13, జులై 2013, శనివారం

ఎంత తెలుగు వస్తే పద్యం వ్రాయగలమో చెప్పండి చూద్దాం?

ఎంత తెలుగు వస్తే పద్యం వ్రాయగలమో చెప్పండి చూద్దాం?

ఇది నాకు కాయ  గారు వేసిన రెండవ ప్రశ్న.  నాకు దమ్ముంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పాలట.

నిజానికి ఇది సరైన ప్రశ్న కాదు.

ఆ మాట అనటం చాలా సులువు.  కాని ఆ మాట అని ఆవలి వారిని ఒప్పించటమే‌ కష్టం. అసలు ఒకరిని నొప్పించటం యెప్పుడూ సులువే - మన మాటలకు తర్కబధ్ధత యేమీ‌ అవసరం లేదు. .  ఒప్పించటం నిజంగా కష్టమే - మన మాటలకు తర్కబధ్ధత తప్పకుండా ఉండి తీరాలి మరి.

నాకు తోచిన సమాధానం చెబుతాను. ఒకటి రెండు స్వీయానుభవాల సహాయంతో.

నాకు పద్యవిద్యమీద చెప్పుకోదగ్గ పట్టు పాఠశాలాదినాల్లోనే‌ కలిగింది.  అప్పటికి నాకు తెలుగుభాషమీద చెప్పుకోదగ్గ పాండిత్యం యేమీ‌లేదని ప్రత్యేకించి వివరించ నక్కర లేదనుకుంటాను. నిర్మొగమాటంగా ఒప్పుకుంటున్నాను, ఇప్పటికీ‌ నాకు తెలుగు భాషలో యేమంత చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు. సరే, విషయానికి వస్తే పాఠశాలాదినాల్లోనే ఓ మోస్తరు పిల్లకవిగా నాకు స్నేహితుల వద్దా ఉపాధ్యాయుల వద్దా కొంచెం గుర్తింపు ఉండేది. ఆ రోజుల్లో‌ కొన్నేళ్ళపాటు హైస్కూలు లిటరరీ‌ అసోసియేషన్ కార్యదర్శిని విద్యార్థుల తరపు నుండి.

సరదాగా ఒక పద్యం చిత్తగించండి.  కోడికూత మీద మామిత్రులు పద్యం చెప్పమంటే చెప్పినది.

కం. తొలిజాము కోడి కూసెను
తెలవారగ నుండె ననుచు తెలుపుట కొరకై
కలనిష్టభోగతతులన్
కులుకుచు నున్నట్టి భిక్షుకుడు కోపించెన్

సరే, కథ లోనికి వద్దాం. స్కూలు వార్షికోత్సవం సందర్భంలో స్టేజీ మీద మా లిటరరీ‌ అసోసియేషన్ వాళ్ళం కూడా చిన్న పాటి నివేదిక ఇవ్వవలసి ఉంది.  పైగా ఆ సంవత్సరం సభకు ఒక విద్వత్కవి గారు అద్యక్షులుగా వస్తున్నారు కూడా. మా తరగతి ఉపాధ్యాయులవారు లిటరరీ‌ అసోసియేషన్ తరపున దాని అద్యక్షహోదాలో ఉపన్యసించాలి.  ఆయనకు సభాద్యక్షుల సముఖంలో కొన్ని పద్యాలు కూడా చదవాలని కోరిక కలిగింది. 

మా ఉపాధ్యాయులవారు మంచి తెలుగు పండితులు.  కాని కవి మాత్రం కాదు.  ఏ మాత్రం కాదు.  అయినా చాలా కష్టపడి -- ఆ మాట ఆయనే నాతో‌ అన్నారు -- కొన్ని పద్య రత్నాలు తయారు చేసుకున్నారు.  తీరా వ్రాసి, నాలుగు సార్లు చదువుకున్నాక ఆయన పద్యాలు ఆయనకే ఏమీ‌ నచ్చ లేదు.

అవి నాచేతికిచ్చి చదవరా అన్నారు. చదివాను. ఎలా ఉన్నాయిరా అన్నారు.  ఏం చెప్పేది?  నీళ్ళు నమిలాను. ఒరేయ్, నీకు పుణ్యం ఉంటుంది. కొంచెం వీటిని బాగుచేసి ఇవ్వు.  సభలో చదవాలి అన్నారు. సరే నని ఒప్పుకోక తప్పలేదు. ఏదో చేతయినంత మెరుగులు దిద్ది, కుదరని వాటిని తిరుగవ్రాసి ఇచ్చాను.  ఆయనా వాటిని సభలో చదివారు.  ఆయనకు గండం గడిచింది -- ఆ ముక్కా ఆయనే నాతో‌ అన్నారు తరువాత --.  మనలో‌ మన మాట, కార్యదర్శిగా నా నివేదికతో‌ పాటు నేను నా పద్యరత్నాలు చదివాను.

