31, జనవరి 2021, ఆదివారం

విగ్రహారాథన గురించి ....

ప్రపంచంలో అనేకరకాల మనుష్యు లుంటారు. అందుచేత ఏవిషయంలో ఐనా అందరి అభిప్రాయాలూ ఒకే విధంగా ఉంటే ఆశ్చర్యపోవాలి తప్ప వేరువేరుగా ఉంటే అందులో విశేషం ఏమీ లేదు. ఒక ఇంట్లో నలుగురు సభ్యులుంటే ఎంతో‌కాలంగా కలిసి కాపురం చేస్తున్న భార్యాభర్తలూ వారి ఇద్దరు బిడ్దలూ అనుకుందా వారు, ఆ నలుగురి అభిప్రాయాల్లోనూ ఎన్నో విషయాల్లో విబేధాలుంటాయా ఉండవా? భర్తకు నలుపురంగు దుస్తులంటే ఇష్టం ఐతే ఇల్లాలికి తెలుపురంగు హుందాగా ఉంటుందీ అదే‌ మంచిరంగూ అని అభిప్రాయం. కూతురికి పింక్ రంగు ప్రాణం ఐతే కొడుక్కి ఆ రంగంటే అసహ్యం కావచ్చును. అమ్మకు ఏదో‌ బాబామీద భక్తి ఐతే గృహమేథిగారికి వేంకటేశ్వర స్వామితప్ప మరొక దైవం నచ్చడు. కొడుక్కి గణపతి మీద గురి ఐతే కూతురికి శ్రీకృష్ణభక్తి మెండు.అమ్మ కొడుకుని డాక్టర్ని చేయాలనుకుంటే వాడేమో‌ మంచి చిత్రకారుణ్ణి కావాలని కృషిచేస్తూ ఉంటాడు. ఇలా సవాలక్ష భిన్నాభిప్రాయాలుంటాయి. కాని అందరూ కలిసే ఉంటారు. సంతోషంగా ఒక కప్పుకింద కలిసి నివసిస్తూనే ఉంటారు.  ఒక రకంగా ఆలోచిస్తే దేశం అంతా కూడా ఒక కుటుంబం లాంటిదే. ఐతే అది చాలా పెద్ద కుటుంబం. మరి ఈ‌పెద్దకుటుంబంలో ప్రతి చిన్నాపెద్దా విషయం మీదా అందరూ ఎందుకు కలహించుకొని ద్వేషవిషాగ్నికణాలు మిన్నంటేలా ఎగదోస్తున్నారో‌ నాకు బోధపడటం లేదు. ఒక ముఖ్య కారణం రాజకీయభూతం అనుకుంటే మరొకటి మతవిద్వేషభూతం అనుకుంటున్నాను.

రాజకీయమైన అభిప్రాయబేధాలు పీకలుకోసుకొనే స్థాయిలో ఉండటానికి కారణం రాజకీయం అనేది సమాజశ్రేయస్సుకు తోడ్పడే సాధనంగా కాక స్వార్ధపరశక్తులకు అవకాశరంగంగా మారటమే.

ప్రపంచంలో అందరూ తీవ్రంగా విబేధించి కొట్టుకొని చచ్చే మరొక విషయం ఏదన్నా ఉందంటే అది ఒక్క మతం మాత్రమే. నిజానికి మతం అంటే అభిప్రాయం అనే అర్ధం. కాని రూఢంగా అథ్యాత్మికభావనగా లేదా అథ్యాత్మికజీవనవిధానంగా అది స్థిరపడిపోయింది.

ఈ వ్యాసం ఈరెండు సమస్యలను గురించీ‌ చర్చించటం కోసం ఉద్దేశించినది కాదు. మతదురభిమానం అనేది వెఱ్ఱితలలు వేసి మనుషులు కొట్టుకొని చచ్చేందుకు దారితీస్తున్న నేటి పరిస్థితుల్లో ఈనాటి విగ్రహవిద్వంస కార్యక్రమం పుణ్యమా అని రంగప్రవేశం చేసి ముందుకు వచ్చి నిలబడ్డ విగ్రహారాథన అన్న అంశం గురించి నా అభిప్రాయం వ్రాయటానికి మాత్రమే ఉద్దేశించిన వ్యాసం ఇది.

ఈసాయంత్రం మా మామయ్య గారు శ్రీప్రసాద్ ఆత్రేయ కవి గారు ఫోన్ చేసి ఈవిషయం ఎత్తారు. నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఆయన ఫోన్ చేసారు. కాని చిక్కేమిటంటే నా అభిప్రాయం ఒక్క వాక్యం ఐనా మాట్లాడానో‌ లేదో ఆయన అడ్డు తగిలి ప్రశ్నలు వేయటం‌ మొదలుపెట్టారు. ఎన్ని సార్లు ఎలా ప్రయత్నించినా నేను ఒకటి రెండు వాక్యాలైనా పూర్తిగా చెప్పే వీలు కుదరలేదు. ఇంతలో ఫోన్ కాల్ కాస్తా భగవంతుడు కట్ చేసిపారేసాడు.

మరలా ఆయన ఈ ప్రసక్తి తీసుకొని వస్తే కూడా సీన్ రిపీట్ అవటం‌ తప్ప చర్చ ముందుకు జరిగేది ఏమీ‌ కనిపించటం లేదు. అందుకని అయన కోసం ఈవ్యాసం వ్రాయటం జరుతుతోంది. సరే ఎలాగూ వ్రాస్తున్నాను కదా, అది అందరూ చదవటం మంచిదేగా అని నేరుగా బ్లాగులోనే వ్రాస్తున్నాను, ఆయనకు ఒక జాబు క్రింద వ్రాయకుండా.

ఇదీ ఈవ్యాసం నేపథ్యం. ఇంక నేరుగా విషయం లోనికి వెళ్తాను.

చిన్నప్పుడు బళ్ళో పంతులు గారు 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే వాళ్ళం. ఇప్పుడూ బళ్ళలో అలాగే నేర్పుతున్నారో‌ లేదో‌ తెలియదు. అంకెలూ‌ అక్షరాలూ నేర్చుకుంటున్న పిల్లవాళ్ళు అలా వేళ్ళ మీద లెక్కవేస్తుంటే చూడ ముచ్చటగా ఉంటుంది కాని పదో తరగతి పిల్లవాడు కూడా అలాగే 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేయటం‌ మొదలుపెడితే ఎలా ఉంటుంది చూసే వాళ్ళకు?

లెక్కల్లో అది ఎలాగైతే పిల్లవాడి వయస్సునూ‌ అనుభవాన్ని బట్టి మనం ఒక స్థాయిని సహజం అనుకుంటామో అలాగే అనేకానేక రంగాల్లో కూడా విషయం గ్రహించటం, అభ్యాసం వంటివి క్రమపరిణామంగానే ఉంటాయి.

చంటిపిల్లవాడికి 5 + 3 ఎంత అంటే ఎదురుగా ప్రత్యక్షంగా వేళ్ళ రూపంలోనో కాగితం మీద ఒకట్ల రూపంలోనో‌ ఒక ప్రతీకాత్మకమైన లక్షవస్తువులు కనిపిస్తుంటే వాడికి లెక్కపెట్టటం సుళువుగా ఉంటుంది. ఒక స్థాయికి వచ్చాక ఆలాంటి అవసరం ఉండదు.

ఆరాథనావిధానం కూడా అలాంటి ప్రతీకలతో కూడి ఉంటుంది ప్రాథమికస్థాయిలో.నిజానికి ప్రతీకలు మారుతాయి కాని తగినంత ఉన్నతమైన స్థాయిని చేరుకొనే వరకూ ఏదో విధమైన ప్రతీకల అవసరం లేనిదే‌ లక్ష్యం పైన గురి కుదరటం సాధారణ సాధకులకు చాలా చాలా కష్టం.

