భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భాష లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

29, ఆగస్టు 2021, ఆదివారం

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

కనీసం ఈపూట ఐనా ఈ పాటను వినండి.

 

(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)


(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)

 

(ఈ వీడియోలో పాటతో పాటు సాహిత్యమూ చూపబండింది చక్కగా)

(శారద & లత పాడినది. నేపథ్యంలో బొమ్మలు చాలా బాగున్నాయి పాటతో పాటు)


చేయెత్తి జై కొట్టు తెలుగోడా....

(సంగీతం: ఘంటసాల గానం: ఘంటసాల & బృందం పల్లెటురు సినిమాకోసం పాడినది. రచన:వేములపల్లి శ్రీకృష్ణ)
(స్వరాభిషేకం కోసం బాలూ 2018లో పాడినది. శ్రీకృష్ణ గారి గురించి వివరాలతో)


వీరగంధము తెచ్చినారము....

(ట్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన, ఆకాశవాణి విజయవాడ వారు ప్రసారం చేసినది)


24, నవంబర్ 2020, మంగళవారం

అసంభావితాలు?


ఈ జిలేబి గారికి బహుసరదా ఐన వ్యాపకాల్లో రెండవది తన బ్లాగులో తానే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసుకోవటం. మొదటి వ్యాపకం గురించి అందరికీ తెలిసిందే ఎక్కడపడితే అక్కడ కందాలను పోలినవి వ్రాస్తూ వీలైన చోట్ల పుల్లలు పెడుతున్నట్లు హడావుడి చేస్తూ ఇల్లేరమ్మలాగా బ్లాగ్లోకం అంతా కలయదిరుగుతూ ఉండటం.

ఆవిడ తన ద్వంద్వం అన్న టపా క్రింద తానే వ్రాసిన ఒక వాఖ్యలో  ఇలా అన్నారు.

ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)
చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!

ఇక్కడ విన్నకోట నరసింహా రావు గారు అసంభావితాలు అంటే ఏమిటా అని సందేహం వెలిబుచ్చారు. దానికి జిలేబీ‌  గారు వినరా వారూ మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ  అని హాశ్చర్యం వెలిబుచ్చారు. మరి "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు అని విన్నకోట నరసింహా రావు గారు మరలా విన్నవించుకొన్నారు. మరి జిలేబీ గారు ఉలకరు పలకరు. చిత్రం.జిలేబీకీ సైలెన్స్ అన్నమాటకీ చుక్కెదురు కదా.

అవునూ? ఈ అసంభావితాలు అంటే ఏమిటీ‌?

ఈ సందేహం మీకూ వచ్చిందా?

ఐతే చదవండి.

ముందు ఒక పదం భావితం అన్నదానిని గురించి తెలుసుకోవాలి. భావితం అన్నది భావితము అనే మాటకు కొంచెం క్లుప్తరూపం. 

భావన అన్న మాట గురించి తెలుసును కదా. ఆలోచన అని దానికి అర్ధం అని కూడ తెలుసును కదా.  అలాగే ఇంచుక్ ప్రత్యయం చేర్చితే ఈ‌ భావన అన్న మాటకు మనకు భావించు అన్న మాట వస్తున్నదనీ తెలుసును కదా. ఇప్పుడు ఈ‌భావించు అన్న మాట గురించి కూడా సాధారణంగా వాడబడే‌మాట కాబట్టి దాని గురించి కూడా తెలుసును కదా. "భావన చేయు" అన్న అర్ధంతో భావించు అన్న మాటను వినియోగిస్తారని అందరూ సులభంగానే గ్రహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఏ యిబ్బందీ లేదు కదా.

ఇప్పుడు ఆ భావితము అన్న మాట భావన అన్న మాట నుండి ఏర్పడింది అని సులువుగానే తెలుస్తుంది తెలుగులోకానికి. భావింంచ బడినది భావితము. మనం ఏదైనా వస్తువును గురించి కాని విషయాన్ని గురించి కాని భావిస్తూ ఉంటే, అదేనండీ భావన చేస్తూ ఉంటే ఆ వస్తువో భావనో ఇక్కడ భావితము అన్నమాట. మీరు ఆఫీసు పని చేస్తూనో ఆరో తరగతి పుస్తకం చదువుతూనో పులుసటుకుల్ని గురించి మనస్సులో ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు ఆ భావితము ఐనది పులుసు అటులుకు అన్నమాట. అన్నమాట కేం‌ లెండి, ఉన్నమాటే.

మీరెప్పుడైనా సంభావన అన్న మాట విన్నారా? వినే ఉంటారు లెండి. ఈ‌సంభావన అన్న మాటకు రెండు అర్ధాలున్నాయి. గౌరవపూర్వకంగా అందిచేది, మనస్సులో చక్కగా తలచుకొనేది అని. నిజానికి మొదట చెప్పిన గౌరవపూర్వకంగా అందించేది అన్న అర్ధం కూడా మనస్సులో చక్కగా ఇష్టపూర్వకంగా తలంచుకొని ఇస్తున్నది అన్న భావన నుండే ఏర్పడిన అర్ధం. కాబట్టి సంభావన అంటే మనస్సులో చక్కగా భావించటం. మనస్సులో భావించటం అన్న అర్ధంలో భావన అంటే సం అన్న ఉపసర్గను ముందు చేర్చి  సం+భావన => సంభావన అనటం ఎందుకంటే ఆ తలంచుకోవటం అన్నది ఎంతో‌ ప్రీతితో చేయటం అని నొక్కి చెప్పటానికి తప్ప మరేమీ‌ లేదు.

 ఏమాటకామాట చెప్పుకోవాలి సంభావన ఇస్తున్నారు అంటే లెక్కప్రకారం ఎంతో‌ ప్రీతితో‌ అదరించి ఏదన్నా ఇస్తున్నారు అని సుళువుగానే అందరికీ‌ బోధపడుతూ‌నే ఉన్నా అన్ని సందర్భాల్లోనూ అది పైపైపలుకే. ఇప్పుడు అలా అంటే మనవాళ్ళకి అర్ధం అవుతూ‌ ఉండవచ్చును కాని పూర్వమూ అంతేనూ అంటేనే గొప్ప హాశ్చర్యం‌ కలుగుతుంది.

ఒకప్పుడు అడిదం సూరకవి గారు ఎవరింటికో పనిబడి వెళ్ళారట. సరిగ్గా ఆనాడు అక్కడ ఆ గృహస్థు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడు. ఎందరో వచ్చారు అక్కడికి సంభావనల కోసం. ఏం చేస్తారు చెప్పండి. ఈ బ్రాహ్మలంతే. నన్నయ్యే అనేశాడు కదా ఆదిపర్వంలో "వసువులు వసుహీనవిప్రులక్రియ  పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఈ‌ముక్కలో భలే‌సొగసుగా రెండర్ధాలు వస్తాయి దక్షిణాశ్రితులైరి అన్నప్పుడు. వసువులు దక్షిణదిక్కుగా పారిపోయారని చెప్పటం ఒకటి ఐతే మరొక ఆ పారిపోవటాన్ని డబ్బులేని బ్రాహ్మలు దక్షిణలను ఆశ్రయించి నట్లు అని అనటం. ఏం చేస్తారు గతిలేని వారు, ఎవరో ఇంత సంభావన అని చెప్పి పడేస్తే, ఆ అరకొరకే ఆనందపడి వారిని ఆశీర్వదించి పోవటం తప్ప. సరే ఆ గృహస్థు ఇంటికి అలా దక్షిణలకోసం బోలెడు మంది వచ్చారు. గుమ్మందగ్గర కొందరు వీళ్ళని చూసుకొందుకు ప్రత్యేకంగా ఉన్నారట. అబ్బెబ్బే‌ వాళ్ళు దక్షిణలు ఇచ్చి పంపటానికి కాదండి. సెలెబ్రిటీ బ్రాహ్మల్ని తిన్నగా లోపలికీ, మిగిలిన జనాభాని దొడ్డిలోనికి పంపించటానికి. కార్యక్రమంలో సెలెబ్రిటీలకు దక్షిణలు ఇచ్చి ఆశీర్వాదాలూ పద్యపంచరత్న స్తుతులూ వగైరా అందుకొన్నాక గృహస్థు ఆనవాయితీగా దొడ్డిలోనికి వచ్చాడు అక్కడ పోగైన బ్రాహ్మలకి సంభావనలు ఇవ్వటానికి. అప్పట్లో సెలెబ్రిటీకి రూపాయి సంభావన. రూపాయేనా అనకండి అది నేటి ఒక ఐదొందలైనా చేస్తుంది. దొడ్డిసంభావన లెక్క పావలా. వరసగా అందరూ వచ్చి గృహస్థు దగ్గర పావలా సంభావన పుచ్చుకొని వెళ్తున్నారు. హఠాత్తుగా గృహస్థు ముందుకు వచ్చి చేయి జాచిన ఒకాయన్ను చూసి తెల్లబోయాడు. "అయ్యయ్యో ఇదేమి చోద్యం భావగారూ మీరిక్కడ ఉన్నారేమిటీ‌ లోపలికి దయచెయ్యక" అని గడబిడపడ్డాడు. సూరకవి నవ్వేసి, ఈవేళ ప్రాప్తం ఇంతే‌ భావగారూ అన్నాడట. ఇంతకూ‌ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం‌ అంటే, ఇలా ఇచ్చే‌ దొడ్డిసంభావన అత్యంత ప్రీతిపూర్వకం కాదు కాని ఉట్టి విధాయకం అని తెలుస్తున్నది కదా, దీన్ని బట్టి సంభావన అంటే ఇలా గూడా ఉండవచ్చునూ అని తెలుసుకుందుకు అన్నమాట.

ఇప్పుడు సంభావితము అంటే ఏమిటో మీకు చూచాయగా బోధపడి ఉంటుంది. ఏ విషయం లేదా వస్తువు మనస్సులో ప్రీతిపూర్వకంగా తలచుకోబడిందో అది సంభావితము అన్నమాట. నిజంగా అంతే. ఐతే కవులు కొంచెం‌ డాంబికంగా తమ గణాలూ‌ గట్రా బాగా కుదరటానికీ అనిచెప్పి ఉత్తుత్తినే కూడా భావితము అనటం బదులు సంభావితము అని వాడిపారేస్తూ ఉంటారు. అది మనం గమనించి సందర్భాన్ని బట్టి ఆ 'సం' అన్న ఉపసర్గని కోవలం పూరణాయాసం క్రిందో‌ బడాయి క్రిందో లెక్కగట్టి మరీ అంత పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.

అలాగని కవులంతా ఊరకే సంభావిత అన్న మాటను భావిత అంటే సరిపోయే చోటకూడా బడాయికి వాడేస్తారని అనుకోకండి. మహాకవులు తెలిసే వాడుతారండీ. కావలిసి వస్తే మీరీ కవిబ్రహ్మ గారి పద్యం చూడండి.

ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో
గావహ మేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం
భావిత భాగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్. 

ఎంత గడుసుగా సొగసుగా చెప్పారో చూసారా ధర్మరాజు గారి భాగ్యం గురించి? రాజసూయం తర్వాత రగిలిపోతున్న ధుర్యోధనుడు అంటున్నాడూ, ధర్మరాజు గారి భాగ్యం అక్కడికి వచ్చిన జనం అందరిచేతా సంభావితం ఐనది అని. అంటే ఆ రాజలోకమూ తదితరులూ అందరూ ఆయన భాగ్యగరిమని మనస్సులో మిక్కిలి ప్రీతితో మనస్సుల్లో తలచుకుంటున్నారని అసూయతో రగిలిపోతూ దుర్యోధనుడు 'అయన భాగ్యం సంభావితం ఐనదీ' అంటున్నాడు. అదీ‌ మహాకవి ప్రయోగం అంటే!

మరి అసంభావితము అంటే ఏమిటీ అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించాలి. 

ఈ 'అ' అన్న ఉపసర్గను వ్యతిరేకార్థంలో వాడుతాం‌ అన్నది అందరికీ తెలిసిందే. అందుచేత సంభావితము కానిది అసంభావితము అన్న మాట.

మీరు పులుసటుకుల గురించి భావిస్తూ ఉంటే అది సంభావితము అనుకోవచ్చును. భేషుగ్గా అనుకోవచ్చును. మరి ఈ సందర్భంలో అసంభావితములు ఏమిటండీ? ఇక్కడ సంభావితము కానిది అని కదా. అంటే పులుసటుకులు కానిది అని అర్ధం. అందుబాటులో ఉన్నవో కానివో‌ కాని పులుసటుకులు కాని సవాలక్ష ఖ్యాద్యపదార్దాల్లో ప్రతిదీ అసంభావితమే అన్నమాట. 

ఏడ్చినట్లుంది. ఇది ఫలానా అని నిర్దేశించక ప్రపంచంలో నేను తలచుకొనే ఫలానాది కానిది అని డొంకతిరుగుడు ఏమిటీ అనవచ్చును మీరు. మరంతే. అదే అసంభావితము అన్న మాటకి అర్ధం.

ఒక్కసారి జిలేబీ‌ పద్యాన్ని పరిశీలనగా చదివి అర్ధం చేసుకోండి. 

 అయ్యబాబోయ్ అంటారా. నేనూ అదే అంటానండీ. 

ఊరికే‌ మాటవరసకి అర్ధం చేసుకోండి అన్నాను. అందులో జిలేబి సంభావించినవి ఏమన్నా ఉంటే మిగిలినవన్ని అసంభావితాలు అన్నమాట.

అదీ జిలేబీ "ఈ‌ పద్యంలో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి?" అనటం వెనుక ఉన్న ఆంతర్యం. మరింకేం అవుతుందీ? అంతే‌ కావాలి.

కాని ఎక్కడో తేడా కొడుతున్నదా.

మీరు సరిగానే గమనించారు. జిలేబీ గారి పద్యం (పద్యం లాంటిది!?) చదివిన తరువాత కూడా మీ బుఱ్ఱలు అమోఘంగా పనిచేస్తున్నాయంటే గట్టిబుఱ్ఱలే! అభినందనలు. 

నేనైతే అంత సాహసం చేయలేదు. ఈ వ్యాసం వ్రాయాలి కదా! బుఱ్ఱని జాగ్రతగా చూసుకోవాలి కదా!

సరే విషయంలోనికి వస్తున్నాను.

మీరెప్పుడన్నా కావ్యదోషాలు అన్న మాట విన్నారా?

మూడురకాల దోషాలను కావ్యంలో జాగ్రతగా కవులు పరిహరించాలీ అని పెద్దలు చెప్తారు. అవి అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనేవి.

అతివ్యాప్తి అంటే అక్కడొక నల్లని కాకి ఉంది అని చెప్పటం‌ లాంటిది. కాకులన్నీ నల్లగానే ఉంటాయికదా. (కోటి కొక బొల్లికాకి ఉంటే ఉండనీండి). కాకి అంటే సరిపోయే దానికి నల్లనికాకి అని చెప్పటం అనవసరం. ఇది అతివ్యాప్తి అంటారు. 

అవ్యాప్తి అంటే అరుదైన విషయాన్ని సాధారణం అన్నట్లు చెప్పటం. అక్కడ పదో పదిహేనో త్రాచుపాములున్నాయి, ఒక్కోటీ పది పది-పన్నెండు అడుగుల పొడవుంది అని చెప్పటం. త్రాచుపాము ఎక్కడన్నా అరుదుగా ఒకటి పదడుగులు ఉందంటే అది వేరే సంగతి కాని ఓ గుంపు త్రాచులు పన్నెండేసి అడుగులున్నవి ఉన్నాయని చెప్పటం బాగోదు. అలా ఎక్కడా ఉండదు. ఇటువంటివి అవ్యాప్తి.

ఇంక అసంభవం అంటే, వాడా గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకున్నాడు అని చెప్పటం వంటిది. కొమ్ములుండవు గుఱ్ఱాలకి. అందుచేత గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ‌ గట్టిగా పట్టుకొని లొంగదీసుకోవటం అసంభవం.

ఇకపోతే నాదృష్టిలో మరొక మూడు కావ్యదోషాలున్నాయి. అవి అనుచితం,అసందర్భం, అసభ్యం అని. ఏదైనా సందర్భంలో  ఉచితం కాని విధంగా విషయం గురించి చెప్పటం అనుచితం ఐతే‌ సందర్భానికి అతకని విషయాన్ని చెప్పటం అసందర్భం. ఇంక అసభ్యం అంటే వేరే చెప్పలా? ఏది (పదుగురు ఉండే‌) సభలో ప్రస్తావించటం‌ నాగరికప్రవర్తన కాదో అటువంటిది పదుగురినీ చదవమని కావ్యంలో వ్రాయటం.

