28, డిసెంబర్ 2021, మంగళవారం

సేవించే మాకు శుభములీవయ్య సీతారామ

సేవించే మాకు శుభము లీవయ్య సీతారామ
నీవారమే కాదా నిరుపమగుణధామ

రాగము ద్వేషమున్న ప్రాణులమయ్య మేము
బాగొప్ప నీసేవ పచరించుచున్నాము
ఆగక మానాల్క లన్నియు చాలా యను
రాగముతో బల్కు రామా నీ నామమును

మామంచిచెడు లెఱుగు మంచి వాడవు నీవు
మామీద కరుణకల మాదేవుడవు నీవు
రామయ్య నినునమ్మి మేముంటి మిక నీవు
తామసహరణ దశరథాత్మజ కావవయ్య

కలికి మే మూడిగము సలుపుట కల్లమాట
కలిని మే మెదిరించ గలుగుట యును కల్ల
కలియు నిన్నెదిరించ గలవాడా రఘురామ
కలిని నీ వణగించి కాపాడ వలయును


27, డిసెంబర్ 2021, సోమవారం

రారా శ్రీరామా రారా జయరామా

రారా శ్రీరామా రారా జయరామా
రారా మమ్మేల రారా రఘురామా

రఘువంశ గగనమందు రాజిల్లు రవివి నీవు
రఘువంశ మనెడు క్షీరాభ్దికి చంద్రుడ వీవు
రఘువంశ కులగిరికి రమ్యశిఖరమవు నీవు
రఘువంశ పావన శ్రీరామా రాజీవనయన 
 
నీనామ మొకటే‌ కద నిచ్చలు శ్రీహరు డెంచు
నీనామ మొకటే‌ కద నిరతము మారుతి పలుకు
నీనామ మొకటే‌ కద మా నాలుకలపై నుండు
నీ‌నామ మొకటే కద నిఖిల జగతికి రక్ష 

శ్రీరామా శ్రీరామా ఘోరభవనాశన నిపుణ
శ్రీరామా శ్రీరామా శ్రేయోవివర్ధన నిపుణ
శ్రీరామా శ్రీరామా చింతితార్ధ దాన నిపుణ
శ్రీరామా శ్రీరామా క్షిప్రఫల వితరణ చణ
 

24, డిసెంబర్ 2021, శుక్రవారం

తెలంగాణాలో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధు లందరూ పాస్!


తెలంగాణా ప్రభుత్వ విద్యాశాఖ వారు మంచి నిర్ణయం‌ ఒకటి ప్రకటించారు. ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం పరీక్ష వ్రాసిన విద్యార్ధు లందరూ పాస్ అని ప్రకటించారు. ఈ విషయం ఇప్పుడే పత్రికల్లో వచ్చింది.  ఈనాడులోనూ, అంధ్రజ్యోతిలోనూ, సాక్షిలోనూ చూసాను. ఇంకా అన్ని పేపర్లలోనూ వచ్చే ఉంటుంది.

దురదృష్టవశాత్తూ యీ నిర్ణయాన్ని చాలా ఆలస్యంగా ప్రకటించారు.

విద్యాశాఖ మంత్రిణి గారికి ఒక విన్నపం. అందర్నీ పాస్ చేసి మంచిపని చేసారమ్మా. కొందరు విద్యార్దినీవిద్యార్ధులు ఈఫలితాలకు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు పాపం. దయచేసి వాళ్ళందరికీ మీరంతా పాసయ్యారర్రా అని చెప్పేసి వెనక్కి తీసుకొని వచ్చి వాళ్ళవాళ్ళ అమ్మానాన్నలకు అప్పగించండి. మీకు చాలా పుణ్యం ఉంటుంది.

ఎన్ని పేపర్లు ఉండలీ‌ పరీక్షల్లో అన్న విషయం మీరు ముందుచూపుతో ఆలోచించారో లేదో‌ నాకు తెలియదు.
 
పాపం వాళ్ళ చదువులు కరోనాకాలం చదువులు ఐపోయాయే, కాస్త సులభంగా ఉండాలీ పేపర్లు అన్న మార్గదర్శక సూత్రం ఏమన్నా చేసారేమో ముందుచూపుతో అన్నది తెలియదు. ఒకవేళ అలాంటిది చేసి ఉంటే సగానికి పైన అభ్యర్దులు ఫెయిల్ అయ్యేవారు కారేమో కదా. ఒకవేళ మీరు తగినంత సులభం చేయలేదేమో మరి.

పోనీ ఏదో‌ లెక్కలు వేసి పరీక్షలు నిర్వహించారు సరే, వాటి పర్యవసానంగా ఫెయిల్ ఐన వాళ్ళే హెచ్చు పాసయిన వారి కంటే అని అధికారవర్గాలు ప్రభుత్వదృష్టికి తీసుకొని వెళ్ళాయేమో తెలియదు. ఒకవేళ వారు ఫలితాలను విడుదల చేయటానికి ముందుగా,  ఆపని చేసి ఉన్నపక్షంలో, ఈ విద్యార్దుల ఆత్మహత్యలు ఇన్ని ఉండేవి కావేమో అని అనుమానం.

పోనివ్వండమ్మా, ఐనదేదో ఐపోయింది.
 
మీరు ఫలితాలను సరిదిద్ది, అందరినీ పాస్ చేసారు. సంతోషం.

