31, మార్చి 2021, బుధవారం

రామనామముద్రాంచితమైన రమ్యమైన ఒక పాట

రామనామముద్రాంచితమైన రమ్యమైన ఒక పాట
పామరులైనా పండితులైనా పరవశమందే పాట

పదముపదమున మధువులూరగ కదమును త్రొక్కే పాట
ముదమున సుజనులు కలసిపాడ మునుకొను నట్టి పాట
విదితయశుడు శ్రీరామచంద్రుని విజయము తెలిపే‌ పాట
ఇది కద పాట ఇంపగు పాటని ఎల్లరు పొగడే‌ పాట

అందరు కలిసి పాడే‌పాట అందమైన ఒక పాట
బృందారకసందోహమునకును వేడుకగొలిపే‌ పాట
చందమామకన్నను చల్లని జానకిపతిపై పాట
వందనీయుడు రామచంద్రుడు భళియని మెచ్చే‌ పాట

సాటిలేని శ్రీరామచంద్రుని చక్కగ పొగడే పాట
మేటిభావము తేటమాటల మెఱిసే చక్కని పాట
పాడరా ఓ సోదరా అట్టి పలుకులున్న ఒక పాట
ఆడవే ఓ చెల్లెలా ఆ అందాల పాటకు ఆట


22, మార్చి 2021, సోమవారం

ఇంకెవరున్నా రెల్లర కావగ

ఇంకెవరున్నా రెల్లర కావగ
శంకలేని నిను శరణుజొచ్చితి

నిలకడలేని చిలిపికోతులను
బలమగు సేనగ నిలిపిన వాడ
తలపడి దైత్యుల గెలిచిన వాడ
కలికి దొరకితిని కావగ రార

ఎవరిని నమ్మి యేమి లాభము
చివరకు నీవే జీవుల నెపుడును
భవసర్పపరిష్వంగమునుండి
ఇవల కీడ్చవలె నెప్పటి కైనను

భూవలయమున పుట్టినవారికి
దేవతలకును దేవేంద్రునకు
నీవే దిక్కని నేనెఱుగుదును
కావగ రావయ్య కరుణగలాడ


21, మార్చి 2021, ఆదివారం

గుడిలోని దేవుడివా

గుడిలోని దేవుడివా గుండెలోని దేవుడివా
అడిగినానని నీవేమీ అనుకోవద్దు

ధనవంతుల దేవుడివా గుణవంతుల దేవుడివా
మునిజనుల దేవుడివా జనులందరి దేవుడివా
అనుమానము తీర్చ రావయ్యా దేవుడా
మనసు తేటపరచ రావయ్య మంచి దేవుడా

కరుణగల దేవుడివా కష్టమెఱుగు దేవుడివా
వరములిచ్చు దేవుడివా బరువుబాపు దేవుడివా
మరి యెందుకు వినవు నా మాట దేవుడా
మరియాదను నిలుపరావయ్య మంచిదేవుడా

భక్తవరుల దేవుడివా భవరోగుల దేవుడివా
శక్తినిచ్చు దేవుడివా ముక్తినిచ్చు దేవుడివా
త్యక్తరాగుడను నన్ను తలచవేమి దేవుడా
రక్తితో కొలుతు నిన్ను రాముడా నాదేవుడా

రాఘవ రాఘవ

రాఘవ రాఘవ రాజలలామా

నీ ఘనతను పాడ నేనిట లేనా


ధీరవరేణ్యుడ వందురా అది తెలియని వా రుండ రందురా

వీరాగ్రణివని యందురా సరివీరులు నీకు లేరందురా

మారజనకుడ వందురా శతమన్మథాకృతి వీవందురా

కారుణ్యాంబుధి వందురా అటు కాదను వారు లేరందురా


జగదీశ్వరుడ వీ వందురా ముజ్జగముల పోషింతు వందురా

సుగుణాకరుడ వీ వందురా కడు సూక్ష్మబుధ్ధివి నీ వందురా

విగతరాగుడ వీ వందురా శుభవితరణశీలి వీ వందురా

సగుణబ్రహ్మాకృతి వందురా హరి చక్రాయుధుడ వీ వందురా


భక్తపాలకుడ వీ వందురా జనవంద్యచరితుడ వీ వందురా

భక్తితో సేవించు వారల భవ బంధములూడ్చెద వందురా

ముక్తిప్రదాత వీ వందురా నిను మ్రొక్కి తరించెద నందురా

శక్తి కొలది కీర్తింతురా ఇక జన్మము లేకుండ చేయరా


20, మార్చి 2021, శనివారం

రాముడా జానకీరాముడా

రాముడా జానకీరాముడా పట్టాభిరాముడా నన్నేలు రాముడా
రాముడా లోకాభిరాముడా కారుణ్యధాముడా నా శ్రీరాముడా

