30, ఏప్రిల్ 2024, మంగళవారం

ఆహాహా యెటువంటి దాయెనీ జిహ్వ


ఆహాహా యెటువంటి దాయెనీ జిహ్వ

శ్రీహరి నామమునే చింతించదు


ఒరుల నిందించగా నుత్సహించెడి జిహ్వ

హరినామమును పలుక దొరకొన దీజిహ్వ


కల్లలాడుట యందు కడునేర్పు కల జిహ్వ

చల్లగా హరీ యన నొల్లని దీజిహ్వ


ముప్పొద్దుల మెక్కుచు మురుయున దీజిహ్వ 

చప్పిడా హరినామ మొప్ప కుండు జిహ్వ


తప్పు లెన్నుట యందు తర్ఫీదుకల జిహ్వ

ఎప్పుడును హరినామ మెఱుగని దీజిహ్వ


మరియాదయే లేక మాటలాడెడు జిహ్వ

సరసముగ హరి యనగ జాలని దీజిహ్వ


నిదుర లేచిన దాది వదరుచుండెడి జిహ్వ

ముదమార రామా యనదు సూవె యీజిహ్వ
అడుగ వయా నీప్రశ్శఅడుగ వయా నీప్రశ్శ నది యేమిటో

అడిగితే కొంటెప్రశ్న యనబోకయ్యా


సొమ్మ లేమి చేయు నయ్యా 

    సుఖముల కొనిపించు నయ్యా

సొమ్ము లేలా సుఖము లేలా 

    కమ్మనిది హరినామమైతే


జయము లేమి చేయు నయ్యా 

    చాలగర్వము నిచ్చు నయ్యా

జయము లేలా గరువ మేలా 

    చాలునది హరిస్మరణ మైతే


పాప మేమి చేయు నయ్యా 

    పట్టి నరకము చూపు నయ్యా

పాప మేలా నరక మేలా 

    పట్టవలె హరిపాద ములను


పుణ్య మేమి చేయు నయ్యా 

    భోగముల నందించు నయ్యా

పుణ్య మేలా భోగ మేలా 

    పొందదగనది మోక్షమైతే


తను వదేమి చేయు నయ్యా 

    తగని బంధము లిచ్చు నయ్యా

తను వదేలా బంధ మేలా 

    తాను హరితో నొకటై యుండ


ఏమి చేయుదు నేమి చేయుదు 

    నెట్లు హరితో నొకటై యుందు

రామ రామ యనుటే దారి 

    రాముడన శ్రీహరియే నయ్యామరువ కండి శ్రీరాముని మీరు


మరువ కండి శ్రీరాముని మీరు 

    మరువ కండి రఘురాముని

మరువ కండి గుణధాముని మీరు 

    మరువ కండి ఘనశ్యాముని 


మరువ కండయా మానవనాథుని 

    మన శ్రీరాముని మహితతేజుని

మరువ కండయా జగదభిరాముని 

    మన శ్రీరాముని మంగళమూర్తిని

మరువ కండయా కరుణామూర్తిని 

    మన శ్రీరాముని వరదాయకుని

మరువ కండయా మునిజనసేవ్యుని 

    మన శ్రీరాముని హరి నచ్యుతుని


మరువ కండయా జగదీశ్వరుని 

    మన శ్రీరాముని సర్వేశ్వరుని

మరువ కండయా పరంధాముని 

    మన శ్రీరాముని పరమేశ్వరుని

మరువ కండయా కమలేక్షణుని 

    మన శ్రీరాముని కలిమలధ్వంసిని

మరువ కండయా తారకనాముని 

    మన శ్రీరాముని భవనాశకుని


మరువ కండయా పరమానందుని 

    మన శ్రీరాముని భక్తవరదుని

మరువ కండయా సురగణవంద్యుని 

    మన శ్రీరాముని శోభనమూర్తిని

మరువ కండయా భండనభీముని 

    మన శ్రీరాముని పతితపావనుని

మరువ కండయా పాపవిదారిని 

    మన శ్రీరాముని మన దైవంబును


పదాతిదళమా వానరమూక


పదాతిదళమా వానరమూక మదగజహయరథములు లేవు

కదనము చేయుట రాకాసులతో పదునగునాయుధములు లేవు


ఐనది రాముని ఆజ్ణయని వానరులందరు కదలి రిదే

ఆనందముగా రాముని కొఱకై యనిచేయుట కుత్సాహముతో


రాముని కొఱకై వానరవీరులు ప్రాణమునీయగ తలచిరిగా

తామందరము రాముని కార్యము తప్పక నెఱవేర్చెదమనుచు


రాముడు నాయకుడై యుండగ మన కేమి భయంబని తలచిరిగా

రామునకే యపకార మెనర్చిన రావణుతో తలపడెదమని


లంకను పతనము చేసెదమనుచును రామునిదే విజయమ్మనుచు

శంకలేక నాలంకాధిపుని సైన్యముతో తలపడెదమని


