31, ఆగస్టు 2023, గురువారం

శ్రీరామనామం


శ్రీరామనామం శ్రీరామనామం
కోరిన సుఖములు కురిసేనామం

సాకేతనాథుని చక్కని నామం
లోకారాధ్యుని శ్రీకరనామం
శోకప్రశమన శుభకరనామం
వైకుంఠాధిపు పావననామం

పరమశివునకే పరమప్రీతి
కరమై యుండెడు ఘనమగు నామం
పరమభక్తులకు  పరమానంద
కరమై యుండెడు హరి శుభనామం
 
పాపములలైనా పంతములైనా
ఆపదలైనా తాపములైనా
శాపములైనా శమింపజేసే
ఆపరమాత్ముని అమృతనామం 

బదులీయ వేమిరా మదనగోపాల


బదులీయ వేమిరా మదనగోపాల
వదనారవిందము వాడిన దేమంటే

త్వరపడుచును నాకై తహతహతో నీవు
బిరబిర తనమందిరమును వీడగ
చురచుర చూపుల సుదతి యెవ్వతె గాని
మరియాద మీఱి పలుమాటలు పలికెనా

పరమభక్తులు నీకు పాండవు లవ్వారి
సిరుల కసూయనే చెంది కౌరవులు
దొరకొనిరా యేమి దుండగముల కిపుడు
మరి యది కాదేని మాటాడవేరా

చనవున నే కొంటెతనమున నేమైన
మనసునొవ్వగ బలికితిని కాదు కద
మనసిజమోహన మధుసూదనా యీ
దినమున నీమోము తీరిటులున్న దేమి


వరములిచ్చే స్వామివైతే నాకేమి


వరములిచ్చే స్వామివైతే నాకేమి
పరమునిచ్చే స్వామివైతే నాకేమి

ఎవరెవరో నీభక్తు లేవేవో యడిగిన
నెవరెవరో యువిదలే యేవేవో కోరిన
భువనమోహన నీవు పొలుపుగ వారికి
త్తువు గాని నాయిల్లు తొలగి పోబోకురా

మునులాడు మాటలు మునుపే వింటి గాని
నినుజూచి నాస్వామివని మాత్ర మెఱుగుదు
ననుబాసి చనకుండ నాయింటనే యుండి
కనులార నినుజూచు కొనుచుండ నీరా

నావరకు నాయింటి నాథుడవై యుండేవు
నీవు నిలకడజూపి నిలచితే నది చాలు
ఏవరములు వద్దు గోవింద నీయండ
భావింప నాకదే పదివేలు కదరా


30, ఆగస్టు 2023, బుధవారం

నాకు తెలియును నారాముని మహిమ


నాకు తెలియును నాకు తెలియును నారాముని మహిమ
లోకములేలే రాముని మహిమ శ్రీకరమగు మహిమ

రాతినైనను నాతిగజేసే రామవిభుని మహిమ
కోతినైనను బ్రహ్మనుజేసే సీతాపతి మహిమ
ప్రీతిమీఱగ భక్తులనేలే వేదవేద్యు మహిమ
సీతాలక్ష్మణసమేతుడైన శ్రీరాముని మహిమ

పరమశివునిచే పొగడిక లందిన పరంతపుని మహిమ
సరసిజాసనుడు సన్నుతిజేసిన జానకీశు మహిమ
పరమభక్తులకు వరముల నిచ్చే పరాత్పరుని మహిమ
కరువలితనయుడు నిరతము కొలిచే ఘనుని దివ్యమహిమ

జగములన్నిటను వ్యాప్తినిబొందిన జగదీశుని మహిమ
నిగమము లన్నియు పొగడుచునుండే నిరంజనుని మహిమ
తగినవిధంబుగ సుజనుల బ్రోచే ధర్మవిభుని మహిమ
సుగతిని మునులకు సొంపుగనిచ్చే శుభప్రధమగు మహిమ



వీధులన్నీ తిరిగి వేళదాటి వచ్చి


వీధులన్నీ తిరిగి వేళదాటి వచ్చి
బాధింతువేలర బాలగోపాల 

ఎంత బ్రతిమలాడి యెన్నిసుద్దులు చెప్పి
సుంత లాభములేక చోద్యమాయె
వింతచేతలవాడ విధిని దూరుదు నే
నంతియె గాక నిన్ననలేను మాటలు

వీరింట వారింట విందులారగించి
తీరికగ యింటికి చేరే బుధ్ధి
మారజనక నీకు మరియాద కాదని
పోరనేల బుధ్ధి పుట్టినప్పుడు రార

పదునాల్గులోకాలు పరగ వీధులు నీకు
ముదమార భక్తులు ముందిడు నైవేద్యాలు
విదితముగ మంచి విందులు ఆపైన
సదయుడవై యింటికి చనుదెంతువు 

నేరక నిను బిల్చి నే తప్పుజేసితి


నేరక నిను బిల్చి నే తప్పుజేసితి
నౌర గోపాల శృంగారరససార

గడపగడపకు పోయి కమలాక్షులను దాహ
మడిగి పుచ్చుకొనుట నంతయు విన్నాను
విడిచి నాయింటిని వేయిండ్ల జొరబడు
గడుసుదనము నన్ను కలవరపరచెను

వార్తలు నిజమే నే వారిండ్ల కేగితి
నార్తు లందరి యిండ్ల కరిగెద నందు వే
నార్తను కానోనా యందున శ్రీకృష్ణ
మూర్తి దయజూపవు మోసగించేవు

పెదవివిప్పి నిన్ను పిలువను నీవెపుడు
ముదమార నాదైన హృదయమెఱిగి వచ్చి
పదిచోట్ట తిరిగిన బడలిక తీరంగ
నిదురచేసెద వది నీకే విడచెద 


29, ఆగస్టు 2023, మంగళవారం

శ్రీరామనామం చేరని మనసే


శ్రీరామనామం చేరని మనసే చీకటిగుహ కాదా నామం
చేరిన మనసున జ్ఞానప్రకాశం చిందులువేయు కదా

చీకటిగుహలో విషకీటకములు చేరుచునుండు కదా మనసను
చీకటిగుహలో కామక్రోధములు చేరక మానవుగా

