27, మే 2014, మంగళవారం

రామ రామ యని నామము బలుకగ రాదో‌


రామ రామ యని నామము బలుకగ రాదో జనులారా
కామితఫలదుని ఘనతను పొగడుట కాదో మీ వలన


సుజనుల కెపుడు సుఖము నొసంగే సూర్యవంశవిభుని
విజయపరంపర వీనులవిందుగ వినిపించగ రాదా
॥రామ రామ॥

నిరుపమగుణనిధి పరమాప్తుం డిది నిశ్చయమే కాదా
పరమాత్ముని సంభావించుటలో పరమసుఖము లేదా
॥రామ రామ॥

చతురాననశివశక్రసంస్తుతుని శరణు వేడ రాదా
మతిమంతులరై మోక్షప్రదునిపై మనసు నిలుప లేరా
॥రామ రామ॥23, మే 2014, శుక్రవారం

మోదీపై అప్పుడే మన మేథావుల విసుర్లు మొదలు!

ఇంకా మోదీ ప్రధాని కాలేదు.

కొత్త ప్రభుత్వమూ రాలేదు దాని పనితనానికి సంబంధించిన అంచనాలు వేయటానికి కొత్త లోక్‌సభకు కాని దానిని నిర్మించుకొన్న భారతదేశప్రజానీకానికి కాని ఏ విధమైన ఉపయుక్తసమాచారమూ బయటకు రాలేదు.

కాని మనదేశంలో మేథావులు కూడా ఉన్నారు.
వారికి అప్పుడే బాణాలు వేయటానికి సమయం ఆసన్నం అయ్యిందన్న స్పృహ కలిగింది.
అవును, కొత్త ప్రభుత్వం గురించి కొత్త విశ్లేషణలు తప్పక రావాలి కదా?
అవి ఎంత తొందరగా మొదలు పెట్టాలా అన్న ఆతృత మన మేథావులది.
వారిది ప్రత్యేకమైన ప్రతిపత్తి దేశంలోని ఇతరులతో పోలిస్తే.

ఇప్పుడే ఒకటి  నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ -గోపాలకృష్ణ గాంధీ -1 నా కంటబడింది. అది మీరూ చదివి తరించండి:
ఇది వ్రాసింది జాతిపితగారి మనుమడైన గోపాలకృష్ణ గాంధీ గారు. వారు తెలుగులో వ్రాయలేదు కాని, మనం ఆయన లేఖకు తెలుగు అనువాదం చదివామన్న మాట విశేఖర్‌గారి బ్లాగులో.

దీనిమీద కొంచెం స్పందించటానికి ప్రయత్నిస్తాను.  ఆ వ్యాసం మొదట్లోని కొన్ని మాటలు చూడండీ -

మీరు చేరుకున్న అత్యున్నత అధికార స్ధానాన్ని మీరు చేరుకోగా చూడాలని కోరుకున్నవారిలో నేను ఒకరిని కాను. మీరు ప్రధాన మంత్రి అవనున్నారని అనేక మిలియన్ల మంది ఆనంద పరవశులై ఎదురు చూస్తుంటే ఇంకా అనేక మిలియన్ల మంది నిజానికి వికలమై ఉన్నారన్న సంగతి మరే ఇతరుల కన్నా కూడా మీకు ఎక్కువగా తెలుసు.  ....

మీరు అక్కడికి చేరుకున్నారు! జవహర్ లాల్ నెహ్రూ కూర్చున్న డస్క్ దగ్గర కూర్చుని ఉన్నారు, లాల్ బహుదూర్ శాస్త్రి  ..... మీరు అక్కడికి వెళ్లడం ఇష్టం లేనివారు సైతం, మీరు అక్కడికే చేరుకున్న నిజాన్ని అంగీకరించక తప్పదు.   ....... ఆ అరుదైన అవకాశం మీకు దక్కడం సముచితమేనా అన్న విషయంలో నాకు భారీ సంకోచాలు ఎన్ని ఉన్నప్పటికీ

 వాహ్వా!