లక్ష్యం పైన చిత్తానికి విశుధ్ధిగా గురి కుదరటానికి చేసే సాధనలో భావనాభాగానికే‌ మనం సాధారణీకరించి శ్రధ్ధ అనీ భక్తి అని పేర్లు పెడుతున్నాం. లక్ష్యం ఒక శాస్త్రం ఐతే ఆ పేరు శ్రధ్ధ. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ఆ పేరు భక్తి.

లక్ష్యం ఒక శాస్త్రం ఐతే అక్కడ ప్రతీకలు శాస్త్రగ్రంథాలు. లక్ష్యం భగవంతుడైన పక్షంలో ప్రతీకలు భగవన్మూర్తులు.

శాస్త్రం‌ బాగా ఒంటబట్టిన వానికి శాస్త్రగ్రంథాలతో పని లేదు. వారు గ్రంథాలను తృణికరించరు. వాటిని గౌరవంగానే చూస్తారు. శిష్యులకు అవి బోధిస్తారు కూడా. కాని వారికి స్వయంగా అవి అవసరం కావింక. ఎందుకంటే శాస్త్రవిషయంలో వారికి అధికారం సిధ్ధించింది కాబట్టి.

శుద్దరూపంలో భగవత్తత్త్వానికి బ్రహ్మము అని సంకేతం. వివిధ దేవతామూర్తి స్వరూపస్వభావాలు అన్నీ ఆ బ్రహ్మము యొక్క ప్రతీకలే. ఏ‌ ప్రతీకను ఆధారం చేసుకొని చిత్తశుధ్దిగా ఉపాసన చేసినా వారికి అంతిమంగా కలిగేది ఒకటే విధమైన తత్త్వజ్ఞానం.  ప్రతీకలను ఆధారం చేసుకొని ఉపాసన చేయటం సగుణోపాసన అని చెప్తారు. ఆ స్థాయిని ధాటి తత్త్వజ్ఞానం పరిపూర్ణంగా సిధ్ధించిన పిదప వారు చేసే ఉపాసన నిర్గుణోపాసన. కేవలం విశుధ్ధబ్రహ్మోపాసన.

ఏకంగా పరబ్రహ్మతత్త్వాన్ని ఉపాసన చేయవచ్చును కదా మధ్యలో రాముడూ శివుడు అంటూ ప్రతీకలను ఉపాసించటం ద్వారా సమయం ఎందుకు వృధాచేయటం అని బుధ్ధిమంతులు ప్రశ్నిస్తూ ఉంటారు. అది సాధ్యమా అన్నది అలోచించాలి ముందు.

అక్షరాలూ అంకెలూ అన్నీ బాగా వచ్చిన తరువాత కుర్రవాడికి ఏకంగా డిగ్రీ గణితం చెప్పవచ్చును కదా, ఎందుకండీ ఏళ్ళతరబడీ చిల్లరమల్లర గణితవిషయాలు చెప్తూ విలువైన కాలం వృధాచేస్తున్నారూ అని అడిగితే ఏమి జవాబు చెప్తారు?

తగిన పరిణతి రాకుండా ఏకంగా డిగ్రీ గణితం ఎలా గండీ వాడికి అర్ధం అవుతుందీ అంటున్నారా? చిత్తం. అంతేనండి. అలాగే తగిన పరిణతి రాకుండానే నిర్గుణబ్రహ్మోపాసన అన్నది అసాధ్యం అండి.

ఎల్లాగైతే పిల్లలు ఎదిగే క్రమంలో వేళ్ళమీద లెక్కలు వేయటం సహజంగానే మాని వేస్తారో అలాగే ఉపాసనాక్రమంలో పరిణతి వచ్చిన తరువాత సాధకులు ప్రతికల మీద ఆధారపడవలసిన అవసరం దాటి ముందుకు వెళ్తారు.

మీరు మీ‌వేళ్ళ మీద లెక్కలు కట్టటం లేదు. పెద్దవారైపోయారు కదండీ‌ పాపం. కాని మీ బుల్లి అబ్భాయో అమ్మాయో మీరు కాని 5 + 3 ఎంత అంటే వేళ్ళ మీద లెక్కవేసే చెప్తుంటే ఎంతో ముచ్చట పడుతూ చూస్తారు కదా? కొంపదీసి చీచీ అలా వేళ్ళ మీద లెక్కెట్ట కూడదు దరిద్రం అని తిట్టరు కదా?

అలాగే నిర్గుణోపాసన స్థితికి వచ్చిన సాధకులు కూడా ఇంకా సగుణోపాసనలో ఉన్న వారిని చూసి వెక్కిరించరు. అందరూ ఒకే‌ పరిణతి కలిగి ఉండరు కదా అని వాళ్ళకు తెలుసు. అందుకే వారికి ఆ సగుణోపాసనలో తగినవిధంగా ప్రోత్సహిస్తారు. భయం లేదు, వాళ్ళు కూడా క్రమంగా పరిణతి సాధిస్తారు.

మీ‌ చిట్టితండ్రి లెక్కల పుస్తకంలో ఎన్నో ఇల్లా ఒకట్లు వేసి చేసిన కూడికలూ వగైరాలున్నాయి కదా. ఎవరన్నా దౌర్జన్యంగా ఆపుస్తకాన్ని లాగికొని చించివేస్తేనో, లేదా దొంగిలించితేనో వాడికి బోలెడు దుఃఖం వస్తుంది కదా. చెప్పండి వస్తుందా రాదా? ఆ పుస్తకం మీకు విలువైనది కాకపోవచ్చును. మీ చిట్టితండ్రికి ఎంతో విలువైన పుస్తకం కాదా? అది కాస్తా ఇలా ఐనది అని వాడికి దుఃఖం వస్తే, అలా దుఃఖం తెప్పించిన వాడి మీద మీకు కోపం వస్తుందా రాదా?  బోడి పుస్తకం, పోతే పోయిందిలే, నిజానికి లెక్కలు అలా ఎవరూ చేయరు అంటూ మీ‌పిల్లవాడి మీద చిందులు వేయరు కదా.

యూనివర్శిటీలో ఖగోళశాస్త్రం చదివుకొనే‌ యువకుడికి వాళ్ళ తాతగారి కాలం నాటి జ్యోతిషగ్రంధం వట్టి చెత్తగా తోచవచ్చును. ముందుముందు కాలంలో ఆ యువకుడి కొడుకు డాక్టరు చదువువెలిగిస్తూ తండ్రిగారి కలెక్షన్‌లో ఉన్న ఆస్ట్రనామిలల్ ఆల్మనాక్ వగైరా ఖగోళ శాస్త్రం పుస్తకాలను చెత్తచెదారం అనుకోవచ్చును. ఈ అనుకోవటాలు మనమన వికారాలే‌ కాని ఆ పుస్తకాల లక్షణాలు కావు. అందుచేత మన బుధ్ధుల్లో కొంచెం సంయమనం చాలా అవసరం.

ఈవిధమైన సంయమనం లోపించటం అంత మంచి సంస్కారం కాదు. భగవద్గీత గొప్ప పుస్తకం ఐనట్లే‌ బైబుల్ కూడా అని అనుకోవాలి. అండ్ వైస్ వెర్సా. కృష్ణుణ్ణి గౌరవించుతాను, జీసస్ అంటే నాకు కిట్టదు అనకూడదు. అండ్ వైస్ వెర్సా.