చీకటిగుహలో సంపద లున్నను చేతికి చిక్కవుగా మనసను
చీకటిగుహలో సుగుణసంపదలు చెడు నకటా యిట్లే

చీకటిగుహలో తన దుస్థితిని చెప్పరాని యటులే మనసను
చీకటిగుహలో జీవునిదుస్థితి చెప్పనలవి కాదు 


శ్రీరామమధురం


శ్రీరామార్చన మధురం మధురం శ్రీరామరక్షణ మధురం
శ్రీరామమయమై జగమే మధురం శ్రీరామ యనుటే మధురం 

శ్రీరామనామం మధురం మధురం శ్రీరామరూపం మధురం 
శ్రీరామచరితం మధురం మధురం శ్రీరామతత్త్వం మధురం
శ్రీరామవచనం మధురం మధురం శ్రీరామహసితం మధురం
శ్రీరామభావన మధురం మధురం శ్రీరామస్మరణం మధురం

శ్రీరామచరణం మధురం మధురం శ్రీరామచింతన మధురం
శ్రీరామకీర్తన మధురం మధురం శ్రీరామభజనం మధురం
శ్రీరామసన్నిధి మధురం మధురం శ్రీరామసేవన మధురం
శ్రీరామహృదయం మధురం మధురం శ్రీరామసత్కృప మధురం

శ్రీరామశక్తియె మధురం మధురం శ్రీరామభక్తియె మధురం
శ్రీరామసుగుణం మధురం మధురం శ్రీరామపాలన మధురం
శ్రీరామవీక్షణ మధురం మధురం శ్రీరామవిభూతి మధురం
శ్రీరామమఖిలం మధురం మధురం శ్రీరామమనంత మధురం 


28, ఆగస్టు 2023, సోమవారం

వీనులవిందుగ రామనామమును


వీనులవిందుగ రామనామమును వివిధరాగముల పాడరే
మానవజన్మము నెత్తినందుకు మానక రాముని కొలువరే

దశరథనందన రఘురామా యని తనివితీరగ పిలువరే
దశముఖసంహర దైవరాయ యని యశోవిశాలుని పిలువరే

ఇనకులతిలక జననాయక యని ఎంతోప్రేమగ పిలువరే
మునిజనమోహన మోక్షప్రదా యని ముచ్చటతీరగ పిలువరే

వనజాతేక్షణ పరమాత్మా యని భక్తవరద యని పిలువరే
జనకసుతావర జగదీశ్వర యని ఙ్ఞానగమ్య యని పిలువరే

ఈతని కధికుడు లేనేలేడని యెల్లతావులను చాటుచును
ప్రీతిగ రాముని నామామృతముని భూతలమందున పంచుచును

వివిధతాళముల విరివిగ పాడుచు అవిరళముగ కడు వేడుకతో 
భవతారకమగు భగవన్నామము ప్రజలందరకు పంచుచును

పాడినవారిదె భాగ్యము సుమ్మని పరిపరివిధముల పొంగుచును
వేడుకతో హరిభజనము చేసిన విబుధులదే ఘనభాగ్యమని


27, ఆగస్టు 2023, ఆదివారం

నేనెఱుగనివా నీమాయలు


నేనెఱుగనివా నీమాయలు 
ఈనాడే క్రొత్త లేమున్నవి  

ఎచ్చోట జూచిన నచ్చట నుండేవు 
ముచ్చటలాడేవు ముగుదలతో 
ఎచ్చటను లేని దీవింతపోకడ 
వచ్చె నెట్లో గోపాలక నీకే  

యిప్పు డేయే యిండ్ల నింతుల గూడి నే
నొప్పని పనులేమి యొనరించుచు
గొప్పలు చరచుచు గోపాలక నీ
విప్పుడు నామాటనే మరచేవో

పాపము వారెంత భక్తులో నేనెంత
పాపినో యన్నట్లు భావింతును
లోపము లేకున్న గోపాల నీవు నా
తాపంబును తీర్ప దయచేయవు


24, ఆగస్టు 2023, గురువారం

వచ్చిన గోపాలుని ముచ్చటలు తీర్చవే

వచ్చిన గోపాలుని ముచ్చటలు తీర్చవే
వచ్చుటే పదివేలు పరుసము లేలే

విరసోక్తులు పలికితే వెడలిపోవునే
సరసముగా మాటలాడి చక్కని వరములు
తరుణి నీవు బడయుటే తగినపని కాదటే
తరళేక్షణ గోవిందుడు దయగలవాడే

అందరు నీవంటివారె యనుకోరాదే
వందనములు చేయువా రందరకు వరముల
నందించుచు వినోదించు నందగాడు కాదటే
సుందరి యీ గోవిందు డందరి వాడే

వీని పాదములను పట్టి వేడవెందుకే
మౌనులకును యోగులకును పొలుపుగా వరముల
మానక నందించువాడు మరి వీడు కాదటే
మానిని యీగోవిందుడు మహిమల వాడే


22, ఆగస్టు 2023, మంగళవారం

అనుష్టుప్పులు


ఇవేవో అప్పులో స్టెప్టులో అనుకోకండి. ఒకరకం సంస్కృతఛందస్సులు.

సంస్కృతఛందస్సులు ఇరవైఆరు రకాలు. ఒకటవ ఛందస్సుకు పాదానికి ఒకటే అక్షరం. ఇరవైయ్యారవ ఛందస్సుకు పాదానికి ఇరవైయ్యారు అక్షలాలు. కేవలం చదువరుల సౌకర్యం కోసం వాటి పట్టిక ఇస్తున్నాను.

  1. ఉక్త
  2. అత్యుక్త
  3. మధ్య
  4. ప్రతిష్ట
  5. సుప్రతిష్ట
  6. గాయత్రి
  7. ఉష్నిక్
  8. అనుష్టుప్
  9. బృహతి
  10. పంక్తి
  11. త్రిష్టప్
  12. జగతి
  13. అతిజగతి
  14. శక్వారి
  15. అతిశక్వారి
  16. అష్టి
  17. అత్యష్టి
  18. ధృతి
  19. అతిధృతి
  20. కృతి
  21. ప్రకృతి
  22. ఆకృతి
  23. వికృతి
  24. సంకృతి
  25. అతికృతి
  26. ఉత్కృతి

ఇరవైయ్యారు అక్షరాలకన్నా శ్లోకంలో పాదం ఇంక పొడుగు ఉండకూడదా అని మీకు సందేహం రావచ్చును. ఉండవచ్చును అని సమాధానం. ఐతే అటువంటి ఛందస్సులను ఉధ్ధురమాలలు అంటారు.