అందుచేత మీరు దయచేసి ఆచనిపోయిన విద్యార్ధినీవిద్యార్ధులనూ మళ్ళీ మనమధ్యకు తీసుకువచ్చి మీదిద్దుబాటును సమగ్రం చేసుకోండి.

21, డిసెంబర్ 2021, మంగళవారం

దానవేంద్రవైరి యడుగో ధరణిజాసమేతు డడిగో

దానవేంద్రవైరి యడుగో ధరణిజాసమేతు డడిగో
మానవాధిపేంద్రు డడిగో కానవచ్ఛేను

ముందట బెత్తాలవారదె మోదముతో నడచుచుండ
చందురునకు మించి చాలా చక్కనివాడు
వందారుసద్భక్తమందారుడైన దేవుం 
డందరివాడు రాము డల్లదే కనుడీ

సంద్రమునే కట్టి సమరంబున దాన
వేంద్రునే పట్టి చాలవిధములుగ గొట్టి
యింద్రాదు లరయ జంపి యినకులేశుడు మాన
వేంద్రుం డైనట్టి రాముడు వేంచేసె కనుడీ

మ్రొక్కరే రావణుని పీడ తుక్కుచేసిన పతికి
మ్రొక్కరే దేవతలు మున్నే మ్రొక్కి రితడికి
మ్రొక్కరే మన నేలవచ్చిన మూడులోకముల నేలు
చక్కనయ్యకు స్వామి వచ్చిన చల్లనివేళ17, డిసెంబర్ 2021, శుక్రవారం

అహ్వానం.

వరాహమిహురుడి పంచసిధ్ధాతిక గ్రంథానికి తెలుగులో వ్యాఖ్యానం వ్రాస్తున్నాను.

ఈ వ్యాఖ్యానం ఒక ప్రైవేట్‌బ్లాగ్ రూపంలో ఉంటుంది కాబట్టి అందరకూ బహిరంగంగా కనబడదు. 

భారతీయఖగోళశాస్త్రవిజ్ఞానం గురించి ఆసక్తి ఉన్నవారు ఈ వ్యాఖ్యానాన్ని నిర్మాణదశనుండి అనుగమించవచ్చును. 

ఆసక్తి ఉన్నవారు తమ పేరూ, ఇ-మెయిల్ వివరాలను ఈటపాకు ఒక కామెంట్ రూపంలో పంపవచ్చును. ఈకామెంట్లను పబ్లిష్ చేయటం జరుగదు. కాని, అలా చేరిన వారికి నేరుగా ఆ బ్లాగునుండి ఆహ్వానం విడిగా అందుతుంది.

కేవల‌ కాలక్షేపం కోసం ఎవరూ ఈవ్యాఖ్యానం కోసం చేరవద్దని మనవి. ఎవరన్నా ఆబ్లాగులో చేరి అనుచితమైన వ్యాఖ్యలను చేసిన పక్షంలో అక్కడినుండి తొలగించబడతారని గ్రహించండి. ఈవిషయంలో మొగమాటం ఉండదు.

ఇది చాలా సీరియస్ సబ్జక్ట్ ఐనా సరే సాధ్యమైనంతగా సులభంగా బోధపడేలా రచించటం‌ జరుగుతోంది.

గణితం అంటే గాభరా ఉన్నవారికి ఇది మరీ అంత సుకరం‌ కాకపోవచ్చును. కాని హైస్కూలు విద్యార్ధులు కూడా సులభంగా దీనిని అర్ధం చేసుకొనేలా వ్రాస్తున్నాను.

16, డిసెంబర్ 2021, గురువారం

హరిప్రీతిగ నీవేమిచేసినా వన్నది మాకు చెప్పవయా

హరిప్రీతిగ నీవేమిచేసినా వన్నది మాకు చెప్పవయా
హరి నిన్నఱసి సంతోషించుట యన్నది చాలా ముఖ్యమయా

విద్యలనేర్చితి విషయములెఱిగితి విత్తము లే నార్జించితిని
గద్యపద్యములు కవితలనల్లితి కవిగౌరవమును పొందితిని
విద్యలసంగతి శేముషిసంగతి విత్తముసంగతి విడువుము నీ
వుద్యమించి హరిప్రీతిగ చేసిన దుండిన దానిని చెప్పవయా

మేడలుమిద్దెలు భూములుపుట్రలు మెండుగ సంపాదించితిని
వేడుకతో నావారికి చక్కగ విలాసములు సమకూర్చితిని
వేడుకమీఱగ మేడలు కట్టిన విషయము ప్రక్కన పెట్టవయా
ఆడంబరములు కావు నీవు హరికర్పణముగ చేసినదేమి

దర్పముమీఱగ చేసితి నెన్నో దానధర్మములు పూజలను
అర్పించితి బహుదైవంబుల కత్యార్భాటముగా ముడుపులను
అర్పించక శ్రీహరికి నీమనసు ఆదానాదులు వృథావృథా
దర్పము విడచి దశరదసుతుని దయ నికనైనను వేడవయా


ఘనుడు మన రాముడు ఘనుడు మన లక్ష్మణుడు

ఘనుడు మన రాముడు ఘనుడు మన లక్ష్మణుడు
ఘనశీలవతి మన జనకాత్మజ

మునిరాజు విశ్వామిత్రుని యాగమును కావ
దనుజుల దండించె మన రాముడు
అనలాక్షు పెనువింటి నవలీల ఖండించి
జనకసుతను బడసె మన రాముడు

తన యగ్రజుని వెంట జని యాగమును కాచి
మునుల మెప్పు పొందె మన లక్ష్మణుడు
జనకున పనుపున వనులకు జను యన్న
వెనువెంట నడచెను మన లక్ష్మణుడు

తనమగని వెన్నంటి వనవాస క్లేశం
బును పొందె సంతోషముగ జనకజ
వనినున్న తనను రావణు డపహరించ నా
తని వంశ మణగించె ధరణీసుత

మన రామలక్ష్మణుల ఘనవిక్రమమున రా
వణు డంతరించె దేవతలు ముఱియ
జనకజాలక్ష్మణ సహితుడై రాముడు
తన నిజపురికేగి ధరణి నేలె


15, డిసెంబర్ 2021, బుధవారం

కథాసంవిధానం.


