25, జులై 2016, సోమవారం

పబ్లిక్ బ్లాగులనుండి కష్టేఫలీ బ్లాగరు శర్మగారి నిష్క్రమణం.



కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు సంతోషాన్ని కలిగిస్తాయి.

కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు విచారాన్ని కలిగిస్తాయి.

కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు ఉదాసీనతను కలిగిస్తాయి.

కొన్ని కొన్ని సంఘటనలు మనస్సుకు సంతోషవిచారాలను కలగలుపుగా కలిగిస్తాయి.

ఏ విధంగా చూసినా శ్రీ‌శర్మగారు అగ్రిగేటర్లనుండి తప్పుకోవటం అన్నది తెలుగుబ్లాగులోకానికి తీరని నష్టం. నాకైతే వారి ఈ నిర్ణయం వారికొరకు మంచిది, అవివేకంలో కూరుకొనిపోతున్న తెలుగుబ్లాగులోకానికి చెడ్దది అనిపిస్తున్నది.

ఐతే ఈ‌నష్టం కలగటానికి కారణం ఈ‌తెలుగుబ్లాగులోకం తాలూకు పోకడలే కారణం అంటే అందులో అతిశయోక్తి అణుమాత్రమూ‌ లేదు.

ఒకప్పుడు శ్రీ‌శర్మగారి కష్టేఫలీ బ్లాగు రెండువిధాలుగా అత్యున్నతమైన స్థానంలో ఉండేది.  మొదటికారణం, అనేకబ్లాగుల కన్నా హెచ్చు గౌరవాదరాలతో హుందాగా సాగుతూ ఉండటం. సామాజికజీవితంలో అందరికీ ఎంతో ఉపయుక్తమైన విషయాలను ఎవరికీ నొవ్వు కలగని రీతిలో వారు అందమైన నుడికారంతో కూడిన భాషలో అమృతభాండం వంటి తమ బ్లాగులో నిత్యసంతర్పణం చేస్తూ ఉండటం వలన ఆ ఆదరాభిమానాలు. రెండవకారణం, వారి బ్లాగు విలువను గుర్తించిన తెలుగుబ్లాగులోకం వారికి సముచితమైన గౌరవాదరాలను వినయపూర్వకంగా ఇస్తూ ఎంతో మర్యాదాపూర్వకంగా వ్యవహరిస్తూ అవసరమైన సమాచారాన్ని వారిని అడిగి తెలుసుకొని సంతోషిస్తూ‌ ఉండటం.

కాని రానురానూ ఈ‌ తెలుగుబ్లాగులోకానికి కొందరు తెగులు పట్టించారు. అమర్యాదాపూర్వకమైన వ్రాతలతో పెద్దవారి మనస్సును నొప్పించటమే పనిగా కొందరు చెలరేగుతూ ఉన్న బ్లాగులోకాన్ని విసర్జించక తప్పని పరిస్థితిని శ్రీశర్మగారికి కల్పించారు.

స్వయంకృతాపరాధంతో‌ తెలుగుబ్లాగులోకం ఈ‌దుస్థితిని తెచ్చుకున్నందుకు జాలిపడటం‌ మినహా చేయగలిగింది ఏమీ‌ కనిపించటం లేదు.

ఆయన పట్లు అవఙ్ఞను ప్రదర్శించటం చూస్తూ ఊరుకున్నందుకు అనండి, ఊరకుండటం తప్ప మరేమీ పూనుకొని చేయలేక పోయినందుకు అనండి అపరాథఫలితాన్ని ఈ బ్లాగులోకం అనుభవించక తప్పదు.

కొందరు తెలుగు బ్లాగర్లైతే ఇంకా నిస్సిగ్గుగా వారిని కించపరుస్తూ వినోదిస్తూనే ఉన్నారంటే అది అఙ్ఞానం అనుకోవాలా, అహంకారం అనుకోవాలా?

కొద్ది సంవత్సరాల క్రిందటశ్రీశర్మగారి బ్లాగు టపాలను నిర్లజ్జగా కొందరు దొంగతనం చేసారు. ఆ దొంగతనాన్ని వారు బయటపెట్టిన తరువాత నేను గమనించగా మరింత చౌర్యవిన్యాసం కనిపించింది. నిలదీసాను. ఈ సంఘటన మే, 2014సం. లో జరిగింది.  ఆ చోరశిఖామణి ఇచ్చిన జవాబు 'just i m sharing good information to my friend about our tradition . if u r giving permission then only i keep this page in my blog now i m removing' అని. ఏమన్నా బాగుందా? శ్రీశర్మగారి అనుమతి తీసుకోవద్దా? అందుకే ఆ సమాధానాన్ని తిరస్కరించి 'I'm sorry to say that your curt reply is hardly satisfactory.  Suggest you to apologize to sri Sarma ASAP.  Then you can seek his permission.  You better immediately delete all posts you copied from other sources without permission.  And please don't do such things again ever.' అని మరికొంచెం ఘాటుగా చెప్పాను. మరింత వివరంగా నిరసన తెలుపుతూ అదే రోజున మరొక లేఖ కూడా పంపాను. ఏమీ జవాబు లేదు

పనిలోపనిగా ఆవిడగారు మరొకరి బ్లాగునూ తస్కరిస్తూ ఉండటమూ గమనించి, ఆ బ్లాగరుకు కూడా సమాచారం ఇచ్చాను. వారి ధన్యవాదాలనూ‌ అందుకున్నాను.

తదుపరి కాలంలో ఆ దొరికిన దొంగ చేసినపని ఏమిటీ? తన Facebook పేజీలో‌ 'శర్మగారికి పిచ్చెక్కింది' అంటూ  ప్రేలాపనలకు దిగింది!

అలా దొంగతనంగా శర్మగారి టపాలను మరింకెందరు దోపిడీ చేసారో అని తప్పక అనుకోవాలి. కాని వారందరూ తెలుగుబ్లాగులోకం సభ్యులే.  మొత్తం బ్లాగులోకం అంతా సరిగా స్పందించి ఉంటే చోరుల ఆట కట్టేదని అనుకుంటాను. అలా జరగలేదు. అందుచేత అపరాథభావాన్ని అందరమూ మోయవలసి ఉంది.

పరిస్థితులు దిగజారుడుగా ఉండటాన్ని సహించలేక బ్లాగులోకంలో నుండి నిష్క్రమించాలనీ శ్రీశర్మగారు ప్రయత్నించారు. అగ్రిగేటర్లకు నా బ్లాగుల్ని మీ లిష్టుల్లోంచి తొలగించండి అని విఙ్ఞప్తి చేసారు. కొన్ని అగ్రిగేటర్లు ఆ విఙ్ఞప్తిని పెడచెవిని పెట్టాయంటే అది ఆయన పట్ల అమర్యాదగా ప్రవర్తించటమే.

ఆవుచేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు ఘనతవహించిన అగ్రిగేటర్లే అలా అమర్యాద చేసినప్పుడు, మన తెలుగుబ్లాగులోకపు వీరులు తక్కువగా అమర్యాద చూపుతారా? కొందరు చెలరేగిపోయారు.

ఒకప్పుడు శ్రీశర్మగారి బ్లాగుకు అఙ్ఞాతల బెడద తక్కువగా ఉండేది.  కాని దిగజారుతున్న పరిస్థితులకు దారి తీసిన కాలంతో పాటు ఆ ముచ్చటా తీరుతున్నది.

బ్లాగుటపాలకు వ్యాఖ్యలు పాటించవలసిన కనీసమర్యాదలు కొన్ని ఉన్నాయి. అవి అందరకూ తెలుసు. కాని కొందరు తెలియనట్లు నటిస్తున్నారు. కొందరు తమదే మర్యాదామార్గం అని డబాయించటానికీ‌ ఇక్కడ సిధ్ధంగా ఉన్నారు. అందుకని సమగ్రతకోసం అవేమిటో టూకీగా చెప్పుకుందాం.

  • వ్యాఖ్య టపా విషయానికి సంబంధించి ఉండటం.
  • వ్యాఖ్యలో భాష విషయంలోనూ, భావం విషయంలోనూ, భావప్రకటనలోనూ, నిడివిలోనూ ఎంతమాత్రమూ‌ ఔచిత్యానికి భంగం కలిగించకుండా ఉండటం.
  • ఇతరబ్లాగర్లతో వివాదాలకు తమ వ్యాఖ్యలను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయుధాలుగా వాడుకోకుండా ఉండటం.

ఇలాంటివన్నీ ఒకరిచేత చెప్పించుకోవలసినంత దుర్గతిలో తెలుగుబ్లాగువీరులు ఉన్నారని నేను అనుకోవటంలేదు. అందరికీ అన్నీ తెలుసును. కాని ఎవ్వరూ సముదాచారాన్ని గౌరవింవటం లేదు ఈ తెలుగుబ్లాగుల్లో అన్న చెడ్డపేరు తెలుగుబ్లాగులోకానికి వచ్చేసిందంటే దానికి కారణం ఈ‌బ్లాగులోకంలో అమర్యాద అన్నది ఎంతగా ప్రబలిపోయిందో అర్థం చేసుకోవచ్చును సులభంగా.

అందరూ ఈ దుస్థితికి కారణం అని అరోపించేంత అవివేకిని కాదు. ఎందరో చక్కగా హుందాతనాన్ని పాటిస్తున్నారు. వారెవరో పేరుపేరునా చెప్పలేం - ఎందుకంటే వారి సంఖ్య ఇంకా చాలా హెచ్చుగానే ఉంది కాబట్టి.

కాని ఈ సంఖ్య వేగంగా పడిపోతోంది అన్నది మనం మర్చిపోకూడదు.

మనస్తాపం చెంది ఎందరు మంచిబ్లాగర్లు తప్పుకుంటే అంతగా ఇక్కడ కాలుష్యసాంద్రత పెరుగుతుందని అర్థం చేసుకోవలసిన తరుణం ఇది.

కెమిష్ట్రీలాబ్‌లో ప్రయోగాలు చేస్తున్నప్పుడు మాకు తరచుగా డిమాన్‌స్ట్రేటర్లు ఒక హెచ్చరిక చేస్తూ ఉండేవారు. ఫలితాల్లో 2శాతం కన్నా ఎకువ తేడా వస్తే అది క్షంతవ్యం‌ కాదు పరీక్ష పోతుందీ అని. మనందరికీ‌ కూడా తెలుసు ఒక గిన్నెడు పాలు విరిగిపోవాలంటే ఏమాత్రం విరోధపదార్థం అవసరం అవుతుందీ అని. ఒక్క చుక్క విషం‌ కలిసినా పాయసం పనికిరాదూ అని తెలుసును. ఇవన్నీ మనకు తెలుసును కదా. అందుచేత ఎంతశాతం మంది బాధ్యతారాహిత్యంతో బ్లాగులోకాన్ని భ్రష్టుపట్టిస్తున్నారూ లాంటి ప్రశ్నలను దయచేసి లేవనెత్తకండి.

కొందరు అనవచ్చును. వ్యాఖ్యలను నియంత్రించ వచ్చును కదా అని. నిజమే. కాని పదేపదే అవి వస్తూంటే పెద్దమొత్తంలో, అవన్నీ‌ జల్లెడ పడుతూ కూర్చునేందుకు ఓపిక ఉండాలి కదా? అంత ఆసక్తి ఉండాలి కదా?

