13, జులై 2013, శనివారం

పద్యాలంటే ఏమిటి.. అవసలు ఎందుకు?

ఈ రోజున (జూలై 13, 2013) ఈ ప్రశ్న వచ్చింది.
ప్రశ్న వేసింది  కాయ   గారు. అది వారి బ్లాగు ప్రొఫైల్ పేరు. వారి అసలు పేరు నాకు తెలియదు.

ఈ నాటి పరిస్థితులలో, అంటే తెలుగుభాష ఉన్న స్థితిలో, ఇది చాలా సమంజసమైన ప్రశ్న అనటంలో సందేహం లేదు.

ఈ ప్రశ్నకు సశాస్త్రీయంగా సమాధానం చెప్పటానికి నేను భాషాశాస్త్రవేత్తను కాదు.  కనీసం, తెలుగు పండితుడిని కూడా కాదు.

తెలుగుభాషలో నాకున్న పరిజ్ఞానంతో పద్యకవిత్వం వ్రాయటంలో నాకున్న స్వల్పాతిస్వల్పమైన కౌశల్యంతో ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి నేను ఉపక్రమించటం నిజంగా సాహసమే.

అయినా, ప్రయత్నిస్తున్నాను.  తప్పులుంటే విజ్ఞులు మన్నించగలరని ఆశిస్తున్నాను.  నాకన్నా హెచ్చు పరిజ్ఞానమూ, కవనశక్తీ, పాండిత్యమూ వగైరా అర్హతలున్నవాళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు.  అంతర్జాలంలోనే అనేక మంది ఉండవచ్చును కూడా.

కాని యీ‌ ప్రశ్న ఈ బ్లాగులో నన్ను అడగటం జరిగింది.  ఒకింత తీవ్రస్వరంతోనే అడగటం జరిగిందనీ చదువరులకు తెలుసు.  కాబట్టి, బాధ్యత తీసుకుని నా శక్తిమేరకు సమాధానం అన్వేషిస్తాను.

ప్రపంచంలో అనేక భాషలున్నాయి.  కాలక్రమేణ అంతరించిపోయిన భాషలూ అనేకం ఉన్నాయి.  వాటిలో కొన్ని ప్రజలవాడుకలో లేకపోయినా, వాటిలో ఉన్న సాహిత్యసంపద లేదా చారిత్రకవివరాల కారణంగా ఇంకా ప్రజలు వాటిని అధ్యయనం చేయటం జరుగుతూనే ఉంది.  అటువంటి సంప్రదాయం కొనసాగుతుంది కూడా.

అన్ని భాషలలోనూ గొప్ప కవులున్నారు నాడు నేడూ.  అన్ని భాషలలోనూ సాహిత్యం ఉంటుంది.  తమతమ భాషలలోని ప్రాచీన మరియు ఆధునిక సాహిత్యాలను ఆదరించాలా గౌరవించాలా ఆవలపారెయ్యాలా అనేది ఆయా భాషలను తమవిగా చెప్పుకునే ప్రజలు నిర్ణయించుకోవాలి.  ఒక్క విషయం మాత్రం స్పష్టం.  స్వభాషనూ దానిలోని సాహిత్యసంపదనూ గౌరవించుకుంటే దానితో సంబంధ ఉన్న ప్రజలకు మేలు జరగవచ్చు.  స్వభాషనూ దానిలోని సాహిత్యసంపదనూ నిరాదరణకుగురిచేస్తే నష్టం యేదయినా కలిగితే అది కూడా దానితో సంబంధ ఉన్న ప్రజలకు మాత్రమే.