కథ అన్నాక దానిని నడిపేవిధానం కథ అంత ముఖ్యంగానూ ఉంటుంది. ఒక కథను అనేకులు విడివిడిగా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా తమకు తోచినట్లు తాము వ్రాసారు అనుకోండి. అప్పుడు వార‌ందరూ అదే కథనే‌ చెప్పినా దానిని చెప్పే విధానం ఎవరిది వారికి ప్రత్యేకంగానే ఉంటుంది కదా. కథను నిర్మించే విధానాన్ని మనం సంవిధానం అందాం. ఈసంవిధానం ఎన్ని రకాలుగా ఉండవచ్చునూ‌ అన్నది నిజానికి మనం లెక్కించను కూడా వలనుపడదు.

ఒక ఉదాహరణను తీసుకుందాం. అందరికీ తెలిసిన ఒక కథ ఉన్నది. దానిపేరు రామాయణం. ఈ రామాయణకథకు మనకు ఆధారగ్రంథం వాల్మీకి మహర్షి సంస్కృతభాషలో రచించిన శ్రీమద్రామాయణం. ఈ రామాయణం లోని కథ కల్పితమా లేక చారిత్రకమా అన్నది ఈరోజున చర్చల్లో తేలే‌ అంశం‌ కాదు.

ఒక్క విషయం మాత్రం ముఖ్యంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. రామాయణం కల్పితకథ ఐనపక్షంలో ఆకథ గురించీ ఆకథలోని పాత్రల గురించీ వాల్మీకిమహర్షి చెప్పినదే‌ ప్రమాణం. ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూ‌కథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో‌ మరింతమంచిదనో‌ మాట్లాడకూడదు. ఒకవేళ రామాయణకథ చారిత్రకం అనుకుంటే, ఆకథను మొదట గ్రంథస్థం చేసినవ్యక్తి వాల్మీకి మహర్షి. ఆకారణంగా కూడా ఆయన రామాయణాన్ని తప్పుపడుతూ మనం ఆపాత్రలనూ‌కథనూ మార్చి మన వెర్షన్ మాత్రమే సరైనదనో‌ మరింతమంచిదనో‌ మాట్లాడకూడదు. అలా రెండువిధాలుగానూ వాల్మీకి రామాయణాన్ని తప్పుపట్టటమో లేదా దానికి మనకు తోచిన మెఱుగులు దిద్దటమో అసమంజసం.

ఐనా సరే అనాదిగా కవులూ నేటి ఆధునికులూ కూడా రామకథను తమకు తోచిన రీతిలో‌ తాము చెబుతూనే‌ ఉన్నారు. ఈ‌చెప్పే‌వాళ్ళు రెండు రకాలు. ఒకరకంవారు సంస్కృతంలో ఉన్న శ్రీమద్వాల్మీకి రామాయణాన్ని దేశభాషల్లోని తెచ్చి మరింతమందికి అందుబాటులోనికి తేవాలని ఆశిస్తూ ఉంటారు. వీరుమరలా మూలాన్ని అనుసరించి ఉన్నదున్నట్లు వ్రాయాలనుకునే వారూ, తమప్రతిభను ప్రదర్శిస్తూ కొత్తకొత్త సంగతులు చేర్చి వ్రాద్దామనుకునే వారూగా రెండు రకాలుగా ఉన్నారు. రామాయణకథను మళ్ళా చెప్పటంలో వేరేవేరే‌ ఉద్దేశాలు మనసులో‌ ఉంచుకొని కథను తదనుగుణంగా చెబుతూ వాల్మీకాన్ని కావాలని అతిక్రమించి వ్రాసే వారు రెండవరకం - వీరిలో వాల్మీకాన్ని తిరస్కరించి వ్రాసే వారూ బహుళంగా కనిపిస్తున్నారు. ఇలా తిరస్కరించి దురుద్దేశంతో రామకథను వక్రీకరించే వారిని మినహాయిస్తే ఆకథ సకారణంగా సగౌరవంగా మరలా చెప్పేవారిని తప్పుపట్టుకోవలసిన పనిలేదు.

ఈ రామకథను పునఃపునః చెప్పిన వారిలో ఎవరి ప్రత్యేకత వారిదే కదా. ఇప్పటికీ రామాయణాన్ని కవులు మళ్ళామళ్ళా చెబుతున్నారూ అంటే‌ కథాసంవిధానం అన్నది అనంత విధాలుగా చెయ్యవచ్చును అనటానికి మనకు ప్రత్యేకంగా ఋజువులు అవసరం లేదు.