శ్రీమాన్ గాంధీగారికి మోడీ ప్రధాని కావటం ఇష్టం లేదు.  అందులో మనం అభ్యంతరం చెప్పవలసింది లేదు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం.  ప్రధాని పదవి వంటి అరుదైన మహత్తరమైన అవకాశం మోదీకి దక్కటం సముచితమేనా అన్న విషయంలో గాంధీగారికి భారీ సంకోచాలు ఉన్నాయని వారే అంటున్నారు.

మంచిది. అలాగే కానివ్వండి.  కాని మోదీకి బదులుగా అదే మహత్తరమైన అవకాశం రాహుల్ గాంధీకి గాని దక్కి ఉంటే,  ఆయన ఎంత అవ్యక్తుడో అన్న విషయం మీద ఈ దేశంలో అనేక మందికి ఎంత గొప్పగా స్పష్టత ఉన్నప్పటికీ, ఇదే‌ గాంధీగారు తన అసంతృప్తిని ఇలా రాహుల్ గాంధీకి ఒక బహిరంగ లేఖ అంటూ వ్రాసే సాహసం చేసి ఉండేవారా అన్న ప్రశ్న ఒకటి వేస్తున్నాను.  నా అంచనా మేరకు అటువంటి పని ఈ గోపాలకృష్ణగాంధీగారు చేయరనే అనిపిస్తోంది.  ఎంత అప్రయోజకులైనా ఎంత హానికారకులైనా ఘనతవహించిన నెహ్రూ-గాంధీ కుటుంబపాలనను దాని అసహజమైన కొనసాగింపులను సహజపరిణామాలుగానే మనదేశపు మేథావివర్గం భావిస్తుందనీ, సహిస్తుందనీ ఇంకా ఘట్టిగా చెప్పాలంటే దానికి తమ మౌనసమర్థనను అందిస్తుందనీ నిర్మొగమాటంగా చెప్పవచ్చును.

గాంధీగారు అంటున్నది మరొక చిత్రమైన సూక్తి.  మోదీ ప్రధాని కావాలని ఆనందపారవశ్యంతో  అనేక మిలియన్లమందీ, అలా జరగకూడదని వికలమనస్కులై ఇంకా అనేక మిలియన్లమందీ ఎదురు చూసారట! వారి తర్కం చూడండి.

 మన జనాభాలో 31 శాతం (మీకు పడిన ఓట్ల నిష్పత్తి అదే)...మిమ్మల్ని తమ రక్షకుడని (saviour) వారు ఊహించుకున్నారు ....    అదే విధంగా 69 శాతం మంది ఓటర్లు మిమ్మల్ని తమ సంరక్షకునిగా భావించలేదన్నది కూడా గమనించాల్సిన విషయమే.

వారు మేథావులు కదా. మనకు తప్పుడు తర్కం బోధించేందుకు వారు గొప్పగొప్ప అర్హతలు కలిగి ఉంటారు మరి.  ఈ‌ దేశంలో జరిగిన ఇన్ని ఎన్నికల్లో, అనేకవేల ఫలితాల్లో ఎంతమంది 51% లేదా అంతకన్నా ఎక్కువశాతం ఓట్ల నిష్పత్తితో విజయం సాధించి ఉంటారో చెప్పండి? మన వ్యాసకర్తగారి లాజిక్కు ప్రకారం చూస్తే అసలుసిసలు ప్రజామోదంతో దాదాపుగా ఈ దేశంలో ఏ అభ్యర్థికాని గెలవటం అత్యంత అరుదైన సంఘటన అన్నమాట.  అందుచేత దాదాపుగా ఇన్నాళ్ళూ గెలిచాం అనుకుంటున్న వారంతా  మైనారిటీ ఓట్ల నిష్పత్తితో మాత్రమే అవకతవక గెలుపులతో తప్పుడు అధికారాలను అనుభవించారన్నమాట.  పార్టీలపరంగా అన్వయించితే రాజ్యాలేలిన పార్టీల్లో ఎన్నింటీకి ఎన్నిసార్లు మెజారిటీ ఓట్ల నిష్పత్తి వచ్చిందో చెప్పండి మరి? అన్నట్లు స్వాతంత్ర్యం వచ్చినది మొదలు నేటిదాకా హెచ్చుగా అధికారం అనుభవించిన  నెహ్రూ-గాంధీ కాంగ్రెసు పార్టీ ఇన్నాళ్ళూ నిర్మొగమాటంగా అన్యాయంగా దక్కిన అధికారం వెలిగించిందన్న సంగతి ఒప్పుకు తీరవలసిందే.  ఐతే, అది ఘనతవహించిన నెహ్రూ-గాంధీ కాంగ్రెసు కాబట్టి, మన దేశపుమేథావులు వారికోసం మాత్రం కొంచెం‌ ప్రత్యేకమైన వారికి లాభసాటియైన తర్కం వాడతారన్నమాట.  అదే భాజపా అయ్యేది మరొక కాంగ్రెసేతరపార్టీ అయ్యేది రాజ్యానికి వస్తే మాత్రం ఇదండీ వీళ్ళ తర్కం!

