జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జ్ఞాపకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

14, జనవరి 2020, మంగళవారం

అటవీ స్థళముల కరుగుదమా!



యతి రాజ్యం అనే అమ్మాయి నాకెప్పుడూ గుర్తుంటుది.

సంక్రాంతి పండగప్పుడు ఈ అటవీ స్థలముల పాటను ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ ఉంటారు. ఈరోజున   గారు  బోల్డన్ని కబుర్లు బ్లాగులో ప్ర స్తావించినట్లు.

ఆపాటతో బాటే నాకు యతిరాజ్యం కూడా గుర్తుకు వస్తుంది తప్పకుండా.

ఒక సంప్రదాయ వైష్ణవకుటుంబంలోని పిల్ల యతిరాజ్యం.

చదివేది ఏడవ తరగతి. మా బేబిపిన్నికి స్నేహితురాలు.

అటవీ స్థలముల పాటను ఆ అమ్మాయి ఇలాగే అటవీ స్థళముల కరుగుదమా అని తమాషాగా పాడేది.

ఆ పాట ఇలా ఉంటుంది.

అటవీ స్థలములు కరుగుదమా చెలి
వట పత్రమ్ములు కోయుదమా

చింత పిక్కాలాడుదమా
   చిరు చిరు నవ్వులు నవ్వుదమా

చెమ్మా చెక్కాలాడుదమా
   చక్కిలిగింతలు పెట్టుదమా

కోతీ కొమ్మచ్చులాడుదమా
   కొమ్మల చాటున దాగుదమా

చల్లని గంధం తీయుదమా
   సఖియా మెడకూ పూయుదమా

పూలదండలు గుచ్చుదమా
   దేవుని మెడలో వేయుదమా

అప్పట్లో మా బేబీ పిన్ని మాయింట్లోనే ఉండి ఒక యేడాది చదువుకుంది. అప్పుడు నేను ఆరవతరగతి, తాను ఏడవ తరగతి అన్నమాట.

ఐతే యతిరాజ్యం నాకు బాగా గుర్తు ఉండిపోవటానికి కారణం ఈపాట కాదు. ఆమె అటవీ స్థళముల కరుగుదమా అని  ల ను ళ చేసి అనటం కూడా కాదు.

యతిరాజ్యం నా ప్రియాతిప్రియమైన బేబీ పిన్నికి స్నేహితురాలు కావటం కూడా కాదు.

అవన్నీ కొంతవరకే కారణాలు.

అసలు కారణం వేరే ఉంది.

అప్పట్లో మేము గెద్దనాపల్లిలో ఉండే వాళ్ళం. మా నాన్నగారు అక్కడి జిల్లాపరిషత్ మిడిల్ స్కూలుకు ప్రథానోపాధ్యాయులుగా ఉండేవారు. అదే పాఠశాలలో నేను ఆరవతరగతిలోనూ మా బేబీ పిన్ని ఏడవతరగతిలోనూ ఉండేవాళ్ళం. యతిరాజ్యం మా పిన్నికి స్నేహితురాళ్ళలో ఒకమ్మాయి. మరొకమ్మాయి పేరు వరలక్ష్మి అనుకుంటాను. ఇంకా అప్పుడప్పుడు మరొకరిద్దరు అమ్మాయిలూ మా పిన్నితో పాటు మాయింటికి వచ్చేవారు ఆడుకుందుకు.

వాళ్ళెవ్వరితోనూ నాకు పరిచయం ఐతే ఉన్న గుర్తులేదు. యతిరాజ్యం మాత్రం ఈఅటవీ స్థళముల పుణ్యమా అని బాగానే గుర్తు.

ఒకరోజున మా యింటికి భాష్యం గారు వచ్చారు.  భాష్యం గారు అంటే యతిరాజ్యం వాళ్ళ నాన్నగారన్న మాట. ఆయన మా నాన్నగారికి ఒక శుభవార్త చెప్పటానికి వచ్చారు.

ఆ శుభవార్త ఏమిటంటే యతిరాజ్యానికి పెళ్ళి కుదిరింది అని.

ఆ రోజున మా నాన్న గారూ మా అమ్మ గారూ భాష్యంగారితో కొంత సేపు మాట్లాడారు.

