3, జనవరి 2023, మంగళవారం

ఏలుకొను దొరా నేను మేలుకొంటిని

ఏలుకొను దొరా నేను మేలుకొంటిని కరు
ణాలవాల సేవింపగ నరుదెంచితిని

జగదేకవీరుడనుచు సత్యవిక్రముడనుచు
జగన్నాథు డిత డనుచు జానకిరామ
పొగడుచు నిను పాడుచుండ పురుషోత్తమ నీవును
తగునిది నీవొనరింపగ తగినసేవ యంటివి 

ఎన్ని జన్మల పుణ్యమో యీజన్మలో నేను
నిన్ను సేవించుకొనుచు నిలచియుంటిని
ఎన్న నాకీ భాగ్యమే ఈజన్మకు చాలందునా
నిన్ను చేరుకోనిమ్మని నేను వేడుకొందునా

మరి కొన్ని జన్మ లిట్లు మహిని నిన్ను పొగడచు
తిరుగుదునో వైకుంఠపురము నీకు
సరియైన తావు రమ్మని చక్కగా పిలిచెదవో
హరి నీదు కృపగలిగిన ధరయును వైకుంఠమే