9, జులై 2013, మంగళవారం

పాహి రామప్రభో - 162

ఆ.వె. మురికి యద్దమందు మూర్తి స్ఫుటముగా
గలుగ నట్లు పంచమలము లలము
కొన్న బుధ్ధి రామ నిన్ను గానదు నీవె
కనికరించ వలయు కమలనయన

(వ్రాసిన తేదీ: 2013-6-12)


2 కామెంట్‌లు:

 1. బాగుంది గురువు గారు
  మొత్తమ్మీద పాహి రామ ప్రభో ఇంకా కంటిన్యూ అవుతోంది; అభిననందనలు. రాయడం మానకండి. జనం చదువుతున్నారు; కామెంటకపోయినా.

  నేను మీ వందో పద్యం దగ్గిర్నుంచి ఇప్పటి దాకా మిస్ అయ్యేను శెలవులో ఉండడం వల్ల. అన్నట్టు చెప్పడం మర్చిపోయేనండోయ్, ఈ సారి ఇండియా ట్రిప్పులో పోతన భాగవతం ఐదు సంపుటాలు కొన్నాను. మొదటి పద్యం (శ్రీ కైవల్యపదంబుకై నే చింతించెదన్..) చదవగానే బుర్ర తిరిగిపోయింది. తర్వాత దాన్ని రోజుకెన్ని సార్లు చదివానో! మళ్ళీ వామానావతారం చదివాను (మళ్ళీ, మళ్ళీ చదువుతూ ఉన్నాను). వామనుడు కాలు సాచాడుట బలి కడగడానికి (... నానా వేదముంబాదమున్) అదీ, ఎలాంటి హస్తం ముందుకు సాచాడో తర్వాత.. ఇలాంటి పద్యాలు పోతన తప్ప ఇంకెవరు రాయగలరు? పద్యాలు రాసేవాళ్ళు మొదట్లో పలికించెడు వాడు రామభద్రుడట అన్నా, కొంతకాలం పోయేక చూసావా నేను ఎంత గొప్పగా రాస్తున్నానో అనే గర్వం వల్ల మిగతాది సరిగ్గా రాయలేరు అని నా ఆభిప్రాయం. కానీ పోతనకి ఇలాంటి గర్వం ఏ పరిస్తితుల్లోనూ రాలేదు కనక అలాంటి పద్యాలు, భాగవతం రాయగలిగేదు అని నేను అనుకుంటున్నాను. దీనికి ఎంతో భగవత్సేవ చేసి ఉంటాడు ఆయన; ఎంత అదృష్టవంతుడో.

  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ముందు మాటే అదిరిపోయింది. 5 పుస్తకాలు టిటిడి వారు ఆర్ట్ పేపర్ మీద వెయ్య రూపాయలకి అమ్ముతున్నారు. చీప్ కిందే లెక్క. తెలుగు వాడిగా పుట్టి ఈ పోతన భాగవతం చదవకపోతే జీవితం శుద్ధ దండగ అనే అభిప్రాయం ఇప్పుడు బాగా బలపడింది.

  రిప్లయితొలగించండి
 2. భాగవతం చదువుతున్నారు. చాలా సంతోషం.

  నేను అన్న అహమికతో భగవత్సంబంధమైన రచనలు చేయటం మంచిది కాదు.

  మురికి అద్దంలాంటి మనస్సులో భగవత్పకాశం వ్యక్తం కావటం‌ కష్టం కాబట్టి, దానిని మనం సరిగ్గా వ్యక్త పరచటం దాదాపు అసాధ్యం - యీ నేను అనే దాని అడ్డు ఉన్నంత వరకూ.

  పోతన ధూర్జటులవంటి వారు ధన్యులు అందుకే.

  ఇక నేనంటారా, యేదో సాధకుడనైతే కావచ్చు నేమో కాని అంత కంటే మరేమీ లేదు. అభ్యాసేనతు కౌంతేయా అని గీతాకారుడి ఉపదేశం‌ కదా, అందుకే నా చేతనైన ధోరణిలో అభ్యాసం చేస్తున్నాను. అంత కంటే ప్రత్యేకత యేమీ లేదనుకోండి.

  వీలు వెంబడి మీరు చదవలేక పోయిన పద్యాలు చదవవచ్చును. దాని కేమి.

  మీ పునర్దర్శనం ఆనందకరం.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.