20, జులై 2013, శనివారం

శ్రీ చాగంటివారిపై వివాదం సమంజసమా?

భాస్కరంగారు ఒక టపా వ్రాసారు ఈ‌ విషయం మీద.  అది చాలా చక్కగా ఉంది. నా మాటగా రాద్దాం అనుకున్న ఈ‌ వ్యాఖ్య పెద్దది అయిపోయింది. అందుకని ఈ టపా.

ధూర్జటిగారి  కాళహస్తి మాహాత్మ్యం ప్రబంధంలో, తిన్నడి కథ ఉంది. అందులో  శివబ్రాహ్నణుడు అనే భక్తుడు, బోయవాడు తిన్నడి మొరటుపూజకు లబలబ లాడుతుంటాడు.  అది చూసి శివుడు, ఆ శివబ్రాహ్మణునితో ఇలా అంటాడు:

క. ఠవఠవపడ నేటికి మది
శివగోచర నీకు, నన్నుఁ జెంచొకఁదు శ్రుతి
వ్యవహారేతర మతమునఁ
దవిలి మహాభక్తిఁ గొలువ దయపుట్టుటయున్

గీ. ఆ కిరాతుని పూజ నంగీకరించి
నాఁడ దద్భక్తి నీవును నేఁడు చూతు
గాని నా వెన్క దిక్కునఁ గానకుండ
నడఁగి యుండుము తడయక యతడు వచ్చు

దీనిని బట్టి శ్రుతివిరుధ్ధం అయిన పూజనూ భగవంతుడు అంగీకరించాడు అని తెలుస్తోంది. అయితే, అది అమాయకత్వం‌ కారణంగానే జరిగిన వ్యవహారం.  అందుకే శివుడు అంగీకరించాడు. వేదధర్మం తెలియని వారూ వేదోక్తంగానే పూజలు చేయాలీ, లేకపోతే పాపం దోషం అనటం సరికాదు కదా! అయితే తెలియని వారు చేస్తే శివానుగ్రహం కలిగిందికదా అని తెలిసిన వారూ వేదధర్మాన్ని విడిచి పెట్టటం మహాదోషం.  అనేకమంది నిరక్షరాస్యులకు వేదోక్త విధానాల గురించి అవగాహన ఉండదు.  కాబట్టి అట్లాంటి గ్రామ్యపూజావిధానాలు దోషభూయిష్ఠం అని వాదించరాదు.


ఉపాధిబేధం చేత అధికారబేధం ఏర్పడుతోంది. అన్ని ఉపాధులకూ వేదప్రామాణ్యం అని ఎవరూ పట్టుబట్టరు కూడా.  

శ్రీకాళహస్తీశ్వరశతకంలో ధూర్జటి ఇలా అంటాడు:

ఏ వేదంబు పఠించె లూత భుజగం బే శాస్త్రముల్ సూచె తా
నే విద్యాభ్యసనం బొనర్చె కరి  చెం చేమంత్ర మూహించె బో
ధావిర్భావ నిదానముల్ చదువు లయ్యా కావు మీ పాద సం
సేవా సక్తియె కాక నిక్కమరయన్ శ్రీకాళహస్తీశ్వరా

అందుచేత విద్యాగంధం లేని బోయని భక్తీ, పూజావిధానాలు ఒకలా, వేద విరుధ్దంగా ఉండటంలో ఏ దోషమూ లేదు. విద్యాగంధమూ, వివేకవిజ్ఞానాలూ ఉన్న వారు, తమతమ స్థితికి తగిన ప్రామాణికమైన విధానాలను తప్పరాదు.

శ్రీ చాగంటివారు తమ ప్రవచనాల్లో చాలా స్పష్టంగా వేదప్రామాణ్యవిధిగా ఉన్న విషయాలనే చెబుతున్నానని అంటారు. శ్రుతి ప్రమాణానికి విరుధ్ధం కానంతవరకూ‌ స్మృతులూ ప్రమాణాలే. సృతి, స్మృతులకు విరుధ్దం కానంత వరకూ పురాణాలు ప్రమాణగ్రంథాలే.  ఇతిహాసాలు పురాణసమానాలు. ఐనా, అవి వేదసమ్మితాలుగా ప్రసిధ్ధికి వచ్చాయి.
"వేదవేద్యే పరే పుంసి జాతే థరథాత్మజే వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షాద్రామాయణాత్మనా" అని శ్రీమద్రామాయణమానికీ, పంచమవేదం అని మహాభారతానికీ ప్రశస్తి. వాటియందు శ్రుతిప్రతిపాద్యధర్మవ్యవస్థ ప్రతిఫలించటమే దానికి కారణం.