 మైనారిటీలకు ధైర్యం ఇవ్వడం గురించి మన గాంధీగారు ప్రస్తావించటం ఆశ్చర్యం కాదు. మన మేథావులు ఎప్పుడూ మైనారిటీల భద్రతగురించి మాత్రమే మాట్లాడుతారు. అయ్యా, భత్రత గురించి తప్పక మాట్లాడాలి. దానికి మతాల కులాల విభజనల అవసరం లేదు.  కాని మైనారిటీలను మాత్రం ఉద్దేశించి అలా సానుభూతి నటిస్తూ మాట్లాడటం ద్వారా మేధావులుగా గుర్తింపు తెచ్చుకుంటారు మనదేశంలో.  అందులో భాగంగానే హిందువు అనే మాట అదేదో టెర్రరిష్టు అన్న ద్వనివచ్చేలా పలకటం కూడా వారి మేథావిత్వాన్ని ఋజువుచేసుకుందుకు ఒక పనిముట్టే.  అందుచేత మన గాంధీగారు యధాప్రకారం హిందువుగా ముసుగు వేసుకుని.... హంతక బందిపోటు వంటి పదప్రయోగాలు చేయకుండా ఉంటే బాగుండదు, మేథావిగా పలుచన అవుతారు కాబట్టి మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోవచ్చును.

మన గాంధీగారి సూక్తి మరొకటి అభివృద్ధి అన్నది భద్రతకు ఎంతమాత్రం ప్రతిక్షేపం కాజాలదు. అనేది.  నిజమే. మోదీగారు అభివృధ్ధి అని ఉంటే అది భద్రతను తాకట్టుపెట్టి మరీ అన్నారని ఏలా తర్కం తీస్తున్నారో చూడండి.  మన మేధావులు నిస్తేజంగానో ఆనందంగానో చూస్తూ ఉండిపోయే నెహ్రూ-గాంధీల పాలనల్లో అభివృధ్ధి అనేది స్కాంల రూపంలో తప్ప జరిగిందా? భద్రతగురించి నిర్భయ ఉదతం వెల్లడించటం లేదా?  కాని అప్పుడు అంతా సవ్యంగానే ఉన్నట్లూ ఈ భద్రత అనేది మోదీ విచ్చిన్నం చేస్తాడన్నట్లూ మాట్లాడటం ఏమిటీ?  ఇంకా కనీసం ప్రధానిగా ఆయన పాలన మొదలైనా కాకుండానే? 

