24, జులై 2013, బుధవారం

పాహి రామప్రభో - 177


పూజలో మొదటి ఉపచారం దైవాన్ని ధ్యానం చేయటం.  మనం భగవంతుణ్ణీ యే దేవతాస్వరూపంగా భావించుకుని పూజించుకుంటున్నామో ఆ భగవత్స్వరూపాన్ని మన మనస్సులో చక్కగా ధ్యానం చేసి సాక్షాత్కరింప చేసుకోవాలి.   అలా చక్కగా ధ్యానం చేసిన తరువాత దేవుడికి మిగతా ఉపచారాల్ని సమర్పించుకోవాలి.  ఒక్క విషయం బాగా గుర్తు పెట్టుకోండి. దేవుదికి చేసే పూజ పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి.  మన ఇంటికి అతిథిని పిలిచామనుకోండి.  వచ్చిన అతిథిని పట్టించుకోకుండా మనకు తోచిన పనుల్లో‌ మనం కాలక్షేపం చేయటం తప్పు కదా?  అతిథి మర్యాద అనేది ఎలా చాలా శ్రద్ధగా చేస్తామో, దేవుడి పూజ కూడా అలాగే అత్యంత శ్రద్ధతో చేయాలి.

ధ్యానము

కం.  ధ్యానింతును నా యెడదను
మౌనీంద్రార్చితుని సర్వమంగళమూర్తిన్
జ్ఞానానందమయుండగు
భూనాధుని రామచంద్రమూర్తిని కూర్మిన్తాత్పర్యం.  రామచంద్రమూర్తి జ్ఞానానంద మయుడు.  సార్వభౌముడు. సర్వమంగళమైన స్వరూపం కలవాడు. అటువంటి శ్రీరామచంద్రమూర్తిని నా హృదయంలోఎంతో ప్రేమపూర్వకంగా ధ్యానం చేస్తున్నాను.


(జూలై 2013)