30, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 153

ఉ. రామయ యేమి కన్ను లివి రాగవిషాక్తవిలోకనంబులం
భూమిని నిత్యముం గలుష బుధ్ధిని గ్రుమ్మరు జీవు డార్తిమై
స్వామిపదాంబుజంబులను చక్కగ చూడుడటంచు వేడుచో
నేమియు లక్ష్యపెట్ట విక నేమి యొనర్పగ వచ్చు చెప్పుమా

(వ్రాసిన తేదీ: 2013-6-7)

29, జూన్ 2013, శనివారం

హనుమంతులవారిని గుర్తించ లేక పోయానే!

ఈ వారం అంతా దంపతులము ఇద్దరమూ ఇంటికి దూరంగా ఉండవలసి వచ్చింది.
ఈ‌ రోజు సాయంకాలమే యింటికి పునరాగమనం.
అందుచేత యీ విషయాన్ని మీతో పంచుకుందుకు కొద్ది రోజులు ఆగవలసి వచ్చింది.

రెండు రోజుల క్రిందట ఒక విచిత్రమైన స్వప్నం కలిగింది.
ఆ స్వప్నంలో నేను లింగస్వరూపుడైన పరమేశ్వరుని మూర్తిని అన్వేషిస్తూ తిరుగుతున్నాను.
తిరగ్గా తిరగ్గా ఒక దేవాలయంలో శివలింగం సాక్షాత్కరిస్తుందనిపించింది.
నమ్మకం‌ బలవత్తరమై అటు అడుగులు పడసాగాయి.
నేను స్వామి దర్శనంకోసం వెళుతున్న సమయంలో ఒక చిత్రం జరిగింది.

శివలింగాన్ని సమీపించేలోగా నాకు శ్రీసీతారామలక్ష్మణుల దివ్యమూర్తుల దర్శనం కలిగిస్తూ వేరొక దేవళం‌ సాక్షాత్కరించింది.  ఆహా యేమీ ఆ దివ్యమూర్తుల శోభ, వర్ణించే సామర్ధ్యం నాకు లేదు.  మీరు అర్థం చేసుకోవలసిందే.

సాధారణంగా ఆలయాల్లో శ్రీసీతారామలక్ష్మణుల ప్రతిష్టిత మూర్తులు శిలావిగ్రహస్వరూపాలుగా నల్లగానే‌ ఉంటాయి.  కాని యిక్కడ యీ‌ మూర్తులు చక్కగా అందంగా రంగుల్లో ఉన్నాయి. పైగా అతిమనోహరమైన దయాపూర్ణమైన కన్నులూ‌ నవ్వులూ కలిగి ఉన్నాయి.  

అటువంటి మూర్తుల్ని మనం యెక్కడా చూడం.

నాకు అమితానందమైనది.
కాని ఒక విషయంలో మిక్కిలి ఆశ్చర్యం కలిగింది కూడా.
ఇక్కడ శివదర్శనం‌ అవుతున్నదని గ్రహించి కదా వచ్చింది?
మరి రాములవారు దర్శనమిస్తున్నారే!
ఆశ్చర్యంగా అటూ ఇటూ పరికించాను.
అక్కడ శివయ్యా ఉన్నాడు.

అంతే‌ కాదు, అక్కడ ముఖ మంటపంలో మరెవరో‌ కూడా ఉన్నారు.
వారినీ‌ సందర్శించాలని దగ్గరగా వెళ్ళాను.

ఆయన పెద్దవాడు. ఒక డెబ్భై యేళ్ళ వాడేమో.
చాలా ఆకర్షణీయమైన ముఖం.
చాలా పరిచయమైన ముఖమే అనిపిస్తోంది.
 కాని సరిగా గుర్తుకు రావటంలేదు ఎవరైనదీ.
ఎంత ప్రయత్నించినా గుర్తుపట్టలేక పోయాను.
ఆయన చల్లగా నవ్వారు!
దగ్గరకు పిచిచారు.

ఆయన నాతో‌ చాలా ఆదరంగా మాట్లాడారు.
ఎన్నో విషయాలు చర్చించుకున్నాం‌ ఇద్దరమూ.
చాలా సందేహాలు నివృత్తి అయ్యాయి.

