27, ఏప్రిల్ 2024, శనివారం

వందనశతసహస్రి

 


నీవు సుగుణభూషణుడవు నే నవగుణభూషణుడను

నీవు లోకవందితుడవు నేను లోకనిందితుడను

నీవు దేవదేవుడవును నేను సేవకాధముడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు దీనబాంధవుడవు నేను దీనతామూర్తిని

నీవు కృపాజలరాశివి నేను దుఃఖజలరాశిని

నీవు శాంతచిత్తుండవు నేను భ్రాంతచిత్తుండను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు జితక్రోధనుడవు నేను నిత్యక్రోధనుడను

నీవు సిరిని శాశింతువు నేను సిరిని ప్రార్ధింతును

నీవు ధర్మవర్తనుడవు నే నధర్మవర్తనుడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు పుణ్యచరిత్రుడవు నేను పాపచరిత్రుడను

నీవు రాగరహితుండవు నేను రాగమోహితుడను

నీవో విధివందితుడవు నేనా విధివంచితుడను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు సత్యవిక్రముడవు నే నసత్యవిక్రముడను

నీవు లోకపోషకుడవు నేను నీకు పోష్యుడను

నీవు భక్తవరదుండవు నేను నీకు భక్తుండను

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి


నీవు సకల మెఱుంగుదువు నే నెఱిగిన దొకటి లేదు

నీవు భవచికిత్సకుడవు నేను భవజ్వరార్తుడను

నీవు మోక్షవరదాతవు నేనిచట ముముక్షవును

నీవు చేకొనుము రామ నావందనశతసహస్రి




నేలకు దిగివచ్చిన


నేలకు దిగివచ్చిన ఓ నీలమేఘశ్యాముడా

వేలవేల దండాలివె విష్ణుదేవుడా 


బాలుడా పెరిగి పెద్దవాడ వగుట యెప్పుడు

ఆలములో రావణుని యంతుచూచు టెప్పుడు

మేలుచేయు టదెప్పుడు మేదినికిని మాకును

లీలామానుషవిగ్రహ బాలరాముడా


కాలుమోపు టది యెపుడు కాంతారములలోన

కాలుమోపు టెపుడు లంకాపురి పొలికలనులో

కాలున కా రావణుని కాను కిచ్చే దెప్పుడు

లీలామానుషవిగ్రహ బాలరాముడా


ఏలు టెప్పు డీధరను మేలుగా జనాళికి

కాలమునకు నిలిచెడు ఘనతచాటు టెప్పుడు

చాల భక్తవరదుడని జనులెరిగే దెప్పుడు

లీలామానుషవిగ్రహ బాలరాముడా


మక్కువతో చేయండీ

మక్కువతో చేయండీ చక్కని నామము
చక్కని నామము రామచంద్రుని నామము

సకలార్తినాశక మగు చక్కని నామము

సకలసుజనవినుత మైన చక్కని నామము

సకలదానవాహితమగు చక్కని నామము

సకలవరదు డైన రామచంద్రుని నామము


సర్వయోగివినుత మైన చక్కని నామము

సర్వరక్షాకర మైన చక్కని నామము

సర్వలోకముల నేలే చక్కని నామము

సర్వేశ్వరుడైన రామచంద్రుని నామము


సదమలమై వెలుగుచుండు చక్కని నామము

సదాముదాకరంబైన చక్కని నామము

సదాశివుడు జపముచేయు చక్కని నామము

వదలకండి శ్రీరామప్రభువు నామము

23, ఏప్రిల్ 2024, మంగళవారం

పురాకృతము ననుభవింప


పురాకృతము ననుభవింప పుట్టు దేహము

నరుని పాపపుణ్యముల బరువుమోయుచు


ఒక సంపద వచ్చిచేరు నొకనాటి పుణ్యఫలము

ఒక గర్వము వచ్చు నంత నొనగూడిన సిరిఫలము

ఒక పుణ్యము పండు టేమి యొక పాప హేతువేమి

ఇక నిన్నే మరచిపోయి ఎగురుటేమి రామచంద్ర


ఎగిరి యెగిరి దేహము పడి యిట్టే పుట్టు నవని మరల

తగని గర్వమునకు ఫలము తప్పకుండ పొందుటకు


ఒక రోగము వచ్చి పడెడు నొకనాటి పాపఫలము

ఒకటి కాని బాధల వలన నొనరు పశ్చాత్తాపము

ఒక పాపము పండు టేమి యొక దారి తోచుటేమి

ఇక నీవే దిక్కనుచు నెంచు టేమి రామచంద్ర 


పొగిలిపొగిలి దేహము పడి  పుట్టు నవని మీద మరల

తగుననుచును రామచింతన తప్పక కొనసాగగ

రామ్ రామ్ రామ్ హరి


రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్ హరి
    రామ్ రామ్ రామ్ హరి రామ్ రామ్ రామ్
రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్ జయ
    రామ్ రామ్ రామ్ జయ రామ్ రామ్ రామ్