జరగటానికి వీలే లేని విషయాలు అసంభవాలు కదా. తన పద్యంలో అసంభవమైన విషయాలు రెండు ఉన్నాయని సూచించటానికి జిలేబీ‌ గారు "రెండు అసంభావితాలున్నాయి" అని ఉండవచ్చును అనుకుంటున్నాను. రెండు అసంభవాలు అనే అనవచ్చును కదా మరి అసంభావితాలు అనటం ఎందుకు అని మీరు అడగవచ్చును. 

బాగుండండోయ్ నన్నడుగుతారేమిటీ?

ఏమో కొంచెం‌ డాంబికంగా గంభీరంగా ఒక ముక్క వాడుదాం అని అనుకొని అలా అన్నారేమో మరి జిలేబీ‌గారు.

నాకు తెలియదు. ఆ జిలేబీ‌ గారికే తెలియాలి.

మరైతే ఈ వ్యాసం ఎందుకు వ్రాసినట్లూ.

ఎందుకంటే జిలేబీకి ఇంకే‌పనీ తోచక ఒక పద్యం. నాకేమో మరేమీ‌ తోచక ఈ వ్యాసం.

17, మే 2020, ఆదివారం

తెలుగులో తమిళ అక్షరాల ప్రవేశం? తస్మాత్ జాగ్రత జాగ్రత!!!

తెలుగు భాషాభిమానులకు ఒక చేదు వార్త.

ఈ నెల 7వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో తెలుగులో తమిళ అక్షరాలా అంటూ  ఒక వార్త వచ్చింది.  తమిళ భాషలోని రెండు అక్షరాలను తెలుగులో విరివిగా వాడుతున్నందున వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలన్న ప్రతిపాదనను యూనికోడ్ కన్సార్టియమ్ వారు ఆమోదించారట!

ఇవిగో ఆ అక్షరాలు అంటూ పత్రికలో ఇచ్చినవి:



ఇదెలా జరిగిందీ? తెలుగులో తమిళప్రవేశం ఏమిటీ?

రెండు తమిళ అక్షరాలను అదే రూపంలో (తెలుగు సమాన అక్షరాలుగా కాకుండా) యథాతథంగా వైష్ణవ మత గ్రంథాలలోను, ముఖ్యంగా తిరుప్పావై, తిరువాయిమొళిలలో విరివిగా తెలుగువారు వాడుతున్నారని ఒక పది పన్నెండు పాత పుస్తకాలను ఆధారంగా చేసుకుని అతను యూనికోడ్ వారికి ప్రతిపాదించడం, యూనికోడ్ వారు దీనిపై పెద్ద చర్చ లేకుండానే ఆమోదించడం జరిగిపోయింది అని ఆంధ్రజ్యోతి కథనం.

ఈ కథనం లో నిజానిజాలను మనం నిర్ధారించుకోవలసి ఉంది. మన బ్లాగర్లలో ఆంధ్రజ్యోతి అన్న పేరు వింటేనే నిప్పులు చెవుల్లో పడ్డట్లుగా చిందులు త్రొక్కే వారు బ్రహ్మాండమైన సంఖ్యాబలంతో ఉన్నారు. అందుకే యూనికోడ్ సైట్ నుండి వివరాలు సేకరించ వలసి ఉంది. అందుకోసం యూనికోడ్ కొత్త అక్షరాల ప్రపోజల్స్  పేజీని ఒక సారి పరిశీలిద్ధాం.

Draft Candidate Characters for Version 14.0 అనే టేబుల్ వద్ద ఈ క్రింది సమాచారం చూడవచ్చును.

AllocationCountName

0C3C1TELUGU SIGN NUKTA
0C5B..0C5C2TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL LLLA
TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL RRA
0C5D1TELUGU LETTER NAKAARA POLLU


All Characters: UTC Status & ISO Stage అనే టేబుల్ వద్ద ఈ క్రింది సమాచారం చూడవచ్చును.

AllocationCountNameUTC StatusISO Stage

0C3C1TELUGU SIGN NUKTA2020-Apr-28
Accepted
N/A
0C5B..0C5C2TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL LLLA
TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL RRA
2020-Apr-28
Accepted
N/A
0C5D1TELUGU LETTER NAKAARA POLLU2020-Apr-28
Accepted
N/A


ఇక్కడ స్పష్టంగా ఉంది కదా 0C5B..0C5C అని రెండు తమిళ అక్షరాలను తెలుగులిపిలో ఇరికించుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా.

అదీ సంగతి.


ఈ విషయమై యూనికోడ్ వారిని మరలా ఆలోచించి ఈ అక్షరాల చేరికను నిలిపివేయవలసిందిగా మనం విజ్ఞప్తి చేయవలసి ఉంది.

యూనికోడ్ పధ్ధతిలో వ్రాసేటప్పుడు ఇతర లిపులలోని అక్షరాలను యథాతధంగా వాడటానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అందుచేత ఒక భాషలోనికి ఇతరభాషల అక్షరాలను కలుపుకొని పోవటం అనవసరం.

ఐతే తెలుగువారి ఈఅక్షరాలను విరివిగా ఉపయోగిస్తున్నరని ఒక తమిళుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా యూనికోడ్ వారు ఈనిర్ణయం తీసుకోవటం అభ్యంతరకరం.

అందుచేత ఎప్పటిలా నిర్లిప్తంగా ఉండకుండా తెలుగువారు అందరూ కలుగజేసుకోవలసిన అవసరం తప్పకుండా ఉంది.

లేకపోతే తెలుగులిపి కుక్కలు చింపిన విస్తరిలా తయారు కావటానికి ఆట్టే సమయం పట్టదు.


[ ఒక ముఖ్య గమనిక. ఈ వార్త ఆంధ్రజ్యోతి తప్ప ఇతర పత్రికలలో వచ్చిందా లేదా అన్నది తెలియదు. ఆవిషయం నేను పరిశీలనగా చూడలేదు. దాని అర్ధం నేను సదరు ఆంధ్రజ్యోతి మాత్రమే చూస్తానని కాదు. ఇతరపత్రికల్లో వస్తే వచ్చి ఉండవచ్చును కాని నాదృష్టికి రాకపోయి ఉండవచ్చును. ]

7, నవంబర్ 2017, మంగళవారం

మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట 1975లో పుట్టిందట!


ఆంధ్రభూమి పత్రికలో ఒక వ్యాసం వచ్చింది  తెలుగు మహాసభల చుట్టూ తెలుగు భాష! అన్న శీర్షికతో.

అందులో ఒక వింత విషయం ఉన్నది.

వ్యాసకర్త మాటలు చూడండి.

"మొదటి మహాసభల సందర్భంగా వెంగళ్‌రావు ప్రభుత్వం 40 లక్షలకుపైగా ఖర్చుచేయడం వృధా ప్రయాస అనేది నాటి ఆలోచనాపరుల నిరసనకు కారణం కాగా, నిధులు దుర్వినియోగం కావడం తెలిసిందే! ఈ సభల సందర్భంగానే ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ..’ అనే రాష్ట్రీయ గీతాన్ని శంకరంబాడి సుందరాచార్యతో రాయించడం జరిగింది. దీన్ని ఆలపించడానికై నాటి నటి, గాయకురాలు అయిన టంగుటూరి సూర్యకుమారిని లండన్ నుంచి రప్పించడం జరిగింది."

వ్యాసకర్త అభిప్రాయం ప్రకారం

-బహుళప్రచారంలో ఉన్న మా తెలుగుతల్లికి మల్లెపూదండ అన్న గీతాన్ని శంకరంబాడి సుందరాచార్యులు గారు మొదటి ప్రపంచ తెలుగు మహాసభల కోసం వ్రాసారు.

-సభానిర్వాహకులు శంకరంబాడి వారిని ఈ పాట వ్రాయటానికి పురికొల్పారు!!

-దాన్ని సభలో ఆలపించటం కోసం టంగుటూరి సూర్యకుమారి గారిని లండన్ నుండి ప్రత్యేకంగా రప్పించారు.

ఈ  ఉటంకింపులన్నీ తప్పులే.

వ్యాసకర్త ఏమాత్రమూ పరిశోధన చేయకుండా అలా అవాస్తవమైన విషయం ఎందుకు వ్రాసినదీ బోధపడదు. ఒకవేళ ఆయన కావాలని వ్రాసారేమో తెలియదు.

నిజాలు ఏమిటంటే,

ఈ మాతెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని దీనబంధు అనే సినిమా కోసం శంకరంబాడి వారు 1942లో రచించారు. కొన్ని కారణాలవలన ఆ గీతం సినిమాలో చోటు చేసుకోలేదు. కాని సూర్యకుమారి గారు తమ ప్రైవేట్ ఆల్బమ్ లో ఆ పాటను చేర్చితే అది జనంలోనికి చొచ్చుకొని పోయింది.

అనంతరకాలంలో సూర్యకుమారి గారు లండన్ నగరంలో స్థిరపడ్డారు. 1975లో మొదటి ప్రపంచ తెలుగుమహా సభలు జరిగాయి,

సూర్యకుమారి గారు ప్రఖ్యాత గాయకురాలు. ముఖ్యంగా ఈ మాతెలుగుతల్లికి పాట ఆమెకి గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. ఆవిడనూ ఎలాగూ సభలకు ఆహ్వానించుతారు కదా? ఆవిడ ఆ గీతాన్ని ఆలపిస్తారు కదా? ఇక్కడ ఈ పాటకోసం లండన్ నుండి రప్పించా రనటం పొరపాటు. అసలు పాట ఎప్పుడు రచించబడిందన్నదే వ్యాసకర్త పొరపాటుగా పేర్కొన్నారు. ఇది ఆ పొరపాటుకు కొనసాగింపు అన్నమాట.

ఈ పొరపాట్లు నిజంగా పొరపాట్లేనా? ఈ తరం వాళ్ళకు ఏమీ తెలియదులే అన్న దిలాసాతో జనాన్ని బోల్తావేయటం కోసం చెప్పారా యీ మాటలను వ్యాసకర్త?

ఎన్నో విషయాలను సేకరించిన వ్యాసకర్తకు ఈ పాటగురించిన సమాచారం అలభ్యం ఐనది అనుకోలేను. అది నేడు అంతర్జాలంలోనే లభిస్తున్నది.  [ ఏమాటకు ఆమాట చెప్పుకోవాలి. అంతర్జాలంలో లభించినదంతా సరైనది అనుకోరాదు. శంకరంబాడి వారి గురించి ఒక సైటులో ఉన్న అమూల్య వాక్యాలు చూడండి. "ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన మా తెలుగు తల్లికి.. కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది."  ఇది తేటగీతిఛందస్సులో ఉన్నదన్న మాట తప్పు! అసలు ఇది పద్యం కాదు. ఒక గీతం. ]

ఒక దృక్పథంతో ఏదైనా వ్రాయదలచుకొన్నప్పుడు నిజాలను కప్పిపెట్టటమూ, వక్రీకరించటమూ వంటివి కొందరు చేస్తారు. ఇది ఆధునికమైన పోకడల్లో ఒకటి. అందుచేత వ్యాసకర్త ఉద్దేశాన్ని అనుమానించ తప్పటం లేదు.

శ్రీశ్రీ గారికి తెలుగు మహాసభలు జరగటం నచ్చలేదు. ఐతే ఏంటట? ఆయన మాటలు శిలాక్షరాలా? నిజాలకు ఋజువులా?

ఇదే శ్రీశ్రీ గారు

ప్రధాని కాగోరు టాగోరు
అయ్యాడు కొందరికి ఐసోరు

అని కూడా ఒక హాస్యాస్పదమైన కవిత్వం చెప్పి, అదేంటయ్యా అని జనం నిలదీస్తే, అబ్బే ఉట్టినే సరదాకి అలా అన్నానంతే అన్నదీ మనం మర్చిపోలేదు.

అయ్యా పత్రికా సంపాదకమహాశయులారా! కాస్త పరిశీలించి మరీ ప్రచురించండయ్యా!! ఏదిపడితే అది అచ్చొత్తేయటమేనా?

చివరిమాట. వ్యాసకర్త తమ ఫోన్ నెంబరు ఇచ్చారు. కాని ఆయన మాటలను ఫోన్ చేసి సరిచేయటం అసంగతం అవుతుందని అనిపించింది. ఆయన బహిరంగంగా తప్పుడు సమాచారం ఇచ్చినపుడు దానిని ఒక ప్రైవేట్ సంభాషణలో సరిచేస్తే ఆ సరిచేసిన సంగతి కాని సరైన సమాచారం కాని జనబాహుళ్యానికి ఎలా చేరుతుంది? సదరు వ్యాసకర్త స్వయంగా సరిచేసిన సమాచారాన్ని ప్రచురిస్తారని ఆశించలేకపోతున్నాను. ఒకవేళ ఆయన అలా చేసినా ఆంధ్రభూమి వారు ఇలా సవరణ ఒకదాన్ని ప్రకటించి వ్యాసం మొదట తప్పులు చెప్పిందని ఒప్పుకుంటారా అన్నదీ నాకు సందేహమే. అంత శ్రధ్ధ కాని బాధ్యత కాని ఉన్నవారైతే మొదటే వ్యాసంలోని పై తప్పుల్ని ఎత్తి చూపగలిగే వారు వ్యాసకర్తకు.  ఈ నేపధ్యంలో ఇలా టపా రూపంలో ఆ వ్యాసంలోని తప్పుల్ని ఎత్తి చూపక తప్పలేదు. వ్యాసంలో మరి కొన్ని తప్పులూ ఉండవచ్చును కాని వాటిని ప్రస్తుతం పరిశీలించే తీరిక లేదు.

బోనస్.  మా తెలుగుతల్లికి పాట సినిమాలోనే లేదు కాబట్టి అది వినబడదు కాని ఈ దీనబంధు సినిమాలోని కొన్నిపాటలు వినండి. 

29, ఆగస్టు 2017, మంగళవారం

తెలుగో యమ్మ తెలుగు!


సుమశీ యస్వీర్ గారి బ్లాగులో‌ ఈరోజున మాతృభాషను సేవించి మనగదయ్య అన్న సందర్భోచితమైన వ్యాసం చూసాను.

ఆయన ఒక పద్యం ముగింపులో 'దేవభాషాపుత్రి తెలుగుభాష' అన్నారు. అలా అనటం అంత సముచితం‌ కాదేమో‌నని నా సందేహం. ఈ విషయం లో‌ ఒక వ్యాఖ్య వ్రాద్దామని మొదలు పెడితే, ఇదిగో‌ ఇలా ఒక టపాగా తయారై కూర్చుంది.

తెలుగునిండా సంస్కృతం మమేకం‌ కావటానికి అప్పటి దేశకాలపరిస్థితులు కారణభూతం అయ్యాయి. అందుకు మనం‌ సంతోషిస్తున్నాం. తెలుగు స్వయం‌ప్రతిపత్తి కల భాష. ఇలా సంస్కృతమయం‌ కావటం వలన ఎంత లాభం‌ కలిగిందీ‌ అని కొందరూ ఎంతో‌నష్టం‌ జరిగిందని కొందరూ అంటూ ఉంటారు.

తెలుగు నిండా ఇప్పుడు ఇంగ్లీషు నిర్ధాక్షిణ్యంగా దూరిపోతోంది. ఒకప్పుడు, ఎంత నిర్ధాక్షిణ్యంగా అనండి ఎంత దయతో‌ అనండి ఎలా సంస్కృతం మన తెలుగును ఆవరించుకుందో అచ్చం అలాగే. ఈ రోజున మన పలుకబడులన్నీ ఆంగ్లీకరించబడుతున్నాయి. 

అన్నం‌ అనటం బదులు హోటళ్ళవాళ్ళు రైస్ అంటారు చూసారూ. అది ఇప్పుడు అందరి ఇళ్ళల్లోనూ‌ జోరుగా ఉంది. మంచినీళ్ళు అనటం‌ బదులు పిల్లామేకా అంతా ఇంట్లో కూడా వాటర్ అనేస్తున్నారు అలవోకగా. పాఠశాల అన్న మాటనో లేదా బడి అన్న మాటనో మీరు విని ఎన్నాళ్ళైనదో‌ తెలియదు - నేను ఈమధ్య ఎప్పుడూ వినలేదా మాటలు - అందరూ‌ స్కూల్ అనటమేను.

ఇలా తెలుగు ఆంగ్లీకరణకు లోను కావటం తెలుగువాళ్ళకు పెద్దగా మనస్సుకు పట్టటం‌ లేదనే చెప్పాలి. ఐతే నాబోటి ఛాందసులం‌ బాధపడుతూ అందుకు తీవ్రంగా కలత చెందుతున్న మాట మాత్రం కఠిన వాస్తం. దానికి ఋజువు ఏమిటంటే ఈ మాటలు వ్రాస్తున్న సమయానికి కొద్ది నిముషాల ముందే నేను లోలకం బ్లాగులో వ్రాసిన ఒక వ్యాఖ్యయే.  అది ఇలా ఉంది.

