భగవత్కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భగవత్కథలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

26, ఆగస్టు 2013, సోమవారం

శ్యామలీయం భాగవతంలో ప్రథమస్కంధం సంపూర్ణం అయింది

ఈ క్రింద మంజరీ ద్విపదపద్యం రూపంలో మహాభాగవతం ప్రథమస్కంధం యొక్క విషయసూచిక ఇవ్వబడింది.  

ఇందులో ప్రతి లైనూ ఒక లింకు. మీరు క్లిక్ చేసి టపాను  శ్యామలీయం భాగవతం బ్లాగులో  చదువుకోవచ్చును. 

భాగవతం ప్రధమస్కంధం కథా మంజరి 

ఘనుడు పోతన్న భాగవతంబు నుడివె
అడిగిరి సూతుని హరికథల్ మునులు 
వ్యాసుని చింతను వచియించె నతడు 
వ్యాసుని వద్దకు వచ్చె నారదుడు 
భాగవతము వ్రాయ బనిచె నారదుడు
పలికెను తన పూర్వ భవము దేవర్షి 
వ్యాసు డంతట భాగవతమును జేసె 
ద్రోణపుత్రుడు చేసె దుష్టకార్యంబు 
గురుపుత్రు డెంతయు కోపన శీలి 
ద్రోవది సౌజన్యరూప దీపశిఖ 
హరిపాదముల వ్రాలె నభిమన్యు పడతి 
హరిని వైరాగ్యంబు నడిగెను కుంతి 
పాండవాగ్రజు చింత బాపె భీష్ముండు 
దివి కేగె భీష్ముండు దేవసన్నిభుడు
అవనికి ధర్మజు నభిషిక్తు జేసి
వాసుదేవుడు వచ్చె ద్వారకా పురికి
వేలాది సతులకు వేడుక జేసె  
అంధక్షితీశ్వరుం డడవుల కేగె 
బంధుమోహంబును వదలె ధర్మజుడు 
కరిపురంబును చేరె ఘనుడు విదురుడు  
కాలగతిని గాంచి కలగె ధర్మజుడు 
వైకుంఠమున కేగె వాసుదేవుండు
కలియుగం బను కష్టకాలంబు వచ్చె
పార్థుని పౌత్రుండు పాలకుండయ్యె 
ధర్మమార్గంబున ధర నేల జొచ్చె
హరివియోగంబున కవని శోకించె 
ధర్మావనుల కలి తన్ని హింసించె
వాని పరీక్షిత్తు పట్టి శిక్షించె 
హరికీర్తి నుడివి నా డంత సూతుండు 
కాలంబుచే రాజు కదిలె వేటలకు 
రాజును మునికుమారకుడు శపించె
భూమీశునకు వార్త ముని యెఱిగించె 
ప్రాయోపవేశంబు ప్రకటించె రాజు 
శుకయోగి వచ్చె రాజోత్తము జూడ
మోక్షమార్గము వేడె భూమీశు డతని 

 
ఇతర వివరణలు


22, జులై 2013, సోమవారం

భాగవతం 1.3: శ్రీవేదవ్యాస భగవానులవారికి కలిగిన విచారం

ఆ సూతపౌరాణికులవారు మహర్షుల ప్రశ్నలకు జవాబులు చెప్పటానికి ఉపక్రమించారు.

మహర్షులారా ద్వాపరయుగం చివరలో శ్రీహరియొక్క దివ్యకళతో శ్రీవేదవ్యాసభగవానులవారు అవతరించారు.  ఒకనాటి సూర్యోదయ సమయం. వ్యాసులవారు బదరికాశ్రమం దగ్గర సరస్వతీ పుణ్యనదీ జలాలలో స్నానం పూర్తిచేసుకున్నారు.  ఒంటరిగా కూర్చుని రాబోయే కలియుగం యెలా ఉంటుందో అందులో మానవజాతి ప్రవర్తన యెలా ఉంటుందో అని అనుకున్నారు. అది ఎంత ఘోరంగా ఉండేదీ వారి మనస్సుకు రాగానే వారికి ఎంతో విచారం కలిగింది.

