10, నవంబర్ 2021, బుధవారం

జానక్యాః . . . . . శ్లోకం గురించి


ఈ రోజున వాత్సల్య గారు పంపిన వ్యాఖ్య ఆలోచనీయంగా ఉంది.

శ్యామలీయం గారూ,
నిష్కర్షగా నేను-నా రాముడు అని చెప్పడం చాలా బాగుందండీ.
జానక్యాః శ్లోకం ఇంటర్నెట్లో ఒకొక్కచోట ఒకొక్కలాగ ఉంది.మీకు వీలయితే సరి అయిన శ్లోకాన్ని ఇక్కడ జవాబు ద్వారా వ్రాయగలరా?

చలామణీలో ఉన్న ఈ శ్లోకంలో ఉన్న తప్పులని ఎత్తిచూపుతూ ఎవరైనా వ్రాయకపోయి ఉంటారేమో, ఇంటర్నెట్లో వెతకాలి అనుకున్నప్పుడు నాకు గుర్తు వచ్చినది మీ బ్లాగు, శర్మగారి బ్లాగే. 

ఈ జానక్యాః .. శ్లోకం శ్రీరామకర్ణామృతం లోనిది.

జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితా 
న్యస్తా రాఘవమస్తకే తు విలసత్కుంద ప్రసూనాయితాః  
స్రస్తాః శ్యామలకాయకాంతికలితాః యా ఇంద్రనీలాయితాః 
ముక్తా స్తా శ్శుభదా భవంతు భవతాం శ్రీరామవైవాహికాః ॥ 1-82॥
 
ఇప్పుడు నేను పైన చూపిన పాఠం వావిళ్ళవారు 1972లో ప్రచురించిన ప్రతిలోనిది. ఈప్రతి ఒక నాదగ్గర జీర్ణావస్థలో ఉంది! వావిళ్ళవారి ప్రచురణలు ప్రమాణంగా గ్రహించటం అన్నది పరిపాటి. దానికి కారణం ప్రచురణకర్తలు స్వయంగా మహాపండితులు కావటం.

ఒక ఐతిహ్యం ఉన్నది. వావిళ్ళవారు ప్రచురించే పుస్తకాలకు సంబంధించిన ప్రతులకు తప్పొప్పులను సరిచూడటానికి పండితులకు ఒక గొప్ప అవకాశం ఉండేదట. అచ్చులోనికి వెళ్ళక ముందు వావిళ్ళవారి పరిష్కర్తల బృందం సరిచూడటం జరిగిన తరువాత ఆ అవకాశం ప్రెస్సుకు వచ్చే కవిపండితులకు తప్పకుండా ఉండేదట. ఏవన్నా తప్పులు కనుక ఎత్తి చూపటం ఎవరన్నా చేస్తే వారికి తప్పుకు ఒక అణా చొప్పున పారితోషికం కూడా వావిళ్ళవారు ఇచ్చేవారట.

అందుచేత నా బాల్యం నుండి గమనిస్తున్నాను, సాహిత్య చర్చల్లో వావిళ్ళవారి పాఠం అంటే అదొక ప్రమాణంగా పరిగణించబడుతూ ఉండటం.

ఈశ్లోకం తెలుగునాట బహుళ ప్రచారం పొందినది. ముఖ్యంగా పెళ్ళిశుభలేఖల్లో ముపాతికమువ్వీసం లేఖలు ఈశ్లోకంతో ప్రారంభం అయ్యేవి. స్వయంగా నేనే చాలా సార్లు పెళ్ళిశుభలేఖల్లో ఈ శ్లోకం ప్రతి సరిదిద్దటం జరిగింది.

అంతర్జాలంలో ఈశ్లోకం చాలాచోట్ల తప్పులతో కనిపిస్తున్నమాట నిజమే.
సాక్షిపత్రిక వారి వ్యాసంలో ఈ శ్లోకంలో "రాఘవ మస్తకే చ" అనీ "ముక్తా తా" అనీ పొరపాటు ముద్రణ ఉంది.
సుజనరంజని పత్రిక వారి వ్యాసంలో కూడా ఈశ్లోకంలో "రాఘవ మస్తకేచ" అని ఉంది.
చాగంటి సత్సంగ్ వారి పేస్‌బుక్ పేజీలోనూ "రాఘవ మస్తకేచ" అని ఉంది.
తెలుగుపద్యం బ్లాగు పేజీలో కూడా ఇలాగే "రాఘవ మస్తకేచ" అని ఉంది.
ఇలా "రాఘవ మస్తకేచ" అని చాలా ప్రచురంగా కనిపిస్తోంది.
 