ఈ రోజున ఉన్న ప్రజల ఆలోచన యేమిటీ అంటే సాహిత్యం అధ్యయనం చేయటం అనేది కూడు పెట్టే వ్యవహారం కాదు కదా అలాంటప్పుడు దాని కోసం సమయమూ ధనమూ దండగ చేసుకోవటం యేమంత అవసరమూ అని.  అసలు, ఇంగ్లీషు అంతర్జాతీయ భాష కాబట్టి ఆ భాష బాగా వస్తే చాలు, బాగా బ్రతకవచ్చునూ తెలుగెందుకూ‌ అని నేటి తరాల ధోరణి. ఈ‌ అలోచనతో పిల్లలు తెలుగులో‌ మాట్లాడరాదని కట్టడిచేసే బడులున్నాయి.  పిల్లలు తెలుగులో‌ మాట్లాడరాదని ఇంట్లో తామే ఇంగ్లీషులో తప్ప మాట్లాడకుండా జాగ్రత్తపడే తల్లిదండ్రులున్నారు.  పిల్లలకు తెలుగులో మాట్లాడటానికే బ్రహ్మప్రళయంగా ఉంటే ఇంక వాళ్ళకు తెలుగుసాహిత్యం గురించి ఏమని చెప్పగలం? 

అందుచేత ఈ రోజున తెలుగు పద్యం అంటే ఆమడ దూరం పారిపోతున్నారు జనం.  అదేదో తలనొప్పి వ్యవహారం అని.  మంచిది.  నేడు మనం ఆరాధిస్తున్న ఇంగ్లీషు భాషలోనూ బోలెడు సాహిత్యం ఉంది.  అదంతా ఫక్తు వచనం కాదే.  షేక్‌స్ఫియర్ పదహారవ శతాబ్ది వాడు. ఆయన నాటకాలలోని భాష నేడు మాట్లాడే ఇంగ్లీషు కన్నా కొద్దోగొప్పో తేడాగా ఉండి చదవగానే అర్థం కాదు.  కాని ఇంగ్లీషువాడింకా ఆయన నాటకాలను చదివి ఆనందించటానికి ఉవ్విళ్ళూరుతూనే ఉంటాడు. ఆంగ్లసాహిత్యం అంతా వచనం కాదే.  వాళ్ళకూ రకరకాల ఛందస్సులున్నాయి.  ఇవన్నీ‌ ఎందుకుండాలీ అని ఇంగ్లీషువాడు అడగడు.  తెలుగువాడు మాత్రం పద్యం ఎందుకుండాలీ అంటాడు.  ప్రపంచంలో తెలుగువాడు ప్రత్యేకజాతి మనిషి అనే చెప్పాలి.

కవులందరూ వచనంలోనే ఎందుకు వ్రాయలేదు. వాళ్ళు పద్యాలంటూ యెందుకు వ్రాసారూ అన్న ప్రశ్నకు వద్దాం.

అన్ని భాషలలోనూ లిఖిత సాహిత్యం కన్నా పాట అనేదే ముందు పుట్టిందని ఒక అబిప్రాయం ఉంది.  అది నిజమే అనిపిస్తుంది.

పాట అనే దానిలో‌ ఒక అంతర్లీన మైన ఒక తూగు ఉంటుంది. దానిని వ్యక్త పరచేందుకు పదాలను అందంగా పేర్చటం అనే ఒక కళ ఉంటుంది.  పాట యొక్క నడకను మనుషులు తమ తమ హావభావాలతోనూ, చేతితో, వాయిద్యాల సహకారంతో ఉద్దీపనం చేసే అవకాశం ఉంటుంది.  రకరకాల భావోద్వేగాలను వ్యక్తీకరించటానికి తగిన సాధనంగా పాట బ్రహ్మాండంగా ఉపయోగిస్తుంది.  పాట కట్టటానికి కొంతప్రావీణ్యం ఉండాలన్నిది నిజమే‌కాని పాండిత్యం అవసరం మాత్రం తక్కువ.  నిజానికి పండితులు వ్రాసిన పాటలు చాలా మొక్కుబడి వ్యవహారంగా ఉంటాయి.  దానికి కారణం పాట కట్టటానికి ముఖ్యమైనది అనుభూతి గల మనస్సు కాని పాండిత్యం‌ కాకపోవటమే.