ఆలోచనాతరంగాలు బ్లాగులో అసలు వ్యాఖ్యలకే చోటులేదు. ఆయనెంత విసిగి పోయారో మరి అలా నిక్కచ్చి చేసారంటే. ఇలాంటి బ్లాగులు మరికొన్ని కూడా ఉండవచ్చును.

కాని ఎలా ఎంత నియంత్రించినా అదేదో స్వీయనియంత్రణ అంటారే అది లేని బ్లాగులోకంలో ఏమీ సత్ఫలితాలు రావు.  వెఱ్ఱిమొఱ్ఱి వ్యాఖ్యలకు ఒకరు చోటివ్వకపోతేనేం, మరొకరు ఇస్తారు. ఒకరైతే ఎవరికి తోచిన వ్యాఖ్యలను వ్రాసుకోండని  ఒకరు ఒక టపా పేజీనే కేటాయించారు! కొంతమందైతే ఒకచోట తమ వ్యాఖ్యకు స్థానం దొరక్కపోతే కోపించి వీలైనన్ని బ్లాగుల్లో ఆగ్రహావేశాలతో అనుచితమైన వ్యాఖ్యలు పుంఖానుపుంఖాలుగా వ్రాస్తున్నారు

అనునిత్యం అనేక టపాలక్రింద టపావిషయాలకు ఆమడదూరంలో వ్యాఖ్యాతలు యుధ్ధాలు చేసుకుంటూ పోతున్నారు. చూస్తూనే ఉన్నాం.

తోచక కొన్నీ‌ తప్పక కొన్నీ‌ బ్లాగుయుధ్ధాలు నిత్యం జరగటం చూస్తూనే ఉన్నాం.

ఈ యుధ్ధాలని చూసి వినోదించే వారూ, ఆ యుధ్ధాలకు ఆయుధాలూ మైదానాలూ సమకూర్చేవారూ కూడా బయలుదేరారు. కొన్నిసార్లు తగినంత యుధ్ధవాతావరణం ఏర్పడకపోతే సముచితమైన దోహదక్రియలకు దిగే మహానుభావుల్నీ నిరాశగా మనం గమనిస్తున్నాం‌ కాని ఏమీ‌ చేయలేకపోతున్నాం.

సముదాచారానికి విలువ లేకుండా పోతూ ఉండటం కాదు, అసలు సముదాచారం ఎందుకు పాటించాలీ అనే బాపతు ప్రజానీకమూ ఇక్కడ కనిపిస్తున్నారు. 


కొందరు బ్లాగర్లైతే మా బ్లాగులో ఎవరేమి వ్యాఖ్యలు వ్రాసినా మాకు అభ్యంతరం లేదు, అమర్యాదాపూర్వకంగా ఉన్నాసరే అవిమాకు అమూల్యమే అనేస్తున్నారు. వారి వారి ప్రయోజనాలు వారికి ఉండవచ్చును. కాని ఈ‌బ్లాగులోకం విస్తృతప్రయోజనాన్ని కూడా కాస్త బ్లాగర్లంతా దృష్టిలో ఉంచుకోవటం‌ వారి బాధ్యత కాదా? దానినుండి తప్పించుకుంటా మంటే చివరికి ఇలాంటి పరిస్థితి రాక తప్పదు.

ఒక ప్రముఖబ్లాగరు శర్మగారిని కర్మగారు అంటూ ఎద్దేవా చేస్తారు! పెద్దవారికి ఇదా మన బ్లాగులోకం ఇచ్చే మర్యాద? ఎంతమంది ఇలాంటి మాటలను ఖండించగలిగిందీ ఒక్కసారి ఆలోచించుకోండి. చివరికి ఇలాంటి మాటలనూ ఇలాంటి అవినయాన్నీ వినోదించగల స్థితిలో ఉండటం ఈ‌ తెలుగుబ్లాగులోకానికి ఎటువంటి గౌరవాన్ని ఆపాదిస్తుందన్నది కొంచెం ఆలోచించండి.

ఈ రోజున వచ్చిన ఒక అక్షరాలా పొగరుబోతు అనామకులవారి వ్యాఖ్యను చూడండి. శర్మగారు  తన (బ్లాగ్)ఇల్లు మూసేసుకుని ఇతరుల (బ్లాగ్)ఇల్లిళ్ళూ తిరుగుతున్నారన్నమాట! అని. ఇలాంటి మేళం వలనకాదూ ఈ రోజున తెలుగుబ్లాగులోకం  శర్మగారిని దూరం చేసుకుంటున్నదీ? ఈ‌మాట వీళ్ళని అడిగి లాభం ఉంటుందా? ఈ‌ శర్మ గారు లేకపోతేనేం అంటారు. వాళ్ళకేమీ‌ నష్టం ఉండకపోవచ్చు. తెలుగుబ్లాగులంటే ఈ‌ దురుసుదనపు కాలక్షేపరాయుళ్ళేనా అన్నది ఆలోచించుకోవాలి.

మరొక్క ప్రముఖ బ్లాగరు ఎవరండీ శర్మగారు......? అంటారు.  ఏమీ? వారి వ్యాఖ్య చూపిస్తున్నదిగా శర్మగారి ప్రొఫైల్ లింక్? అక్కడికి పోతే వారెవరో తెలియదా? ఇతరుల టెక్నిక్కులను పట్టి ప్రదర్శించే మన మేధావులకు అదేమన్నా బ్రహ్మవిద్యా? ఇలాంటి అవినయపరుల వలన కాదా ఈ రోజున తెలుగుబ్లాగులోకం  శర్మగారిని దూరం చేసుకుంటున్నదీ? పైగా ఆ బ్లాగరు శ్రీశర్మ గారి బ్లాగులో పరంపరగా వ్యాఖ్యలను వ్రాస్తూనే ఉండేవారే కాని వారినీ వారి బ్లాగునూ‌ అస్సలు ఎరుగని వారు కానేకాదే! మరెందుకు నటన?‌ ఎందుకలా వారిని ఎద్దేవా చేయటం?

ఈ తెలుగుబ్లాగులోకం పోకడలనూ, ఈ పోగడలను పట్టించుకోని అగ్రిగేటర్లనూ పక్కన పెట్టి తన వ్రాతలేవో తను వ్రాసుకోవాలని శ్రీశర్మగారు అనుకుంటే అందులో అక్షేపణీయం ఏమీ లేదు. గట్టిగా పట్టించుకుందుకు మాకు పెసులుబాటు లేదూ మేము ఉచితంగా సేవలందిస్తుంటే మాటలంటారా అని అనవచ్చును అగ్రిగేటర్ల వాళ్ళు. కాని వారు కూడా తగుమాత్రం బాధ్యత వహించకుండా ఆ సాకు వెనకాల దాక్కోలేరు.

ఇప్పుడు శ్రీశర్మగారి వ్రాతలను అభిమానంతో చదివేవారికి ఙ్ఞానతృష్ణ కలవారికీ మాత్రం వారి బ్లాగు కనిపిస్తుంది. అదీ వారి ఆహ్వానం మేరకే అనుకుంటాను. శర్మగారికి ఉన్న సౌకర్యం - అనుచితంగా మెలిగే వారిని పాఠకుల్లోనుండి పంపించి వేయటం. యోగ్యులకు అలాంటి దుర్గతి రాదు కాబట్టి, శర్మగారికీ ఆ చదువరులకూ కూడా మనశ్శాంతి. నిజాయితీకల పాఠకులకు అమృతవితరణమూ ఇకమీద నిరాటంకం.

శ్రీశర్మగారి ప్రయత్నం విజయవంతం కావాలని ఆశిస్తున్నాను.
(పనిలో పనిగా, తెలుగుబ్లాగులోకం కాస్త కళ్ళుతెరవాలనీ ఆశిస్తున్నాను.) 


[నేను ఇలా వ్రాయటమే గొప్ప దురుసుతనం అనీ నాబోటి వారివల్లనే ఈ తెలుగుబ్లాగులోకం చెడిపోతోందనీ అనేవాళ్ళు కూడా ఉండవచ్చును. అటువంటి వారికొక నమస్కార శతం. వారితో వివాదానికి దిగనని సవినయంగా అందరికీ మనవి చేస్తున్నాను.]  

 

24, జులై 2016, ఆదివారం

సరసవచోనిథివి చాల మంచివాడవు ...





సరసవచో నిథివి చాల మంచివాడవు
ధరణిజాపతివి చాల దయగల దొరవు


నిదురను గూడ నిన్ను మరువక
ఎదురు చూచుచు నిన్నేళ్ళు
పదిలముగా శుభభావన నిలిపిన
యెదలో ఆశల నింకగ నీకుము
సరస

నీ కృపచే నిట నిర్మిత మైనది
నాకు నెలవుగ నీవు చేసినది
నీ కటాక్షమున నిలచియున్నది
చీకి కూలి ధర చేరక మునుపే
సరస

సువిశాలంబును సుందరమగు నొక
భవనము గాదిది పాతయిల్లు  నీ
కవరోధము వలె హాయి గొల్పగా
సవరించితి నే శక్తికొలదిగా
సరస






23, జులై 2016, శనివారం

రావయ్యా ఈ‌ జీర్ణకుటీరము ...





రావయ్యా యీ‌ జీర్ణకుటీరము
పావనముగ జేయ - వేగమె
రావయ్యా నీ నిజభక్తునకు
దీవన లందీయ బిరబిర


నిదురను గూడ నిన్ను మరువక
ఎదురు చూచుచు నిన్ని యుగంబులు
పదిలముగా శుభభావన నిలిపిన
యెదలో ఆశల నింకగ నీకుము
రావయ్య

నీ కృపచే నిట నిర్మిత మైనది
నాకు నెలవుగ నీవు చేసినది
నీ కటాక్షమున నిలచియున్నది
చీకి కూలి ధర చేరక మునుపే
రావయ్యా

సువిశాలంబును సుందరమగు నొక
భవనము గాదిది పాతయిల్లె నీ
కవరోధము వలె హాయి గొల్పగా
సవరించితి నే శక్తికొలదిగా
రావయ్యా






22, జులై 2016, శుక్రవారం

ఎవరెవెరో ఏమేమో ...





ఎవరెవెరో యేమేమో పలికి
సవరింతురె యీ శ్యాముని మనికి


ఎత్తిన జన్మము లెన్నెన్నో అవి
మెత్తిన తెలివిడి యెంతెతో నా
చిత్త మెఱింగిన స్నేహితుడా నీ
మెత్తని పలుకులు వినుచుండ
ఎవరెవరో

పరమాప్తా స్వప్నావబోధముల
సరళములను హితకరముల నేను
నిరతము వినుచు నీ ప్రియభాషలు
మరువక మదిని స్మరియించు నెడ
ఎవరెవరో

ఆ ముచ్చటలును నాలకించుమని
యేమయ్యా యీ యెకసెక్కెంబులు
నీ మాటలనే నే వినదలచెదు వే
రే మాటల విని యేమి చేయుదు
ఎవరెవరో






20, జులై 2016, బుధవారం

దేవుడవని మొన్ననే తెలిసికొంటిని



దేవుడవని మొన్ననే తెలిసికొంటిని నన్ను
కావుమని నిన్ననే వేడుకొంటిని
ఈవేళ వత్తువని వేచియుంటిని నీ
వేవేళకు వత్తువో తెలియకుంటిని

కబురు చేయుదమంటే కనబడరే నా కెవరూ
కబురు పంపుటకు నీకు కనబడలేదా ఎవరూ
గుబులాయె రామ ఈ జీర్ణకుటీరము నీకు
సబహుమానముగ తగిన స్వాగత మిచ్చేనా
॥దేవుడవని॥
గొప్పగొప్పవారు నిన్ను కొలువ వైకుంఠములో
తప్పనిసరి పనుల మధ్య తలమునక లైతివో
ఎప్పటికి వీలు చిక్కి యిటు వచ్చెదవో రామ
అప్పటికే జీర్ణకుటిని ఆరగించు కాలము
॥దేవుడవని॥
వేదాంతిని కాను నేను విద్యలేవి నేర్వలేదు
నీ దారితెన్నులను నేనెఱుగ నేనెఱుగ
ఓ దయామయ నమ్మి యున్నాను వత్తువని
వేదన లడలించవయ్య విచ్చేయ వయ్య రామ
॥దేవుడవని॥



శ్రీరాము డున్నాడు చింత యేల

     


రామకృపాస్తోత్రం



సీ. పరమకృపాళువై పాపంబులను బాప
        శ్రీరాము డున్నాడు చింత యేల

దయను సముద్రుడై తాపంబులను దీర్చ
        శ్రీరాము డున్నాడు చింత యేల

కరుణాంతరంగుడై కష్టంబులను దీర్చ
        శ్రీరాము డున్నాడు చింత యేల

కనికరించి తలను కాచి రక్షించగా
        శ్రీరాము డున్నాడు చింత యేల


తే. కలిమి శ్రీరామకృప చేత కలుగుచుండు
లేమి శ్రీరామకృప చేత లేకయుండు
జయము శ్రీరామకృప చేత జరుగు చుండు
బ్రతుకు శ్రీరామకృప చేత పండుచుండు


ఆ.వె. శరణు శరణు రామ పరమకృపాధామ
శరణు శరణు రామ సార్వభౌమ
శరణు శరణు రామ పరమపావననామ
శరణు శరణు ధరణిజా సమేత


కం. ఈ‌ రామకృపాస్తోత్రము
తీరుగ జపియించ రామదేవుని కృపచే
ధారాళమగును సౌఖ్యము
శ్రీరాముని యందు భక్తి చేకూరు హృదిన్



19, జులై 2016, మంగళవారం

వ్యాసమహర్షి.


ఆ.వె. హరిని గూర్చి చెప్ప హరికె సాధ్యంబగు
తదితరులకు చెప్ప తరము గాదు
కాన హరియె వ్యాసు డైనాడు లోకసం
గ్రహము కొఱకు గొప్ప కరుణ తోడ

ఉ. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూల కారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాడె వ్యాసునిగ నెల్లర బ్రోవగ వచ్చె భూమికిన్

సీ. వచ్చి వేదమును విభాంగంబు లొనరించి
    మనుజుల చదివింప పనిచె ఋషుల
వచ్చి పురాణముల్ పదునెన్మిదింటిని
    విరచించె జనులకు వెలయ మేలు
వచ్చి శ్రీహరికథల్ గ్రుచ్చి ముక్తిప్రదం
   బగు భాగవతమును ప్రజల కిచ్చె
వచ్చి జయంబన పంచమవేదంబు
    కరుణతో జేసె లోకంబు కొఱకు   

తే. వచ్చి బ్రహ్మసూత్రంబుల నిచ్చె నతడు
ధర్మమార్గంబు దెలిపిన దైవమతడు
భారతీయంబగు సకలవాంగ్మయమును
వ్యాసప్రోక్తంబు కలిమలభంజకంబు

వ. కావున పరమగురుస్వరుపుండగు వ్యాసభగవాను నిట్లు నుతింతును.

ఉ. ప్రాంశుఁ బయోద నీలతనుభాసిత యుజ్జ్వలదండధారి పిం
గాంశుజటాచ్ఛటాభరణ యాగమపుంజపదార్థతత్త్వని
స్సంశయకారి గృష్ణమృగచర్మకృతాంబరకృత్య భారతీ
వంశవివర్ధనా ద్రిదశవందిత వ్యాస మహాత్మ గొల్తు నిన్

18, జులై 2016, సోమవారం

శ్యామలీయంపై శ్రీమాన్ లక్కాకుల వేంకట రాజారావుగారి విసుర్లు.


ఈ మధ్యకాలంలో నేను కొందరికి దేముడు కాదండీ దేవుడు అన్నది సరైన పదం అని చెప్పాను. వారు సరిదిద్దుకోవటమూ జరిగింది. సహజంగానే నటనాపూర్వకంగానో కాని కలహప్రియురాలుగా కనిపించే జిలేబి గారి నుండి దేముడు బాబాయ్ అన్న ఒక టపా వచ్చింది. ఆ టపాను ఆరంభించటమే నన్నొక బెత్తం మాష్టారుగా చూపించారు జిలేబిగారు! సంతోషం.

జిలేబీగారు బహుశః ఆశించినట్లుగానే శ్రీమాన్ లక్కాకుల రాజారావుగారు చర్చను ఇలా ఆరంభించారు. (శ్రీరాజారావు గారు తమదైన పధ్ధతిలో ఎత్తిచూపేదాక -మాలికలో వారి వ్యాఖ్యను చూసేదాక -నేనూ గమనించ లేదు, ఇంటి పేరు పొరపాటుగా వ్రాసానని! ఇప్పుడు, అంటే జూలై 21న సరిచేసాను. )

-జూలై 10, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
నీమమ్మున పల్లె జనులు
దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
దేముడిలో తప్పు వెదుకు
ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

జూలై 10,2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
రావణుడి లోని వా మన
దేవుడిలోనూ గనుపడ తెలుగు జనమ్ముల్
పోవిడి , రాముడిలో గల
మూ వెలయగ దేముడనిరి ముచ్చట గొలిపెన్. 

దేముడు అన్నపదం తప్పుకాదన్నట్లూ, నేను భాషతీరు తెలియకయే తప్పువెదులుతున్నట్లూ వారు స్పష్టంగానే ఆరోపించారు.  ఇది నన్ను తీవ్రంగా బాధించబట్టి నేనుకూడా ఒక సమాధానాన్ని వ్రాసాను దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట  అంటూ ఒక టపాగా శ్యామలీయంలో. రాజారావుగారు తమ వివరణ అనండీ సమాధానం అనండి ఏదీ ఇవ్వలేదు నాటపాకు వ్యాఖ్యగా. కాని వారు  జిలేబీగారి వరూధిని బ్లాగులో ఇలా నన్ను ఆక్షేపిస్తూ వ్రాసారు.

- జూలై 12, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!


మరల వారే తమ బ్లాగులో కూడా ఒక టపాగా తమ అక్షేపణలను ఈ క్రింది విధంగా తెలిపారు. పైవ్యాఖ్యకూ దీనికీ కొద్దిగానే తేడా అంతే.

జూలై 12న రాజారావుగారి బ్లాగులో టపా
జన వ్యవహారము కొరకా
ఘన పండిత సుష్టు కొరకు గలవా భాషల్?
జన భాష నుండి విడివడి
ఘన పండితు లుంట వారి ఘనతా ! అహమా?

పండితుల మాట సుష్టువు!
దండిజనుల నుండి పుట్టి  తల్లి పలుకు గా
మెండుగ వ్యవహారము నం
దుండు పలుకు సుష్టువు నకు దూరంబగునా?

భాష జనుల కొరకు , పండితులకు గాదు ,
ప్రజలు మాటలాడు పలుకు సుష్టు ,
పదము మారు , దాని పరమార్థమును మారు
మార్పు లేని భాష మరణమొందు.

ఎరుకగల వారమందురు ,
అరమరికలు లేని జనుల వ్యవహారములో
విరిసిన తాజా మల్లెల
పరిమళ పదసంపద లకు పరిహాసములా!

ప్రజల నాల్కల పయి బ్రతుకును భాషలు ,
పండితుల మెదళ్ళ పైన కాదు,
ప్రజల నాల్కల పయి పరవశించు పలుకు
జీవ గుళిక  , గొప్ప చేవ కలది .


వారి టపాకు వారే ఒక వ్యాఖ్యను ఇలా జోడించారు మరికొంచెం వివరణగా.
జూలై 12న వారి టపాక్రింద వారిదే ఒక స్పందన
జనంలో ఎవ్వరూ నాన్నను అలా అన్న వారు లేరు,మీరు పిలుచుకుంటానంటే తమ ఘనతను కీర్తిస్తాను .
దేముడు అనే పదం బూతూ కాదు , పైత్యమూ కాదు. దేవుడు అనే పదానికి పర్యాయంగా నెల్లూరు, కడప ఇంకా చాలా జిల్లాల్లో జనం వాడుకలో ఉంది . ఎరుక లేనందున వ్రాయగా దిద్దేనంటాడాయన . పైగా జనం వాడుకలో లేదంటాడు .
భాష సృష్టికర్తలు జనం . పండితులు కాదు . భాష
మాట్లాడే జనం నాల్కల మీద బ్రతికుంటుంది .
పండితుల మెదళ్ళలో కాదు .
తెలుగు మాట్లాడే వాళ్లంతా ఎరుక లేని వాళ్లూ కాదు . బూతులే మాట్లాడుతూ కూర్చోడం లేదు .
' దేవుడు అనే పదానికి పర్యాయంగా కొన్ని చోట్ల
దేముడు అనే వ్యవహారం కూడా ఉండొచ్చు .
ఐతే , అది దేవుడు అనే పదం నుండి ఏర్పడిందే కదా! దేవుడు అని రాస్తే బాగుంటుంది ' అని మర్యాదగా, సున్నితంగా కూడా చెప్పొచ్చు . కానీ, ఇది తప్పు , ఇలానే ఉండాలి అని శాసించడాన్ని
పండితాహంకారమంటారు .

జూలై 13న వారి స్పందన అదే టపాక్రిందను.
వాడుకలో పదాలు మార్ఫుకు లోనగుట సహజం. దీన్ని భాషాపరిణామమంటారు. అసలు దేముడు అనే మాట వాడుకలోనే లేదన్నాడే, దాన్ని విభేదించాను. ఎవ్వరైనా తాము సర్వఙ్ఞుల మనుకోవడం అఙ్ఞానమని తెలుసుకుంటే మంచిది. అలాగే భాషా విషయంలో ఒక్కొక్కరి పంథా ఒక్కో రకం . ఈ పదం అసదు, ఈ పదం గ్రామ్యం, జనవాడుకపదాలు రాతలో వాడరాదు. అనే వాళ్లకు
అనేక నమస్సులు. అసలు భాషకు పరమ ప్రయోజనం జన వ్యవహారము. తతిమ్మా వ్యాసంగాలన్నీ ఆనుషంగిగాలు.  


మీరు గమనించారా? ఆయన ఏకవచనంలో నన్ను సంబోధించటం. నాకైతే నొవ్వు కలిగి ఆయనకు తెలియబరిస్తే ఆయన స్పందన చూడండి.
జూలై 13నవారి వ్యాఖ్య. ఇది వారు చేసిన ఏకవచనప్రయోగాన్ని ఎత్తిచూపినందుకు వారి స్పందన
పల్లెల్లో పుట్టి పెరిగి
పల్లెల ప్రాంతీయ తత్త్వ బహు సహజత్వం
బుల్లంబున పాదుకొనెను,
నెల్లూరు పలుకు బడులు నెలకొను కతనన్ -

అన్నా శ్యామల రాయా!
పన్నుగ నేకవచనమున పలుకుబడి విథం
బన్నది మా పలుకు తీరు
ఉన్నది ఉన్నట్లు పలుక ఉలుకేలయ్యా!

తెచ్చి పెట్టుకున్న తెగగౌరవము కన్న
ప్రేమ లూరు పిలుపు పేర్మి గాదె!
అన్న యనుటకన్ప ఆత్మీయ బంధమ్ము
గారు గీరనుటలొ కాంచ గలమె? 

వారికి నన్ను ఎంత అధిక్షేపించినా తనివి తీరటం లేదండి. ఇది చూడండి.
- జూలై 14, 2016న వరూధిని బ్లాగులో వ్యాఖ్య
భవదీయాంద్ర మహాద్భుత
కవితా ధను ముక్త రగడ ఘన శరములు తా
కి , వికావికలైరి ఘనులు,
స్తవనీయము తవరి పద్య ధను తాడనముల్.



వారు ఈ క్రింది వ్యాఖ్యలో తెలుగుతూలిక బ్లాగులోనికి వెళ్ళి మరలా నాపై కత్తులు దూస్తున్న విధం గమనించండి.


ఆ బ్లాగులోని సదరు టపాక్రింద నేను వ్యాఖ్యను ఉంచలేదే! కాని వారు నేనే తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగాతప్పులె వెదికెడు ఘనుడనని అక్కడకు పోయి ఆక్షేపణ చేస్తున్నారు.
 జూలై 17, 2016న తెలుగుతూలికలో వ్యాఖ్య
తప్పులు వెదుకుటె పనిగా
తప్పక ప్రతి బ్లాగు దూరి తలమునకలుగా
తప్పులె వెదికెడు ఘనులకు
ఒప్పదు రచనా మనోఙ్ఞ మొప్పరు గుణముల్ .
తప్పులు వెదికే వారలు
తప్పక తమ రచన చదివి తమలో గల యీ
తప్పులు వెదికే దుర్గుణ
మిప్పటికైనా విడుచుట మేలగు నండీ .

వారు నన్ను ఏకవచనంలో సంబోధించటంపై నేను నిరసన తెలిపినపుడు చక్కగా 'అన్నా శ్యామల రాయా! ' అన్నారు. తనది ' ప్రేమ లూరు పిలుపు' కాని వట్టి అలాంటిలాంటి ఏకవచనప్రయోగం కాదన్నారు. దానిని ఒక 'ఆత్మీయ బంధమ్ము' అంటూ చిత్రించారు. సంతోషం.

కాని ఇతరత్రా వీలైనంత ఘాటుగా హేళన చేస్తూ మాట్లాడారు ప్రతిసారీ. చదువరులు కొంచెం గమనికతో చదివితే అది సులభంగానే పోల్చుకొన వచ్చును. నాది పండితాహంకారం అట. పండితుడను కాను బాబో అని ఎన్నిసార్లు బ్లాగులోకానికి స్పష్టం చేసాను!? మాటిమాటికీ ఘనుడు అని ఎత్తిపొడవటంలో ఉన్న ప్రేముడిని మీరే చూడండి. అన్నట్లు నాపై విసుర్లు పడ్డప్పుడల్లా జిలేబీగారు ఆనందోత్సాహాలతో స్పందించటమూ గమనించండి. ఎందుకో ఈ నిరుపయోగమైన అకారణవైరాలు!

నేను రాజారావు గారికి ఏ విన్నపమూ చేయటం లేదు.  వారు ఉచితానుచితాలనుకొంచెంగా అలోచించుకుంటే బాగుంటుందని ఆశిస్తున్నానంతే. అకారణవైరం వారికి నాపైన ఉన్నపక్షంలో నేను చేయగలిగింది ఏమీ లేదు, కేవలం ఉపేక్షించి ఊరకొనటం తప్ప. నాకైతే వారితో ఏవైరమూ లేదు ఏవిధమైన వైరకారణమూ లేదు.  


రామాయణంలో వాల్మీకులవారు మంధర అలా ఎందుకు చేసిందండీ అంటే మంధరాః పాపదర్శినీ అని చెప్పి వదిలేసారు. నా దురదృష్టం కొద్దీ, నేనేమి వ్రాసినా ఎవరికి ఏమి సలహా ఇచ్చినా అది ఒక అపరాధం లాగే తోస్తోంది వారి దృష్టికి!  చెప్పానుకదండీ దురదృష్టం అని. అంతే. అందుచేత ఆవిషయంలో ఏమీ చేయలేను. ఉపేక్షయే శరణ్యం.

ఈ టపా వ్రాయటానికి కారణం?
నా మనసులోనుండి ఈ విషయాన్ని ఇంతటితో దూరం పెట్టటం.

నా మనసునుండి నొవ్వును తొలగించుకొనటానికి వ్రాసాను కాని ఎవరినీ నొప్పించటం నా ఉద్దేశమూ కాదు, వృత్తీ కాదు,  ప్రవృత్తీ కాదు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే, మన్నించాలి.


11, జులై 2016, సోమవారం

దేముడు ఎవరో తెలియని ధీమంతుడిని అట.





నిన్న జూలై 10న మాన్యులు శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు నన్ను ఉద్దేశించి ఒక వ్యాఖ్య రూపంలో ఈ క్రింది పద్యం చెప్పారు.

    నీమమ్మున పల్లె జనులు
    దేముడనుచు మ్రొక్కులిడెడు తీరు తెలిసియున్ ,
    దేముడిలో తప్పు వెదుకు
    ధీమతులకు భాష తీరు తెలుపుము దేవా!

ఈ వ్యాఖ్య నేపథ్యం, రాజారావు గారి చేత రస సిద్ధులు  అనిపించుకొన్న ధన్యజీవి జిలేబీ గారు తమ వరూధినీ బ్లాగులో వ్రాసిన దేవుడు బాబాయ్ టపా. ఈ టపాలో జిలేబీ గారు 'బెత్తం మేష్టారు' అని తమకు సహజమైన వ్యంగ్యధోరణిలో సంబోధించినది నన్నే అన్నది తెలుగుబ్లాగులోకంలో అందరికీ సులభగ్రాహ్యమైన విషయమే.

అదేమి చిత్రమో కాని రాజారావు గారి దృష్టికి రససిధ్ధులుగా కనిపిస్తున్న జిలేబీగారు నా కంటికి మాత్రం ఎందుకనో కాని నిత్యమూ విరససిధ్ధులు గానే కనిపిస్తున్నారు మరి. ఈ రోజున జిలేబీ గారు మా గురువులుంగారు నన్ను బర్తరఫ్ జేసినారు అని ఓ చురక వేసారు నాకు.  కాని ఆ బర్తరఫ్ అవయోగం ఎందుకు తమకు సంప్రాప్తించిందీ అంటే తాము అసభ్యపదజాలంతో కూడిన వ్యాఖ్యను వ్రాయటం కారణంగానే అన్నది మాత్రం జిలేబీ గారు ప్రస్తావించలేదు సుమా. అసభ్యపదాలతో వ్రాయటం కూడా ఒక రససిధ్ధి యోగాభ్యాసవిధానమే అన్న కొత్తసంగతి నాకు నమ్మశక్యం  కాకుండా ఉంది.  నిజమైన ధీమంతులకే ఇలాంటి మహావిషయాలు తెలుస్తాయేమో నాకు తెలియదు.

కొంతకాలంగా గమనిస్తున్నాను. రాజారావు గారు నా విషయంలో కొంత వైమనస్యంతో ఉన్నట్లు కనిపిస్తున్నది. కొన్నికొన్ని సందర్భాల్లో నా మాటలను ఖండిస్తూ తమతమ పద్యవిలాసం చూపారు కూడా. పెద్దలు వారితో విరోధభావం సముచితం కాదని నేను వారి మాటలను మౌనంగా గమనించీ గమనించనట్లే ఉంటున్నాను. కాని ఈ నాడు నాకు కొంచెం హెచ్చు బాధకలిగి సమాధానం వ్రాయవలసి వస్తున్నది. దీని నిడివి కారణంగా ప్రతివ్యాఖ్యగా వ్రాయటం వీలుపడదు కాబట్టి ఒకటపాగా వ్రాస్తున్నాను. దీని అర్థం వారితో విరోధం కోరుతున్నానని కాదు.

    భాషతీరును తెలిసిన వారు మీకు
    దేముడను మాట పుట్టువు తెలియవచ్చు
    దేము నెఱిగిన వారలే ధీమతులన
    నేమి చెప్పుదు దేవునే యెఱుగు దేను

    ఏను పెరిగిన యూళ్ళలో నెన్నడైన
    దేవు డను వారినే గాని దేము డనెడు
    మానవుని చూచి యెఱుగను మాన్యచరిత
    దేముడని మ్రొక్కు వార లేతీరువారొ

    తెలియమిం జేసి కొందరు దేము డనుచు
    వ్రాయు టెఱుగుదు గాని యెవ్వార లేని
    దేముడని పల్కి మ్రొక్కుట తెలియ దయ్య
    నీమ మను మాట నటు లుండనిండు స్వామి

    ఎందు లేనట్టి పదముల కొంద రెఱుక
    చాలమింజేసి వాడెడు చాడ్పు నఱసి
    తెలిసినంతగ తప్పును దిద్ది నంత
    భాష తీఱెఱుగడు నాగ బల్కదగునె

    వ్యావహారిక మను పేర వట్టి గ్రామ్య
    పదములను కూడ వ్రాయుట భావ్య మనుచు
    భావవాదుల మని బల్కువారు మీరు
    భాష యెటులున్న నేమన వచ్చు నింక

    సంప్రదాయమ్ము కలిగిన చక్కనైన
    విద్య సద్విద్య సద్వేద్య పద్యవిద్య
    దాని గౌరవమును దీయ దగదు మనకు
    పద్యముల నైన సుష్టుగా వ్రాయవలయు

    వచనమున గూడ సుష్టువై వరలు భాష
    వాడి నంతట మీదు నవ్యతకు విన్న
    దనము కల్గదు భావముల్ తళుకు చెడవు
    వన్నె గ్రామ్యంబె యందురా వందనములు

    కల్గుచో వైమనస్యంబు కల్గు గాక
    యకట కొద్దిగ శ్యామలీయంబు పైన
    నంత మాత్రంబునకు నేల వింత వింత
    వాదములు నెత్తి పొడుపుల పద్యములును

    పండితుడగాను యెఱిగిన వాడ గాను
    ధీమతుడగాను కొంచెమే తెలిసియుందు
    వినయశీలుడ మీబోటి వారి తోడ
    వాదులాడంగ తగినట్టి వాడ గాను

    ధీమతుడ నని చేసిన దెప్పిపొడుపు
    నా మనంబును కలచిన నాకు బాధ
    కలిగి పలికితి నంతియ కాని యొకరి
    కేమి చెప్పగ తగువాడ నెంతవాడ





8, జులై 2016, శుక్రవారం

రెండు పద్యకంఠీరవాలు!



వరంగల్లులో అష్టావధానం అంటూ శంకరాభరణం బ్లాగులో కంది శంకరయ్య గారు ఒక టపా ప్రచురించారు. ఆ టపాలో సదరు సభకు పిలిచే ఆహ్వానపత్రాన్ని ఫోటోతీసి వేసారు. అందులో ముఖ్య అతిధి గారు సహస్రపద్యకంఠీరవ బిరుదాంకితులు. శంకరయ్యగారిని సహస్రపద్యకంఠీరవ అంటే ఏమిటో బోధపడలే దండీ అని ప్రశ్నిస్తే ఆయన నాకు ఇచ్చిన జవాబును ఇక్కడ ప్రచురిస్తున్నాను.

శ్యామల రావు గారూ, వారికి ఎక్కడ, ఎప్పుడు, ఎవరు ఆ బిరుద మిచ్చారో నాకు తెలియదు. ఈరోజు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి డా. ఇందారపు కిషన్ రావు (ప్రసిద్ధ అష్టావధాని) గారి ఇంటికి వెళ్లినప్పుడు వా రన్నారు "ఈ సహస్ర పద్య కంఠీరవ ఏమిటి? ఆయనను ఏకధాటిగా వేయి పద్యాలు అప్పగించే సామర్థ్యం ఉంది. అందుకు సహస్ర పద్య పఠన కంఠీరవ అనో సహస్ర పద్య ధారణా కంఠీరవ అనో అనాలి. కాని సహస్ర పద్య కంఠీరవ అనడం తప్పు" అన్నారు.

ఈ జవాబులో ఏకధాటిగా పద్యాలు అప్పగించే సామర్థ్యం గురించిన ప్రస్తావన చదవగానే నాకు నా చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది.

మా నాన్నగారు కీ.శే. తాడిగడప వేంకట సత్యనారాయణగారు 60ల్లో తూర్పు గోదావరిజిల్లా గెద్దనాపల్లెలో ప్రాథమికోన్నతపాఠశాలకు ప్రథానోపాధ్యాయుగా ఉండేవారు. పాఠశాలా విద్యార్థులకు మా పాఠశాల వార్షికోత్సవం వచ్చిన సందర్భంలో రకరకాల పోటీలు పెట్టేవారు. వార్షికోత్సవాలు చాలా సందడిగా జరిగేవి.

ఒకసారి పద్యాలను అప్పగించటం పైన పోటీ నిర్వహించారు.

ఆ సంవత్సరం నాతోపాటు మా బేబీపిన్ని కూడా చదువుకొన్నది ఆ పాఠశాలలో.

ఇద్దరం కంటికి కనబడ్డ ప్రతిపద్యాన్నీ బట్టీ పట్టటం మొదలు పెట్టాము.

ఈ పోటీ జరిగే విధానంలో ఒక మెలిక పెట్టారు. మొదటగా ప్రతి అభ్యర్థీ వేదికమీదకు రాగానే వచ్చిన పద్యాల లిష్టును జడ్జీలకు అందించాలి. వాటిలోనుండి జడ్జీలు చదవమని అడిగిన ప్రతి పద్యాన్నితప్పుల్లేకుండా చదవాలి. అంతేనా అనకండి. జడ్జీలు అడిగితే పద్యం అర్థాన్నీ వివరించాలి మరి. అదీ మెలిక.

పాఠ్యపుస్తకంలోని పద్యాలు అన్నీ పిడి వేసేసాం. నా కంటే మా పిన్ని ఒక క్లాసు పెద్ద. ఐనా నా పుస్తకంలోనివీ తన పుస్తకంలోనివీ అన్నీ పట్టేసాం. అప్పట్లో ఆంధ్రప్రభ సచిత్రవారపత్రికలో కూడా పద్యాలు వచ్చేవి. ఇంట్లో అవి బోలెడున్నాయి. అవన్నీ బట్టీ ఐపోయాయి.

కొన్ని శతకాలు కూడా ఉన్నాయి మా యింట్లో. వాటిల్లోనుండీ వీలైనన్ని భట్టీయం వేసాం

పద్యం దొరకగానే బట్టీ పట్టటం. ఒకరి కొకరు అప్పచెప్పుకోవటమూ మొదటి ఘట్టం.

ఆతరువాత మా నాన్నగారి దగ్గరకు పరిగెత్తి ఆ పద్యం అర్థం చెప్పమని ఒకటే పోరు పెట్టటం.

ఇలా వందలమీద పద్యాలను కంఠగతం చేసుకున్నాం.

ఇద్దరమూ చెరొక నాలుగువందల పద్యాలూ లిష్టులు వేసి ఇచ్చాం.  పాపం మిగతా పిల్లలంతా పదిపరకపద్యాల లిష్టులే సమర్పించా రనుకుంటాను.

నన్నొక ఇరవయ్యో పాతికో పద్యాలను అడిగారు ఒకటి అప్పగించగానే మరొకటి చొప్పున. చాలా వాటికి అర్థాలు కూడా అడిగారు.

మా పిన్నినీ అలాగే అడిగారు.

ఇద్దరం సమఉజ్జీగానే చెప్పాం.

ఒక్క చోట కాబోలు తాను అర్థం వివరించటంలో కొంచెం తడబడిందనో లేదా తనకంటే నేనొక యేడాది చిన్నవాడిని కదా అనో నాకు మొదటిస్థానమూ ఆమెకు రెండవస్థానమూ ఇచ్చారు. మరీ చిన్నపిల్లలం కదా అని బహుమతులే ఇచ్చారు కాని న్యాయంగా పద్యధారణాకంఠీరవ అన్న బిరుదం కూడా ఇస్తే ఎంత బాగుండేదీ అని!

తదనంతర కాలంలో ఆమె భాషాప్రవీణ పట్టా పుచ్చుకొని నిడదవోలులో తెలుగు ఉపాధ్యాయురాలిగా పని చేసింది.

నాకైతే ఆ రోజుల్లో మా నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహం తెలుగుభాషపైన నాకు కొంచెం పట్టు సంపాదించుకుందుకూ, మాతృభాషపైన అభిమానం పెరిగేందుకూ బాగా తోడ్పడింది.

అన్నట్లు నేను పద్యాలను వ్రాయటం మొదలు పెట్టిన కొత్తలో మా నాన్నగారు బాగా ప్రోత్సహించటానికి గాను ఆయన స్వయంగా నాతో పాటు పద్యాలను అల్లుతూ ఉండేవారు. 

6, జులై 2016, బుధవారం

ఫలించిన జోస్యం - 9 (గండాలే గండాలు -2)


నాతో‌ దాగుడుమూత లాడుతున్న గండాలను గురించి చెబుతున్నాను కదా.

నేను ఎక్కడపడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ కనిపించిన కాగితాన్ని చదివే ప్రయత్నం చేయటం వంటి సాహసకృత్యం ఫలితంగా మా వాళ్ళకి, ముఖ్యంగా మా అమ్మగారికి కొంచెం‌ బెదురు పుట్టింది.

మేము గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు వచ్చిన క్రొత్తలో ఒకసారి మా అమ్మగారు మా నాన్నగారితో అననే అన్నారు 'వీడు చూస్తే ఎదురుగా ఏమి వస్తోందో చూసుకోడు, ఇదేమో‌ టౌనాయె. సైకిళ్ళూ అవీ‌ తిరుగుతూ ఉంటాయిక్కడా' అని. 'వీడొక మందమతి. రోడ్డుమీద కూడా ఏదో ఆలోచిస్తూ‌ నడిస్తే ఎంత ప్రమాదమూ' అని కూడా అన్నారు. ఈ మాటల్లో అతిశయోక్తి ఏమీ‌ లేదని జనాభిప్రాయం.

డిగ్రీ రెండవసంవత్సరంలో ఉండగా జబ్బుపడ్డాను. దాని పేరు పేరాటైఫాయిడ్ అట. ఆరోజుల్లో జబ్బుచేస్తే లంఘనాలే‌ కదా.  ఎవరైనా నమ్ముతారో లేదో పాతికలంఘనాల పైనే‌ చేసాను. డిగ్రీ రెండవసంవత్సరం పబ్లిక్ పరీక్షలకు అప్లికేషన్ వ్యవహారం అంతా నా ప్రియమిత్రుడు గుడిమెళ్ళ పాండురంగారావే చూసుకున్నాడు కాలేజీవారి సహకారంతో. నేను ఫారాలమీద సంతకాలు చేసానంతే.  మా అస్థానవైద్యులు అంబారుఖానా శ్రీరామమూర్తిగారే అలోపతీ వైద్యం చేసారు.

ఆరోగ్యం బాగుపడిందిలే అనిపించాక కాలేజీకి ఒకరోజున వెళ్ళివచ్చాను. ఎంతైనా బలహీనంగానే ఉన్నాను కదా, సాయంత్రం ఇంటికి వచ్చే సరికి, కొంచెం‌ అలసి,  నిద్రపోయాను. మా అమ్మగారి శీతలకరస్పర్శతో‌ మెలుకువ వచ్చింది. ఎదురుగా మా అమ్మగారు ఆందోళనతో కనిపించారు, ప్రక్కనే గంభీరంగా మా నాన్నగారు. జబ్బు తిరుగబెట్టింది. మళ్ళా లంఘనాలు మెదలు.

మంచమీద నుండి లేవలేని పరిస్థితికి వచ్చేసాను. మాట్లాడటానికీ ఓపికలేని పరిస్థితి. మా నాన్నగారు ఆందోళన పడుతున్నారని కనిపిస్తోందంటే మా అమ్మగారిపరిస్థితి గురించి వేరే చెప్పాలా?

చివరకు శ్రీరామమూర్తిగారు మా నాన్నగారితో, 'ఈ రిక్లార్ బాగానే పనిచేస్తున్నా, నార్మల్లోకి రావటానికి ఆలస్యం అవుతోంది. అలోపతీ అటుంచండి. జయమంగళరసం వాడదాం. మూడురోజుల్లోగా పత్యానికి వచ్చి తీరుతుంది. ఏమీ‌ భయపడకండి' అన్నారు. ఆ జయమంగళరసం నిజంగానే బాగా పనిచేసింది. ఈ సారి పాతిక చిల్లర లంఘనాలు (ముఫై అని గుర్తు) ముగిసి, పథ్యం ఇచ్చారు.

మేము అద్దెకు ఉంటున్న ఇంట్లో అటూ ఇటూ ఉన్న వాటాలు అద్దెకు ఇచ్చి మధ్యవాటా ఇంటివారు వచ్చినప్పుడు వాడుకుందుకు వీలుగా తాళం వేసి ఉండేది మొదట్లో.  కొన్నేళ్ళ తరువాత, ఇంటి వారు మా నాన్నగారి మిత్రులే కాబట్టి వారి వాటాను కూడా మాకే అప్పజెప్పారు. ఆ ఇంటివారి వాటా మధ్యలో పెద్ద హాలు ఉండేది. ఆ హాలులో నుండే డాబాపైకి వెళ్ళటానికి మెట్లు కుడా ఉండేవి.

ఆహాలు మధ్యలో పీట వేసి కూర్చో బెట్టి నాకు మా అమ్మగారు పథ్యం తినిపించారు. నాకు పీటమీద కూర్చోవటానికి కూడా ఎంతమాత్రమూ ఓపిక లేదు. అది చూసి మా అమ్మగారికి ఒక పక్కన కన్నీళ్ళు ఆగటం లేదు. పిల్లవాడికి పథ్యం‌ పెడుతున్నామని సంతోషం‌ ఒక ప్రక్కనా, వాడు కనీసం కూర్చోను కూడా ఓపలేని స్థితిలో ఉన్నాడని బాధ ఒకప్రక్కనా మరి. ఆ రోజును తలచుకుంటుంటే నాకూ‌ ఇప్పుడు కన్నీళ్ళు ఆగటం లేదు. అంత జబ్బు తరువాత నేరుగా అన్నం పెట్టరు కదా.  శ్రీరామమూర్తిగారు కొఱ్ఱజావను పల్చగా ఇమ్మన్నారు. ఆరోజున పేరుకే పథ్యం‌ కాని గుటక వేయటం చాలా కష్టమైపోయింది.  పథ్యం‌ పెట్టినా మరి కొన్నాళ్ళు దాదాపు మంచాన్ని అంటిపెట్టుకొనే‌ గడిపాను.