జయజయ రామా జయజయ రామా జానకిరామా యనుచునిదే

భయములేని శ్రీరామునిసైన్యము పరుగున లంకకు కదలెనిదే


కదలెను రాముడు వానరసైన్యము ముదమున తనతో నడువగను

కదలెను భండనభీముడు రాముడు కడతేర్చగను రావణుని29, ఏప్రిల్ 2024, సోమవారం

మోమేల దాచేవురామోమేల దాచేవురా శ్రీరామ

నీమోము చూపించరా


నీముద్దు మోమున నిలచిన చిరునవ్వు 

ప్రేమతొ తిలకించ విచ్చేసె నీతండ్రి


కలువల కన్నుల కాంతుల సొగసుల

తిలకించ విచ్చేసె కులదీప నీ తండ్రి


బుడిబుడి యడుగుల తడబడు నినుజూడ

వడివడి చనుదెంచె వనజాక్ష నీతండ్రి


ముద్దైన పలుకుల మురిపించు నినుజూచి

ముద్దాడగా వచ్చె మోముజూపర తండ్రి


నీలాలకలు గప్పు నీమోము తిలకించ

చాల వేడుకతోడ చనుదెంచె నీతండ్రి


నిను జూడకుండంగ నిలువలేక సభను

జనపతి నీతండ్రి చాలించి విచ్చేసె


ఏనాడు నీనామ మీజహ్వపై కెక్కె


ఏనాడు నీనామ మీజహ్వపై కెక్కె

నానాడె నీవాడ నైనానయా


ఏమేమొ పలుకుచు నెగిరి పడెడు జహ్వ

కేమాయె విడువక నీనామమే పలుకు

నీనామమే పలుకు నానామమున కులుకు

తానెంతగా మారె దశరథరామ


నీనామమే శివుడు నిత్యంబు ప్రేమతో

ధ్యానించు ననుచు పెద్దలు చెప్పగా వింటి

ఆనామమే జగదాధార మందు రది

యీనాడు నాజిహ్వ పైనుండె రామ


చేరి నాజిహ్వపై చిందులాడుచును సం

సారవిముఖుని జేసె చక్కగాను నన్ను

కూరిమి నిటు లేలుకొనుచు నిదియే భవ 

తారకమై యొప్పె తండ్రి శ్రీరామ28, ఏప్రిల్ 2024, ఆదివారం

దయచేసి నాదీనతను బాపరా


దయచేసి నాదీనతను బాపరా భవ

భయవారక రామ పతితపావన నామ


నీనామమాహాత్మ్య మేనెఱుగు నాటికే 

మేనునగల సత్వమే మాయమైనది

జానకీపతి నేడు పూని పునశ్చరణ

నేను చేయగలేని దైనది రాదేవ


పూని ప్రాయమునందు బుధ్ధిమంతుడ నగచు

నేను చదువగ నైతి నీదివ్యచరితము

జానకీపతి నేడు నేను చదువగ లేను

దీనుని మన్నించితే చాలు దేవ


ఏనాడు సమవర్తి యిటువచ్చునో యని

ఈనాడు భయమున దీనుడ నైయుంటి

నానాలుక నీదు నామ మిప్పుడు నేర్చె

దీనబాంధవ నీవె దిక్కయ్య దేవ


27, ఏప్రిల్ 2024, శనివారం

వందనశతసహస్రి

 


నీవు సుగుణభూషణుడవు నే నవగుణభూషణుడను

నీవు లోకవందితుడవు నేను లోకనిందితుడను

నీవు దేవదేవుడవును నేను సేవకాధముడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు దీనబాంధవుడవు నేను దీనతామూర్తిని

నీవు కృపాజలరాశివి నేను దుఃఖజలరాశిని

నీవు శాంతచిత్తుండవు నేను భ్రాంతచిత్తుండను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు జితక్రోధనుడవు నేను నిత్యక్రోధనుడను

నీవు సిరిని శాశింతువు నేను సిరిని ప్రార్ధింతును

నీవు ధర్మవర్తనుడవు నే నధర్మవర్తనుడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు పుణ్యచరిత్రుడవు నేను పాపచరిత్రుడను

నీవు రాగరహితుండవు నేను రాగమోహితుడను

నీవో విధివందితుడవు నేనా విధివంచితుడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు సత్యవిక్రముడవు నే నసత్యవిక్రముడను

నీవు లోకపోషకుడవు నేను నీకు పోష్యుడను

నీవు భక్తవరదుండవు నేను నీకు భక్తుండను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు సకల మెఱుంగుదువు నే నెఱిగిన దొకటి లేదు