ఒక రామకథనో ఒక భారతకథనో మనం మనదైన ఆలోచనతో మనదైన శైలిలో వ్రాయాలంటే అందులో కొంత సౌలబ్యం ఉంది. ఆ సౌలభ్యానికి కొన్ని కారణాలున్నాయి.

 • కథ మొత్తం మనకు ఆమూలాగ్రం మనస్సుకు చాలా స్పష్టంగా విదితంగా ఉండటం. 
 • కథలోని పాత్రల పేర్లూ, స్వభావాలూ పాత్రల మధ్య సంబంధబాంధవ్యాలూ స్నేహవైరాల విషయంలో చాలా మొదటినుండే చాలా స్పష్టత ఉండటం. 
 • కథలోని ముఖ్యఘట్టాల నుండి చిన్నచిన్న సంఘటన వరకూ వాటి క్రమమూ ప్రాథాన్యత గురించి సంపూర్ణమైన అవగాహన ఉండటం. 
 • కథలో‌ ప్రస్తావనకు వచ్చే‌ ప్రదేశాలూ వస్తువుల వంటి వాటి అవసరమూ ప్రయోజనమూ గురించి బాగా తెలిసి ఉండటం.

కేవలకల్పనాకథలు కృత్రిమరత్నములు అన్నాడొక కవి. అద్యసత్కథలు వావిరిబట్టిన జాతిరత్నములు అని కూడా అన్నాడాయన. ఆయనకో నమస్కారం పెట్టి కల్పించి ఒక పెద్దకథను చెప్పటం ఒక కత్తిమీద సాము అన్నది విన్నవించక తప్పదు. మీరొక కథను కల్పించి వ్రాసే పక్షంలో పైన చెప్పిన ఏకారణాల వలన రామాయణాదులు సులభంగా కథితం చేయగలుగుతున్నారో ఆకారణాలు మీరు వ్రాయబోయే కొత్తకథకు కూడా అంత చక్కగానూ వర్తించాలి. అప్పుడే మీరు మంచి సంవిధానంతో మీకథను చెప్పగలరు.

అదంత సులభం‌ కాదు. మొత్తం అంతా వ్రాసేద్దామన్న అత్యాశ వదలుకొని ఒక ప్రణాళిక ప్రకారం వ్రాయటం చేయాలి. 

మొదటిదశ

 • క్రమంగా మీ కథను అభివృధ్ధి చేయాలి. అంటే ముందుగా మీరు వ్రాయదలచుకొన్న కథను సంక్షిప్తంగా వ్రాయాలి. కొద్ది పేజీల్లోనే‌ అది పూర్తి కావాలి. అది స్పష్టంగా చెప్పటం ఒకపట్టాన కుదరదని గుర్తుంచుకోండి. పెద్దకథ అని అనుకున్నప్పుడు అది తృప్తికరంగా క్లుప్తంగా వ్రాయటం కూడా ఒక సవాలే. ఒకటి కాదు పదిసార్లు చిత్తుప్రతిని వ్రాయవలసి రావచ్చును. 
 • ఇప్పుడు మీరు పూర్తి చేసిన సంక్షిప్తకథలో ఉపకథలు ఎక్కడెక్కడ వచ్చేదీ గుర్తించండి. ఉపకథలను విడివిడిగా అభివృధ్ధి చేయండి.  
 • ఇలా ఉపకథలకు కూడా ప్రధానకథకు చేసినట్లుగానే సంక్షిప్తప్రతులను చేయాలి. మరలా ఆఉపకథలలో కూడా రెండవస్థాయి ఉపకథలుంటే ఇలాగే అభివేధ్ధి చేయాలి. ఇలా ఎంతలోతుగా పోవవలసి వస్తుందీ అన్నది మీ‌కథను బట్టి ఉంటుంది. 
 • అట్టడుగు స్థాయి ఉపకథలను పూర్తి చేసిన తరువాత దాని పైస్థాయి ఉపకథను పూర్తి చేయగలుగుతారు. ఓపిక చాలా అవసరం. తొందరపడితే‌ మీరు త్వరగా గందరగోళంలో పడిపోయే‌ ప్రమాదం ఉంటుందని మరవవద్దు. ఇలా అడుగుస్థాయి నుండి పైస్థాయి దాకా ఒకసారి అభివృధ్ధి చేసిన తరువాత, మీ‌కథకు ఒక స్వరూపం అంటూ‌ వస్తుంది. 
 • అప్పుడే ఐపోలేదు. ఈ‌ప్రతిని సునిశితంగా పరిశీలించాలి. పాత్రల పేర్లూ స్వభావాలూ, సంబంధాలూ, ప్రదేశాలూ, కథలోని కాలగమనం వంటి వన్నీ బాగా అధ్యయనం చేయాలి. ఇది త్వరత్వరగా చేయకూడదు. ఇక్కడే ఎక్కువ జాగ్రత వహించాలి. అవసరం అనుకుంటే వీలు కుదిరితే మీకు సమర్ధులు అనిపించిన వారిని మీ‌చిత్రుప్రతిని విశ్లేషించేట్లు కోరాలు. ఈ విశ్లేషకులు కనీసం ఇద్దరు ముగ్గురు ఉండటం వలన చాలా లాభాలుంటాయి. 
 • వచ్చిన సూచనలూ సలహాలూ‌ దృష్టిలో పెట్టుకొని మీ‌చిత్తుప్రతిని సవరించాలి. ఇది మరలా విశ్లేషణకు వెళ్ళాలి. ఇదంతా మొదటి దశ.