నా స్నేహితులు కొందరైతే నేను దక్కనేమో అని భయపడ్దామని చెప్పారు.

అదృష్టవశాత్తు పరీక్షలకు కొన్ని నెలల సమయం ఉండబట్టి సమయానికి తగినంతగా తేరుకొని అమలాపురం వెళ్ళాను పరీక్షలను వ్రాయటానికి. పెద్దగా తయారీ అంటూ ఏమీ లేదు - ఎక్కువగా మేలుకొని ఉండి చదివేంత ఆరోగ్యం కాదు కదా మరి. వచ్చిందేదో వ్రాయటమే.  అన్నట్లు ఆ పరీక్షలు మొదటి రెండు సంవత్సరాల సిలబస్ మొత్తానికి కలిపి!

మొదట ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పరీక్షలు. బాగానే వ్రాస్తున్నాను. వాటిలో‌ చివరిది తెలుగులో రెండవపేపర్ అనుకుంటాను. అది వ్రాసి నేనూ‌ నా రూమ్మేటు పాండురంగారావూ హోటల్‌కు భోజనానికి బయలు దేరాము. తిరిగి వస్తూ‌ కాబోలు కొంచెం తలనొప్పిగా ఉందిరా అని రంగడితో అన్నాను. సుబ్బారావుగారి దగ్గరకు వెడదాం ఏదైనా మందు వేసుకుందువు గాని అని అతను మంథా సుబ్బారావుగారి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన అమలాపురంలో ప్రసిధ్ద ఆయుర్వేదవైద్యులు. 'నేను మందు అడిగి తెస్తాలే, నువ్వు కూర్చో' అని చెప్పి అతను లోపలకు వెళ్ళి ఎవరితో ఏమి చెప్పాడో తెలియదు. సుబ్బారావు గారే స్వయంగా వచ్చి పరీక్షించి ఒక టాబ్లెట్ మింగించారు.

రూమ్‌కు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాను. రాత్రికి కాని మెలకువ రాలేదు.  మెలకువ వచ్చేసరికి నా ప్రక్కనే మా నాన్నగారు! నాకు నూటనాలుగు డిగ్రీల జ్వరం. ఒళ్ళంతా సలసలలాడుతోంది.  తరువాత తెలిసిన విషయం ఏమిటంటే నాకు జ్వరంగా ఉందనీ మా నాన్నగారికి కబురుపెట్టమనీ‌ రంగాను సుబ్బారావుగారే ఆదేశించారట.

నాకు పట్టుదల పెరిగిపోయింది. జ్వరాన్ని లెక్కచేయకుండా పరీక్షలు వ్రాసి తీరుతానని ప్రకటించాను. పాండురంగారావు నచ్చ చెప్పబోతే వినలేదు. మా నాన్నగారు బ్రతిమలాడినా వినలేదు. సుబ్బారావు గారు వద్దన్నా వినలేదు. పరీక్షహాలులో నన్ను మా లెక్చరర్లు  చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒళ్ళు తెలిసీతెలియని స్థితిలోనే, మళ్ళా, మందులు మింగుతూ లంఘనాలు చేస్తూనే పరీక్షలు వ్రాసాను. అవి ముగిసిన తరువాత నాకు జ్వరం తగ్గి ఓపికరావటానికి మరొక వారం పైనే పట్టింది. పాండురంగారావు నా ప్రక్కనే ఉండి చూసుకుంటూ ఉండబట్టి సరిపోయింది.  చివరికి నేను సుబ్బారావుగారి దగ్గర సెలవుతీసుకొని వెళుతుంటే ఆయన , 'నీకు మళ్ళా ధృఢత్వం రావాలంటే నాలుగైదు ఏళ్ళన్నా పడుతుంది. ఆరోగ్య‌ం‌ జాగ్రత్త సుమా' అని చెప్పారు దాదాపు గాలివీచితే పడిపోయేలా ఉన్న నాతో. కాని మరొక మూడు నాలుగేళ్ళకి మళ్ళా జబ్బు పడ్డాను. అప్పటికి రంపచోడవరం వచ్చేసాం. గాడాల డాక్టర్ గారని అనేవారు. ఆయన పేరు దేవరాజు మహారాజు. ఆయన నాకు వైద్యం చేసి ఆ తరువాత బలం రావటానికి కాను వసంత కుసుమాకరం మండలం రోజులు వాడించారు. దానివలన మంచి లాభం కలిగింది.

మరి కొన్నేళ్ళకు హైదరాబాదు వచ్చి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగంలో ఈత మొదలు పెట్టాను.

ఉద్యోగజీవితం మొదలైన కొత్తలో  ప్రపంచానుభవంలేక నేనూ నా మిత్రులు కొద్దిమందిమీ‌ ఒక చిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాం‌ ఒకసారి. ఈ‌ సంఘటన హైదరాబాదులో జరిగినది కాదు. వేరే చోట. పరిస్థితి చాలా పెద్ద అవమానానికి దారితీసేలా ఉంది. ఎంత ఒత్తిడికి లోనయ్యామంటే మాలో ఒకతనైతే ఆత్మహత్యతప్ప దారిలేదని నిర్ణయించేసుకున్నాడు. నేనైతే మౌనంగా రాములవారికి ఒక విఙ్ఞప్తి చేసి ఊరకున్నాను. చివరికి ఇబ్బంది అంతా మబ్బులాగా విడిపోయింది.

హైదరాబాదుకు వచ్చిన కొత్తలో కంప్యూటర్ సొసైటీ వారి వార్షిక సమావేశాలు ఆ సంవత్సరం పూనాలో‌ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిన బృందంలో నేనూ ఉన్నాను. ఏదో ఒక చిన్న పాటి పేపర్ కూడా నా ముఖంలాగా చదివాను లెండి. మా బృందంలో ఉన్న వారిలో రేమెళ్ళ అవధానులు గారూ ఉన్నారు. ఆయన మా నాన్నగారి శిష్యులు.  నా కంటే వృత్తిపరంగా ఆరేళ్ళు సీనియర్. నేనంటే ఆయనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు అవధానులు గారు వేదభారతిని నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల సమావేశాలు పూనాలో‌ ముగిశాక ఒక ఉదయం‌ సికంద్రాబాదులో రైలు దిగాము. మాలో కొందరు పట్టాలు దాటి ఒకటో‌ నంబరు ప్లాత్‌ఫారం మీదకు వెళ్ళారు. నేనూ‌ అవధానులు గారూ‌ మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతున్నాం. హఠాత్తుగా నా గమనికకు వచ్చింది. ఒక రైలు బండి దాదాపు మా సమీపానికి వచ్చేసిందని. ఒక ఉదుటున దాటాను. అవధానులు గారు ఇంకా గమనించలేదు రైలును. నేను అరచి ఆయన రెక్కపట్టి బయటకు గుంజాను. మరుక్షణంలో రైలు వెళ్ళింది. ఆయన కొయ్యబారిపోయా రొకక్షణం. 'మా ఆవిడ మంగళసూత్రం గట్టిదండోయ్' అన్నారు. ఈ విధంగా మేము ఒక గండం నుండి తృటిలో‌ తప్పించుకున్నాం.

ఒకటి రెండు సార్లు సికంద్రాబాదు బస్సుస్టాండులో కొద్దిలో ప్రమాదాలు తప్పాయి.

అమెరికా వెళ్ళాక కూడా ప్రమాదాలు వెంటాడాయి. రెండు సార్లు నా కారు ప్రమాదానికి గురైనది. కాని నాకు గాని నా శ్రీమతికి గాని ఏమీ కాలేదు. ఒకసారి మేము వేరొకరితో ప్రయాణిస్తున్నప్పుడు సిగ్నల్ వద్ద ఆగియున్న మా కారును మరొక కారు వెనుకనుండి బలంగా ఢీకొట్టింది. మళ్ళా తృటిలో‌ తప్పించుకున్నాం అందరం. ఒక సారి ఒక కారు రోడ్ క్రాస్ చేస్తున్న నా మీదకు చాలా వేగంగా వచ్చేసింది కాని సురక్షితంగా తప్పించుకున్నాను.

రెండేళ్ళ క్రిందట వృత్తిగతమైన పనులమీద కాలిఫోర్నియాకు వెళ్ళి వచ్చాను. నేను బస చేసిన మోటెల్ చుట్టపట్ల భారతీయభోజనం వంటిదేమో‌దొరకదు. ఎల్ కమినో‌ రియాల్ రోడ్డు మీద 25వ వీధి మొగలో చెన్నైక్లబ్ అని ఒకటి ఉందని తెలిసింది. అక్కడైతే కాస్త మన తిండి దొరుకుతుందని కొంచెం దూరం (అబ్బే ఎంతలెండి రెండు మైళ్ళేను!) నడచి వెళ్ళే వాడిని. అలా నడచి వెళ్ళే‌దారిలో ఒక చోట రైల్వేక్రాసింగ్ వస్తుంది. భయపడకండి రైలును చూసుకోకపోవట‌ం‌ లాంటి దేమీ‌ జరగ లేదు లెండి. ఆ రోజున భోజనానికని ఆ ప్రాంతంలో నడచి వెడుతుండగా ఒక పెద్ద ట్రాఫిక్ సైన్ బోర్డు హఠాత్తుగా నా చొక్కాను రాసుకుంటూ నా వెనుకనే పడిపోయింది! ఒక సెకనులో పదోవంతు సమయం నేను కొంచెం మెల్లగా వస్తూ ఉన్నపక్షంలో అది కాస్తా తిన్నగా నా నెత్తి మీదనే ఖచ్చితంగా పడేది.

అంత పెద్ద చప్పుడుతో‌ ఆ బోర్డుకాస్తా నా వెనుకనే‌ పడటంతో వెనుదిరిగి చూసాను బిత్తరపోయి.

కొంచెం దూరంలో ఎదురుగా ఒక వృధ్ధదంపతుల దర్శనం.  ఇద్దరూ ఒక్కసారి కంగారుగా 'హోహో' అని అరిచారు. మొల్లగా నా దగ్గరకు నడచుకుంటూ వచ్చారు. అప్పటికింకా నేను పూర్తిగా తేరుకోలేదు. అలాగే షాక్ లోనే ఉన్నానన్న మాట.

నా దగ్గరగా వచ్చారు. ముసలాయన 'ఆర్ యు ఆల్‌రైట్' అని పరామర్శించాడు. 'యు ఆర్ సో‌ బ్లెస్‌డ్. గాడ్ ఈజ్ విత్ యు ఫర్ స్యూర్' అని అన్నారు ముసలావిడ.

ఈ సంఘటన జరిగిన ఒక నిముషంలోపునే నేను ఏమీ జరగనట్లే‌ నడచుకుంటూ చెన్నైక్లబ్‌కు వెళ్ళి భోజనం చేసి అదే దారిలో తిరిగి వెళ్ళాను.

ఈ సంఘటన జరిగిన చాలా కాలం తరువాతనే ఆ వృధ్ధదంపతులు ఎవరన్నది నాకు స్ఫురించింది.