షోడషోపచారాదిక పూజనాలూ, పారాయణాదికాలూ ఋషి ప్రోక్తాలు. వేదసమ్మత విధానాలు. అటువంటప్పుడు లోకాచారంలో వైదికవిధివిధానాలకు ఈ కాలంవారు కొత్తరూపాలు కలిగించుతూ ఉన్నప్పుడు ఆయా కొత్తవిధానాల ఆర్షతను చాగంటి వారు పరిశీలించి, ప్రశ్నించటంలో‌ తప్పు పట్టవలసింది యేమీ లేదు. ఒకవేళ చాగంటి వారు అనాచారాలనూ, దురాచారాలనూ ప్రశ్నించకపోతేనే ఆశ్చర్యపోవాలి.

పూర్వం శ్రీశంకరభగవత్పాదులవారు అవతరించిన సమయంలో కూడా చదువుకున్న వారిలోనూ, వేదప్రామాణ్యతావిరుధ్ధంగా ఆచారాలు చెడి అనాచారాలుగా ప్రబలిపోయిన పరిస్థితి. అటువంటి దానిని ప్రశ్నించి, అటువంటి వివిధమతశాఖలను సంస్కరించి, అనాచారాలను ఖండించి పరిస్థితిని శంకరాచార్యులవారు చక్కదిద్దారు. 

ఎవరికైన కటువుగా అనిపించవచ్చును గాక, నేడూ అటువంటి అవ్యవస్థ యేర్పడి ప్రబలుతోంది. అందుచేత వేదప్రమాణవిరుధ్ధమైన అనాచారాలను శ్రీచాగంటి వంటి వారు ఖండించవలసిన అవసరం కూడా తప్పకుండా తలెత్తుతోంది. 


ఈ నాడు ఎందరెదరు బాబాలు, స్వామీజీలు, గురువులు, యోగులు - వీధివీధికీ భగవదవతారాలమని పూజలందుకుంటూ వెలిగిపోతున్నారో మీకూ‌ తెలుసు కదా? వీటిలో ప్రతివారికి వేలాది దేశవిదేశీ భక్తగణం.  మా స్వామి మాకు భగవంతుడే, ఆయనే సృష్టిస్థితిలయ కారకుడు, ధూపదీపనైవేద్యాలతో పూజిస్తాం - వారికే పురుషసూక్తంతో పూజిస్తాం అని ఈ‌ భక్తులు ఎంత గొప్పగా హడావుడి చేస్తున్నారో చెప్పనలవి కాకుండా ఉంది. కాదంటారా?

ఈ చాగంటివారి ప్రవచనాలమీద  TV9 వారు వివాదం లేవదీసిన నాడే, ఆ చానెల్ వారికి నేనొక లేఖ రాసాను. దానికి జవాబు యేమీ ఇప్పటికీ రాలేదు.  ఆ లేఖ పాఠం ఆసక్తి గలవారికోసం, ఇప్పుడు ప్రకటిస్తున్నాను.

ఆర్యా,
ఈ రోజు మీ ఛానెల్ చూడటం జరగలేదు,  పని మీద సిటీలో తిరుగుతూ ఉండటం వలన.   కొద్ది సేపటి క్రిందట ఇంటర్నెట్లో చూచాను ఒక విషయం.
తెలుగు బ్లాగుల్లో "పారాయణం లో పిడికల వేట" ప్రోగ్రాం పేరుతో మీ ఛానెల్ వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి మీద బురద చల్లే ప్రయత్నం చేసినట్లుగా టపాలు వచ్చాయి.  దయచేసి ఒక విషయం గమనించండి, దేనినైనా వివాదాస్పదం అంటూ చిత్రీకరించి వార్తా ఛానెళ్ళు కార్యక్రమాలు ప్రసారం చేయటం వెనుక  ఉద్దేశం తరచుగా సత్యాసత్యాలగురించి కాక సదరు ఛానెళ్ళ ప్రచార తాపత్రయం హెచ్చుగా ఉంటోంది.  మీ ఛానెలు అటువంటి పనులు చేయదని మీరు అనవచ్చు. అది వేరే సంగతి.  కాని వ్యాపారదృక్పధం కాక జనోధ్దరణకార్యక్రమంగా ఏదైనా ఛానెల్ నడుస్తోందని నమ్మేంత అమాయకత్వంలో ప్రజలు లేరని మీతో‌సహా అన్ని ఛానెళ్ళూ గ్రహించుకోవాలి.