ఎలా ఈ‌ మానవజాతికి హితం చేకూర్చాలీ‌ అని ఆలోచించారు.  కలియుగంలో మానవుల శక్తి స్వల్పం. బహు విస్తారంగా ఉండే వేదాన్ని అభ్యసించటం కలిలో మనుషులకు శక్తికి మించిన పని.  అందుచేత ఎంతో ఆలోచించి, మానవులకు సులభంగా ఉండటం కోసం ముందుగా వేదరాశిని నాలుగు విభాగాలుగా చేసారు.

వాటిలోఋగ్వేదాన్ని పైలుడనే మహర్షికి ఉపదేశించారు. అలాగే సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చారు.  యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చారు. అధర్వవేదాన్ని సుమంతుడికి ఇచ్చారు.

ఇలా వేదవిభాగాల్ని ఆయా ఋషీంద్రులు వ్యాసభగవానుల వలన గ్రహించి తమతమ శిష్యగణంద్వారా వాటిని మానవలోకంలో ప్రవర్తింప జేసారు.

అయితే ఇంకా ఒక చిక్కు మిగిలే ఉందని వ్యాసులవారు అనుకున్నారు.  వేదాలను అధ్యయనం చేసే అధికారం బ్రహ్మవేత్తలుగా ఉండే బ్రాహ్మణులకే తప్ప అన్యులకు లేదు.  అలాగే అబ్రాహ్మణులకే కాక,  స్త్రీలకూ వేదవిధ్యాధికారం లేదు. మరి వారికి ఏదీ అభ్యున్నతి కలిగేదారీ అని కరుణామూర్తులైన వేదవ్యాసులవారు ఆలోచించారు. 

అప్పుడు ఆయన చక్కగా మహాభారతాన్ని మానవులకు అందరికీ ఉపయుక్తం అయ్యేటట్లుగా నిర్మించారు.  ఈ మహాభారతం చెప్పే సందర్భంలో భగవానులు వేదార్థసారం అంతా దానిలో నిక్షేపించారు.  అందుకే, అది పంచమవేదంగా ప్రసిధ్ధి గడించింది. మహాభారతాన్ని అధ్యయనం చతుర్వర్ణాలవారూచేయవచ్చు.  స్త్రీలూ పురుషులూ అనే బేధం లేక అందరూ మహాభారతాన్ని అధ్యయనం చేసి మేలు పొందవచ్చు.

ఇదంతా మానవజాతిలో బుధ్ధిమంతులందరికీ చాలా సంతోషం కలిగించింది. ఋషిగణం అంతా ఆయనను సాక్షాత్తూ విష్ణుస్వరూపంగా గుర్తించి కీర్తించింది.

అయినా వ్యాసులవారికి సంతోషం కలగలేదు.  ఇంకా ఆ భగవానుల మనస్సుకు తృప్తిగా అనిపించలేదు.

మరలా ఒకనాడు ఒంటరిగా సరస్వతీ నదీ‌ తీరాన కూర్చుని తనలో తాను ఈ విషయమై చాలా బాధపడ్డారు.

ఎంతో‌ ఆలోచించగా, ఆయనకు ఒక విషయం బోధపడింది.

తాను ఎంతగా కృషిచేసి వేదవిభాగం చేసీ, మహాభారతం అనే గొప్ప ఇతిహాసం నిర్మాణం చేసీ కూడా, ఈశ్వరుడి మెప్పును మాత్రం ఇంకా పొందలేక పోయాడు.  అయ్యో,  శ్రీహరికీ, మహాయోగులకీ ఎంతో ఇష్టమైన భగవంతుని కథలను చక్కగా చెప్పలేదే నేను!  ఎంత మోసపోయానూ, ఎంత పొరపాటు చేసానూ! నాకు ఇన్నాళ్ళూ ఆ బుధ్ధి ఎందుకు కలగలేదూ అని చాలా చాలా విచారించారు.

ఇప్పుడు తనకు ఏమిటి కర్తవ్యం అని ఆయన ఆలోచిస్తుండగా ఒక అద్భుతం జరిగింది.

అప్పుడు వ్యాసులవారి వద్దకు శ్రీనారదమహర్షులవారు వచ్చారు.  శ్రీనారదులు బ్రహ్మమానసపుత్రులు.  వారు శ్రీహరికి పరమభక్తాగ్రగణ్యులు. సమస్తమూ తెలిసిన వారు.  ఆయన విచ్చేయటంతో వ్యాసభగవానులవారు పరమానంద భరితులయ్యారు.