సనాతనధర్మంలో ఓం కారాదులు శబ్దప్రతీకలైలట్లే, రామకృష్ణాది స్వరూపాలు విగ్రహప్రతీకలు. క్రైస్తవంలో శిలువ ఒక ప్రతీక, మేరీమాత కూడా ఒక ప్రతీకాత్మక వ్యక్తియే. రాముడు అని ఒక ప్రతీకను ఒకడు ఉపాసనాసాధనంగా గౌరవించుకోవటాన్ని ఆక్షేపించే క్రైస్తవుల్లో అందరూ శిలువను మెడలో వేసుకుంటున్నారు కదా? రెండూ ప్రతీకలే. రెండూ - బండగా చెప్పాలంటే - విగ్రహారాథనలే. అందరూ కొంచెం ఆలోచించి చూడండి.

ఇస్లాం‌ కూడా విగ్రహారాథనకు తీవ్రంగా వ్యతిరేకం అంటారు. మంచిది. ప్రవక్త మదీనాకు ప్రవాసం వెళ్ళటం అనే థీమ్‌ను సూచించే కాలెండర్ బొమ్మలు కనిపిస్తున్నాయా లేదా? వారు చంద్రవంకనూ‌ ఆకుపచ్చరంగునూ తమ సాధనలో ప్రతీకలుగా గ్రహించారాలేదా?

ప్రతీక అంటే అది శబ్దం‌ కావచ్చును. ఒక రూపం కావచ్చును. ఒక వర్ణం కావచ్చును. ఒక స్థలం కావచ్చును. ఒక కాలనియమాది వ్యవహారం కావచ్చును. అన్నీ ప్రతీకలే.

అన్ని ప్రతీకలు వారి వారి సంప్రదాయికమైన సాధనావిధానాలను శ్రధ్ధలో ఉంచటానికి ఏర్పడినవే‌. అన్నీ వాటి వాటి ప్రయోజనాల దృష్ట్యా గొప్పవే.

సాధనలో పరిణతినిబట్టి ప్రతీకలు ఎదురుగా ఉంటేనే‌ సాధకుడు నిలువగలుగుతున్నాడా శ్రధ్ధలో లేదా అన్నది నిర్ణయం అవుతుంది. ప్రతీకల అవసరం దాటి ముందుకు వెళ్ళిన వాడు వాటిని చిన్నబుచ్చడు. మేడ ఎక్కటానికి మెట్లు అవసరం. అంతవరకూ మాత్రమే వాటి ప్రయోజనం. ఐన మేడెక్కిన తరువాత మెట్లు దండగ అని బుఱ్ఱ ఉన్నవాడెవడూ అనడు కదా.

ఒక చిత్రమైన ప్రశ్న విన్నాను. రామతీర్ధంలోనో‌ మరెక్కడో రామవిగ్రహం ధ్వంసంచేస్తే తప్పేముందీ? వచ్చిన నష్టం ఏముందీ అని.

ఒక చిన్నపిల్లల బడిని ఎవరో ధ్వంసం చేసారనుకుందాం. అక్కడ నేర్పే వేళ్ళ మీద లెక్కలూ వగైరా అంతా ట్రాష్ కదా, ఆ స్కూల్ పడగొట్టేస్తే తప్పేమిటీ‌ అంటారా మీరు? అనర్లెండి. మీకు చదువు విలువ తెలుసు. ఆవేళ్ళ మీద లెక్కలు అలాగే చిన్నపిల్లకి చెప్తారు అనీ తెలుసు. అందులో తప్పేమీ లేదని తెలుసు. కాని మీకు గుళ్ళు దేవుడి ప్రతిమలూ దేవుడికి పూజలూ అంతా ట్రాష్ అనే ఆధునిక భావాలు మాత్రం పుష్కలంగా ఉండి ఈ ప్రశ్న వేసారంతే. అయ్యా చిన్నపిల్లలకు వాళ్ళకు తగిన బడులు ఎలా అవసరమో పవిత్రమో సాధకులకు కూడా వారికి తగిన సాధనాస్థలాలూ ప్రతీకలూ అంతే అవసరమూ‌ పవిత్రమూ కూడా అని సవినయంగా మనవి చేస్తున్నాను.
 

ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు.

రామ రామ రామ యనే రామచిలుకా

రామ రామ రామ యనే రామచిలుకా నీకీ

రామ మంత్ర మెటులబ్బెను రామచిలుకా నీకీ

   రామ మంత్ర మెవరిచ్చిరి రామచిలుకా


తెలిసీతెలియని నీవే తీయగా నీమంత్రము

పలుకుచున్నావు కదే చిలుకా ఓ చిలుకా

నలువ యిచ్చినట్టి తెలివి కలిగిన మనుషు లది

పలుకుటకే చాల సిగ్గుపడుదు రిపుడు చిలుకా


ఎవరే ఆ పుణ్యాత్ములు ఇంకను శ్రీరామ యనుచు

భువిని తిరుగుచున్నారే వివరించవె చిలుకా

ఎవరైనను నేర్పికయే యెటుల రామ రామ యని

పవలు రేలు పలుకుదువే బంగరు తల్లి చిలుకా


అలనాడా సీతమ్మయె చిలుకలు నేర్పెనట

పలుకుతీపి రామనామ పరమమంత్రము

కలికాలము వచ్చినను చిలుకలది మరువవుగా

కలి నరులను మరువజేసె చిలుకా ఓ చిలుకా


సూటిగా మోక్షమిచ్చు

సూటిగా మోక్షమిచ్చు మేటిమంత్రము సప్త

కోటిమంత్రముల లోన గొప్పమంత్రము


రామనామ మంత్రము రమ్యమైన మంత్రము

కామితప్రద మంత్రము కళ్యాణమంత్రము

పామరుల నుధ్ధరించు పావనమగు మంత్రము

స్వామిభక్తవరులకు చాలగూర్చు మంత్రము


ఈ మంత్రము సంపదల నీనుచుండు మంత్రము

ఈ మంత్రము జానకమ్మ కిష్టమైన మంత్రము

ఈ మంత్రము లోకముల నేలుచుండు మంత్రము

ఈ మంత్రము శివుడు ధ్యానించునట్టి మంత్రము


ఇంతగొప్ప మంత్రమని యెరుగని వారికైన

చింతలన్ని పోగొట్టే శ్రేష్ఠమైన మంత్రము

అంతరార్థ మెరిగి కొలుచు నాత్మవిదులందరకు

సంతతబ్రహ్మానందసంధాయక మంత్రము


30, జనవరి 2021, శనివారం

భవతారకమంత్రమా

భవతారకమంత్రమా పతితపావనమంత్రమా

అవనిజాప్రాణమంత్రమా రామమంత్రమా


పరమసుఖదమంత్రమా బహుసులభమంత్రమా

నిరుపమానమంత్రమా వరదాయకమంత్రమా

హరసన్నుతమంత్రమా అతిప్రసిధ్ధమంత్రమా

కరుణను నా నాల్కపై కదలాడే మంత్రమా


మరియాదాపురుషోత్తము మహనీయమంత్రమా

పరమపదప్రదమైన సురుచిరమగు మంత్రమా

సురనరసంపూజ్యమై వరలుచుండు మంత్రమా

హరదేవుని నాలుకపై నాడు చుండు మంత్రమా


మరుతాత్మజనిత్యసేవ్యమానమైన మంత్రమా

తిరయశమున తేజరిల్లు దివ్యమైన మంత్రమా

హరిభక్తుల హృదయంబుల నమరియుండు మంత్రమా

ధరాతనయ నాలుకపై తారాడే మంత్రమా


శివుడిచ్చే దేదో

శివుడిచ్చే దేదో శివుడిచ్చునులే కాని
శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా
     నువ్వు - శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా
    ముందు - శివుడికే మిచ్చేవో చెప్పవయ్యా