మీతో సహా అన్ని ఛానెళ్ళలోనూ చర్చల పేరుతో‌జరిగేవి కేవలం ప్రహసనాలే అని అందరికీ తెలుసు. వంచనలూ ఆత్మవంచనలూ నిష్ప్రయోజనం.

మీరు చాగంటి వారిమీద నిందలు వేయదలచుకుంటే అలాగే కానివ్వండి. ఎటు ఉండే జనం అటు ఎప్పుడూ ఉంటారు.

ఇంత కాలం మీ ఛానెల్ వారు కొంతలో కొంత నయం అన్న అభిప్రాయంలో‌ ఉన్నాను.  ఒక వేళ ఆ అభిప్రాయాన్ని సమీక్షించుకోవలసి వస్తుందేమో‌ తెలియదు.

చివరికి సగటు తెలుగు వాడి పరిస్థితి?  ఏ వార్తా పత్రికలోని వార్తనూ‌ నమ్మే పరిస్థితి లేదు.  ఏ ఛానెల్ వారి కథనాలనూ నమ్మే‌ పరిస్థితి లేదు.  ఇంటర్నెట్‌లో వచ్చే‌ కథనాలకు ఎలాగూ విశ్వసనీయత తక్కువే.  ఘనత వహించిన దొరతనం వారు అనుగ్రహించే వార్తా ప్రసారాలను ఎలాగూ విశ్వసించలేము కదా?  ఇంకా మిగిలిన దారి అంటూ ఉన్నదా?

ఇలాంటి పరిస్థితి మనదేశంలోనే ఉందో ఇతరదేశాలదీ ఇదే‌ కర్మమో తెలియదు.

విశ్వసనీయత గురించి ఆలోచించవలసిందిగా మీతో సహా తెలుగు వార్తామాధ్యమానికి ఇదే నా విజ్ఞప్తి. పనికిమాలిన వార్తాకథనాలూ నిందాపూర్వకమైన మిడిమిడి విజ్ఞానులతో చర్చాకార్యక్రమాలూ కట్టిపెడితే మంచిది.

భవదీయుడు
తాడిగడప శ్యామలరావు.


ఆ వివాదం బయటకు వచ్చిన తరువాత అనేకమంది అనేకరకాలుగా దానిమీద టపాలూ వ్యాఖ్యలూ వ్రాసారు. 

మనవు అని ఒక బ్లాగులోవ్రాసిన టపాలోని అభిప్రాయాల మీద నా వ్యాఖ్యను జోడించాను కూడా.  ఆ బ్లాగుటపా 'కోర్కేలు లేని సంసారి, కోర్కెలు ఉన్న సన్యాసి, ఇద్దరూ "హిందుత్వ"కు దూరంగా ఉన్న వారే.' అని.  మొత్తం నా వ్యాఖ్య అంతా ఇక్కడ వ్రాయటం అనవసరమైన స్థలకాలహరణోద్యోగం కాబట్టి ఒక ముఖ్యభాగం మాత్రం ఎత్తి రాస్తున్నాను:

విషయానికి వస్తే చాగంటి వారు  దైవాన్ని 'తుఛ్ఛమైన' కోరికలు కోరటం సమంజసం కాదన్నారు కాని ధర్మబధ్దమైన కోరికలు కోరరాదని అనలేదు కదా?  ఆర్తోజిజ్ఞాసురర్థార్ధీ అని భగవానుడే చెప్పాడు.  ఇక్కడ అర్థము అంటే ధర్మబధ్ధమైన అర్థము అనే కాని తదన్యం‌ కానేరదు.  కోర్టుకేసులో ఆవలి పార్టీ ఓడిపోవాలని మ్రొక్కు కోవటం చేసిన యిరుపక్షాల వారిలో ఒకరిదైనా అక్రమమైన కోరిక కాదా?  గుర్రప్పందెంలో గెలవాలనో‌ లాటరీ రావలనో కోరుకోవటమూ తుఛ్ఛమే కదా?  పెద్దల వాక్యాలకు సొంతతెలివితో అర్థాలు తీయక ప్రమాణబుధ్ధితో గ్రహించటం నేర్చుకోవటం హితకారి అయిన ఆలోచన అని నా ఉద్దేశం.  ప్రతివారు మాకు మేమే ప్రమాణం అనుకోవటం సంఘవినాశ హేతువు. నేను అల్పజ్ఞుడనని మీ వివేకం మీకు బోధిస్తే నన్ను మన్నించండి.