మొదట్లో పాట వచ్చి, లిఖితసాహిత్యం తరువాత వచ్చింది అని చెప్పుకున్నాం కదా.  మానవనాగరికతకు సాంఘికరూపాలు ఏర్పడటం మొదలయ్యాక వారికి తమతమ సంప్రదాయాలనీ, పెద్దల కథలనీ వారసత్వసంపదగా తరతరాలకూ అందించాలన్న తపన పెరగటం జరిగిందనటం వాస్తవదూరం కాదు.  మొదట్లో ఇలా వీటిని భద్రపరచుకుందుకూ వివిధభాషలవాళ్ళు పాటనే ఆశ్రయించారనటమూ అసత్యం‌ కాదు.

కానీ, పాటకు ఒక పరిమితి ఉంది.  ఒక్కో‌భావోద్వేగాన్నీ ఒక్కో రకంగా వ్యక్తీకరించటానికి తరచుగా అనేక పాటలు జమ చేయవలసిందే కాని పాటను పొడిగించుకుంటూ పోవటం చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది.  ఒకే నడకతో సాగే పాటతో రకరకాల భావోద్వేగాలు చక్కగా పలికించటం తరచుగా కుదరదు మరి.

అందుచేత భావోద్వేగాలను చక్కగా వ్యక్తం చేసే మరొక సాధనం కావలసి వచ్చింది.  వచనం ఉండనే ఉంది. కాని వచనం ధారణకు అంత అనువైనది కాదు. దానిలో లయను చొప్పించకపోతే ధారణ కుదరదు - భావం‌ పలకదు.

పద్యం వచ్చింది. రెండో నాలుగో‌ పాదాల్లో లయాన్వితంగా భావాన్ని పలికించగల సాధనమే అది.  దానితో‌ సమస్య తీరింది.  చిట్టి పొట్టి భావాలనుండి,  కొంత గంభీరమైన భావాన్నీ చక్కగా సూటిగా, లయాన్వితంగా చెప్పే అవకాశాన్ని అది ఇచ్చింది.

అనేకరకాల తూగు చూపించేందుకు అనేకరకాల పద్యాలు వచ్చాయి.

ఉదాహరణకు ఈ పద్య పాదం చూడండి:
 చెల్లియో‌ చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచి రందరున్

ఈ చెల్లియో చెల్లకో పద్యం తిరుపతి వేంకట కవులు రచించిన పాండవోద్యోగం నాటకం లోనిది.  బహుశః  నేటి తరం వాళ్ళకు యిది సరిగా తెలియక పోవచ్చును.  కాని ఒకప్పుడు పొట్టపొడిస్తే అక్షరంముక్క రాని పశువులకాపర్లు కూడా ఈ‌పద్యాన్ని ఎంతో భావస్ఫోరకంగా రాగ యుక్తంగా పాడుతూ‌ ఆనందిస్తూ ఉండే వాళ్ళు.  నేనే ప్రత్యక్ష సాక్షిని.  ఇంకా ఎందరో ఇలాంటి ఘట్టాన్ని చూసి ఉండవచ్చును.  పశువులనుకాసే వాళ్లకు చదువురాదు.  కాని పద్యాన్ని విని ధారణ చేసి తిరిగి విన్నది విన్నట్లుగా పాడుకుని ఆనందించటం వెనుక నున్న రహస్యం ఏమిటి?  పద్యంలో ఉన్న లయ. పద్యంలో ఉన్న బిగువు.  పద్యం పాడటంలో ఉన్న భావస్ఫూర్తి.  వాళ్ళు నాటకం చూసి ఈ పద్యం నేర్చుకున్నారు.  కేవలం విని నేర్చుకున్నారు.  అంటే నాటకంలో ఇదొక్కటే పద్యమా?  పద్యాలు తప్ప మరేమీ‌ లేవా?  లేకేం బోలెడు పద్యాలున్నాయి.  బోలెడు సంభాషణలున్నాయి.  అన్నీ‌ దాదాపు ఒకేరకమైన భాషలోనే ఉన్నాయి.  మరి పశువుల కాపరులు కేవలం‌ పద్యాలనే హెచ్చుగా గుర్తుపెట్టుకో గలగటానికి కారణం‌ ఏమిటి?  సమాధానం ఒకటే,  వచనంలో లేని తూగు పద్యంలో ఉంది.  అదే‌ దాని ఆయువు పట్టు.  దానికే వాళ్ళు సమ్మోహితులయ్యారు.