రెండవదశ

 •  కథను సంవిధానం చేయటం అన్నది రెండవదశ. చిత్తు ప్రతిలో అంతా కథలూ ఉపకథలూ అన్న క్రమంలో ఉంది. కాని సంవిధానం అంటే కథలను ఒకదానిలో ఒకటి జాగ్రతగా సమ్మిశ్రితం చేయటం. మొదటి చిత్రుప్రతిలో ఒక ఉపకథ ఉందంటే అక్కడ అది మొత్తంగా ఉంది. కాని చెప్పే విధానం అది కాదు కదా, ఆ ఉపకథను ముక్కలుచేసి దాని ఆధారకథలో ఎక్కడ ఎంత చెప్పాలో ఎలా చెప్పాలో అలా కలుపుతూ పోవాలి. అట్టడుగు స్థాయి ఉపకథలనుండి పైస్థాయి దాకా ఇలా చేయటం అనుకున్నంత సులువు కాదు. ప్రయత్నబాహుళ్యం అవసరం పడవచ్చును. 
 • ఇలా సంవిధానం చేసిన గ్రంథాన్ని విశ్లేషణకు ఇవ్వాలి. చిత్తుప్రతికన్నా ఈగ్రంథం పూర్తిగా తేడాగా ఉంటుంది కదా కధలు ఒకదానిలో ఒకటి పడుగుపేకల్లా కలగలిసి. అది ఎంత చక్కగా చదివించేలా ఉందో విశ్లేషకుల అభిప్రాయం తరువాత స్పష్టత వస్తుంది. వచ్చే విమర్శల ఆధారంగా మార్పులు చేర్పులు చేయాలి. ఇలా రెండవదశ ముగుస్తుంది.

మూడవదశ

 • ఇప్పటికి ప్రథానకథనూ దానిలో అంతర్గతంగా ఉన్న ఉపకథలనూ ఒకపధ్ధతిలో పేర్చటం పూర్తయింది. కాని ఇదే‌ తుది గ్రంథం కాదు కదా. ఇప్పుడు మూడవదశ లోనికి ప్రవేశిద్దాం. ఇంతవరకూ ఏర్పడిన గ్రంథంలో సంభాషణల స్థానంలో సంభాషణాసారం మాత్రమే కనిపిస్తోంది. సంఘటనలకు క్లుప్తంగా మాత్రమే చెప్పటం జరిగింది. ఇవి విస్తరించాలి. 
 • సంభాషణలను పూర్తిగా విస్తరించి వ్రాయాలి - ఏ సంభాషణ ఎంత నిడివి ఉండాలీ అన్నది సందర్భం యొక్క ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఒక సంభాషణలో పాల్గొనే‌ పాత్రలను బట్టి ఉంటుంది. రెండు బండ గుర్తులు ఏమిటంటే అప్రధానసంఘటనల్లోనూ అప్రధానపాత్రలమధ్యనా సంభాషణ చిన్నదిగా ఉండాలి. ఏ సంభాషణా నిరుపయోగంగా ఉండకూడదు అన్నవి. ఇటువంటి బండగుర్తులే సంఘటనలను విస్తరించటంలోనూ‌ ఉపయోగిస్తాయి. ఇప్పుడు గ్రంథంలో అవసరమైన చోట్ల వర్ణనలను చేర్చాలి. వీటి వలన పాత్రల స్వభావాలకు పుష్టిచేకూర్చ వచ్చును. సందర్భానికి తగిన వస్తు, ప్రకృతి ఇత్యాదులను గురించిన అవవరమైన సమాచారాన్ని పొందుపరచ వచ్చును.
 • ఇలా విస్తరించి వ్రాసిన గ్రంథం మరలా బాగా విశ్లేషించబడాలి. ఎందుకంటే పాత్రల స్వరూపస్వభావాలను ఇప్పుడు మనం మన వాక్యాల్లో కాకుండా సంఘటనలూ సంభాషణలూ ఆధారంగా చదువరికి అందించుతున్నాం కాబట్టి.  పాత్రలస్వభావాలు వైరుధ్యరహింతంగా నిరూపించామా, సంఘటనల్లో దేశకాలాదులను సరిగా చూపుతున్నామా అన్నది చాలా నిశితంగా విమర్శించుకోవాలి.ఇలా మూడవదశ పూర్తి ఐన తరువాత మన గ్రంథం పూర్తి ఐనట్లే.  

నాలుగవదశ

 • ఇక చివరిది అయిన నాలుగవ దశ. ఈ‌దశలో కొద్దిమంది కాక ఎక్కువమంది గ్రంథాన్ని చదివి వారి వారి విమర్శలు చెబుతారు. ఎక్కువసంగతులు వెలుగులోనికి వస్తాయి. ఫలాని పాత్రకు మీరు పెట్టినపేరు బాగోలేదు అని ఒకరు చెప్పి తమతమ కారణాలను చూపించవచ్చును. ఫలాని ప్రదేశం అన్నారు అక్కడ మీరు చెప్పిన రకం పూలు పూయవు అని ఎవరన్నా ఎత్తి చూపవచ్చును. ఫలాని రెండు పాత్రలచిత్రణ అసహజంగా ఉంది. మార్చండి అని కొందరు సమర్ధనలు చూపవచ్చును. ఇలాంటివి ముందు దశల్లో రావు. అప్పటికి అంతా కథమీదనే దృష్టి కాబట్టి, కథను మాత్రమే చూపాము కాబట్టి. ఇప్పుడు గ్రంథవికాసం ఐన తరువాతనే ఇలాంటి విమర్శలు వస్తాయి. 
 • ఈ విమర్శలను పరిగణనలోనికి తీసుకొని గ్రంథాన్ని సంస్కరించండి. ఇప్పుడు మీ‌కొత్త పుస్తకం విడుదలకు సిధ్ధం.