హరుని ముందు ఒకేఒక్క అరటిపండు పెడతావు
వరసపెట్టి కోరుతావు వందకోరికలు
    నువ్వు - వరసపెట్టి కోరుతావు వందకోరికలు
    రోజూ - వరసపెట్టి కోరుతావు వందకోరికలు

అరటిపండు తిని నీకు అడిగిన విచ్చెయ్యాలా
కొరగాని కోరికలు తీర్చెయ్యాలా
    నువ్వు - అరటిపండు కొన్న డబ్బు లెవరిచ్చారో
    నువ్వు - కొన్న అరటిపండు శివుని సృష్టి కాదో

శివుడిచ్చిన డబ్బులతో శివసృష్టిలోని పండు
శివుడికే లంచంగా పెడుతున్నావా
    నువ్వు - శివుడికే లంచంగా పెడుతున్నావా
    పెట్టి - అడ్డమైనవన్నీ నువ్వడుగుతున్నావా

శివుడు రామనామము చేయమన్నాడు నిన్ను
సవినయముగ జపమును సలుపుచున్నావా
     నువ్వు - రామనామ మించుక చేయుచున్నావా
     అవ్వ! రామనామ మసలు నీకు గురుతున్నదా


ఇంతకన్న సులభమైన

ఇంతకన్న సులభమైన మంతర మేమున్నది
యింతకన్న మధురమైన మంతర మెందున్నది

సంతతమును దీనినే స్మరించరాదొకో
అంతులేని ఆనంద మందరాదొకో
జంతుతతికి గొప్ప మోక్ష సాధనం బిదేను
ఇంతకన్న మంచివిధ మేమున్నది

శ్రీరామ యను మంత్రము శివసన్నుతము
గౌరికి శివుడిచ్చినట్టి ఘనమంత్రము
నారాయణ మంత్రము భవతారక మంత్రము
ఈరేడు లోకంబుల నిదేగొప్పది

విశ్వవిజయ మంత్రము విశ్వశాంతిప్రదము
విశ్వవినుత మంత్రము విజయమంత్రము
విశ్వగురుని మంత్రము వేదవినుత మంత్రము
విశ్వామిత్రదర్శితము విమలమంత్రము


29, జనవరి 2021, శుక్రవారం

ఘుష్యతే యస్యనగరే

ఘుష్యతే యస్యనగరే
రంగయాత్రా దినేదినే
తమహం శిరసావందే
రాజానం కులశేఖరమ్‌


ఈ శ్లోకంలో యస్యనగరే అని కాక యత్రనగరే అనే మరొక పాఠం కూడా ఉంది.

భావం. 

ఏ కులశేఖరుని నగరంలో ప్రతిదినమూ రంగయాత్ర గురించిన చాటింపు విబబడుతూ ఉంటుందో, ఆ మహారాజు కులశేఖరునికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.

వివరణ.
కులశేఖరుడు గొప్ప రాజు. అయన గొప్ప రామభక్తుడు. రామకథాశ్రవణంలో ఎంతగా నిమగ్నమైపోయే వాడంటే అది చెప్పనలవి కాదు. ఒకసారి ఖరదూషణాలు పద్నాలుగు వేలమంది రాక్షసులు రాముడి మీదకు దండెత్తి వచ్చారని పౌరాణికుడు రామాయణం చెబుతూ వినిపించగానే, అయ్యో రాముడు ఒక్కడే ఆ సైన్యాన్ని ఎదుర్కోవాలా, ఎంత కష్టం ఎంత కష్టం అని దిగ్గిన లేచి సైన్యసమేతంగా రాముడికి సహాయంగా వెళ్ళాలి అని గబగబా ఆజ్ఞలు జారీ చేసాడట. అప్పుడు పౌరాణికుడు అయ్యయ్యో అంత శ్రమ మీకవసరం లేదండీ వాళ్ళందర్నీ రాముడు మట్టుబెట్టాడు అని చెప్పి మొత్తం మీద శాంతింపజేసాడట. అలాగే రావణుడు సీతమ్మను ఎత్తుకొని లంకకు తీసుకొనిపోయాడని విని ఆవేశంతో‌ మళ్ళా సైన్యంతో బయలుదేరాడట. ఆయన ఆవేశం చల్లార్చరానిదిగా ఉంటే సీతాసహితుడై ప్రత్యక్షమై రామచంద్రుడే నాయనా ఆ రావణుణ్ణి చంపేశాను, ఇదిగో సీతమ్మ చూడు అని అనునయించాడట. అటువంటిది ఆయన శ్రవణభక్తి.

కులశేఖరుల వారికి రాముడి ఇలవేల్పు రంగనాథస్వామి అని తెలిసి మహా ఆనందం కలిగింది. ఆ రంగనాథుణ్ణి తానూ సేవించుకోవాలని అనిపించి వెంటనే ప్రజలందరికీ ఒక తెలిసేలా ఒక ప్రకటన చేసాడు. ఏమని? నేను మన దైవం శ్రీరాముల వారికే ఇలవేల్పు ఐన శ్రీరంగనాథుణ్ణి సేవించుకుందుకు బయలుదేరుతున్నాను.ప్రజలారా, ఆసక్తి ఉన్న వాళ్ళంతా నాతో రండహో అని.

అనుకున్నంత మాత్రాన ప్రయాణం సాధ్యపడాలి కదా. ఆరోజున ఎవరో‌ భాగవతోత్తములు రాజనగరానికి వచ్చారు. భాగవతుల్ని సేవించటం అన్నది భగవంతుణ్ణి సేవించటం వలే విధి కదా. వారికి స్వయంగా ఏర్పాట్లు చేయించి, వారిని సేవించటంతో ఆదినం గడచిపోయింది.

మరొకసారి, ఇలాగే రంగపురానికి ప్రయాణం‌ కడితే, అదేదో‌ పరీక్ష అన్నట్లు మళ్ళా మరెవరో భాగవతోత్తముల రాక.

ప్రతిసారీ ఇలాగే జరుగుతూ రంగయాత్రా ప్రకటనం దినదిన కృత్యమై పోయింది.

అందుచేత ఎవరో భక్తుడు కులశేఖరులను ఉద్దేశించి చెప్పిన శ్లోకమే ఈ
   ఘుష్యతే యస్యనగరే రంగయాత్రా దినేదినే
   తమహం శిరసావందే రాజానం కులశేఖరమ్‌
   
అన్నది.

భగవధ్బక్త సేవనం భగవత్సేవనం‌ కన్నా దొడ్డది అని చెప్పే తదారాథనాత్పరమ్‌ తదీయారాథనం  అన్న నానుడి ఒకటి ఉంది. దానినే ప్రప్తత్తి అంటారు. ముకుందమాలను పారాయణం చేసేవారు ముందుగా ఈ‌కులశేఖరుల ప్రపదననాన్ని తెలిపే ఈశ్లోకాన్ని పఠించటం ఒక ఆచారం అయ్యింది.

ఐతే ఈ‌శ్లోకం దక్షిణదేశ ప్రతుల్లో లేదు. ఉత్తరదేశం లోని ప్రతుల్లో కనిపిస్తున్నది.

అనువాదం.

      కం. దినదిన మెవ్వాని పురిన్
      వినబడు శ్రీరంగయాత్ర వేడుక టముకై
      ఘనుడా కులశేఖరునకు
      మనసా శిరసా యివియె నమస్కారంబుల్.



