ఈ రోజున పల్లెప్రపంచం పోర్టల్ బ్లాగులో వచ్చిన ప్రశ్న అర్ధం కావడమా!? భాషా ప్రావీణ్యమా!? ఏది ముఖ్యం!? వాడుక భాషవల్ల గ్రాంధికానికి సమస్యలు వస్తున్నాయా!? అనేదానికి రెండువ్యాఖ్యలను మధ్యాహ్నం స్ప్వల్పవ్యవధిలో ఉంచాను. ఆ పిదప మరికొంత చర్చ జరిగింది. నా సమాధానంగా క్రొత్తవ్యాఖ్య సుదీర్ఘం కావటంతో మొత్తం వ్యాఖ్యలు మూడింటినీ ఇక్కడ ఒక టపాగా చదువరుల సౌకర్యార్థం ఉంచాను.
మొదటి వ్యాఖ్య
ఇది రాజకీయసంబంధిత చర్చకాదన్న అవగాహనతో వ్రాస్తున్నాను.
"ఇంగ్లీష్‌లో 26 అక్షరాలుంటే మనకు 56 అవసరమా? " అన్నది సరైన ప్రశ్న కాదని నా అభిప్రాయం. భాషలను కొన్ని విధాలుగా వర్గీకరించారు. అది భాషాశాస్త్రం. దాని గురించి కొంత అవగాహన ఉన్నప్పుడు దానికి సంబంధించిన చర్చ బాగుంటుంది - ముఖ్యంగా అవగాహన ఉన్నవారి మధ్యనే అది పరిమితమైనప్పుడు. ఎన్ని అక్షరలున్నాయీ? ఎంత తక్కువ అక్షరాలుంటే అంత గొప్ప భాషా వంటి పశ్నలు అశాస్త్రీయం.
వివిధ భాషావ్యాకరణాల మధ్య విచారణకూడా భాషాశాస్త్రపరమైనదే.
తెలుగు వ్యాకరణం అన్నది కావ్యాలకు ప్రశస్తి సంప్రదాయకవిత్వమూ బాగా ఉన్నరోజుల్లో భాషాస్వరూపానికి సంబంధించిన లక్షణాలను వివరించేదిగా ఉంది. వ్యావహారిక భాషకు సరైన వ్యాకరణం లేదు. ఒకటో రెండో అలాంటి ప్రయత్నాలు ఉన్నా వాటికి అంత ప్రశస్తి రాలేదు. వ్యావహారిక భాష అనేది వివిధ ప్రాంతాల్లో వివిధంగా ఉంటుంది కాబట్టి ఒక వ్యాకరణమూ, ఒక పదజలమూ సహాయంతో నిర్వచించటం కష్టంగా ఉంది. ఇప్పుడు వాడుతున్న భాషను శిష్టవ్యావహారికం అనేవారు నిన్నటిదాకా. ఉన్న ఫణంగా దీని విస్తారంగా అన్నిప్రాంతాలకూ అన్వయింపజేయటం కూడ కొన్ని వివాదాలకు దారితీయవచ్చును. ఇది కొంచెం క్లిష్టమైన పరిస్థితి.
పాఠ్యగ్రంధాల్లో రశ్మ్యుద్గారత అనే పదం చూసి అసలు ఎందరికి ఇది నోరు తిరుగుతుందా అని నాడే మా బోంట్లకు అనుమానం వచ్చింది. ఇలాంటి వింతమాటలు ఇబ్బంది కలిగించాయన్నది వాస్తవం. ఇప్పుడు సెల్ ఫోన్ అన్నదానికి చరవాణి అన్న మాట చాలా మందే వాడుతున్నారు. అది కొందరికి నవ్వు కలిగించవచ్చును. ఆలోచించండి - తమిళులు బస్సు అన్న దానికీ తమిళ పదం తయారు చేసుకుని వాడుతున్నారట. మనకి మన తెలుగుమీదే చులకన భావం కాబట్టి ఇంగ్లీయు పదాలే బాగుంటాయి. అన్నం అనటానికి బదులు రైస్ అనటం అందంగా ఉండే జాతి మనది.
కొత్తపదాలు బాగున్నా మన తెలుగుదనం లోపించిన తెలుగువారికి కృత్రిమంగానే తోస్తాయి. ఏనుగు అంటే మా తమ్ముడి కూతురికి అర్థం కాలేదు. ఎలిఫెంట్ అని చెప్పాక, మరి ఏనుగంటావేం? అని అడిగింది! అమ్మా అనటమే మనకు నచ్చని తరాలలో తెలుగు అన్నదే కృత్రిమంగా ఉన్న రోజుల్లో ఉన్నాం మనం.
తెలుగు పదాలు అజంతాలు, అచ్చులతో పూర్తయే పొట్టిపదాలు చాలావరకు. సంస్కృతంలో ధాతుజన్యమైన పదాలు ఒకదానితో ఒకటి అతుకు పెట్టి ఏకసమాసం చేయటానికి వీలుగా ఉంటాయి. భాషా లక్షణాలలో బేధమే కారణం.
తెలుగుపదనిర్మాణంలో లోపాలేమీ లేవు. లేని బాగులు మనం చేయలేము. భాష లక్షణం ఎలా ఉంటుందో చెప్పాను కదా తెలుగులో. అందువలన ఒకటికంటే హెచ్చు పదాలను కలిపి చెప్పవలసి వస్తే ఏకపదం చేయటం సంస్కృరంలోనే సుళువు కాబట్టే కొత్తపదాల సృష్టికి సంస్కృతం ఉపయోగిస్తోంది.
భాషను ముందుకు తీసుకొని పోయేది జనమే. ప్రభుత్వాలు కానేకాదు. ముందు తెలుగువారం తెలుగులో మాట్లాడటం సిగ్గు అనుకోవటం భేషజం వదిలించుకోవాలి. కొత్తతరాలవారికి తెలుగు ఎవరూ నేర్పనిదే ఎలా వస్తుంది? ఇంటా బయట గొప్పకోసం ఇంగ్లీషు. ఇంట్లో అమ్మా నాన్నా కూడా తెలుగువారై ఎక్కడి పిల్లలకు తెలుగు పట్టుబడుతుందో అన్న భయంతో, ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ ఉంటే, ఇంక పిల్లతరాలకు తెలుగు పరాయి భాషకాదా? కావుకావు మనలేని కాకి ఉంటుందా అన్నాడు జంఘాలశాస్త్రి సాక్షివ్యాసాలలో. తెలుగులో మాట్లాడినందుకు పిల్లలను శిక్షించే బడులే కాదు తల్లిదండ్రుల్నీ చూసాను నేను.
ముందు జనానికి తెలుగులో మాట్లాడటం తప్పు కాదు తప్పనిసరి ఐన బాధ్యత అని అవగాహన కల్పించవలసి ఉంది. అది జరిగితే, క్రమంగా మంచి మార్పులు అవే వస్తాయి.
రెండవవ్యాఖ్య
"ముందు ఇంగ్లీష్ కన్నా మాదే గొప్ప అన్న అహంభావం వదిలెయ్యాలి." అన్నారు ఒకరు.
వినదగు నెవ్వరు చెప్పిన అన్నారు. కాబట్టి ఈ మాటా ఆలకించటమైనది.
ప్రస్తుతం సమస్య "మాతృభాషకన్నా ఇంగ్లీషు గొప్పభాష అన్న భ్రమ కారణంగా ఇబ్బడిముబ్బడి అవుతున్న ఇబ్బందులు". మా అమ్మ మంచిది అనుకోవటం ఎన్నడూ అహంకారం కాదు. మా అమ్మకంటే ప్రక్కింటి వాళ్ళమ్మే గొప్పది అని అనుకోవటం మంచి సంస్కారం కూడా కాదు. ఆవలి వారి అమ్మకన్నా మా అమ్మ ఎక్కువ చరువుకొనక పోయినా, ఎక్కువ అందంగా లేకపోయినా, ఎక్కువ ముసలిది ఐనా, రోగిష్టిది ఐనా, మంచి మాటతీరు లేనిది ఐనా, సామాజికంగా గుర్తింపు లేనిది ఐనా, .... ఇంకా సవాలక్ష కారణాలున్నా, మా అమ్మ మంచిది అని అందరూ అనుకుంటారు. బయటివారు పోలికలు తీసుకొని వచ్చి, అలా మా అమ్మ మంచిది అనుకోవటం అహంకారం అంటే అది వారి అమాయకత్వమా, అజ్ఞానమా, దురుసుతనమా, మరొకటా అన్నది ఎవరికి వారు వేరువేరుగా అనుకున్నా, అలా అనటాన్ని హర్షించలేరు.
ఈ మధ్య కొందరు భాషను ఒక పనిముట్టు అని ప్రచారం చేస్తున్నారు. నాకు తెలిసి భాష అమ్మే!