శ్రీరఘురామ్ జయ సీతానాయక 
    శ్రీమద్దశరథనందన రామ్
నారాయణ సురవైరివీరగణ
    నాశనచణ సురతోషక రామ్

కారుణ్యాలయ కమలదళేక్షణ
    కౌసల్యాసుఖవర్ధన రామ్ 
నారాయణ బ్రహ్మాదిసుపూజిత
    నానామునిగణవందిత రామ్

మారజనక శతకోటిమన్మథాకార
    జలధరశ్యామల రామ్
నారాయణ సద్భక్తజనావన 
    జ్ఞానానందప్రదాయక రామ్

వారధిబంధన వీరకులేశ్వర 
    దారుణరావణఖండన రామ్
నారాయణ సంసారమహార్ణవ
    తారణకారణ జయజయ రామ్

21, ఏప్రిల్ 2024, ఆదివారం

రామ రామ

రామ రామ శివనుతనామ సీతారామ
రామ రామ జితశతకామ సీతారామ

రామ రామ రామ రఘురామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ ఘనశ్యామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ గుణధామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ మునికామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ శుభనామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ రణభీమ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ సార్వబౌమ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ ఆప్తకామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ పరంధామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ


రామ రామ రామ హరేరామ సీతారామ

రామ రామ రామ జయరామ సీతారామ



18, ఏప్రిల్ 2024, గురువారం

కరుణాలవాలుడవు శ్రీరామ


కరుణాలవాలుడవు శ్రీరామ 

    కరుణించి మమ్మేలు మిక నైన


కరిరాజవరదుడవు శ్రీరామ 

    కరిని బిడ్డను వోలె కాచితివి


సురరాజవరదుడవు శ్రీరామ 

    సురకార్యమును దీర్చ నెంచిచివి


మునిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించి దనుజుల గొట్టితివి 


ఖగరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి జటాయువు నపుడు


హరిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి సూర్యసుతు నపుడు


వరభక్తవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి విభీషణు నపుడు


గిరిరాజవరదుడవు శ్రీరామ 

    కరుణించితివి భద్రుని వేడ్క


హరి సత్యవరదుడవు శ్రీరామ 

    సరిసాటి నీకెవరు లేరయ్య



శ్రీరామచంద్ర నే సేవింతు


శ్రీరామచంద్ర నే సేవింతు నిన్నెపుడు
ఓరామచంద్ర నే నున్నదే నీకొఱకు

కువలయ నాయక నిన్ను కొలిచెదను మానకను
రవిసుతుని వలె నీకై ప్రాణము నే నిచ్చెదను
పవమానసుతుని వలె పాడెద నీ నామమును
శివుని వలెను నిత్యమును చేసెద నీ ధ్యానమును

నీసత్కీర్తిని నేను నిత్యమును చాటెదను
దాసుడనై నిన్నెపుడు తప్పక సేవించెదను
భాసురమౌ నీమహిమ వదలక నే పొగడెదను
వాసిగ నీ గుణరూపవర్ణనమే చేసెదను 

అడిగిన వన్నియు నిత్తు వందురురా నిన్నెపుడు
అడుగక నే నన్యముల నడుగుదురా మోక్షమును
కడువేగముగ నన్ను కరుణించు మికనైన
ఉడురాజముఖ నన్ను నడుపవయా నీపురికి 



17, ఏప్రిల్ 2024, బుధవారం

నీకిచ్చే సొమ్ములురా

నీకిచ్చే సొమ్ములురా నీవే దాచుకో
నా కాపని పెట్టకురా నావలన కాదు

నేడో రేపో పడిపోయే నేనెటుల దాచుదును
నేడు రే పను ప్రసక్తి లేని నీవే దాచుకో
వేడుకయే నీకున్న యెడల విధమును నీకుండును
పాడుచేసుకొందువో కాపాడుకొందువో

