20, మార్చి 2021, శనివారం

రాముడా జానకీరాముడా

రాముడా జానకీరాముడా పట్టాభిరాముడా నన్నేలు రాముడా
రాముడా లోకాభిరాముడా కారుణ్యధాముడా నా శ్రీరాముడా

మ్రొక్కుబడి దండమును పెట్టిదేవున కేము మిక్కిలి సద్భక్తి పరుల మం చందురే
చక్కగా మనసులో నిక్కువంబుగ నేను సర్వాత్మనా నిను కొల్చుచుందునే
అక్కటా నేనేమొ భక్తిహీనుడనంట అరయ వీరన మహా భక్తులట రాముడా
వెక్కిరింతలు చేయు వీరిబారిన బడిన వేళ రక్షించుమో రాముడా రాముడా

అయిన వారు కానివార లందరును ననుగూర్చి అడ్దదిడ్దములనే పలుకుచున్నారయా
దయమాలి నీవేమొ మాటాడ కున్నావు తగునని నీకెట్లు తోచుచున్నదో
భయదములు హృదయశూలాయమానములగు పలుకులే నెటులోర్చి బ్రతుకుదును రాముడా
జయమొసగు వాడవని పేరున్న వాడవే జయమునా కొసగవే రాముడా రాముడా

పదునాల్గు లోకాలు పాలించువాడవే పతితపావనుడన్న బిరుదున్న వాడవే
నదులన్నిటిని సాగరము పొదవుకొనునట్లు నానాజీవులను చేర్చుకొందువే
మదిలోన నేకోరు నది నీకు తెలియదా మరి యేల యెఱుకలే దన్నట్టు లుందువో
ఇదినీకు పాడియే యెంత ప్రార్ధించినను ఇసుమంత వినవేమి రాముడా రాముడా


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.