పద్యాలు చదవాలీ పాడకూడదూ‌ అని ఒక వాదన ఉంది. అది సరికాదు.  పద్యంలో ఉన్న తూగును విస్మరిస్తే అది చప్పబడిపోతుంది.  మనలో మనం‌ పద్యాన్ని ఆనందించటానికి పైకి పాడేంత ప్రజ్ఞ అవసరం లేదు.  ఎదుట ఉన్న పద్యంలోని అందాన్నీ, తూగునూ గమనించగలిగితే చాలు.

శ్రీమద్రామాయయణాన్ని ఆదికావ్యం అంటాము. కనీసం భారతదేశంలోని భాషలలో అది మొదటి పద్యకావ్యం.  రామాయణాన్ని మొదట గానం చేసిన వారు లవకుశులు. వారు రాముడి నగరంలో, సభలో దానిని గానం చేసారు. అలా మొదటి పద్యకావ్యమే గానయోగ్యంగా రూపుదిద్దుకుంది. ఆ ఒరవడి కొనసాగుతోంది.

పద్యంలో మనస్సుకు పట్టే గుణం ఉంది కదా.  ఆ కారణం చేతనే నాటకకవులు మనస్సుకు పట్టుకునే మాటలు చెప్పాలనుకున్నప్పుడు పద్యాలను వాడారు. కావ్యాలను వ్రాసే కవులు రకరకాల భావాలను పలికించటానికి తగిన నిడివీ నడకా ఉన్న పద్యఛందస్సులను యెన్నుకుని పద్యాలు వ్రాస్తారు.  కవిహృదయమూ, పద్యం‌నడకా, సందర్భమూ తెలిసి చదువుకుంటే మనస్సుకు పద్యం చాలా హాయుగా ఉంటుంది.

ఇదెక్కడి తలనొప్పిరా బాబూ‌ అనుకుంటే యేదీ‌ బాగుండదు.

అలాగే  అందులో ఉన్న విషయం‌ అర్థం అవుతున్నప్పుడు పద్యాన్ని ఇంకా బాగా ఆనందించగలం.  కాబట్టి మనం మనతెలుగు భాషలో అందుకోసం శ్రమ అనుకోక కృషి చేయటం బాగుంటుంది.  పూర్వకాలపు కవులు వ్రాసిన కావ్యాలు మనకు కష్టంగా అనిపిస్తే వారేం చేయగలరు?  మనం మన తెలుగుకు దూరంగా జరుగుతున్నాం.  అది మన తప్పు.  ఈ‌ ఇరవై ఒకటవ శతాబ్దపు భాషలో నన్నయగారు వ్రాసి ఉండకపోవటం ఆయన దోషం కాదని మనం‌ అంగీకరించాలి.  వారసత్వంగా వచ్చిన పద్యసంపదను మనం వదులుకుందామా, నిలబెట్టుకుందామా అన్నది మరెవ్వరో తీసుకునే నిర్ణయం కాదు.  నేటి తరం తమకు తామే తీసుకోవలసిన నిర్ణయం.


4 కామెంట్‌లు:

  1. చాలా చక్కగా వివరించారు.పద్యాలు పది కాలాల పాటు బ్రతికుండాలంటే అవి జీవద్భాష లోనే వ్రాయబడాలి.మన కావ్యాంతర్గత పద్యాలకంటె పాండవోద్యోగ విజయాలు, కరుణశ్రీ పద్యాలు చాటు పద్యాలు అశేష ప్రజానీకం అబిమానాన్ని చూరగొన్నాయంటే కారణం ఇదే.కవులు తమ పాండిత్య ప్రకర్షకి పూనుకోకుండా ఉంటే పద్యాలు రాణిస్తాయి.ఎంతైనా అందమైన భావం లేక పోతే పద్యమూ రాణించదు.

    వ్యర్థ పదమ్ముల వేసి,ని
    రర్థక డాంబిక కవితల నల్లిన, ఏ కా
    వ్యార్థము సిధ్ధించ దెచట
    సార్థక రచనలు సుకవి కసాధ్యము లౌనా

    రిప్లయితొలగించండి
  2. శ్యామలీయం గారు, నమస్కారం

    పద్యం గురించి మీరిచ్చిన వివరణ హ్రుద్యంగా వుంది.