అయ్యా తమరెవరూ‌ అని మాత్రం అడగలేక పోయాను.
కారణం తెలియదు.
బహుశః ఆయన నా ప్రయత్నాన్ని తన సంకల్పంతో‌ అడ్డుకుని ఉంటారు.

ఏమయితేనేం , నాకు చాలా సంతోషమూ‌ తృప్తీ‌ కలిగాయి.
ఆయన కృపాపూర్ణవదనం నాకింకా కళ్ళ ముందే‌ ఉంది.
అది మరింత సంతోషం‌ కలిగించే విషయం .

మెల్లగా కల కరిగిపోయింది.

క్రమంగా నాకు అవగాహనకు వచ్చింది.
శ్రీరామచంద్రులవారి సమ్ముఖంలో‌ఉండేది సాక్షాత్తు శ్రీ‌హనుమంతులవారు కాదా?
అయ్యో, ఆ విషయం నాకు తట్టనేలేదే!
ఎందుకని స్వామి నన్ను నిరోధించారో.
అదీ‌ కాక వారిని చూస్తున్నంత సేపూ వారు నాకు మిక్కిలి పరిచయస్తుల వలె తోచారే!
అదేమిటలా?

ఆలోచించగా ఆలోచించగా నాకు ఇటువంటి వేరొక వృత్తాంతం గుర్తుకు వచ్చింది.
ఆ వృత్తాంతం 'ఒక యోగి ఆత్మకథ' అనే పుస్తకంలో ఉంది. శ్రీయుక్తేశ్వరగిరిగారు ఒక సందర్భంలో మహావతార్ బాబాజీగారి సమక్షాన్ని పొందీ‌ ఆయన్న గుర్తుపట్టలేక పోయారు.  బాబాజీగారు తనను గిరిగారు గుర్తించకుండా అడ్డుకున్నారు అక్కడ.

ఇక్కడ శ్రీహనుమంతులవారు తనను నన్ను గుర్తించనీయ లేదు.
నా సాథనాస్థితి ఇంకా అందుకు తగిన యోగ్యత కలిగింది కాకపోవటమే కారణం అనుకుంటున్నాను.

అయినా వారు దయతో‌ నాకు కొన్ని సందేహాలు తీర్చారు.
అదే స్వప్న ప్రయోజనం.

కొన్ని కారణాల వలన, స్వామివారితో‌ నాకు స్వప్నంలో‌ జరిగిన సంభాషణను అందరితో‌ పంచుకోలేదు. సహసాథకులకు దానికి గల కారణం అర్థం అవుతుందనే ఆశిస్తున్నాను.

స్వప్నవృత్తాంతాన్ని మాత్రం పంచుకుంటున్నాను అందరితో. 
దీని వలన సాథకులకు అందరకూ మరింత ధ్యైర్యమూ, ఉత్సాహమూ‌ కలుగుతుందన్న భావనతోనే యిలా పంచుకుంటున్నాను తప్ప మరేమీ‌ కారణం లేదని సవినయంగా మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను.

పాహి రామప్రభో - 152

ఉ. రామయ యెట్టి కాళు లివి రక్కెసదీక్షను బూని నిత్యముం
నీమముమై చరించు నిల నెల్లప్రదేశములందు రూకపై
కామము పెచ్చుమీర తమకంబున జీవుడు దేవళంబునన్ 
స్వామిని కొల్వ బోదమన వంకలు బెట్టును గాని సాగవే

(వ్రాసిన తేదీ: 2013-6-5)

28, జూన్ 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 151

ఉ. రామయ యేమి చేతులు విరామ మెఱుంగక నాల్గు రాళ్ళకై
తామసవృత్తులందు సతతం బివి గ్రుమ్మరు గాని యాత్మకున్
కామిత మంచు నియ్యకొని గట్టిగ రెండును జోడిగూడి నా
స్వామి భవత్పదంబులకు చక్కగ దండము పెట్ట నేరవే

(వ్రాసిన తేదీ: 2013-6-7)

27, జూన్ 2013, గురువారం

పాహి రామప్రభో - 150

ఆ.వె. పుట్టి నట్టి వాడు గిట్టక తీరదు
పుట్ట నేల మరల గిట్ట నేల
పట్టుబట్టి రామభద్రుని వేడిన
పుట్టు నవుసరంబు పుట్టదుగద