వచ్చే టపాలో నారదులవారు వ్యాసులవారితో సంభాషించిన విషయాల గురించి తెలుసుకుందాం.

19, జులై 2013, శుక్రవారం

భాగవతం 1.2: శ్రీమహాభాగవతం కథా ప్రారంభం

శ్రీమహాభాగవత పురాణం  మనకు అందివచ్చిన కథ నైమిశారణ్యంలో ప్రారంభం అవుతుంది. ఇది విష్ణుక్షేత్రం. ఇక్కడకు కలి పురుషుడు ప్రవేశించనే ప్రవేశించడు - అది అతనికి అసాధ్యం.  అందుచేత అక్కడ, శౌనకుడు మొదలయిన మహర్షులు, శ్రీమహావిష్ణువును చేరుకునేటందుకు గాను వేయేళ్ళపాటు సత్రయాగం చేసారు. ఆ యాగాన్ని చూడటానికి సూతుడు అనే గొప్ప ఋషిపుంగవులు వచ్చారు. ఆ సూతుడు గొప్ప పౌరాణికుడు.  అంటే భగవంతుని మాహాత్మ్యం వినసొంపుగా కథలుకథలుగా విపులంగా చెప్పే మహానుభావుడు.

ఒకరోజున మునులంతా ఆరోజుకు అవసరమైన యాగసంబంధమైన కార్యక్రమాలు ముగించుకుని సూతమహర్షి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు.

క. భూషణములు వాణికి నఘ
పేషణములు మృత్యుచిత్తభీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరిగుణోపచిత భాషణముల్

ఓ సూతమహర్షీ, శ్రీహరి కథలు సరస్వతీదేవికి అలంకారాలు. ఆ కథలు పాపాలను పొడిపొడిగా నూరి పారేస్తాయి. ఆ కథలంటేనే మృత్యుదేవత గుండెలు అదిరిపోతాయి. అవి చెవుల బడగానే హరిభక్తుల గుండెలు ఆనందంతో ఎగిసిపడతాయి. ఆ కథలన్నీ జగత్కల్యాణం కలిగించేవి.

ఆ కథలు అత్యంత అద్భుతమైనవి.

సీ. హరికథాకథన దావానల జ్వాలచేఁ
      కాలవే ఘోరాఘ కాననములు
వైకుంఠదర్శన వాయుసంఘంబుచేఁ
      దొలఁగవే‌ భవదుఃఖ తోయదములు
కమలనాభ ధ్యాన కంఠీరవంబుచేఁ
      గూలవే సంతాప కుంజరములు
నారాయణ స్మరణ ప్రభాకర దీప్తిఁ
      దీఱవే షడ్వర్గ తిమిరతతులు
ఆ. నళిననయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు
వేయు నేల మాకు విష్ణుప్రభావంబు
దెలుపవయ్య సూత ధీ సమేత

మహాపాపాలనే‌ భయంకరమైన అరణ్యాలు హరికథలు అనే దావానలంతో‌ కాలిపోవే!
వైకుంఠవాసుని దర్శనం అనే ప్రచండ వాయువుతో జీవుల్ని ఈదులాడించి దుఃఖపెట్టే ఈ భవసముద్రం‌ ఇంకిపోదా?
విష్ణు ధ్యానం అనే‌ మహాసింహం దెబ్బకి ఏనుగు లంతేసి ఉండే రకరకాల కష్టాలూ కూలిపోవా?
నారాయణస్మరణం అనే సూర్యరశ్మికి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే చీకట్లు విచ్చిపోవా?
విష్ణుభక్తి అనే‌ నావనెక్కి తప్ప భవసముద్రం దాటలేము గదా.

ఓ సూతమహర్షీ అందుచేత మాకు శ్రీమహావిష్ణువు ప్రభావం గురించి విశరీకరించి చెప్పవయ్యా అని అడిగారు.

ఆ సూతమహర్షికి ఆనందం‌ కలిగింది ఈ‌ పరిప్రశ్నకి.  ఆయన మునులతో ఇలా అన్నారు.


ఆ. అతిరహస్యమైన హరిజన్మ కథనంబు
మనుజుఁ డెవ్వడేఁని  మాపు రేపుఁ
జాల భక్తితోడఁ జదివిన సంసార
దుఃఖరాశిఁ బాసి తొలగి పోవు

చాలా సంతోషం. ఈ విష్ణుకథలున్నాయే అవి చాలా రహస్యమైనవి.  అంటే శ్రథ్తాభక్తులు గలవారు శ్రధ్ధాభక్తులు గలవారిని ఆశ్రయిస్తే కాని తెలుసుకోవటానికి సులువుగా దొరకనివి. సంపూర్ణమైన భక్తితో, ఏ మానవుడైతే, నిత్యమూ వాటిని మనస్సులో అనుసంధానం చేసుకుంటూ ఉంటాడో వాడు ధన్యుడు.  వాడికి ఇక సంసారం అనే దుఃఖం లేకుండా పోతుంది.
 
మహాత్ములారా,  వినండి. సాక్షాత్తూ విష్ణుస్వరూపులే ఐన వ్యాసభగవానులవారు తెలుసు కదా? ఆయన శ్రీమహాభాగవతం అనే పేరుగల అద్భుతపురాణాన్ని నిర్మించారు.  అది సాక్షాత్తూ పరబ్రహ్మ స్వరూపమే!  దానిని మొదట వ్యాసులవారు తమ కుమారుడైన శుకయోగీంద్రులచేత చదివించారు.  ఆ‌ శుకమహర్షి దానిని పరీక్షిత్తు అనే మహారాజుకు ఉపదేశం చేసారు. ఆ పరీక్షిత్తు పాండవుల మనుమడు.  ఆయన గంగ ఒడ్డున ప్రాయోపవేశ దీక్షలో ఉండగా శ్రీశుకులు వచ్చి ఆయనకు భాగవతం చెప్పారు. అప్పుడు నేనూ అక్కడ ఉండి అంతా భక్తితో‌ ఆలకించాను.  ఆ భాగవతాన్ని మీకు వినిస్తాను.

ఆ మునిశ్రేష్ఠులందరికీ ఆశ్చర్యం‌ కలిగింది. సూతుణ్ణి ఇలా అడిగారు.

మహాత్మా, ఆ శుకయోగీంద్రులు మహా యోగి అని చెబుతారే.  అయనకు కనీస స్త్రీపురుష బేధ దృష్టీ లేదు కదా!  ఆయనగురించి ఒక కథ విన్నాం.  

ఒకసారి శుకుడు గోచీగుడ్డకూదా లేకుండా దిస్సమొలతో అడవిలో పోతూ ఉంటే వ్యాసులవారు వెనక వెతుకుతూ వెళ్ళారు.

ఆ అరణ్యంలో ఒక కొలనులో‌ దేవకన్యలు జలకా లాడుతున్నారు.

శుకుడు ఆ కొలను గట్టు మీద నుండి పోతూ ఉండగా చూసి ఆ కన్యలంతా ఆ మహానుభావుడికి నీళ్లలో నుండే నమస్కారాలు సమర్పించుకున్నారు.

ఇంతలోనే కుమారుడి వెనకాలే నాయనా నాయనా అని పిలుస్తూ వెతుక్కుంటూ వ్యాసమహర్షులవారు వస్తున్నారు.  వారిని చూసి సిగ్గుపడి గాభరాగా ఆ కన్యలు బట్టలు వేసుకుని కొలను వెలువడి ఆయనకు మ్రొక్కారు.

వ్యాసులవారు అమ్మాయిలూ మీరు మా శుకుణ్ణి గాని చూసారా అని ఆడిగారు.

వారన్నారూ, మహాత్మా శుకులవారు ఇంతకు ముందే ఈ దారిన వెళ్ళటం కొలనిలోనుండి అందరం చూసాం అని.

వ్యాసులవారికి ఆశ్చర్యం కలిగింది. అమ్మాయిలూ, నన్ను చూసి మీరు నీళ్ళల్లోంచి బయటికి వచ్చి బట్టలు వేసుకున్నారు.  ముసలి వాడిని నన్ను చూసి సిగ్గుపడ్డారే!  నవయువకుడు, అందగాడు అయిన మా శుకుడిని,  ఒంటిమీద నూలుపోగు లేకుండా వస్తూ ఉన్నవాడిని చూసి, మీకు సిగ్గువేయలేదా అని వారిని వ్యాసులవారు అడిగారు.

అప్పుడు ఆ దేవకన్యలు వ్యాసమహర్షితో,  ఇలా అన్నారు. మహాత్మా,  అతడు నిర్వికల్పుడయ్యా. అతడికి స్త్రీలూ పురుషులూ‌ అన్న బేధం కూడా ఏ మాత్రం లేదు.  అందుచేత అతడి కంట మేము పడినా మేము స్త్రీలమూ తాను పురుషుడనూ అన్న భావన లేశమూ లేని వాడైన ఆ శుకుణ్ణి చూసి సిగ్గు పడవలసింది యేమీ‌లేదు. మీకూ వారికీ‌ చాలా పెద్ద బేధం ఉంది.  అతడు కేవలం పరబ్రహ్మ స్వరూపుడు. 

ఎంత అద్భుతమైన విషయం. ఆహా, ఆ శుకయోగీంద్రులు మహాయోగి, సమదర్శనుడు, మాయను జయించినవాడు, ఆనందస్వరూపుడూ‌ కదా!

అలాంటిది, ఆ శుకయోగీంద్రులు హస్తినాపురం వెళ్ళారా? ఎక్కడా కూడా, అవుపాలు పితికేటంత సమయం ఐనా నిలువని ఆ  మహాత్ముడు పరీక్షిత్తుకి పురాణం వినిపించారా రోజుల తరబడి? ఆ పరీక్షిత్తుకూడా మహాధర్మాత్ముడని విన్నాం. ఆయనకు ఏమి కష్టం వచ్చింది స్వామీ‌, రాజ్యంగీజ్యం వదిలేసి గంగ ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేసి ప్రాణాలు వదలటానికి?

సూతపౌరాణికులవారు చిరునవ్వుతో, అంతా చెబుతాను వినండి, అన్నారు.

17, జులై 2013, బుధవారం

భాగవతం 1.1: పోతనగారు భాగవత రచనకు పూనుకోవటం

శ్రీమధ్బాగవత పురాణాన్ని మనకు అందించిన మహానుభావులు వేదవ్యాసమునీంద్రులు. వేదవ్యాసులవారు సాక్షాత్తూ శ్రీమన్నారాయణుని అవతారమూర్తులలో ఒకరు.  ఈ‌ విషయం భాగవతంలోనే స్పష్టంగా ఉంది.

సంస్కృతభాషలో ఉన్న భాగవతాన్ని తెలుగులో అందించిన భాగవతోత్తములు పోతనామాత్యుల వారు. ఆపాతమధురమైన కవితాధార పోతన్నగారి సొత్తు. ఆయనది సహజపాండిత్యం.  శ్రీవిశ్వనాథ సత్యనారాయణగారు పోతన్న తెలుఁగుల పుణ్య పేటి అన్నారు. పోతనగారి ఆంద్రమహాభాగవతగ్రంధం ప్రతి తెలుగు యింటనూ తప్పక ఉండవలసిన పుణ్యగ్రంధం.  ఆ మహర్దివ్యగ్రంథాన్ని ఇంట నుంచు కున్న అదృష్టవంతులకు భగవత్కృప అపారంగా లభిస్తుంది.  పారాయణం చేస్తే అది సాక్షాన్ముక్తి ప్రదాయకమే.

భగవంతుని దివ్యలీలావిలాసాలను సంపూర్ణంగా తెలుసుకోగలగటం కేవలం‌ అసాధ్యం.  భగవంతుని తెలియగలవాడు వేరొకడు ఎవ్వడూ ఉండడు.  పోతన్నగారు అందుకే ఇలా అన్నారు

ఆ. భాగవతముఁ దెలిసి పలుకుట శక్యమే
శూలికైనఁ తమ్మి చూలికైన
విబుధవరుల వలన విన్నంత కన్నంత
దెలియ వచ్చినంత తేట పఱతు

సాక్షాత్తూ బ్రహ్మశివులకైన సంపూర్ణంగా భగవత్తత్వం‌ అవగాహన కాదే‌ అంటే నేనెంత? ఏదో‌ పెద్దలవలన తెలుసుకున్నది నాకు అర్థమైనది అయినట్లుగా తెలియజేస్తాను అన్నారీ‌ పద్యంలో పోతనగారు.  

