6, జులై 2016, బుధవారం

ఫలించిన జోస్యం - 9 (గండాలే గండాలు -2)


నాతో‌ దాగుడుమూత లాడుతున్న గండాలను గురించి చెబుతున్నాను కదా.

నేను ఎక్కడపడితే అక్కడ రోడ్డుకు అడ్డంగా నిలబడి మరీ కనిపించిన కాగితాన్ని చదివే ప్రయత్నం చేయటం వంటి సాహసకృత్యం ఫలితంగా మా వాళ్ళకి, ముఖ్యంగా మా అమ్మగారికి కొంచెం‌ బెదురు పుట్టింది.

మేము గెద్దనాపల్లె నుండి కొత్తపేటకు వచ్చిన క్రొత్తలో ఒకసారి మా అమ్మగారు మా నాన్నగారితో అననే అన్నారు 'వీడు చూస్తే ఎదురుగా ఏమి వస్తోందో చూసుకోడు, ఇదేమో‌ టౌనాయె. సైకిళ్ళూ అవీ‌ తిరుగుతూ ఉంటాయిక్కడా' అని. 'వీడొక మందమతి. రోడ్డుమీద కూడా ఏదో ఆలోచిస్తూ‌ నడిస్తే ఎంత ప్రమాదమూ' అని కూడా అన్నారు. ఈ మాటల్లో అతిశయోక్తి ఏమీ‌ లేదని జనాభిప్రాయం.

డిగ్రీ రెండవసంవత్సరంలో ఉండగా జబ్బుపడ్డాను. దాని పేరు పేరాటైఫాయిడ్ అట. ఆరోజుల్లో జబ్బుచేస్తే లంఘనాలే‌ కదా.  ఎవరైనా నమ్ముతారో లేదో పాతికలంఘనాల పైనే‌ చేసాను. డిగ్రీ రెండవసంవత్సరం పబ్లిక్ పరీక్షలకు అప్లికేషన్ వ్యవహారం అంతా నా ప్రియమిత్రుడు గుడిమెళ్ళ పాండురంగారావే చూసుకున్నాడు కాలేజీవారి సహకారంతో. నేను ఫారాలమీద సంతకాలు చేసానంతే.  మా అస్థానవైద్యులు అంబారుఖానా శ్రీరామమూర్తిగారే అలోపతీ వైద్యం చేసారు.

ఆరోగ్యం బాగుపడిందిలే అనిపించాక కాలేజీకి ఒకరోజున వెళ్ళివచ్చాను. ఎంతైనా బలహీనంగానే ఉన్నాను కదా, సాయంత్రం ఇంటికి వచ్చే సరికి, కొంచెం‌ అలసి,  నిద్రపోయాను. మా అమ్మగారి శీతలకరస్పర్శతో‌ మెలుకువ వచ్చింది. ఎదురుగా మా అమ్మగారు ఆందోళనతో కనిపించారు, ప్రక్కనే గంభీరంగా మా నాన్నగారు. జబ్బు తిరుగబెట్టింది. మళ్ళా లంఘనాలు మెదలు.

మంచమీద నుండి లేవలేని పరిస్థితికి వచ్చేసాను. మాట్లాడటానికీ ఓపికలేని పరిస్థితి. మా నాన్నగారు ఆందోళన పడుతున్నారని కనిపిస్తోందంటే మా అమ్మగారిపరిస్థితి గురించి వేరే చెప్పాలా?

చివరకు శ్రీరామమూర్తిగారు మా నాన్నగారితో, 'ఈ రిక్లార్ బాగానే పనిచేస్తున్నా, నార్మల్లోకి రావటానికి ఆలస్యం అవుతోంది. అలోపతీ అటుంచండి. జయమంగళరసం వాడదాం. మూడురోజుల్లోగా పత్యానికి వచ్చి తీరుతుంది. ఏమీ‌ భయపడకండి' అన్నారు. ఆ జయమంగళరసం నిజంగానే బాగా పనిచేసింది. ఈ సారి పాతిక చిల్లర లంఘనాలు (ముఫై అని గుర్తు) ముగిసి, పథ్యం ఇచ్చారు.