మేధావి వర్గం అత్యంత ఇష్టంగా ఈ మధ్య ప్రస్తావించి పులకించిపోతున్న కొద్ది నెలల క్రితం నాటి ముజఫర్ నగర్ అల్లర్ల జ్ఞాపకాలను మన గాంధీగారు మోదీని హెచ్చరిస్తూ స్మరించారు. మైనారిటీల పట్ల ప్రేమాభిమానాలు కేవలం నెహ్రూ-గాంధీలసొత్తు కాబట్టి కాంగ్రెసుమాత్రమే నమ్మదగ్గ పార్టీ కావచ్చును వీరి దృష్టిలో.  ఇందిరమ్మ హత్య తరువాత ఢిల్లీలో సిక్కులను ఊచకోత కోసిన సంఘటన గురించి స్మరించి ఆ కాంగ్రెసూ అంతగా నమ్మదగ్గ పార్టీ కాదని ఆవేదన ఏమైనా చెందుతున్నారా గాంధీగారు? ప్రత్యేకించి మోదీకే ఎందుకు సుద్దులు చెప్పటం? 

ఇప్పుడు శ్రీగాంధీగారి లేఖ రెండవ భాగం చూదాం.

మైనారిటీల భద్రతగురించి తన భయాందోళనలను ప్రతిభావంతగా వివరిస్తూ వ్యాసకర్త మీరు జారీ చేసినవిగా మీడియా నివేదిస్తున్న ప్రకటనలు నమ్మకానికి బదులు భయాన్ని కలిగిస్తున్నాయి అంటున్నారు. అంతేకాదు భారత దేశ ప్రధానిగా మీరు రిపబ్లిక్ యొక్క కనపడని అహం (ఆల్టర్ ఈగో) అంటున్నారు. ఇన్నాళ్ళుగా పాలనాధికారం జన్మహక్కుగా కలిగి ఉన్నట్లు భావించుకొంటూ వస్తున్న కాంగ్రెసుపార్టీ మైనారిటీప్రజల్లో భయాలకు బదులు నమ్మకాన్ని ఎలా కలిగించుతూ వస్తున్నదీ? అలాగైతే ఇంకా మైనారిటీలకి ఇన్నాళ్ళ నెహ్రూ-గాంధీల పాలన తరువాతా అభద్రత అలాగే ఉందీ చెప్పండి? వారి చేతకాని తనం వల్ల కాదా?  ఒక ప్రతిపక్షపార్టీ అధికారంలోకి వస్తుంటే అందులో అహం అనేది చూస్తున్న గాంధీగారికి ఎప్పుడూ ఈ‌ కాంగ్రెసువారి అహం కనబడలేదా? లేదా ఆయన పాత వ్యాసాలు చదివి నా అభిప్రాయం మెఱుగుపరచుకోవాలా?

ఐనా శ్రీవ్యాసకర్తగారు,  భారత్ మాతా కి జై .... బలీయమైన ‘జై హింద్!’ నినాదాన్ని అదెంత మాత్రం కొట్టివేయజాలదు అని ఎందుకంటూన్నారూ? అలా ఈ‌ నినాదాల మధ్య పోటీ ఏమన్నా ఎవరన్నా పెట్టారా?  అసందర్బం ప్రలాపంకాకపోతే?

ఆ తరవాత మరికొన్ని పెద్దరికంతో కూడిన హితోపదేశాలు చేసి మళ్ళీ మొదటికి వస్తారు మన వ్యాసకర్త గాంధీగారు.  
అవసరం వచ్చినపుడు మీకు ఓటు వేయని 69 శాతం మంది కోసం వారు కోరుకునే విధంగా ఉండాలని సుతారంగా నీతి చెబుతారు.   అయ్యా ప్రియతమ వ్యాసకర్తగారు, నేను కూడా మరొకసారి మొదటికే వచ్చి చెబుతున్నాను, పోలైన ఓట్లలో 51శాతంతో గెలిచే వారు అత్యంత అరుదు.  ఇంత చిన్న విషయం మీ అంత పెద్ద మేథావికి తెలియకపోతే అది మా ప్రజల తప్పుకాదు.

ముక్తాయింపుగా ఒక మాట చెప్పాలి.  కాంగ్రెసేతర పక్షం అధికారంలోకి వస్తే మన మేథావుల రంధ్రాన్వేషణాతీవ్రతకు అవి పడిపోవలసినదే నని వారి ఆశ. మీడియాకైతే శరపరంపరగా వచ్చే ఈ‌ బాపతు వ్యాసలతో పండగే పండగ రోజూ!