నీవు భవచికిత్సకుడవు నేను భవజ్వరార్తుడను

నీవు మోక్షవరదాతవు నేనిచట ముముక్షవును

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి
నేలకు దిగివచ్చిన


నేలకు దిగివచ్చిన ఓ నీలమేఘశ్యాముడా

వేలవేల దండాలివె విష్ణుదేవుడా 


బాలుడా పెరిగి పెద్దవాడ వగుట యెప్పుడు

ఆలములో రావణుని యంతుచూచు టెప్పుడు

మేలుచేయు టదెప్పుడు మేదినికిని మాకును

లీలామానుషవిగ్రహ బాలరాముడా


కాలుమోపు టది యెపుడు కాంతారములలోన

కాలుమోపు టెపుడు లంకాపురి పొలికలనులో

కాలున కా రావణుని కాను కిచ్చే దెప్పుడు

లీలామానుషవిగ్రహ బాలరాముడా


ఏలు టెప్పు డీధరను మేలుగా జనాళికి

కాలమునకు నిలిచెడు ఘనతచాటు టెప్పుడు

చాల భక్తవరదుడని జనులెరిగే దెప్పుడు

లీలామానుషవిగ్రహ బాలరాముడా


మక్కువతో చేయండీ

మక్కువతో చేయండీ చక్కని నామము
చక్కని నామము రామచంద్రుని నామము

సకలార్తినాశక మగు చక్కని నామము

సకలసుజనవినుత మైన చక్కని నామము

సకలదానవాహితమగు చక్కని నామము

సకలవరదు డైన రామచంద్రుని నామము


సర్వయోగివినుత మైన చక్కని నామము

సర్వరక్షాకర మైన చక్కని నామము

సర్వలోకముల నేలే చక్కని నామము

సర్వేశ్వరుడైన రామచంద్రుని నామము


సదమలమై వెలుగుచుండు చక్కని నామము

సదాముదాకరంబైన చక్కని నామము

సదాశివుడు జపముచేయు చక్కని నామము

వదలకండి శ్రీరామప్రభువు నామము

23, ఏప్రిల్ 2024, మంగళవారం

పురాకృతము ననుభవింప


పురాకృతము ననుభవింప పుట్టు దేహము

నరుని పాపపుణ్యముల బరువుమోయుచు


ఒక సంపద వచ్చిచేరు నొకనాటి పుణ్యఫలము

ఒక గర్వము వచ్చు నంత నొనగూడిన సిరిఫలము

ఒక పుణ్యము పండు టేమి యొక పాప హేతువేమి

ఇక నిన్నే మరచిపోయి ఎగురుటేమి రామచంద్ర


ఎగిరి యెగిరి దేహము పడి యిట్టే పుట్టు నవని మరల

తగని గర్వమునకు ఫలము తప్పకుండ పొందుటకు


ఒక రోగము వచ్చి పడెడు నొకనాటి పాపఫలము

ఒకటి కాని బాధల వలన నొనరు పశ్చాత్తాపము

ఒక పాపము పండు టేమి యొక దారి తోచుటేమి

ఇక నీవే దిక్కనుచు నెంచు టేమి రామచంద్ర 


పొగిలిపొగిలి దేహము పడి  పుట్టు నవని మీద మరల

తగుననుచును రామచింతన తప్పక కొనసాగగ

రామ్ రామ్ రామ్ హరి


రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్ హరి
    రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ
    రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్

శ్రీరఘురామ్ జయ సీతానాయక 
    శ్రీమద్దశరథనందన రామ్
నారాయణ సురవైరివీరగణ
    నాశనచణ సురతోషక రామ్

కారుణ్యాలయ కమలదళేక్షణ
    కౌసల్యాసుఖవర్ధన రామ్ 
నారాయణ బ్రహ్మాదిసుపూజిత
    నానామునిగణవందిత రామ్

మారజనక శతకోటిమన్మథాకార
    జలధరశ్యామల రామ్
నారాయణ సద్భక్తజనావన 
    జ్ఞానానందప్రదాయక రామ్

వారధిబంధన వీరకులేశ్వర 
    దారుణరావణఖండన రామ్
నారాయణ సంసారమహార్ణవ
    తారణకారణ జయజయ రామ్

21, ఏప్రిల్ 2024, ఆదివారం

రామ రామ

రామ రామ శివనుతనామ సీతారామ
రామ రామ జితశతకామ సీతారామ

రామ రామ రామ రఘురామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ ఘనశ్యామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ గుణధామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ మునికామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ శుభనామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ రణభీమ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ సార్వబౌమ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ ఆప్తకామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ పరంధామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ హరేరామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ18, ఏప్రిల్ 2024, గురువారం

