22, జులై 2013, సోమవారం

భాగవతం 1.3: శ్రీవేదవ్యాస భగవానులవారికి కలిగిన విచారం

ఆ సూతపౌరాణికులవారు మహర్షుల ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఉపక్రమించారు.

మహర్షులారా ద్వాపరయుగం చివరలో శ్రీహరియొక్క దివ్యకళతో శ్రీవేదవ్యాసభగవానులవారు అవతరించారు.  ఒకనాటి సూర్యోదయ సమయం. వ్యాసులవారు బదరికాశ్రమం దగ్గర సరస్వతీ పుణ్యనదీ జలాలలో స్నానం పూర్తిచేసుకున్నారు.  ఒంటరిగా కూర్చుని రాబోయే కలియుగం యెలా ఉంటుందో అందులో మానవజాతి ప్రవర్తన యెలా ఉంటుందో అని అనుకున్నారు. అది ఎంత ఘోరంగా ఉండేదీ వారి మనస్సుకు రాగానే వారికి ఎంతో విచారం కలిగింది.

ఎలా ఈ‌ మానవజాతికి హితం చేకూర్చాలీ‌ అని ఆలోచించారు.  కలియుగంలో మానవుల శక్తి స్వల్పం. బహు విస్తారంగా ఉండే వేదాన్ని అభ్యసించటం కలిలో మనుషులకు శక్తికి మించిన పని.  అందుచేత ఎంతో ఆలోచించి, మానవులకు సులభంగా ఉండటం కోసం ముందుగా వేదరాశిని నాలుగు విభాగాలుగా చేసారు.

వాటిలోఋగ్వేదాన్ని పైలుడనే మహర్షికి ఉపదేశించారు. అలాగే సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు.  యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు. అధర్వవేదాన్ని సుమంతుడికి ఇచ్చారు.

ఇలా వేదవిభాగాల్ని ఆయా ఋషీంద్రులు వ్యాసభగవానుల వలన గ్రహించి తమతమ శిష్యగణంద్వారా వాటిని మానవలోకంలో ప్రవర్తింప జేసారు.

అయితే ఇంకా ఒక చిక్కు మిగిలే ఉందని వ్యాసులవారు అనుకున్నారు.  వేదాలను అధ్యయనం చేసే అధికారం బ్రహ్మవేత్తలుగా ఉండే బ్రాహ్మణులకే తప్ప అన్యులకు లేదు.  అలాగే అబ్రాహ్మణులకే కాక,  స్త్రీలకూ వేదవిధ్యాధికారం లేదు. మరి వారికి ఏదీ అభ్యున్నతి కలిగేదారీ అని కరుణామూర్తులైన వేదవ్యాసులవారు ఆలోచించారు. 

అప్పుడు ఆయన చక్కగా మహాభారతాన్ని మానవులకు అందరికీ ఉపయుక్తం అయ్యేటట్లుగా నిర్మించారు.  ఈ మహాభారతం చెప్పే సందర్భంలో భగవానులు వేదార్థసారం అంతా దానిలో నిక్షేపించారు.  అందుకే, అది పంచమవేదంగా ప్రసిధ్ధి గడించింది. మహాభారతాన్ని అధ్యయనం చతుర్వర్ణాలవారూచేయవచ్చు.  స్త్రీలూ పురుషులూ అనే బేధం లేక అందరూ మహాభారతాన్ని అధ్యయనం చేసి మేలు పొందవచ్చు.

ఇదంతా మానవజాతిలో బుధ్ధిమంతులందరికీ చాలా సంతోషం కలిగించింది. ఋషిగణం అంతా ఆయనను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా గుర్తించి కీర్తించింది.

అయినా వ్యాసులవారికి సంతోషం కలగలేదు.  ఇంకా ఆ భగవానుల మనస్సుకు తృప్తిగా అనిపించలేదు.

మరలా ఒకనాడు ఒంటరిగా సరస్వతీ నదీ‌ తీరాన కూర్చుని తనలో తాను ఈ విషయమై చాలా బాధపడ్డారు.

ఎంతో‌ ఆలోచించగా, ఆయనకు ఒక విషయం బోధపడింది.

తాను ఎంతగా కృషిచేసి వేదవిభాగం చేసీ, మహాభారతం అనే గొప్ప ఇతిహాసం నిర్మాణం చేసీ కూడా, ఈశ్వరుడి మెప్పును మాత్రం ఇంకా పొందలేక పోయాడు.  అయ్యో,  శ్రీహరికీ, మహాయోగులకీ ఎంతో ఇష్టమైన భగవంతుని కథలను చక్కగా చెప్పలేదే నేను!  ఎంత మోసపోయానూ, ఎంత పొరపాటు చేసానూ! నాకు ఇన్నాళ్ళూ ఆ బుధ్ధి ఎందుకు కలగలేదూ అని చాలా చాలా విచారించారు.

ఇప్పుడు తనకు ఏమిటి కర్తవ్యం అని ఆయన ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది.

అప్పుడు వ్యాసులవారి వద్దకు శ్రీనారదమహర్షులవారు వచ్చారు.  శ్రీనారదులు బ్రహ్మమానసపుత్రులు.  వారు శ్రీహరికి పరమభక్తాగ్రగణ్యులు. సమస్తమూ తెలిసిన వారు.  ఆయన విచ్చేయటంతో వ్యాసభగవానులవారు పరమానంద భరితులయ్యారు.

వచ్చే టపాలో నారదులవారు వ్యాసులవారితో సంభాషించిన విషయాల గురించి తెలుసుకుందాం.