4, జులై 2013, గురువారం

మేము రామయోగులము మేము రామభోగులము

మేము రామయోగులము మేము రామభోగులము
మేము రామసేవకులము మాది రామకులము

శ్రవణీయ మనవరతము రమ్య రామనామము
నవనీతము కన్న రుచి భువిని రామనామము
దివిజు లెల్ల కొలుచుకొను దివ్య రామనామము
భవతారణసుఖనౌకగ పరగు రామనామము

శ్రీరాముడు మాకెప్పుడు స్నేహితుడు గురుడు
శ్రీరాముడు మాకెప్పుడు చెంతనుండు దైవము
శ్రీరాముడు మాకెప్పుడు చేదోడగు సోదరుడు
శ్రీరాముడు మాకు తండ్రి సీతమ్మ మా తల్లి

శ్రీరామ యనువారిని చేరుట మా నైజము
శ్రీరామ చింతన మా చిత్తముల కాహారము
శ్రీరాముని కథలు మా చెవులకు సంగీతము
శ్రీరామ సేవన మా జీవితపరమార్థము

1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.