మూడవ వ్యాఖ్య
కొన్ని కొన్ని విషయాలు ప్రస్తావించటానికి ఈ వ్యాఖ్య పరిమితం. వాదం కోసం వాదాన్ని పెంచటం ఈ వ్యాఖ్య ఉద్దేశం కాదు.
1. యూనికోండ్ తెలుగులో ఉన్న అక్షరాలన్నింటినీ ముద్రించుకొనే సౌకర్యం కలిగిస్తుంది.
2. ఎక్కువ ప్రచారంలో కనిపింఅని అక్షరాలు తీసివేయటం అంటూ ఆలోచించకండి దయచేసి. పాత పత్రాలను ఎక్కించేటప్పుడు అవి అవసరం అవుతాయి.
3. అచ్చులన్నీ వ్రాయవచ్చును. ఋ ౠ ఌ ౡ అనే వాటితో సహా.
4. హల్లులన్నీ వ్రాయవచ్చును ౘ ౙ అనే దంత్యాలతో సహా.
5. రూపాయ గుర్తు కూడా అందుబాటులో ఉంది.
6. ఐతే మీకు అందుబాటులో ఉన్న ఉపకరణాలు అన్ని అక్షరాలను సమకూర్చలేకపోవచ్చును.
7. లేదా మీ ఆపరేటింగ్ సిస్టమ్ తగిన యూనికోడ్ వెర్షన్‍ను అందించక పోవచ్చును.
8. 'భాష అనేది ఒక టూల్ మాత్రమే' అన్న భావన నాకు నచ్చదని ముందే మనవిచేసాను. అన్నిభాషలలోను మహనీయులు జ్ఞానబోద చేసారు. కాని అన్నిభాషలనుండీ మనం నేరుగా స్వీకరించలేము, ఇతరులు భాషాంతరీకరణం చేస్తేకాని. భాష ఒక జ్ఞానవాహిని. మాతృస్వరూపిణి. పుట్టాక కొన్నాళ్ళు పాలిచ్చే టూల్ అమ్మ అనుకోవటం నా ఊహకు అందదు. అలాగే పరస్పర భావవినిమయానికే కాక జ్ఞాననిక్షేపణకూ భాష అనేది ఒక అనంతనిధి. కాబట్టి అటువంటి భాష ఒకటూల్ మాత్రమే అన్న భావన సబుబుకా దనుకుంటాను.
9. తెలుగుపదాల సంఖ్యను పెంచటానికి తాపత్రయం మంచిదే. అంతకన్నా ముందు తెలుగులో ఉన్న పదసంపద బాగా తెలుసుకోవాలు తెలుగుభాషపై అంత మక్కువ ఉన్నవారు.
10. తెలుగుకు 56 అక్షరాలు ఎక్కువే అనుకునే వారితో నాకు వాదించను. కాని, మరొకసారి విన్నవించే ప్రయత్నం చేస్తాను. చీనీభాషలో వేలాది పదచిత్రరూపాలు నేర్చుకోవలసి ఉంటుంది. జపనీస్ భాషలోనూ అంతే. కాని వారు అలాగే తమతమ భాషలను అంతర్జాతీయభాషలుగా తీర్చిదిద్దుకున్నారు. మనం మనకు అక్షరాలు ఎక్కువైపోవటం వలన తెలుగు అంతర్జాతీయ భాష కాలేకపోయిందన్నట్లుగా బాధపడుతున్నట్లు మాట్లాడుతున్నాం, ఒక పక్కన తెలుగులో పెదవి విప్పటమే నామోషీగా ప్రవర్తిస్తూ. ఇంగ్లీషులో Q అనే అక్షరం లేకపోతే కొంపేమీ మునిగిపోదు. కాని ఇంగ్లీషు తెలిసినవారూ, ఇంగీషు మాతృభాషగా ఉన్నవారూ ఎంతమంది ఈ అక్షరం అనవసరం అని భాషలోంచి తీసెయ్యండి అని అరుస్తున్నారు?
11. తెలుగులో కాని సంస్కృతంలో కాని ఒకేవిధంగా పలికే అక్షరాలు పునరావృతంగా లేనే లేవు. ఊష్మాలనబడే శ, ష, స, హ లను ఈ రోజుల్లో తెలుగు సరిగా తెలియని తరం సరిగ్గా ఉఛ్ఛరించకపోతే ఆ తప్పు భాషదా? శ ను ష లాగా పలకటం శుధ్ధతప్పు! తెలుగులో ఒకే రకం పలుకుబడి ఉన్న అక్షరాలూ అంటూ ఒక రాగం వినిపిస్తున్నవారు, ఇంగీషులో J, Z అనేవి సాదృశాక్షరాలుకావంటారా? Z ఎందుకన్న అనుమానం రావటం లేదా మీకు?
12. సంస్కృతానికి ఉన్న సుళువులు తెలుగులో దించలేము. ఏ భాష వ్యక్తిత్వం ఆ భాషదే. మూలస్వరూపాన్ని మార్చటం కుదరదు. చిన్నయసూరిగారు కాని మరొక వయ్యాకరణి కాని వ్యాకరణం వ్రాసాకనే భాష అలా ప్రవర్తించటం జరగదు. భాష ఎలా ప్రవర్తిస్తోందో దానిని సూత్రబధ్ధం చేయటమే వ్యాకరణం. ఉదా। వాడు + ఎక్కడ => వాడెక్కడ. అందరూ కలిపే అంటారు కదా? వ్యాకరణమూ అదే చెబుతుంది.
13. ఏ భాషలోంచి ఐనా మరొక భాషలోకి తర్జుమా చేస్తే నూటికి నూరుపాళ్ళూ అలాగే ఉండదు. ఏ భాష పలుకుబడి దానిది. ఇంగీషు వాడు make hay while the Sun shines అంటే దానిని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని వ్రాయాలి మన నుడికారం కోసం. అలాగే అందరూ బియ్యాన్నే వండుతారు అన్నం కోసం, కాని అన్నవండాం అంటాం కాని బియ్యం వండాం అనం.
14. ఒక భాష ప్రపంచభాష కావటానికి కారణాలు ఒకటి కంటే ఎక్కువగానే ఉంటాయి. నామావశిష్టం ఐపోయిన హీబ్రూ భాషని ఇజ్రాయిల్ కొన్ని దశాబ్దాల్లోనే అంతర్జాతీయస్థాయికి చేర్చింది. అంతా ఆ భాష మాట్లాడే వారి సంకల్పధృఢత్వంలో ఉంది.
15. తెలుగుతోసహా ఏ భాషలోనూ పదాలనూ పండితులు కనిపెట్టి ప్రజల్ని వాడమని ఒత్తిడి చేయలేదు. ముందు ప్రజావినియోగంలో నుండే పదాలు పండితవినియోగం లోనికి వస్తాయి. వాటికి వారు పరిణతి, విస్తృతి కల్పిస్తారు. ప్రజల్లో నుంది వచ్చిన పదాలకు కొత్తకూర్పులూ పండితులు వ్యాప్తి చేస్తారు.
ఈ సందర్భంలో ఇంతకంటే ఎక్కువగా వ్రాయవలసిన అవసరం పడదనే భావిస్తున్నాను.
ధన్యవాదములు శ్యామలీయం గారు ఇంతక్రితమే ౘ ,ౙ వ్రాయడం తెలుసుకున్నాను. ఌ ౡ కూడా మీరన్నాకనే ట్రై చేసి నేర్చుకున్నాను. ఈ టపా వల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. తెలుగులోని 56 అక్షరాలు టైప్ చేయొచ్చన్నందుకు ధన్యవాదములు. ఇంతక్రితం నేను తెలుగుభాషలోని 56 అక్షరాలు ఇవీ అని ఓ పోస్టు వ్రాశాను. వీలయితే దానిని టైప్ చేసి రీ పబ్లిష్ చేస్తాను. అర సున్నని ఎలా టైప్ చేయాలి చెప్పగలరా? తెలుగు భాషపై మీతో వాదించడమంటే తెలుసుకోవడానికే అని గమనంలో ఉంచుకోవాలని మనవి. వాదనలవల్ల తెలుగుకు ఇలాంటి మేలు జరుగుతూనే ఉంటుంది కదా?
రిప్లయితొలగించండిభాష తల్లా లేదా "కేవలం" పనిముట్టా అన్న సబ్జెక్టుపై కొన్ని ప్రశ్నలు/వ్యాఖ్యలు. నేను మీ భావం అర్ధం చేసుకుందామనే అడుగుతున్నాను తప్ప మరో ఉద్దేశ్యంతో (రాజకీయం అసలే) కాదు. మీకు సాగతీత ఇష్టం కాదని తెలుసు కాబట్టి మీ జవాబు చదివి వదిలేస్తాను.