(వ్రాసిన తేదీ: 2013-6-3)


26, జూన్ 2013, బుధవారం

పాహి రామప్రభో - 149

ఉ. నేను నిమిత్త మాత్రుడను నీదగు నాజ్ఞ కృతాకృతంబుల
జ్ఞానము గల్గి యాడగల జంత్రము నై నడయాడు వాడ నీ
ధ్యానము దప్ప నన్యమగు ధ్యాసయు నాకెపు డుండకుండు న
ట్లానతి సేయవయ్య వరదా శుభకారణ రామభూవరా

(వ్రాసిన తేదీ: 2013-6-3)

25, జూన్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 148

శా. ఆ రామయ్య కృపావిశేషమది రాదా జీవుడీ‌ దుష్టసం
సారంబన్నది దాటిపోవుటకు నీషణ్మాత్రమున్ పూనుకో
డా రామయ్య యనుగ్రహంబు దనపై నావంతగా గల్గుచో
క్రూరుండైన ఋషీంద్రుడౌ కవికులోత్కృష్టుండు ముక్తుండు నౌ

(వ్రాసిన తేదీ: 2013-6-2)

24, జూన్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 147

ఆ.వె. గురుముఖమున బడయకుండిన మంత్రజ
పంబు వలన సత్ఫలంబు లేదు
కాని రామనామ ఘనమంత్రజపమెల్ల
జనుల కిచ్చు ముక్తి సత్యముగను


(వ్రాసిన తేదీ: 2013-5-31)

23, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 146

ఉ. కర్మఫలోదయోచితముగా నొక దేహము నొంది జీవుడా
కర్మఫలంబులం గుడిచి క్రమ్మర స్వస్థుడు గాక క్రొత్తదౌ
కర్మసముఛ్ఛయంబు తల గట్టుక పోవును రామభక్తుడై
నిర్మలుడై తరించు నిది నిక్కము వేరొక దారి యున్నదే

(వ్రాసిన తేదీ: 2013-5-31)

22, జూన్ 2013, శనివారం

పాహి రామప్రభో - 145

ఆ.వె. రామమంత్రమందు రమియించ నొల్లని
చిత్త మొక్క పెద్ద చెత్తకుప్ప
రామమంత్రసిధ్ధి రాజిల్లు చిత్తము
రామచంద్రుడుండు రత్నపీఠి

(వ్రాసిన తేదీ: 2013-5-30)

21, జూన్ 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 144

ఆ.వె. మరల మరల రామమంత్రజపంబున
సంతసించు నట్టి సజ్జనులను
కట్ట వెరచు ప్రకృతి కార్యంబు లేదని
కనుక రామ రామ యనుట మేలు

(వ్రాసిన తేదీ: 2013-5-30)

20, జూన్ 2013, గురువారం

పాహి రామప్రభో - 143

తే.గీ. పాల జలములు చేరిన పాలు నిలచి
యుదకములు నామరూపంబు లుడుగు భంగి
రామ నినుజేరి జీవులు నామరూప 
ములను విడనాడ గలరయ్య ముదము మీర


(వ్రాసిన తేదీ: 2013-5-29)

19, జూన్ 2013, బుధవారం

పాహి రామప్రభో - 142

 తే.గీ. మొదటినుండియు నేనొక మూఢబుధ్ధి
నెన్ని జన్మంబు లెత్తితి నిన్ను మఱచి
నేడు నీ దయచే రామ నిన్నెఱింగి
స్వస్వరూపంబు దెలిసితి విశ్వరూప

(వ్రాసిన తేదీ: 2013-5-28)

18, జూన్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 141

శా. ఏ వేదాభ్యసనంబు సేసినది లే దేశాస్త్రముల్ నేర్వలే
దే విద్యన్నిపుణుండ గాను సరిగా నేసాధు సన్యాసులం
సేవించం దరిజేరలేదు ముదిమిం జింతించి నీ‌నామమే
నీవే దిక్కని యుంటి రామ కనుమా నిర్వాణసంధాయకా

(వ్రాసిన తేదీ: 2013-5-28)