మ్రొక్కుబడి దండమును పెట్టిదేవున కేము మిక్కిలి సద్భక్తి పరుల మం చందురే
చక్కగా మనసులో నిక్కువంబుగ నేను సర్వాత్మనా నిను కొల్చుచుందునే
అక్కటా నేనేమొ భక్తిహీనుడనంట అరయ వీరన మహా భక్తులట రాముడా
వెక్కిరింతలు చేయు వీరిబారిన బడిన వేళ రక్షించుమో రాముడా రాముడా

అయిన వారు కానివార లందరును ననుగూర్చి అడ్దదిడ్దములనే పలుకుచున్నారయా
దయమాలి నీవేమొ మాటాడ కున్నావు తగునని నీకెట్లు తోచుచున్నదో
భయదములు హృదయశూలాయమానములగు పలుకులే నెటులోర్చి బ్రతుకుదును రాముడా
జయమొసగు వాడవని పేరున్న వాడవే జయమునా కొసగవే రాముడా రాముడా

పదునాల్గు లోకాలు పాలించువాడవే పతితపావనుడన్న బిరుదున్న వాడవే
నదులన్నిటిని సాగరము పొదవుకొనునట్లు నానాజీవులను చేర్చుకొందువే
మదిలోన నేకోరు నది నీకు తెలియదా మరి యేల యెఱుకలే దన్నట్టు లుందువో
ఇదినీకు పాడియే యెంత ప్రార్ధించినను ఇసుమంత వినవేమి రాముడా రాముడా


19, మార్చి 2021, శుక్రవారం

పట్టాభిరాముని నామము

పట్టాభిరాముని నామము - ఇది పతితపావననామము
పట్టుబట్టి ధ్యానించేవో ఆ పరమపదము నీ స్వంతము

సుజనుల హృదయము లందుండి ఇది శోభిల్లుచుండెడి నామము
కుజనుల బ్రతుకుల కన్నిటికి - ఇది కులిశము గానుండు నామము
ప్రజలకు ధర్మము బోధించి -ఇది రక్షించుచుండెడి నామము
విజయరాఘవుని నామము - ఇది విజయము లిచ్చే నామమము

కామారి మెచ్చిన నామము - ఇది కామము నణచే నామము
ప్రేమను పంచే నామము -ఇది వివేక మొసగే నామము
భూమిజనుల భవబంధముల -నిది ముక్కలుచేసే నామము
శ్యామలాంగుని నామము -ఇది శాంతము నొసగే నామము

దాంతులు కొలిచే నామము -ఇది ధర్మస్వరూపుని నామము
అంతోషములకు మూలము -ఇది జయశుభదాయక నామము
భ్రాంతుల నణచే నామము -ఇది రామచంద్రుని నామము
శాంతము నిచ్చే నామము -ఇది జానకిరాముని నామము

15, మార్చి 2021, సోమవారం

రామనామం రామనామం

రామనామం రామనామం భూమిని నింగిని మ్రోగే నామం
రామనామం రామనామం  రక్తిని ముక్తిని కూర్చే నామం

విన్నకొద్దీ వినాలనే ఒక వేడుకపుట్టే రామనామం
అన్నకొద్దీ అనాలనే ఒక ఆతృతపుట్టే రామనామం
అన్నా విన్నా మనసుల్లో వెన్నెలనింపే రామనామం
చిన్నా పెద్దా అందరికీ చేరువ యైన రామనామం

అందరిచెవులను వేయాలని ఆశపుట్టే రామనామం
అందరి కూడి పాడాలని ఆశ పుట్టే రామనామం
అందరి కోరికలను తీర్చే అద్భుతమైన రామనామం
అందరి బ్రతుకులు పండించే అద్భుతమైన రామనామం

గాలిపట్టికి బ్రహ్మపదాన్నే కరుణించినదీ రామనామం
నేలను చక్కగ ధర్మపధాన్ని నిలబెట్టినదీ రామనామం
వేలమందికి కైవల్యాన్ని వితరణచేసెను రామనామం
కాలాతీతం రమణీయం కమనీయం మన రామనామం

