18, జులై 2024, గురువారం

తెలియని తీరం


తెలియని తీరం చేరగ బోయే
దిక్కుమాలిన పడవకి
తెలిసీతెలియని నావికుడి అతి
తెలివితేటలే దిక్కట

తోడుపడెదమని ఓడ నెక్కిరి
తోడుదొంగలై ఆరుగురు
వేడుకతో వారు ఓడకళాసును
వెఱ్ఱివానిగా చేసిరి
పాడుదారులను పోవుచు నున్నది
ఓడ వారికే లోబడి
ఓడ తీరమును చేరుటెన్నటికి
నుండని దాయె పరిస్థితి

ఎంతో కాలము భవసంద్రాన
యిటు నటు సాగిన దాపడవ
చింత మెండాయె జీవి కళాసున
కెంతకు తీరము కనబడక
ఎంతకాలమని యిటునటు పోయే
దంతు లేని యీ సంద్రమున
ఇంతకు నీయారుగురికి దారేదీ
సుంతైన తెలియమి యెఱుకాయె


అందాలనౌక అతిపెద్దనౌక
అటువైపుగా నొకటి వచ్చెనదే
ఎందుకు వచ్చిన పడవప్రయాణ
మిందుచేరమని చేజాచి
సుందరాకారుడు శ్రీరాము డనువాడు
తొందరించుచు పిలువగనే
అందరు దొంగలు సంద్రాన దూకిరి
ఆపడవ వాడెక్కె నానౌక


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.