ఆయన గురించి కొంచెం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.

పోతనామాత్యుడను అని చెప్పుకున్నారు కాబట్టి ఆయన నియోగి బ్రాహ్మణులు.  వారిది కౌండిన్య గోత్రం, ఆపస్తంబ సూత్రం. భీమన మంత్రి,  కుమారుడు అన్నయ మంత్రి.  అన్నయ, గౌరమాంబల పుత్రుడు సోమన. సోమన, మల్లమ్మల కుమారుడు ఎల్లన.  ఎల్లన మాచమ్మల కుమారుడు పోతనగారి తండ్రిగారు కేతన

ఆ. లలితమూర్తి బహుకళానిధి కేతన
దాన మాన నీతిధనుడు ఘనుఁడు
దనకు లక్కమాంబ ధర్మగేహిని గాఁగ
మనియె శైవశాస్త్రమతముఁ గనియె

కేతనగారు సౌమ్యులు. మంచి విద్యావంతులు. నీతిపరులు, దానశీలురు. ఆయనభార్య లక్కమాంబ. (వారి కుమారుడే పోతనామాత్యుడు)

పెద్దల పేర్లను బట్టి చూసినా, పై పద్యాన్ని గమనించినా పోతన్నగారి వంశీకులు శివారాధనా తత్పరులని అర్థం‌ అవుతోంది గదా?  శివారాధనాతత్పరులైన పోతనగారు తనది పరమేశ్వర కరుణా కలిత కవిత అని చెప్పుకున్నారు వినయంగా.  వారికి శివకేశవలు ఇద్దరూ సమానమే. ఆయన హరిహరుల చరణారవిందాలకు సమంగా మ్రొక్కే విబుధులు.

తన వేయి జన్మల తపస్సు ఫలితంగా తనకు శ్రీమన్నారాయణుడి కథాప్రపంచం అయిన శ్రీమధ్బాగవతం ఆంద్రీకరించాలనే కోరిక పుట్టింది.  అది ఆంద్రుల అదృష్టం. ఆంద్రజాతి చేసుకున్న పుణ్యఫలం.


ఒకరోజున పోతనగారు నదీస్నానం చేసి, మహేశ్వర ధ్యానం చేసుకుంటున్నారు. ఆయన కన్నులు అరమోడ్పుగా ఉన్నాయి. శివధ్యానంలో మైమరచి ఉన్న పోతనామాత్యులకు ఒక అద్భుతమైన దర్శనం కలిగింది.

సీ. మెఱుఁగు చెంగటనున్న మేఘంబు కైవడి
      నువిద చెంగట నుండ నొప్పువాఁడు
చంద్రమండలసుధాసారంబు పోలిక
      ముఖమునఁ జిరునవ్వు మొలుచువాఁడు
వల్లీయుత తమాల వసుమతీజము భంగి
      బలువిల్లు మూఁపున బరగువాఁడు
నీలనగాగ్ర సన్నిహిత భానుని భంగి
      ఘన కిరీటము దలఁ గలుగువాఁడు

ఆ. పుండరీక యుగముఁ బోలు కన్నుల వాఁడు
వెడఁద యురమువాఁడు విపులభద్ర
మూర్తివాఁడు రాజముఖ్యుఁ డొక్కరుఁడు నా
కన్నుఁ‌గవకు నెదురఁ‌ గానఁబడియె

ఆ కనిపించిన మహారాజ మూర్తి యెలా ఉంది? మేఘంలా తానూ మెరుపులా తన పత్నీ ప్రకాశిస్తున్నారట.  అంటే సీతమ్మతో కూడి రామభద్రులు విచ్చేసారన్న మాట. ఆయన ముఖ చంద్రమండలం నుండి చిరునవ్వు అనే‌ అమృతం వర్షిస్తోంది.  ఒక పెద్ద నల్లని కానుగ చెట్టును అంటి ఉన్న లతలాగా ఒక పెద్దవిల్లు ధరించి ఉన్నాడు.  పెద్ద నల్లని కొండశిఖరం మీద ఉన్న సూర్యబింబంలా ఆయన నెత్తిన పెద్ద అందకిరీటం.  తామరరేకుల వంటి అందమైన కళ్ళు. వెడల్పైన వక్షస్థలం.  ఎంతో మంగళకరమైన స్వరూపం.