12, మార్చి 2021, శుక్రవారం

శ్రీరామనామం చేయండీ

శ్రీరామనామం చేయండి మీరు చింతలన్ని పారద్రోలండి

శ్రీరాముడే మీకు చేయందించగ ఘోరభవాంబుధి దాటండి


రామరామా యని రామనామము చేయ కామక్రోధములు కడబట్టును

రామరామా యని రామనామము చేయ రాలిపోవును పాపకర్మములు

రామరామా యని రామనామము చేయ రారు మీజోలికి యమభటులు

రామరామా యని రామనామము చేయ రాము డిచ్చును మీకు సద్గతులు


రామునకు సాటి దైవమే లేడని రామచంద్రుని నమ్మి కొలవండి

రామునకు సాటి దైవమే లేడని ప్రేమతో లోకాన చాటండి

రామునకు సాటి దైవమే లేడని భూమి నంద రెఱుగ చాటండి

రామునకు సాటి దైవమే లేడని రామకీర్తిని దెసల నించండి


శ్రీరామనామము చేసెడి వారల శీలము త్రైలోక్యసంపూజ్యము

శ్రీరామనామము చేసెడి వారిని చేరుదు రందరు దేవతలు

శ్రీరామనామము చేసెడి వారలు చెందరెన్నటికిని దుర్గతులు

శ్రీరామనామము చేసెడి వారలు చేరుట తథ్యము వైకుంఠము


11, మార్చి 2021, గురువారం

చేయండి చేయండి శ్రీరామనామం

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచు శ్రీరామనామం చేయండి
శ్రీరామ నామ భజనచేయుట లోన చెప్పలేని సుఖము కలదండి

చేయండి చేయండి శ్రీరామనామం చిత్తజగురుని శుభనామం
చేయండి చేయండి శ్రీరామనామం జీవిని రక్షించు శుభనామం
చేయండి చేయండి శ్రీరామనామం చిత్తశాంతిని కూర్చు శుభనామం
చేయండి చేయండి శ్రీరామనామం జేజేలు సేవించు శుభనామం

చేయండి చేయండి శ్రీరామనామం ఆ యముడి పీడయె వదలగను
చేయండి చేయండి శ్రీరామనామం మీ యింట శుభములు పండగను
చేయండి చేయండి శ్రీరామనామం చేయెత్తి జనులెల్ల మ్రొక్కగను
చేయండి చేయండి శ్రీరామనామం మీ‌యాశ లన్నియు తీరగను

చేయండి చేయండి శ్రీరామనామం చింతలన్నియు తీరి పోవగను
చేయండి చేయండి శ్రీరామనామం సిరులన్నియు వచ్చి వ్రాలగను
చేయండి చేయండి శ్రీరామనామం మాయలన్నియు చెదరిపోవగను
చేయండి చేయండి శ్రీరామనామం హాయి మీలో నిండిపోవగను

చేయండి చేయండి శ్రీరామనామం చేసెడి వారిదె భాగ్యమని
చేయండి చేయండి శ్రీరామనామం శివప్రీతి కరమైన నామమని
చేయండి చేయండి శ్రీరామనామం సీతమ్మ కది ప్రాణప్రదమని
చేయండి చేయండి శ్రీరామనామం చేసిన కలుగును మోక్షమని

10, మార్చి 2021, బుధవారం

చాలు రామనామమే చాలనరాదా

చాలు రామనామమే చాలనరాదా మాకు
మేలు రామభజనమే మేలనరాదా

చాలు రామనామమని మేలు రామభజనమని
యీలోకపు జనావళి కిదే చాటరాదా
నేల నాల్గు చెఱగులను నించి రామనామమును
నేల నింగి మ్రోయ భజన నెఱుపగ రాదా

ఈ రామనామమేగా హితకరమని యనరాదా
యీరేడు లోకంబుల నేలునన రాదా
దారుణభవదుఃఖహరము శ్రీరామనామమనుచు
నోరారా సత్యమే నుడువగ రాదా

నామమే నామ్నియనుచు నామ్నియే నామ మనుచు
రామనామమంటే శ్రీరాము డన రాదా
రామనామభజనపరులు రామునే పొందెదరని
రామభక్తియే మోక్షప్రదమన రాదా