ఛందస్సులలో ఎనిమిదవది అనుష్టుప్పు. పాదానికి ఎనిమిది అక్షరాలు అన్నారు కాబట్టి 256 రకాల అనుష్టుప్పులు కుదురుతాయి. ఐతే ఇది నిర్దిష్ట స్ధానాల్లో గురులఘువులకు నియామకం జరిపి నిర్ణయించే అనుష్టుప్పు వృత్తాల అని లెక్క. మరి గురు లఘువులకు స్థాననియమం లేని పక్షంలో? అప్పుడు పాదాలన్నీ ఒకమూసలో ఉండనక్కరలేదు కాబట్టి 32 అక్షరాలు కలిపి ఏకంగా చూడాలి. అబ్బో అప్పుడు 65536 రకాలుగా అనుష్టుప్పులు ఉండవచ్చు.

ఇదంతా ఎందుకు చెప్పటం అంటే మనం అనుష్టుప్పులు అనే శ్లోకాలకు కచ్చితమైన గురులఘు క్రమం అక్కరలేదు కాబట్టి.

కేవలం పాదానికి ఎనిమిది అక్షరాలు చొప్పున నాలుగు పాదాలు ఒక శ్లోకం. అరుదుగా ఆరుపాదాల అనుష్టుప్పులు కనిపించి కొంచెం తికమక పెడతాయి.

పాదానికి అక్షరాలు ఎనిమిది మాత్రమే కాబట్టి పాదమధ్యంలో విరామస్థానం లేదు. అవసరం కాదు. పదికన్నా తక్కువ అక్షరాలు పాదానికి ఉంటే అలాంటి అవసరం లేదు. ఐతే పాదాంతంలో విరామంమాత్రం ఉండాలి. విరామం అంటే అటుపిమ్మట కొత్త మాట వేయాలి అని ఆర్ధం. విరామం మాట మధ్యలో ఉండదు. 

సందర్భం కలిగింది కాబట్టి ఒకమాట. సంసృతఛందస్సులను తెలుగువారు దిగుమతి చేసుకున్నప్పుడు ఈవిరామాల నియమాలను మార్చారు. పాదాంతవిరామం ఎగరగొట్టారు. పాదమధ్యవిరామానికి యతిమైత్రిస్థానం అని కొత్త పేరుపెట్టి అక్కడ అక్షరసామ్యమే కాని పదవిరామం అవసరం కాదని అన్నారు.

ఇలా తెలుగులోనికీ మరికొన్ని దేశభాషల లోనికీ ఉత్పలమాల వంటి సంస్కృతఛందస్సులు వచ్చాయి.

ఫలానా స్థానాల్లొ గురువులూ ఫలానా స్థానాల్లో లఘువులూ అంటూ కచ్చితమైన నియమం ఉంటే అటువంటివి వృత్తాలు. ఉత్పలమాల శార్దూలం వంటివి అలా వృత్తాలు.

ప్రసిద్ధి చెందిన అనుష్టుప్పులు కచ్చితమైన  వృత్తనియమాలను కలిగి లేవు. అదే కారణమో మరొకటో కాని అనుష్టుప్పులు దేశభాషల ఛందస్సులకు ప్రాకలేదు. 

అనుష్టుప్పులు చిన్న ఛందస్సు. శ్లోకం మొత్తం 32 అక్షరాలే. తెలుగులో అనుష్టుప్పుల స్థానంలో కందపద్యాలు వ్యాపించాయి. 

సంసృతకవిత్వంలో ముప్పాతికమువ్వీసం అంతా అనుష్టుప్పులే. తెలుగుసాహిత్యంలో సింహభాగం పద్యాలు కందపద్యాలే.

నిర్దిష్ట గురులఘుస్థానాలతో ఉండదు కాబట్టి అనుష్టుప్పులకు బొత్తిగా నియమాలు లేవు అనుకోవద్దు.

అనుష్టుప్పులలో అన్ని పాదాల్లోనూ 5వ అక్షరం లఘువై తీరాలి

అనుష్టుప్పులలో అన్ని పాదాల్లోనూ 6వ అక్షరం గురువై తీరాలి

అనుష్టుప్పులలో బేసిపాదాలలో 7వ అక్షరం గురువై తీరాలి.

అనుష్టుప్పులలో సరిపాదాలలో 7వ అక్షరం లఘువై తీరాలి.

అనుష్టుప్పులలో సరిపాదాలలో 8వ అక్షరం గురువై తీరాలి.

ఇవే నియమాలు.

స్థూలంగా అనుష్టుప్పులు ఇలా ఉంటాయి.

యిలాగ


     X X X X  I U U X   X X X X  I U I U

     X X X X  I U U X   X X X X  I U I U


ఐతే ప్రాచీనమైన కొన్ని అనుష్టుప్పులు ఈనియమాలను అతిక్రమించిన సందర్భాలు కనిపిస్తాయి. అనుష్టుప్పులు చాలా రకాలుగా ఉన్నాయి నిజానికి. వీటిగురించి వేరే వ్యాసంలో చెప్పుకుందాం. అపుడు మరింత స్పష్టంగా ఉంటుంది.

తెలుగులో కందపద్యానికి చాలానే నియమాలను గమనించవచ్చును. అబ్బో ఇన్ని నియమాలా ఐతే కందం వ్రాయటం కష్టం అనిపించవచ్చును. కాని కందం వ్రాయటం కవులకు బహుసులభం. ఎందుకంటే నడక అనేది బండి నడిపిస్తుంది కాబట్టి. 

