22, జులై 2016, శుక్రవారం

ఎవరెవెరో ఏమేమో ...





ఎవరెవెరో యేమేమో పలికి
సవరింతురె యీ శ్యాముని మనికి


ఎత్తిన జన్మము లెన్నెన్నో అవి
మెత్తిన తెలివిడి యెంతెతో నా
చిత్త మెఱింగిన స్నేహితుడా నీ
మెత్తని పలుకులు వినుచుండ
ఎవరెవరో

పరమాప్తా స్వప్నావబోధముల
సరళములను హితకరముల నేను
నిరతము వినుచు నీ ప్రియభాషలు
మరువక మదిని స్మరియించు నెడ
ఎవరెవరో

ఆ ముచ్చటలును నాలకించుమని
యేమయ్యా యీ యెకసెక్కెంబులు
నీ మాటలనే నే వినదలచెదు వే
రే మాటల విని యేమి చేయుదు
ఎవరెవరో






2 కామెంట్‌లు:

  1. మేష్షారూ:-)

    నాదో చిలిపి సందేహం.భాగవతం గజేంద్ర మోక్షణం సందర్భంలో గజేంద్రుని దుఃఖంలో ఒకచోట "కుయ్యో!" అని ఉంటుంది,అది మనం ఎవరన్నా ఏడుస్తుంటే క్యామెడీగా "కుయ్యో మొర్రో అంటున్నాడు" అనే రకపు సరదా మాటయేనా,లేక పదవ్యుత్పత్తిలో యేదయినా గంభీరమయిన వ్యవహారం ఉందా?ఎందుకంటే ఆ ముక్క అచ్చులో చూస్తున్నప్పటినుంచీ చక్కిలిగింతలు పెట్టినట్టు నవ్వు తన్నుకొస్తున్నది,కానీ అందులో యేదయినా గంభీరమయిన అర్ధం ఉందేమో,ఎందుకు అకటావికటపు నవ్వు అని బెరుగ్గా ఉంది - కాస్త నా ఇబ్బందిని తీర్చుదురూ!

    కొంచెం ఓపిక జేసుకుని ఓరి దేవుడోయ్,ఆయన గారు కదలాలంటే ఇంత గుక్కపట్టి ఏడవాలా?ఇంత సుదీర్ఘంగా యేడ్చే ఓపిక మాకు లేదయ్యోయ్ - గజేంద్ర మోక్షణా!అని వేసిన నా పోష్టు చూసి అక్కడ నేను "సరిసరి నీపని సరి,నీదగు మని" అని మొదలెట్టి రాసిన సీసంలో దోషాలు ఉంటే చెబితే దిద్దుకుంటాను.

    భవదీయుడు
    హరి సనాతనుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగులో కూయి అన్న మాట ఒకటి ఉంది. పిలుపు అన్న అర్థంలో. ఆర్తితో రక్షణకోసం పిలవటం అన్న అర్థఛ్ఛాయలోనూ వాడతారు. ఈ కూయి అన్నదానికే కుయ్యి అన్న రూపంలో రక్షణకోసం పిలవటం అన్న అర్థంలో‌ వినియోగం హెచ్చు. కుయ్యి + ఆలించి -> కుయ్యాలించి అని వ్యాకరణ కార్యం జరిగి గజేంద్రమోక్షంలో కుయ్యాలించి అని కనిపిస్తున్నది - ఆ కుయ్యిని విని అని దాని అర్థం.

      మీ సీసం గురించి ఆ పోష్టు క్రింద వ్రాస్తాను చూచి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.