    పద్య పఠనం వలన ధారణా శక్తి పెరుగుతుంది. 30 సంవత్సరాల క్రితం మతిమరుపు (అల్జిమీర్) వ్యాధి లేదు. ఇప్పుడు వ్యాధి ప్రబలుతుంది.

    ప్రస్తుతమున్న పోటీ ప్రపంచంలో, యాంత్రికంగా పని చేస్తున్నాం. మానసిక ప్రశాంతత లేదు. కొంత సమయాన్ని తెలుగు వారు సాహిత్యం గురించి తెలుసుకుంటే దానిలో వుండే ఆనందం వేరు. అనుభవిస్తూ చెపుతున్నాను. పింగళి సూరన గారు రాసిన కొన్ని పద్యాలు పై నుంది చదివితే ఒక అర్ధం, వెనుకనుంచి చదివితే ఇంకో అర్ధం. ఏ భాషలో వుందండి ఈ ప్రక్రియ, ఒక్క తెలుగులో తప్ప. పద్యం చదవడానికి, అర్ధం చేసుకొవడానికి పాండిత్యం అవసరం లేదు. సరళమైన భాషలో ఎన్నొ పుస్తకాలు లభిస్తున్నాయి.

    మీలాంటి పెద్దలు చెయ్యాల్సిన ఒక చిన్న కార్యక్రమం ఒకటుంది : పాఠకులు ఎవరికైనా పద్యంలొ వచ్చె సందెహాలుంటె, దాని అర్ధ తాత్పర్యాలను నివ్రుత్తి చెయడం. మీరు తప్పకు సహాయం చెస్తారని ఆసిస్తున్నాం.


    రిప్లయితొలగించండి
  3. చక్కటి వివరణ. నేను ఒక పద్యం గుర్తు పెట్టుకున్నా దాని పదవిభాగం కాని మిగతా వివరాలు తెలియవు, పద్య భావం గుర్తుండి పోయింది. ఇదీ పద్యం గొప్ప. పద్యమే గొప్పా కాదు, ధారణకు పనికొచ్చేది పద్యం. వచనమే గొప్పా కాదు. దేని గొప్ప దానిదే.

    ఈపద్యం కొంచం సంస్కరించండి.

    "విద్య యొసగును వినయమ్ము, వినయమున బాత్రత, బాత్రత వలన ధనము, ధనము వలన ధర్మంబు దానివలన ఐహికాముష్మిక సుఖంబులందు నరుడు". పదవిభాగం తప్పులు చెప్పగలరు.

    రిప్లయితొలగించండి
  4. శర్మగారూ, మీ రడిగిన పద్యం‌ పూర్తిపాఠం ఇదిగో:

    విద్య యొసగును వినయంబు వినయమునను
    బడయు పాత్రత పాత్రత వలన ధనము
    ధనము వలనను ధర్మంబు దాని వలన
    నైహికాముష్మిక సుఖంబు లందు నరుడు

    ఈ‌ పద్యంలో కవి విద్య వలన గలిగే‌ ప్రయోజనాన్ని స్పష్టీకరిస్తున్నాడు. విద్య వలన ప్రయోజనం మౌలికంగా వినయం. అలా వినయం అనే సద్గుణం పెంపొందించుకున్న వాడిని ప్రజలు (గౌరవానికి) అర్హుడుగా భావిస్తారు. అటువంటి సమాజ గౌరవాన్ని పోందగల వ్యక్తికే చక్కగా దర్మమార్గంలో ధనసంపాదన చేసే అవకాశం ఉంటుంది. అంతే కాదు అలా యోగ్యుడైన వ్యక్తి ధర్మంగా సంపాదించటమే కాక దానిని ధర్మమార్గంలో వినియోగిస్తాడు. అందుచేత ఈ‌లోకంలోనే కాక, పరలోకంలోనూ సుఖం పొందుతాడు. ఇదీ‌ యీ‌పద్యం మనకు అందించే సందేశం.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.