అలాగే అనుష్టుప్పులకు కూడా ఒక స్వంత నడక ఉంది. అది పట్టకొని చెప్పుకుంటూ పోతారు కవులు. నియమాలు కుదిరినంత మాత్రాన నడక కుదరకపోవచ్చును కాని నడక కుదిరినప్పుడు వాటంతట అవే నియమాలు పాటించబడతాయి. ప్రత్యేకంగా ప్రయాస అక్కరలేదు.

నడకకుంటుబటిన సందర్భాలలో చదువరులకే ఇక్కడేదో తేడాగా ఉందే అని తెలిసిపోతుంది. అలాగే అక్షరాల లెక్క తప్పిన పాదాలూ చదువరులకు సులువుగా దొరికిపోతాయి. చదివేవారు స్వయంగా కవులు కాకపోయినా అలా దొరికిపోవటం తథ్యం.

ఉదాహరణకు ఈవ్యాసానికి దారితీసిన చర్చలో ఉన్న వసుధైక కుటుంబకమ్ లేదా వసుధైక కుటుంబం అన్న ప్రయోగాలలో ఏది సరైనదీ అన్న ప్రశ్నను చూదాం. వసుధైక కుటుంబకమ్ అన్నది ఒక అనుష్టుప్పులో సరిపాదంగా చక్కగా ఒదుగుతుంది. కాని వసుధైక కుటుంబం అన్నప్పుడు పాదంలో 7 అక్షరాలే ఉన్నాయి. అనుష్టుప్పులో ఇమడదు - ఒక అక్షరం తక్కువౌతోంది కదా చివరన. 


పదము లంటితిని కదరా


పదము లంటితిని కదరా పలుకరా యింక
మదనగోపాల యెట్టి మాటలననురా

పాలు పెరుగులకు నీవు పైపై యిండ్లకు పోతే
చాలవా నాయింటి చల్ల లననురా
కాలునిలువక నీవు గడపలెన్ని మెట్టినా
చాలును తిరుగుళ్ళని సణగబోనురా

ఇంటికివచ్చిన సుదతుల నికిలించుచు పిలచినా
కొంటెవాడ తప్పనుచు కోపపడనురా
మంటిముద్దలోన నీకు మంచిరుచులు తోచినా
వెంటబడి నిన్ను నేను వెక్కిరించరా

నేనేగా శ్రీహరినని నీవు గొప్పలాడితే
నేనికపై వాదులాడి నిందించనురా
నేను జీవకోటికెల్ల నిక్కముగా పతినంటే
కానీరా అదే నిజముగా నమ్ముదురా 


చాలుచాలు బిడియాలు సఖుని జేరవే


చాలుచాలు బిడియాలు సఖుని జేరవే నీ
మేలు తలచి చెప్పు మాట లాలకించవే

పురుషోత్తము డితని మించు పురుషు డింక నెవ్వడే
పొరపొచ్చెము లేటికి కాపురము సేయవే
తరుణి యభ్యసించి నీవు పురుషుని మెప్పించువిద్య
మరియాదలు సలుపవమ్మ మరువకుండగ

తరుణులంట జీవులెల్ల తానొక్కడె పురుషుడంట
చరాచరసృష్టికే బీజప్రదాత తానట
మరి యప్పుడు నీవు ప్రకృతిమాతవై యుందువుగద
పరమాత్ముడు వరుని సిగ్గుపడక చేరవే

ఇరువురు నొకటై యుండుటయే గాదటె పరమార్ధము
మరి విభుడే పిలుచువేళ మరియును బెట్టేలే
కర మాతని కందించగ కళవళపడ నేమిటికే
సరిసరి కృష్ణుని యెడిలో సరాసరి చేరవే 


21, ఆగస్టు 2023, సోమవారం

వసుధైక కుటుంబకమ్ vs వసుధైక కుటుంబం

ఈరోజున విన్నకోట నరసింహారావు గారు స్మరణ బ్లాగులో అడిగిన ప్రశ్నకు నాకు తెలిసినంతవరకు సమాధానం వ్రాస్తున్నాను.

అన్నట్లు నరసింహారావు గారు ఆప్రశ్నను నాకు వాట్సాప్ ద్వారా కూడా పంపించారు. 
మంచి ప్రశ్న వేసినందుకు ఆయనకు నా ధన్యవాదాలు.

మహోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో ఉంది సమాధానం,
అందులోని ఈ మంత్రాన్ని చిత్తగించండి.

అయం బంధు రయం నేతి గణనా లఘుచేతసామ్ । 
ఉదారచరితానాం తు వసుధైవ కుటుమ్బకమ్ ॥ ౭౧॥

ఈ మంత్రం మహోపనిషత్తులో ఆరవ అధ్యాయంలోని 71వ శ్లోకంగా ఉంది. ఉపనిషత్తు కాబట్టి మంత్రం అనాలి ఛందస్సు ప్రకారం ఇది అనుష్టుప్పు. ఒక శ్లోకం.

ఇక్కడ వసుధైవ కుటుంబకమ్ అన్నపాఠం ఉంది. వసుధైక కుటుంబకమ్ అన్న పాఠం కూడా ప్రచారంలో  ఉంది. ఈపాఠం కూడా ఛందస్సుకు చక్కగా సరిపోతున్నది. అర్ధంలోనూ కించిత్తు బేధం కూడా లేదు. కాబట్టి ఏపాఠం ఐనా ఆమోదయోగ్యమే.

ఈ మంత్రం చెబుతున్న విషయం చాలా ఉదాత్తంగా ఉంది. చిత్తగించండి. వీడు నావాడు నాబంధువు - వాడు పరాయివాడు వంటి భావన అల్పబుధ్ధి కలవారు చేసేది. ఉదారమైన మనస్సు కల సజ్జనులకు ప్రపంచం అంతా ఒకే కుటుంబం. ఇదీ ఈమంత్రం చెప్పే మాట.

ఐతే ఎలా వచ్చిందో ప్రచారంలోనికి వసుధైక కుటుంబం ప్రయోగం స్పష్టంగా తెలియదు. కాని అది పొరపాటు వాడుక. ఆ ప్రయోగం అనుష్టుప్పును భంగపరుస్తున్నది. ఆమోదయోగ్యం కాదు. ఉపనిషత్పాఠం స్పష్టంగానే ఉంది.