పెట్టినట్టి సొమ్ములు పెట్టక పెట్టుచుంటి దినదినము
పెట్టినన్నాళ్ళును నేనివి పెట్టి మురియు వాడ
పెట్టెడి ఈవెఱ్ఱి కొకదినము పెట్టు కాలపాశము
అట్టే వీటిని విడచెదవో అన్నీ దాచుకొందువో

అన్నీ దాచుకొందువో యివి యనవసర మందువో
విన్నవించి చెప్పుటయే నా కున్న బాధ్యత
అన్నీ నీకే తెలియునుగా అందాలరామ నీ
కెన్ని కీర్తనాలంకారము లిచ్చినా తక్కువే

16, ఏప్రిల్ 2024, మంగళవారం

కదిలినాడు రాఘవుడు

హరిలీలయొ విధిలీలయొ అయోధ్యారాముడు
అరుగుచున్నాడు గదా అడవులకు నేడు

వదలి తలిదండ్రులను కదలినాడు రాఘవుడు

వదలి సింహాసనమును కదలినాడు రాఘవుడు

వదలి తన పురజనులను కదలినాడు రాఘవుడు

కదిలినాడు రాఘవుడు కానలకు రాముడు


వదలి సుఖభోగములను కదలినాడు రాఘవుడు

వదలని చిరునగవులతో కదలినాడు రాఘవుడు

మదగజ గమనంబుతోడ కదలినాడు రాఘవుడు

కదలినాడు రాఘవుడు కానలకు ధీరుడై


వదలి అంతఃపురంబును కదలినది సీతమ్మ

వదలి యత్తమామలను కదలినది సీతమ్మ

వదలక పతి యడుగుజాడ కదలినది సీతమ్మ

కదలినది సీతమ్మ కానలకు మగనితో


వదలి పత్ని యూర్మిళ నిట కదలినాడు లక్ష్మణుడు

వదలలేక తన యన్నను కదలినాడు లక్ష్మణుడు

వదలక నిజక్రోధమును కదలినాడు లక్ష్మణుడు

కదలినాడు లక్ష్మణుడు కానలకు భ్రాతతో


కదలిపోవు పురసిరితో కదలిపోయె పురమెల్ల

కదలిపోవు రామునితో కదలిపోయె పురమెల్ల

కదలిపోవు బిడ్డలతో కదలిపోయె పురమెల్ల

కదలిపోయె పురమెల్ల కానలకు వారితో



15, ఏప్రిల్ 2024, సోమవారం

రామనామమే చేయుదము


రామనామమే చేయుదము రామనామమే చేయుదము
రామనామమే చేయుదము రయమున మోక్షము పొందుదము

రామనామమే పావనము రామనామమే జీవనము
రామనామమే జీవనము శ్రీరామనామమే చేయుదము

రామనామమే సుందరము రామనామమే శాశ్వతము
రామనామమే శాశ్వతము శ్రీరామనామమే చేయుదము

రామనామమే సురనుతము రామనామమే శివనుతము
రామనామమే శివనుతము శ్రీరామనామమే చేయుదము

రామనామమే వరప్రదము రామనామమే జయప్రదము
రామనామమే జయప్రదము శ్రీరామనామమే చేయుదము

రామనామమే శుభకరము రామనామమే సుఖకరము
రామనామమే సుఖకరము శ్రీరామనామమే చేయుదము

రామనామమే భయహరము రామనామమే భవహరము
రామనామమే భవహరము శ్రీరామనామమే చేయుదము

బాలుడై యున్నాడు భగవంతుడు


బాలుడై యున్నాడు భగవంతుడు సురల
మేలెంచి మది నిదే మేదిని జేరి

వరము లిచ్చు పని యేమో బ్రహ్మగారిది ఆ
వరములతో విఱ్ఱవీగు పని దైత్యులది ఆ
వరము లన్ని వమ్ము జేయు పని వెన్నునిది ఆ
హరి నేడు ధరపైన నవతరించినాడు

కామిత శుభ వరదు డైన శ్రీకాంతుడు సుర
కామిత మగు రావణ వధ ఘటియింపగను తమ
కామన లన్నియును తీర ఘనులు మునులకు శ్రీ
రాము డనగ ప్రభవించెను రవికులమందు

శ్రీరమారమణు డిదే చేరెను భువికి ఇక
శ్రీరమారమణి చేరు సీతగ నటకు ఆ
శ్రీరమారమణి తోడ నారాయణుడు దు
ర్వారవిక్రము డగు రావణు బాధ నణచును

