5, మార్చి 2021, శుక్రవారం

వద్దేవద్దు

భగవంతుడా నీ పావననామము పలుకని నాలుక వద్దేవద్దు

నిగమవినుత నిను హాయిగ పొగడ నేర్వని నాలుక వద్దేవద్దు


ఊరుగాయలు కూర లూరక మెక్కుచు నుండెడు నాలుక వద్దేవద్దు

ఊరి జనులతోడ నిచ్చకములాడు చుండెడు నాలుక వద్దేవద్దు

వారి వీరిని పొగడి పొట్టకు పెట్టుచు బ్రతికెడి నాలుక వద్దేవద్దు

ధారాళముగ కల్ల బొల్లి కథలల్లుచు తనిసెడు నాలుక వద్జే వద్దు


అదికోరి యిదికోరి యందరు వేల్పుల నర్ధించు నాలుక వద్దేవద్దు

పదునైనమాటల పదుగుర నొప్పించు పాపిష్టి నాలుక వద్జేవద్దు

విదుల తప్పులనెంచి నిరతము పనిగొని ప్రేలెడు నాలుక వద్దేవద్దు 

మదిలోని విషమును మృదువాక్యముల గప్పు మాయల నాలుక వద్దేవద్దు


శ్రీరామభక్తులతో చేరి భజనలు చేయని నాలక వద్దేవద్దు

శ్రీరామచంద్రుని చక్కగ సన్నుతి చేయని నాలుక వద్దేవద్దు

శ్రీరామ యనుటకు సిగ్గుపడుచునుండు చిత్రపు నాలుక వద్దేవద్దు

శ్రీరామ శ్రీరామ శ్రీరామ యనుచుండు సింగారి నాలుక ముద్దేముద్దు



1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.