17, జూన్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 140

ఉ. రావణు జంప వచ్చితివొ రాజ్యసుఖాదులు స్వల్పమంచు నీ
భూవలయంబునం బ్రజల బుద్దికి సోకగ జెప్పవచ్చితో 
వావిరిధర్మవర్తనపు వాసితనంబును చాటవచ్చితో
భూవర రామచంద్ర మునిపుంగవులం గరుణించ వచ్చితో

(వ్రాసిన తేదీ: 2013-5-28)

16, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 139

ఉ. స్వామిని మోక్షదాయకుని సత్యపరాక్రము నవ్యయున్ హరిన్
రాముని భక్తకామితవరప్రదు నీశ్వరు నచ్యుతున్ పరం
ధాముని జానకీహృదయధాముని శ్యాముని బ్రహ్మరుద్రసు
త్రామముఖామరార్చితుని దాశరథిన్ శరణంబు వేడెదన్

(వ్రాసిన తేదీ: 2013-5-28)

15, జూన్ 2013, శనివారం

పాహి రామప్రభో - 138

ఉత్సాహము
జయము జయము జయము రామ జానకీ‌మనోహరా
జయము జయము వాసవాదిసర్వదేవవందితా
జయము జయము పార్వతీశసన్నుతా పరంతపా
జయము జయము శ్యామలాంగ సర్వలోకపాలకా

(వ్రాసిన తేదీ: 2013-5-27)

14, జూన్ 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 137

కం. రాముని సీతాహృదయా
రాముని  వరప్రదుని వీతరాగుని నతసు
త్రాముని దానవవంశవి
రాముని మనసార గొలువ రాదే‌ మనసా

(వ్రాసిన తేదీ: 2013-5-27)

13, జూన్ 2013, గురువారం

పాహి రామప్రభో - 136

ఆ.వె. లౌకికముల పట్ల లౌల్యంబుచే జెడి
యలమటించు జీవులార మీరు
రామవిభుని పాదరాజీవముల చెంత
చేర రండు మనసు సేద దీర

(వ్రాసిన తేదీ: 2013-5-23)

12, జూన్ 2013, బుధవారం

పాహి రామప్రభో - 135

కం. నలుదిక్కుల నలుమూలల
పొలుపుగ దేవతలు నిలచి భువనేశ్వర నీ
సెలవెల్ల వేళ సేయం
గలవారలు రామ భూమికన్యారమణా
 
(వ్రాసిన తేదీ: 2013-5-23)

11, జూన్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 134

సీ. ఒక మూల కేలికై యుండెడు నగ్ని నీ
      వాడుగా శ్రీరామ వందనములు
 ఒక మూల కేలికై యుండెడు నిరృతి నీ
      వాడుగా శ్రీరామ వందనములు
ఒక మూల కేలికై యుండు పవనుడు నీ
      వాడుగా శ్రీరామ వందనములు
ఒక మూల కేలికై యుండు భవుండు నీ
      వాడుగా శ్రీరామ వందనములు  
తే.గీ. నాల్గు మూలల నీయాజ్ఞ నమలు జరుప
దేవముఖ్యులు నీవారు త్రిభువనేశ
పరమ సమ్మోదమున నున్న వారు స్వామి
రఘుకులార్ణవచంద్ర శ్రీరామచంద్ర

(వ్రాసిన తేదీ: 2013-5-23)

10, జూన్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 133

సీ. దేవనాథుడు తూర్పు దిక్కు నేలును నీదు
      బంటుగా శ్రీరామ వందనములు
దక్షిణంబును యమధర్మరా జేలు నీ
      బంటుగా శ్రీరామ వందనములు
పడమటి దిక్కును వరుణు డేలును నీదు
      బంటుగా శ్రీరామ వందనములు
ధనదు డుత్తరదిశ తా నేలు చుండు నీ
      బంటుగా శ్రీరామ వందనములు
తే.గీ. త్రిభువనంబుల నీ కీర్తి తేజరిల్ల
నాల్గు దిక్కుల నీబంట్లు నయముమీఱ
నేలుచున్నారు నీయాజ్ఞ నెఱుకపరచి
రఘుకులార్ణవచంద్ర శ్రీరామచంద్ర

 
(వ్రాసిన తేదీ: 2013-5-23)

9, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 132

శా. నీపై చిత్తము నిల్పగోరుదునయా నీ నామమాహాత్మ్యమే
నా పాపంబుల నన్నిటిం జిదుమ నానందంబుగా సర్వసం
తాపంబుల్ దిగద్రోసి నీ కొలువు నుత్సాహంబునం జేసెదన్
కాపాడం దగు నన్ను శ్రీరఘువరా కారుణ్యవారాన్నిధీ(వ్రాసిన తేదీ: 2013-5-23)


8, జూన్ 2013, శనివారం

పాహి రామప్రభో - 131

తే.గీ. ఆ యయోధ్యను ప్రజలంద రాత్మవిదులు
వారు రామాజ్ఞ మీఱెడు వారు కారు
వారు లోభాదికములున్న వారు కారు
వారు సంసారబధ్ధులు కారు కారు

(వ్రాసిన తేదీ: 2013-5-23)

7, జూన్ 2013, శుక్రవారం

పాహి రామప్రభో - 130

తే.గీ. ఆ యయోధ్యను జనులు గేహముల ముందు
వేడ్క మీరగ వెన్నెలవేళలందు
భక్తినిండార శ్రీరామవిభునియందు
నృత్యసంగీతగోష్టుల నెరపు చుంద్రు

(వ్రాసిన తేదీ: 2013-5-23)

6, జూన్ 2013, గురువారం

పాహి రామప్రభో - 129

శా. ఈ నా నోటను నీదు భక్తుడను నిన్నే నమ్మినానంచు నే
దో నిష్ఠం గొని కొల్చు వాని వలె లో‌ నూహించి పల్కంగ నే
లా నా చిత్తము సర్వదుర్విషయలోలంబై ప్రవర్తించుచుచో
నీ నామంబును తప్పుచో రఘుపతీ నిర్భాగ్యుడం బ్రోవవే

(వ్రాసిన తేదీ: 2013-5-22)

5, జూన్ 2013, బుధవారం

పాహి రామప్రభో - 128

ఉ. రాముని తోడిదే సుఖము రాముని భక్తుల కెల్లవేళలన్
రాముని తోడిదే జగము రాముని భక్తుల కెల్లవేళలన్
రాముని తోడిదే బ్రతుకు రాముని భక్తుల కెల్లవేళలన్
రాముని వారలైన నిక రాముడె కాక తదన్య ముండునే

(వ్రాసిన తేదీ: 2013-5-21)


4, జూన్ 2013, మంగళవారం

పాహి రామప్రభో - 127

ఆ.వె.  నన్ను గూర్చి చింత నా కేమియును లేదు
నిన్ను గూర్చి చింత నిత్య మగుట
నన్ను నీవు ప్రోచు టెన్నడు నా స్వామి
రామచంద్ర వేగ రాగ దయ్య

(వ్రాసిన తేదీ: 2013-5-20)


3, జూన్ 2013, సోమవారం

పాహి రామప్రభో - 126

తే.గీ. అనవరతము నే స్వామిని కనుల జూడ
అమరవరులెల్ల తపసి వేషములు దాల్చి
తిరుగు చుందురు సాకేత పురము జొచ్చి
యట్టి శ్రీరామచంద్రున కంజలింతు

(వ్రాసిన తేదీ: 2013-5-20)

2, జూన్ 2013, ఆదివారం

పాహి రామప్రభో - 125

తే.గీ. ఆ యయోధ్యకు సాటియే యమరనగరి
పుణ్యమున్నంత కాలమే భోగమచట
రామపురవాసు లందరు స్వామి కృపను
పరమధామంబు వైకుంఠ పురము జనిరి

(వ్రాసిన తేదీ: 2013-5-20)

1, జూన్ 2013, శనివారం

పాహి రామప్రభో - 124

శా. సాకేతంబున సర్వభూతహితుడై సర్వజ్ఞుడై యుండ ము
ల్లోకంబుల్ కొనియాడు రామవిభునా లోలాక్షి సీతాంగనన్
లోకారాధ్యను తోడు చేసికొని భూలోకంబనారాతియై
చీకుం చింతయు లేక నేలు ఘనునిన్ చింతించెదన్ నిత్యమున్

(వ్రాసిన తేదీ: 2013-5-20)