మిత్రులు వేమూరి వారూ, మీ సుదీర్ఘమైన ఈ టపాను చదివిన తరువాత కన్నీళ్ళు వచ్చాయి. ఏం చేస్తాం ప్రస్తుతం తెలుగు దశాదిశా ఏమీ బాగో లేవు. రేపోమాపో మరోసారి దేవుడు భూమ్మీదకు పంపేటప్పుడు, తెలుగువాడిగా పుట్టే అవకాశం గురించి ఆలోచిస్తే, ఇద్దామన్నా ఆయనకూ, అడుగుదామన్నా నాకూ, అది ఉండే అవకాశం ఉండదనే బెంగగా ఉంది. ఇకొంచెం కాలానికే తెలుగు అనే భాష ఉండేది అని వేరే భాషల్లో పుణ్యాత్ములు జాలిగా తలచుకొనే పరిస్తితి కదా. మీరు పోతన అంటున్నారు - ఈ కాలం పిల్లలకు అల్పుడెపుడూ పల్కు అంటూ వేమనపద్యం చెప్పినా ఒక్కముక్కా అర్థం కాదు! నా చిన్నతమ్ముడి కూతురు ఇంకా చిన్నపిల్ల - ఆమధ్య ఏనుగంటావేం ఎలిఫెంట్ అని చెప్పొచ్చు కదా అంది ఒక సందర్భంలో. ఇంకేం తెలుగు! ఇంక మనమే మన తెలుగును మర్చిపోకుండా వీలైనంతగా మననం చేసుకొని (మనలో మనమే మాట్లాడుకొని) సంతోషించాలి. కొబ్బరినీళ్ళు ఎవడిక్కావాలీ కోకాకోలా తప్ప, అమృతం ఎవడిక్కావాలి అరకప్పు కాఫీ తప్ప!
-తాడిగడప శ్యామలరావు.

చూసారు కదా నాకెంతగా ఈ ఆంగ్లీకరణం క్షోభను కలిగిస్తోందో. వేమూరి వారి వ్యాసం‌ కూడా చదవండి మా బాధ మరింతగా అవగతం అవుతుంది.

విషయానికి వస్తే తెలుగును ఆంగ్లం విజృంభించి ఆక్రమించటం కనీసం‌ మాబోటి గాళ్ళకు నచ్చటం లేదు.

అలాగే ఒకప్పుడు తెలుగులో‌ సంస్కృతం  ప్రవేశించి ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా త్రివిక్రమావతారం ఎత్తి చివరకు తెలుగుకు సంస్కృతమే తల్లిభాష అనే నమ్మిక రూఢి అయింది. చివరికి అంతా జనని సంస్కృతంబు సకలభాషలకును అనటం మొదలెట్టారు.

శ్రీనాథమహాకవి నిర్మితిగా ప్రసిధ్ధిలో‌ఉన్న క్రీడాభిరామంలో

జనని సంస్కృతంబు సకలభాషలకును
దేశభాషలందు తెలుగు లెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద
మెచ్చు టాడుబిడ్డ మేలుకాదె

అని ఒక పద్యం‌ఉంది. నిజానికి క్రీడాభిరామం వ్రాసింది వినుకొండ వల్లభ రాయడు. అది వేరే‌ సంగతి.

ఈ‌ప్రద్యం విశేషప్రచారంలోనికి తెచ్చిన వ్యవహారం ఈ జనని సంస్కృతంబు సకలభాషలకును అన్నది.

అందరమూ‌ తెలుగుకు సంస్కృతం మాతృభాష అని దాదాపు గుడ్డిగా నమ్మే పరిస్థితి.

ఏమో మరొక వందేళ్ళు పోతే ఆ జనని స్థానం నుండి సంస్కృతాన్ని గెంటివేసి ఆంగ్లభాష తిష్ఠవేస్తుంది. తస్మాత్ జాగ్రత.

తెలుగు కూడా పూర్తిస్థాయి భాషయే. దాని నెత్తిమీదకు మరొక భాషను - అదెంత గొప్పదైనా - అదెంత పరమపవిత్రదేవభాషయైనా సరే కూర్చో  బెట్టటం అవసరం కాదు. అలా కూర్చోబెట్టి అదే తెలుగుకు తల్లి అనటం ఒప్పుకోను.

సంస్కృతంవలన తెలుగు పరిపుష్టం కావటం గురించి చర్చించటం లేదు. రేపు ఇంగ్లీషు పదాలవరద వలన తెలుగుకు అంతర్జాతీయస్థాయి వచ్చిందన్న ఉపన్యాసాలు భావితరాలు చేస్తాయేమో అన్నదీ ఆలోచించమంటున్నాను.

నాకు తెలుగుఛందస్సులు ఇష్టం అంటే ఒక ప్రముఖుడు నాతో అవంత బాగుండవండీ, సంస్కృతవృత్తాల్లో వ్రాస్తేనే తెలుగు కవిత్వం‌బాగుంటుంది' అన్నారు.

సంస్కృతం‌పొందిన స్థితినో  ఇంగ్లీషుపొందబోతున్న స్థితినో‌ ద్వేషించమని నేను చెప్పటం లేదు.

తెలుగు అనేది స్వయంగా ఒక భాష. అది మన అమ్మభాష. ఆసంగతిని మాత్రం మరవకండి ప్లీజ్ అంటున్నాను. అమ్మభాషను బ్రతికించి ఉంచుకుందుకు మీరు ఏమిచేయగలరో ఉడతా భక్తిగా అది చేయటాని ప్రయత్నించండని బ్రతిమాలుతున్నాను. నాకైతే ఆట్టే అశల్లేవనుకోండి. ఐనా అడగటంలో తప్పులేదు కదా.



xxxxxx

27, అక్టోబర్ 2016, గురువారం

ఒక స్పందన - ప్రతిస్పందనలు - సమాధానం



విశ్వనాథవారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతన్నగారు అంధ్రీకరించిన భాగవతపురాణం తెలుగువాళ్ళకు ప్రాణప్రదం అయ్యింది. ఒకప్పుడు అందరిళ్ళల్లోనూ కనీసం దశమస్కంధం ఐనా తప్పని సరిగా ఉండేది. కేవలం‌ గృహాలంరణంగా కాదు. దానిని పారాయణం చేసేవారు. లేదా వీలుప్పడల్లా తన్మయత్వంతో పఠించేవారు.

కర్లపాలెం‌ హనుమంత రావు గారు తమ నాకు తెలిసిన లోకం అనే తమ బ్లాగులో ఇటీవల పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను వ్రాసారు.  (గమనిక: ఈ టపా ఇప్పుడు కనిపించటం లేదు.)

ఆ టపా క్రింద నేనొక వ్యాఖ్యను వ్రాసాను.  అక్టోబరు 24 ఉదయం 7:38ని॥ వ్రాసిన ఆ వ్యాఖ్య ఇదిగో:

ఎవరు వ్రాసారో ఈసంపాదకీయాన్ని!

శ్రీరామచంద్రమూర్తిని  రాజమ్మన్యుడు అని సంబోధించటం ఏమిటి? ఎంత విడ్డూరం! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హత లేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. పోనివ్వండి నానాటికీ జనం తెలుగును తమాషాగా వాడుతున్నారు! నిన్నమొన్ననే వచ్చిన ఒక సినిమా పేరు నాగభరణం. నాగాభరణం కాదు! ఒక్కడు కూర్చుని కథ వ్రాయవచ్చును కాని పదిమంది చేతులు వేయకుండా సినిమా తయారు కాదే, అలాంటిది ఆ సినిమాపేరులో ఉన్న తప్పు ఎవ్వరికీ తట్టలేదందామా లేక పట్టలేదందామా లేక నాగాభరణం కన్న నాగభరణమే వారికి నచ్చిందందామా? ఇంక తెలుగుకు దిక్కు లేదందామా చెప్పండి? రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా చంపుకుతింటుంటే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు.

'పాలుకుర్తి'కి చెయ్యిచాస్తే అందే దూరంలో ఉన్న బమ్మెర గూటిలోనే పోతనామాత్యుడు  ఉన్నాడని ఖచ్చితంగా చెప్పలేము. ఆ విషయంలో  సందేహాలున్నాయి. బమ్మెర ఆయన ఇంటిపేరైనంత మాత్రాన అది ఆయన నివాసస్థలం అన్నట్లుగా ఎలా వ్రాసేయటం? ఆయనిది ఓరుగల్లు అని ఒంటిమిట్ట అని వివాదపడుతున్నారే ఒక ప్రక్కన!



దదుపరి నాకు 25వ తారీఖున 11:32ని॥ ఒక స్పందన వచ్చింది.  అది ఈ విధంగా ఉంది:

నమస్తే! రాజమ్మన్యుడు అంటే రాజు అనిపించుకొనే అర్హతలేకపోయినా బడాయికి తనను తానే రాజుగా చెప్పుకొంటూ తిరిగే డాంబికుడు అనీ అర్థం. అన్నారు కదా! సాధికారికమైన నిర్వచనం చూపిస్తే తప్పు ముందు ముందు జరగకుండా సరిచేసుకొనేందుకు వీలవుతుంది. రాజమ్మన్యుడు -కి మీరు చెప్పిన అర్థం వినడం నేనైతే ఇదే మొదటి సారి. శ్యామల గారూ! అలవోకగా వ్యాఖ్యానించి ఉంటే మాత్రం ఒక్క పదాన్ని పట్టుకుని సంపాదకీయం విలువ మొత్తాన్ని తగ్గించినట్లవుతుంది - అని నా భావన.

ఆ వ్యాఖ్య వచ్చిన మరి కొద్ది సేపటికి అంటే 25వ తారీఖున 11:58ని॥ సమయంలో మరొక స్పందన వచ్చింది. అది కూడా చూడండి:

రోజూ మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు- అన్నారు, తెలుగు స్వరూప స్వభావాలు చెదిరిపోతున్నాయన్న మీ చింత కొంత అర్థం చేసుకోదగినదే కానీ.. మారుతున్న కాలం ప్రకారం భాష.. వ్యక్తీకరణలలో మార్పు రాకుండా ఆపడం ఎవరికీ సాధ్యం కాని విషయం అని నా భావన. సినిమావాళ్ల తెలుగు పరిజ్ఞానాన్ని ఈ టపాకింద ఉదహరించ తెలుగు చచ్చి పోతున్న విధానానికి నొచ్చుకోవడం సబబు కాదని.. అనిపిస్తున్నది నాకు. పోతన జన్మస్థలం గురించి మీరన్నట్లు బమ్మెర .. ఓరుగల్లా అన్న చర్చకు ఇది సరైన వేదిక కాదు. ఆ తరహా చర్చలక్ దిగేందుకు ఈ సంపాదకీయం కేవలం మౌలికంగా వివిధ భావాల సాహిత్య మాలిక. ఈ కారణాల చేత మీ వ్యాఖ్యానాన్ని ఆ బ్లాగు కింది వ్యాఖ్యలనుంచి తొలగించాలని అనుకుంటున్నాను. మీ స్పందనకు ధన్యవాదాలు.

కొద్ది సేపటి క్రిందట నాకు వచ్చిన పై స్పందనలకు సమాధానం వ్రాద్దామని ఆ పోతపోసిన ప్రజాకవి = ఈనాడు సంపాదకీయం అన్న టపాను దర్శించయత్నిస్తే ఆ టపాయే కనిపించ లేదు. అందుచేత నా సమాధానాన్ని హనుమంత రావు గారికి తెలియజేయటం ఎలాగు?

అందుచేత ఇలా టపా ద్వారా వారికి సమాధానం వ్రాస్తున్నాను.

మొదట రాజమ్మన్యుడు అన్న మాట గురించి నేను చెప్పిన అర్థాన్ని ఆయన ఇంతవరకూ వినలే దంటున్నారు హనుమంత రావుగారు. కాని నేను చెప్పినది ప్రసిద్ధమైనదే కాని క్రొత్త విశేషం ఏమీ‌ కాదు.

మీరు ఆంధ్రభారతి - తెలుగు నిఘంటువు పేజీ లోపల పండితమ్మన్యుడు అన్న పదాని అర్థాన్ని చూడండి. మీకు శ్రమ అవసరం లేకుండా అక్క డేముందో క్రింద చూపుతున్నాను.


పండితమ్మన్యుడు

పండితమ్మన్యుడు : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979 
 సంస్కృత విశేషణము
        తన్ను పండితునిగా తలచుకొనెడివాడు.

పండితంమన్యుడు/పండితమ్మన్యుడు/ పండిత మాని : పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 201
 [హిందూ]
        తనను తాను పండితుడుగా భావించు కొనేవాడు. 

ఇదేదో వెబ్-సైట్ నిఘంటువు కదా ఏమంత సాధికారికమైనది అన్న అనుమానం మీకు రావచ్చును. కాని వారు తమ అర్థానికి ప్రమాణాలనూ ఎత్తి చూపారు కదా. మీకు అనుమానం ఉంటే ఎవరైన వయోవృద్ధులైన తెలుగు లేదా సంస్కృతపండితులను సంప్రదించండి. నేను వయోవృద్ధులైన అనటానికి కారణం ఈనాటి తెలుగుపండితులలో అనేకులకు ఉన్న తెలుగుపరిజ్ఞానం  మరీ అంత నమ్మదగ్గది కాకపోవటమే.

హనుమంతరావు గారూ, నేను ఒకవేళ అలవోకగా వ్యాఖ్యానించానేమో అని అడుగుతున్నారు కాని అలాంటిదేమీ‌ లేదని నమ్మకంగా చెప్పగలను. ఒకవేళ నాకే అంత తెలుగులో పరిజ్ఞానం సరిపోకపోయినా నా బుద్ధికి ఎలా తోస్తే అలా అన్నానేమో అని మీరు విస్మయపడటంలో ఆశ్చర్యం‌ లేదు. అలా చేసే వారూ దండిగానే ఉంటారు, ఉన్నారు కూడా.


ఇకపోతే మీడియాలో ఎవరికి తోచినట్లు వారు తెలుగును అక్షరాలా 'చంపుకుతింటుం'టే ఏమీ చెయ్యలేక విచారపడటం తప్పటం‌ లేదు అనటంలో అనౌచిత్యం ఏమీ లేదనే అనుకుంటున్నాను.

ఈ రోజున ప్రింట్ మీడియాలోనూ‌ ఎలక్ట్రానిక్ మీడియాలోనూ‌ కూడా కనిపించే వినిపించే తెలుగు చాలా నేలబారుగానే ఉంటోంది.

మీడియా ప్రసక్తి అనుచితం అనుకోవద్దండి. ప్రజలు, ముఖ్యంగా విద్యార్థిదశలో ఉన్నవాళ్ళకు మాతృభాష చుట్టుప్రక్కల ఉన్న మనుష్యుల ద్వారా ఎంత అవగాహనకు వస్తుందో అంతగానే మీడియాద్వారా కూడా అవగాహనలోనికి వస్తుంది. అందుకే వారికి కనిపించే వినిపించే భాషయొక్క స్వరూపస్వభావాల ప్రమాణాలను దిగజారనిస్తూ పోతూ‌ ఉదాసీనంగా ఉండి కాలం‌ మారుతోంది అనటం సబబు కానేకాదు.

పోతన జన్మస్థలం‌ ప్రసక్తి టపాలోనే ఉన్నప్పుడు దానిపై వ్యాఖ్యానించటానికి మీరు అభ్యంతరం చెప్పకూడదు కదా.

మీరు నా వ్యాఖ్యను తొలగించా లనుకుంటే దానికి నా దగ్గర అభ్యంతరం లేదు. మీ బ్లాగు మీ‌ నిర్ణయం. మీకు నచ్చనిది మీరు తొలగించ వచ్చును దానికేమి.

ఐతే మొత్తం టపానే తొలగించటం ఆశ్చర్యం కలిగించింది.

ఈ టపా ఉద్దేశం కేవలం నా సమాధానాన్ని హనుమంతరావు గారికి తెలియ చేయటమే‌ కాని ఇదేదో వివాదం అని ఎవరూ ఊహలూ అపోహలూ చేయవద్దని అందరికీ మనవి.

