5, మార్చి 2021, శుక్రవారం

అందమైన రామనామము

 అందమైన రామనామ మందుకోండి

సందడిగా రామభజన సాగించండి


రామ రామ రామ యని రసన రేగి పాడగా

ప్రేమమయుడు హరికై చెలరేగి యాడండి

రామనామ ప్రియులైన సామాన్యు లందరును

మీమీ యాటలపాటల మిగుల మురియగ


పగలు రేయి యను మాటను పట్టించుకొనకుండ

భగవంతుని సుగుణములను పరిపరి విధములుగ

సొగసుగా వర్ణించుచు సుందరాకారునకై

జగమెల్లను మెచ్చునటుల సంతోషముగా


ఆలస్యము దేని కండి యందుకోండి తాళములు

మీలో యొకడై మారుతి మీతో జతకలియగ

నేల మీద వైకుంఠము నిక్కముగ తోచగ

వైళమ సద్భక్త వరులు పాడగరండీ


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.