ఏది ఏమైన ఒక విషయం స్పష్టం. పెద్దలు మనకు నచ్చినట్లే మాట్లాడాలీ లేకపోతే వారు తప్పుచేసినవారూ అనటం హర్షణీయం కాదు.  వారు ఏమి చెప్పినా మన అభ్యున్నతి కోరి చెబుతున్నారు. ఇష్టమైన పక్షంలో, చేతనైనంతవరకూ ఆ మంచి మాటలను ఆదరించి ఆచరించండి.  లేదా ఊరుకోండి.  పెద్దల జ్ఞానంలో లక్షోవంతుకూడా లేని మనం వారిని ఆక్షేపించి నోరుమూయించాలను కుంటే, అది జాతికి మంచి చేయదు. 

నాన్సెన్స్. మాకు మేమే ప్రమాణం అంటారా?  మంచిది. మిమ్మల్ని జయించే వారు లేరు. ఇంక యెవరూ, మీకు మంచి చెప్పలేరు, చేయలేరు. ఇతరులెవరూ కూడా మీకు చెడు చేయలేరు - ఎందుకంటే ఆ చెడేదో మీకు మీరే స్వయంగా చేసుకుంటున్నారు కాబట్టి.  ఇక మీ యిష్టం. 

స్వస్తి.

10 కామెంట్‌లు:

  1. భాస్కరం గారే ఆ వీడియో ఎడిట్ చేసిందేమో నని కూడా అనుమాన పడ్డారు. బావుంది

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాకూ ఆ వీడియో ఎడిట్ చేసి ఉంటారనే అనుమానం ఉంది. కాని, పూర్వాపరాలు విచారించకుండా వివాదాలు చేయటం ఛానెళ్లకి కొత్త కాదు. వాళ్ళ తంటాలు వాళ్ళవి పాపం!

