12, జులై 2013, శుక్రవారం

భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!

ముందు మాట.

మన తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది. అది వేయేళ్లకు పైగా కష్టపడి చిలికి జనుల దోసిట్లో కవిచక్రవర్తులు పోసిన అమృతం.

తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు వేమన అనే ఒక కవి. ఆ సంగతి యేమో గాని తినగా తినగా గారెలు చేదెక్కాయని ఒక సామెత ఉంది.  అలాగా తెలుగువాళ్ళకి తెలుగు మాట్లాడీ మాట్లాడీ విసుగెత్తిపోయినట్లుంది.  ఈ‌ మధ్యన అసలు తెలుగు మాట్లాడటమే నామోషీ అయిపోయింది.

ఈ రోజుల్లో జనం అన్నం అనటం మానేసి రైస్ అంటున్నారు.  పాటను సాంగు అంటున్నారు.  అమ్మా నాన్నా అని పిలవటం మోటు అనుకుంటున్నారు.  తెలుగు వద్దూ‌ అనుకుంటున్నారు.  నష్టం‌ ఎవరికీ?

మన ఎంత బాగ ఇంగ్లీషు వెంటబడినా ఇంగ్లీషువాళ్ళం మాత్రం కాలేము.  మనని మనం తెలుగువాళ్ళం అనుకోవటానికి మొహమాట పడుతున్నాం.  మనం‌ ఎవరిగా మిగల బోతున్నాం?  ఈ విషయం కాస్త ఆలోచించుకోవాలి మనం.

నేటి తల్లిదండ్రుల అతి కారణంగా పిల్లలకు తెలుగు అనేది ఒక చదువదగ్గ వ్రాయదగ్గ మాట్లాడ దగ్గ భాషలాగే కనబడటం లేదు.

మనం కోల్పోతున్నది మన ఉనికిని అని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి.  మన సాహిత్యం కూడా మన ఉనికిలో అతి ముఖ్యమైన భాగమేనని సవినయంగా మనవిచేస్తున్నాను. కాదని వాదించే‌ వారితో ప్రతివాదనకు దిగననీ మనవి చేస్తున్నాను. మనం అంతా కావాలనుకుంటే మన తెలుగు బ్రతికి బట్టకడుతుంది.  లేకపోతే కృశించి నశిస్తుంది. అంతా మన చేతిలోనే ఉంది.

ప్రస్తుత పరిస్థితులలో తెలుగు ఒక సబ్జెక్టుగా అభ్యసించే విద్యార్థులలో ఆసక్తి గలవారు మినహాయించి పిల్ల లెవరికీ తెలుగు పద్యాలు చదివి అర్థం చేసుకొనే శక్తి ఆసక్తి లేదు. నిజానికి చాలామంది మధ్యవయస్కుల పరిస్థితీ అదేనేమో. అందువలన శ్యామలీయం‌ బ్లాగులో కొన్ని ప్రబంధ భారత భాగవతాది కథలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. 

ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని పద్యాలూ కథలతో‌పాటే చెప్పుకుందాం అర్థతాత్పర్యాలతో సహా. ఇది కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. పద్యం చదవటం పట్ల ఆసక్తి పెరిగి, కొద్ది మందైనా తిరిగి సంప్రదాయిక సాహిత్యాన్ని చదవాలనుకుంటే నా కృషి ఫలిస్తుంది.

అందు చేత చదువరులు యీ శీర్షికను స్వాగతిస్తారని ఆశిస్తున్నాను.


దయచేసి మీ స్పందనను తెలియజేయండి.

8 కామెంట్‌లు:

  1. అస్తు!శుభం భూయాత్!!!

    రిప్లయితొలగించండి
  2. నాకు తెలుగంటే చాలా ఇష్టం. కానీ..
    పద్యాలు అర్థం కావు, పాటలు మాత్రం ఇష్టం..

    మీకు దమ్ముంటే.....

    ....పద్యాలంటే ఏంటి.. అవసలు ఎందుకు, ఎంత తెలుగు వస్తే పద్యం వ్రాయగలమో చెప్పండి చూద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ క్రింది లింకులు ఇంగ్లీషులో ఉన్నా, మీ ప్రశ్నల్నిపరిష్కరిస్తాయేమోనని...

      ఛందస్సెoదుకు:
      http://rksanka.tripod.com/telugu/chandassu_vissa.html

      పద్యం రాయాలంటే ఎంత తెలుగు తెలియాలి:
      http://rksanka.tripod.com/telugu/padyanadaka.html

      తొలగించండి
    2. కాయగారూ,

      మీకు తెలుగుభాష అంటే ఇష్టం అని చదివి చాలా సంతోషించాను. నాకు దమ్ముందా అని మీరు ప్రశ్నించటం ఎబ్బెట్టుగా ఉంది. సభామర్యాద కాదు. నాకు చేతనయిన కృషి నేను చేస్తున్నాను. మీకు నచ్చకపోతే చదవకండి. బలవంతం ఏమీ లేదు. నిజాయితీగా చెప్పాలంటే మీ‌ ప్రశ్నలు ఆలోచించదగ్గవే. కాని అడిగే విధానం అభ్యంతరకరంగా ఉండటం విచారకరం.

      స్పందించినందుకు ధన్యవాదాలు.

      తొలగించండి
  3. చాలా చక్కటి ప్రయత్నం. పోతన భాగవతం లోని పద్యాలు ముందుగా పరిచయం చెయ్యండి. ఇంకా అష్టదిగ్గజ కవుల పద్యాలు, పంచ మహా కావ్యాలనించి ప్రసిద్ధి చెందిన పద్యాలు, ఈ కాలం ప్రజానీకానికి అర్ధమయ్యే రీతిలో పరిచయం చెయ్యండి.

    రిప్లయితొలగించండి
  4. నాకు కూడా తెలుగు అంటే వల్లమాలిన అభిమానం... ఎక్కడ చూసిన తెలుగును ఖూని చేస్తున్నారు.. పెళ్ళి అని పలకడం కూడా రానివాళ్ళు ఎంతో మంది... ఇలాంటి సమయం లో మీరు చేస్తున్న ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. తెలుగును ఖూనీ చేయటానికి ఎలక్ట్రానిక్ & ప్రింట్ మీడియాలూ, సినీమాలూ, తెలుగుని నిషేధించి పారేస్తున్న నేటి ఆధునిక విద్యావిధానం వెఱ్ఱితలలూ, ఇంట్లో‌ కూడా ఇంగ్లీషే మాటాడుకోవాలని తాపత్రయ పడే తలిదండ్రులూ --- తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుంది.

      తొలగించండి
  5. ఆ.వె. భాగవతుల కెల్ల వందనంబులు నేడు
    మొదలు పెట్టి నాడ పోతనార్య
    ప్రోక్తమైన విష్ణుమూర్తి కథాసుధ
    భాగవత పురాణ వచన కృతిని

    పెద్దపిన్నల సమాదరంతో ఈ‌ శీర్షిక కొనసాగుతుందని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.