13, ఏప్రిల్ 2024, శనివారం

రామగోవింద రామగోవింద


రామగోవింద రామగోవింద
శ్రీమన్నారాయణ రామగోవింద

కామితార్ధదాయక రామగోవింద
కలికల్మషనాశక రామగోవింద

దైత్యసంహారక రామగోవింద
దారుణభవవారక రామగోవింద

భక్తజనపోషక రామగోవింద
పతితజనోధ్ధారక రామగోవింద

అవనిజాసత్కళత్ర రామగోవింద
అకళంకసచ్చరిత్ర రామగోవింద

నిరవద్యగుణశీల రామగోవింద
పరిపంధిజనకాల రామగోవింద

ప్రజ్ఞానఘనరూప రామగోవింద
ప్రత్యక్షపరబ్రహ్మ రామగోవింద

కామవైరిసన్నుత రామగోవింద
ప్రేమామృతాంబోధి రామగోవింద

వనజాయతేక్షణ రామగోవింద
మునిమోక్షవితరణ రామగోవింద


ఆనంద మానంద మాయెను


ఆనంద మానంద మాయెను శ్రీరామ

నీ నామము నందు నాకు నిష్ఠ కుదిరెను


ఏనామము వేదాంతుల యెంపికలో బ్రహ్మమో

ఏనామము మౌనీంద్రులు మానక జపియింతురో

ఏనామము యోగీంద్రులు ధ్యానించుచు నుందురో

ఆనామము  నాకబ్బిన దీనాటికి నీదయచే


ఏనామము నిరంతరము నిలాసుత జపించునో

ఏనామము మరుతాత్మజు డింపుగా భజించునో

ఏనామము శివదేవుని హృదయము నందుండునో 

ఆనామము నందు నిష్ఠ యమరెను నీదయచే


ఏనామము భయశోకము లిట్టే తొలగించునో

ఏనామము రిపుషట్కము నిట్టే యణగించునో

ఏనామము భవాంబోధి నిట్టే దాటించునో

ఆనామము నాకు కలిగె నయ్యా నీదయచే



చాలు చాలు నీభాగ్యము

చాలు చాలు నీభాగ్యము సర్వేశ్వర రామ న
న్నేలు సీతాపతి రామ యింతే చాలు

చేతులార నీకు పూజ చేసుకొనెడి భాగ్యము సం
ప్రీతిగ నీనామములను పిలిచి మురియు భాగ్యము ప్ర
ఖ్యాతిగలుగు నిన్ను గూర్చి యాలపించు భాగ్యము ఓ
సీతాపతి నీవు నాకు సిధ్ధింపగ జేయవే

తలపులలో నిన్ను నింపి ధన్యుడనగు భాగ్యము నా
పలుకులలో నిన్ను నింపి పులకరించు భాగ్యము  ని
ర్మలమగు నీ సత్కీర్తిని మహిని చాటు భాగ్యము ఇన
కులనాయక నాకు నీవు కూరిమితో నీయవే

పురుషోత్తమ నిన్ను దప్ప పొగడకుండు భాగ్యము సం
బరమున నాకన్నుల నిను బడయగలుగు భాగ్యము నీ
పురమున స్థిరవాసము నేపొందగలుగ భాగ్యము శ్రీ
హరి రఘునాయక నా కతిముదమున నీవే