      తొలగించండి
    2. శ్యామలరావు గారూ, నిన్నంతా వేరే ఒత్తిడులలో ఉండడంవల్ల వెంటనే మీ టపాపై స్పందించలేకపోయాను.
      1. ఆర్షహృదయాన్ని మీరు చక్కగా ఆవిష్కరించారు. అయితే బయట సువిశాలమైన ఆర్షేతర ప్రపంచం కూడా ఉంది. దాని విశ్వాసాలు దానికి ఉన్నాయి. వాటిని ఈ రోజున మనం గ్రామ్యపూజావిధానాలుగా పేర్కొనలేం. కాలమాన పరిస్థితులు అందుకు అంగీకరించవు.
      2. "ఉపాధి భేదం చేత అధికార భేదం ఏర్పడుతుంది. అన్ని ఉపాధులకూ వేదప్రామాణ్యం అని ఎవరూ పట్టుబట్టరు కదా" అన్నారు. ఈ వ్యాఖ్యద్వారా మీరు ఈ రోజున పైకి అనకూడని ఒక అంశాన్ని సూచించారు. దానిని నేను కూడా గుప్తంగానే ఉంచుతాను. మీరు ఆ జాగ్రత్త ఎందుకు తీసుకున్నారంటే కాలమానపరిస్థితులు సూటిగా ఆ మాట అనడానికి అంగీకరించవు కనుక. ఇదే విషయం ఇంకా అనేక అంశాలకు వర్తిస్తుంది.
      3. "విద్యాగంధమూ, వివేకజ్ఞానాలూ ఉన్నవారు తమ తమ స్థితికి తగిన ప్రామాణికమైన విధానాలను తప్పరాదు" అన్నారు. ఇక్కడ విద్యాగంధం, వివేకజ్ఞానం అన్నప్పుడు ఏ విద్య, ఏ వివేకం అన్న ప్రశ్న వస్తుంది. అవి లౌకిక విద్యావివేకాలు అయితే, అర్షసంప్రదాయానికి చెందినవారేకాక; ఒకనాడు గ్రామ్యులుగా భావించినవారు కూడా ఈరోజున వాటిని పొందుతున్నారు. మీరలా అనడంలో ఆర్షవిద్యావివేకాలను ఉద్దేశిస్తే, గ్రామ్యులు ముందునుంచీ అందులో సంపూర్ణ భాగస్వాములుగా లేరు. పురాణాలు వారి ఆధ్యాత్మికజ్ఞానానికి తోడ్పడచ్చు కదా అని మీరు అనచ్చు. వేదాధికారం, పురాణాధికారం అనే వింగడింపు వారిలో తాము ద్వితీయ శ్రేణి పౌరులమన్న భావన పెంచడం సహజం. ఒకప్పుడు ఆ భావన వ్యక్తమవక పోయినా ఇప్పుడు వ్యక్తమవచ్చు. ఇక కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఆర్షసంప్రదాయ పరిధిలోకి వచ్చే వారు కూడా ఆర్షవిద్యలకు ఈ రోజున దూరమయ్యారు. ఈ పరిస్థితిలో ఆర్షసంప్రదాయం తప్పవద్దని, వాటిని పాటించమని మీరు ఎవరికి చెబుతున్నారు? తమకు అందుబాటులో ఉన్న మార్గంలో వారు భక్తినీ, విశ్వాసాన్నీ ప్రకటించుకుని తృప్తి పడుతుంటే అది తప్పని చెప్పి ఎందుకు నిరుత్సాహపరుస్తున్నారు? ఇది ఉభయులలోనూ అయోమయాన్ని పెంచదా?
      4. చాగంటివారిపై టీవీ 9 చేసిన ప్రసారం, వారిపై మీకున్న విశ్వాసాన్ని గాయపరచడంతో మీరు స్పందించారు. అలాగే శ్రీ సాయిబాబా పై భక్తివిశ్వాసాలు ఉన్నవారిని చాగంటి వారి వ్యాఖ్యాలూ గాయపరచడం సహజం కాదా?
      5. "పెద్దల జ్ఞానంలో లక్షో వంతు కూడా లేని మనం వారిని ఆక్షేపించి నోరు మూయించాలనుకోవడం జాతికి మేలు చేయదు" అన్నారు. జ్ఞానమంతటినీ పెద్దలకే పరిమితం చేసి, మిగతావారు అనుచరమాత్రులుగా మిగిలి పోవడమూ జాతికి మేలు చేయదు శ్యామల రావుగారూ. అది అందరూ జ్ఞానాన్ని పెంచుకోవాలి. ప్రమాదో ధీమతామపి అన్నారు. పెద్దలు కూడా అప్పుడప్పుడు ప్రమాదపడతారు. అది ఎత్తి చూపకపోవడం వారికీ మేలుచేయదు.
      5. ఇప్పటికీ నేను చాగంటి వారు ఆ వ్యాఖ్యలు చేయడం ప్రామాదికమే ననుకుంటున్నాను తప్ప ఆంతర్యాన్ని శంకించడం లేదు. తమ వ్యాఖ్యలు విరుద్ధ సంకేతాలను అందించే అవకాశాన్ని ఆయన దృష్టిలో ఉంచుకోలేదనే అనుకుంటున్నాను. రాజకీయనాయకులే కాక, ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఎవరైనా సరే తమ మాటలు విరుద్ధసంకేతాలు ఇవ్వకుండా జాగ్రత్త పడవలసిందే. మీడియా పై విమర్శలు చేసేటప్పుడూ జాగ్రత్త పాటించాలీ. మీడియా పనితీరులో సవాలక్ష లోపాలు ఉండచ్చు, నేను కాదనను. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని మనమే మరింత జాగ్రత్తగా ఉండాలి. మీడియాకు అవకాశం ఇవ్వకూడదు. నేడు మనం జీవించే బాహాట సమాజంలో మీడియాను నిరాకరించలేము. దాని సానుకూల పాత్ర దానికి ఉంది.
      6. చివరగా ఒక వివరణ. టీవీ 9 చాగంటివారి మాటలను ఎడిట్ చేసి ఉండచ్చని నేను అనుమానం వ్యక్తం చేయలేదు. ఒకవేళ చాగంటి వారు, లేదా వారి అనుయాయుల నుంచి అటువంటి ఆరోపణ వచ్చి, అది నిరూపితమైతే...నని నా జాగ్రత్తకోసం అన్న మాట మాత్రమే అది.