ఈ మహోపనిషత్తును చదువదలచుకొన్న వారికి ఇది ఇంటర్నెట్లో సులభంగానే లభిస్తున్నది.  దిగుమతి చేసుకోదలచుకున్న వారు https://sanskritdocuments.org/doc_upanishhat/maha-te.pdf అన్న లింక్ ద్వారా సేకరించుకోవచ్చును. పాఠం తెలుగులిపిలోనే ఉంది. ఐతే అంతా మూలపాఠమే కాని వ్యాఖ్యానం ఏమీ అక్కడ లేదు.

19, ఆగస్టు 2023, శనివారం

వీడెవ్వడంట వీడెవ్వడంట


వీడెవ్వడంట వీడెవ్వడంట
చేడియ చొరబడె నింట

ఊహల కందని వాడంట జగ
న్మోహను డీనల్లవాడంట
మోహాలు తొలగించు వాడంట మధు
రోహలు కలిగించు వాడంట

మంచిముచ్చటల వాడంట వల
పించెడు నేర్పున్న వాడంట
ఫించము దాల్చెడు వాడంట నయ
వంచన లడగించు వాడంట

పాలారగించెడు వాడంట విన్న
పాలాలకించెడు వాడంట
మేలైన చేతల వాడంట నంద
బాలు డోహో మన వాడంట 

ఎలనాగ నీవిభున కెదురేగవే

ఎలనాగ నీవిభున కెదురేగవే
కులుకులరాయడు గోపాల డదె వచ్ఛె

నీలాల నిగనిగల మేలిమి మేనిపై
దాలిచి తులసిమాలలు మోమున
చాలనగవులు పులిమి చాన యదెవరో
చాల చందన మలద సరసుడై వచ్చె

నిదురలేని కనుల నించి ప్రేముడిని
కొదమసింగపు నడక కుదిరించుచు
బెదురులేని చూపు నదిగో నటించుచు
వదలరాని విభుడు పడతిరో వచ్చె

అందరి మంచిచెడ్డ లరసి చూచువాడు
అందరు జీవులకు నంతరంగుడు
సందుచూచుకు నీతో సరసములాడగ
తొందరపడుచు ఓ తొయ్యలి వచ్చె 

18, ఆగస్టు 2023, శుక్రవారం

ఇంతదాక నేయింతి చెంత నుంటివో


ఇంతదాక నేయింతి చెంత నుంటివో ఆ
యింతి నెంత మోసగించి యిటువస్తివో

నీచిరునగవులను గన ఏచిన్నది తహతహ పడి
వేచినదో నావలెనే వేయియుగములు
నీచిత్తము నందు కరుణ నిండి వచ్చినా వనుచు
ఆచెలియ మురియు లోన అంతలోన మాయమై

రాకరాక నీవు రాగ రమణి యెవ్వతెయు నీదు
పోక కొప్పుకొనదుగా పురుషోత్తమ
నాకు తెలిసి మాయచేసి నీకు నీవే తరలి
నాకడకు వచ్చి యేమి నంగనాచితనము

అచట నుందు విచట నుందు వందరి కడ నుందువని
ప్రచురముగా వినుచుందుము పంకజేక్షణ
ముచికుందవరద నిన్ను మోహించని వారెవ్వరు
ఎచట నెవ్వతెను వదలి యిటుదయ చేసితివి కృష్ణ


17, ఆగస్టు 2023, గురువారం

మేలాయె మేలాయె బాలగోపాల


మేలాయె మేలాయె బాలగోపాల ఈ
వేళ బహుకృపగలిగి విచ్చేసినావు

అందరి మనసుల నాహరించి నీవే
యుందు వన్నివేళ లందు నందబాల
విందుకు రమ్మని వేమార్లు పిలువగ
సుందర నేటికి జొచ్చితి వీయిల్లు

ఇల్లిల్లు తిరిగేవు నల్లనయ్యా నీవు
ఇళ్ళన్ని నావనుచు నెన్ని యిండ్ల
సల్లాపములు సలిపి చనుదెంచినావు
వల్లమా‌లిన ప్రేమ వచ్చి నామీద

పొలతుక యెవ్వతె పొమ్మని యదిలించె
నళినాక్ష తిరుగుళ్ళ కలిగి నీమీదను
వలచి నాయింటికి వచ్చినావా యేమి
బలె బలె యిటులైన పండెను నాపంట


16, ఆగస్టు 2023, బుధవారం

నిన్నే వలచుచున్న దానరా

నిన్నే వలచుచున్న దానరా గోపాలబాల 
నిన్నే నమ్ముకొన్నదానరా  

మురాసురప్రాణహర హరి ధరాధరధర
పరాత్పర పరమయోగిపరిసేవిత చరణయుగళ

మనసిజగర్వాపహరణ ఘనవనమాలాభరణ
జనార్చితశుభచరణ మునిగణమోక్షవితరణ

రార మారజనక సుకుమార ధీర గంభీర 
రార హరి మనోహర రారా శృంగారసార

15, ఆగస్టు 2023, మంగళవారం

చిన్న దొక సందేహ మున్నది



చిన్న దొక సందేహ మున్న  దది తీర్చుమా
చిన్నదో పెద్దదో చెప్పు తీర్చెదను

మధురాతిమధురమై యధరమ్ములకు సోకి
బుధుల నెయ్యది చాల పులకింప జేయు
బుధుల మైమరపించు భూరిమాధుర్యము
మధురతమ రామనామమునకే కలదు

పలుకునెడ పెదవులకు పరమసుకుమారమై 
అలరారు పలుకేది యవనిలో కలదు
పలుకుటకు సరళమై పరమసుకుమారమై
యిలను రాముని పేరు విలసిల్లు చుండు

సర్వసంపదలిచ్చి సర్వసౌఖ్యములిచ్చి
సర్వవేళల బ్రోచు సన్మంత్ర మేది
సర్వవేళల రామచంద్రమంత్రము నిన్ను
సర్వార్ధముల నిచ్చి చక్కగా బ్రోచు 