మేము అద్దెకు ఉంటున్న ఇంట్లో అటూ ఇటూ ఉన్న వాటాలు అద్దెకు ఇచ్చి మధ్యవాటా ఇంటివారు వచ్చినప్పుడు వాడుకుందుకు వీలుగా తాళం వేసి ఉండేది మొదట్లో.  కొన్నేళ్ళ తరువాత, ఇంటి వారు మా నాన్నగారి మిత్రులే కాబట్టి వారి వాటాను కూడా మాకే అప్పజెప్పారు. ఆ ఇంటివారి వాటా మధ్యలో పెద్ద హాలు ఉండేది. ఆ హాలులో నుండే డాబాపైకి వెళ్ళటానికి మెట్లు కుడా ఉండేవి.

ఆహాలు మధ్యలో పీట వేసి కూర్చో బెట్టి నాకు మా అమ్మగారు పథ్యం తినిపించారు. నాకు పీటమీద కూర్చోవటానికి కూడా ఎంతమాత్రమూ ఓపిక లేదు. అది చూసి మా అమ్మగారికి ఒక పక్కన కన్నీళ్ళు ఆగటం లేదు. పిల్లవాడికి పథ్యం‌ పెడుతున్నామని సంతోషం‌ ఒక ప్రక్కనా, వాడు కనీసం కూర్చోను కూడా ఓపలేని స్థితిలో ఉన్నాడని బాధ ఒకప్రక్కనా మరి. ఆ రోజును తలచుకుంటుంటే నాకూ‌ ఇప్పుడు కన్నీళ్ళు ఆగటం లేదు. అంత జబ్బు తరువాత నేరుగా అన్నం పెట్టరు కదా.  శ్రీరామమూర్తిగారు కొఱ్ఱజావను పల్చగా ఇమ్మన్నారు. ఆరోజున పేరుకే పథ్యం‌ కాని గుటక వేయటం చాలా కష్టమైపోయింది.  పథ్యం‌ పెట్టినా మరి కొన్నాళ్ళు దాదాపు మంచాన్ని అంటిపెట్టుకొనే‌ గడిపాను.

నా స్నేహితులు కొందరైతే నేను దక్కనేమో అని భయపడ్దామని చెప్పారు.

అదృష్టవశాత్తు పరీక్షలకు కొన్ని నెలల సమయం ఉండబట్టి సమయానికి తగినంతగా తేరుకొని అమలాపురం వెళ్ళాను పరీక్షలను వ్రాయటానికి. పెద్దగా తయారీ అంటూ ఏమీ లేదు - ఎక్కువగా మేలుకొని ఉండి చదివేంత ఆరోగ్యం కాదు కదా మరి. వచ్చిందేదో వ్రాయటమే.  అన్నట్లు ఆ పరీక్షలు మొదటి రెండు సంవత్సరాల సిలబస్ మొత్తానికి కలిపి!

మొదట ఇంగ్లీషు, తెలుగు భాషల్లో పరీక్షలు. బాగానే వ్రాస్తున్నాను. వాటిలో‌ చివరిది తెలుగులో రెండవపేపర్ అనుకుంటాను. అది వ్రాసి నేనూ‌ నా రూమ్మేటు పాండురంగారావూ హోటల్‌కు భోజనానికి బయలు దేరాము. తిరిగి వస్తూ‌ కాబోలు కొంచెం తలనొప్పిగా ఉందిరా అని రంగడితో అన్నాను. సుబ్బారావుగారి దగ్గరకు వెడదాం ఏదైనా మందు వేసుకుందువు గాని అని అతను మంథా సుబ్బారావుగారి దగ్గరకు తీసుకెళ్ళాడు. ఆయన అమలాపురంలో ప్రసిధ్ద ఆయుర్వేదవైద్యులు. 'నేను మందు అడిగి తెస్తాలే, నువ్వు కూర్చో' అని చెప్పి అతను లోపలకు వెళ్ళి ఎవరితో ఏమి చెప్పాడో తెలియదు. సుబ్బారావు గారే స్వయంగా వచ్చి పరీక్షించి ఒక టాబ్లెట్ మింగించారు.

రూమ్‌కు తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుందామని నడుం వాల్చాను. రాత్రికి కాని మెలకువ రాలేదు.  మెలకువ వచ్చేసరికి నా ప్రక్కనే మా నాన్నగారు! నాకు నూటనాలుగు డిగ్రీల జ్వరం. ఒళ్ళంతా సలసలలాడుతోంది.  తరువాత తెలిసిన విషయం ఏమిటంటే నాకు జ్వరంగా ఉందనీ మా నాన్నగారికి కబురుపెట్టమనీ‌ రంగాను సుబ్బారావుగారే ఆదేశించారట.

నాకు పట్టుదల పెరిగిపోయింది. జ్వరాన్ని లెక్కచేయకుండా పరీక్షలు వ్రాసి తీరుతానని ప్రకటించాను. పాండురంగారావు నచ్చ చెప్పబోతే వినలేదు. మా నాన్నగారు బ్రతిమలాడినా వినలేదు. సుబ్బారావు గారు వద్దన్నా వినలేదు. పరీక్షహాలులో నన్ను మా లెక్చరర్లు  చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఒళ్ళు తెలిసీతెలియని స్థితిలోనే, మళ్ళా, మందులు మింగుతూ లంఘనాలు చేస్తూనే పరీక్షలు వ్రాసాను. అవి ముగిసిన తరువాత నాకు జ్వరం తగ్గి ఓపికరావటానికి మరొక వారం పైనే పట్టింది. పాండురంగారావు నా ప్రక్కనే ఉండి చూసుకుంటూ ఉండబట్టి సరిపోయింది.  చివరికి నేను సుబ్బారావుగారి దగ్గర సెలవుతీసుకొని వెళుతుంటే ఆయన , 'నీకు మళ్ళా ధృఢత్వం రావాలంటే నాలుగైదు ఏళ్ళన్నా పడుతుంది. ఆరోగ్య‌ం‌ జాగ్రత్త సుమా' అని చెప్పారు దాదాపు గాలివీచితే పడిపోయేలా ఉన్న నాతో. కాని మరొక మూడు నాలుగేళ్ళకి మళ్ళా జబ్బు పడ్డాను. అప్పటికి రంపచోడవరం వచ్చేసాం. గాడాల డాక్టర్ గారని అనేవారు. ఆయన పేరు దేవరాజు మహారాజు. ఆయన నాకు వైద్యం చేసి ఆ తరువాత బలం రావటానికి కాను వసంత కుసుమాకరం మండలం రోజులు వాడించారు. దానివలన మంచి లాభం కలిగింది.

మరి కొన్నేళ్ళకు హైదరాబాదు వచ్చి కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ రంగంలో ఈత మొదలు పెట్టాను.

ఉద్యోగజీవితం మొదలైన కొత్తలో  ప్రపంచానుభవంలేక నేనూ నా మిత్రులు కొద్దిమందిమీ‌ ఒక చిత్రమైన పరిస్థితిలో చిక్కుకున్నాం‌ ఒకసారి. ఈ‌ సంఘటన హైదరాబాదులో జరిగినది కాదు. వేరే చోట. పరిస్థితి చాలా పెద్ద అవమానానికి దారితీసేలా ఉంది. ఎంత ఒత్తిడికి లోనయ్యామంటే మాలో ఒకతనైతే ఆత్మహత్యతప్ప దారిలేదని నిర్ణయించేసుకున్నాడు. నేనైతే మౌనంగా రాములవారికి ఒక విఙ్ఞప్తి చేసి ఊరకున్నాను. చివరికి ఇబ్బంది అంతా మబ్బులాగా విడిపోయింది.

హైదరాబాదుకు వచ్చిన కొత్తలో కంప్యూటర్ సొసైటీ వారి వార్షిక సమావేశాలు ఆ సంవత్సరం పూనాలో‌ జరుగుతుంటే అక్కడికి వెళ్ళిన బృందంలో నేనూ ఉన్నాను. ఏదో ఒక చిన్న పాటి పేపర్ కూడా నా ముఖంలాగా చదివాను లెండి. మా బృందంలో ఉన్న వారిలో రేమెళ్ళ అవధానులు గారూ ఉన్నారు. ఆయన మా నాన్నగారి శిష్యులు.  నా కంటే వృత్తిపరంగా ఆరేళ్ళు సీనియర్. నేనంటే ఆయనకు ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానం. ఇప్పుడు అవధానులు గారు వేదభారతిని నిర్వహిస్తున్నారు.

మూడు రోజుల సమావేశాలు పూనాలో‌ ముగిశాక ఒక ఉదయం‌ సికంద్రాబాదులో రైలు దిగాము. మాలో కొందరు పట్టాలు దాటి ఒకటో‌ నంబరు ప్లాత్‌ఫారం మీదకు వెళ్ళారు. నేనూ‌ అవధానులు గారూ‌ మాట్లాడుకుంటూ పట్టాలు దాటుతున్నాం. హఠాత్తుగా నా గమనికకు వచ్చింది. ఒక రైలు బండి దాదాపు మా సమీపానికి వచ్చేసిందని. ఒక ఉదుటున దాటాను. అవధానులు గారు ఇంకా గమనించలేదు రైలును. నేను అరచి ఆయన రెక్కపట్టి బయటకు గుంజాను. మరుక్షణంలో రైలు వెళ్ళింది. ఆయన కొయ్యబారిపోయా రొకక్షణం. 'మా ఆవిడ మంగళసూత్రం గట్టిదండోయ్' అన్నారు. ఈ విధంగా మేము ఒక గండం నుండి తృటిలో‌ తప్పించుకున్నాం.