28, జనవరి 2021, గురువారం

ధ్యేయుడు శ్రీహరి రాముడు

ధ్యేయుడు శ్రీహరి రాముడు మా యిలవేలుపు రాముడు 

మాయామర్మము లేనివాడు కడు మంచివాడు మా రాముడు


పతితపావనుడు రాముడు భవతారకుడు రాముడు

అతిసన్నిహితుడు రాముడు సతతసేవ్యుడు రాముడు

హితమితవచనుడు రాముడు ధృతకోదండుడు రాముడు

శ్రితమందారుడు రాముడు సీతానాథుడు రాముడు


కరుణానిలయుడు రాముడు కమలేక్షణుడు రాముడు

వరదాయకుడు రాముడు వందనీయుడు రాముడు

పరమసుందరుడు రాముడు భక్తవరదుడు రాముడు

నిరుపమానుడు రాముడు పరమేశ్వరుడు రాముడు


ఇనకులేశ్వరుడు రాముడు ఘనసచ్చరితుడు రాముడు

దనుజాంతకుడు రాముడు ధనుష్మదగ్రణి రాముడు

మనుజనాథుడు రాముడు మహీతలేశుడు రాముడు

మునికులవినుతుడు రాముడు మోహనాంగుడు రాముడు


27, జనవరి 2021, బుధవారం

పాడే రదె నిన్ను గూర్చి

పాడే రదె నిన్ను గూర్చి పరమాత్మా విబుధులు
ఆడే రదె ఆపాటల కదిగో నట్టువరాండ్రు

వినుచుండెడు వారలకు వేడుక జనియింప
కనుచుండెడు వారికెల్ల కనులపండువ కాగ
జననాథుడ నీముందు జానకమ్మ ముందు
దినదినమును చూడ పండువ దినమగు నిట్లు

ప్రతిగీతము రామసుగుణ వర్ణనాత్మకమై
ప్రతిగీతము రామలీలా వర్ణనాత్మకమై
ప్రతిగీతము రామకథా వర్ణనాత్మకమై
ప్రతిదినమును మీసభలో నతిశయంబుగ

రామ నీ‌ శాంతగుణము రాజిల్ల మోమున
రామ తమ ముద్రల నీ‌ ప్రాభవము తెలియగ
రామ ఈ నట్టువరాండ్రు రమ్యముగా నాడ
ఏమందుము నాభాగ్య మిదే కనుచుంటి

 

26, జనవరి 2021, మంగళవారం

అడవు లంటే పూలతోట

అడవు లంటే పూలతోట లనుకొందువా
అడవులలో తపసులుందు రనుకొందును

అడవి నుండ వ్రతదీక్ష అతివా నాకే నీ
పడతి యర్ధాంగి కదే వ్రతము కాదా
యడవుల చిరుపర్ణశాల లం దుందువా నీ
వడవి నుంటే నదే నా కంతఃపురమోయి

అడవుల రాకాసులుందు రని వినలేదా నీ
అడుగులలో అడుగువేసి నడచుదాన
ఇడుములబడ యుబలాట మెందు కతివా నా
కిడుములైన కుడుములైన హితము నీతోనే

పుడమి బ్రహ్మ నిన్ను నన్ను పుట్టించినాడే
అడవులలో గడుపమని అటులే‌ కానీ
అడలకువే సీతారాముడే వీడు నిన్ను
విడచి యెటులపోవునే చిడిముడి పడకే


రావయ్యా సీతారామ

రావయ్యా సీతారామ రక్షించవయ్యా
నీ వాడను నాబాధ నీది కాదా

భవారణ్యమధ్యమున పడియుంటిని దీని
నే విధిని గడచుటయో యెఱుగ రాక
నీ వెచ్చట నున్న గాని రావలయు నయ్య
కావగ మరి యెవరుగలరు కరుణా రసాబ్ధీ

భవమహాసాగరాన పడియుంటిని దీని
యవలి యొడ్డు చేరుటన్న దసలున్నదా
లవలేశము శక్తి లేదు  రామచంద్ర కృపాళో
నవనీతహృదయ సీతానాయక రావే

భవమహాసర్పపరిష్వంగబంధితుడ పాప
విషపుటూర్పులకు చాల వేగుచు నుంటి
భవదీయకృపామృతవర్షము కురిపించవే
వలయేశ వేగ నన్ను కావగ రావే

సీతారామా నీభక్తుడ

సీతారామా నీభక్తుడనే చేయందించవయా

ప్రీతిగ నీపదదాసుని బ్రోవగ బిరబిర రావయ్యా


కోపాలసులగు నరులమధ్య నే కూలబడితినయ్యా

పాపము వద్దు పుణ్యము వలదు పాహిపాహి రామా

ఏపగిదిని నన్నుధ్ధరింతువో యిక భారము నీదే

కృపాంబుధారలు కురిపించవయా నృపాలమణి రామా


గడబిడ పడకుము నేనున్నా నని కరుణగ పలుకవయా

పడిన కష్టములు చాలును సుఖములు బడసెద వనవయ్యా

గడచిన దానికి వగవకు నాకృప కలదని పలుకవయా

విడిపించితి నీ భవబంధములని వేడ్కను పలుకవయా


ఈకలిబాధల కోర్వగలేను నాకు నీవె దిక్కు

నీకన్యుల నేనెరుగను తండ్రీ నిన్నే నమ్మతిరా

ప్రాకటముగ నన్నుధ్ధరించవే భక్తవరద రామా

శ్రీకర శుభకర కరుణాకర హరి శ్రీవైకుంఠవిభో


23, జనవరి 2021, శనివారం

విల్లెత్త మన్నారా

విల్లెత్త మన్నారా విఱిచి చూపమన్నారా

అల్లరి పిల్లవాడ వైతివి నీవు


విల్లెత్తితి నారి దొడగ మెల్లగా వంచితినే

మెల్లగా వంచితివా నల్లనయ్యా

మెల్లగనే వంచితినే ఫెళ్ళుమని విఱిగెనే

అల్లరి కాదందువులే అంతేనయ్యా


ఎంతదొడ్డ విల్లయ్యా ఇట్టే విఱిచినావయ్యా

చింతించి లాభమేమి సీతా నేడు

పంతగించు రాజుల పనిపట్టినట్టి విల్లయ్యా

ఎంతో సులభమాయె నాకింతిరొ నాడు


ఆదరమున నాచేతికి నబ్బిన దా విల్లు

నీ దయితు నందుకనియె కాదన దా విల్లు

ఆదరించి నట్టి వింటి నంతలో విఱిచితివి

మోదముతో పెండ్లిపీట మీద కూర్చుంటివి


బదులీయ కున్నావు

బదులీయ కున్నా వెంత బ్రతిమలాడినా యింక

ముదమున మమ్మేలుకోర మోహనాకార


చిన్నచిన్న తగవులు చిత్రమైన తగవులు

పన్ని మాతో వాదులాడి బడలినావులే

అన్నియు నుత్తుత్తి కోపాలన్నది మాకెరుకే

యెన్ని చూడ మిట్టివో యినకులేశ్వర


గడుసుమాట లాడేవు గడబిడ సేసేవు

విడువకనే మాకొంగు వీరరాఘవ

పెడమెగము పెట్టు నీ వేషాలు మాకెరుకే

పడకదిగి చిరునగవులు పంచవయ్యా


అప్రమేయ యికచాలు నలుకలు పంతాలు

క్షిప్రప్రసాద సీతాచిత్తవిహార

విప్రవరులు నిదురలేప విచ్చేసి నా రదే

సుప్రభాత వేళాయె చూడవయ్యా


మనవిచేయ వలయునా

మనవిచేయ వలయునా మరిమరి నీకు నీవు
కనికరించకున్న నెట్లు డచును నాకు

గురువు కలుగలేదనుచు కుందగలేదు లోక
గురుడవైన నీవె నా గురుడ వంటిని నిన్ను
పరమభక్తి సేవించు వాడనైతిని భక్త
వరద యింక నాదీనత బాపవయ్యా యని

గొప్ప కీర్తి వలయునని కోరుటలేదు పదవు
లిప్పించ మనుచు పీడించుటలేదు సిరుల
కుప్పలు కావలయునని కోరుటలేదు నాకు
తప్పించుము దైన్యమో దశరథాత్మజా యని