12, ఏప్రిల్ 2024, శుక్రవారం

హరిగతి రగడ


హరి యెచ్చట గల డందురు కొందరు
    హరి యెచ్చట లేడందురు కొందరు

హరితో పనియే మందురు కొందరు
    హరియే లేడని యందురు కొందరు

హరినే నమ్ముదు మందురు కొందరు
    హరినే కొలిచెద మందురు కొందరు

హరి కరుణామయు డందురు కొందరు
    హరి వరదాయకు డందురు కొందరు

హరియే దైవం బందురు కొందరు
    హరియే బ్రహ్మం బందురు కొందరు

హరియే ప్రధముం డందురు కొందరు
    హరియే తుది మొద లందురు కొందరు

హరియే యఖిలం బందురు కొందరు
    హరి కన్యము లేదందురు కొందరు

హరి యజ్ణేశ్వరు డందురు కొందరు
    హరి పరమేశ్వరు డందురు కొందరు

హరి లోకేశ్వరు డందురు కొందరు
    హరి యోగీశ్వరు డందురు కొందరు

హరి వేదమయుం డందురు కొందరు
    హరియే వేద్యుం డందురు కొందరు

హరియే కాలాత్మకు డందురు కొందరు
    హరి మాయామయు డందురు కొందరు

హరి త్రిజగత్పతి యంందురు కొందరు
    హరి జీవేశ్వరు డందురు కొందరు

హరి సర్వేశుం డందురు కొందరు
    హరి యన్నిట గల డందురు కొందరు

హరి విశ్వాత్మకు డందురు కొందరు
    హరియే విశ్వం బందురు కొందరు

హరి కడ చేరుదు రార్తులు కొందరు
    హరిని గొలుతు రర్ధార్ధులు కొందరు

హరిని జేరు జిజ్ణాసులు కొందరు
    హరి వారగు మోక్షార్దులు కొందరు

హరిపూజలు మేలందురు కొందరు
    హరినామము చాలందురు కొందరు

హరి యందరి వా డందురు కొందరు
    హరి మావాడని యందురు కొందరు

హరియే రాముం డందురు కొందరు
    హరియే కృష్ణుం డందురు కొందరు

హరియే శివుడని యందురు కొందరు
    హరిహరు లొకటే నందురు కొందరు

హరి హరి హరి యని యందురు కొందరు
    హర హర హర హర యందురు కొందరు

హరి ధ్యానించును హరు నెల్లప్పుడు
    హరుడును చేయును హరికై ధ్యానము

హరి హరులను ధ్యానించెడు వారికి
     ఇరువురు నొకటను యెఱుక రహించును

హరి హరి యన్నను హర హర యన్నను
    పరమపదమునే బడయుదు రందరు


10, ఏప్రిల్ 2024, బుధవారం

నరసింహ నరసింహ


నరసింహ నరసింహ నరసింహ బహు

    కరుణామయుడ వీవు నరసింహ


పద్మకేసరవర్ణ నరసింహ నీవు

    బంగారుతండ్రివే నరసింహ

పద్మనాభుడ వయ్య నరసింహ నాకు

     పరమసులభుడ వైన నరసింహ


జడుడను నన్నేల నరసింహ నీవు

    వడివడిగ వచ్చితివి నరసింహ

అడుగకయ దరిసెనము నరసింహ నాకు 

    కడు దయ నిచ్చితివి నరసింహ


పగటి నిద్దురలోన.నరసింహ నీవు

    ప్రత్యక్ష మైనావు నరసింహ

జగమేలు నీయాన నరసింహ నాకు

    ద్విగుణ మాయెను భక్తి నరసింహ


నీవు తోచిన దాది నరసింహ రాము

    డావహించెను నన్ను నరసింహ

నీవు నడిపించగను నరసింహ రామ

     దేవుని కీర్తించెద నరసింహ

 


మంగళ మనరే

మంగళ మనరే మన రామయ్యకు 
    మహి కేతెంచిన వెన్నునకు
మంగళ మనరే మన సీతమ్మకు 
    మంగళదేవత శ్రీరమకు

మంగళ మనరే ముల్లోకంబుల 
    మసలుచు నుండెడి సుజనులకు
మంగళ మనరే సీతారాముల 
    మరువుజొచ్చు నిజభక్తులకు
మంగళ మనరే సీతారాముల 
    మహిమనెఱింగిన విబుధులకు
మంగళ మనరే సీతారాముల 
    మదిలో దలచెడు వారలకు

మంగళ మనరే రామభజనలను 
    మానక చేసెడు మాన్యులకు
మంగళ మనరే రామభక్తి నిల 
    మరిమరి చాటెడు భక్తులకు
మంగళ మనరే రాముని భక్తుల 
    సంగతి నుండెడు సుజనులకు
మంగళ మనరే రాముని మోక్షము 
    మాత్రము వేడెడు సుకృతులకు

9, ఏప్రిల్ 2024, మంగళవారం

చిత్తమా పొగడవే శ్రీరాముని


చిత్తమా పొగడవే శ్రీరాముని

చిత్తజుని గురుడైన శ్రీరాముని


శ్రీరఘువల్లభుడగు శ్రీరాముని

సీరధ్వజు నల్లుని శ్రీరాముని

వారిజాక్షుని హరిని శ్రీ‌రాముని

చేరి యణకువ తోడ శ్రీరాముని


ఆరావణాంతకుని శ్రీరాముని

భూరిభుజశాలియగు శ్రీరాముని

మారవైరినుతు డగు శ్రీరాముని

దారిద్ర్యశమనుడగు శ్రీరాముని


ధారాధరశ్యాముని శ్రీరాముని

భూరికృపాశాలిని శ్రీరాముని

నారాయణు డైనట్టి శ్రీ‌రాముని

కోరి యపవర్గమును శ్రీరాముని