      తొలగించండి
    3. భాస్కరంగారూ,
      మీ విస్తృతవ్యాఖ్యకు సంతోషం. నాకు అయోమయాన్ని పెంచే ఉద్దేశం లేదు,ఎవరినీ నిరుత్సాహపరచే ఉద్దేశమూ లేదు. సమాజంలో అందరూ జ్ఞావవిజ్ఞానాల్లో సమంగా ఉండరు కదా, ఉన్నత మైన జ్ఞానసముపార్జన గలవారి అభిప్రాయాలకు కొంచెం హెచ్చు విలువ ఇవ్వటం సమంజసం. కాదూ అంతా సర్వసమానం అంటే ఎవరూ చెప్పదగినవారూ కాదు, ఎవరూ ఎవరిమాటా వినవలసిన అగత్యమూ‌ లేదు. అలా అనుకుంటే పేచీ ఎమీ‌ ఉండదు కూడా. మీరన్నట్లు చాగంటివారు నబ్రూయాత్ సత్య మప్రియమ్‌ అనుకుని ఊరకుంటే బాగుండేదేమో నేటి సమాజంలో. ఆ సంగతి TV ఛానెళ్ళవాళ్ళూ మరికొంతమంది బ్లాగరు మిత్రులూ‌ ఎత్తిచూపినట్లుగా కనిపిస్తోంది. శ్రీచాగంటివారు ఆర్షసాంప్రదాయందృష్టిలో యేది ఉచితం‌యేది అనుచితం అన్న దృక్కోణంలో మాట్లాడారని నా అభిప్రాయం. అసలు అలా మాట్లాడే అధికారం వారికి లేనే లేదు అంటే వారిని నోరుమూసుకోవయ్యా అని చెప్పటమే. కొత్తదేవుళ్ళూ కొత్తగురుదేవుళ్ళూ రోజుకొకరు, ఊరికొకరుగా వెలుస్తున్నారు. వారివారి ప్రచారాలూ, శిష్యభక్తకోటులూ వారివి. వారిలో ఎవరికీ తగలకుండా మాట్లాడటం రోజురోజుకూ‌ నిశ్చయంగా అసాధ్యం అయిపోతుంది కాబట్టి అమాయకంగా ప్రవచనాలు చేస్తున్న చాగంటివారి లాంటివారూ, ఇంకా ఏదో అర్షధర్మం అంటూ అబిమానం కలిగి ఉన్న నా బోటి వారు ఖచ్చితంగా మౌన ముత్తమ భాషణమ్‌ అని గ్రహించుకోవలసి వస్తున్నది. కానివ్వండి. ఇంతకంటే ఏమి చెప్పగలను?

      తొలగించండి
  2. శ్రీ సాయిబాబా హిందూధర్మాన్ని పటిష్ఠపఱచడానికే వచ్చారు. ముఖ్యంగా హిందువులు పూర్తిగా మర్చిపోయిన సద్గురుపూజని గుర్తుచేయడానికే వారి అవతారం. వారి భక్తుల పొరపాట్లని వారికి ఆపాదించడం సరికాదు. ఇప్పుడు దేశంలో కొన్నివందల మిలియన్ల జనం ఆయన్ని అనుసరిస్తున్న తరుణంలో ఆయన మీద ప్రతికూలవ్యాఖ్యలు మేలు చేయవు. పురాణప్రవాచకులు ఎంత పండితులైనప్పటికీ ఆత్మదర్శి యైన సద్గురువుతో సమానం కాజాలరు.

    రిప్లయితొలగించండి
  3. స్వాగతం.

    పురాణప్రవాచకులు ఎంత పండితులైనప్పటికీ ఆత్మదర్శి యైన సద్గురువుతో సమానం కాజాలరని మీరన్నది సబబే. ఐతే, ఈ‌ రోజున బయట పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారుగా? ఎవరు ఏ విషయం మీద ఏ అభిప్రాయం వెలిబుచ్చినా దానికి తీవ్రస్థాయిలోన ఖండనమండనలు జరుగుతున్నాయి.

    కాబట్టి ఏమి వ్రాయాలన్నా, ఏమి చెప్పాలన్నా, కొంచెం ఇబ్బంది కరమైన పరిస్థితి.