వరములిమ్మనుచు నిన్ను బాధపెట్టను ముక్తి
కరుణించు మిప్పుడనుచు కష్టపెట్టను పరమ
కరుణాళుడవని నీదు కాళ్ళకు మ్రొక్కి దైన్య
మరసి వేగ నను కావు మయ్యా రామా యని

21, జనవరి 2021, గురువారం

శ్రీహరిని నమ్మితే

శ్రీహరిని నమ్మితే చిక్కు లెక్కడివి బుధ్ధి

మోహమున మునిగితే ముక్తి యెక్కడిది


సంసారమున నున్న శాంతి యెక్కడిది

మాంసపంజరములో మ్రగ్గుచునున్న

హంసకు స్వేచ్ఛపైన నాశ యెక్కడిది

కంసారిపాదపంకజముల యాన


‌బంగారము పైపిచ్చి వదులు టెక్కదిది

శృంగారమె బ్రతుకైతే శీలమెక్కడిది

దొంగగురువు దొరికితే త్రోవయెక్కడిది

అంగజుని తండ్రి దివ్యాంఘ్రుల యాన


తారకనామముండ తాపమెక్కడిది

ఆ రామనామరక్ష కంతమెక్కడిది

నోరారనుడువ మోక్షతీరము నీది

శ్రీరామ పాదరాజీవము లాన


చేరబిలిచి వరములిచ్చి

చేరబిలిచి వరములిచ్చి శ్రీరాముడు మన

సార దీవించు గద శ్రీరాముడు


పరతత్త్వము తానని భావమున నెఱిగి

నిరతంబును చక్కని నిష్ఠను కలిగి

నిరుపమాన భక్తిని నెరపెడు నరునకు

సరసుడైన నరపతి కరుణాప్రపూర్ణుడై


కులమతాల నెన్నక గుణదోషములను

తలపక హరిభక్తి తత్పరులందు

కలిసి సంకీర్తనము కలిసి సేవనము

వెలయించు వానిని వేడుకతో తాను


హరిని సేవించ తా నరుగుదెంచితిని

హరి సేవ కన్యములు త్యాజ్యంబులని

హరియే రాముడనుచు నంతరంగమున

మురియుచు సేవించు నరుని ముచ్చటతో


హరినామ ప్రియు లందరకు

హరినామ ప్రియు లందరకు అతివేడుకతో నమోనమో

హరిసేవాపరు లందరకు అమిత భక్తితో నమోనమో


హరిలో నుండిన దఖిలవిశ్వమని యరసిన వారికి నమోనమో

హరి విశ్వములో నన్నిట నుండుట నరసిన వారికి నమోనమో

హరి రూపములే చరాచరములని యెరిగిన వారికి నమోనమో

హరి కన్యము వేరొకటి లేదని యెరిగిన వారికి నమోనమో


కాలస్వరూపుడు హరియని తెలిసిన ఘనులందరకు నమోనమో

మేలును కీడును శ్రీహరిప్రసాదమే యను వారికి నమోనమో

పూలును ముళ్ళును హరిరూపములని పోల్చిన  వారికి నమోనమో

కాలకూట మమృతమును హరియని కనుగొను వారికి నమోనమో


హరినామములను రామనామమే అతిశ్రేష్ఠంబని వేడుకతో

హరి చరితంబుల రామచరితమే అత్యధ్భుథమని వేడుకతో

హరి రామాకృతి నారాధించుట అతిశ్రేష్ఠంబని వేడుకతో

హరి పరమాత్ముని శరణుజొచ్చిన భక్తులందరకు నమోనమో


సీతారామా సీతారామా

సీతారామా సీతారామా చిన్మయరూపా సీతారామా
చేతులెత్తి మ్రొక్కేము ప్రోవరా భూతలనాథా సీతారామా

ఇమ్మహి దేహమె నిజమని నమ్మితి మెంతో చెడితిమి సీతారామా
సొమ్ములు భూములు సుఖమని నమ్ముచు సోలిపోతిమి సీతారామా
నెమ్మనమున నిక నిన్నే గట్టిగ నమ్ముకొంటిమి సీతారామా
మమ్ము కావ వే రెవరున్నా రిక మంగళమూర్తీ సీతారామా

సారహీనమీ సంసారంబని చక్కగ తెలిసెను సీతారామా
తారకమంత్రము నీనామంబని అవగతమైనది సీతారామా
మీఱక నీయానతి నిక నెప్పుడు మెలగెదమయ్యా సీతారామా
కారుణ్యాలయ మాతప్పుల వెస మన్నించవయా సీతారామా

మౌనిజనాశ్రయ మంగళదాయక మరువము నిన్ను సీతారామా
జ్ఞానానందమయస్వరూప నిను ధ్యానించెదము సీతారామా
మానక చేసెదమయ్యా మేమిక నీనామ మెప్పుడు సీతారామా
దీనజనావన క్రిందకు మీదకు తిరుగలేమయ్యా సీతారామా

14, జనవరి 2021, గురువారం

రామ సీతారామ

రామ సీతారామ సుగుణధామ జయరామ
శ్రీమదయోధ్యాపురీధామ సార్వబౌమ

రామ రఘువరాన్వయసోమ శుభదనామ
రామ రిపుభయంకరనామ ఘనశ్యామ
రామ లోకావనఘననామ విజయరామ
రామ ప్రియదర్శన మునికామ సీతారామ

రామ సకలదనుజగణవిరామ భండనభీమ
రామ సకలలోకవినుతనామ పూర్ణకామ
రామ సదావైకుంఠధామ పరంధామ
రామ సర్వలోకాభిరామ సీతారామ

రామ జగద్విఖ్యాతనామ సుఖదనామ
రామ స్మరవిరోధినుతనామ పుణ్యదనామ
రామ శ్రీమద్దశరథరామ సుందరరామ
రామ భవవిమోచననామ సీతారామ


12, జనవరి 2021, మంగళవారం

నిన్ను పొగడువారితో

నిన్ను పొగడువారితో నిండిపోనీ పృథివి

సన్నుతాంగ రామచంద్ర చక్కగాను


భరతభూమి రామభక్తవరులతో క్రిక్కిరిసి

పరమశాంతిపూర్ణమై వర్ధిల్లనీ

నిరతమును నీ భక్తులు నీవిజయగీతికల

పరమానురాగముతో పాడనీ కలసి


దరహాసపూర్ణవదన దాశరథీ నీ దివ్య

కరుణామృతవృష్టిచే నిరతంబును

హరిభక్తుల మానసంబు లానందడోలికల

మరిమరి యూగుచు నీ మహిమనెంచనీ


సరిసాటియె లేని వాడ సాకేతరాజేంద్ర

పరమయోగిగణపూజిత పద్మనాభ

నిరుపమానసత్యకీర్తి ధరణిజాహృద్వర్తి

సురవిరోధిగణగర్వహరణమూర్తి


11, జనవరి 2021, సోమవారం

ప్రాణం

కం. ప్రాణము కలదా మట్టికి
ప్రాణము గాలికిని నీటివాలుకు కలదా
ప్రాణము కలదా అగ్గికి
ప్రాణము గగనంబునకును వరలునె చెపుమా

కం. కదలును గాలియు నీరును
కదలును మరి యగ్ని భూమి కదలును ఖతలం
బదియును దశదిశల కదలు
కదలిక లున్నపుడు ప్రాణకలితములు కదా

కం. కలదేని ప్రాణ మొకచో
కలదు కదా ప్రాణశక్తి ఘనసంచారో
జ్వలలీలాకలితంబై
యలరుచు సర్వాంగరాజి ననవతంబున్