రిప్లయితొలగించండి1. ఒకే మనిషికి ఎన్నో భాషలు వస్తాయి/రావొచ్చు కాబట్టి అన్ని భాషలు తల్లితో సమానం కాలేవు
2. అయితే గియితే మాతృభాష మాత్రమె తల్లి లాంటిది అనుకోవాలి. దీని వల్ల భాషలలో హెచ్చు తగ్గులు (hierarchy or stratification) సృష్టించినట్టు కాదా? దీనితో లాభం ఉంటుందా?
3. మాతృభాష అంటే ఏమిటి? ఉ. మా అమ్మమ్మ తమిళురాలు. మా అమ్మకు తెలుగు శానా బాగా కొద్దిగా ఉర్దూ మాత్రమె వచ్చు. నాకు వచ్చినంత తమిళం కూడా అమకు రాదు. ఆవిడ తమిళాన్ని తల్లిలా భావించే ప్రసక్తే లేనప్పుడు అది ఆమె తప్పా?
4. పోనీ మా అమ్మ విషయంలో ఆమె తన తండ్రి భాషను స్వీకరించింది అనుకుంటే, తల్లి తండ్రులు ఇద్దరూ వేర్వేరు భాషల వారు పిల్లలతో మూడో భాషలో మాట్లాడితే వారి పరిస్తితి ఏమిటి? మా మిత్రులలో/చుట్టాల్లో ఎందరో అలాంటి వారు ఉన్నారు. ఉ. తండ్రి కన్నడ తల్లి తెలుగు పిల్లలు హిందీ లాంటి వారు కోకొల్లలు.
5. భాష (లేదా "మాతృభాష") తల్లి అనుకోవడం సహజ సిద్దమయిన ఆలోచనా (self evident natural process) లేదా నేర్చుకున్న ప్రవర్తనా (learnt behavior)? ఒకవేళ learnt behavior అయితే అందరూ ఒప్పుకోవాలిన లేదు కదా?
6. అనుబంధ ప్రశ్న: ఇది సర్వకాల సర్వదేశాలకు వర్తిస్తుందా? ఒకవేళ కాకపొతే (ఉ. భారత దేశానికి మాత్రమె వర్తిస్తే) దాన్ని universal truthగా అనొచ్చా?
7. భాష ఖచ్చితంగా ఒకరినొకరు అర్ధం చేసుకునే టూల్ (చర్చ కోసం "మాత్రమె" తొలిగిస్తే) అని మీరు ఒప్పుకుంటారా? ఇది కాక భాషకు (మాతృభాష అయినా "పరభాష" అయినా) ఇంకేమన్నా ప్రయోజనం ఉందా?
I am trying to come to grip with the concept itself. I opine anything that is derived from sentiment alone can't be asserted as a law of nature.
1. కన్నతల్లి అని ఒక్కరే ఎలాగు ఉంటారో సహజమైన మాతృభాషగా కూడా ఒక భాషయే ఉంటుంది.
తొలగించండి2. అమ్మపట్ల ప్రేమాభిమానాలుండటం సహజం. అమ్మ నుండే క్రమశిక్షణకూడా మొదలవుతుంది. సరైన క్రమశిక్షణ కలవారు ఇతరస్త్రీలను తప్పుగానో తక్కువగానో భావించరు. అలాగే మాతృభాషపై ప్రేమాభిమానాలుండటం సహజం. అంతమాత్రం చేత సరైన క్రమశిక్షణ కలవారు ఇతరభాషలను తప్పుగానో తక్కువగానో భావించరు.
3. మాతృభాష అంటే అమ్మ దగ్గరనుండి మనం నేర్చునే భాష. అమ్మ సహజంగా ఏ భాషలో మాట్లాడుతుందో అదే సాధారణంగా పిల్లలతో సంభాషించుతూ నేర్పుతుంది.
4. తలిదండ్రులు భిన్నమాతృభాషలవారైన పక్షంలో కూడా, అమ్మ నుండే సంక్రమిస్తుంది మాతృభాష సాధారణంగా. బిడ్డ భూమిమీదకు వచ్చేముందే అమ్మ యొక్క కంఠద్వనీ, భావోద్వేగాలూ వంటివి గుర్తించగలడని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది.
5. మాతృభాష అన్నది సహజసిధ్ధమైన ఆలోచనయే. బిడ్డకు తల్లితోనూ తల్లిభావాలూ భాషతోనూ అనుబంధం జననాత్పూర్వమే ఏర్పడుతున్నప్పుడు ఆ భావనలు కృత్రిమం కానేరవు కదా?
6. నాకు తెలిసి, ఇది సార్వజనీనమైన విషయమే. దేశకాలా౽బాధ్యమే.
7. భాషకు ఒక పనిముట్టుకన్నా హెచ్చు ప్రయోజనమూ ప్రయోగమూ ఉన్నాయి. ఈ విషయం నేను ఇప్పటికే చెప్పాను. భావాల మార్పిడికి సైగలూ సరిపోవచ్చును. కాని సమాచారాన్ని నిక్షిప్తం చేయాలీ భావిప్రయోజనాలకూ అనుకుంటే అది భాషతోనే ముడిపడిన విషయం. భాషతో సమాజానికి సాంస్కృతిక సంబంధం ఉంటుంది. ఒక పనిముట్టుతో వ్యక్తిగతమైన ప్రయోజనమూ కొంచెం స్వల్పమైన అనుబంధమూ మాత్రమే సాధ్యం.
8.భావోద్వేగాలు కృత్రిమం కావు. అవి జంతుప్రపంచంలో కూడా ఉన్నాయి. అందుచేత భావోద్వేగాలు ప్రకృతిసిధ్ధమైనవే. జంతువులలోనూ ఎంతో కొంత తెలివి కూడా ఉందని పరిశోధనద్వారా తెలియవస్తున్నది కూడా.
Thank you, interesting views (though I may not agree)
తొలగించండిExcellent. అక్షరాలు తగ్గించ వలసిన అవసరం లేదు. రానున్న రోజులలో కొత్తగా కష్టపడి ఇతర బాషలు నేర్చుకోవలసిన అవసరం ఉండదు. గూగుల్ ట్రాన్స్లేటర్ లో తెలుగులో రాస్తే ఇంగ్లిష్ లోకి తర్జుమా చేసినట్లు, మనం మన మాత్రుభాషలో మాట్లాడుతూమంటే ఇతరులు ఏ భాషలో వినాలనుకొంటే ఆ భాషకి మాటలు తర్జుమా అయ్యి మాటలు వినిపిస్తాయి. శాస్రియ సంగీతంలో పాటలు రాసిన కొందరౌ వగ్గేయకారులకి తమిళం కూడా వచ్చు, అయినా వారు పాటలు ఆ భాషలో ఎందుకురాయలేదో ఆలోచిస్తే తెలుగు ప్రత్యేకత అర్థమౌతుంది. పలకలేని వారు నేర్చుకోవాలి అంతేకాని, భవిషత్ తరాల వారికి పదాలు ఉచ్చరించటం కష్టంగా ఉందని, వారి సౌలభ్యం కొరకు, అక్షరాలను కుదించుకొంటూ పోతే, నోరు తెరచి మాట్లాడటమే మహాపని గా అనిపిస్తుంది. లండన్ లో వివిధ జాతుల వారు ఒక్కొక్క రకమైన స్లాంగ్ మాట్లాడటం వలన ఇంగ్లిష్ పదాలు పలకటంలో స్పష్టత లేకుండాపోయింది. గత కొంతకాలం గా లాండన్ లో సంస్కృతానికి పెద్ద పీఠ వేస్తున్నారు. దానికి ఒక ప్రధాన కారణం సంస్కృతానికి గల స్పష్టమైన ఉచ్చరణ, అది అలవాటైతే ఇంగ్లిష్ కూడా బాగా మాట్లాడుతారని వారి అభిప్రాయం. .
తొలగించండిSanskrit thriving in UK schools
As young students here recite Sanskrit verses from the Upanishads at the Annual Sanskrit Speech Competition, proud parents and teachers applauding their efforts.
"It gives them brilliant linguistic training. Sanskrit scriptures are inspiring and full of philosophical concepts, which is why we teach it," said Warwick Jessop, the head of the school's Sanskrit department.
When asked if they find learning the language hard, most students said Sanskrit was their favourite as they enjoy the classes.
"Learning Sanskrit is unique. As not many people speak it now, it is special that we get to learn such a language. I enjoy learning Sanskrit because I suppose we are one of the few schools that study it and I feel that it benefits you in lots of different ways. As you saw, it helps in improving pronunciation and diction. I would say the spiritual benefits are also quite high. There are lots of different stories like the Ramayana and Mahabharata and there are lots of different ways of describing what was happening in the world ages ago," said a student of the school.
http://www.ndtv.com/article/world/sanskrit-thriving-in-uk-schools-34267
https://www.youtube.com/watch?v=jF3hXu2wH3g
@Jai Gottimukkala:
తొలగించండిఒకరి అభిప్రాయాలతో మరొకరు ఏకీభవించలేక పోవచ్చును. ఇబ్బంది లేదు.