ఏముంటుందీ, అంత చిన్నపిల్లకు పెళ్ళేమిటండీ అనే.

భాష్యం గారు మాత్రం ఆచారం అనీ సంప్రదాయం అనీ ఏమేమో చెప్పారట మా అమ్మానాన్నలకు సమాధానంగా. వాళ్ళు మాత్రం పాపం ఏం చేస్తారు. వీలైనంతగా చెప్పి చూడగలరే కాని.

యతిరాజ్యం ఆ తరువాత మా యింటికి ఎప్పుడూ రాలేదు.

యతిరాజ్యం స్కూలు మానివేసింది

యతిరాజ్యానికి పెళ్ళయిపోయింది.

చాలా కాలం పాటు, ఆ అమ్మాయి గుర్తుకు వచ్చినప్పుడల్లా మా అమ్మగారు, బంగారం లాంటి పిల్ల అంటూ బాధపడే వారు.

ఎవరు ఎక్కడ అటవీ స్థలముల పాట పాడినా నాకు యతిరాజ్యం గుర్తుకు వస్తుంది. బంగారం లాంటి అభం శుభం తెలియని ఏడో తరగతి అమ్మాయికి పెళ్ళి చేసిన ఆ అమ్మాయి పెద్దల చాదస్తం గుర్తుకు వస్తుంది.

మా పిన్ని భాషాప్రవీణ చేసింది.  ఆతరువాత కొన్నాళ్ళు నిడదవోలులో ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

మా పిన్నిని నేను తరచూ కలుసుకుంటూనే ఉండే వాడిని. ఆమెను కలుసుకుందుకు కొవ్వూరు వెళ్తూ ఉండే వాడిని.

ఒకసారి యతిరాజ్యం ప్రసక్తి వచ్చింది మా మధ్యన.

ఆడపిల్లల బ్రతుకులు వాళ్ళ చేతుల్లో ఉంటాయేమిట్రా అనేసింది ఆరోజున మా బేనీ పిన్ని.


25, ఫిబ్రవరి 2018, ఆదివారం

శ్రీదేవి బొమ్మను ప్రింటు కొడుతుందా మీ కంప్యూటరూ?


నటీమణి శ్రీదేవి గారి గురించి  ఎవ్వరూ ఎవరికీ ప్రత్యేకంగా పరిచయవాక్యాలు చెప్పనవసరం లేదు.

పసిపిల్లగానే సినీతారగా మారిన శ్రీదేవి ఆసేతుశీతాచలమూ అభిమానప్రేక్షకలోకాన్ని సంపాదించున్నారు.

ఆవిడ బోనీకపూర్ వంటి వయోధికుణ్ణి పెళ్ళిచేసుకోవటం అప్పట్లో ఒక సంచలనం ఐతే ఇలా హఠాత్తుగా వెళ్ళిపోవటం ఇప్పుడు గొప్ప సంచలన వార్త. పత్రికల్లో రేపు వార్తలూ వివరాలూ వస్తాయి కానీ ఈరోజున టీవీ ఛానెళ్ళన్నీ హోరెత్తించేస్తున్నాయి.

ఆవిడతో నాకేవిధమైన పరిచయమూ లేదు.

నాకెవరూ అభిమాన నటీనటులూ లేరు.

ఐనా ఆవిడకు సంబందించిన ఒక విశేషం మాత్రం చెప్పగలను. అది ఆవిడ పైన మనదేశంలో ఉన్న విపరీతమైన అభిమానానికి సంబంధించినది.

ఒకప్పుడు అంటే మూడు దశాబ్దుల క్రితం వరకూ ఇసిఐయల్ సంస్థ కంప్యూటర్లను తయారు చేస్తూ ఉండేది.  అప్పట్లో నేను ఆ సంస్థలో పని చేస్తూ ఉండేవాడిని.

అప్పట్లో మా సంస్థను కొనుగోలు దారు సంస్థల తరపు పెద్దలు తరచూ సందర్శించుతూ ఉండేవారు. వారికి మా కంప్యూటర్లను గురించిన వివరాలు మేము వివరించి వారి అవసరాలకు అవి ఎలా సరిపోతాయో అన్నది వారికి నచ్చచెపుతూ ఉండే వాళ్ళం.