కరుణాలవాలుడవు శ్రీరామ


కరుణాలవాలుడవు శ్రీరామ 

    కరుణించి మమ్మేలు మిక నైన


కరిరాజవరదుడవు శ్రీరామ 

    కరిని బిడ్డను వోలె కాచితివి


సురరాజవరదుడవు శ్రీరామ 

    సురకార్యమును దీర్చ నెంచిచివి


మునిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించి దనుజుల గొట్టితివి 


ఖగరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి జటాయువు నపుడు


హరిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి సూర్యసుతు నపుడు


వరభక్తవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి విభీషణు నపుడు


గిరిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి భద్రుని వేడ్క


హరి సత్యవరదుడవు శ్రీరామ 

    సరిసాటి నీకెవరు లేరయ్యశ్రీరామచంద్ర నే సేవింతు


శ్రీరామచంద్ర నే సేవింతు నిన్నెపుడు
ఓరామచంద్ర నే నున్నదే నీకొఱకు

కువలయ నాయక నిన్ను కొలిచెదను మానకను
రవిసుతుని వలె నీకై ప్రాణము నే నిచ్చెదను
పవమానసుతుని వలె పాడెద నీ నామమును
శివుని వలెను నిత్యమును చేసెద నీ ధ్యానమును

నీసత్కీర్తిని నేను నిత్యమును చాటెదను
దాసుడనై నిన్నెపుడు తప్పక సేవించెదను
భాసురమౌ నీమహిమ వదలక నే పొగడెదను
వాసిగ నీ గుణరూపవర్ణనమే చేసెదను 

అడిగిన వన్నియు నిత్తు వందురురా నిన్నెపుడు
అడుగక నే నన్యముల నడుగుదురా మోక్షమును
కడువేగముగ నన్ను కరుణించు మికనైన
ఉడురాజముఖ నన్ను నడుపవయా నీపురికి 17, ఏప్రిల్ 2024, బుధవారం

నీకిచ్చే సొమ్ములురా

నీకిచ్చే సొమ్ములురా నీవే దాచుకో
నా కాపని పెట్టకురా నావలన కాదు

నేడో రేపో పడిపోయే నేనెటుల దాచుదును
నేడు రే పను ప్రసక్తి లేని నీవే దాచుకో
వేడుకయే నీకున్న యెడల విధమును నీకుండును
పాడుచేసుకొందువో కాపాడుకొందువో

పెట్టినట్టి సొమ్ములు పెట్టక పెట్టుచుంటి దినదినము
పెట్టినన్నాళ్ళును నేనివి పెట్టి మురియు వాడ
పెట్టెడి ఈవెఱ్ఱి కొకదినము పెట్టు కాలపాశము
అట్టే వీటిని విడచెదవో అన్నీ దాచుకొందువో

అన్నీ దాచుకొందువో యివి యనవసర మందువో
విన్నవించి చెప్పుటయే నా కున్న బాధ్యత
అన్నీ నీకే తెలియునుగా అందాలరామ నీ
కెన్ని కీర్తనాలంకారము లిచ్చినా తక్కువే

16, ఏప్రిల్ 2024, మంగళవారం

కదిలినాడు రాఘవుడు

హరిలీలయొ విధిలీలయొ అయోధ్యారాముడు
అరుగుచున్నాడు గదా అడవులకు నేడు

వదలి తలిదండ్రులను కదలినాడు రాఘవుడు

వదలి సింహాసనమును కదలినాడు రాఘవుడు

వదలి తన పురజనులను కదలినాడు రాఘవుడు

కదిలినాడు రాఘవుడు కానలకు రాముడు


వదలి సుఖభోగములను కదలినాడు రాఘవుడు

వదలని చిరునగవులతో కదలినాడు రాఘవుడు

మదగజ గమనంబుతోడ కదలినాడు రాఘవుడు

కదలినాడు రాఘవుడు కానలకు ధీరుడై


వదలి అంతఃపురంబును కదలినది సీతమ్మ

వదలి యత్తమామలను కదలినది సీతమ్మ

వదలక పతి యడుగుజాడ కదలినది సీతమ్మ

కదలినది సీతమ్మ కానలకు మగనితో


వదలి పత్ని యూర్మిళ నిట కదలినాడు లక్ష్మణుడు

వదలలేక తన యన్నను కదలినాడు లక్ష్మణుడు

వదలక నిజక్రోధమును కదలినాడు లక్ష్మణుడు

కదలినాడు లక్ష్మణుడు కానలకు భ్రాతతో


కదలిపోవు పురసిరితో కదలిపోయె పురమెల్ల

కదలిపోవు రామునితో కదలిపోయె పురమెల్ల

కదలిపోవు బిడ్డలతో కదలిపోయె పురమెల్ల

కదలిపోయె పురమెల్ల కానలకు వారితో