తే. పంచభూతంబు లందిట్లు ప్రాణశక్తి
దివ్యమైయుండ పాంచభౌతిక మనంగ
వరలు సృష్టి కణకణము ప్రాణమయము
అమృతమయమైన దీసృష్టి యార్యులార

సీ. విత్తులో ప్రాణంబు వెలయును సూక్షమై
ఆ విత్తు కాయలో నణగి యుండు
పండౌను కాయయు ప్రాణంపు కలిమిచే
పండ్లు కాయుచునుండు పాదపంబు
ప్రాణముండుట చేత పాదపంబులు క్షోణి
వర్ధిల్లుచుండును వసుధ యొక్క
ప్రాణశక్తి వలన ప్రాణశక్తియె యిట్లు
సర్వంబు చక్కగ నిర్వహించు

ఆ.వె. ధరణి యందు మరియు ధరణీధరంబుల
నుండు పర్వతముల బండ లందు
నుండు బండరాళ్ళ నులుల మలచి
కొలుచు ప్రతిమ లందు కూడ నుండు

కం. వ్యక్తముగ జంగమముల న
వ్యక్తముగను స్థావరముల వర్హిల్లెడు నీ
శక్తిం దెలియగ నోపర
వ్యక్తులు బ్రహ్మవేత్త లఱయుదు రెపుడున్

ఆ.వె. వెలిని లోన నిండి వెలుగుచు బ్రహ్మాండ
వ్యాప్తమగుచు నుండు ప్రాణశక్తి
బ్రహ్మమనుచు బుధులు వాక్రుచ్చు తత్త్వమే
బ్రహ్మ మెఱుగు వాడు బ్రాహ్మణుండు



భూమి మీద పడియున్నావా

భూమి మీద పడియున్నావా విముక్తిని కోరుచు నున్నావా
రామరామ యని యన్నావా రాముని దయనే కన్నావా

శేషనాగపర్యంకశయానా శ్రీహరి జయజయ యన్నావా
దోషాచరప్రాణాపహరణచణ దురితనివారణ యన్నానా

రామా ప్రావృణ్ణీలపయోధరశ్యామా జయజయ యన్నావా
నీ మనమున హరి మోహనమూర్తిని నిండారగ కనుగొన్నావా

రామరామ రఘురామ పరాత్పర రావణసంహర యన్నావా
రామచంద్రపదరాజీవంబుల ప్రేమమీఱ పూజించేవా

రామా రవివంశాంబుధిసోమా కామితవరదా యన్నావా
రాముని దయగల వానికి పొందగరానిది లేనే లేదు కదా


9, జనవరి 2021, శనివారం

నిజము రాముడు తిరిగిన తెలుగునేల

నిజము రాముడు తిరిగిన తెలుగునేల రామతీర్థం

సుజనావళి అడుగడుగున రాముని చూచు రామతీర్థం


తెలుగునేలపై గుడిలో రాముని తలచము మూర్తి యని

తిలకింతుము శ్రీరామచంద్రుడే నిలబడె నెదుట యని

తలచెదము మాపుణ్యము పండగ దరిసెనమాయె నని

పలుగాకులు బొమ్మనుచు తలచుట వారి కుసంస్కారం


తెలుగుగడ్డకు కులదైవముగ వెలసిన రామునకు

తుళువలచే నపకారము గలిగిన దోషాచరణులకు

కలుగును హాని కలుగదు రాముని ఘనకీర్తికి లోటు

కలుషబుధ్ధుల వంశంబులకే కలుగును నాశనము


రాజకీయముల పేరిట రాముని రచ్చచేయు వారు

రాజాశ్రయమున మురిసి రాముని లావుమరచు వారు

రాజభయంబున రాము నెరుగని లాగున చనువారు

ఏజన్మంబున నించుక సుఖమన నింక బడయలేరు


శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ శ్రీరామ శ్రీరామ

శ్రీరామ శ్రీరామ సీతారామ


శ్రీరామ శ్రీరామ కారుణ్యధామ

శ్రీరామ శ్రీరామ జీమూతశ్యామ

శ్రీరామ శ్రీరామ సేవింతు నిన్ను

శ్రీరామ శ్రీరామ తారకనామ


శ్రీరామ శ్రీరామ శివచాపదళన

శ్రీరామ శ్రీరామ జితభృగురామ

శ్రీరామ శ్రీరామ చేయూతనీవే

శ్రీరామ శ్రీరామ చిన్మయరూప


శ్రీరామ శ్రీరామ జితదానవేంద్ర

శ్రీరామ శ్రీరామ దారిద్ర్యశమన

శ్రీరామ శ్రీరామ చేయందుకోవే

శ్రీరామ శ్రీరామ శేషాహిశయన


7, జనవరి 2021, గురువారం

అమ్మా యిపుడు

అమ్మా యిపుడు కొంచె మాగవమ్మ నీవు ముద్దు

గుమ్మా రమ్మా సోకు చేసుకొమ్మా నీవు


విల్లెత్తు వాని కొరకు వేచితి వెన్నేళ్ళో ఆ

విల్లెత్తి విరిచి నిన్ను పెళ్ళాడిన వీరుడు ని

న్నిల్లాలిని చేరగా నించుక జాగైనచో

తల్లడిలేవే పిచ్చితల్లీ బాగున్నదే


పది నెలలు వేచితివే పతిరాక కొరకు తల్లి

ఆదయుడైన తులువ రావణాసురుని తోటలోన

ముదిత నేడు పతిరాక ముహూర్తము జాగైన

మదిని తల్లడిలేవే మరియు బాగున్నదే


ఓ రామలక్ష్మి నీ వూరక నిట్టూర్చకే 

శ్రీరామచంద్రు లేమొ చేరవచ్చు వేళాయె

సారసాక్షి విరహాలు చాలించి రావే బం

గారు తల్లి యంగరాగాలు నగలు వేచేనే


మంగళ మనరే

మంగళ మనరే మహనీయునకు

మంగళ మనరే మన రామునకు 


మంగళ మనరే మదనశతకోటి

శృంగారమూర్తికి సీతాపతికి

మంగళ మనరే మారజనకునకు

మంగళ మనరే మగువల్లారా


మంగళ మనరే మదనారిధను

ర్భంగము చేసిన బాలవీరునకు

మంగళ మనరే మహితాత్మునకు

మంగళ మనరే మానినులారా


మంగళ మనరే మన యువరాజుకు

బంగరు తల్లికి వసుధాత్మజకు

మంగళ మనరే మాన్యచరితులకు

మంగళ మనరే  అంగనలారా


రామచంద్ర పాహిమాం

రామచంద్ర పాహిమాం రాఘవేంద్ర పాహిమాం

కోమలాంగ శ్యామలాంగ కోసలేంద్ర పాహిమాం


వీరవర పాహిమాం విబుధవినుత పాహిమాం

నీరజాక్ష పాహిమాం నిగమవినుత పాహిమాం

మారజనక పాహిమాం మంగళాంగ పాహిమాం

నారసింహ పాహిమాం నారాయణ పాహిమాం


విశ్వజనక పాహిమాం విశ్వవంద్య పాహిమాం

విశ్వవినుత పాహిమాం విశ్వార్చిత పాహిమాం

విశ్వపోష పాహిమాం విశ్వాత్మక పాహిమాం

విశ్వనాథ పాహిమాం విశ్వమూర్తి పాహిమాం


వరదాయక పాహిమాం సురనాయక పాహిమాం

నిరుపమాన పాహిమాం నిరంజన పాహిమాం

పరమేశ్వర పాహిమాం పరంజ్యోతి పాహిమాం

కరుణాకర పాహిమాం కమలనాభ పాహిమాం


4, జనవరి 2021, సోమవారం

రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా

రాకాసులు రెచ్చిపోయి రాజ్యాలేలేరా - రాజ్యాలేలేరా
తోకముడిచి హనుమంతుడు తొలగి నిలచేనా - తొలగి నిలచేనా

