4, జులై 2016, సోమవారం

మిథిలాసందర్శనము







శ్రీరామ చంద్రుడు సీతమ్మ గూడి
సింహాసనస్థుడై చెన్నుమీఱగను
సార్వభౌముండుగా జగమేలు చుండ
సురలెల్ల ప్రీతులై చూచుచుండంగ
నెలమూడు వానలు నిత్యమై యుండ
కలికంబునకు నేని కరవు లేకుండ
ఉర్విసుభిక్షమై యొప్పారు చుండ
జనులెల్ల సంతోషస్వాంతులై యుండ
ప్రతినాడు జనులకు పండువై యుండ
భూనాధు జనులెల్ల పొగడుచు నుండ
భూనాధు మునులెల్ల పొగడుచు నుండ
భూనాధు నరపతుల్ పొగడుచు నుండ
భూనాథు కవులెల్ల పొగడుచు నుండ
భూనాథు సత్కీర్తి భూమిపై నిండ
భూనాథు సత్కీర్తి భువనముల్ నిండ
సర్వంబు చక్కగా జరుగుచు నుండ
సాకేత మరుదెంచె జనకుని దూత
సభలోని కరుదెంచె జనకుని దూత
జానకమ్మను చూచె జనకుని దూత
సార్వభౌముని చూచె జనకుని దూత
సంతోషమున పొంగె జనకుని దూత
వినుతశీలుండైన జనకుని దూత
జ్ఞానియు వృధ్ధుడౌ జనకుని దూత
సీతమ్మతల్లి కాశీర్వాద మిచ్చె
శ్రీరామవిభున కాశీర్వాద మిచ్చె
మామగా రంపిన మహితాత్మునకును
రామచంద్రుడు సేసె రాజోచితములు
మరియాదలెన్నియో నిరుపమానములు
గౌరవంబులు సేసి కానిక లిచ్చి
సాకేతపతి పల్కె సాంజలి యగుచు
పెద్దలు జనకులు వినిపించ మనిన
ఆనతి వినిపించు డయ్యరో మీరు
సీరధ్వజుల యాన శ్రీరాము డెపుడు
శిరమున దాల్చును సీతమ్మ యాన
అనినంత నా దూత యానంద పడుచు
అగణితగుణధామ యా మాట చాలు
మారాజు కోరిక మన్నించి నటులె
వినవయ్య చక్కగా వినిపింతు నీకు
జనకుల మాటలు వినిపింతు నీకు
ప్రియమైన మాటలు వినిపింతు నీకు
అతిలోక వీరుడ యల్లుడ రామ
దనుజేంద్రగర్వవిధ్వంసక రామ
సకలలోకస్తుత్యసద్గుణధామ
సత్యాశ్రయా సురసన్నుత రామ
పరమేశబ్రహ్మేంద్రప్రస్తుత రామ
పిల్ల నిచ్చితి గాన చల్లని వాడ
నీకు బంధువు నైతి నేను ధన్యుడను
మన్నించి నీవు నీ మామ గేహంబు
పావనం‌ బొనరింప వలయు విచ్చేసి
చిన్నతల్లిని నాదు సీతను జూడ
కన్నులు కాయలు కాచిన వయ్య
నా తల్లి నాయింట నడయాడి నాకు
కనులపండువ సేయు ఘనభాగ్య మిమ్ము
నాగేటి చాలులో నాముందు వెలసి
నాబిడ్డయై నిల్చి నన్ను పాలించి
నీయింటి వెలుగైన నిరుపమజ్యోతి
నా తల్లి సీతను నాకు చూపించు
అవలీలగా నాడు శివుని విల్లెత్తి
దాని నొంచిన నిన్ను తాను చేపట్టి
మీ యింటి కోడలై మెఱసిన తల్లి
అడవికి నీతోడ నడచె నా సీత
పడరాని యిడుములు పడెను నా సీత
రాకాసి లంకలో శోకించె సీత
నా బిడ్డ సీతను నాకు చూపించు
పంక్తికంఠుని నీవు పట్టి వధించి
తేఱి యవనజ మోము తిలకించ లేక
నిన్నొల్ల బొమ్మన్న నిప్పులో దూకె
అగ్నిహోత్రుడు తల్లి నగ్గించ గాను
కష్టాల గుండాలు గడచె నా తల్లి
నా చిట్టితల్లిని నాకు చూపించు
పుట్టింట సుఖములు పొందుచు పెరిగె
ముగ్గురత్తలు తన్ను ముద్దు సేయగను
ఆరళ్ళు పెట్టని యత్తింట వెలిగె
కష్టాలు కడతేది గద్దియ కెక్కె
నా కన్నతల్లిని నాకు చూపించు
బ్రహ్మేంద్రరుద్రులు ప్రస్తుతించగను
దివినుండి తనమామ దిగివచ్చి పొగడ
అసమాన కీర్తితో నలరారి నట్టి
నా ముద్దుబిడ్డను నాకు చూపించు
సర్వాభినుతయైన సౌశీల్యజ్యోతి
నా కంటివెలుగును నాకు చూపించు
ఇనకులసౌభాగ్యహేతువై నట్టి
నా భాగ్యరాశిని నాకు చూపించు
రావణగర్వనిర్వాపణాకార
నా పుణ్యరాశిని నాకు చూపించు
వీరరాఘవధర్మవిజయపతాక
నా సీత నొకసారి నాకు చూపించు
మిథిలానగరకీర్తి మేలిపతాక
నా తల్లి నొకసారి నాకు చూపించు
రామయ్య ఒకసారి రావయ్య నీవు
సీరధ్వజుని జూడ సీతమ్మ తోడ
మీ యిర్వురను జూడ మిథిలలో వారు
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
మీ యిర్వురను జూడ మా యింటి వారు
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
మీ యిర్వురను జూడ మీ‌ మామ యత్త
వేయి కన్నుల తోడ వేచి యున్నారు
రావయ్య మిథిలకు రామయ్య నీవు
రమణి సీతమ్మతో రాజశేఖరుడ
అని పల్కె మిథిలాపురాధీశ్వరుండు
వినిపించితిని వారు వినిపించమన్న
పలుకు లన్నింటిని బ్రహ్మాండనాథ
భవదీయమైన సభాస్థలంబునను
మీ యాఙ్ఞ మేరకు మీ‌ సమ్ముఖమున
శ్రీరామచంద్ర నీ చేయదగినది
చేయుము రాజేంద్ర శీఘ్రంబుగాను
మన్నించ దగు నీకు మామ కోరికను
అని పల్కె నా దూత వినయ మొప్పంగ
సీతమ్మ కన్నులు చెమ్మగిల్లినవి
విభుని మోమేమొ గంభీరమై యుండె
అటునిటు రాజు మాట్లాడక యుండె
గుడుసుళ్ళుపడి రాజు కూర్చుని యుండె
అరమోడ్పు కనులతో‌ నట్లె కూర్చుండె
వేచి యుండెను దూత విభుడట్టు లుండె
విభుని మాటలు విన సభ వేచియుండె
అరఘడియకును మాట్లాడడు రాజు
కాంతుని తిలకించె కలికి సీతమ్మ
కాంతుడు సీతమ్మ కనులలో జూచె
మిగుల ప్రసన్నుడై జగదీశ్వరుండు
ముని వశిష్ఠుని దొల్త కనుగొని యపుడు
దూతను కనుగొని తోయజాక్షుండు
సభవారి కనుగొని సర్వాత్మకుండు
తమ్ముల కనుగొని ధర్మవిగ్రహుడు
మంత్రుల కనుకొని మానవేశ్వరుడు
మధురాక్షరంబుల మాటాడ దొడగె


(సశేషం)







4 కామెంట్‌లు:

  1. గంగా ప్రవాహంలా సాగిపోయింది. సశేషం విశేషంగానే ఉంటుందని ఆశిస్తూ, ఎదురు చూస్తున్నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పూర్వం ఆడవాళ్ళ పాటలని ప్రత్యేకంగా అద్భుతమైన సాహిత్యం‌ ఉండేదండి. గంగాగౌరీసంవాదం, ధర్మాంగద పాముపాట, సుభద్రసారె, కుశలవులయుధ్ధం వగైరా ఎన్నో ఎన్నేన్నో గొప్ప పాటలుండేవి. తీరకసమయాల్లో స్త్రీలు కలుసుకొని ఈ‌పాటలను చాలా శ్రావ్యంగా పాడుకుంటూ ఉండేవారు. ఈ రామగాథలు కూడ అటువంటి గానయోగ్యమైన సాహిత్యంగా వ్రాసుకుంటూ వస్తున్నాను. ఇది కొంచెం పెద్ద గేయం. అందుకని మూడు నాలుగు భాగాలుగా వస్తుంది. త్వరలోనే ఫలించిన జోస్యం పూర్తి కావస్తున్నది.

      ఒక ముఖ్యమైన మాటను ముందుగానే ప్రస్తావిస్తున్నాను. కొంత పునరుక్తివంటిది, కొంచెం సాగతీతవంటిది కనిపిస్తుంది. కాని అది ఇటువంటి పాటల్లో ఒక నిర్మాణశైలి అన్నది అందరూ అర్థం చేసుకోవాలని మనవి. ఉదాహరణకు ధర్మరాజు జూదం పాటలో 'ఆ ధర్మ నందనుని ఎడబాయలేనే' అన్న వాక్యం వరుసగా అనేకమార్లు వస్తుంది - అది రాజ్యలక్ష్మి ధర్మరాజును వదిలి పోతున్నందుకు విచారంగా చేస్తున్న విచారవ్యక్తీకరణలో‌ భాగం. మరొక ముఖ్యవిషయం. ఈ‌రామగాథల్లో రామాయణపాత్రలను వాటి ఔన్నత్యం నుండి తలవెండ్రుకవాసిగా ఐనా అటూఇటూ చేయటం‌ జరగదు. కల్పనాసాహిత్యమే కాని పాత్రౌచితి అతిజాగరూకతతో రామాయణవిధేయంగానే ఉంటుంది.

      తొలగించండి
  2. రాముడేమన్నాడో జనకుని దూతతో వినాలని వుంది :)

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.