19, ఆగస్టు 2023, శనివారం

ఎలనాగ నీవిభున కెదురేగవే

ఎలనాగ నీవిభున కెదురేగవే
కులుకులరాయడు గోపాల డదె వచ్ఛె

నీలాల నిగనిగల మేలిమి మేనిపై
దాలిచి తులసిమాలలు మోమున
చాలనగవులు పులిమి చాన యదెవరో
చాల చందన మలద సరసుడై వచ్చె

నిదురలేని కనుల నించి ప్రేముడిని
కొదమసింగపు నడక కుదిరించుచు
బెదురులేని చూపు నదిగో నటించుచు
వదలరాని విభుడు పడతిరో వచ్చె

అందరి మంచిచెడ్డ లరసి చూచువాడు
అందరు జీవులకు నంతరంగుడు
సందుచూచుకు నీతో సరసములాడగ
తొందరపడుచు ఓ తొయ్యలి వచ్చె 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు