30, జూన్ 2023, శుక్రవారం

రావయ్య రావయ్య రఘునాయక

రావయ్య రావయ్య రఘునాయక మమ్ము
కావగ రావయ్య సర్వకామదాయక

దేవ సుఖదాయక త్రిభువనైకపోషక
భూవలయనాయక పూర్ణశుభదాయక
భావిత మునినాయక రావణాదినాశక
మావలని దోషముల మన్నించి రామ

కరుణారససాగర ధరణిజామనోహర
నరపాలసుధాకర కమనీయగుణాకర
సురగణైకనాయక సురవైరివిదారక 
నరులమగు మమ్మింక మన్నించి రామ

భోగిరాజసేవిత భూసురగణ పూజిత
యోగిరాజకామిత యుర్విజాసమేత
నాగరాజప్రార్ధిత రాగాదివివర్జిత 
సాగిరమ్ము మమ్మిక చక్కగా బ్రోవ

రార శ్రీమన్నారాయణ రార మధుసూదన


రార శ్రీమన్నారాయణ రార మధుసూదన
రార గరుడగమన చక్రధారి గిరిధారి 

రార కృపారససాగర రమ్యసుగుణాకర
రార దైత్యగణనాయకప్రాణాంతక వేగ
రార మునిమోక్షవితరణ పుణ్యకీర్తన
రారా రఘుకులతిలక రారా శ్రీరామ

రార పంక్తిరథతనయ రార ధర్మపరాయణ
రార సకలభువనజనక రార ప్రాణజీవన
రార  యోగిరాజగణారాధితపదపంకజ
రారా ఘనపాపనాశ రారా శ్రీరామ

రార కమలనయన దేవ మారజనక శ్రీహరి
రార దేవగణానంద రమారమణ వేగ
రార పురుషోత్తమ సంసారభయవారణ
రారా నన్నుధ్ధరింప రారా శ్రీరామ


28, జూన్ 2023, బుధవారం

రామచంద్రుడుండ రక్షకుడై యుండ

తే.గీ. రామచంద్రుడుండ రక్షకుడై యుండ
సుజను లతని పొగడుచుండ ఖలులు
మెచ్చకున్న నేమి మించిపోవును హరికి
కొరతయేమి కలుగు కువలయమున

శ్రీరామచంద్రు డుండగా ఆయన సర్వజగద్రక్షకుడై యుండగా సుజనులందరూ ఆయనను చక్కగా పొగడుతూ ఉండగా కొంత మంది దుర్బుధ్ధులు మాత్రం అదిచూసి మెచ్చలేకుండా ఉన్నారు.

వాళ్ళు మెచ్చకపోతే మించిపోయింది యేమీ లేదు.

ఈభూమి మీద శ్రీహరికి వచ్చిన కొరత యేమీ లేదు.

27, జూన్ 2023, మంగళవారం

భ్రాంతి తొలగిన సర్వము రామమయము

తే. అద్దమందున కన్పట్టు నఖిలజగము
నద్దమందున లేదుగా యట్లె మాయ
వలన జగమున్న దనునట్టి భ్రాంతి కలుగు
భ్రాంతి తొలగిన సర్వము రామమయము

ఉన్నది పరబ్రహ్మమే.

ఉన్నది అదొక్కటే కాని అన్యమైనది ఏదీ నిజంగా లేదు.

అద్దంలో ప్రపంచం అంతా కనిపిస్తుంది.

కాని అద్దంలో ఏమీ లేదు కదా.

మాయ కారణంగా ప్రపంచం అనేది లేకపోయినా ఉందనే భ్రాంతి కలుగుతోంది.

అంతే.

ఆభ్రాంతి తొలగిపోతే ఉన్నది బ్రహ్మము ఒక్కటే.

ఆ బ్రహ్మమే రాముడన్న వ్యవహారంతో ఉంది.

అందుచేత భ్రాంతితొలగిన నాడు సర్వమూ ఆరామమయంగానే తెలుస్తుంది.

రాము డెవడని ప్రశ్నించు రాలుగాయి

తే. రాము డెవడని ప్రశ్నించు రాలుగాయి
యెవడు నీకెట్లు చెప్పిన నెఱుగగలవొ
కాశిలో జచ్చినప్పుడు కాని వాడు
నీకు చెప్ప డారీతి నీలోక మందు

ఓరాలుగాయీ రాము డెవడూ అని హేళనగా ప్రశ్నిస్తున్నావు కదూ?

ఎవడు నీకు ఎలాగు చెప్తే తెలుస్తుందో వాడు వచ్చి నీకు స్వయంగా అలా చెప్తే తప్పకుండా తెలుస్తుందిలే.

కాని ఎలా?

గట్టిచిక్కే వచ్చిందే!

నువ్వు నీపుణ్యంపుచ్చి కాశీలో చచ్చినప్పుడు కాని వాడు వచ్చి నీకలా చెప్పనే చెప్పడే!

నువ్వు ఈలోకంలో ఉండగా వాడు వచ్చి చెప్పడే‌‌, ఇంకెలా తెలిసేదీ నీకు?


26, జూన్ 2023, సోమవారం

లచ్చిమగడ నీకు లక్షదండములు

తే.గీ. లచ్చిమగడ నీకు లక్షదండము లయ్య
రామచంద్ర నీకు ప్రణతు లయ్య
రుక్మిణీశ సర్వలోకేశ జోహార్లు
మమ్ము బ్రోవవయ్య మధువిరోధి

ఓ రామచంద్ర ప్రభూ నీకు నమస్కారములు. నీవు లక్ష్మీనాథుడవైన విష్ణుమూర్తివి. నీకు లక్షనమస్కారాలు. నీవే రుక్మిణీనాథుడవైన శ్రీకృష్ణుడవు. నీకు జోహార్లు. ఓ మధుసూదనా మమ్మల్ని రక్షించు.

24, జూన్ 2023, శనివారం

భగవంతుడు రాముడై ప్రభవించెను

భగవంతుడు రాముడై ప్రభవించెను
జగదీశ్వరి తోడనే జానకి కాగ

సురలకష్టములు తీరెడు శుభకాలము వచ్చెను
నరుడై నారాయణుడు ధరకు రాగ
సురవైరుల గుండెలలో జొరబడినది భయము
పరమాత్ముడు వారిపని పట్టగ రాగ

మునుల తపఃఫలితములు మోసులెత్త జొచ్చెను
అనరణ్యుని శాపమున కదను కాగ
ధనేశుని సోదరునకు తపోబలము విచ్చెను
జనార్ధనుడు సూర్యవంశమున బుట్ట

మానవతుల పగలుతీరు మంచికాల మాయెను
దానవకుల మంతరించు తరుణము కాగ
ఆనీచుడు రావణున కంత్యకాల మాయెను
దానవారి మానవుడై తలపడ రాగ 

21, జూన్ 2023, బుధవారం

రావణుని పొగడెడు రాకాసులు

సరళ.
రావణుని పొగడెడు రాకాసు లెందరో నేడు
భూవలయము నందు పుట్టిరి రామాయణమును
దేవ నిన్నును చెడతిట్టుచు తిరుగుచున్నారు
నీవు వారి నెల్ల నిగ్రహింప వలయు రామ

ఓ రామచంద్ర ప్రభూ.

ఇది కలియుగం.

ఎప్పుడో త్రేతాయుగంలో నీచే జచ్చిన రాక్షసు లెందరో యీ కలియుగంలో భూలోకంలో మానవుల్లా జన్మించారు.

వాళ్ళంతా రావణాసురుడిని పొగడుతూ తిరుగుతున్నారు.

రామా నిన్ను తిడుతున్నారు.

నీదివ్యచరిత్రమైన రామాయణాన్ని పరిహసిస్తున్నారు.

వాళ్ళ సంఖ్య నానాటికీ పెరుగుతున్న సంగతి గమనించు.

మాకు వాళ్ళతో తలపడే శక్తి లేదు.

నీవే పూనుకొని వాళ్ళని మళ్ళా నిగ్రహించాలి.

17, జూన్ 2023, శనివారం

అన్యములెన్ను నెడల

సరళ.
మీనలోచనలకు మీ‌రు బానిసలైన యెడల
కానిపనులు చేసి కాసులార్జించెడు నెడల
మాని రామనామమంత్ర మన్యములెన్ను నెడల
మానక యమపురికి మరలమరల పోవలయును


15, జూన్ 2023, గురువారం

కాపాడ గద వయ్య రామ

సరళ.
హరునిధ్యానముద్ర కాధా‌రమైనట్టి రామ 
పరమయోగివరుల భావనలోనుండు రామ 
నిరుపమానకృపకు నిలయమై యుండెడు రామ
కరుణ తోడ నన్ను కాపాడ గద వయ్య రామ


ఓ రామచంద్రప్రభూ.

పరమశివుడి ధ్యానముద్రకు ఆధారమైన దివ్యనామం కలవాడా,
పరమయోగుల భావనలో నిత్యం ఉండే వాడా,
నిరుపమానమైన కరుణకు నిలయమైన వాడా,
దయతో నన్ను కాపాడవయ్యా.

మూర్ఖజనులు తలపరు శ్రీరామ విభుని

సరళ.
సిరుల గోరి సురల చేరి పూజించుచు నుంద్రు 
ధరను మూర్ఖజనులు తలపరు శ్రీరామ విభుని 
హరిని విడచి యన్యు నర్చించు వారల కెట్లు 
దొరకు ముక్తి యనెడు దు‌ర్లభం బైనట్టి పదము


లోకంలో కొందరు మూర్ఖజనులు ఉంటారు. కొందరని ఏమి వాళ్ళే ఎక్కువగా ఉంటారు.

వాళ్ళు ఏమి చేస్తారంటే సిరిసంపదలను కోరి రకరకాల దేవతలను పూజిస్తూ ఉంటారు.

కాని శ్రీరామచంద్రుడిని మాత్రం తలపోయరు.

భగవంతుడైన హరిని వదలిపెట్టి అన్యదేవతలను పూజించే వారికి ఎలా ముక్తిపదం దొరుకుతుంది?

అది దుర్లభమైనది.

కేవలం శ్రీమన్నారాయణుడు మాత్రమే అనుగ్రహించేది.

సిరిమగండు దిగెను శ్రీరామచంద్రుడై

సరళ.

సిరిమగండు దిగెను శ్రీరామచంద్రుడై ధరకు 
సిరియు వెంటవచ్చె సీతమ్మవారిగా నంత 
నెఱుక లేక వారి నెదిరించి రావణాసురుడు 
పురము నెల్ల జెఱచి పొలికలనికి బోయి చచ్చె

సాక్షాత్తు లక్ష్మీవిభుడే శ్రీరామచంద్రుడై ధరకు దిగాడు. అప్పుడు ఆయన వెంట సీతమ్మవారిగా సిరి కూడా దిగివచ్చింది.

ఈ సంగతిని గ్రహించలేక వారి నెదిరించి రావణాసురుడు చెడ్డాడు. 

అతడు తన లంకానగరాన్ని పాడుచేసుకున్నాడు. 

చివరకు తాను కూడా యుధ్ధభూమికి పోయి రాముడి చేతిలో చావును తెచ్చుకున్నాడు.

హరియె యవతరించె రాము డను పేర

సరళ.
ఎవని లీల వలన నీలోకములు పుట్టుచుండు
నెవని కరుణ వలన నివియెల్ల వర్ధిల్లుచుండు
నెవని యందు తుదకు నివి లీనమౌ నట్టి హరియె
యవతరించె రాము డను పేర జనులార వినుడు

ఓ జనులారా!

వినండి.

ఎవని దివ్యలీల కారణంగా ఈలోకాలన్నీ పుడుతున్నాయో, ఎవని కరుణావిశేషం కారణంగా ఆలోకాలన్నీ హాయిగా వర్ధిల్లుతున్నాయో, ఎవని యందు తుదకు ఆలోకాలన్నీ లీనమౌతున్నాయో ఆమహాత్ముడైన శ్రీహరియే రాముడన్న పేరుతో అవతరించాడు.

వృత్తలక్షణవిషయం.
ఇదొక కొత్త వృత్తం. పేరు ఏదో ఒకటి కొత్తది ఇవ్వాలి కాబట్టి సరళ అన్న పేరు పెడదాం. ఇది దేశిఛందస్సుకు చెందినది. ఒక  జాతివృత్తం. ప్రాసనియమం ఉంది కాబట్టి ప్రాసయతి వీలుపడదు. పాదంలో సూ-సూ-సూ-ఇం-ఇం-సూ  క్రమంగా వాడాలి. మొదటి మూడు సూర్యగణాల తరువాత యతిమైత్రి చేయాలి. పాదలక్షణం ప్రకారం ఆటవెలది బేసిపాదాలకు అదనపు సూర్యగణం చేర్చినట్లు కనిపించినా అటవెలది నడక లేదు.

13, జూన్ 2023, మంగళవారం

మధురత‌ర రామనామము

కం. మధురత‌ర రామనామము
నధరములకు మప్పువాడె యతిధన్యుడు దు
ర్విధిచే నిత‌రంబులనే
మధురముగా తలచువాడె మతిహీనుడు సూన్.

ఓరామచంద్రప్రభూ.

మధురమైన రామనామాన్ని పలంకటమే పెదవులకు అలవాటు చేసేవాడే అతిధన్యుడు

విధివైపరీత్యం కారణంగా రామనామాన్ని విడచి వేరేవి ఏవో ఏవేవో మధురం అని తలచేవాడే ఎంచి చూడగా  మతిలేనీవాడు. 

12, జూన్ 2023, సోమవారం

శ్రీరామభక్తులను చేరని జన్మ మేలా

వసంతతిలకము.
శ్రీరామభక్తులను చేరని జన్మ మేలా
శ్రీరామనామమును చేయని జన్మ మేలా
శ్రీరామచంద్రవిభు చిన్మయు నాత్మబంధున్
కారుణ్యమూర్తి  నెద గాంచని జన్మ మేలా
 

జన్మ మెత్తిన తరువాత శ్రీరామచంద్రుని భక్తులలో చేరవలసినదే. లేదా అది వృథా అవుతున్నది. నిత్యమూ శ్రీరామనామమును చేయవలసినదే లేదా ఆజన్మము వృధా అవుతున్నది. చిన్మయుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి మనకు విభుడు, ఆత్మబంధువు. ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకొని దర్శించలేని జన్మం వృథాయే.

లక్షణచర్చ.
ఈ వసంతతిలకం (త-భ- జ-జ-గగ) వృత్తానికి వాడుకే తక్కువ తెలుగు కవిత్వంలో. దీనికి యతిమైత్రిస్థానంగా తెలుగుకవులు 8వ అక్షరం గ్రహించారు. కాని 9వ అక్షరం యతిమైత్రిస్థానంగా మరింత పసందుగా ఉంటుందని కొందరికి అనిపిస్తుంది .కాని ఎనిమిదవ అక్షరంపైన యతిమైత్రి చేయటమే సబబు. ఎందుకో వివరిస్తాను.
 
త-భ- జ-జ-గగ = 5+4+4+4+4 = 21 మాత్రలు ఊనిక కోసం మొదటి మాత్ర. దాన్ని విడిగా ఉంచి లెక్కించితే 1+20 మాత్రలు. సమద్విఖండనంగా 1+10+10 మాత్రలు అవుతున్నాయి. ఇప్పుడు 1+10=11 మాత్రల తరువాత యతిమైత్రి చేయటం సముచితంగా ఉంటుంది.  కాని 11 మాత్రల తరువాత ఎలా కుదురుతుందీ 11వ 12వ మాత్రలు ఒక గురువుగా జమిలి ఐపోతే? ఇప్పుడు 12 మాత్రల తరువాత యతిమైత్రిస్థానం అనవలసి ఉంది.  అంటే పాదం UUI - UII IUI - IUI - UU అనే గురులఘుక్రమంలో పూర్వభాగం UUI - UII - IU ఉత్తరభాగం I - IUI - UU అవుతున్నది. 
 
కాని పూర్వకవుల పధ్ధతి ప్రకారం పూర్వభాగం UUI - UII - I ఉత్తరభాగం UI - IUI - UU అవుతున్నది. ఇది అక్షరక్రమంగా పాదద్విఖండనం అవుతున్న విధానం - దీనిలో పూర్వభాగంలో 10 మాత్రలూ ఉత్తరభాగంలో 11 మాత్రలూ వస్తున్నాయి. 

ఐతే ఏవిధానం ప్రశస్తం అన్న మీమాంస వస్తుంది. దీన్ని విచారించటానికి మరొక మంచి మార్గం ఉంది. ఈ వసంతతిలకాన్ని మరొకలాగు కూడ చూడవచ్చును. UUI - UII - IUI - IUI - UU అనే గురులఘుక్రమం UUI - UII - IU - IIUI -  UU అనే గురులఘుక్రమంగా చూస్తే ఇక్కడ 5+4+3+5+4 మాత్రల విభజన కనిపిస్తోంది. అంటే ఇది నిజానికి మూడు ఖండాలు అన్నమాట.  UUI - UII,  IU  IIUI - UU అని. ఇప్పుడు యతిమైత్రిస్థానం ఈమధ్యన ఉన్న త్రిమాత్రాఖండానికి యీవల ఐనా ఉంచాలి లేదా ఆవల ఐనా ఉంచాలి. అంతేకాని మధ్యఖండంలోని ఏఅక్షరం పైన ఉంచినా బాగుండక పోవచ్చునేమో. 
 
మధ్యఖండానికి ముందే ఉంచితే పూర్వార్ధం మరీ పొట్టి అవుతున్నది. అందుచేత ఆవలనే ఉంచటం శ్రేష్ఠం అనక తప్పదు. ఇలాగైతే యతిమైత్రి 9వ అక్షరం పైన ఐతే సరిగ్గా ఉంటుంది. 
 
కాని ఇదంతా ఆలోచించి కూడా పూర్వకవులు ఎనిమిదవ అక్షరాన్ని యతిమైత్రిస్థానంగా గ్రహించటానికి కారణం అక్కడ ఒక గురువు ఉండటం అని భావిస్తున్నాను. ఇలాచేయటం వలన పూర్వభాగం సరిగా రెండు పంచమాత్రాగణాలుగా వచ్చిందని గమనించవచ్చును. తెలుగుపద్యంగా నడపటానికి పంచమాత్రాగణాలు మంచి అందంగా ఉంటాయి. ఆ సంగతి ఇక్కడ కీలకాంశం! ఇప్పుడు నడకను మరొకసారి పరికిస్తే అది UUI - UIII - UII - UI - UU ( 5+5,  4+3+4) అన్నట్లుగా తేటపడుతుంది. ఇక్కడ ఉత్తరభాగంలో భగణం పిదప చిన్న విరుపు వస్తున్నది గమనించండి.

అమితంబు లేల

మధ్యాక్కఱ.
ఒక మంచికీర్తనే చాలు నీతత్త్వ ముగ్గడించుటకు
ఒక మంచిపద్యమే చాలు నీగొప్ప నొప్పార జెప్ప
ఒక మంచిభావమే చాలు మనసు నిన్నూహించి మురియ
అకళంకదివ్యప్రభావ శ్రీరామ యమితంబు లేల
 
ఓ రామచంద్రప్రభూ.
 
ఒక మంచి కీర్తనే చాలు నీ దివ్యతత్త్వాన్ని ప్రకటించి చెప్పటానికి.
ఒక మంచి పద్యమే చాలు నీ గొప్పదనాన్ని సొంపుగా వివరించటానికి.
అలాగే ఒక మంచి భావమే చాలు కదా మనసుకు నిన్ను ఊహించుకొని మురియటానికి.
 
ఓ మచ్చలేని దివ్యప్రభావం కల స్వామీ ఎక్కువగా కీర్తనలో పద్యాలో భావగుంఫనలో చెప్పవలసిన అవసరం ఏముంది?
 
 

నన్ను రక్షించ వలయును

మధ్యాక్కఱ.
శ్రీరామ నీపాదసేవ మానక చేసెద నేను
శ్రీరామ నీనామస్మరణ మానక చేసెద నేను
శ్రీరామ నీన్ను పొగడుట మానక చేసెద నేను
శ్రీరామ నన్ను రక్షించ వలయును ప్రీతితో నీవు
 
ఓ రామచంద్రప్రభూ. నేను మానక నీపాదసేవను చేస్తాను. అలాగే మానకుండా నీనామస్మరణమూ చేస్తాను. నిత్యమూ నిన్ను పొగడుతూనే ఉంటాను.

నీవు మాతం నన్ను ప్రేమతో రక్షించాలి.

