20, జనవరి 2023, శుక్రవారం

శ్రీరఘురామా సీతారామా

నారాయణ హరి దయగనరా నమ్మితిరా నిను దయగనరా

శ్రీరఘురామా సీతారామా శ్రితజనపోషక దయగనరా
తారకనామా దశరథరామా దనుజవిరామా దయగనరా
నేరక యెన్నో తప్పులు చేసితి నేడు మారితిని దయగనరా
మారజనక నీనామామృతమును మరిగితినయ్యా దయగనరా
 
మునిజనకామిత మోక్షప్రదాయక మోహవిదారక దయగనరా
వనజదళేక్షణ వనజాసననుత వందితశతమఖ దయగనరా
తనువు నిత్యమని తలచి చెడితిని తప్పు తెలిసితిని దయగనరా
ఇనకులతిలకా నీనామము నిక నెన్నడు విడువను దయగనరా
 
కామితదాయక కరుణాసాగర కారణకారణ దయగనరా
కోమలనీలసరోజశ్యామా కోదండధరా దయగనరా
పామరుడను నే సంసారంబున పడియుంటిమిరా దయగనరా
ఏమరకను నీ‌నామము చేసెద స్వామీ నన్నిక దయగనరా
 
త్రిజగత్కారణ త్రిజగన్నాయక త్రిజగత్పోషక దయగనరా
త్రిజగస్సేవితదివ్యపదాంబుజ దీనజనావన దయగనరా
గజగజలాడుచు యమునకు నేను కడువెరతునురా దయగనరా
విజయరాఘవా నీనామము నే విడువను విడువను దయగనరా

రాతికి నైనను ప్రాణముపోసిన రామచంద్ర నను దయగనరా
కోతికి నైనను బ్రహ్మపదంబును కొలిచిన స్వామీ దయగనరా
ఖ్యాతిగ భక్తజనావళి నేలు విభీషణవరదా దయగనరా
ప్రీతిగ నీదుపదాబ్జము లంటిన వీనిని నీవిక దయగనరా