14, ఆగస్టు 2023, సోమవారం

అలసిపోయితి నోయి ఆటచాలింతునా

అలసిపోయితి నోయి ఆటచాలింతునా నీ
సెలవైన తొలినెలవు చేరుకొన రానా

ఎన్ని యుగములు గడిచె నీయాట మొదలిడి
ఎన్ని తనువుల దాల్చి ఎంతగా నాడితిని
మన్నింపు మికపైన మరి యాడగా లేను
నన్ను రమ్మన వయ్య నా స్వామి రామా

నేలనే దున్నితిని నీయాట లాడుచును
మేలుగా నినుగూర్చి చాల పొగడితి నేను
వేల తనువుల దూరి కాలము గడిపితిని
చాలు నయ్యా తాళజాలనిక రామా

నీవు నే నొక్కటని నీవనుట నేననుట
భావించ సంతోషప్రదమైన విషయమే
కావున నికనైన కలిసియుండెడు రీతి
నీవు సెలవీయవే యీవేళ రామా


12, ఆగస్టు 2023, శనివారం

ఏమని నిను పొగడుదునే రామపాదమా


ఏమని నిను పొగడుదునే  రామపాదమా  నిన్నెంతగ నేపొగడుదునే రామపాదమా 

సుంత సోక ఒక రాతిని రామపాదమా నీవు సుదతిగనే చేసితివే రామపాదమా
ఎంత పని చేసితివే రామపాదమా నీ వెంత వింత చేసితివే రామపాదమా

సాకేతపురమేలెడు రామపాదమా సకలలోకముల నేలునట్టి రామపాదమా
నీకు సాటి లేదు కదా రామపాదమా నేను నీకు మ్రొక్కుచుందునే రామపాదమా

లోకమాత భూమిసుతయె రామపాదమా వంగి నీకు మ్రొక్కుచుండునే రామపాదమా
శ్రీకరమై చెలగుచుండు రామపాదమా  నిన్ను చేరు భాగ్య మెపుడు నాకు రామపాదమా

మునిమోక్షకారకమగు రామపాదమా నీవు మునుకొని నను బ్రోవవలె రామపాదమా
జనుల భవబంధములు రామపాదమా నిన్ను గనినంత నశించునే రామపాదమా

రామపాదమా శ్రీరామపాదమా నిన్ను ప్రార్ధించిన వారలిక రామపాదమా
భూమిపైన పుట్టరట రామపాదమా యోగిపుంగవులారాధించు రామపాదమా


ఏమిపని నాకేమిపని

ఏమిపని నాకేమిపని
ఏమిపని యిటనేమిపని

నీకు మ్రొక్కితినంటే నవ్వే లోకముతో నా కేమిపని
నీకు మ్రొక్కక దిక్కులు చూచే లోకముతో నా కేమిపని
నీకూ నాకూ వంకలుపెట్టే లోకముతో నా కేమిపని
నాకు మిక్కిలి నిరుపయోగమగు లోకముతో నా కేమిపని

శోకమోహముల కాకరమైన లోకముతో నా కేమిపని
భీకరుగు లోభులతో నిండిన లోకముతో నా కేమిపని
శ్రీకరమౌ నీనామము తలచని లోకముతో నా కేమి పని
నీకటాక్షపు విలువను తెలియని లోకముతో నా కేమి పని

పాపులమధ్యన బ్రతుకుచునుండిన పదుగురైనను సజ్జనులు
నాపాటలు విని నినుచేరెద రని నమ్ముచు నిట నిలచితి గాని
ఈపాటల నిక యాపి రమ్మని ఎప్పుడు రామా పిలచెదవో
పాపపు లోకముతో నాకేమి పనియున్నదని నిలచెదను



రామచంద్రా నన్ను రక్షించమంటే


రామచంద్రా నన్ను రక్షించమంటే నీ
వేమీ మాట్లాడ విదియేమి మరియాద

రూక లిప్పించమని నీకు మొఱబెట్టితినా
కోక లిప్పించమని కోరుకొంటినా
నాకు సంసారేఛ్ఛ నశియించి నీదిక్కై
నీకు దండముపెట్టి నీసన్నిధి నడిగితిని

భూము లిమ్మన లేదు పుట్ర లిమ్మన లేదు
ఏమి భోగంబుల నించుకడుగను
స్వామి సంసారేఛ్ఛ చచ్చినది నీదీక్కై
కామితము లేలేవు కటాక్షించు మంటిని

మరలపుట్ట గోరను మరలచావ గోరను
మరలమరల వసుధను మసలగోరను
హరి యీసంసారేఛ్ఛ అడుగంటీ నా దిక్కై
పరమాత్మ శ్రీరామ పాహిపాహి యంటిని


రామ రామ రామ్


రామ రామ రామ్ సీతారామ రామ రామ్

కామజనక నారాయణ రామ రామ రామ్
కామారివినుతవైభవ రామ రామ రామ్

కోమలాంగ గుణగరిష్ఠ రామ రామ రామ్
శ్యామలాంగ సుజనవినుత రామ రామ రామ్

స్వామి యాగపరిరక్షక రామ రామ రామ్
కామవైరిధనుర్భంగ రామ రామ రామ్

భూమిసుతాప్రాణనాథ రామ రామ రామ్
కామితార్ధప్రదాయక రామ రామ రామ్

రాక్షసగణవిధ్వంసక రామ రామ రామ్
రాక్షసేంద్రప్రాణహర రామ రామ రామ్

భూమిపాలలోకవిశ్రుత రామ రామ రామ్
శ్రీమద్వైకుంఠవాస రామ రామ రామ్


11, ఆగస్టు 2023, శుక్రవారం

మరిమరి శ్రీరామమంత్రము పఠియించి


మరిమరి శ్రీరామమంత్రము పఠియించి
మురిసే మనిషే మోక్షార్హుడు

వ్రతములు పదివేల ఫలమేమి దశరథ
సుతునికై తహతహ సుంతైన లేక
మతిమంతుడై రామమంత్ర ముపాసించి
ప్రతిగా మోక్షమే బడయగ రాదో

దానధర్మములు తాజేసి ఫలమేమి
మానవేశ్వరుడైన మన రామయ్యకు
మానసమర్పించి తానున్న చాలును
తానిచ్చునే కద తనకా మోక్షము

భవతారకంబనుచు పరమయోగులు మెచ్చ
భువి మంత్రమై వెలసె రవికులేశుని పేరు
చవిగొన్న వారలిక భువిని పుట్టగ బోరు
వివిధమంత్రంబులను వేడగ నేల 