@UG SriRam
తెలుగు ఎంత చులకన అంటే సమకాలీనప్రపంచంలో తెలుగువారు అందరికీ దానిని నేర్చుకోవలసిన బాధ్యత లేదు కాని సంస్కరించే హక్కు మాత్రం తప్పకుండా అరచేతిలోనే ఉంది చచ్చినట్లుగా. పలుకుబడులూ, బాంధవ్యాలూ, వస్తువుల పేర్లూ ఒకటని ఏమిటి అన్నీ తెలుగులో ఉండటం పాపం అన్నట్లు మాయం చేసేస్తున్నారు మనవాళ్ళు. ఎంతతొందరగా ఈతెలుగు చచ్చిపోతే అంత అభివృధ్ది చెందినవాళ్లం ఐపోతాం అన్నమాట. మీరేదో, విదేశాల్లో అక్కడ తెలుగు చెబుతున్నారూ ఇక్కడ సంస్కృతం చదువుతున్నారూ అని అంటున్నారు. ఇక్కడ మనవాళ్ళు మాత్రం తక్కువతిన్నారా? మారోజుల్లో నన్నయ వచ్చి కూర్చుని వ్రాస్తే నలభై రావటం గగనం, ఈ రోజున రామశబ్దం రాని వాడికీ సంస్కృతంలో 95కన్నా ఎక్కువ మార్కులే వేస్తున్నారు. తెలుగులో సరిగా వ్రాయనూ చదవనూ రాకపోయినా 90కి మార్కులు తగ్గవు. వచ్చే తరాల్లో మా పూర్వీకుల భాషలు అని మనవాళ్ళు విదేశాలు పోయి తెలుగూ సంస్కృతమూ నేర్చుకోవలసి వచ్చినా రావచ్చును.
కొందరు మాతృభాష యేమిటి, మట్టిగడ్డ? భాష అంటే ఒక పనిముట్టు అంటున్నారు. పనిముట్టుతో అనుబంధం ఉండదు అవసరమే కాని. ఒక పనిముట్టు పాతబడినా చెడినా విసిరేసి మరొకటి కొత్తది తెచ్చుకుంటాం. అంతే మాతృభాష ఐనా మాతృమూర్తి ఐనా సరే, పనిముట్లే. పరస్పర అవసరాఅలే తప్ప అనుబంధాలు జాంతానై ఆధునిక ప్రపంచంలో. అదీ ఆలోచించవలసిన విషయమే. ఎంతమంది వయసుడిగి ఆర్థికంగా భారం ఐన నాన్నల్ణీ అమ్మల్నీ బామ్మల్నీ అవతల పారెయ్యటం లేదూ నేడు? అవసరం తీరిపోతున్న భాషనీ పారేస్తాం అని ఎవరైనా అంటే కాలప్రభావం అని ఊరుకోవాలే కాని తగువేసుకుంటే ఏమీ ఉపయోగం ఉండదు.
సార్, మీకు తెలుగు భాష మీద అభిమానకం ఉండొచ్చు నాకు అన్ని భాషల మీద సామానమయిన గౌరవం (మాత్రమె) ఉండొచ్చు ఇవి వ్యక్తిగతాలు. మీకు వాదన సాగతీత ఇష్టం కాదని తెలిసి "agree to disagree" తో ఆపేసాను. అయితే నేను భాషను పనిముట్టు అన్నాను తప్ప మట్టిగడ్డ అనలేదు అన్న వాస్తవం మీకు తెలియచెప్పాల్సిన బాధ్యత నాకుంది.
తొలగించండిజైగారూ, మన్నించాలి అక్కడ మట్టిగడ్డ అన్న సాభిప్రాయపదప్రయోగం నా స్వకపోలకల్పితమే. అది ఊతం కోసం అలా వ్రాసినదే. మీ రన్నట్లు ఆమాటా మీదే అని ఎవరన్నా అనుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ వివరణ అవసరం అవుతున్నది.
తొలగించండిThanks for the clarification sir
తొలగించండికొన్ని తప్పులు దొర్లాయి. సవరించిన ప్రశ్న కింద చూడండి:
రిప్లయితొలగించండి3. మాతృభాష అంటే ఏమిటి? ఉ. మా అమ్మమ్మ తమిళురాలు. మా అమ్మకు తెలుగు శానా బాగా ఉర్దూ కొద్దిగా మాత్రమె వచ్చు. నాకు వచ్చినంత తమిళం కూడా ఆమెకు రాదు. ఆవిడ తమిళాన్ని తల్లిలా భావించే ప్రసక్తే లేనప్పుడు అది ఆమె తప్పా?
ఈ ప్రశ్నలో ముందుసారి ఆమెకు బదులు ఆమకు అని ముద్రారాక్షసం దొర్లింది. అంతే. ఫరవాలేదు. జవాబు ఇప్పటికే ఇచ్చాను కదా?
తొలగించండిశ్యామలీయం గారు,
రిప్లయితొలగించండిమీ అభిప్రాయాన్ని మీబ్లాగులో టపా గా రాయండి.మీ దగ్గర మంచి సమాచారం ఉంటే వాటిని ప్రభుత్వానికి పంపించడి. రేపు ప్రభుత్వాలు చరిత్ర, బాషా మొదలైన వాటిలో మార్పులు చేర్పులు చేసేముందు పరిశీలిస్తాయి. వాళ్లకి అన్ని మార్చేద్దామని ఉద్దేశం ఉండవచ్చు. కాని అది పూర్తిగా అయ్యేపనికాదు గదా! ఇంతక్రితం నేను చరిత్రకు సంబంధించి అంశం పై ఈ బ్లాగులో చర్చించాను. అయితే ఒక దశలో విరమించాను. కారణం రాసేవ్యాఖ్యలు వివరణ గా మొదలయ్యి చివరికి వాదనగా మారిపోతుంది. మనకు ఎక్కడ నుండి మొదలుపెట్టి ఎంత సమాధానం ఇవ్వాలో అర్థం కాదు. ఒకవేళ ఇచ్చినా ఇతరులు వాటిని అంగీకరించినట్లు ఎక్కడా కనపడదు. మళ్ళి మళ్ళీ అదే వాదన వివిధ రూపాలలో కొనసాగుతూంట్టుంది. మొన్నతెలంగాణా ప్రజ నాయకులే బోనాలు వేరు, బ్రతుకమ్మ వేరు అని వాదన ఎత్తుకొన్నారు. మీ పండగా మామమీద రుద్దారు అని కొందరు ఆరోపిస్తూ పేపర్ లో వార్త వాచ్చింది. ఇటువంటి ఎన్నో ప్రశ్నలు ఇక నుంచి వారికి ఎదురౌతాయి. ఎంతో చరిత్రగల తెలంగాణలో ప్రతి జిల్లా ప్రత్యేక గలదే! పది జిల్లాల వారు వారి వారి చరిత్రలని ఎలా బేరీజు వేసి,దానిని సమాజంలో విభిన్నతకు అన్వయించి, నిరంతరం మార్పులు చేర్పులు గురయ్యే సంస్కృతి, బాషలకు ఎలా వర్తింపచేస్తారో వేచి చూడాలి. చరిత్రను సోషల్ మీడీయాలో ఆసక్తి ఉన్నవారు చర్చించుకోవటం వేరు, స్కూల్ పుస్తకాలలో సిలబస్ గా పెడితే విద్యార్ధిగా చదవటం వేరు. ఈ సమన్వయాన్ని వారు ఎలా సాధిస్తారో వేచి చూద్దాము.
ప్రభుత్వాలు చరిత్ర, బాషా మొదలైన వాటిలో మార్పులు చేర్పులు చేసేముందు పరిశీలిస్తాయి.
తొలగించండిలేదండీ. అవి ఆలాంటి నిర్మలహృదయంతో చేయవు. రాజకీయావసరాలకోసం మాత్రమే చేస్తాయి.
రాసేవ్యాఖ్యలు వివరణ గా మొదలయ్యి చివరికి వాదనగా మారిపోతుంది.
నా బాధా అదే. కాని చర్చ అన్నదానిలో దూరటం పద్మవ్యూహంలో దూరటం లాంటిది.
చరిత్రను సోషల్ మీడీయాలో ఆసక్తి ఉన్నవారు చర్చించుకోవటం వేరు
ఇటువంటి మాట ఒకటి పూర్వమే ప్రజలో చెప్పాను. మరలా చెబుతున్నాను. శాస్త్రసంబంధి విషయాలను నడివీధుల్లో చర్చలు చేయకూడదు. ఆయా శాస్త్రరంగాల్లో తగిన ప్రావీణ్యత ఉన్నవారే చర్చించాలి. లేకపోతే ఆ చర్చ నిరుపయోగం. అది అనవసరమైన ఆవేశకావేశాలకు తప్ప దేనికీ ఉపయోగించదు.
ఈ సమన్వయాన్ని వారు ఎలా సాధిస్తారో వేచి చూద్దాము.