కాని నాకు గండం వచ్చిపడింది!  సభ అయిపోయిన తరువాత మా తెలుగు ఉపాధ్యాయులలో ఒకరు, శ్రీ వేదుల వేంకట రావు గారు నన్ను పిలిపించుకున్నారు.  ఆయన నాకు కవితా గురువు. మంచి ఆశుకవి. ఆయన నన్ను ముక్క చీవాట్లు పెట్టారు. సారాంశం యేమిటంటే:

౧. నేను మా అసోసియేషన్ అద్యక్షుల వారికి పద్యాలు వ్రాసి పెట్టానని సులువుగానే కనిపెట్టారు మా గురువుగారు - పద్యాల శైలిని బట్టి అనుకుంటాను. అందుకే అగ్గిరాములై పోయారు. ఎన్నడు ఎవరికీ ఘోష్ట్ రైటింగ్ చేయకురా అది ఛండాలం అని హెచ్చరించారు.

౨. భగవంతుడిమీద భగవత్సంబంధమైన విషయాల మీద తప్ప ఇంక పనికి మాలిని విషయాలపైన ఎప్పుడూ కవిత్వం రాయకు. అది తుఛ్ఛమైన పని. ఎవడినో పొగుడుతూ ఎందుకు పద్యాలు రాసావురా?  అలాంటి పొరపాటు ఎన్నడు చేయవద్దు అని హితోపదేశం చేసారు.

గురువుగారి ఉపదేశం దాటింది లేదు.

అవునూ, ఈ‌ కథ యెందుకు చెప్పానూ, ఎంత తెలుగు వస్తే పద్యం వ్రాయగలమో అన్న ప్రశ్నకు జవాబుగా?

ఈ‌పాటికి మీకందరికీ అర్థం అయే ఉంటుంది. ఎంత తెలుగు వచ్చినా కవిత్వం వ్రాయటం అనేది భగవద్దత్తమైన కళ.  అది గురువులు మెరుగులు దిద్దితే మరింత చక్కగా నైపుణ్యం‌ సంతరించుకుంటుంది.  అంతే కాని ఎకడమిక్ సిలబస్ చెప్పినట్లు చెప్పి కేవలం పాఠాలతో‌ కవులను తయారు చేయటం సాధ్యపడదు.

చిన్నతనంలో‌ బొమ్మలు వేయటంలో‌ ఆసక్తి చూపి కొంత వరకు కృతకృత్యులైన వారినే చిత్రలేఖనం నేర్పే కోర్సులకు తీసుకుంటారు. నాకైతే ఆ కళ పట్ల ఆసక్తి ఉన్నా సరిగ్గా అద్దం బొమ్మా, గ్లాసు బొమ్మా కూడా వేయటం రాలేదు.  చివరికి రావాడ కృష్ణగారి దగ్గర ప్రయత్నించినా సరే.

మరొక సంఘటన చూడండి.  ఒకరోజున మా ఊళ్ళో గ్రంధాలయంలో కూర్చుని పుస్తకం చదువుకుంటుండగా ఒక ఆసామీ‌ వచ్చాడు. భట్రాజు కవి అట. నాకేదో పద్యాలు రాయటం చదవటం ఆసక్తి అని తెలుసు కాబట్టి లైబ్రేరియన్ గారు నన్నూ‌ పిలిచారు ఆఫీస్ రూం లోకి. ఆ భట్రాజు అందంగా కొన్ని పద్యాలు చెప్పాడు.  పద్యవిద్య మాకు వంశానుగతంగా వచ్చిందీ నాకు చిన్నప్పటినుండే అలవాటై పోయిందీ‌ అన్నాడు.  ఏమి చదువుకున్నారూ‌ అంటే ఐదవ తరగతి మాత్రమే‌ నట!

ఏతావాతా తేలేది ఏమిటంటే పాండిత్యాన్ని గడించినంత మాత్రాన పద్యాలు వ్రాయగలమని అనుకోరాదు. పద్యవిద్య వేరే‌ కళ.  ధారాశుధ్దిగా కవిత్వం చెప్పగలగటం అన్నది మంచి కవి లక్షణం. అది పద్యవిద్య పట్టుబడిన వాడి లక్షణం. తెలుగులో తగినంత పాండిత్యం ఉంటే ఆ విద్య మరింతగా రాణిస్తుంది అంతే. తెలుగు భాష బాగా రావటానికీ‌ పద్యాలు వ్రాయగలగటానికీ ఏమీ సంబంధం లేదు!

నా వివరణ సంతృప్తికరంగా అనిపించక పోతే క్షంతవ్యుడను.