 ఇంతవరకూ కథను ఎలాగు ఒక క్రమపథ్థతిలో నిర్మించాలో చూసాము.ఇప్పుడు కథలోని పాత్రలను చిత్రికపట్టటం ఎలాగో చూదాం.

కథలోని పాత్రలు ప్రధానపాత్రలు, అప్రధానపాత్రలు, ప్రాస్తావికపాత్రలు అని మూడు రకాలుగా ఉంటాయి. 

 • ప్రధానపాత్రలు:  కథ వీటిమీద ఆధారపడి నడుస్తుంది.
 • అప్రధానపాత్రలు, కథ వీటిమీద ఆధారపడి నడవదు. కాని కథను నడపటంలో తోడ్పడతాయి.
 • ప్రాస్తావికపాత్రలు: కొన్ని సంఘటనల్లో ఈ పాత్రలు కనిపిస్తాయి. అలా కొధ్ది సంఘటలల్లో పాల్గొనటం తప్ప వీటి వలన వేరే ప్రయోజనం ఉండదు.

రామాయణం తీసుకుంటే దశరథుడు, సీతారామలక్ష్మణులూ, రావణుడూ వంటి వారు ప్రధానపాత్రలు. మందోదరీ, గుహుడూ  వారు ప్రాస్తావిక పాత్రలు. సుమంత్రుడూ, వశిష్ఠుడు, జటాయువూ సంపా వంటి వంటి వారు అప్రధాన పాత్రలు. శత్రుఘ్నుడు కూడా ప్రాస్తావిక పాత్రగానే ఉన్నాడు. భారతంలో కృశ్ణుడు, పంచ పాండవులూ, దుర్యోధన, కర్ణ, ధృతరాష్ట్రవిదుర భీష్మద్రోణకృపాశ్వథ్థామాదులు ప్రథానపాత్రలు. మాద్రీ ద్రుపదపురోహితుడూ సంజయుడు వ్యాసుడు వంటి వారివి అప్రధానపాత్రలు. బోలెడు ప్రాస్తావికపాత్రలున్నాయి.

ఇలా మీకథలో పాత్రల పరిమితిని ముందు గుర్తించాలి. 

ఒక్కొక్క సారి ప్రాస్తావిక పాత్రలు కూడా ప్రభావశీలంగా ఉండవచ్చును. రామాయణంలో మందర ఒక ప్రాస్తావిక పాత్ర. కాని ఆపాత్ర గురించి అందరికీ‌ తెలుసు. కథలో ఒక బలమైన మలుపుకు అది కారణం ఐనది కాబట్టి. కాని వాల్మీకి సంయమనంతో ఉండి ఆ పాత్రను విస్తరించలేదు. మందరా పాపదర్శినీ అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా ఏపాత్రను ఎంతమేర విస్తరించి వ్రాయాలో అన్న ఒక స్పష్టత ఉండాలి.

కథాగమనంలో తోడ్పడే‌ అప్రధానపాత్రలను కూడ తగినంత విస్తరించటంలో ఏమరుపాటు కూడదు. లేకపోతే ఆపాత్రలు తేలిపోవటమే‌ కాక కథాగమనంలో పునాదులు బలహీనంగా అనిపిస్తాయి. భారతంలో సైంధవుడి పాత్ర చిన్నదే. కాని తగినంత బలంగా తీర్చిదిద్దటం జరిగింది. 

సంభాషణల విషయం. ఇప్పటికే‌ ఈవిషయం క్లుప్తంగా చెప్పుకున్నాం. సంభాషణలల్లో  ఒక పాత్ర స్వభావం అన్నిటా ఒకేలా ఉండాలి. స్వభావం స్పష్టంగా చదువరులకు అందాలి. అనవసరమైన సంభాషణలు ఉండకూడదు. ఒక సంభాషణ కథను నడిపించటానికి కాని పాత్రలను స్ఫుటం చేయటానికి కాని మరేదైనా సంఘటననో‌ ఇతరవిషయాన్నో సూచించటానికి కాని ఎందుకో ఒకందుకు తప్పనిసరి కావాలి. కేవలం కాలక్షేపం సంభాషణలు గ్రంథాన్ని బలహీనపరుస్తాయి. అలాగే సంభాషణల్లో పాత్రలే‌ కనిపించాలి కాని రచయిత కనిపించకూడదు. అలాగే సంభాషణల్లో అనుచితమైన ప్రస్తావనలూ భాషా ఉండకూడదు.