కట్టెవంకర పొయ్యి తీర్చిందన్నట్లుగా సాధిస్తారు. ఆని సమస్యలకూ రాజకీయాధికారమే దానికి హితవైన పరిష్కారం అది చెబుతుంది. అది సమాజహితం అవుతుందనీ, అలా కావాలని ఆశించలేము.
ఈ చర్చలో శాస్త్రీయంగా తేల్చాల్సినవి ఉన్నాయి కనుక భాష అనేది టూల్ మాత్రమేనా? అనేది చర్చగా ఉంచాలనుకుంటున్నాను. దీనిపై విస్తృతంగానే చర్చించాలనేది నా భావన.
రిప్లయితొలగించండికొండలరావుగారూ,
తొలగించండిమీ బ్లాగుల్లో ఏది చర్చనీయాంశంగా స్వీకరించాలి అన్న విషయం పైన నేను సలహా ఇవ్వలేను.
శ్రీరాం గారికి పైన చెప్పిన సమాధానమే మీకు కూడా విన్నవిస్తున్నాను. "ఇటువంటి మాట ఒకటి పూర్వమే ప్రజలో చెప్పాను. మరలా చెబుతున్నాను. శాస్త్రసంబంధి విషయాలను నడివీధుల్లో చర్చలు చేయకూడదు. ఆయా శాస్త్రరంగాల్లో తగిన ప్రావీణ్యత ఉన్నవారే చర్చించాలి. లేకపోతే ఆ చర్చ నిరుపయోగం. అది అనవసరమైన ఆవేశకావేశాలకు తప్ప దేనికీ ఉపయోగించదు."
మీచర్చావేదికమీద తగిన శాస్త్రవిషయప్రావీణ్యత కలవారు కూర్చుంటే అది ఏదైనా అలోచనీయమైన అవగాహనకు దారితీయవచ్చునని ఆశిస్తాను. కించి న్యూనే న్యూనం. అంతే నండి.
నాకు ఆ చర్చలో పాల్గొనేందుకు అర్హత నిచ్చేంత భాషాశాస్త్రప్రావీణ్యత లేదు. ఉపరిస్పర్శగా ఉన్న అవగాహనతో నేను "భాష అనేది టూల్ మాత్రమేనా?"అన్న దాని గురించి శాస్త్రీయమైన విశ్లేషణలతో మాట్లాడటం భావ్యం కాదు కాబట్టి ఆ చర్చలో పాల్గొనలేను.
సారీ శ్యామలీయం గారు చర్చలు పద్ధతిగా జరగాలనేది కరెక్టు తప్ప పండితులు మాత్రమే చర్చించాలనేదానికి నేను వ్యతిరేకం. పండితులనుకునేవారు అనుకుంటున్నవారూ శృతి తప్పి రాగం తీస్తున్న సందర్భాలనేకం. చర్చ అంటే తెలుసుకోవడానికీ తెలియజెప్పడానికీ అయినప్పుడు అందరూ చర్చలో ఉండాలి. అయితే ఎవరైనా చర్చలో సంస్కారవంతమైన పద్ధతులను పాటించాలి. మీతో సహా అప్పుడప్పుడు అందరం ఎంతో కొంత అసహనానికీ అసౌకర్యానికీ భావోద్వేగాలకీ గురవుతున్నామని నా అభిప్రాయం. తప్పయితే మన్నించాలి.
తొలగించండికొండలరావుగారూ,
తొలగించండినేను శాస్త్రసంబంధివిషయాలకు చర్చ ఎలా ఉండటం అవసరమో చెప్పాను. అది మీకు నచ్చాలని లేదు.
చర్చలు సంబంధితశాస్త్రపాండిత్యం లేకుండా చేయటం మీకు సమ్మతం ఐతే మీ బ్లాగుల్లో అటువంటి చర్చలు చేసుకోవటం జరుగుతుంది. ఇష్టమైనవారు చదువుతారు. మరింత ఇష్టమైనవారు చర్చలో పాల్గొంటారు. ఇష్టం లేనివారు దూరంగా ఉంటారు ఇలాంటి వాటికి. మీ అభిప్రాయం ప్రకారం నడుచుకునే హక్కు మీకు ఉన్నట్లే మిగిలినవారికీ వారివారి యిష్టాయిష్టాల ననుసరించి తదనుగుణమైన హక్కులూ ఉంటాయి.
ఒక్క ప్రశ్న వేస్తాను, మీ రేమీ అనుకోనంటే.
ఒక వైద్యాలయంలో ఒక రోగికి సంబంధించి ఎలా చికిత్స చేయాలీ అన్న ప్రశ్న తలెత్తిందనుకుందాం. ఎందుకంటే, రెండు మూడు మార్గాల్లో చికిత్స చేయవచ్చును అనుకుందాం. ఏ విధానం ప్రయోజనాలూ ప్రమాదాలూ దానివి. వివిధమార్గాల్లో వివిదమైన ఇతర సాధకబాధకాలూ ఉన్నాయి. కాంప్లికేషన్లు ఉన్న కేసు మరి. ఇదీ ప్రశ్న నేపథ్యం.
ఏవిధమైన చికిత్సావిధానాన్ని ఎంచుకోవాలీ అన్న చర్చలో ఎవరు పాల్గొనాలి చెప్పండి?
వైద్యనిపుణులు మాత్రమే ఈ విషయంలో చర్చించుకోవటం ఉచితమా?
టీలు పట్టుకొచ్చే కుర్రవాళ్ళూ, గదులుశుభ్రం చేసే వాళ్ళూ, అక్కడికి రోగుల్ని చూడటానికి వస్తున్న జనాభా ఇల్లా ఎవరుపడితే వారు తామూ ఆ చర్చలో ఉత్సాహంగా పాల్గొనటం ఉచితంగా ఉంటుందా?
ఏది ఎథికల్? ఏది సరైన చర్చా విధానం?
భాషాశాస్త్రం ఒకటుందని తెలియని వాళ్ళమూ, తెలిసినా దానిలో ఓనమాలు తెలియని వాళ్ళమూ కూడా భాషాశాస్త్రవిషయాలపై డిక్రీలు పాస్ చేస్తూ వేడివేడి చర్చలు చేయటం సబబే ఐన పక్షంలో హాస్పటల్ లో క్రిటికల్ కేర్ పేషంటుకి చేసే చికిత్సవిషయంపై చర్చల్లో పైన చెప్పిన నానారకాల జనాభా కూడా పొలోమంటూ పాల్గొనటమూ సబబే ఐపోతుంది.
రెండూ సబబే అంటారా? శుభం అలాగే కానివ్వండి. నాకేమీ ఇబ్బంది లేదు. ఒకవేళ నిజంగా ఇబ్బంది ఉన్నా చేయగలిగిందీ ఏమీ లేదు కదా.
మన్నించండి, మరొక ముఖ్యవిషయం ప్రస్తావిద్దా మనుకుంటూ మరచిపాయాను చివరకు.
తొలగించండిసైన్స్ జర్నల్స్ అని ఉన్నాయి రకరకాల సైన్స్ విభాగాల్లో వాటిలో ఒక ఆర్టికిల్ ప్రచురించబడాలీ అంటే తత్సంబంధితమైన విషయంలో చురుగ్గా పనిచేస్తున్న వారిలో నిష్ణాతుల అభిప్రాయం తీసుకుంటారు. వారు విమర్శించి బాగుందన్నాకే ఆ ఆర్టికిల్ ప్రచురించబడుతుంది.
మీ ఆలోచనా విధానం ప్రకారం సైన్స్ విషయాల మీద ఆర్టికిల్ వ్రాసే హక్కూ అధికారమూ అందరికీ ఉండాలి. పండితపరిశీలన, పండితచర్చలూ అన్నవి ఆమోదయోగ్యం కాదు. అందుచేత నేను bronchial asthma pathophysiology గురించో pulmonary thromboembolism గురించో చర్చిస్తూ Journal of the American Medical Association పత్రికలో వ్యాసాలు వ్రాసే అధికారం కలిగి ఉన్నాను. ఆమాట మీరూ నేనూ ఒప్పుకున్నా అది లోకహర్షణీయమైన విషయమేనా?
ఇదంతా మీ ఆలోచనావిధానాన్ని ప్రభావితం చేసేందుకు చెప్పటం లేదు. నా అలోచనావిధానానికి ఉన్న ప్రాతిపదికను తెలియజేయాలని మాత్రమే వ్రాసాను.