రామనామమే లేని దేమి జన్మము


రామనామమే లేని దేమి జన్మము
రామపూజనము లేని దేమి జన్మము

మనసార శ్రీరామమంత్రంబు జపియించ
మనుజులకు పవలేమి మరిరాత్రి యని యేమి
తనివార స్మరియించు ధన్యజీవుల యెడ
యినకులేశుని కరుణ యింతితనరాదుగా

రాముని చింతించి రాముని గుణమెంచి
రాముని ప్రేమించి రాముని సేవించి 
రాముని పూజించి రాముని వాడైతే
రాముడు చేరదీసి రక్షించ కుండునా

ఆరూఢిగా జగము శ్రీరామ మయమని
శ్రీరామ మంత్రమే జీవనాధారమని
నోరార శ్రీరామ శ్రీరామ యనువాడు
కోరితే మోక్షమే కొసరడా రాముడే


మనవాడండీ మనవాడండీ

మనవాడండీ మనవాడండీ యినకులతిలకుడు మనవాడండీ

శ్రీరఘురాముడు మనవాడండీ సీతారాముడు మనవాడండీ
శూరవరేణ్యుడు  మనవాడండీ శోకనాశకుడు మనవాడండీ 

పరమపావనుడు మనవాడండీ పరంధాముడు మనవాడండీ
నిరుపమగుణనిధి మనవాడండీ నిర్మలచరితుడు మనవాడండీ

భయరహితుడు హరి మనవాడండీ పతితపావనుడు మనవాడండీ
దయాసాగరుడు మనవాడండీ దశరథతనయుడు మనవాడండీ

పంకజనయనుడు మనవాడండీ పరమసుందరుడు మనవాడండీ 
శంకరవినుతుడు మనవాడండీ  సాక్షాత్బ్రహ్మము మనవాడండీ 

జననాయకుడు మనవాడండీ జయశీలుడు హరి మనవాడండీ 
మునిజనవంద్యుడు మనవాడండీ మోక్షదాయకుడు మనవాడండీ

10, ఆగస్టు 2023, గురువారం

శ్రీరాముల యింటి బంట్లమై

శ్రీరాముల యింటి బంట్లమై మెలగుచు శ్రీరాముల సేవ చేసేము
శ్రీరాముల కీర్తి చాటించ తిరుగుచు శ్రీరాముల సేవ చేసేము

శ్రీరాములకు సాటి యందగా డెవడనుచు శ్రీరాములను గొప్ప చేసేము
శ్రీరాములకు సాటి గుణశీలు డెవడనుచు శ్రీరాములను గొప్ప చేసేము
శ్రీరాములకు సాటి వీరుడే లేడనుచు శ్రీరాములను గొప్ప చేసేము
శ్రీరాములకు మించి దైవమే లేడనుచు శ్రీరాములను గొప్ప చేసేము

శ్రీరాముల పేరు నుడువుచు నిరతమ్ము శ్రీరాములను మేము కొలిచేము
శ్రీరాముల భక్తజనులతో మెలగుచు శ్రీరాములను మేము కొలిచేము
శ్రీరాములకు నిత్యపూజలు నెఱపుచు శ్రీరాములను మేము కొలిచేము
శ్రీరాముల పాదయుగళినే తలచుచు శ్రీరాములను మేము కొలిచేము

శ్రీరాములకు మేము మామనస్సీమలను సేవలు నిత్యము చేసేము
శ్రీరాములకు మేము రేయింబవళ్ళును సేవలు ప్రీతితో చేసేము
శ్రీరాములకు మేము సద్భక్తులను గూడి సేవలు నిత్యము చేసేము
శ్రీరాములకు మేము వైకుంఠపురమందు సేవలు నిత్యము చేసేము 

8, ఆగస్టు 2023, మంగళవారం

రాముని నమ్మిన వాడనురా

రాముని నమ్మిన వాడనురా నేనేమని యితరుల పొగడుదురా
శ్రీమన్నారాయణుడగు శ్రీరాముని చింతన మఱగిన వాడనురా

దేహధారులకు భువిలో దివిలో దిక్కైనిలచే ప్రభువనుచు
మోహనాశకుడు మోక్షకారకుడు మునిజనమోహను డితడనుచు
బాహుపరాక్రమనిర్జితానిమిషవైరివీరగణవిభు డనుచు
ఓహో బహుజన్మంబులుగా తన పదయుగ్మంబులనే యెన్నుచును

తన శుభగుణవర్ణనము చేయుటే తద్దయు సుఖమని లోనెఱిగి
తన శుభచరితమె  త్రిభువనంబుల పరమపావనం బనియెఱిగి
తన భక్తాళికి యెల్లవేళలను తధ్యము రక్షణ మని యెఱిగి
తన శుభనామమె యందరకును భవతారకనామం బని యెఱిగి 

  

5, ఆగస్టు 2023, శనివారం

పోరా వైకుంఠపురికి

చావుకోరల నుండి రక్షించునా నిన్ను శతకోటిమంత్రాలు నరుడా
కావుమని శ్రీరామచంద్రుని వేడక కాలము గడపకు నరుడా

మంత్రాలు జన్మచక్రంబును ద్రుంచెడు మాట సర్వకల్ల నరుడా
తంత్రాలుపన్ని ఆచావు నుండి నీవు తప్పించుకోలేవు నరుడా

మగనికి పెండ్లాము పెండ్లామునకు మగడు మంచిమాటలె కాని నరుడా
జగమున వ్యవహారజ్ఞానంబునకు మించి సత్యంబులు కావు నరుడా

తనువున జేసి బాంధవ్యంబులు నీకు తగులుకొన్నవి కాని నరుడా
విను మాత్మబంధువై వెలసియుండిన వాడు విభుడు రాముడె నీకు నరుడా

భూములు సొమ్ము లు పదవులు యశములు పోయేవి వచ్చేవి నరుడా
రామనామము తప్ప శాశ్వతంబైన దింకేమున్నది నీకు నరుడా