పోతన్నా, నేను శ్రీరామచంద్రుడి నోయీ. శ్రీమహాభాగవతం తెలుగు చేయి. నాకు అంకితం ఇవ్వు. నీకు మోక్షం కలుగుతుంది అని అనుగ్రహభాషణం చేసి ఆ దివ్యమూర్తి అదృశ్యు డయాడు.

పోతన్నగారి పరవశం వర్ణనాతీతం. సాక్షాత్తూ శ్రీరామచంద్రులవారే అనుజ్ఞ దయచేసారు. ఇంకేమి కావాలి తనకు?
అందుకే ఆయన అన్నారిలా

క. పలికెడిది భాగవత మట
పలికించు విభుండు రామభద్రుండట నేఁ
బలికిన భవహర మగు నఁట
పలికెద వేఱొండుగాథ పలికఁగ నేలా

పలికేది భాగవతంట. అది నా నోట పలికించే ప్రభువు రామభదుడే నట! పైగా భాగవతం చెబితే ఇంక చావుపుట్టుకలు లేక మోక్షమే‌ నట.  ఇంక వేరే చెప్పాలా, భాగవతం కాక?

ఆ భాగవతాన్ని తాను ఎలా తన కవిత్వంలో చెప్పదలచుకున్నదీ పోతనగారు సెలవిస్తున్నారు

క. కొందఱకు దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱకు గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్

కొందరికి తెలుగు కవిత్వం ఇష్టం. కొందరికి సంస్కృతంలో ఉంటే బాగా నచ్చుతుంది. కొందరికి  రెండూ యిష్టమే. సందర్భాన్ని బట్టి నా కవిత్వంతో‌ అందరినీ మెప్పిస్తాను.

భాగవతాన్ని తెనిగించే అదృష్టం సామాన్యమైనది కాదూ, నన్నయ తిక్కన వంటి మహాకవులు దీనిని నాకు వదిలి పెట్టటం నా పూర్వ జన్మల పుణ్యఫలమేనూ‌ అనుకున్నారు.  ఇది చేస్తాను, ఇంక పునర్జన్మ లేకుండా తరిస్తానూ అని సంతోషం వెలిబుచ్చారు.

ఆ భాగవత ప్రశస్తి ఎట్లాంటిదో పోతనగారి మధురపద్యంలో ఇలా పలికింది

మ. లలితస్కందము కృష్ణమూలము శుకాలాపాభిరామంబు మం
జులతాశోభితమున్ సువర్ణసుమస్సుజ్ఞేయమున్ సుందరో
జ్వలవృత్తంబు మహాఫలంబు విమలవ్యాసాలవాలంబునై
వెలయున్ భాగవతాఖ్య కల్పతరు వుర్విన్ సద్విజ శ్రేయమై

ఈ భాగవతం ఒక కల్పవృక్షం. దీని శాఖలు ఎంతో‌ అందంగా ఉన్నాయి. మహాభాగవతులనే చిలకలు ఈ చెట్టుని ఆశ్రయించుకొని ఆలాపనలు చేస్తున్నాయి. అందమైన లతలకు ఆశ్రయమైనది. అందమైన దేవతలు దీని మాహాత్మ్యం తెలిసి ఆశ్రయిస్తున్నారు. అద్భుత మైన చరిత కలది.  దీని ఫలాలు అద్బుతాలు. ఎంతో విశాలమైన మొదలు కలది. ఇలా ఒక వృక్షంగా అన్వయం.  మరొకరకంగా చూస్తే, ఈ‌ భాగవత గ్రంధంలో విభాగాలైన స్కందాలు చాలా పసందుగా ఉంటాయి - వివిధ శాస్త్రశాఖలను బాగా సమన్వయం చేస్తూ‌ ఉంటాయి. ఈ‌భాగవతానికి మూలమైనది శ్రీకృష్ణతత్వం. ఈ తత్వా న్ని హాయిగా వినిపించినది శ్రీశుకయోగీంద్రులు. ఎందరో‌భగవధ్బక్తుల చరిత్రలు ఈ‌భాగవతవృక్షాన్ని లతల్లాగా ఆశ్రయించి తరించాయి.  మంచి మనస్సు గలవారికి చక్కగా బోధపడే లక్షణం గలది భాగవతం. దీనిని ఆశ్రయించిన వారికి ఫలం మోక్షమే. ఈ భాగవత పురాణానికి పాదు వ్యాసమునీంద్రులు. 