సైన్స్ జర్నల్స్ లేదా అధికారిక పత్రీకలు వేరు. ఇక్కడ బ్లాగులు వేరు. బ్లాగు అంటేనే వీటికి డిఫరెంట్. నాకు తెలిసినదీ ఎప్పుడూ చెప్పేది ఇప్పుడూ చెపుతున్నాను. ఎప్పటికీ ఎవ్వరికీ అన్ని విషయాలు తెలిసే అవకాశమే లేదు. తెలుసుకోవాలనే క్యూరియాసిటీని చంపేయలేము. అయితే చర్చకు ఓ పద్ధతి పాటించాలి. అది మీరన్న పండితులు సైతం పాటిస్తున్నట్లు నాకనిపించడం లేదు. చర్చలలో తెలియనివారు తెలుసుకోవాలి. తెలిసినవారు తెలియజేయాలి. అంతకు మించి నేను ఎవరినీ ఇబ్బంది పెట్టేందుకు ఇలా చెప్పలేదు. అలా అనిపిస్తే మన్నించాలి.
తొలగించండికొండలరావుగారూ,
తొలగించండిచర్చ అనేదాని యొక్క పరిథిలో తేడా తప్ప రెండింటికీ మౌలికంగా సామ్యం ఉన్నదండి. బ్లాగు అనేది నిజానికి ఎవరైనా తనకోసం తాను వ్రాసుకున్న log book లేదా ఒక public dairy. అందుచేత ఇతరులు చదివేందుకు అభిప్రాయాలు వ్యక్తపరిచేందుకూ అవకాశం ఉంది. కాని ప్రాథమికంగా బ్లాగు అనేది చర్చావేదిక కాదు. కాని అలా చర్చావేదికగా ఉపయోగించకూడదని నియమమూ లేదు. చర్చల గురించి వీలువెంబడి ఒక సైధ్ధాంతిక వ్యాసం విడిగా వ్రాస్తాను వీలు చూసుకొని. ముఖ్యంగా ఈ విషయంలో నేను చెప్పేది, సంబంధితవిషయనైపుణ్యం లేని వారు వెబుచ్చే అభిప్రాయాలకూ, వారు చేసే ఖండనమండనలకూ చిల్లిగవ్వ విలువకూడా ఉండదు. అటువంటి వారు చేసే చర్చల రికార్డులు కూడా అంతే నని నా అభిప్రాయం. అందరికీ అన్నివిషయాలు తెలియటం అన్న ప్రసక్తిలేదు - చర్చాంశం ఏదైతే దాని గురించిన విజ్ఞానవివేకాలు ఉన్నవారి మధ్య చర్చకు విలువ - లేకుంటే లేదు. అటువంటి సంబధ్దమైన చర్చలు ఎలాజరుగుతున్నాయీ అని బ్లాగర్ల మధ్య చర్చల ఆధారంగా నిర్ణయించ రాదు - అవి గుర్తించగల చర్చలే కానప్పుడు.
My response on భాషకు సంబంధిచిన చర్చ భాషావేత్తలే చేయాలా?
తొలగించండిశ్యామలీయం గారు,
తొలగించండిమీరు రాసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. చర్చలో శాస్త్రీయంగా తేల్చాల్సినవి అంట్టూ రాయటం లో అర్థంలేదు. అప్పుడు అలా తేల్చవలసిన వారు ఎవరు? అనే ప్రశ్న వస్తుంది. ప్రజ బ్లాగులొ ఉన్న బాషకు సంబందించి ఉన్న నిపుణులు ఎవరు? చర్చలో శాస్త్రీయంగా జరిగాయని, ఇరువర్గాల వారి వాదనలో ఏది సరి అయినదో తేల్చాటానికి. ఒక నిర్ణయానికి రావటానికి. అక్కడ చర్చలలో పాల్గోనేవారు ఆరోపణలు చేయటం తప్పించి, వాస్తవాల మీద పెద్ద ఆసక్తి ,శాస్రజ్ణానం గురించి అనురక్తి ఉన్నట్లు కనపడదు. అదేదైనా ఉంటే కొండలరావు గారికి ఉంది. అందరికి తెలిసిన వాస్తవాలను వక్రీకరించి రాస్తే దానిని చర్చకు అంగీకరించకుడదు. కాని అక్కడ అలా చెప్పే వారెవ్వరు లేరు. ఒకప్పుడు స్రీలు పురుషులకన్నా శారీరక బలం ఎక్కువగా ఉండేదని రాస్తారు. చరిత్ర తిరగేస్తే, బలవంతులు శారిరక దారుడ్యం ఉండటంవలన పురుషులను బానిసలు గా చేసి చచ్చేచాకిరి చేయించారు. స్రీలకి శారీరక దారుడ్యం లేకపోవటంతో, వారిని వేరే విధంగా యక్స్ ప్లాయిట్ చేశారు. స్పార్టకస్ లాంటి వారి కథలు అందరికి తెలిసినవే. ప్రకృతి లో వేప చెట్టు వేయ్యేళ్లైనా చేదు గుణం కోల్పోదు. అలాగే మనుషులలో కూడా , ఆలోచన విధానం మారవచ్చు గాని ఎన్ని సంవత్సరాలు గడిచినా,శారీరక ధర్మాలలో మార్పులు ఉండవు . ఎందుకంటే వారు ప్రకృతి లో భాగం గనుక.
ఇంకొక సందర్భంలో భగవద్గీత వలన భారతదేశం వెనుకబడిపోయిందని, పురుషసూక్తంలోని భావాలను, భగవద్గీత వనుకొని కోట్ చేశారు. భగవద్గీతకు పురుషసూక్తానికి తేడ తెలియదు. ఇటువంటి గ్లోబల్ థింకర్స్ పాల్గోనే చర్చలలో వాదన వినిపించాలంటే చాలా ఓపిక ఉండాలి. శాస్రీయత గురించి మాట్లాడేవారే కాని ప్రశ్నలలో ఉన్న శాస్రీయత ఎంతో జడ్జ్ చేసే వారు, మధ్యవర్తిగా రెండువైపులా వాదనలో లోపాలను ఎత్తి చూపేవారు, ఎవరు లేకపోవటం వలన చర్చలు వాదనలు గా మారి కొనసాగుతూనేఉంటాయి. ఇక వాదనలో పాల్గోనేవారే , ఆవలి పక్షం వారి ప్రశ్నలలోని అసంబద్దతను ప్రశ్నిస్తే, దానిని వారు లిబరల్ విలువలపై దాడిగా భావిస్తారు.
నాకు తెలిసిన మేరకు చాలా మంది "నిపుణులకు" కూడా పూర్తి పరిజ్ఞానం ఉండదు. వారు కూడా నిరంతరాన్వేషులే. చిత్తశుద్ధితో ఒక విషయం పై అధ్యయనం చేస్తే ఆ ఫలితం ఆధారంగా "పండితుల" చర్చలలో పాల్గొనవచ్చు.
తొలగించండిశ్యామలీయం మాస్టారు తెలుగు భాషకు ఖచ్చితంగా contribute చేయగలరని నా నమ్మకం. Sir, you are more qualified than several experts and therefore you should take the effort to see your views are heard.
@శ్రీకాంత్ చారిగారూ,
తొలగించండిమీ వ్యాసం చదివాను. నేను పండితుడననో, శాస్త్రవేత్తననో ఎన్నడూ చెప్పుకోలేదని మరొకసారి ఈ సంధర్భంగా అందరికీ, ముఖ్యంగా మీకు విన్నవిస్తున్నాను. అలాగే నేను ఏ సైధ్ధాంతికవ్యాసమూ ఇంకా వ్రాయనే లేదు. మీరు పొరబడ్దారు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని మాత్రం నా అభిప్రాయం. మీరు అంగీకరించాలని లేదు. ఒకరిచ్చే గౌరవాదరాల కొరకు తాపత్రయం చెందే వయసూ కాదు, మనసూ లేదు. అందుచేత నిరుపయోగమైన ప్రతివాదనలూ మీతో చేయబోను.
@శ్రీరామ్ గారూ,
ఈరోజుల్లో ఎవరిని గురించి ఐనా ఎవరైనా మాట్లాడవచ్చును అనుకుంటాను. అలాగే ఏ విషయంలో ఐనా సరే, అది ఎంత మనకు అపరిచితమైన ఫీల్డ్ ఐనా సరే నిర్ణయాలూ నిర్థారణలూ చేసేయటమూ కూడా జరిగిపోతోంది. నచ్చకపోతే, ఐతే వినోదంగా చూడటం, అంతగా చూసి భరించలేకపోతే నోర్మూసుకొని తప్పుకోవటం మాత్రమే చేయగలం అంతే.
@గొట్టిముక్కలవారూ,
శాస్త్రీయమైన విషయాలలో శ్రుతపాందిత్యం సరిపోదండీ. తత్సంబంధిత శాస్త్రం క్రమపధ్ధతిలో నేర్చుకోవటం అవసరం. పూర్తిపరిజ్ఞానం అసాధ్యం. అన్ని శాస్త్రశాఖలలోనూ పరిశోధనలుముగిసి శిలాసదృశంగా ఏదీ మిగలలేదు ఇంతవరకూ - ముందు కూడా అటువంటి అవకాశం లేదు. కాని నిపుణత అంటే అది గాఢమైన అభినివేశంతో వచ్చేది కదా అందుచేత దానివిలువ తగ్గదు. అది ముఖ్యమే అవుతుంది తప్పక. ఇకపోతే నేను చేయగల కృషి ఏదైన్నా దైవానుగ్రహం వలన వీలైతే నిశ్శబ్దంగా చేయటం తప్ప ఆ కృషికి ఆమోదమో గుర్తింపో కూడా అడగకలిగే అవసరమూ లేదు పరిస్థితీ లేదు.