    శ్రీచాగంటివారు కేవలం ఆర్షసంప్రదాయం గురించి మాత్రమే తమ ప్రవచనాలలో ప్రధానంగా ప్రస్తావిస్తూ ఉంటారు. మీరన్నట్లు శ్రీసాయిబాబావారు భగవదవతారమే‌ కావచ్చును. అవునో కాదో అది చర్చించటం చాగంటి వారి ఆశయం అని నేను అనుకోను. ఈ రోజున శ్రీసాయిప్రవచనాలుగా చెలామణీలో ఉన్న అభిభాషణలూ, గురుచరిత్రగా చెప్పబడే గ్రంథమూ స్వయంగా శ్రీసాయిబాబావారి ముఖతః వెలువడిన సంపుటి అనుకోవటం సరియైనదో కాదో చెప్పలేం. బహుశః ఆ సారస్వతంలో మీరన్నట్లుగా కొందరు భక్తుల పొరపాట్లో అత్యుత్సాహమో బాబావారి మాటలతో పాటి కలగలిసి ఉండే అవకాశమూ కూడా మనం కొట్టివేయలేం కదా.

    సద్గురువులను అనుసరించటం ముమ్మాటికీ సముచితం సముదాచారమూ అనటంలో ఎవరికీ సందేహం అక్కరలేదు. కాని ఒక్కమాట చెప్పండి. శ్రీసాయిబాబావారు తనకు గుళ్ళూగోపురాలూ కట్టి పట్టుబట్టలూ బంగారుకిరీటాలూ‌పెట్టి ధూపదీపనైవేద్యాలతో నిత్యం తనకు షోడశోపచారపూజలు జరగాలని ఆశించారా? ఇంతవరకూ మీరు నమ్మిన దైవమూర్తులను విసర్జించండి, నేనొచ్చానూ అన్నారా ఆయన? ఆయన ఎంత నిరాడంబరులు? ఈ గుళ్ళు గోపురాలూ పూజలూ పునస్కారాలూ ఎంత ఆడంబరంతో కూడి ఉన్నాయి? మీరే అలోచించండి దయచేసి.

    సద్గురువులు భగవంతుని మనకు దగ్గర చేసే మహాత్ములు. కాని మా సద్గురువే స్వయంగా భగవంతుడు. కాబట్టి మేము భగవదారాధనమాని మా గురువునే పూజిస్తామనతం సమంజసమా? శ్రీఆదిశంకరులను మనం‌ శివావతారంగా భావిస్తాం కాని ఆయనను ఆరాధిస్తూ శివకేశవులను దూరంగా పెట్టటం‌ లేదే? విశ్వామిత్ర మహర్షి స్వయంగా ప్రతిసృష్టి చేసారు - ఆయన అద్భుతమహిమావైభవం చూసి మనం ఆయనే దేవుడు అని పూజలు చేయటం లేదే? అందుచేత గురువుని భగవత్తత్త్వంతో ఏకీకృతం ఐన దివ్యాత్మస్వరూపునిగా గ్రహించి అనుసరించటం వేరు. ఇంక పాతదేవుళ్ళు ఎందుకూ కొత్తదేవుడు మా గురువుగారే చాలు అని అనటం వేరూ.

    మొన్న గురుపూర్ణిమ నాడు అంతా శ్రీసాయిబాబావారి ఆలయాలకు వెళ్ళి పూజలూ దర్శనాలూ చేసుకున్నారు. చాలా సమంజసమైన పని. కాని అది నిజానికి వ్యాసపూర్ణిమ అని గుర్తు పెట్టుకొని భగవాన్ వేదవ్యాసమహర్షిని వారిలో ఎంతమంది కనీసం సంస్మరించుకున్నారు? మీరన్నారే ' హిందువులు పూర్తిగా మర్చిపోయిన సద్గురుపూజని గుర్తుచేయడానికే' అని, కాని ఈ భక్తకోటి వ్యాసులవారిని విసర్జించటం ఏవిధంగా సముచితం?