నిజానికి హనుమంతరావు గారి ఉద్దేశం రాజమాన్యుడు అని చెప్పటం అనుకుంటాను. వారు కొద్దిగా పొరబడి రాజమ్మన్యుడు అన్నారు. ఐతే అర్థం సరిగా తెలియకుండా ఒక మాట వాడటం వలన అది శ్రీరామచంద్రమూర్తికి వారు చేయబోయిన పురస్కారం కాస్తా తిరస్కారంగా మారింది. ఉపచారం‌ కాస్తా అపచారం ఐనది. ఆ దోషం నాకు చాలా మనస్తాపం కలిగించింది.  భాషలో మెలకువలు పెద్దలనుండి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ప్రకటించే ముందు అందరూ ఒకటికి పదిమార్లు సరిచూసుకొనక తప్పదని నా అభిప్రాయం. ముఖ్యంగా ఈ‌కాలంలో ఒక కవిత ఐనా వ్యాసం ఐనా జనందాకా వెళ్ళటానికి అనేక దారులు సులభంగా దొరుకుతున్నాయి. కాబట్టి తప్పుల విషయంలో మరింతగా జాగరూకత వహించాలని అందరమూ  తప్పక గ్రహించవలసి ఉంది.

18, జులై 2016, సోమవారం

శ్యామలీయంపై శ్రీమాన్ లక్కాకుల వేంకట రాజారావుగారి విసుర్లు.


ఈ మధ్యకాలంలో నేను కొందరికి దేముడు కాదండీ దేవుడు అన్నది సరైన పదం అని చెప్పాను. వారు సరిదిద్దుకోవటమూ జరిగింది. సహజంగానే నటనాపూర్వకంగానో కాని కలహప్రియురాలుగా కనిపించే జిలేబి గారి నుండి దేముడు బాబాయ్ అన్న ఒక టపా వచ్చింది. ఆ టపాను ఆరంభించటమే నన్నొక బెత్తం మాష్టారుగా చూపించారు జిలేబిగారు! సంతోషం.

జిలేబీగారు బహుశః ఆశించినట్లుగానే శ్రీమాన్ లక్కాకుల రాజారావుగారు చర్చను ఇలా ఆరంభించారు. (శ్రీరాజారావు గారు తమదైన పధ్ధతిలో ఎత్తిచూపేదాక -మాలికలో వారి వ్యాఖ్యను చూసేదాక -నేనూ గమనించ లేదు, ఇంటి పేరు పొరపాటుగా వ్రాసానని! ఇప్పుడు, అంటే జూలై 21న సరిచేసాను. )

-జూలై 10, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
నీమమ్మున పల్లె జనులు
దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
దేముడిలో తప్పు వెదుకు
ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

జూలై 10,2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
రావణుడి లోని వా మన
దేవుడిలోనూ గనుపడ తెలుగు జనమ్ముల్
పోవిడి , రాముడిలో గల
మూ వెలయగ దేముడనిరి ముచ్చట గొలిపెన్. 

దేముడు అన్నపదం తప్పుకాదన్నట్లూ, నేను భాషతీరు తెలియకయే తప్పువెదులుతున్నట్లూ వారు స్పష్టంగానే ఆరోపించారు.  ఇది నన్ను తీవ్రంగా బాధించబట్టి నేనుకూడా ఒక సమాధానాన్ని వ్రాసాను దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట  అంటూ ఒక టపాగా శ్యామలీయంలో. రాజారావుగారు తమ వివరణ అనండీ సమాధానం అనండి ఏదీ ఇవ్వలేదు నాటపాకు వ్యాఖ్యగా. కాని వారు  జిలేబీగారి వరూధిని బ్లాగులో ఇలా నన్ను ఆక్షేపిస్తూ వ్రాసారు.

- జూలై 12, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!


మరల వారే తమ బ్లాగులో కూడా ఒక టపాగా తమ అక్షేపణలను ఈ క్రింది విధంగా తెలిపారు. పైవ్యాఖ్యకూ దీనికీ కొద్దిగానే తేడా అంతే.

జూలై 12న రాజారావుగారి బ్లాగులో టపా
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి  తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!

ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
పండితుల మెదళ్ళ పైన కాదు,
ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
జీవ గుళిక  , గొప్ప చేవ కలది .


వారి టపాకు వారే ఒక వ్యాఖ్యను ఇలా జోడించారు మరికొంచెం వివరణగా.
జూలై 12న వారి టపాక్రింద వారిదే ఒక స్పందన
జనంలో ఎవ్వరూ నాన్నను అలా అన్న వారు లేరు,మీరు పిలుచుకుంటానంటే తమ ఘనతను కీర్తిస్తాను .
దేముడు అనే పదం బూతూ కాదు , పైత్యమూ కాదు. దేవుడు అనే పదానికి పర్యాయంగా నెల్లూరు, కడప ఇంకా చాలా జిల్లాల్లో జనం వాడుకలో ఉంది . ఎరుక లేనందున వ్రాయగా దిద్దేనంటాడాయన . పైగా జనం వాడుకలో లేదంటాడు .
భాష సృష్టికర్తలు జనం . పండితులు కాదు . భాష
మాట్లాడే జనం నాల్కల మీద బ్రతికుంటుంది .
పండితుల మెదళ్ళలో కాదు .
తెలుగు మాట్లాడే వాళ్లంతా ఎరుక లేని వాళ్లూ కాదు . బూతులే మాట్లాడుతూ కూర్చోడం లేదు .
' దేవుడు అనే పదానికి పర్యాయంగా కొన్ని చోట్ల
దేముడు అనే వ్యవహారం కూడా ఉండొచ్చు .
ఐతే , అది దేవుడు అనే పదం నుండి ఏర్పడిందే కదా! దేవుడు అని రాస్తే బాగుంటుంది ' అని మర్యాదగా, సున్నితంగా కూడా చెప్పొచ్చు . కానీ, ఇది తప్పు , ఇలానే ఉండాలి అని శాసించడాన్ని
పండితాహంకారమంటారు .

జూలై 13న వారి స్పందన అదే టపాక్రిందను.
వాడుకలో పదాలు మార్ఫుకు లోనగుట సహజం. దీన్ని భాషాపరిణామమంటారు. అసలు దేముడు అనే మాట వాడుకలోనే లేదన్నాడే, దాన్ని విభేదించాను. ఎవ్వరైనా తాము సర్వఙ్ఞుల మనుకోవడం అఙ్ఞానమని తెలుసుకుంటే మంచిది. అలాగే భాషా విషయంలో ఒక్కొక్కరి పంథా ఒక్కో రకం . ఈ పదం అసదు, ఈ పదం గ్రామ్యం, జనవాడుకపదాలు రాతలో వాడరాదు. అనే వాళ్లకు
అనేక నమస్సులు. అసలు భాషకు పరమ ప్రయోజనం జన వ్యవహారము. తతిమ్మా వ్యాసంగాలన్నీ ఆనుషంగిగాలు.  


మీరు గమనించారా? ఆయన ఏకవచనంలో నన్ను సంబోధించటం. నాకైతే నొవ్వు కలిగి ఆయనకు తెలియబరిస్తే ఆయన స్పందన చూడండి.
జూలై 13నవారి వ్యాఖ్య. ఇది వారు చేసిన ఏకవచనప్రయోగాన్ని ఎత్తిచూపినందుకు వారి స్పందన
పల్లెల్లో పుట్టి పెరిగి
పల్లెల ప్రాంతీయ తత్త్వ బహు సహజత్వం
బుల్లంబున పాదుకొనెను,
నెల్లూరు పలుకు బడులు నెలకొను కతనన్ -

అన్నా శ్యామల రాయా!
పన్నుగ నేకవచనమున పలుకుబడి విథం
బన్నది మా పలుకు తీరు
ఉన్నది ఉన్నట్లు పలుక ఉలుకేలయ్యా!

తెచ్చి పెట్టుకున్న తెగగౌరవము కన్న
ప్రేమ లూరు పిలుపు పేర్మి గాదె!
అన్న యనుటకన్ప ఆత్మీయ బంధమ్ము
గారు గీరనుటలొ కాంచ గలమె? 

వారికి నన్ను ఎంత అధిక్షేపించినా తనివి తీరటం లేదండి. ఇది చూడండి.
- జూలై 14, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
భవదీయాంద్ర మహాద్భుత
కవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
కి , వికావికలైరి ఘనులు,
స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.



వారు ఈ క్రింది వ్యాఖ్యలో తెలుగుతూలిక బ్లాగులోనికి వెళ్ళి మరలా నాపై కత్తులు దూస్తున్న విధం గమనించండి.


ఆ బ్లాగులోని సదరు టపాక్రింద నేను వ్యాఖ్యను ఉంచలేదే! కాని వారు నేనే తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగాతప్పులె వెదికెడు ఘనుడనని అక్కడకు పోయి ఆక్షేపణ చేస్తున్నారు.
 జూలై 17, 2016న తెలుగుతూలికలో వ్యాఖ్య
తప్పులు వెదుకుటె పనిగా
తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగా
తప్పులె వెదికెడు ఘనులకు
ఒప్పదు రచనా మనోఙ్ఞ మొప్పరు గుణముల్ .
తప్పులు వెదికే వారలు
తప్పక తమ రచన చదివి తమలో గల యీ
తప్పులు వెదికే దుర్గుణ
మిప్పటికైనా విడుచుట మేలగు నండీ .

వారు నన్ను ఏకవచనంలో సంబోధించటంపై నేను నిరసన తెలిపినపుడు చక్కగా 'అన్నా శ్యామల రాయా! ' అన్నారు. తనది ' ప్రేమ లూరు పిలుపు' కాని వట్టి అలాంటిలాంటి ఏకవచనప్రయోగం కాదన్నారు. దానిని ఒక 'ఆత్మీయ బంధమ్ము' అంటూ చిత్రించారు. సంతోషం.

కాని ఇతరత్రా వీలైనంత ఘాటుగా హేళన చేస్తూ మాట్లాడారు ప్రతిసారీ. చదువరులు కొంచెం గమనికతో చదివితే అది సులభంగానే పోల్చుకొన వచ్చును. నాది పండితాహంకారం అట. పండితుడను కాను బాబో అని ఎన్నిసార్లు బ్లాగులోకానికి స్పష్టం చేసాను!? మాటిమాటికీ ఘనుడు అని ఎత్తిపొడవటంలో ఉన్న ప్రేముడిని మీరే చూడండి. అన్నట్లు నాపై విసుర్లు పడ్డప్పుడల్లా జిలేబీగారు ఆనందోత్సాహాలతో స్పందించటమూ గమనించండి. ఎందుకో ఈ నిరుపయోగమైన అకారణవైరాలు!

నేను రాజారావు గారికి ఏ విన్నపమూ చేయటం లేదు.  వారు ఉచితానుచితాలనుకొంచెంగా అలోచించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నానంతే. అకారణవైరం వారికి నాపైన ఉన్నపక్షంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, కేవలం ఉపేక్షించి ఊరకొనటం తప్ప. నాకైతే వారితో ఏవైరమూ లేదు ఏవిధమైన వైరకారణమూ లేదు.  


రామాయణంలో వాల్మీకులవారు మంధర అలా ఎందుకు చేసిందండీ అంటే మంధరాః పాపదర్శినీ అని చెప్పి వదిలేసారు. నా దురదృష్టం కొద్దీ, నేనేమి వ్రాసినా ఎవరికి ఏమి సలహా ఇచ్చినా అది ఒక అపరాధం లాగే తోస్తోంది వారి దృష్టికి!  చెప్పానుకదండీ దురదృష్టం అని. అంతే. అందుచేత ఆవిషయంలో ఏమీ చేయలేను. ఉపేక్షయే శరణ్యం.

ఈ టపా వ్రాయటానికి కారణం?
నా మనసులోనుండి ఈ విషయాన్ని ఇంతటితో దూరం పెట్టటం.

నా మనసునుండి నొవ్వును తొలగించుకొనటానికి వ్రాసాను కాని ఎవరినీ నొప్పించటం నా ఉద్దేశమూ కాదు, వృత్తీ కాదు,  ప్రవృత్తీ కాదు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే, మన్నించాలి.


3, జూన్ 2016, శుక్రవారం

అడిదం సూరకవి గురించి..

ఈ రోజున మనలో మనమాట టపాలో మాలతి గారు సూరకవిగారి చాటువుని ఉదహరించినందుకు సంతోషం. ఐతే దాని పాఠం కొంచెం సరిచేయాలి, క్రింద చూపినట్లుగా

క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలందు యుద్ధములందున్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

ఈ పద్యాన్ని గురించిన సందర్భంలో ఆవిడ కొంచెం పొరబడ్డారు. రాజుగారు పూసపాటి విజయరామ గజపతి రాజు గారు. పూసపాటి సీతారామరాజు గారు రాజుగారికి (సవతి) అన్నగారు.  కవిగారికీ రాజుగారికీ ప్రాణస్నేహం. సీతారామరాజు గారికి కవిగారి పొడగిట్టదు. అదీ సంగతి. అందుచేత వీలైనప్పుడల్లా సూరకవిగారిని సీతారామరాజుగారు తప్పుపట్టుకుంటూనే ఉండే వారు. ఏదో ఒక సందర్భంలో కవిగారు రాజుగారిపై చెప్పిన పద్యంలో ఏకవచనసంబోధన ఉందని తప్పులెన్ని సీతారామరాజుగారు ఆగ్రహించారు.. రాజుగారు సరసులు కాబట్టి ఆయనకేమీ ఇబ్బంది కాలేదు. సీతారామరాజుగారి ఆక్షేపణను సూరకవిగారు తక్షణం తిప్పికొడుతూ చెప్పినదే ఈ పద్యం.

సూరకవిగారు గురించి ఇంకొంచెం. చెప్పుకుందాం సందర్భం వచ్చింది కాబట్టి

ఒకసారి రాజులందరూ ఒక సమావేశం జరుపుకుంటున్నారు. అందరు రాజులూ మధ్యమధ్యలో వినోదవిజ్ఞానకార్యక్రమాలూ ఉండాలి కదా అని తమతమ రాజ్యాలలోని కవుల్నీకళాకారుల్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సీతారామరాజుగారు చాలా తెలివిగా రాజుగారికి సగం సగం వివరాలే అందించటం వలన ఆయనకు విషయం తెలియక ఒక్కరే వెళ్ళారు. తీరా అక్కడ కవులు పదిమందీ తమ తమ కవితా చాతుర్యాన్ని చక్కగా ప్రదర్శిస్తూ ఉంటే, తమ తమ రాజుల్ని పెద్దచేసి పొగడుతూ పద్యాలను వినిపిస్తుంటే విజయరామరాజుగారికి చాలా విచారమూ మనస్తాపమూ కలిగాయి. అయ్యో వీళ్ళంతా సూరకవికి సాటివచ్చే వాళ్ళా, నాకు తెలియకపోయిందే కవిగారిని తీసుకొని రావాలనీ అని విచారించారు. ఇదంతా ఎవరో బయటివాళ్ళు చేసిన పన్నాగం కాదనీ సాక్షాత్తూ అన్నగారే సూరకవిమీద అక్కసుతో ఆయన్ని పక్కన పెట్టాలని ఇలా చేసాడని మథన పడ్డారు. అంతలో ఖంగున వినిపించిది ఒక రసగుళిక.

రాజు కళంకమూర్తి రతిరాజు శరీరవిహీను డంబికా
రాజు దిగంబరుండు మృగరాజు గుహాంతరసీమవర్తి వి
భ్రాజిత పూసపాడ్విజయరామనృపాలుడు రాజుగాని ఈ
రాజులు రాజులా పెనుతరాజులు కాక ధరాతలంబునన్

అందరూ ఆశ్చర్యపోయారు. 

విజయరామరాజుగారు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు.  సూరకవి .. సూరకవి. వచ్చాడయ్యా. వచ్చాడు. ఎంతగొప్ప పద్యం చెప్పాడూ తనమీద!

తనపరువు నిలబెట్టిన సూరకవిని మనస్సులో వేనోళ్ళ కీర్తించారు.

ఐతే కొందరు విరసులూ ఉంటారు కదా అన్ని సభల్లోనూ! అలాగే కవిత్వసారస్యం తెలిసీతెలియని కొందరు రాజులు 'విజయరామ నృపాలుడు రాజు కానీ, ఈ రాజులు రాజులా' అని ఈ సూరకవిగారు తమందరినీ ఆక్షేపించాడని గింజుకున్నారు. కొందరు రంకెలు వేసారు.

అప్పుడు సూరకవి అన్నాడు కదా. 'మహారాజులారా. నేను మీలో ఎవరినీ చిన్నబుచ్చటం లేదు.. మీరు పొరపడకుండా సరిగా అర్థం చేసుకోండి మరి. పద్యంలో ఉన్న రాజుల్ని గురించే 'ఈ రాజులు రాజులా' అన్నానండీ ' అని ఇలా వివరణ ఇచ్చుకున్నాడు. కాదనటం ఎలా?