14, డిసెంబర్ 2021, మంగళవారం

ఎక్కడి సౌఖ్యం బెక్కడి శాంతము

ఎక్కడి సౌఖ్యం బెక్కడి శాంతం బెట్టిది నీజీవిత మనగా

ధనములకొఱకై పెండ్లము బిడ్డలు ననిశము నిను వేధించినచో
తినిపోయెడు నీబంధువు లెప్పుడు పనిగొని నిను సాధించినచో
అనుగుమిత్రులే అపార్ధము చేసుక నడ్డదిడ్డములు పలికినచో
పని మెచ్చక యజమానులు నిన్ను పలుచన చేసి పలికినచో

ప్రతిదిన మెంతగ మ్రొక్కిన వేల్పులు వరముల నీయక యుండినచో
వ్రతములు పూజలు బహుళము చేసియు వాంఛిత మబ్బక యుండినచో
ఇతరుల కెంతగ హితములు చేసిన నెవ్వరు మెచ్చక యుండినచో
కుతుకము మీరగ మంచిచేసినను కూడని నిందలు వచ్చినచో

తెలిసీతెలియక చేసినతప్పులు తరగనిశిక్షలు వేసినచో
బలవంతులతో వైరముకలిగిన వేళ జనులు నిను విడచినచో
తలచినచో శ్రీరాముని తాపత్రయము లుడుగునని తెలియనిచో
కలిలో శ్రీహరిస్మరణమె ముక్తికి కారణమన్నది తెలియనిచో
కోరి భజించితి కోదండరామ

కోరి భజించితి కోదండరామ
దారి చూపించర దశరథరామ

జననాధోత్తమ ఘనపాపహర
వినతాసుతవాహన సర్వేశ
మును నిన్నెంచని మూర్ఖుడ నైనను నీ
ఘనత నెఱింగితి కావున నిపుడిదె 

పరమపురుష హరి పరమదయాళో
కరివరదా కలికల్మషనాశన
పరమాత్మా నిను బ్రహ్మాద్యమరులె లో
నెఱుగ నే‌‌రరని యెఱిగి భక్తితో

భువనత్రయసంపోషణనిపుణ
భవభయవారణ బహువరవితరణ
పవనజనుత నీపాదము లంటితి రా
ఘవ నీవేదిక్కని నమ్మితిరా


11, డిసెంబర్ 2021, శనివారం

శ్రీరామా జయ రఘురామా

శ్రీరామా జయ రఘురామా నిను చింతించెదమో ఘనశ్యామా

జడివానగ శుభవరముల గురిసే చల్లనిఱేడా శ్రీరామా
ఆడుగడుగున మా కండగనిలిచే ఆమితదయామయ శ్రీరామా
పుడమిని భక్తుల బ్రోవగ వెలసిన పురుషోత్తమ హరి శ్రీరామా
విడువము విడువము నీపాదములను విడువ మెన్నడును శ్రీరామా

పిలిచిన పలికే దైవము నీవని తెలిసితి మయ్యా శ్రీరామా
తెలిసి మనసులో భక్తి నిలిపి నిను కొలుచుచుంటిమిదె శ్రీరామా
కొలిచిన వారికి కొంగుబంగరుగ కూరిమి నుండే శ్రీరామా
కలలో నైనను నీకన్యులను కొలువగ నేరము శ్రీరామా

సీతాలక్ష్మణవాతాత్మజయుత చిన్మయరూపా శ్రీరామా
పూతచరిత్రుల భక్తుల మానసపూజల నందే శ్రీరామా
ప్రీతిగ త్రిజగంబుల పాలించే విష్ణుదేవుడవు శ్రీరామా
నీతలపున కెడబాయక నుందుము నిర్మలబుధ్ధిని శ్రీరామా

సీతారాముడు మన సీతారాముడు

సీతారాముడు మన సీతారాముడు

చల్లగ సురలను కాచెడి వాడు
చల్లని వెన్నెల నగవుల వాడు
జల్లుగ కరుణను కురిసెడి వాడు
కొల్లగ శుభముల నిఛ్చెడి వాడు

నల్లని మేఘము బోలెడు వాడు
చిల్లర మాయల చెండెడు వాడు
అల్లరి దైత్యుల నణచెడు వాడు
చల్లగ భక్తుల నేలెడు వాడు

మూడు లోకముల నేలెడు వాడు  
చూడగ చక్కని రూపము వాడు
వేడుక గొలిపే నడవడి వాడు 
ఆడిన మాటను తప్పని వాడు

తోడుగ నీడగ నిలచెడి వాడు
వేడక వరముల నొసగెడి వాడు 
వేడుక భక్తుల బ్రోచెడి వాడు
వేడిన మోక్షము నిచ్చెడు వాడు 

శరముల సంగతి నెఱిగిన వాడు 
గురికి తప్పని బాణము వాడు 
సురవిరోధులను చీల్చెడు వాడు 
పరమాత్ముడు శ్రీహరియే వాడు
చిరుచిరు నగవుల శ్రీరామా

చిరుచిరు నగవుల శ్రీరామా నను
కరుణించవయా ఘనశ్యామా

నరులకు మోక్షము హరి యీయక యె
త్తెఱగున కలుగును దేవేశా
కరుణామయ నీచరణములే యిక
శరణమందురా సర్వేశా

మాయను బుట్టితి మాయను పెరిగితి
మాయనెఱుంగ నమాయకుడ
మాయామయ జగమన్నది దాటు ను
పాయము నీదయ పరమేశా

నిన్నే నమ్మితి నిజముగ మదిలో
నిన్నే తలచెద నళినాక్షా
నిన్నే కొలిచెద నిత్యము నిక్కము
న న్నేమరకుము నాతండ్రీ 

9, డిసెంబర్ 2021, గురువారం

బిపిన్ రావత్ & సహచర అధికారుల దుర్మరణం గురించి....