5, మార్చి 2021, శుక్రవారం

వద్దేవద్దు

భగవంతుడా నీ పావననామము పలుకని నాలుక వద్దేవద్దు

నిగమవినుత నిను హాయిగ పొగడ నేర్వని నాలుక వద్దేవద్దు


ఊరుగాయలు కూర లూరక మెక్కుచు నుండెడు నాలుక వద్దేవద్దు

ఊరి జనులతోడ నిచ్చకములాడు చుండెడు నాలుక వద్దేవద్దు

వారి వీరిని పొగడి పొట్టకు పెట్టుచు బ్రతికెడి నాలుక వద్దేవద్దు

ధారాళముగ కల్ల బొల్లి కథలల్లుచు తనిసెడు నాలుక వద్జే వద్దు


అదికోరి యిదికోరి యందరు వేల్పుల నర్ధించు నాలుక వద్దేవద్దు

పదునైనమాటల పదుగుర నొప్పించు పాపిష్టి నాలుక వద్జేవద్దు

విదుల తప్పులనెంచి నిరతము పనిగొని ప్రేలెడు నాలుక వద్దేవద్దు 

మదిలోని విషమును మృదువాక్యముల గప్పు మాయల నాలుక వద్దేవద్దు


శ్రీరామభక్తులతో చేరి భజనలు చేయని నాలక వద్దేవద్దు

శ్రీరామచంద్రుని చక్కగ సన్నుతి చేయని నాలుక వద్దేవద్దు

శ్రీరామ యనుటకు సిగ్గుపడుచునుండు చిత్రపు నాలుక వద్దేవద్దు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచుండు సింగారి నాలుక ముద్దేముద్దుఅందమైన రామనామము

 అందమైన రామనామ మందుకోండి

సందడిగా రామభజన సాగించండి


రామ రామ రామ యని రసన రేగి పాడగా

ప్రేమమయుడు హరికై చెలరేగి యాడండి

రామనామ ప్రియులైన సామాన్యు లందరును

మీమీ యాటలపాటల మిగుల మురియగ


పగలు రేయి యను మాటను పట్టించుకొనకుండ

భగవంతుని సుగుణములను పరిపరి విధములుగ

సొగసుగా వర్ణించుచు సుందరాకారునకై

జగమెల్లను మెచ్చునటుల సంతోషముగా


ఆలస్యము దేని కండి యందుకోండి తాళములు

మీలో యొకడై మారుతి మీతో జతకలియగ

నేల మీద వైకుంఠము నిక్కముగ తోచగ

వైళమ సద్భక్త వరులు పాడగరండీ


శివదేవు డుపాసించు చిన్నిమంత్రము

శివదేవు డుపాసించు చిన్నిమంత్రము
భవతారకమైనట్టి పరమమంత్రము

పలుకునట్టి పెదవులపై కులుకుచు నీమంత్రము
తులలేని సంపదలే చిలకరించును
తలచునట్టి మనసులోన కులుకుచు నీమంత్రము
కొలువుదీర్చు నేవేళ కోదండరాముని

మునిమానసమోహనుని మోక్షప్రదాయకుని
కనులకు చూపించు నిది కాంక్షతీరగ
ధనధనేతరముల నిచ్చు దబ్బరమంత్రంబు
పనుయేమి మనికిదేను పరమమంత్రము

నిక్కువమగు మంత్రము నిరుపమాన మంత్రము
దిక్కుచూపు మంత్రము దివ్యమంత్రము
ఒక్కడగు పరమాత్ముని యొద్దజేర్చు మంత్రము
అక్కజమగు రామనామ మనెడు మంత్రము

 

3, మార్చి 2021, బుధవారం

చాలు రాము డొక్కని సాంగత్యము

చాలు రాము డొక్కని సాంగత్యము మనకు
చాలు రామనామ మనే సన్మంత్రము మనకు

చాలు రామకథామృతము శ్రవణసౌఖ్యమునకు
చాలు రామనామసుధ నాలుకలు తనియగ
చాలు రామని దర్శనము చక్షువులున్నందుకు
చాలు రామగుణగానము జన్మము తరింపగ

చాలు మనకు రామభక్త జనులతోడి నెయ్యము
చాలు మనకు రామక్షేత్ర సందర్శనభాగ్యము
చాలు మనకు రామధ్యాన సదాచార మొక్కటి
చాలు మనకు రాముని దయ జన్మ మెత్తి నందుకు

చాలు చాలు జననమరణ చక్రములో తిరుగుట
చాలు చాలు భయదసంసారజలధి నీదుట
చాలు చాలు నరులార చాలు మనకు రాముడు
చాల మంచివాడు వాని సంసర్గమె మోక్షము


2, మార్చి 2021, మంగళవారం

ఏమాట కామాట

 ఏమాట కామాటయే చెప్పవలెను

రామనామ మొకటే రక్షించును


రక్షించనేరవు ద్రవ్యనిధుల గనులు

రక్షించనేరవు రాజ్యాధికారాలు

రక్షించనేరరు రమణులు బిడ్డలును

రక్షించునే కాక రామనామము


పరమెట్లు లిచ్చును బహుగ్రంథపఠనము

పరమెట్లు లిచ్చును బహుదేవపూజనము

పరమెట్టు లిచ్చును బహుక్షేత్రదర్శనము

పరము రామనామము ప్రసాదించును


దీపముండగానే దిద్దుకో యింటిని

యూపిరుండగానే శ్రీపతిని వేడుము

ఆపకుండ చేయుమా హరి రామనామము

కాపాడు రామనామ ఘనత నిన్ను