శ్రీరామ శ్రీరామ యనిన

మధ్యాక్కఱ.
శ్రీరామ శ్రీరామ యనిన వీడును చిక్కు లన్నియును
శ్రీరామ శ్రీరామ యనిన తీరును చింత లన్నియును
శ్రీరామ శ్రీరామ యనిన చేరును సిరులు సంపదలు
శ్రీరామ శ్రీరామ యనిన మోక్షసంసిధ్ధియు గలుగు


ఈలోకంలో ఎవరు నిత్యమూ శ్రీరామ శ్రీరామ అని స్మరిస్తూ ఉన్నారో వారిని చిక్కులన్నీ వీడిపోతాయి వారి చింతలన్నీ తీరిపోతాయి. అంతే‌కాదు వారికి సకల సిరిసంపదలూ‌ కలుగుతాయి.

అంతేనా? అలా నిత్యమూ శ్రీరామనామ స్మరణ చేసేవారికి తప్పకుండా మోక్షమూ‌ సిధ్ధిస్తుంది.

ఇంకేమి కావాలి?
అందుకే, అందరమూ నిత్యమూ భక్తిప్రపత్తులతో శ్రీరామనామస్మరణ చేదాం.
 
 

10, జూన్ 2023, శనివారం

దాసులపై నమ్మకమ్ము దాశరథికి

 కం. కాసుల కమ్ముడు పోరని

దాసులపై నమ్మకమ్ము దాశరథికి యా

దాసులకు ముక్తి నిడు హరి

మోసము లేదనుచు నమ్ము బుధ్ధియు నెసగున్ 


దాశరథి యైన రామచంద్రప్రభువుకు తన దాసులు కాసులకు అమ్ముడుపోయే రకం జనులు కారని నమ్మకం.

మరి ఆదాసులకో

మోసం ఏమీలేదు హరి తప్పకుండా మోక్షం ఇస్తాడనే నమ్మకం బ్రహ్మాండంగా ఉంది.



4, జూన్ 2023, ఆదివారం

నీవు మెచ్చిన భవవిమోచనం బగును

మధ్యాక్కఱ.
ఎవరి మెప్పును గోరి యేమి పలుకుదు నీశ్వర నేను
సవినయముగ నీదు మెప్పుగోరుదు సాకేతరామ
భువిని నరులమెప్పు నాకేమి పొసగించు మేలు
భువనపతివి నీవు మెచ్చిన భవవిమోచనం బగును
 

 

ఓ రామచంద్రప్రభూ.

ఓ ఈశ్వరా, నోరు ఉందికదా అని నేను ఎవరి మెప్పును కోరి యేమి పలుక నయ్యా? సవినయంగా నేను నీ మెప్పును మాత్రమే‌ కోరే వాడిని కదా. భువిని ఈ నరులు మెచ్చితే నాకు ఏమి మేలు పొసగుతుందని? ఆ పొసగినట్లు కనిపించే‌దేమన్నా ఉన్నా అది పరానికి పనికి వచ్చేది కాలేదు కదా. భువనపతివి ఐన నీవు మెచ్చావే అనుకో అది నాకు భవబంధవిమోచనం కలిగిస్తుంది. అందుచేత నీవు మెచ్చే‌పలుకులే పలుకుతాను సుమా.

నేను లక్ష్మణుడను కాను

నేను లక్ష్మణుడను కాను నిదురకాయగ లేను
పోని మ్మొకపని చేయుము పురుషోత్తమ
 
నిదురలోన కమ్మనికల ముదమారగ రానిమ్ము
సదయ నీవు నాకలలో చక్కగ దర్శనమిమ్ము
నిదురలోని నాకలలో నిన్ను కొలుచుకొన నిమ్ము
హృదయేశ్వర యంతకన్న నేమికావలయును

పవలెల్ల నిన్ను కొలిచి పరవశించి పరవశించి
చివరకు ఆ నిదురపేర చేష్ఠలుడిగి సొమ్మసిలి
భువనేశ్వర నిన్నుమరచిపోవు టెంత దుర్భరము
అవనిజేశ స్వప్నములో నర్చించెడు భాగ్యమిమ్ము
 
కాపురుషుల కననొల్లను కలల యందు రఘురామ
నా పవళ్ళు నారాత్రులు నమ్మకముగ నీవైన
తాపమేది నేనుందును తాపసమందార హరి
నాపాటలు నిరంతరము నడచుహాయిగా నటుల