తెలుగువారి ఐకమత్య బలిమి వట్టిదేనా - చిలుకపలుకులేనా
తెలుగువాళ్ళ బుర్రల్లో తెలివి తక్కువేనా - తెలివిడి సున్నేనా
తెలుగువారి దైవభక్తి కలిమి డొల్లయేనా - నిలువున డొల్లేనా
తెలుగుగడ్డ మీద దేవతలకు చోటులేదా - నిలువనీడ లేదా

సోది కైన లేదు తెగువ శూన్యం మిగిలేనా - హైన్యం మిగిలేనా
వాద వివాదాలతో వేదన తొలగేనా - బాధలు తొలగేనా
కాదు కాదు కాదంటే కష్టం తగ్గేనా - నష్టం తగ్గేనా
రాదు రాదంటే ముప్పు రాకుండా పోదు - లేకుండా పోదు

తెలుగువాడి మెతకతనం తొలగవలె నేడు - తొలగవలె నేడు
తెలుగువాడు హనుమన్నై తిరిగి దెబ్బకొట్టి - తిరగబడ్డ నాడు
నిలువలేరు రాకాసులు తెలుగుప్రభల ముందు - తెలుగుగడ్డ మీద
తెలుసుకోండి నిజము రామదేవునిపై అన - దేవునిపై అన

తెలుగునేల

తెలుగునేల శ్రీరాముడు తిరుగాడిన నేల

తెలుగుజాతి శ్రీరాముని కొలుచుకొనే జాతి


ఇచట వారికి శ్రీరాము డిష్టదైవ మెపుడును

ఇచటి వారికి రామనామ మిష్టమంత్ర మెపుడును

ఇచటి వారి రామభక్తి యింతింతనరాదుగా

ఇచటి వారి కాంజనేయు డింటిపెద్దదిక్కు 


అట్టి దివ్యభూమి యిప్పు డసురుల పాలాయె

అట్టి రామమూర్తి కిప్పు డవమానమాయ

అట్టి రామపత్ని కిప్పు డవమానమాయె

పట్టుబట్టి రాకాసులు పాడుపనులు చేయ


పెదవివిప్పి పలుకరేమి పృథివినేలు ఘనులు

మెదలరేమి నాయకులు నిదుర నటియింతురు

కదలరేమి తెలుగువారు కడుగూర్చు రామునకై

బెదరి దైవద్రోహులకు బేలలైనారుగా


3, జనవరి 2021, ఆదివారం

రాముడంటే

రాముడంటే గౌరవమా రాకాసులకా

భూమిసుతను రాకాసులు పూజించేరా


రాముడికి కొత్తకాదు రాకాసుల దుండగాలు

ప్రేమతో బోధిస్తే వింటారా రాకాసుల మూకలు

రాముడి బాణాలకు రాకాసులు కొత్తకాదు

భూమికీ కొత్తకాదు ముష్కరుల నెత్తుళ్ళు


మాయలేడి వేషముతో మారీచుడు వంచించెను

మాయచే రామశిరము మలచినాడు రావణుడు

మాయాసీతను చంపి మాయచేసె వాడి కొడుకు

మాయలన్ని వమ్మాయెను మరి వారికి చావాయెను


మొన్నమొన్న శ్రీరాముని బొమ్మ నొకడు విరచెను

నిన్ననే దుష్టుడొకడు నిక్కి సీత బొమ్మ విరచె

చిన్నచిన్న తప్పులనుచు శిక్షించక విడువడుగా 

అన్నన్నా రాకాసుల నణిచివేయు రఘువీరుడు


రాముడి మీద ఆన

రాముడి మీద ఆన రాకాసులారా

మీమీ దుండగాలు మీకే చేటు 


సుబ్బయ్య బొమ్మకే దెబ్బవేసినారా

ఇబ్బందులపాలై ఏమయ్యేరో

సుబ్బయ్య మనవడిని చూడండి నామాట

దబ్బర కానేకాదు దండన తప్పదిక


తెలుగుజాతికి మొదలు తెలియ నాగజాతి

తెలుసుకోండి తెలిసీతెలియక దాని తో

కలహించి నెగ్గలేరు కాటికేపోయేరు

తలకుజాతి కాదు మీ తలకు తెచ్చుజాతి


పాము తోకను త్రొక్కి పారిపోలేరురా

ఏమూలదాగినా యిక మిము విడిచేనా

మీమీ కుతంత్రాలు మిమ్మే కొట్టేరా

ఏమాయదేవుడూ ఇప్పు డడ్డురాడు






ఏ రోజున ఏ గుడికో

ఏ రోజున ఏ గుడికో ఏ దైవమూర్తికో

ఈ రక్కసిమూక తాకి డేమి కర్మమో


వారిపనే యిదియని వీరు గోలచేయుదురు

వీరే చేయించిరనుచు వారు చెప్పుకొందురు

వీరి వారి యనుచరుల వీరంగా లటు లుండ

ఊరకనే వినోదించుచున్నదా దొరతనము


గుడులున్నది మనకొరకా గోవిందుని కొరకా

గుడుల మీద పైసలేరుకొనే దొరల కొరకా

గుడుల బాగు పట్టని బడుధ్ధాయిల్లారా

గుడులు మన తలిదండ్రులు కొలువుతీరిన యిళ్ళు


ముక్కలాయె తెలుగుగెడ్డ మూర్ఖులైరి పాలకులు

చక్కని అవకాశమిదే చిక్కినది విమతులకు

ఎక్కడుంటి వయ్య రామ ఎక్కుపెట్టవేమయ్య

నిక్కువముగ కోదండము నీచుల నణగించగ


పాహి పాహి జగన్మోహన

పాహి పాహి జగన్మోహన రామ

పాహి పాహి పరబ్రహ్మస్వరూప


పరమయోగిగణభావితచరణ

పరమభక్తగణభావితకరుణ

సురగణవందితసుందరచరణ

గరళకంఠహృద్గగనవిహరణ


వధార్హదానవవంశవిశోషణ

విధాతృసన్నుతవిజయవిహరణ

బుధవరగణసంపూజితసద్గుణ

మధురమధురశుభవాక్యప్రసరణ


కాలాతీతవిఖ్యాత పరాత్పర

పాలితత్రిభువనజాల సురేశ్వర

కాలమేఘఘననీలకళేబర

పాలయమాం హరి పరమదయాకర


1, జనవరి 2021, శుక్రవారం

కొత్త సంవత్సరం - కొత్త నిర్ణయం

కొత్త సంవత్సరం వచ్చేసింది.

ఎందరో కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

కొందరైతే ఆ నిర్ణయాలను ప్రకటిస్తారు.

కొంచెం మంది మాత్రమే వాటిని అమలు చేస్తారు.

నా నిర్ణయం వినండి. ఎన్నో లేవు లెండి ఒకటే. దానిని నిలబెట్టుకుంటే చాలు. 

"నేటి నుండి మాలిక వ్యాఖ్యల పేజీని చూడను"

ఇదే నండి కొత్త సంవత్సరం నిర్ణయం.

కారణం ఏమిటీ అంటారా?

మాలిక వ్యాఖ్యల పేజీలో కనిపిస్తున్న భాషను చూస్తున్నారు కదా? అదే కారణం. 

మళ్ళీ వచ్చే జనవరి 1న ఆపేజీని చూడటం గురించి ఆలోచిస్తాను.

మాలిక గురించి నిర్ణయం కొన్నాళ్ళ క్రితం తీసుకున్నదే. వారికి కూడా తెలియజేసినదే. నేటి నుండి అమలులో పెడుతున్నాను.