4, జులై 2016, సోమవారం

మిథిలాసందర్శనము







శ్రీరామ చంద్రుడు సీతమ్మ గూడి
సింహాసనస్థుడై చెన్నుమీఱగను
సార్వభౌముండుగా జగమేలు చుండ
సురలెల్ల ప్రీతులై చూచుచుండంగ
నెలమూడు వానలు నిత్యమై యుండ
కలికంబునకు నేని కరవు లేకుండ
ఉర్విసుభిక్షమై యొప్పారు చుండ
జనులెల్ల సంతోషస్వాంతులై యుండ
ప్రతినాడు జనులకు పండువై యుండ
భూనాధు జనులెల్ల పొగడుచు నుండ
భూనాధు మునులెల్ల పొగడుచు నుండ
భూనాధు నరపతుల్ పొగడుచు నుండ
భూనాథు కవులెల్ల పొగడుచు నుండ
భూనాథు సత్కీర్తి భూమిపై నిండ
భూనాథు సత్కీర్తి భువనముల్ నిండ
సర్వంబు చక్కగా జరుగుచు నుండ
సాకేత మరుదెంచె జనకుని దూత
సభలోని కరుదెంచె జనకుని దూత
జానకమ్మను చూచె జనకుని దూత
సార్వభౌముని చూచె జనకుని దూత
సంతోషమున పొంగె జనకుని దూత
వినుతశీలుండైన జనకుని దూత
జ్ఞానియు వృధ్ధుడౌ జనకుని దూత
సీతమ్మతల్లి కాశీర్వాద మిచ్చె
శ్రీరామవిభున కాశీర్వాద మిచ్చె
మామగా రంపిన మహితాత్మునకును
రామచంద్రుడు సేసె రాజోచితములు
మరియాదలెన్నియో నిరుపమానములు
గౌరవంబులు సేసి కానిక లిచ్చి
సాకేతపతి పల్కె సాంజలి యగుచు
పెద్దలు జనకులు వినిపించ మనిన
ఆనతి వినిపించు డయ్యరో మీరు
సీరధ్వజుల యాన శ్రీరాము డెపుడు
శిరమున దాల్చును సీతమ్మ యాన
అనినంత నా దూత యానంద పడుచు
అగణితగుణధామ యా మాట చాలు
మారాజు కోరిక మన్నించి నటులె
వినవయ్య చక్కగా వినిపింతు నీకు
జనకుల మాటలు వినిపింతు నీకు
ప్రియమైన మాటలు వినిపింతు నీకు
అతిలోక వీరుడ యల్లుడ రామ
దనుజేంద్రగర్వవిధ్వంసక రామ
సకలలోకస్తుత్యసద్గుణధామ
సత్యాశ్రయా సురసన్నుత రామ
పరమేశబ్రహ్మేంద్రప్రస్తుత రామ
పిల్ల నిచ్చితి గాన చల్లని వాడ
నీకు బంధువు నైతి నేను ధన్యుడను
మన్నించి నీవు నీ మామ గేహంబు
పావనం‌ బొనరింప వలయు విచ్చేసి
చిన్నతల్లిని నాదు సీతను జూడ
కన్నులు కాయలు కాచిన వయ్య
నా తల్లి నాయింట నడయాడి నాకు
కనులపండువ సేయు ఘనభాగ్య మిమ్ము
నాగేటి చాలులో నాముందు వెలసి
నాబిడ్డయై నిల్చి నన్ను పాలించి
నీయింటి వెలుగైన నిరుపమజ్యోతి
నా తల్లి సీతను నాకు చూపించు
అవలీలగా నాడు శివుని విల్లెత్తి
దాని నొంచిన నిన్ను తాను చేపట్టి
మీ యింటి కోడలై మెఱసిన తల్లి
అడవికి నీతోడ నడచె నా సీత
పడరాని యిడుములు పడెను నా సీత
రాకాసి లంకలో శోకించె సీత
నా బిడ్డ సీతను నాకు చూపించు
పంక్తికంఠుని నీవు పట్టి వధించి
తేఱి యవనజ మోము తిలకించ లేక
నిన్నొల్ల బొమ్మన్న నిప్పులో దూకె
అగ్నిహోత్రుడు తల్లి నగ్గించ గాను
కష్టాల గుండాలు గడచె నా తల్లి
నా చిట్టితల్లిని నాకు చూపించు
పుట్టింట సుఖములు పొందుచు పెరిగె
ముగ్గురత్తలు తన్ను ముద్దు సేయగను
ఆరళ్ళు పెట్టని యత్తింట వెలిగె
కష్టాలు కడతేది గద్దియ కెక్కె
నా కన్నతల్లిని నాకు చూపించు
బ్రహ్మేంద్రరుద్రులు ప్రస్తుతించగను
దివినుండి తనమామ దిగివచ్చి పొగడ
అసమాన కీర్తితో నలరారి నట్టి
నా ముద్దుబిడ్డను నాకు చూపించు
సర్వాభినుతయైన సౌశీల్యజ్యోతి
నా కంటివెలుగును నాకు చూపించు
ఇనకులసౌభాగ్యహేతువై నట్టి
నా భాగ్యరాశిని నాకు చూపించు
రావణగర్వనిర్వాపణాకార
నా పుణ్యరాశిని నాకు చూపించు
వీరరాఘవధర్మవిజయపతాక
నా సీత నొకసారి నాకు చూపించు
మిథిలానగరకీర్తి మేలిపతాక
నా తల్లి నొకసారి నాకు చూపించు
రామయ్య ఒకసారి రావయ్య నీవు
సీరధ్వజుని జూడ సీతమ్మ తోడ
మీ యిర్వురను జూడ మిథిలలో వారు
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
మీ యిర్వురను జూడ మా యింటి వారు
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
మీ యిర్వురను జూడ మీ‌ మామ యత్త
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
రావయ్య మిథిలకు రామయ్య నీవు
రమణి సీతమ్మతో రాజశేఖరుడ
అని పల్కె మిథిలాపురాధీశ్వరుండు
వినిపించితిని వారు వినిపించమన్న
పలుకు లన్నింటిని బ్రహ్మాండనాథ
భవదీయమైన సభాస్థలంబునను
మీ యాఙ్ఞ మేరకు మీ‌ సమ్ముఖమున
శ్రీరామచంద్ర నీ చేయదగినది
చేయుము రాజేంద్ర శీఘ్రంబుగాను
మన్నించ దగు నీకు మామ కోరికను
అని పల్కె నా దూత వినయ మొప్పంగ
సీతమ్మ కన్నులు చెమ్మగిల్లినవి
విభుని మోమేమొ గంభీరమై యుండె
అటునిటు రాజు మాట్లాడక యుండె
గుడుసుళ్ళుపడి రాజు కూర్చుని యుండె
అరమోడ్పు కనులతో‌ నట్లె కూర్చుండె
వేచి యుండెను దూత విభుడట్టు లుండె
విభుని మాటలు విన సభ వేచియుండె
అరఘడియకును మాట్లాడడు రాజు
కాంతుని తిలకించె కలికి సీతమ్మ
కాంతుడు సీతమ్మ కనులలో జూచె
మిగుల ప్రసన్నుడై జగదీశ్వరుండు
ముని వశిష్ఠుని దొల్త కనుగొని యపుడు
దూతను కనుగొని తోయజాక్షుండు
సభవారి కనుగొని సర్వాత్మకుండు
తమ్ముల కనుగొని ధర్మవిగ్రహుడు
మంత్రుల కనుకొని మానవేశ్వరుడు
మధురాక్షరంబుల మాటాడ దొడగె


(సశేషం)







ఫలించిన జోస్యం - 8 (గండాలే గండాలు -1)

( మొదటిభాగం  రెండవభాగం  మూడవభాగం  నాలుగవభాగం  ఐదవభాగం  ఆరవభాగం  ఏడవభాగం)

( ఒకవారం రోజులు cervical spondylosis పుణ్యమా అని ఆటంక కలిగింది)

ఒక్కొక్కసారి చాలా ఆశ్చర్యం‌ కలుగుతూ‌ ఉంటుంది నాకే. నా జీవనయాత్రలో ఇన్ని గండాలు దాటవలసి రావటం ఎంతో చిత్రంగా అనిపిస్తుంది.

నిజానికి ఈ‌ గండాలమారి జీవుడి లోకవిహారంలో‌ గండాలకు ప్రారంభం అయ్యేనాటికి భూమిమీద అవతరించటం‌ జరగనే లేదంటే కొందరు నమ్మక పోవచ్చును.

తరచుగా కలలోనికి వచ్చి ఒకావిడ 'పిల్లవాడికి నా పేరు పెట్టవా' అని ప్రాధేయపడుతూ ఉండేదట. అలా పేరు పెడితే అన్ని వేళలా తాను కాపుదలగా ఉంటాననీ లేకుంటే అలాంటి అవకాశం తనకు రాదనీ బ్రతిమాలేదట.  ఒకవేళ అలా చేయటానికి అంగీకరించని పక్షంలో బిడ్డ పుట్టటం కూడా కష్టం సుమా అని బెదిరించేదట కూడా!

మా అమ్మగారు తనకు ఎవరో ఒకావిడ కలలోనికి వచ్చి ఇలా చెబుతోందని చెబితే మొదట్లో మన హేతువాదుల్లాగే, నీదంతా ఒట్టి భ్రమ అని నచ్చచెప్పబోయారట అందరూ. ఐతే ఆ కలలోనికి వస్తున్నావిడ రూపురేఖలు వగైరా మా అమ్మగారు వర్ణించిన తీరును బట్టి ఆ వ్యక్తిని పోల్చుకొని ఆశ్చర్యపోయారట.

ఆ కలలోనికి వచ్చి మా అమ్మగారిని ఇబ్బంది పెట్టిన స్త్రీమూర్తి పేరు శ్యామలాంబ.

ఆవిడ మా నాన్నగారి ప్రథమ ధర్మపత్ని. దురదృష్టవశాత్తూ చాలా చిన్నవయసులోనే ఆవిడ పరమపదం‌ చేరుకోవటం జరిగిందట. తదనంతరం మా నాన్నగారు ద్వితీయ వివాహం చేసుకొన్నారు. మా అమ్మగారి పేరు రంగనాయకమ్మ గారు. ఏ కారణం చేతనో‌ కాని మా నాన్నగారు మా అమ్మగారిపేరును కొంచెం క్లుప్తం చేసి రంగమణిగా మార్చారు!

ఇదంతా మా అమ్మగారే స్వయంగా నాతో ఒకటి కంటే హెచ్చు సందర్భాల్లోనే చెప్పారు. ఎన్ని సార్లు కనిపించి ఎలా ఎలా మాట్లాడేదో‌ కూడా చెప్పారనుకోండి. ఐతే ఆ కలలోనికి వచ్చినావిడ పట్ల మా అమ్మగారి సానుభూతియే మా అమ్మగారి మాటల్లో ఎక్కువగా ధ్వనించేది.

నాకు శ్యామలరావు అని నా తలిదండ్రులు పేరు పెట్టటం వెనుక నున్న కథ ఇది.

నాకు గుర్తున్నంత వరకూ ఈ‌కథకు సంబంధించిన ప్రస్తావన మా నాన్నగారి నుండి ఎన్నడూ‌ రాలేదు.