మీరంతగా నిరుత్షాహపడవలసిన అవసరంలేదు. మీ పాటికి మీరు మీబ్లాగులో అభిప్రాయాలు రాస్తూండేది. మంచి చెపితే అపనమక్కంతో, అడ్డుగోలు వాదన చేయటం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, స్వాతంత్రపోరాట సమయం నుంచి ఉంది. ఎడ్డేం అంటే తెడ్డేమనటం, ఒకరంగంలో అనుభవం ఉన్నవారిని, స్కుల్ బాయ్ లాజిక్ తో ప్రశ్నించటం, తెలిసితెలియని వారితో చప్పట్లు కొట్టించుకోవటం ఆ రోజుల్లో పెద్ద ఎత్తున జరిగేది. అదిగొప్ప అనుకొని ఫీలయ్యే వారు, వాదన ఎమి, వారి వాదనకు మద్దతూగా ఆరోజుల్లో వేరే దేశమే ఏర్పరచుకొన్నారు. ప్రస్తుతం పాకిస్థాన్ చూస్తే ఎంత బాగున్నారో తెలుస్తుంది.
తొలగించండిhttps://www.youtube.com/watch?v=mAazyOqmKJM
విదేశాలలో ఉండే ఆదేశస్థులు చివరికి మా మాత్రుదేశం పాకిస్థాన్ అని చెప్పుకోవటానికి సైతం జంకుతున్నారు. ఎవరైనా అడిగితే బంగ్లాదేశ్ , పాకిస్థాన్ వారు మా స్వదేశం హిందుస్థాన్ అని చెప్పుకొంటారు.
శ్యామలీయం గారు,
తొలగించండివిషయం మీద చర్చించాలంటే పండితుడో, శాస్త్రవేత్తనో అయ్యుండాలని మీరే ఆన్నారు. అలాగే సైధ్ధాంతిక వ్యాసం రాస్తానని కూడా అన్నారు. ఇంకా రాయక పోయినా మిమ్మల్ని మీరు ఆ కోవలో చేర్చుకున్నారనే భావిస్తున్నాను. అందుకు నాకు అభ్యంతరం లేదు కూడా. అయితే మీకు నచ్చని వాదనలు చేసినంత మాత్రాన ఎదుటివారిని పూర్తిగా తీసి పారేయకూడదని నా మనవి.
శ్రీకాంత్ చారి గారూ, శుభోదయం. నేనేమి అన్నదీ నాకు గుర్తున్నది. నేను విషయం తప్ప వ్యక్తుల జోలికి వెళ్ళి వాదించేవాడిని కాదు. మీరు భాషకు సంబంధిచిన చర్చ భాషావేత్తలే చేయాలా? అన్న మీ వ్యాసంలో వ్యక్తిగతంగా నా పట్ల ఎంత ఉదారమైన వ్యాఖ్యలు చేసారో కూడా గమనించాను. ఇంతకుమించి స్పందించను.
తొలగించండిమీ వ్యాఖ్య ఏదీ పెండింగ్ లో లేదు సర్. ఇంతవరకు నా బ్లాగూలలో మీ వ్యాఖ్య ఒక్కటి కూడా పెండింగులో ఉంచాల్సిన అవసరం రాలేదు. స్పాం లో కూడా చూశాను మీ కామెంట్లేవీ పెండింగులో లేవు. ఌ,ౡ ల గురించి ఫోనులో మీరు చెప్పింది నేను డ్రైవింగులో ఉంటూ విన్నందున సరిగా అర్ధం కాలేదనుకుంటాను. మీరు పబ్లిష్ బటన్ సరిగా నొక్కి ఉండరు. దయచేసి మరోసారి ఆ వ్యాఖ్యను ఉంచగలరు.
తొలగించండి- పల్లా కొండల రావు.
ఎవరు పండితుడు? ఎవరు పామరుడు? మన భారతీయ సంస్కృతిలో ఔన్నత్యం ఉన్నది. కొందరి పట్ల అవహేళనా ఉన్నది. దళితులని సాటి మనుషులని దేవాలయాలలోనికి రానివ్వకుండా బలిసిన మూర్ఖపు పాండిత్యం ప్రదర్శిస్తే వారు దేవుని బిడ్డలైపోయారు. దీనిని ప్రోత్సహించినవారు , వ్యతిరేకించినవారూ మనవారే ఉన్నారు. వేరే ఏ దేశపు ఇజాలో ఇక్కడకొచ్చి చెప్పాల్సిన అవసరం రాదు. కానీ పాండిత్య పైత్యంతో స్వార్ధంగా తప్పులతడకని గ్రంధాలలో ఓ కుట్రగా అశాస్త్రీయంగా చేర్చితే ఏమి చేయాలి? వాటిని వ్యతిరేకించవద్దా? మన గీతలో కృష్ణుడేమి చేప్పాడు? పండితుడు శునకమూ శునక మాంసము తిను ఛండాలుని యందునూ బ్రాహ్మణునియందును సమదృష్టిని కలిగి ఉంటారనే గదా? ఇక్కడి వ్యాఖ్యలలో శ్రీరాం గారు స్త్రీ పురుషుల శారీరక ధర్మాలు గురించి ఉదహరించారు. ఆయన చెప్పిన వేప గుణం , స్త్రీ పురుష శారీరక ధర్మాలు సహజాతాలుగా ఉన్నవి మారవన్నది సత్యం. అదే సందర్భంలో స్త్రీని అబ్లగా చూపి అణచివేతగా ఉంచడం అధర్మమ. బాల్యవివాహాలు- సతీ సహగమనం ను సమర్ధించిన పండితులను ధైర్యంగా ఎదిరించి పోరాడింది మన గురజాడ వంటివారే తప్ప వేరెవరో వచ్చి ఇజాలు చెప్పి పోరాడలా? ఇజాల కంటే నిజం గొప్పది. ప్రక్రుతిలో ఏవి సహజాతాలుగా ఉన్నాయో వెలికితీయడమే పాండిత్యం తప్ప. స్వీయ పైత్య రసాలు పాండిత్యాలు కానేరవు. ఆ పాండిత్యాలు పైత్యాలు పెంచడానికే పనికి వస్తాయి. వాటిని నేను వ్యతిరేకిస్తాను. దానికి ఎవడిదో ఏ దేశానిదో అయిన ఇజాన్ని మక్కీ మక్కీగా బట్టీ పట్టి ఆ ఉదాహరణలతోనే విమర్శించాల్సిన పని లేదు. నిజం ప్రక్రుతి సిద్దమయినది. అది ఆచరణ + ఆలోచన ల కలపోతగా ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటుంది. దానికి ఆలోచన మంచిగా చేసే పండితులూ దానిని ఆచరణలో పెట్టే శ్రామికులూ ఎప్పుడూ కావలసిందే. ఎవరి ప్రాధాన్యత వారిదే. మానసిక , శారీరక శ్రమలు రెండూ తోడైతేనే అభివృద్ధి ఉంటుందే సమాజంలోనైనా. చర్చలు ఎవరైనా చేయొచ్చు. ఫలానా స్తాయి అనేది శుద్ధ తప్పు. చర్చించే పద్ధతి ఉంటుంది. తెలుగుకు వ్యాకరణం వ్రాసిన చిన్నయసూరి 18 ఏండ్లవరకు బడికే పోలేదు. చర్చలలో తరతమ స్థాయి ఉంటుంది. అన్ని అభిప్రాయాలను క్రోడీకరించి ఆయా అంశాలలో నిష్ణాతులు వాటిపై ఓ నిర్ణయం చేస్తారు. ఆచరణలో మళ్లీ అనుభవం ద్వారా దానికంటే మెరుగైనది ఇలాగే వస్తుంది. ఇదో ప్రాసెస్. ఇదీ మన గీతలో అద్భుతంగానే చెప్పారు : " పరివర్తన చెందడం లోకం పోకడ అని " , దానినే మార్క్స్ ఇలా చెప్పారు " ప్రజలే చరిత్ర నిర్మాతలు " అని. నేను మంచి ఎక్కడున్నా స్వీకరిస్తాను తప్ప ఎవరినీ గుడ్డిగా ఫాలో కాను. ఇక్కడ కూడా శ్యామలీయంగారి అభిప్రాయంతో విభేదించేది అందుకే. గురజాడ వచ్చేవరకూ పద్యరచనే తెలుగు సాహిత్యాన్ని ఏలింది. కానీ ఎందరిని మేలు కొలిపింది? ఎవరి మేలు కోరింది? కాబట్టి ఎవడు పండితుడు? అందులో ఎవడు మంచిని కోరేఎవాడు - ఎవడు దుర్మార్గుడు అనేదీ చూడాలి. మొల్లలా , కాళిదాసులా, వాల్మీకిలా మట్టిలో మాణిక్యాలుగా ఉండే మహానుభావులనూ చూడాలి. ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో అన్నట్లు ఏ మెదడులో ఏ మేధస్సు ఉన్నదో? ఎవరినీ ఏ భావాన్నీ ఏ పైత్యంతో అణచడం మంచిది కాదు.