శ్రీరామ జయరామ నను కావుమని వేడి క్షేమంబు గాంచరా నరుడా
పోరా సంసార సాగరంబును దాటి పొమ్మింక వైకుంఠపురికి 

3, ఆగస్టు 2023, గురువారం

రావయ్య శ్రీరఘురామ గుణధామ


రావయ్య శ్రీరఘురామ గుణధామ 
రావయ్య వైకుంఠధామ నను బ్రోవ

మక్కువతో నీకు మ్రొక్కుచుందును గాని
ఒక్కనాటికి నేను మ్రొక్కబో నన్యులకు
చక్కగా వరములను సతతమొసగే తండ్రి
నిక్కముగ నన్నేల నేడేల రావు

నీనామమే తలచి నేను పొంగుదును
నీనామ మున కన్యమెన్నడు తలపను
నీనామమే యెన్ని నిత్యంబు పాడుదును
రానిమ్ము నీదయను రామయ్య వేగ

ఎత్తిన జన్మంబు లిక చాలు నీకని
మెత్తగా నొకమాట నొత్తిపలుకగ రార
హత్తించి నీదయను ఆదుకొనగ రార 
చిత్తజ జనకుడ శీఘ్రంబుగా రార



శ్రీరామ యనగానె చింతలన్నియు తీరె


శ్రీరామ యనగానె చింతలన్నియు తీరె 
శ్రీరామ యనగానె చిక్కులన్నియు వీడె

శ్రీరామ యనగానె చిత్తంబునకు శాంతి
యారూఢిగా గల్గె నధికంబుగ
శ్రీరామ యనగానె నోరార నాకార్య
భారంబు సుళువాయె ప్రజలారా

శ్రీరామ యనగానె చెచ్చెర జయములే
చేరువయ్యె గుణశీలులార
శ్రీరామ యనగానె శ్రీరాముని కరుణ
ధారయై నన్నిదే తడిపి వేసె

శ్రీరామ యనగానె చెంగున కామాది
వైరివర్గము పారె ప్రజలారా
శ్రీరామ యనగానె జీవుడానందమున
పారవశ్యము బొందె ప్రజలారా 



నీయంత వాడవై నీవున్నావు

నీయంత వాడవై నీవున్నావు 
    నాయంత వాడనై నేనున్నాను

నీయిల్లు గట్టిదై నీవున్నావు
    నాయిల్లు ఓటిదై నేనున్నాను

నీయునికి దాచుకొని నీవున్నావు
    నాయునికి చాటుకొని నేనున్నాను

నాయింటి యేలికవై నీవున్నావు
     నీయింటికి బంటునై నేనున్నాను

ఈమాయ తెరవెనుకను నీవున్నావు
     ఆమాయ తెరలోపల నేనున్నాను

భవబంధ రహితుడవై నీవున్నావు
     భవపాశబధ్ధుడనై నేనున్నాను

నన్నుధ్ఝరింతువని నేనెఱిగితిని
     తిన్నగా నీనామము పలుకుచుంటిని

రామా రామా అంటున్నా వింటున్నావా
      ఆమోక్షము నీయా లనుకుంటున్నావా



ఎన్నెన్ని చోట్ల తిరిగి యెన్ని యిళ్ళు కట్టితిని

ఎన్నెన్ని చోట్ల తిరిగి యెన్ని యిళ్ళు కట్టితిని 
చిన్న పెద్ద యిళ్ళన్నీ చివరకు నే విడచితిని

అన్నన్నా రామచంద్ర అన్ని యిళ్ళు కట్టించిన
పున్నెము నీదేనయ్యా పురుషోత్తమా
తిన్నగా నేయింటను నన్నుండగ నీయనిదే
మన్న నదియు నీయాజ్ఞయె మంచిదేవుడా

అన్ని యిళ్ళ వంటిదే యపురూపముగా నిపుడు నే
నున్న యీ యిల్లు కూడ ఓ రామయ్యా
తిన్నగాను నీకిది మందిరిముగా నిలిపితి నే
నిన్నాళ్ళును నిందు నేను నిన్ను కొలుచుచుంటిని

పడిపోయే యిల్లని నే భావించుట మరచితిని
చెడని పడని యింటిలోన శ్రీరాముడా
కడకు నన్ను చేర్చరా చెడతిరిగినది చాలును
చెడే యిళ్ళు కట్టికట్టి చిత్త మలసిపోయినది 


ఈయిల్లు నాదని యెంతగా మురిసితిని

ఈయిల్లు నాదని యెంతగా మురిసితిని
ఈయింటి కొఱకు నే నెంత చేసితిని

ఈయింటిలో యునికి నెంచి శాశ్వత మని
ఈయింటి యందమున కెంతగానో మురిసి
మాయదారి గొప్పమాయలోన మునిగి
ఈయిల్లు నాకు నీవిచ్చినావని మరచి

ఈయింటిలో నుండుటే భాగ్యమని యెంచి
ఈయింటి దారుఢ్య మినుమడించుట కని
చేయరాని సేవ లెన్ని చేసితిని మమతతో
ఈయిల్లు నాయిల్లే యిటుపైన కాదా

ఈయిల్లు వలదులే ఈశ్వరా యికచాలు
యేయింటిలో నుండ నిక మనసు లేదు
నీయిల్లే నిజముగా నాయిల్లు రాముడా
ఆయింటిలో నుండ నాజ్ఞ సేయ వయ్య 


2, ఆగస్టు 2023, బుధవారం

హరియుండగ భయమదేల

కం. శరణాగతరక్షకుడై
హరియుండగ భయమదేల జనులారా స
త్వరమే రామా యనుచును
హరినే భజియించి మోక్షసీమకు చనుడీ.


1, ఆగస్టు 2023, మంగళవారం

మరి యెవరయ్యా దైవము

కం. కరుణామయుడవు నీవని
దరిజేరితి రామచంద్ర దయజూడవయా
మరి యెవరయ్యా దైవము
నరాధముడ నన్నుబ్రోవ నా తండ్రి హరీ

చాలని నీనామామృతమే

కం. చాలని నీనామామృతమే
లోనెన్నెడు సాధుజనుల లోకేశ సదా
కాలాత్మక రక్షింతువు
కాలుని దూషణల నుండి ఘనుడా రామా