మేము తరచుగా ర్యాలికి వెళ్ళి వస్తూ ఉండే వారం. అక్కడ జగన్మోహినీ‌కేశవస్వామివారిని సందర్శించి రావటం ఒక మిష ఐతే మరొకటి కూడా ముఖ్యమైనది ఉంది. అది మా అమ్మమ్మగా రింటికి వెళ్ళి రావటం. ఈ‌ర్యాలి అమ్మమ్మగారు మా బామ్మగారికి అన్నగారి భార్య. చిన్నతనంలోనే భర్తగారు పోయారట. ర్యాలిలోని వారింట్లో ఆవిడ ఇద్దరు కూతుళ్ళతోనూ అత్తగారితోనూ‌ కలిసి నివసించేవారు. వాళ్ళు చాలా చాలా బీదవాళ్ళు. అప్పుడప్పుడూ‌ మా నాన్నగారే‌ వెళ్ళి వాళ్ళని చూసి వచ్చేవారు. వాళ్ళు చేసిన చిన్నా చితకా అప్పులూ‌ తీర్చి వచ్చేవారు. నిజానికి అలా వాళ్ళ అప్పులు తీర్చటం మా నాన్నగారికి తలకు మించిన భారం గానే ఉండేది,.

అలా ర్యాలి వెళ్ళిన ఒక సందర్భంలో, మా నాన్నగారితో పాటు ఒకరింటికి వెళ్ళటం‌ తటస్థించింది. నాతో‌పాటు ఆ సందర్భంలో నా పెదతమ్ముడు రామం కూడా ఉన్నాడనే గుర్తు. వాళ్ళెవరో ముసలి వాళ్ళు. ఆ యింటివాళ్ళు నాన్నగారి రాకకు ఎంతో‌ సంతోషించారు. వాళ్ళింట్లో ఒక అరగంటపాటు కూర్చున్నాం అనుకుంటాను. మాకు కారప్పూస వగైరా కూడా పెట్టారు. అది నాకు బాగా గుర్తు. ఇంకా పెద్దగుర్తు ఏమిటంటే ఆ ముదుసళులూ‌ మా నాన్నగారూ‌ కొంచెం విచారంగా ఏమో మాట్లాడుకున్నారు.  తరువాతి కాలంలో నాకు అర్థమైనది ఏమిటంటే వారు మా సవతి తల్లిగారి తలిదండ్రులని.

ర్యాలిలో‌ఉండే మా బామ్మగారి పుట్టింటివారు కూడా మా యింటికి బాగా తరచుగానే వచ్చేవారు. మా తాతమ్మగారు అంటే బామ్మగారి తల్లిగారికి మడీదడీ‌ చాలా హెచ్చు మరియు సుబ్రహ్మణ్యస్వామి భక్తురాలు.

లక్ష్మీపోలవరం వాస్తవ్యులకు మంచినీటి వసతి గోదావరి కాలువే. అది మా యింటికి ఒక వందగజాల లోపు దూరంలోనే ఉండేది. మా దొడ్డిలో ఒక ఉమ్మడి నుయ్యి, వాడకం నీళ్ళ అవసరం తీరుస్తూ ఉండేది.  మంచినీళ్ళకైతే ఆడవాళ్ళంతా కాలువను ఆశ్రయించేది తప్పదు కాబట్టి మా యింట్లో నుండి మా బామ్మగారూ మా అమ్మగారూ‌ బిందెలతో అలాగే నీళ్ళు తెచ్చుకొనేవారు.

మంచినీళ్ళకే కాక ఊరి వారు స్నానానికీ కాలువను ఉపయోగించేవారు.

ఒకరోజు అలా కాలువకు స్నానానికీ, ఆ పిదప మంచినీళ్ళను తెచ్చుకుందుకూ మాఅమ్మగారూ, మా బామ్మగారూ, మా తాతమ్మగారూ ముగ్గురూ కాలువకు వెళ్ళారట. ఇంకా ఊహ సరిగారాని చిన్నపిల్లవాడిని నన్నూ‌ తీసుకొని వెళ్ళారట. ఏం జరిగిందో ఏమో, వీళ్ళు చూసేసరికి నేను అప్పటికే‌ ప్రవాహంలో అంతదూరం కొట్టుకొని పోయానట. మా తాతమ్మగారు తెగించి ప్రవహంలో‌ ఈదుకుంటూ ఎలాగో వెళ్ళి నన్ను రక్షించి తీసుకొచ్చారట. మా తాతమ్మగారి ప్రసక్తి వచ్చినప్పుడల్లా మా అమ్మగారు ఈ‌సంఘటనను తప్పక ప్రస్తావించేవారు. ముక్తాయింపుగా మరొక సంగతీ ప్రస్తావించే వారు - ఆ కాలువ చెడ్డదనీ ఆ సంఘటనకు ముందు రోజనే‌ ఒక చిన్నపిల్లవాడు దానిలో కొట్టుకొని పోయాడనీ చెప్పేవారు.

ఇదొకటే‌ కాదు కొన్నేళ్ళ తరువాత మరొక జలగండమూ‌ తప్పింది నాకు. అప్పటికి మా నాన్నగారు గెద్దనాపల్లెలో మిడిల్‌స్కూల్ ప్రథానోపాధ్యాయులుగా ఉండేవారు. పాఠశాల బిల్డింగుకు ప్రక్కనే మంచినీటికొలను. నేను ఒకటో తరగతి దాటి రెండులోనికి వచ్చానో లేదో. ఒక రోజు ఉదయం పదిగంటల సమయంలో ఆ మంచినీటి కొలనులో కాలు జారి పడిపోయాను. నాకేమో ఈతరాదు. అప్పుడూ‌ రాదు - ఇప్పటికీ‌ రాదు. పడిన విసురుకు కొలని మధ్యగా కొంతదూరం వెళ్ళిపోయాను. అశ్చర్యం ఏమిటంటే, ఎంతమాత్రం‌ ఈ‌తరాని నేను ఎలా ప్రయత్నం చేసి ఒడ్డున ఉన్న రేవు మెట్లను పట్టుకొన గలిగానో కాని మొత్తం మీద గండం గడిచింది.  ధారాపాతంగా నీళ్ళోడుతున్న బట్టలతో హెడ్మాష్టరు గారి పెద్దబ్బాయి అలా స్కూలు ముందు నుండి నడచుకుంటూ వెడుతుంటే, అది వేరే ఎవరి కంటనో‌ కాదు, ఏదో పని మీద బయటకు వస్తున్న మా నాన్నగారి కళ్ళలోనే పడింది. స్వయంగా తనూ స్కూలు బంట్రోతు జగన్నాధమూ కలిసి నన్ను ఇంటికి చేర్చారు. జరిగింది వివరం రాబట్టి తెలుసుకున్న తరువాత అంతా గాభరాపడ్డారు.

ఆ సందర్భంలో, నన్ను చూడటానికి మా ఎలిమెంటరీ‌ స్కూలు హెడ్మాష్టరు సోమరాజుగారు కూడా వచ్చారు. పెరిగి పెద్దై డిగ్రీలోనికి వచ్చాక నేను అమలాపురంలో ఒక గది తీసుకొని అద్దెకుండేవాడిని. ఆ యింటాయన శేషగిరిరావుగారు ఒక ప్లీడరు గుమాస్తా గారు. ఆయనకు ఈ‌సోమరాజుగారు దగ్గర బంధువులట. అందుచేత వారొకటి రెండు సార్లు అమలాపురం వచ్చినపుడు నన్ను చూసి చాలా సంతోషించేవారు.

నా చిన్నతనంలోనే మరొక పెద్దం గండం‌ గడిచింది. ఒకరోజున పాఠశాలలోని మా నాన్నగారి  గది బయట ఆడుకుంటున్నాను. బడి భవనం అరుగు మీద నుండి క్రిందికి దూకాను. ఫరవాలేదులెండి రెండు లేదా రెండున్నర అడుగుల ఎత్తు అరుగే అది.  అరుగు చివరన స్కూలు గంట వ్రేలాడుతూ‌ ఉంది. అదొక ఇనప కమ్మీ. సరిగా దాని క్రిందనుండి నేను క్రిందికి దూకాను. అదే సమయంలో ఆ గంటకూ పై దూలానికీ కలిపి కట్టిన తాడో గొలుసో వదులై ఆ కమ్మీ కాస్తా క్రింద పడింది. ఆ పడటం‌ సరిగ్గా నా మీదనే. నా కుడితొడను రాసుకుంటూ అది క్రిందకు పడింది.  అక్కడే ఉన్న బడిబంట్రోతూ,  ఆ సమయంలోనే భవనంలోనికి వస్తున్న మరొక ఉపాధ్యాయులూ పెద్దగా అరవటంతో‌ మా నాన్నగారూ బయటకు వచ్చారు.  నా కేమీ‌ భయమూ గట్రా అనిపించలేదు కాని మా నాన్నగారు మాత్రం చాలా భయపడ్డారు.

మరొక సంఘటన, అదీ‌ నా చిన్నతనం లోనిదే. గెద్దనాపల్లిలో ఉండగా జరిగినదే. కాస్త అక్షరాలను చదవటం అలవాటయ్యాక, అదొక రంధి ఐపోయింది నాకు. ఎక్కడ నాలుగక్షరాలు కనిపించినా అవి వెంటనే చదివి తీరవలసిందే. సందు మళుపు దాటగానే కొద్ది దూరంలోనే ఉన్న పచారీ దుకాణానికి వెళ్ళి చిన్నచితకా వెచ్చాలు తెస్తూ‌ ఉండే వయసు వచ్చింది కదా.  అలాగే ఒక నాడు ఏదో పొట్లం‌ కట్టించుకొని తెస్తున్నానో లేదా అలా వస్తుంటే రోడ్డు మీద ఏదన్నా కాగితం కనిపించిందో నా దృష్టికి అన్నది ఇప్పుడు సరిగా చెప్పలేను. కానీ దాని వలన ప్రమాదం నా మీదకు ఉరుక్కుంటూ వచ్చి అది కాస్తా, తలవెంట్రుకవాసిలో తప్పిపోయింది.  ఎవడో‌ లారీ వాడు దారిన వస్తూ‌ ఉన్నాడు. ఆ రాత్రి ఏడెనిమి గంటలవేళ చీకట్లో, ఆ లారీ‌ హెడ్ లైట్ల వెలుగులో, నాకు చేతిలోని కాగితంలో ఏముందో చూడటం సులువుగా అనిపించింది. దారి కడ్డంగా నిలబడి మరీ ఆ కాగితం దీక్షగా చదువుతున్నాను!

ఇంకేముంది? ఓ మూడు నాలుగు నిముషాల తర్వాత నేను మా యింట్లో వాళ్ళ ముందు బిక్క ముఖం వేసుకొని నుంచున్నాను. లారీ వాడు నా చెవులు పట్టుకొని మా యింటికి తీసుకొని వచ్చి పంచాయితీ‌ పెట్టాడంటే అది వాడి తప్పా చెప్పండి? ఈ రోజున నా అదృష్టమూ మీ అదృష్టమూ‌ బాగున్నాయి కాబట్టి సరిపోయిందని కళ్ళొత్తుకుంటూ  వాడు మా అమ్మగారితోనూ నాన్నగారితోనూ 'అబ్బాయిగారిని ఒక్కర్నీ ఎప్పుడూ బయటకు పంపకండీ' అని  మరీమరీ‌ చెప్పి చక్కాపోయాడు

అన్నట్లు ఒక ముఖ్య విషయం వ్రాయటం మరచిపోయాను! ఆ లారీవాడికీ నాకూ ముఖాముఖీ జరిగిన స్థలం గెద్దనాపల్లిలోని రామకోవెల ముంగిలి.  (అక్కడి రామాలయాన్ని అలాగే పిలచేవారు.)

ఇంకా చాలాగ్రంథం‌ ఉందండీ. అదంతా రేపు.