మొదటి రాజుగారు,  రాజు అంటే చంద్రుడు - ఆయనేమో కళంకమూర్తి అంటే ఒంటిమీద మచ్చలవాడు. తరువాతి రాజు రతిరాజు అంటే మన్మధుడు. సరిసరి వాడికి అసలు శరీరమే లేదు అందుకే వాణ్ణీ శరీరవిహీనుడూ అని తీసి పక్కన పెట్టింది. మూడవది అంబికారాజుగారి వంతు. అంబిక అంటే పార్వతీదేవి గారు కాబట్టి ఇక్కడ శివుడి గురించి చెప్పాలి. ఏం చెప్పాలీ, ఆయనకు కట్టుకుందుకు బట్టలకే కరువాయె. పక్కన పెట్టేద్దాం, దిగంబరుడికేం గొప్ప లెండి.  ఇకపోతే మహామహా మృగరాజు గారు అంటే సింహం అన్నమాట. ఏం గొప్ప లెండి అడవికి రాజట - పోయి గుహల్లో నక్కి ఉంటుంది -దాని రాజమహలు కొండగుహేను. అందుకే ఈ రాజులంతా ఏపాటి రాజులూ అన్నది.  అందుచేత గొప్ప కీర్తిమంతుడైన మా రాజుగారు పూసపాటి విజయరామ రాజుగారితో పద్యంలో ముందు చెప్పిన రాజులంతా పోల్చటానికి పనికిరారూ అని చెప్పానూ అన్నది సూరకవి గారి వివరణ అండి.

తిరుగు ప్రయాణంలో రాజుగారిని మీరు సమయానికి వచ్చి  భలేపద్యం చెప్పి నా పరువు కాపాడి రక్షించారండీ కవిగారూ అని పొగడి, మీకెలా  తెలిసిందీ వార్త అంటే కవిగారు నగరంలో సభగురించిన వార్తవిని మీరు నన్ను తీసుకొని పోకుండా వెళ్ళటంలో ఏదో పొరపాటు ఉందనిపించి పరుగున వచ్చాను మహారాజా అని విన్నవించాడట.

సూరకవిగారు శాపానుగ్రహసమర్థుడని ప్రతీతి. దాని గురించి ఒక ఐతిహ్యం. సరవయ్య అనే ఒక సెట్టిగారు ఈ కవిగారికి తాను వార్షికం ఇస్తానని ఒకసారి ఏదో సందర్భంలో అందరిముందూ  గొప్పకోసం అన్నాడు కాని తీరా ఇవ్వటానికి మాత్రం చేతులు రాలేదు. రేపురా మాపురా అని త్రిప్పుతూ ఉండే వాడు కవిగారిని. సూరకవి ఓపిగ్గా తిరుగుతూనే ఉండే వాడు. ఒకసారి ఉదయమే సూరకవి సరవయ్య ఇంటికి వెడితే ఆప్పుడు ఆ మహానుభావుడు బారెడు పొద్దెక్కాక లేచి దంతధావనం చేస్తున్నాడు. కవిగారు పొద్దున్నే గుమ్మంలో నిలబడేసరికి చిరాకు నెత్తికెక్కి, 'దాచిపెట్టిన సొమ్మన్నట్లు వచ్చాడే వీణ్ణి పాం గరవ' అన్నాడు.  సెట్టిగారి అరుగుమీద ఉన్న వాళ్ళంతా వికవికా నవ్వారు.  కవిగారు విస్తుపోయి ఆనక ఆగ్రహంతో ఊగిపోతూ, 'ఆపామే నిన్నుకరవ అయ్యో సరవా' అని పలికి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సెట్టిగారు దంతధావనం ముగించి పైకి లేచీ లేవగానే ఎప్పుడు వచ్చిందో ఒక పాము చూరునుండి క్రిందికి దిగి ఫెడీ మని కాటువేసింది!

సూరకవిగారు మహా అభిమానధనుడు. పేదరింకం అనుభవిస్తూ కూడా రాజుగారిని ఎప్పుడూ దేహీ అన లేదు. గమనించిన రాజుగారే ఏదో వంకపెట్టి ఇచ్చినా పుచ్చుకోడు కదా ఈ కవి అని ఒక ఎత్తు వేసారు.  కవిగారికి కనకాభిషేకం చేసారు. తనమీద గుమ్మరించిన బంగారాన్ని సభలో ఉన్న కవిపండితులకి పంచేసాడు సూరకవి. రాజుగారు హతాశులయ్యారు.  ఇదేమిటయ్యా నీకోసం ఇంత బంగారం ఇస్తే ఇలా చేసావూ అని నిష్ఠూరం ఆడితే సూరకవిగారు తాపీగా అన్నాడు కదా, 'మహారాజా తాను స్నానంచేసిన నీళ్ళను ఎవ్వడూ తాగటానికి తీసుకుపోడు కదా' అని!

9, ఫిబ్రవరి 2016, మంగళవారం

చెప్పాలె v చెప్పాలి

మొన్న ఏడవతేదీన శ్రీ ఆచార్య ఫణీంద్రగారు తమ సమగ్ర సంపూర్ణ విజయం టపాను "ఈ ఎన్నికల విజయంతో తెలంగాణ ఉద్యమ విజయం సమగ్రంగా సంపూర్ణమయిందని చెప్పాలె." అన్న వాక్యంతో‌ ముగించారు.

ఆపైన నిరంతరవ్యాఖ్యాప్రకటనాకుతూహలచిత్తు లొకరు "మీ టపా మొత్తం లో ఆ చెప్పాలె బాగుందండీ !" అని ప్రశంసించటమూ జరిగింది.

ఆ ప్రశంసకు సమాధానం చెబుతూ ఫణీంద్రగారు గమనార్హమైన కొన్నిమాటలు చెప్పారు. ఆయన అభిప్రాయాలు తప్పక ఆలోచనీయాలుగా కనిపించాయి. వాటిలోనుండి ఏవో‌ కొన్ని ప్రస్తావించి నా అభిప్రాయాలను వెల్లడించటం వలన ఆయన కాని పాఠకులు కాని అనవసరమైన అపోహలకు గురి అయ్యే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ఆయన వ్యాఖ్యను పూర్తిగా ముందు ఉదహరించిన పిదప నా అభిప్రాయాలను చెబుతాను.

వ్యవహార భాషలోని ఆధిపత్యం నుండి కొద్ది కొద్దిగా స్వాతంత్ర్య సాధనకై నేను చేస్తున్న ప్రయత్న ఫలం అది. ఇంకా కొన్ని సంస్కరించుకోవలసిన ఆవశ్యకత ఉంది.

“చెప్పవలె” అన్న గ్రాంథిక క్రియారూపానికి తెలంగాణ ప్రాంతీయులు ప్రయోగించే “చెప్పాలె” అన్న వ్యవహార రూపం దగ్గరగా ఉంది. “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

ఇన్నాళ్ళు … తప్పుడు ప్రయోగాలు ఒప్పులుగా చలామణియై , ఒప్పులు అవహేళనలకు గురి కావడం నిజంగా తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం!


వ్యవహార భాషలోని ఆధిపత్యం అన్న ప్రయోగాన్ని నేను తమ పైన వ్యవహార భాష చేస్తున్న ఆధిపత్యం అన్న అర్థంలో ఫణీంద్రగారు ప్రస్తావించారని భావిస్తున్నాను. వ్యవహారభాష అంటే వ్యవహారంలో ఉన్న భాష అనే కదా అర్థం? వ్యవహారంలో ఉండటం‌ అంటే సమకాలీనులైన ప్రజానీకం‌ తమ నిత్యవ్యవహారంలో ప్రయోగిస్తూ ఉండటం అని కదా? ఇక్కడ ప్రజలు అన్నప్పుడు సాహిత్యంతో అనుబంధం ఉన్న వారూ, అలాంటి అనుబంధం ఏమీ లేనివారూ కూడా ప్రస్తావనలో ఉంటున్నారు. ఎంత కవి యైనా మహాపండితుడైనా సరే తన నిత్యవ్యవహారంలో వాడే భాష ఆనాటి సాధారణవ్యవహార భాష మాత్రమే అవుతూ ఉంటుంది కాని తద్భిన్నంగా ఉండదు కదా. ఐతే సాహితీవేత్తలు అపశబ్దాలను తక్కువగా ఉఛ్ఛరించే సావుకాశం‌ మాత్రం తప్పక ఉంటుంది. ఐనా సరే వారు కూడా నిత్యవ్యవహారంలో నూటికినూరుశాతమూ వ్యాకరణబధ్దమైన భాషను వాడుక చేయట‌ం జరుగదు.  ఒక్క మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నం పంతులు గారు మాత్రం పచారీ షాపువాడితోనూ కూరగాయల వాడితోనూ చివరికి భార్యతోనూ‌ కూడా నిత్యం‌ మహాశుధ్ధమైన వ్యాకరణజుష్టమైన భాషనే వాడేవారని విన్నాను. ఎంతవరకూ‌ నిజమో తెలియదు.

అందుచేత వ్యవహార భాష మన మీద పెత్తనం చేస్తోంది అన్న ఆరోపణకు నాకు ఆట్టే సామంజస్యం కనబడటం‌ లేదు. ఈ దృక్కోణంలో సంస్కరించుకోవలసిన ఆవశ్యకత అంటే ఏమిటో బోధపడదు మరి.

ఐతే ఫణీంద్రగారి వ్యాఖ్యను ఫూర్తిగా తీసుకొని చూడాలి, వారి వ్యాఖ్యను మాత్రమే కాక వారి టపా స్ఫూర్తిని కూడా మనం పరిశీలించవలసి వచ్చినా రావచ్చును.

అ కోణంలో పరిశీలించితే, ఫణీంద్రగారు వ్యవహారభాష అన్నప్పుడు దాని అర్థం, సీమాంద్రనుండి దిగుమతి ఐనదీ, ముఖ్యంగా తెలంగాణాలోనికి దిగుమతి ఐపోయి విస్తరించి తెలంగాణా మాండలికం మీద ఆధిపత్యం కనబరుస్తున్నదీ ఐన సీమాంధ్రుల వ్యవహార భాష అని అర్థం చెప్పుకోవలసి వస్తున్నది.

ఇప్పుడు వారు తమ భాషను సంస్కరించుకోవటం అంటే సీమాంధ్ర వ్యవహార భాష వాడుక చేస్తున్న తమ అలవాటును వదుల్చుకోవటం. ఇలా వారి భావనను నేను అర్థం చేసుకున్నాను.

చెప్పవలెను అన్న ప్రయోగం‌ నుండి గ్రంథప్రయోగార్హమైన మరొక రూపంగా చెప్పవలె అన్నది ఉండటం‌ యధార్థం. ఇది తెలంగాణావారు వాడే చెప్పాలె అన్న వాడుకకు దగ్గరగా ఉండటమూ కాదనరాని వాస్తవమే.

ప్రస్తుతం వ్యవహారభాషలో చెప్పాలి అన్న రూపం ప్రచురంగా వినిపిస్తుంది. ఇది తప్పుడు ప్రయోగమనీ, చెప్పాలి అన్న రూపంలోని 'లి' ఉనికికి ప్రమాణమేమీ లేదనీ ఫణీంద్రగారి అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని ఆయన ,“చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు.  అని ఘాటుమాటలతోనే అన్నారు.

వ్యవహారభాష సీమాంధ్రులు తెచ్చి తెలంగాణామీద రుద్దారన్న అభిప్రాయంతో ఆయన సదరు సీమాంధ్రవ్యవహారభాషను  so called ప్రామాణిక వ్యవహార భాష అని ఈ‌సడించటాని అర్థంచేసుకోవచ్చును.

వ్యవహారభాష పేరుతో సీమాంధ్రభాష బహుళప్రచారం లోనికి రావటం కారణంగా అన్నిచోట్లా అనేక తప్పుడు మాటలు ప్రచారంలో ఉండటం వలన తెలుగుభాష భ్రష్టుపట్టిపోయిందని ఫణీంద్రగారు అభిప్రాయపడు తున్నట్లున్నారు. ఆయన అభిప్రాయం ఆయనది. దానిపైన నేను చర్చించటం లేదు.

నేను నా అభిప్రయాన్ని వారి వ్యాఖ్యలోని ఒక భాగానికి పరిమితం చేయా లనుకుంటున్నాను.  అది “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె అన్నది


తెలుగులో పల్లె అన్న పదం ఉంది. ఆ మాటకు అర్థం ఏమిటో ఎవరికీ వివరించనవసరం ఉండదు. నా చిన్నప్పుడు మేము గెద్దనాపల్లె అన్న ఊళ్ళో ఉండే వాళ్ళం. గతవారం రోజులుగా మారుమోగుతున్న ఊరు కిర్లంపూడికి రెండు మూడు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ గెద్దనాపల్లె. ఆవూరిని అందరూ గెద్దనాపల్లి అనే పిలచేవారే కాని ఎవరూ గెద్దనాపల్లె అని పిలవటం‌ వినలేదు. చదువరులారా, మీకు పల్లె అన్న మాటతో అంతమయ్యే పేరు గల ఊళ్ళు కొన్నైనా తెలిసే ఉంటాయని భావిస్తున్నాను. సాధారణవ్యవహారంలో ఎంతమంది ఆయా ఊళ్ళ పేర్లను సరిగా పల్లె అని వచ్చేలా పలుకుతున్నారో ఒక్కసారి ఆలోచించండి.

ఎంతో దూరం‌ ఎందుకు లెండి. హైదరాబాదు వాళ్ళకి నాంపల్లి గురించి వేరే చెప్పాలా? దాని అసలు శుధ్ధమైన గట్టిగా మాట్లాడితే తెలంగాణావారికే దాదాపు స్వంతమైన పలుకుబడిలో నాంపల్లె అనాలి కదా? ఎలా పిలుస్తున్నారు అందరూ? హైదరాబాదీలైనా నాంపల్లె అంటున్నారా?  నాంపల్లి అని ఒకటే కాదు, ఇంకా కొంపల్లి, బాచుపల్లి వగైరా పల్లితో ముగిసే ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి.

మల్లెపూల గురించి తెలియని వాళ్ళుండరేమో. అవును మరి వ్రాసేటప్పుడు మల్లె అనే వ్రాస్తాం. కాని వాడుకగా జనం పలుకుబడిలో ఉన్నది మల్లి అనే కదా. మల్లి అన్నమాటే మల్లె అన్న మాటకన్నా ఎక్కువ ప్రచారంలో ఉది కదా. మల్లీశ్వరిలో ఉన్నది మల్లి కాని మల్లె కాదేమో కదా.

గారెలు తెలుగువారికి యిష్టమైన పిండివంటల్లో ఒకటి. ఆలోచించండి. వాడుకలో గారె అంటున్నామా గారి అంటున్నామా?

పెట్టె, గిన్నె అన్నపదాలను మనం పెట్టి, గిన్ని అనే వ్యవహారంలో పలుకుతున్నాం. గేదె అన్న మాట తరచుగా గేది అని వినబడుతూఏ ఉంటుంది. ఇలా చాలా మాటలే ఎకారాంతమైనవి జనం నోటిలో‌పడి ఇకారాంతాలుగా వాడుకలో ఉన్నాయి.

చెప్పాలె అన్న మాటలో ఏ దోషమూ‌ లేదు.  అలాగే చెప్పాలి అనటంలో‌ కూడా ఏదోషమూ‌ లేదు. రెండురకాలుగానూ వ్యవహారం బాగానే ఉన్నది.

దయచేసి ఇప్పుడు చెప్పండి. వాడాలి, చెప్పాలి, వినాలి వంటి మాటలలో ఉన్న ఇకారాంత ప్రయోగం తెలుగును నిజంగానే భ్రష్టుపట్టిస్తోందా? లేదా ఈ విధమైన వాడుకలు సీమాంద్రవారి చలువ వలనే ప్రచారంలో హెచ్చుగా ఉన్నాయి కాబట్టే తెలుగుభాష భ్రష్టుపట్టిపోతోందా?

నిత్యవ్యవహారంలోని భాష కాబట్టే అది వ్యవహారభాషగా చెప్పబడుతోంది కదా. అలాంటప్పుడు ఒక సందర్భంలో మన తెలుగువారు వ్యవహారంలో ఎలావాడుతున్నారు అన్నది పరిశీలించితే సరిపోయేదానికి పరమాత్మునికి నివేదించుకోవలసినంత దారుణమైన దౌర్భాగ్యంగా భావించటం ఎలా సబబు?

ఈ వ్యాసం చివరన ఒక ముక్క చెప్పటం అవసరంగా అనిపిస్తోంది. విషయసంబదంధిగా ఫణీంద్రగారి అభిప్రాయాన్ని ఖండించటమే కాని వారిని చిన్నబుచ్చటం‌ నా ఉద్దేశం‌ కాదు. మామధ్య బహుకాలంగానే స్నేహసంబంధాలు చక్కగా ఉన్నాయి.



23, ఫిబ్రవరి 2015, సోమవారం

అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ







ఇది అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ.