మీ సుదీర్ఘమైన వ్యాఖ్యలో టపావిషయనికి సంబంధం తక్కువగానే కనిపిస్తున్నది.
తొలగించండి:) పైన ఉన్నది మీకు మెయిల్ చేసినది. పొరపాటున ఇక్కడ కామెంట్ లోనూ వచ్చినట్లున్నది. వీలయితే అది కట్ చేసి కామెంట్ పబ్లిష్ చేయగలరు. ఇక నా కామెంటులో పండితులంటే ఎవరనేది తెలపడానికే గతంలో పండితులమని విర్రవీగి తప్పులు చేయడం వల్ల భారతీయ సంస్కృతికి నష్టం కలిగినట్లుగానే తెలుగు భాషకూ పండితులవల్ల నష్టం జరుగకూడదనే ఉద్దేశం చెప్పాలనే. ఒకప్పుడు కేవలం పద్యరచన మాత్రమే సాహిత్యమనుకుని పండితులు విర్రవీగలేదా? పద్యాలవల్లనా? గద్యరచనలవల్లనా? దేనివల్ల ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతుంది? అందుకే భాష గురించి చర్చ విషయంలో మంచి ఉద్దేశం కలిగిన శాస్త్రీయ ధృక్పథం కలిగిన భాషావేత్తలైతే ఫర్వాలేదు గానీ స్వయం ప్రకటిత పండితులవల్ల భాషకు నష్టం జరుగుతుందని నా అభిప్రాయం సర్.
తొలగించండిశ్యామలీయం గారూ మీతో చాలా వరకు ఏకీభవిస్తాను. శాస్త్ర విషయాలు, శాస్త్రోక్తంగా వాటిని చదివి, తెలుసుకుని, పరిశీలించిన వాళ్ళు తప్ప మిగిలినవాళ్ళు చర్చించడం వలన ప్రయోజనం ఏమాత్రమూ ఉండదని నా భావన కూడా. కొంచె సిల్లీగా ఉంటుంది కూడా. చిన్న పిల్లలు పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడినట్లు.
రిప్లయితొలగించండి"రాజకీయాలు" చర్చించటంలో అందరూ పాల్గొన వచ్చు కారణం రాజకీయ వోటు హక్కు అందరికీ ఉన్నది కాబట్టి. అందుకని అన్నిటిలోనూ అధికారం చూపించుకోవటం కుదరదని అనుకుంటున్నాను.
మనం ఇంగ్లీష్ నేర్చుకున్నది బ్రతువు తెరువు కోసం. ఇంగ్లీష్ వాళ్ళు, మనకే కాదు ప్రపంచమంతటికీ ఆ అభిప్రాయం కలిగించారు. వారు ఒకప్పుడు "సూర్యుడు అస్తమించని సామ్రాజ్యానికి" అధిపతులుగా ఉన్నారు కాబట్టి అది సాధ్యమయ్యింది. ఇప్పటికీ అది ప్రపంచంలో చాలా వరకు నిజం. దానినే అవసరాని కోసం, వివిధ ప్రదేశాలు (భాషలు) తో నిండిన సంసారాల్లో వాడుకుంటున్నాము. (భావ వ్యక్తీకరణ సరీగ్గా కుదరలేదు కానీ నేను చెప్పేది అర్ధమయిన దనుకుంటాను)
లక్కరాజువారూ, అర్థమైనదండీ. నా అభిప్రాయాలను సానుభూతితో పరిశీలించినందుకు మీకు నా ధన్యవాదాలు.
తొలగించండిఒకప్పుడు ఒకమ్మాయి 'నాకేం తోచట్లేదు ఏంచేయమంటారూ' అని అడిగితే మాలతీచందూర్ గారు, తెలుగు చదవనూ వ్రాయనూ వచ్చిన పిల్ల ఖాళీగా కూర్చోవటం ఏమిటీ, ఇంకా నవలలు రాయటం మొదలుపెట్టలేదా అని ఛలోక్తి విసిరారు.
ఇప్పుడు కళ్ళెదురుగా బ్లాగులున్నాయి, మన చేతిలో కీబోర్డు ఉంది. ఖాళీగా ఎందుకుండటం. తోచినది చదవటం, తోచినచోట కామెంటటం, అక్కడక్కడా చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మనమూ ఉత్సాహంగా పాల్గొని అమూల్యాభిప్రాయాలతో దుమ్మురేపటం. ఆలస్యం దేనికీ?
అప్పుడు విషయాలు తెలియకుండా నవలలు రాసేయటమేనా అని చిరాగ్గా అనిపించేది. భార్గవీచంద్ర అనే ఒక నవలా కారిణీ గారు వ్రాసిన నవల ఒకదానిలో రాజు అనే ఒక కుర్రాడు టెన్నిస్ ఆటలో దేశాలన్నీ జయించుకుంటూ పోతాడు. ఆస్ట్రేలియా వెళ్ళి బ్రాడ్‌మన్‌ను కూడా చిత్తుగా ఓడిస్తాడు. అసలు బ్రాడ్ మన్ ఎవరో ఏమిటో ఏ ఆట ఆడేవాడో తెలియకుండా ఆ మహానుభావురాలు పేద్ద నవల రాసేసింది.
ఇప్పుడు నాకు మింగుడు పడటం లేదు, ఒక విషయంపై మనం మాట్లాడేముందు ఏదైనా సాధికారకంగా మాట్లాడగలమా అన్న అలోచన అవసరం లేదన్న విషయం . కొంచెం ఆవేశపడి పోతున్నానని నాకే ఇబ్బందిగా అనిపిస్తోంది.
కానీయండి. ఈ లోకం చిత్రమైనది. చూసి ఆనందించటమే!
రిప్లయితొలగించండిదీనిని తెలుగు లో అనువదింపుడు !
"I am trying to come to grip with the concept itself. I opine anything that is derived from sentiment alone can't be asserted as a law of nature."
దీనిని ఆంగ్లములో తర్జుమా చేయుడు !!
"ఒకప్పుడు ఒకమ్మాయి 'నాకేం తోచట్లేదు ఏంచేయమంటారూ' అని అడిగితే మాలతీచందూర్ గారు, తెలుగు చదవనూ వ్రాయనూ వచ్చిన పిల్ల ఖాళీగా కూర్చోవటం ఏమిటీ, ఇంకా నవలలు రాయటం మొదలుపెట్టలేదా అని ఛలోక్తి విసిరారు."
జిలేబీగారూ,
రిప్లయితొలగించండినాకు తర్జనభర్జనగర్జనలూ వద్దు తర్జుమాల తకరారులూ వద్దు.
నా నిర్జనారణ్యంలో నన్ను ఒంటిరిగానే ఉండనివ్వండి.
నాకు అదే బాగుండేలా ఉంది. మరికొందరకూ అదే బాగుండేలా ఉంది.
నేను చేయవలసిన పనులు నిశ్శబ్దంగా చేసుకొనిపోగలననే అనుకుంటున్నాను.
ఐనా అవి నిరాటంకంగా చేరవలసిన వారికే తప్పకుండా చేరతాయనీ అనుకుంటున్నాను.
మనుషుల చిలుకపలుకుల కన్నా చిలుకలసహజమైన పలుకులే నా నిశ్శబ్దానికి తోడుపడవచ్చును.
ధన్యవాదాలు.
నిశ్శబ్ధంగా పనులు జరుగవు సర్. దయచేసి మీరు రాటుదేలాలి.
తొలగించండిక్షమించాలి.
తొలగించండినా వల్ల ఇతరులకు ఇబ్బంది కలగటం ఎంతమాత్రమూ నా ఉద్దేశం కాదు ఎన్నడూ
అలాగే, ఇతరులవలన నా పనికి ఇబ్బంది కలగటాన్ని భరించటమూ నా వలన కాదు.
అవునండి, నేను రాటుదేలాలి అన్నది ఒప్పుకుంటాను.
నన్ను దూషిస్తున్న వారిని పట్టించుకోకుండా నా పని నేను చేసుకుపోవటాన్ని అలవాటు చేసకోవాలి..
నన్ను దూషిస్తున్న వారిని ఇది తప్పు అనటానికి కూడా ధైర్యం చేయని బ్లాగులోకాన్ని భరించటమూ అలవాటు చేసుకోవాలి.