19, జులై 2016, మంగళవారం

వ్యాసమహర్షి.


ఆ.వె. హరిని గూర్చి చెప్ప హరికె సాధ్యంబగు
తదితరులకు చెప్ప తరము గాదు
కాన హరియె వ్యాసు డైనాడు లోకసం
గ్రహము కొఱకు గొప్ప కరుణ తోడ

ఉ. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
ఎవ్వని యందు డిందు బరమేశ్వరు డెవ్వడు మూల కారణం
బెవ్వ డనాదిమధ్యలయు డెవ్వడు సర్వము దానయైన వా
డెవ్వడు వాడె వ్యాసునిగ నెల్లర బ్రోవగ వచ్చె భూమికిన్

సీ. వచ్చి వేదమును విభాంగంబు లొనరించి
    మనుజుల చదివింప పనిచె ఋషుల
వచ్చి పురాణముల్ పదునెన్మిదింటిని
    విరచించె జనులకు వెలయ మేలు
వచ్చి శ్రీహరికథల్ గ్రుచ్చి ముక్తిప్రదం
   బగు భాగవతమును ప్రజల కిచ్చె
వచ్చి జయంబన పంచమవేదంబు
    కరుణతో జేసె లోకంబు కొఱకు   

తే. వచ్చి బ్రహ్మసూత్రంబుల నిచ్చె నతడు
ధర్మమార్గంబు దెలిపిన దైవమతడు
భారతీయంబగు సకలవాంగ్మయమును
వ్యాసప్రోక్తంబు కలిమలభంజకంబు

వ. కావున పరమగురుస్వరుపుండగు వ్యాసభగవాను నిట్లు నుతింతును.

ఉ. ప్రాంశుఁ బయోద నీలతనుభాసిత యుజ్జ్వలదండధారి పిం
గాంశుజటాచ్ఛటాభరణ యాగమపుంజపదార్థతత్త్వని
స్సంశయకారి గృష్ణమృగచర్మకృతాంబరకృత్య భారతీ
వంశవివర్ధనా ద్రిదశవందిత వ్యాస మహాత్మ గొల్తు నిన్