అప్పట్లో ఇప్పటిలాగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి లేవు.

కొందరు కుర్రవాళ్ళు వాళ్ళకు చేతనైన కసరత్తులతో బొమ్మలు వేస్తూ ఉండేవారు.

మీకు పాతకాలం నాటి టైప్ మిషన్లు గుర్తున్నాయా?

ఐతే అప్పట్లో కొందరు ఆ మిషన్ల మీద X అక్షరంతోనో లేదా దానితోపాటు కీబోర్డుమీద ఉన్నమరికొన్ని అక్షరాల సాయంతోనూ వేంకటేశ్వరస్వామి బొమ్మనో మరొక బొమ్మనో వేయటం కూడా గుర్తుండాలి మీలో కొందరికైనా.

అప్పట్లో కంప్యూటర్ మీద ఇప్పటిలాగా A4 సైజు కాగితాలమీద ప్రింట్ చేయటం అనేది లేదు. లైన్ ప్రింటర్లు అని ఉండేవి. లైనుకు 132 అక్షరల దాకా ప్రింటు చేస్తూ పేజీకి అరవైపైన లైన్లు ప్రింటు చేసుకొనే సదుపాయం ఉండేది. పైగా అప్పట్లో వాటిపై  అన్నీ ఇంగ్లీషు అక్షరాలే అదీ పెద్దబడి మాత్రమే. అంటే అన్నీ A B C....Z తప్ప a b c .. z  వగైరాలు లేనేలే వన్నమాట. ఈ అక్షరాలు కాక కొన్ని గుర్తులు అంటే కామాలూ కోలన్లూ సెమీకోలన్లూ ఫుల్‍స్టాప్ వగైరాలు మాత్రం ఉండేవి.

కొందరు ఉత్సాహవంతలైన కుర్రాళ్ళు అ పరిమితమైన వాటితోటే లైన్ ప్రింటర్ కాగితంపైన వెంకటేశ్వరస్వామి బొమ్మ వేయగలిగారు. మరికొందరు దేవుళ్ళ బొమ్మలూ వేసారు వినాయకుడూ వంటివి.

మా సంస్థకు కష్టమర్ల తాలూకు పెద్దలు వస్తూ ఉండేవారని చెప్పాను కదా కంప్యూటర్ల సామర్థ్యాలను స్వయంగా తెలుసుకుందుకు.

అలాంటి కష్టమర్లు కంప్యూటరుకు అనుసంధానించి ఉన్న పరికరాల సామర్థ్యమూ వేగమూ గురించీ తప్పక అడిగి తెలుసుకునే వారు.  లైవ్‍గా చూపించమనీ అడిగే వారు. అలాగే ఆ లైన్ ప్రింటర్ వేగం కూడా ఆలోచించే వారు. అంటే నిముషానికి ఎన్ని లైన్లు ప్రింట్ చేయగలదూ అన్నట్లు. అప్పట్లో సాధారణంగా నిముషానికి 300 లేదా 600 లైన్లు ప్రింటుకొట్టేవి ఆ ప్రింటర్లు. మరీ ఆధునికమైనవీ బాగా ఖరీదనవీ నిముషానికి 1200 లైన్లూ ప్రింటుకొట్టేవి. అప్పట్లో అది మహావేగం అన్నమాట.

అలాంటి ఒక కష్టమరుకు ప్రింటరును చూపుతున్నాడు మా ఇంజనీర్లలో ఒకబ్బాయి.

వేంకటేశ్వరస్వామి బొమ్మను వేగంగా ప్రింటుకొట్టి చూపాడు.

ఆ కష్టమరు  తెగ ముచ్చటపడిపోయాడు.

శ్రీదేవి బొమ్మను ప్రింటు కొడుతుందా మీ కంప్యూటరూ? అలాగైతే వెంటనే ఆర్డరిస్తాను అన్నాడు.

ఈ సంఘటనను మేము చాలాసార్లు గుర్తుచేసుకొని నవ్వుకొనే వాళ్ళం అప్పట్లో.