అచ్చతెనుఁగు కావ్యం‌ అంటే సంస్కృతపదాలూ, తత్సమాలూ ఏవీ వాడకుండా కేవలం తెలుగుపదాలతోనే నిర్మించిన కావ్యం అన్నమాట.

ఈ శృంగారశాకుంతలం అనే అచ్చతెలుగు కావ్యాన్ని వ్రాసిన కవిగారు కేసిరాజు సీతారామయ్యగారు. ఈ‌ కావ్యం ప్రథమ ముద్రణం 1959లో జరిగింది. నాకు తెలిసినంతవరకు, ప్రస్తుతం దీని ప్రతులు అందుబాటులో లేవు. ఈ కావ్యానికి జటావల్లభుల పురుషోత్తం గారూ, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రిగారూ, చిలుకూరి పాపయ్యశాస్త్రిగారూ, ఇంద్రగంటి హనుమఛ్ఛాస్త్రిగారూ, నండూరి బంగారయ్యగారూ తమతమ పండితాభిప్రాయాలను వ్రాసారు. కేసిరాజు వేంకట నృసింహ అప్పారావుగారు విపులమైన పీఠికను వ్రాసారు.

ప్రస్తుతం ఈ‌ కావ్యంలో ఉన్న వృషభగతిరగడను అందిస్తున్నాను.మన తెలుగుకవులు రగడలను వాడింది తక్కువే. ఏదో‌ ప్రబంధనిర్మాణకార్యక్రమంలో కావ్యానికొకటి చొప్పున సంప్రదాయం పాటించటాని కన్నట్లుగా వ్రాయటమే కాని ఆట్టే మక్కువను రగడలపై ప్రదర్శించింది కనరాదు. ఈ శృంగారశాకుంతలంలో కూడా ఒక రగడ ఉన్నది. అది కావ్యం ద్వితీయాశ్వాసంలో ఉంది. ముద్రణలో పద్యాలకు సంఖ్యాక్రమం ఇవ్వలేదు కాబట్టి పద్యసంఖ్యను ఇవ్వటం కుదరదు. పుట సంఖ్య 39-40లో ఉందని మాత్రం వివరం ఇవ్వగలను.

ఇది వృషభగతి రగడ అని చెప్పాను కదా. మనకు రగడలు ఆట్టే ప్రచారంలో కనిపించవు కాబట్టి, ఈ వృషభగతి రగడ లక్షణం మొదట వివరిస్తాను. మాత్రాఛందస్సు. పాదానికి 28 మాత్రల చొప్పున రెండు పాదాలు ఒక పద్యం. అంటే నాలుగు సప్తమాత్రాగణాలుగా ఉంటుంది. సప్తమాత్రలగణం అంటే ఒక సూర్యగణం పైన ఒక చతుర్మాత్రాగణం అన్నమాట. చతుర్మాత్రాగణంగా జగణం వదిలి భ,నల,గగ, స అనేవి వాడవచ్చును. (3+4) + (3+4) + (3+4) + (3+4) = 28 మాత్రలు అన్నమాట. ప్రాచీనకాలంలో రగడలకు ప్రాసనియమం లేకపోయినా తరువాత మనకవులంతా ప్రాసనియమం పాటించారు. మూడవ గణం మొదటి అక్షరం యతిస్థానం. దీని నడక మిశ్రగతి. వృషభగతికి త్రిపుటతాళం అని లక్షణశిరోమణిలో‌ రమణకవి ఉవాచ. రగడలలో అంత్యప్రాస సాధారణంగా ప్రయోగిస్తారు. కవుల రుచిభేదాన్ని బట్టి రకరకాల యమకాలూ అనుప్రాసలూ వగైరా కూడా యధేఛ్ఛ అన్నమాట. అలాగే లక్షణం ప్రకారం రెండుపాదాలు ఒక పద్యం ఐనా పద్యాలను తోరణంలా వ్రాసుకుంటూ పోతూ దండలాగా అనేకం గుదిగుచ్చుతారు.

సంప్రదాయికంగా మొత్తం రగడలోని పద్యాలన్నీ మధ్యలో ఖాళీలైనులు ఇవ్వకుండా ఒకే వరుసగా వ్రాసుకుంటూ పోతారు కాని పాఠకుల సౌలభ్యం దృష్టిలో ఉంచుకొని నేను ఈ‌ రగడలో ఏ పద్యానికి ఆ పద్యంగా ఎత్తి వ్రాసాను. అదీ కాక, ప్రతిపాదాన్నీ రెండు భాగాలుగా చూపటం చేసాను - లేకుంటే పాదం మరీ‌ పొడుగ్గా అనిపించి కొందరు జడుసుకొనే ప్రమాదం ఉంది కదా నేటి కాలంలో. 

ఇక కవిగారు చెప్పిన వృషభగతి రగడ.


వెలఁది వెలఁది వెడంద కన్నుల
     విప్పువిప్పుట నంటి కప్రము
నలరు నలరుల రాల్చు పుప్పొడి
     నల్లనల్లన వీడు చప్రము

లేమ లేమరువంబు లవియే
     లెక్కలెక్కకు మీఱె మోవులు
కోమ కోమలికంబుగాఁ గొన
     గోర గోరఁటఁ ద్రుంపు పూవులు

మనము మన ముంగిటను నీ యెల
     మావి మావిరిబోఁడి యూయెల
కొనకకొన కటు తాపుచో ననఁ
     గోయఁ గోయని కూసె కోయల

తలఁప తలపంతం బదేలను
     దాకఁ దాకకు తీవ మిన్నది
చెలువ చెలువగు తావి నెలపూఁ
     జిట్టజిట్టలుగాగ నున్నది

తుఱుము తుఱుమున మొల్లమొగ్గలు
     తూలి తూలిక జాఱెవాడఁగ
చుఱుకు చుఱుకున వీచు తెమ్మెర
     జుమ్ము జుమ్మని తేంట్లు వీడఁగ

రంగు రంగుల పూల వేచిగు
     రాకు రాకుము కోయఁగా నిట
చెంగు చెంగున క్రోవి నీ ర్వెద
     జల్ల జల్లని రాలు పూలట

పొగడ పొగడఁగఁ బూచె నీ సుర
     పొన్న పొన్నదలిర్చె నల్లదె
నిగనిగని పురివిచ్చి యాడెడు
     నెమ్మి నెమ్మిని జూడ నల్లదె

పూని పూనిలువెల్ల రాల్పఁగ
     పూపపూప బెడంగు కనుమిది
జాన జానగు పూవుఁ గొమ్మల
     సారెసారెకు వంచకుము గుది

కుదుర కుదురుల నీరు వోయగ
     కొల్లకొల్లగఁ బూచె మల్లియ
పొదలు పొదలుట జూడుమీ యెల
     పోఁకపోకడ గనుము చెల్లియ

చెలియ చెలియలి ప్రేంకణం బిదె
     చేరి చేరిక ననల ద్రుంపకు
కలికి కలికితనంబు గాదిది
     కన్నె కన్నెర జేసి నింపకు

వలను వలనుగ నెగిరిపడు గొరు
     వంక వంకను జూడు మియ్యెడ
చిలుక చిలుకలు ముద్దుపలుకులు
     చేరు చేరువ నున్న కుయ్యిడ

తగవు తగవులమారి తుమ్మెద
     తారుతారుము మమ్ము వీడుము
నగడు నగడువడంగ నీకిది
     నాలి నాలితనంబుఁ జూడుము

మంచి మంచి రకాల పూలెన
     మాలి మాలియ గుత్తు మింతట
నంచు నంచుల తా మొడళ్ళను
     నలరు నలరులఁ గోసి రంతట





9, జనవరి 2015, శుక్రవారం

తెలుగుభాషకు పడుతున్న దుర్గతిని గమనించండి.

మన తెలుగుభాష దుస్థితి ఎలా ఉందో తెలిపేందుకు ఉదాహరణగా నిలిచే సంఘటన ఒకటి నిన్న రాత్రి నాగార్జున నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరుడు అనే షోలో తటస్థించింది.

నిన్నరాత్రి షోలో అభ్యర్థిగా పాల్గొన్న ఒకాయన పేరు లక్ష్మీనారాయణగారు.

ఆయన తెలుగులో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. అయన పరిశోధించిన అంశం కరీంనగర్ జిల్లాలో భజన సంప్రదాయాలు.

ఆయనకు వచ్చిన ప్రశ్నల్లో కొన్ని అయనను ఇబ్బంది పెట్టాయి. ఆ ఇబ్బందులేమిటో మీరే చదివి ఆనందించండి!

తెలుగు అక్షరాలలో  గ జ డ ద బ లను యేమని పిలుస్తారు?

మొదటగా లక్ష్మీనారాయణగారిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న ఇది.  నిజానికి యీ ప్రశ్నకు యే పాఠశాలావిద్యార్థి ఐనా జవాబు చెప్పగలడు. కాని డాక్టర్ లక్ష్మీనారాయణ అనిపించుకున్న మహనుభావుడికి జవాబు తెలియలేదు. సూచించబడిన నాలుగు సమాధానలలో సరైనదీ తప్పక ఉంటుంది, ఉంది కూడా. కాని యీయన తికమక మకతిక పడిపోయి, చివరికి స్టూడియోలో ఉన్న ప్రేక్షకులను సూచించమని లైఫ్ లైన్ అడిగాడు. వారి చలువతో, గండం గడిచి చివరకు గజడదబ లను సరళములు అంటారు అని గ్రహించి అదే జవాబుగా ఇచ్చారు. నాగార్జున ఆశ్యర్యపోయి ఈయనకు ఎందుకు ఇబ్బంది వచ్చిందన్నట్లు అడిగితే, నాకు తెలుసును కాని ఎందుకో తికమకపడ్డానని చెప్పారు.

కొద్ది సేపటికి మరొకప్రశ్న వచ్చింది మరికొంచెం ఇబ్బంది పెట్టటానికి.

యుధిష్టిరుడికి అజ్ఞాతవాసంలో ఉన్నప్పటి పేరు యేమిటీ?

ఈ ప్రశ్నకు ఆలోచించి అలోచించి సరిగ్గానే అక్కడ ఉన్న ఆప్షన్ 'కంకుభట్టు' అన్నది ఎన్నుకున్నారు డాక్టర్ గారు.  ఆ 'కంకుభట్టు' అంటే అర్థం యేమిటంటే జూదం ఆడేవాడు కాబట్టి కంకుభట్టు అన్న పేరు అని చెప్పారు! అవునా? ఎక్కడా వినలేదు!

నిజానికి 'కంకుభట్టు' కాదు 'కంకభట్టు' అన్నది సరైన పదం. ఈ సంగతి డాక్టర్ లక్ష్మీనారాయణగారికి తెలియదు!  కంకము అన్నదానికి సంస్కృతంలో పద్మము అనే అర్థం ఉంది. భట్టు అన్నది సరే భట్టువంశీకుడన్నది సూచించే పదం అనుకుంటే అది ఒక ముని, పండితుడు అన్న అర్థాన్నిచ్చే పదం. నన్నయ భట్టారకుడు లేదా నన్నయ భట్టు అన్నదానిలో భట్టు పదం ఇటువంటిదే. అగ్నిభట్టారకుడనే మాటకూడా వాడుకలో ఉంది. కాబట్టి భట్టారక లేదా భట్ట శబ్దం శ్రేష్టతా వాచకం. కాబట్టి,  ఈ కంకభట్టు అనే పదం పండితశ్రేష్ఠుడు అన్న అర్థం ఇస్తుంది. ఈ మహానుభావుడికి ఇలాంటి విషయాలేమీ తెలిసినట్లు అనిపించదు.

మన డాక్టరేట్ యోగ్యతాసన్మానితుణ్ణి ఇబ్బంది పెట్టిన ముచ్చటైన మూడవపశ్న.

బుచ్చిబాబు అన్న కలంపేరుతో ప్రసిధ్ధుడైన రచయితగారి నిజమైన పేరు ఏమిటి?

దీనికి సమాధానంగా సూచించబడిన పేర్లు శివరాజు వెంకట సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి,  శ్రీరంగం శ్రీనివాసరావు, మరొకాయన-పేరు-గుర్తు-లేదు

మన డాక్టర్ లక్ష్మీనారాయణగారు బోర్లా పడిపోయారీ ప్రశ్నకు. దేవులపల్లి కృష్ణశాస్త్రి కాదు,  శ్రీరంగం శ్రీనివాసరావు కాదు, ఆ మరొకాయనా కాదు అనుకున్నాడు - అదీ అనుమానం గానే. కాని శివరాజువారు అవునా కాదా అన్నది తెలియలేదు. చివరకు ఆటను విడిచిపెట్టేశారు.

మీరు మిగతా ముగ్గురూ కాదనుకున్నారు కదా, బుచ్చిబాబుగారి ప్రసిథ్థమైన పుస్తకం 'చివరకు మిగిలేది' లాగా ఇక్కడా 'చివరకు మిగిలేది' శివరాజు వెంకట సుబ్బారావు అన్నదే సరైన సమాధానం అని నాగార్జున చమత్కరించాడు. మీరు తెలుగు సాహిత్యంమీద రీసెర్చి చేసారు కదా ఎందుకని ఇబ్బంది కలిగిందీ అని అడిగితే మన హీరోగారు చెప్పిన సమాధానాలు చూడండి.

శివరాజు వెంకట సుబ్బారావు గారి గురించి తెలియదు.
బుచ్చిబాబు అన్న పేరు ఎప్పుడూ వినలేదు.
'చివరకు మిగిలేది' అనే నవలపేరు ఎన్నడూ వినలేదు.

ఇదండీ, మన తెలుగుభాషలో, అందులోనూ సాహిత్యరంగంలో పరిశోధనచేసి డాక్టరేట్ పుచ్చుకున్న మహావీరుడు చూపిన ప్రజ్ఞ.

ఇలాంటి వారిని చూసి నవ్వాలా?
ఇలాంటి వారికి కూడా డాక్టరేట్ పట్టాలు ఎలా వచ్చేస్తున్నాయని ఆశ్యర్యపోవాలా?
ఇలాంటివారు తెలుగు లెక్ఛరర్లుగా విద్యార్థులకు జ్ఞానప్రదాతలుగా ఎలా వెలుగుతున్నారో అని ఆవేదనపడాలా?
మన తెలుగు భాషకు పడుతున్న దుర్గతిని చూసి ఏడవాలా?

మీరే చెప్పండి.

26, నవంబర్ 2014, బుధవారం

పల్లెప్రపంచంలో తెలుగు భాష పైన ప్రశ్న - నా అభిప్రాయాలు

ఈ రోజున పల్లెప్రపంచం పోర్టల్ బ్లాగులో  వచ్చిన ప్రశ్న  అర్ధం కావడమా!? భాషా ప్రావీణ్యమా!? ఏది ముఖ్యం!? వాడుక భాషవల్ల గ్రాంధికానికి సమస్యలు వస్తున్నాయా!? అనేదానికి  రెండువ్యాఖ్యలను మధ్యాహ్నం స్ప్వల్పవ్యవధిలో ఉంచాను. ఆ పిదప మరికొంత చర్చ జరిగింది. నా సమాధానంగా క్రొత్తవ్యాఖ్య సుదీర్ఘం కావటంతో మొత్తం వ్యాఖ్యలు మూడింటినీ ఇక్కడ ఒక టపాగా చదువరుల సౌకర్యార్థం ఉంచాను.

మొదటి వ్యాఖ్య

ఇది రాజకీయసంబంధిత చర్చకాదన్న అవగాహనతో వ్రాస్తున్నాను. 

"ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా? " అన్నది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. భాషలను కొన్ని విధాలుగా వర్గీకరించారు. అది భాషాశాస్త్రం. దాని గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు దానికి సంబంధించిన చర్చ బాగుంటుంది - ముఖ్యంగా అవగాహన ఉన్నవారి మధ్యనే అది పరిమితమైనప్పుడు. ఎన్ని అక్షరలున్నాయీ? ఎంత తక్కువ అక్షరాలుంటే అంత గొప్ప భాషా వంటి పశ్నలు అశాస్త్రీయం.

వివిధ భాషావ్యాకరణాల మధ్య విచారణకూడా భాషాశాస్త్రపరమైనదే.

తెలుగు వ్యాకరణం అన్నది కావ్యాలకు ప్రశస్తి సంప్రదాయకవిత్వమూ బాగా ఉన్నరోజుల్లో భాషాస్వరూపానికి సంబంధించిన లక్షణాలను వివరించేదిగా ఉంది. వ్యావహారిక భాషకు సరైన వ్యాకరణం లేదు. ఒకటో రెండో అలాంటి ప్రయత్నాలు ఉన్నా వాటికి అంత ప్రశస్తి రాలేదు. వ్యావహారిక భాష అనేది వివిధ ప్రాంతాల్లో వివిధంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యాకరణమూ, ఒక పదజలమూ సహాయంతో నిర్వచించటం కష్టంగా ఉంది. ఇప్పుడు వాడుతున్న భాషను శిష్టవ్యావహారికం అనేవారు నిన్నటిదాకా. ఉన్న ఫణంగా దీని విస్తారంగా అన్నిప్రాంతాలకూ అన్వయింపజేయటం కూడ కొన్ని వివాదాలకు దారితీయవచ్చును. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి.