ఈరోజున ఈవిషయం ప్రస్తావిస్తూ ఈటపా వ్రాయాలని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే‌ భండారు శ్రీనివాసరావు గారి టపా వచ్చింది. దానిపై నాస్పందన తెలుపకుండా ఉండలేకపోయాను. ఆస్పందననే ఇక్కడ ప్రకటిస్తున్నాను టపాగా.


బిపిన్ రావత్ గురించి మీడియా నిరంతరాయంగా కథనాలను వడ్డిస్తూనే ఉంది.

కాని చూసారూ, ఆయనతో పాటుగా మరొక పదముగ్గురు స్వర్గస్థులయ్యారు. ఏ మీడీయాలోనూ వారి గురించిన వివరాలు కాదు కదా, కనీసం వారి పేర్లు కూడా రాలేదు. 
 
ఇది ఎంత అన్యాయం! వారు మాత్రం దేశభక్తులు కారా? వారు మాత్రం దేశసేవలోనే మరణించలేదా? వారికి మాత్రం ఊరూ పేరూ ప్రతిష్ఠా వంటివి ఏమీ లేవా? వారికి మాత్రం మనం తగిన విధంగా గౌరవం ఇవ్వవలసిన అవసరం లేదా?

చివరికి మీరూ కనీసం వారి ప్రసక్తి ఐనా తీసుకురాలేదు.

వారి గురించే ఆలోచిస్తున్నాను నేను. అయ్యో వారిని కనీసం స్మరించేవారు కూడా లేరే అని. కేవలం వారి వారి కుటుంబసభ్యులు స్మరించుకుంటారులే‌ అని ఎవరూ వారిని నిర్లజ్జగా కనీసంగా ఐనా పట్టించుకొనక పోవటం దారుణాతిదారుణం!!

రావత్ గారి గొప్పదనం గురించి నేనేమీ విమర్శించటం లేదు. మిగిలిన వారిని కూడా కొంచెం స్మరించినంత మాత్రాన రావత్ గారి స్మృతికి అన్యాయం జరిగిపోదు కూడా.

ధన్యవాదాలు.

జయజయ రామా సద్గుణధామా జయజయ సీతారామా

జయజయ రామా సద్గుణధామా జయజయ సీతారామా

జయజయ సర్వసురారిగణాంతక జయజయ లక్ష్మీరమణా
జయజయ బ్రహ్మాద్యమరప్రార్ధిత జయజయ త్రిభువనశరణా
 
జయజయ యజ్ఞప్రసాదసముద్భవ జయజయ తారకనామా
జయజయ కౌసల్యాసుఖవర్ధన జయజయ దశరథరామా

జయజయ విశ్వామిత్రప్రియధన జయజయ దనుజవిరామా
జయజయ పురహరకార్ముకభంజన జయజయ సీతారామా
 
జయజయ శమితపరశ్వధరామా జయజయ కళ్యాణరామా
జయజయ సీతలక్ష్మణసమేత జయజయ వనచర రామా
 
జయజయ లంకావైభవనాశక జయకయ భండనభీమా
జయజయ రావణదైత్యవిమర్దన జయజయ విక్రమధామా
 
జయజయ బ్రహ్మాద్యమరప్రపూజిత జయజయ జగదభిరామా
జయజయజయ సింహాసనసంస్థిత జయజయ అయోధ్యరామా
 

4, డిసెంబర్ 2021, శనివారం

నీకు నాకు భలే జోడీ

నీకు నాకు భలే జోడీ సాకేతరామ అది
నీకు వినోదము గూర్ఛు నిశ్చయంబుగ

నీవు పతితపావనుడవు నేను చాల పతితుడను
నీవు దీనబాంధవుడవు నేను చాల దీనుడను
నీవు భక్తవత్సలుడవు నేను నీకు నీ‌భక్తుడను
నీవు సర్వసమర్ధుడవు నేను చాల వీఱిడిని
 
నీవు పురుషోత్తముడవు నేనొక కాపురుషుడను
నీవు దైవశిఖామణివి నేనేమో మానవుడను
నీవు సర్వమెఱిగి యుండువు నేనెఱుకయె లేని వాడ
నీవు సత్కీర్తియుతుడవు నేనేమో అనామకుడ
 
నీవు సదానందుడవు నేను నిత్యదుఃఖితుడను
నీవు వీతరాగుండవు నేను రాగమయాకృతిని
నీవు మాయాతీతుడవు నేను మాయామోహితుడను
నీవు మోక్షదాయకుడవు నేనేమో ముముక్షువును

ఇదే తుదిభవముగా నేర్పరించ వయ్య

ఇదే తుదిభవముగా నేర్పరించ వయ్య
హృదయేశ్వర నాకింకేమియు వలదు

శివుడు మెచ్చిన నామమని చింతలుడుపు నామమని
భవతారక నామమని భావించి ఓ
అవనిజామనోహరా అతితీయని నీనామము
పవలురేలు జపింతును పతితపావనా

విన్నపములు విందువని వివరము కనుగొందు వని
అన్నికోరికలు తీర్చు హరివనుచు ఓ
సన్నుతాంగ నీనామము చక్కగా జపించుచును
నిన్నే నమ్మియుంటినిరా నిజము రాముడా

ఎన్నిజన్మముల నుండి యిట్లు వేడు చున్నానో
మన్నీడా నీ వెఱుగని దున్నదా ఓ
కన్నతండ్రి నామొఱవిని కాపాడర యికనైనా
నిన్నుకాక వేరొకరిని నేనడుగనురా