ఎంత అందమైన పద్యం!

12, జులై 2013, శుక్రవారం

భగవత్కథలు - కొత్త శీర్థిక - మీ స్పందన తెలియ జేయండి!

ముందు మాట.

మన తెలుగులో గొప్ప సాహిత్యం ఉంది. అది వేయేళ్లకు పైగా కష్టపడి చిలికి జనుల దోసిట్లో కవిచక్రవర్తులు పోసిన అమృతం.

తినగ తినగ వేము తియ్యనుండు అన్నాడు వేమన అనే ఒక కవి. ఆ సంగతి యేమో గాని తినగా తినగా గారెలు చేదెక్కాయని ఒక సామెత ఉంది.  అలాగా తెలుగువాళ్ళకి తెలుగు మాట్లాడీ మాట్లాడీ విసుగెత్తిపోయినట్లుంది.  ఈ‌ మధ్యన అసలు తెలుగు మాట్లాడటమే నామోషీ అయిపోయింది.

ఈ రోజుల్లో జనం అన్నం అనటం మానేసి రైస్ అంటున్నారు.  పాటను సాంగు అంటున్నారు.  అమ్మా నాన్నా అని పిలవటం మోటు అనుకుంటున్నారు.  తెలుగు వద్దూ‌ అనుకుంటున్నారు.  నష్టం‌ ఎవరికీ?

మన ఎంత బాగ ఇంగ్లీషు వెంటబడినా ఇంగ్లీషువాళ్ళం మాత్రం కాలేము.  మనని మనం తెలుగువాళ్ళం అనుకోవటానికి మొహమాట పడుతున్నాం.  మనం‌ ఎవరిగా మిగల బోతున్నాం?  ఈ విషయం కాస్త ఆలోచించుకోవాలి మనం.

నేటి తల్లిదండ్రుల అతి కారణంగా పిల్లలకు తెలుగు అనేది ఒక చదువదగ్గ వ్రాయదగ్గ మాట్లాడ దగ్గ భాషలాగే కనబడటం లేదు.

మనం కోల్పోతున్నది మన ఉనికిని అని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలని నా విజ్ఞప్తి.  మన సాహిత్యం కూడా మన ఉనికిలో అతి ముఖ్యమైన భాగమేనని సవినయంగా మనవిచేస్తున్నాను. కాదని వాదించే‌ వారితో ప్రతివాదనకు దిగననీ మనవి చేస్తున్నాను. మనం అంతా కావాలనుకుంటే మన తెలుగు బ్రతికి బట్టకడుతుంది.  లేకపోతే కృశించి నశిస్తుంది. అంతా మన చేతిలోనే ఉంది.

ప్రస్తుత పరిస్థితులలో తెలుగు ఒక సబ్జెక్టుగా అభ్యసించే విద్యార్థులలో ఆసక్తి గలవారు మినహాయించి పిల్ల లెవరికీ తెలుగు పద్యాలు చదివి అర్థం చేసుకొనే శక్తి ఆసక్తి లేదు. నిజానికి చాలామంది మధ్యవయస్కుల పరిస్థితీ అదేనేమో. అందువలన శ్యామలీయం‌ బ్లాగులో కొన్ని ప్రబంధ భారత భాగవతాది కథలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నాను. 

ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని పద్యాలూ కథలతో‌పాటే చెప్పుకుందాం అర్థతాత్పర్యాలతో సహా. ఇది కొంత మేలు చేస్తుందని ఆశిస్తున్నాను. పద్యం చదవటం పట్ల ఆసక్తి పెరిగి, కొద్ది మందైనా తిరిగి సంప్రదాయిక సాహిత్యాన్ని చదవాలనుకుంటే నా కృషి ఫలిస్తుంది.

అందు చేత చదువరులు యీ శీర్షికను స్వాగతిస్తారని ఆశిస్తున్నాను.


దయచేసి మీ స్పందనను తెలియజేయండి.