23, జులై 2016, శనివారం

రావయ్యా ఈ‌ జీర్ణకుటీరము ...

రావయ్యా యీ‌ జీర్ణకుటీరము
పావనముగ జేయ - వేగమె
రావయ్యా నీ నిజభక్తునకు
దీవన లందీయ బిరబిర


నిదురను గూడ నిన్ను మరువక
ఎదురు చూచుచు నిన్ని యుగంబులు
పదిలముగా శుభభావన నిలిపిన
యెదలో ఆశల నింకగ నీకుము
రావయ్య

నీ కృపచే నిట నిర్మిత మైనది
నాకు నెలవుగ నీవు చేసినది
నీ కటాక్షమున నిలచియున్నది
చీకి కూలి ధర చేరక మునుపే
రావయ్యా

సువిశాలంబును సుందరమగు నొక
భవనము గాదిది పాతయిల్లె నీ
కవరోధము వలె హాయి గొల్పగా
సవరించితి నే శక్తికొలదిగా
రావయ్యా