పాఠ్యగ్రంధాల్లో రశ్మ్యుద్గారత అనే పదం చూసి అసలు ఎందరికి ఇది నోరు తిరుగుతుందా అని నాడే మా బోంట్లకు అనుమానం వచ్చింది. ఇలాంటి వింతమాటలు ఇబ్బంది కలిగించాయన్నది వాస్తవం. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నదానికి చరవాణి అన్న మాట చాలా మందే వాడుతున్నారు. అది కొందరికి నవ్వు కలిగించవచ్చును. ఆలోచించండి - తమిళులు బస్సు అన్న దానికీ తమిళ పదం తయారు చేసుకుని వాడుతున్నారట. మనకి మన తెలుగుమీదే చులకన భావం కాబట్టి ఇంగ్లీయు పదాలే బాగుంటాయి. అన్నం అనటానికి బదులు రైస్ అనటం అందంగా ఉండే జాతి మనది.

కొత్తపదాలు బాగున్నా మన తెలుగుదనం లోపించిన తెలుగువారికి కృత్రిమంగానే తోస్తాయి. ఏనుగు అంటే మా తమ్ముడి కూతురికి అర్థం కాలేదు. ఎలిఫెంట్ అని చెప్పాక, మరి ఏనుగంటావేం? అని అడిగింది! అమ్మా అనటమే మనకు నచ్చని తరాలలో తెలుగు అన్నదే కృత్రిమంగా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం.

తెలుగు పదాలు అజంతాలు, అచ్చులతో పూర్తయే పొట్టిపదాలు చాలావరకు. సంస్కృతంలో ధాతుజన్యమైన పదాలు ఒకదానితో ఒకటి అతుకు పెట్టి ఏకసమాసం చేయటానికి వీలుగా ఉంటాయి. భాషా లక్షణాలలో బేధమే కారణం.

తెలుగుపదనిర్మాణంలో లోపాలేమీ లేవు. లేని బాగులు మనం చేయలేము. భాష లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను కదా తెలుగులో. అందువలన ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది. 

భాషను ముందుకు తీసుకొని పోయేది జనమే. ప్రభుత్వాలు కానేకాదు. ముందు తెలుగువారం తెలుగులో మాట్లాడటం సిగ్గు అనుకోవటం భేషజం వదిలించుకోవాలి. కొత్తతరాలవారికి తెలుగు ఎవరూ నేర్పనిదే ఎలా వస్తుంది? ఇంటా బయట గొప్పకోసం ఇంగ్లీషు. ఇంట్లో అమ్మా నాన్నా కూడా తెలుగువారై ఎక్కడి పిల్లలకు తెలుగు పట్టుబడుతుందో అన్న భయంతో, ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ ఉంటే, ఇంక పిల్లతరాలకు తెలుగు పరాయి భాషకాదా? కావుకావు మనలేని కాకి ఉంటుందా అన్నాడు జంఘాలశాస్త్రి సాక్షివ్యాసాలలో. తెలుగులో మాట్లాడినందుకు పిల్లలను శిక్షించే బడులే కాదు తల్లిదండ్రుల్నీ చూసాను నేను.

ముందు జనానికి తెలుగులో మాట్లాడటం తప్పు కాదు తప్పనిసరి ఐన బాధ్యత అని అవగాహన కల్పించవలసి ఉంది. అది జరిగితే, క్రమంగా మంచి మార్పులు అవే వస్తాయి.

రెండవవ్యాఖ్య

"ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి." అన్నారు ఒకరు.
వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. కాబట్టి ఈ మాటా ఆలకించటమైనది.

ప్రస్తుతం సమస్య "మాతృభాషకన్నా ఇంగ్లీషు గొప్పభాష అన్న భ్రమ కారణంగా ఇబ్బడిముబ్బడి అవుతున్న ఇబ్బందులు". మా అమ్మ మంచిది అనుకోవటం ఎన్నడూ అహంకారం కాదు. మా అమ్మకంటే ప్రక్కింటి వాళ్ళమ్మే గొప్పది అని అనుకోవటం మంచి సంస్కారం కూడా కాదు. ఆవలి వారి అమ్మకన్నా మా అమ్మ ఎక్కువ చరువుకొనక పోయినా, ఎక్కువ అందంగా లేకపోయినా, ఎక్కువ ముసలిది ఐనా, రోగిష్టిది ఐనా, మంచి మాటతీరు లేనిది ఐనా, సామాజికంగా గుర్తింపు లేనిది ఐనా, .... ఇంకా సవాలక్ష కారణాలున్నా, మా అమ్మ మంచిది అని అందరూ అనుకుంటారు. బయటివారు పోలికలు తీసుకొని వచ్చి, అలా మా అమ్మ మంచిది అనుకోవటం అహంకారం అంటే అది వారి అమాయకత్వమా, అజ్ఞానమా, దురుసుతనమా, మరొకటా అన్నది ఎవరికి వారు వేరువేరుగా అనుకున్నా, అలా అనటాన్ని హర్షించలేరు.

ఈ మధ్య కొందరు భాషను ఒక పనిముట్టు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి భాష అమ్మే!

మూడవ వ్యాఖ్య

కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావించటానికి ఈ వ్యాఖ్య పరిమితం. వాదం కోసం వాదాన్ని పెంచటం ఈ వ్యాఖ్య ఉద్దేశం కాదు.

1.   యూనికోండ్ తెలుగులో ఉన్న అక్షరాలన్నింటినీ ముద్రించుకొనే సౌకర్యం కలిగిస్తుంది.

2. ఎక్కువ ప్రచారంలో కనిపింఅని అక్షరాలు తీసివేయటం అంటూ ఆలోచించకండి దయచేసి. పాత పత్రాలను ఎక్కించేటప్పుడు అవి అవసరం అవుతాయి.

3.  అచ్చులన్నీ వ్రాయవచ్చును. ఋ ౠ ఌ ౡ అనే వాటితో సహా.

4.  హల్లులన్నీ వ్రాయవచ్చును ౘ ౙ అనే దంత్యాలతో సహా.

5.  రూపాయ గుర్తు కూడా అందుబాటులో ఉంది.

6.  ఐతే మీకు అందుబాటులో ఉన్న ఉపకరణాలు అన్ని అక్షరాలను సమకూర్చలేకపోవచ్చును. 

7.  లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్ తగిన యూనికోడ్ వెర్షన్‍ను అందించక పోవచ్చును.

8.  'భాష అనేది ఒక టూల్ మాత్రమే' అన్న భావన నాకు నచ్చదని ముందే మనవిచేసాను.  అన్నిభాషలలోను మహనీయులు జ్ఞానబోద చేసారు.  కాని అన్నిభాషలనుండీ మనం నేరుగా స్వీకరించలేము, ఇతరులు భాషాంతరీకరణం చేస్తేకాని. భాష ఒక జ్ఞానవాహిని. మాతృస్వరూపిణి.  పుట్టాక కొన్నాళ్ళు పాలిచ్చే టూల్ అమ్మ అనుకోవటం నా ఊహకు అందదు. అలాగే పరస్పర భావవినిమయానికే కాక జ్ఞాననిక్షేపణకూ భాష అనేది ఒక అనంతనిధి. కాబట్టి అటువంటి భాష ఒకటూల్ మాత్రమే అన్న భావన సబుబుకా దనుకుంటాను.

9. తెలుగుపదాల సంఖ్యను పెంచటానికి తాపత్రయం మంచిదే. అంతకన్నా ముందు తెలుగులో ఉన్న పదసంపద బాగా తెలుసుకోవాలు తెలుగుభాషపై అంత మక్కువ ఉన్నవారు.

10.  తెలుగుకు 56 అక్షరాలు ఎక్కువే అనుకునే వారితో నాకు వాదించను. కాని, మరొకసారి విన్నవించే ప్రయత్నం చేస్తాను. చీనీ‌భాషలో వేలాది పదచిత్రరూపాలు నేర్చుకోవలసి ఉంటుంది. జపనీస్ భాషలోనూ అంతే. కాని వారు అలాగే తమతమ భాషలను అంతర్జాతీయభాషలుగా తీర్చిదిద్దుకున్నారు. మనం మనకు అక్షరాలు ఎక్కువైపోవటం వలన తెలుగు అంతర్జాతీయ భాష కాలేకపోయిందన్నట్లుగా బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నాం, ఒక పక్కన తెలుగులో పెదవి విప్పటమే నామోషీగా ప్రవర్తిస్తూ. ఇంగ్లీషులో Q అనే అక్షరం లేకపోతే కొంపేమీ మునిగిపోదు. కాని ఇంగ్లీషు తెలిసినవారూ, ఇంగీషు మాతృభాషగా ఉన్నవారూ ఎంతమంది ఈ అక్షరం అనవసరం అని భాషలోంచి తీసెయ్యండి అని అరుస్తున్నారు? 

11.  తెలుగులో కాని సంస్కృతంలో కాని ఒకేవిధంగా పలికే అక్షరాలు పునరావృతంగా లేనే లేవు. ఊష్మాలనబడే శ, ష, స, హ లను ఈ రోజుల్లో తెలుగు సరిగా తెలియని తరం సరిగ్గా ఉఛ్ఛరించకపోతే ఆ తప్పు భాషదా? శ ను ష లాగా పలకటం శుధ్ధతప్పు! తెలుగులో ఒకే రకం పలుకుబడి ఉన్న అక్షరాలూ అంటూ ఒక రాగం వినిపిస్తున్నవారు, ఇంగీషులో J, Z అనేవి సాదృశాక్షరాలుకావంటారా? Z ఎందుకన్న అనుమానం రావటం లేదా మీకు?

12.  సంస్కృతానికి ఉన్న సుళువులు తెలుగులో దించలేము. ఏ భాష వ్యక్తిత్వం ఆ భాషదే. మూలస్వరూపాన్ని మార్చటం కుదరదు. చిన్నయసూరిగారు కాని మరొక వయ్యాకరణి కాని వ్యాకరణం వ్రాసాకనే భాష అలా ప్రవర్తించటం జరగదు.  భాష ఎలా ప్రవర్తిస్తోందో దానిని సూత్రబధ్ధం చేయటమే వ్యాకరణం. ఉదా। వాడు + ఎక్కడ => వాడెక్కడ. అందరూ కలిపే అంటారు కదా? వ్యాకరణమూ అదే చెబుతుంది.

13.  ఏ భాషలోంచి ఐనా మరొక భాషలోకి తర్జుమా చేస్తే నూటికి నూరుపాళ్ళూ అలాగే ఉండదు. ఏ భాష పలుకుబడి దానిది. ఇంగీషు వాడు make hay while the Sun shines అంటే దానిని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని వ్రాయాలి మన నుడికారం కోసం. అలాగే అందరూ బియ్యాన్నే వండుతారు అన్నం కోసం, కాని అన్నవండాం అంటాం కాని బియ్యం వండాం అనం.

14.  ఒక భాష ప్రపంచభాష కావటానికి కారణాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉంటాయి. నామావశిష్టం ఐపోయిన హీబ్రూ భాషని ఇజ్రాయిల్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయస్థాయికి చేర్చింది. అంతా ఆ భాష మాట్లాడే వారి సంకల్పధృఢత్వంలో ఉంది.

15.  తెలుగుతోసహా  ఏ భాషలోనూ పదాలనూ పండితులు కనిపెట్టి ప్రజల్ని వాడమని ఒత్తిడి చేయలేదు. ముందు ప్రజావినియోగంలో నుండే పదాలు పండితవినియోగం లోనికి వస్తాయి. వాటికి వారు పరిణతి, విస్తృతి కల్పిస్తారు. ప్రజల్లో నుంది వచ్చిన పదాలకు కొత్తకూర్పులూ పండితులు వ్యాప్తి చేస్తారు.

ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువగా వ్రాయవలసిన అవసరం పడదనే భావిస్తున్నాను.

28, సెప్టెంబర్ 2014, ఆదివారం

గుఱ్ఱం జాషువా కవి గారి జయంతి నేడు






ఈ రోజున గుఱ్ఱం జాషువా కవిగారి జయంతి.  ఘనంగా జరిపిద్దా మనుకున్నా రట దొరతనం వారు. కాని తెలుగు అకాడమీయో‌ మరేదో ఇంకా విడిపోలేదట.  అందు చేత నిధుల కొఱత పీడిస్తోందట,  ఈ‌ మాట నిన్న వార్తల్లో వినిపించింది టీవీలో.  ఏ ఛానెలో - టీవీ౯ కావచ్చు. మరొకటి కావచ్చు విషయం అది.  ఏం చేస్తాం.  ఉన్నంతలోనే కాస్త ఘనంగా చేదా మనుకున్నారేమో నేడు వార్తల స్క్రోలింగుల్లో కనిపించిది జాషువా జయంతి అని.  అదీ సంగతి. 

జాషువాగారి గురించి వ్రాయగలిగినంత గొప్పవాడిని కాను. కాబట్టి ఆయన గురించి వెబ్ లోకంలో కనిపించిన కొన్ని లింకులు క్రింద ఇస్తున్నాను.  అక్కడ చదివి కొంత తెలుసుకొని తలచుకొని ఆనందించవ చ్చును,

ప్రస్తుతం నా దృష్టికి వచ్చిన సమాచారం ఇది. అన్నీ వరుసగా చదివినప్పుడు కొంత సమాచారం చర్వితచర్వణంగా అనిపించవచ్చును.  ఫరవాలేదు.  కొన్ని కొన్ని కొత్త విషయాలూ ప్రతీచోటా కనిపించవచ్చును కదా? అందుకే చదవండి.  నా కిష్టమైన గిజిగాడు పాఠం‌మాత్రం వెబ్‌లో ఎక్కడా కనిపించలేదు దానికీ‌ లింక్ ఇద్దామనుకుంటే.

అన్నట్లు ఆ మధ్యన మన హైదరాబాదులోని టాంక్‌బండ్ వద్ద ఉన్న విగ్రహాలను కొన్నింటిని ధ్వంసం చేయటం జరిగింది కదా ఉద్యమాల నేపద్యంలో.  ఆలా ధ్వంసమైన విగ్రహాల్లో జాషువాగారి విగ్రహమూ‌ ఉందని విగ్రహాల ధ్వంసం సబబుకాదు అన్న విశాలాంధ్రవారి అప్పటి వార్తలో చదివాను.  ఆంద్రప్రదేశం వారు మేలుకొని భేషజాలకు పోకుండా 'ఈ‌ సీమాంధ్ర మహానుభావులు'గా కొత్త తాతాచార్యులముద్ర వేయించుకొన్న తమవారి విగ్రహాలను తమ రాష్ట్రానికి తరలించుకుంటే వారిని ఆ మాత్రంగా నైనా కాస్త గౌరవించినవారు అవుతారేమో అన్నది ఆ రాష్ట్రప్రభుత్వంవారు ఆలోచించుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.


25, ఫిబ్రవరి 2014, మంగళవారం

పత్రికల్లో తెలుగుభాష



రమణగారు  రాజకీయనాయకులు దేవుళ్ళూ దెయ్యాల భాషను వాడినా, పత్రికలు తమ రిపోర్టింగ్‌లో అదే భాషని వాడకూడదూ అని రూలింగ్ ఇచ్చారు మొన్నటి తమ కాలక్షేపం వార్తలు టపాలో. చాలా సంతోషం.

పత్రికలు చాలా సంయమనంతో హుందాగా వ్యవహరిస్తూ పుస్తకాలభాషలో వార్తలు ప్రచురించే కాలం ఒకప్పుడు చూసాము. అప్పట్లో రేడియో ఉన్నా అది దాదాపు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం ఒకలబోస్తూ వార్తల్ని పిండి కషాయంచేసి చిక్కని చక్కని భాషలో వినిపించేది.  అపుడు టీవీ అనేది లేదు.

ఇప్పుడు టీవీనిండా వార్తలఛానెళ్ళే. సినిమా ఛానెళ్ళకన్నా ఇవే ఎక్కువసంఖ్యలో ఉన్నాయంటే దానికి కారణం అవి అందిస్తున్న వార్తలా లేదా  సినీమాలని మించి అవి పంచుతున్న వినోదమా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి.