    ఒకవేళ మీరూ ఇదంతా నేను శ్రీసాయిబాబావారికి ప్రతికూలంగా అజ్ఞానంతో చేస్తున్న దుర్వాఖ్యలు అనుకుంటే మరొక్క నమస్కారం అని తప్ప మరేమీ అనలేను.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా! ఎవరినీ అపార్థం చేసుకోవడం నాకిష్టం ఉండదు. బాబావారు ఎన్నడూ చెప్పనివి ఆయన సంప్రదాయమైనట్లు కొందరు ప్రచారం చేస్తున్న మాట వాస్తవం. హైదరాబాదులో ఒక మరాఠీ ప్రచారకుడు "స్త్రీలు కడగా ఉన్న రోజుల్లో సైతం బాబావారికి పూజ చేయొచ్చునని సెలవిస్తున్నా"డని నా దృష్టికొచ్చింది. ఆయనే బాబావారి పేరుతో హోమాలు కూడా ఇన్వెంట్ చేశాడు. ఇదంతా బాబావారు చెప్పలేదనేది నిజం. ఆయన పదే పదే చేసిన ప్రధానమైన బోధ ఏంటంటే : "ఆత్మజ్ఞానానికి నిరంతరం ధ్యానమవసరం. ఆ ధ్యానం నీకు కుదరకపోతే నా ఆకృతిని నఖశిఖపర్యంతం నీ మనసులో నిలుపుకో. నేను మా గురువుగారిని ఎలా సేవించానో నువ్వూ నన్నలా శ్రద్ధతో ఓర్పుతో సేవించు. నా చరిత్ర పారాయణ చేయి. నీ సంగతి నేను చూసుకుంటాను." అని! బాబావారి చరిత్రపారాయణ చేయక కేవలం లోకుల ననుసరించి ఆయన వెంటపడడం వల్ల ఆయన సంప్రదాయానికి చాలా నష్టం జరిగింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు సరిగ్గా నా అభిప్రాయాన్ని గ్రహించినందుకు చాలా సంతోషం. ఇలాంటి ప్రచారకులు పెద్దల బోధలను వక్రీకరించటమే కాదు వారి పట్ల అనేక అపచారాలు చేస్తున్నారు మాటలతో చేతలతో. అంతా కలిమహిమ.

      తొలగించండి
  5. *ఈ‌ రోజున బయట పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నారుగా? ఇలాంటి ప్రచారకులు పెద్దల బోధలను వక్రీకరించటమే కాదు వారి పట్ల అనేక అపచారాలు చేస్తున్నారు మాటలతో చేతలతో. అంతా కలిమహిమ*

    ఈ రోజే కాదు,ఎప్పుడు బయట పరిస్థితి ఇప్పుడున్నట్లే ఉంది. గురువులు మంచి వారా కాదా అనేది అనవసరమైన చర్చ. ముందర మీకు గురువు ఎందుకు కావాలి? ఆయన నుంచి ఎమి ఆశిస్తున్నారో స్పష్టత ఉండాలి. కేరీర్ ,డబ్బులు కావలసిన వారు గురువులకి దూరంగా ఉంట్టూ వాటి మీదే ఫోకస్ చేస్తే మంచిది. మీలాంటి వారు గురువులు కంచి స్వామి లాగా దేశమంతా కాలినడకన నడవాలి, ఏ.సి. రూములో కూచొంట్టున్నారు,కార్లలో గురువులు మోసం చేస్తున్నారనే భావన వదలుకోవాలి. మనకి ఇష్టం లేకపోతే పట్టించుకోకుడదు.
    ___________________

    మీరు మహా భాగవతం రాయటం ఎందుకు ఆపారు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రెండు మంచి ప్రశ్నలు వేశారు శ్రీరాం గారూ‌, ధన్యవాదాలు.
      ౧. మీలాంటి వారు గురువులు కంచి స్వామి లాగా దేశమంతా కాలినడకన నడవాలి, ఏ.సి. రూములో కూచొంట్టున్నారు,

      విచారించవలసిన సంగతే. అక్షరాలా ఏసీ రూమ్‌లో కూర్చొనే ఉదోగం మరి. పొట్టకూటికి తప్పనిసరైనది. ఈ వృధ్ధాప్యంలో ఆసరాలేనివారు ఓపికున్నన్నాళ్ళు ఇష్టమున్నా లేకున్నా జరుగుబాటుకోసం‌ శ్రమించవలసిందే కదా!

      ౨. మీరు మహా భాగవతం రాయటం ఎందుకు ఆపారు?
      ఇదే కాదు, మరికొన్ని ఆగిన పనులున్నాయి. సమయం‌ కేటాయించటం కష్టమై. ఆపటం ఇష్టమై కాదు. ఐనా ఎలాగో అలా కొనసాగించాలనే అనుకుంటున్నాను. అన్నీ సవ్యంగా జరిగితే అతితొందరలోనే విరామానికి విరామం.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.