ఒకటి రెండు సార్లు సికంద్రాబాదు బస్సుస్టాండులో కొద్దిలో ప్రమాదాలు తప్పాయి.

అమెరికా వెళ్ళాక కూడా ప్రమాదాలు వెంటాడాయి. రెండు సార్లు నా కారు ప్రమాదానికి గురైనది. కాని నాకు గాని నా శ్రీమతికి గాని ఏమీ కాలేదు. ఒకసారి మేము వేరొకరితో ప్రయాణిస్తున్నప్పుడు సిగ్నల్ వద్ద ఆగియున్న మా కారును మరొక కారు వెనుకనుండి బలంగా ఢీకొట్టింది. మళ్ళా తృటిలో‌ తప్పించుకున్నాం అందరం. ఒక సారి ఒక కారు రోడ్ క్రాస్ చేస్తున్న నా మీదకు చాలా వేగంగా వచ్చేసింది కాని సురక్షితంగా తప్పించుకున్నాను.

రెండేళ్ళ క్రిందట వృత్తిగతమైన పనులమీద కాలిఫోర్నియాకు వెళ్ళి వచ్చాను. నేను బస చేసిన మోటెల్ చుట్టపట్ల భారతీయభోజనం వంటిదేమో‌దొరకదు. ఎల్ కమినో‌ రియాల్ రోడ్డు మీద 25వ వీధి మొగలో చెన్నైక్లబ్ అని ఒకటి ఉందని తెలిసింది. అక్కడైతే కాస్త మన తిండి దొరుకుతుందని కొంచెం దూరం (అబ్బే ఎంతలెండి రెండు మైళ్ళేను!) నడచి వెళ్ళే వాడిని. అలా నడచి వెళ్ళే‌దారిలో ఒక చోట రైల్వేక్రాసింగ్ వస్తుంది. భయపడకండి రైలును చూసుకోకపోవట‌ం‌ లాంటి దేమీ‌ జరగ లేదు లెండి. ఆ రోజున భోజనానికని ఆ ప్రాంతంలో నడచి వెడుతుండగా ఒక పెద్ద ట్రాఫిక్ సైన్ బోర్డు హఠాత్తుగా నా చొక్కాను రాసుకుంటూ నా వెనుకనే పడిపోయింది! ఒక సెకనులో పదోవంతు సమయం నేను కొంచెం మెల్లగా వస్తూ ఉన్నపక్షంలో అది కాస్తా తిన్నగా నా నెత్తి మీదనే ఖచ్చితంగా పడేది.

అంత పెద్ద చప్పుడుతో‌ ఆ బోర్డుకాస్తా నా వెనుకనే‌ పడటంతో వెనుదిరిగి చూసాను బిత్తరపోయి.

కొంచెం దూరంలో ఎదురుగా ఒక వృధ్ధదంపతుల దర్శనం.  ఇద్దరూ ఒక్కసారి కంగారుగా 'హోహో' అని అరిచారు. మొల్లగా నా దగ్గరకు నడచుకుంటూ వచ్చారు. అప్పటికింకా నేను పూర్తిగా తేరుకోలేదు. అలాగే షాక్ లోనే ఉన్నానన్న మాట.

నా దగ్గరగా వచ్చారు. ముసలాయన 'ఆర్ యు ఆల్‌రైట్' అని పరామర్శించాడు. 'యు ఆర్ సో‌ బ్లెస్‌డ్. గాడ్ ఈజ్ విత్ యు ఫర్ స్యూర్' అని అన్నారు ముసలావిడ.

ఈ సంఘటన జరిగిన ఒక నిముషంలోపునే నేను ఏమీ జరగనట్లే‌ నడచుకుంటూ చెన్నైక్లబ్‌కు వెళ్ళి భోజనం చేసి అదే దారిలో తిరిగి వెళ్ళాను.

ఈ సంఘటన జరిగిన చాలా కాలం తరువాతనే ఆ వృధ్ధదంపతులు ఎవరన్నది నాకు స్ఫురించింది.