ఒకప్పుడు పత్రికలరిపోర్టింగులో దొరికిపోయిన నేతలంతా 'పత్రికలు తప్పుగా అర్థంచేసుకున్నాయీ' అని సన్నాయి నొక్కులతో తమను తాము సమర్థించుకొనే వారు.  కాని నేడు నాయకమ్మన్యులు ఏమి వాక్రుచ్చుతున్నదీ యథాతధంగా లైవ్ ప్రసారాలు వస్తున్నాయి వార్తాఛానెళ్ళలో.  కాబట్టి ఈ సన్నాయినొక్కులు కాస్త తగ్గాయి. 

ప్రజలు వార్తలకోసమూ, వాటి వివరాలకోసమూ వార్తాఛానెళ్ళమీద ఆధారపడుతున్నారు కాని చద్దన్నం వడ్డించినట్లు వార్తలందించే పత్రికలమీద కానేకాదు నేడు.  లైవ్‌లో ఎటువంటి భాషావిన్యాసాలు మన నాయకులు చేస్తున్నారో వాటినే అలాగే వాటితాలూకు విశ్లేషణలూ అదే భాషలోనే అందించవలసిన కర్మం పత్రికలకు పట్టింది. మడికట్టుకుంటే అవి ఠప్పున చస్తాయి మరి.

నాయకులమనుకునే వారు జుగుప్సాకరమైన భాషప్రయోగించటం పట్ల, జుగుప్సాకరమైన లేదా విద్వేషపూరితమైన భావజాలంతో మాట్లాడటం పట్లా మీరూ నేనూ అందరూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయాలి ముందుగా.  అలా చేస్తున్నామా?   ఆ మధ్యన, 'ఆంధ్రావాళ్ళు బిర్యానీ చేస్తే పేడలా ఉంటుంది' లాంటి  విద్వేషపూరితమైన వ్యాఖ్యచేసిన గొప్పనేతను మనం తప్పుపట్టగలిగామా?  టీవీఛానెళ్ళలోకి వచ్చి 'లుఛ్ఛాలు' వంటి పదప్రయోగాలు చేస్తే మనం అభ్యంతరం ఏమైనా వ్యక్తం చేయగలిగామా? దాదాపు బూతులుతిడుతూ‌ పాటలు కట్టి టీవీల్లో పాడి వినిపిస్తుంటే మనం అభ్యంతరం చెప్పామా?  కొందరు ఈ ధోరణిలో నిజాలు చూసారు, కొందరు ఈ ధోరణిలో వ్యంగ్యం  చూసారు,  కొందరు నిజాయితీతో కూడిన ఆవేశం చూసారు.  ఔచిత్యం ఎక్కడుంది అన్నది మాత్రం ఎవ్వరూ చూడలేదు.  చూసినా పరిస్థితులకు తలవంచి మాట్లాడే సాహసం చేయలేదు.

పత్రికలేం చేస్తున్నాయి?  సమకాలీన రాజకీయ సామాజిక భాషాప్రయోగాల్ని శీర్షికల్లోకి తీసుకువస్తున్నాయి.  ఔచిత్యం భంగం కానంతవరకూ సమంజసమే.  కాని ఔచిత్యం ఏ మాత్రం తప్పినా  తప్పుపట్టటానికి మనం వ్యాసాలు వ్రాయటానికి పూనుకోగలం. అందులో సందేహం లేదు.

రాజకీయనాయకులనూ ఇతర బడా పెద్దమనుషులనూ‌  తప్పుబట్టం. కొరవితో తల గోక్కోవట మెందుకూ అని.  పత్రికలను మాత్రం పుస్తకాలభాష వదలరాదు అని రూలింగులిస్తాం. పత్రికలు ప్రజలపై చర్యలు తీసుకోవు కదా అని.  కాని మనది పక్షపాత ధోరణి కాదా?

ఈ రోజున  పత్రికలు కరపత్రికలస్థాయికి దిగజారిపోవటాకి టివీతోటీ అంతర్జాలంతోటీ‌పోటీయే కాక ఇంకా మరికొన్ని కారణాలుండవచ్చును.  కాని అవన్నీ అస్తిత్వపోరాటం చేస్తున్నాయి. బతికి బట్టకట్టే  ప్రయత్నంలో భాగంగా అవి భాషవిషయంలో రాజీపడవలసి వస్తోందన్నది చాలా విచారించవలసిన విషయం. అవి  చేస్తున్నది సరైన పని కాదని ఒప్పుకుంటూనే వాటిని కొరతవేయటా ప్రయత్నించటానికి బదులు సమాజంలో భాష యొక్క స్థాయిని మన నాయకులు ఇంకా ఇంకా దిగజార్చకుండా ఉండాలంటే ఏమైనా చేయగలమా అని ఆలోచించాలి.

వక్తల భాష హుందాగా ఉంటే టీవీల్లోనూ పత్రికల్లోనూ కూడా వివరాలు హుందాగానే నివేదించబడతాయి.


18, సెప్టెంబర్ 2013, బుధవారం

అక్షరసత్యాల తొందరపాటులో అసత్యాలు.

ఈ క్రింది విపుల వ్యాసం తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న అక్షరసత్యాలు బ్లాగు టపాకు సమాధానంగా, విశదీకరణగా వ్రాస్తున్నాను.  ఇది కేవలం తెలుగుభాషకు సంబంధించిన టపాయే కాని దీనిలో రాజకీయ ఉద్దేశాలు ఏమీ లేవు.

చదువరులు దయచేసి ఒక్క విషయం గమనించాలి.  నాకు అక్షరసత్యాలు బ్లాగు వారిపై ఏమీ‌ కక్షా కార్పణ్యాలు లేవు.  కేవలం  తెలుగుభాషకు పుట్టిల్లు తెలంగాణా అన్న టపాలోని విషయానికి సంబంధించి మాత్రమే ఈ టపా ఉద్దేశించబడింది.

ఇది తెలుగుభాషకు సంబంధించిన విషయం కాబట్టి స్పందిస్తున్నాను కానీ, ఇందులో రాజకీయ కోణం వెతికి నన్ను అల్లరి పెట్టటానికి ప్రయత్నించకండి. ఎవరైన తెలిసో, తెలియకో అలాంటి ఉద్దేశంతో స్పందిస్తే జవాబు వచ్చే అవకాశం దాదాపు శూన్యం అని గ్రహించండి.  అనవసర చర్చలలోకి తెలుగుభాషని ఈడవటానికి ప్రయత్నించవద్దు దయచేసి.

నాదీ అని తెలుగు వాళ్ళంతా గర్వపడే భాష తెలుగుభాష. అందులో తెలంగాణా వాళ్ళు తప్ప మిగతా వాళ్ళని వెలివెయ్యా లనుకోవటం మంచిది ఆలోచన కాదు. సదరు‌ టపా ఆ పని చేయటం బాధాకరం.

నిజానికి తెలుగుభాష స్వరూపం ఎక్కువగా మారింది ఫలాని చోట అని చెప్పలేం.  వివిధప్రాంతాలలో వివిధ కారణాల వల్ల పరభాషా పదాలు తెలుగులో స్థానం సంపాదించుకున్నాయి.  ఇందులో  తప్పుపట్ట వలసినదీ, బాధపడ వలసినదీ ఏమీ‌లేదు.  తెలుగులో కవులు అన్ని ప్రాంతాలలోనూ ప్రభవించారు. మీరు కొన్ని ప్రాంతాల వాళ్ళే కవులు అని హ్రస్వదృష్టి ప్రదర్శించ కూడదు.  అన్ని ప్రాంతాలలోనూ మాండలిక బేధాలు చిన్న పెద్దాగా ఉన్నా కూడా తెలుగు తేనెవాకయే కాని బాగుండక పోవటం లేదు. స్వచ్చమైన తెలుగు పలుకుబడి తెలంగాణాలోనే ఉంది అని అనుకోవటం కేవలం ప్రాంతీయాభిమానమే. అన్ని ప్రాంతాల్లోనూ తెలుగు స్వఛ్ఛంగా పలికే వారూ ఉన్నారు, తెలుగు మాట్లాడటానికి అవస్థపడే వారూ ఉన్నారు.  దేశకాల పరిస్థితుల ప్రభావం అలాంటిది.   మీరు తెలంగాణా వారు మాత్రమే వాడే స్వఛ్ఛమైన తెలుగు పదాలు అంటూ‌ఇచ్చిన పట్టీ చూదాం:



తెలంగాణా పలుకుబడి? ఇతరప్రాంతాల పలుకుబడి? వివరణ
అంగడి బజారు అంగడి అన్నది అన్ని ప్రాంతాల్లో ఉన్న తెలుగుపదమే సామెత: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో‌శని
అల్లరి [తెలంగాణం]
దుకాణం [కోస్తా; తెలంగాణం; రాయలసీమ]
bazaar: late 16th century: from Italian bazarro, from Turkish, from Persian bāzār 'market'  see dictionary
అమాస అమావాస్య అమావాస్య సంస్కృతపదం.
అమాస : నల్లగొండజిల్లా మాండలిక పదకోశం (రవ్వా శ్రీహరి)
అయ్యా ఆర్యా (సారు) ఆర్యా అనేది సంస్కృతపదం.
సర్ అనే ఇంగ్లీషు మాటకి ప్రాంతీయరూపం‌గా సారు అని వాడేది తెలంగాణాలోనే!
మాస్టారు, టీచరు, మాస్టరు [కళింగ మాండలికం] 
పంతులు, సారు, అయ్యగారు [తెలంగాణ మాండలికం]
అయ్యగారు, అయ్యవోరు, అయ్‌వోరు, అయ్యోరు [రాయలసీమ మాండలికం]
అరుగు(అరగు) వేదిక వేదిక సంస్కృతపదం.   వేదిక అనేది పండిత వ్యవహారంలోంచి సభాస్థలానికి వాదుకపదంగా ప్రచారం లోనికి వచ్చింది
అరుగు (అరగు) అనేది ఆంద్ర్హ, తమిళ, కన్నడ భాషల్లో సమంగా కనిపించే పదం. అన్ని తెలుగు ప్రాంతాల్లోనూ వాడుకలో ఉన్నదే. 
ఆత్రం ఆత్రుత ఆత్రం అనేది తెలుగు, తమిళ, కన్నడాల్లో సమానంగా ఉంది.  తెలుగువారు అన్ని ప్రాంతాల్లోనూ‌ వాడుతున్నారు.
ఆత్రుత అనేది ఆతురత అనే‌ గ్రాంథికపదానికి వ్యావహారిక రూపం.
ఆరతి హారతి (నీరాజనం) హారతి, నీరాజనం సంస్కృతపదాలు.
ఆరతి అనేది హారతికి వికృతి పదం. కోస్తాజిల్లాల్లో ఈ పదం వాడరు నిజమే. 
నిజానికి ఆరతి అనే భ్రష్టరూపం ఉత్తరాది నుండి దిగుమతి పదంలా కనిపిస్తుంది. హిందీలో ఇదే ప్రసిథ్థం.
ఆస ఆశ ఆశ సంస్కృతపదం.
ఆస దానికి వికృతి. తధ్భవపదం. అంతే కాని అచ్చతెలుగుమాట కాదు.
ఆసరా ఆశ్రయం ఆశ్రయం సంస్కృతపదం.
ఆసరా అనేది తెలంగాణాలోనే ఎక్కువగా వాడుతారు.  సకృత్తుగా కోస్తాంధ్రలోనూ వాడుక ఉంది.
ఇంగలం అగ్ని(అగ్గి) అగ్ని సంస్కృతపదం కాగా ఆగ్గి అద్బవరూపం.
ఇంగలం అనేది ఇంగాలో అనే‌ ప్రాకృతభాషా పదం‌యొక్క దేశి రూపం.  అచ్చతెలుగు కాదు.  తెలంగాణాలో వాడుక హెచ్చు. కాని మనుచరిత్రలోనూ ఈ‌ పదం వాడబడింది.
ఈను, కాన్పు, నీల్ళాడు   ప్రసవం ప్రసవం సంస్కృతపదం.
ఈను, కను, కానుపు, నీళ్ళాడు అనే మాటలు తెలుగునాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు.
ఉత్తగ పుణ్యం పుణ్యానికి అని ఊరికే దానంగా ఇవ్వటం అనే‌ క్రియకు వ్యవహారంగా ఉన్న ఎత్తిపొడుపు మాట.
ఉత్తినే, ఉత్తిగా అన్న తెలుగు మాటలు అదే అర్థంలో అన్ని ప్రాంతాల్లోనూ‌ వాడుతారు
ఎడ్దోడు మూర్ఖుడు మూర్ఖః అని సంస్కృతం.
ఎడ్డి వాడు, ఎడ్డి మనిషి, ఎడ్డి వెధవ అనీ అని సీమాంధ్రలో వాడుతారు. 
ఎడ్డోడు అన్నది ఎడ్డివాడుకు సంక్షిప్తరూపం.
ఎర్క జ్ఞాపకం జ్ఞాపకం అన్నది సంస్కృతపదం.
ఎరుక అన్న మాట తెలుగునాట ఎల్లెడలా సుపరిచితమే
ఏఱు నది నది సంస్కృతపదం
ఏఱు అన్న తెలుగుమాట అన్ని ప్రాంతాల్లోనూ వాడుతారు.
ఏర్పాటు విభజన విభజన సంస్కృతపదం.  (division)
ఏర్పాటు (arrangement) అన్నది దానికి సరియైన తెలుగుమాట కాదు.
కాని ఏర్పాటు  అనే మాట అన్ని ప్రాంతాల్లోనూ వాడతారు.
ఒప్పుకొను  అంగీకారం అంగీకారం అన్నది సంస్కృత ప్రయోగం 
ఒప్పుకొను అన్నది అంగీకరించు అన్న మాటకు సమానార్థకం.  ఒప్పుకొను అన్న ప్రయోగం తెలుగునాట అన్ని చోట్లా ఉన్నదే.
ఓకర, కక్కు వాంతి ఓకర, వాంతిలు అన్న మాట తెలుగు, తమిళ, కన్నడాల్లో ఒకే అర్థంలో ఉన్నాయు.  కోస్తాలో ఓకర అని వాడటం వినలేదు.
కక్కు అన్న మాట సీమాంధ్రలోనూ వాడుకలో ఉంది.
ఓడు పరాజయం పరాజయం సంస్కృతపదం.  ఓడు అన్నదానికి పరాజయము పొందు అని అర్థం.
ఓడు అన్న మాట తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు
ఓపు సహనం సహనం సంస్కృతపదం.   దీనికి తెలుగు మాట ఓపిక అన్నది తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు.
ఓపు అన్నదానికి సహనము చూపు అని అర్థం. ఓపు అన్నది నన్నయాదులు ప్రయోగించిన పదమే.

కడుగు  శుభ్రం చేయు శుభ్ర పదం సంస్కృతం.  కడుగు దానికి తెలుగు మాట.
కడుగు అన్న మాటను తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు.
కనికరం కరుణ, దయ కరుణ, దయ అన్నవి సంస్కృతపదాలు.
కనికరం కరుణకు సమానార్థకమైన తెలుగుమాటగా తెలుగునాట అన్ని చోట్లా వాడుతారు



ఈ విధంగా ఎన్ని పదాలని విడమరచి చెప్పేది?
అక్షరసత్యాలు టపాలో మరో అరవై పదాలు కాబోలు ఉన్నాయి.
స్థాలీ పులాక న్యాయంగా మొదటి ఇరవై పదాలు కాబోలు విడమరచాను.
నిజానికి అన్ని పదాల సంగతీ విశదం చేయాలనుకున్నాను.
కాని ఈ‌ మాత్రం చాలు అనిపించి ముగిస్తున్నాను.

పై విశదీకరణ చూసిన వారికి అక్షారసత్యాలు టపాలోని తొందరపాటు చక్కగా బోధపడుతుంది.
మరీ ఈ విషయాన్ని ఇంకా సాగదీసి చెప్పవలసిన అగత్యం కనిపించటం లేదు.

ఇది తొందరపాటులో జరిగిన పొరబాటు. ఆ టపా వ్రాసినవారికి నేను దురుద్దేశాలు ఆపాదించదలచుకో లేదు.
నిజానికి ఆ టపాలో,  అసలు తెలుగంటే ఏదో గుర్తెరుగని అంధులను చూసివాడి అజ్ఞానానికి జాలిపడటం కంటే తెలంగాణా వాడేమీ అనలేడు అనే వాక్యం సీమాంధ్రులను ఉద్దేశించినదే కావచ్చునని స్పష్టంగానే ఉన్నా, ఇది అవగాహనాలోపమే కాబట్టి దానికి ఎక్కువ విలువ ఇవ్వనవుసరంలేదని భావిస్తున్నాను.  పై పట్టికలోని వివరణ చూసాక వారు సరిగా అర్థం చేసుకోగలరని నా విశ్వాసం.  వారు వారి వాదానికే‌ కట్టుబడితే నేనేమి పట్టుబట్టను.

దయచేసి ఎవరూ అపార్థం చేసుకో వలదని నా విజ్ఞప్తి.