ఇంకా అనేక చోట్ల రకరకాల తప్పులతోనే కనిపిస్తోంది. ఒకచోట "ముక్తాః శుభదాః భవంతు" అనిఉంది  
 
వావిళ్లవారి పాఠం ఇచ్చాను కదా, దీనిలో "పద్మరాగాయితా" అని విసర్గరహితంగా ఉంది. కాని దాదాపు అందరూ "పద్మరాగాయితాః" అని అంటున్నారు. అంతర్జాలం నిండా ఈపాఠమే ఉంది. మరి వావిళ్ళవారు విసర్గను వదలటం పొరపాటున చేసారా అన్నది నా సందేహం. ఈవిషయంలో పెద్దలను సంప్రదించాలి.

ఇకపోతే, ఈశ్లోకానికి వివరణ ఇవ్వమని మిత్రులు శర్మగారు ఆదేశించారు. అవశ్యం అలా చేయవలసినదే.

ఈశ్లోకం అంతా ముక్తాః అని ఇందులో ఒక ముక్క ఉంది చూడండి, దాని చుట్టూ తిరుగుతుంది. మరి ముక్తాః అంటే ముత్యాలు. మౌక్తికం అంటే సంస్కృతంలో ముత్యం అని అర్ధం. ముక్త అన్నా ముత్యమే. శ్లోకంలో ముక్తా అని విసర్గ లేంకుడా ఉందనుకోకండి. విసర్గ ఉంది కాని సంధికార్యం జరిగి కనబడకుండా పోయింది ముక్తాః తాః అన్నది ముక్తాస్తా అయ్యిందన్నమాట. ఇవి మామూలు ముత్యాలు కావండోయ్. ముత్యాల తలంబ్రాలు. సీతారాముల పెండ్లిలోని ముత్యాల తలంబ్రాలు. ఆ తలంబ్రాల ఘట్టంలో కొట్టొచ్చినట్లు కనిపించిన ఒక సంగతి గురించి ఈశ్లోకం మనకు చెప్తోంది.
 
తలంబ్రాలు అన్న మాటలో‌ తల అన్నది తెలుస్తోంది. కదా జాగ్రతగా చూడండి, చివర్న ప్రాలు అన్నది మరొక మాట కనిపిస్తోంది కదా, ఆ ప్రాలు అంటే ఏమిటీ? ఏమిటంటే బియ్యం. మరి బియ్యం ఎలాగుంటాయీ తెల్లగా కదా. సరే మన యిళ్ళల్లో పెళ్ళిళ్ళైతే బియ్యంతో తలంబ్రాలు పోసుకుంటారు వధూవరులు.
 
కాని రాముడూ‌ సీతా అంటే మనలాంటి సామాన్యులా ఏమిటీ? రాములవారేమో దశరథుడనే‌ మహారాజు గారి కొడుకైతే సీతమ్మ యేమో జనకుల వారనే మరొక మహారాజు గారి కూతురు. ఒక యువరాజూ ఒక యువరాణీ‌ పెండ్లాడుతుంటే మనలాగా మామూలు బియ్యంతో తలంబ్రాలు పోసుకోవటమేం! ఇంచక్కా మంచి ముత్యాలతోనే తలంబ్రాలు పోసుకుంటారు. అవును కదా.

ఆ మంచి ముత్యాలేమో అందంగా తెల్లగా ఉంటాయి. అదీ నిజమే‌ కదా. కాని అక్కడట అవి సీతమ్మ దోసిటలో  ఉన్నప్పుడు  ఎఱ్ఱగా మంచి పద్మరాగాల్లాగా ఉన్నాయట. పద్మరాగాలు అంటే మాణిక్యాలు. అవి చాలా ఎఱ్ఱగా ఉంటాయి కదా. వీటిల్ని రూబీలు అంటార్లెండి ఇంగ్గీషులో.
 
అవునండీ, సీతమ్మవారి దోసిటలో అవి ఎఱ్ఱగా ఉండక తప్పదు కదా, ఆ తల్లి అరచేతులు చక్కగా ఎఱ్ఱగా ఉండటం వలన. శ్లోకంలో కమలామలాంజలిపుట అన్నారు. మామూలు కమలాలు అనగా తామరలు కావు కెందామరలు అంటే ఎఱ్ఱతామరలు. ఈ సమాసంలో ఉన్న అంజలి అంటే దోసిలి అని అర్ధం.

అమ్మ ఆ మంచిముత్యాలని తన ఎఱ్ఱని దోసిటిలో పట్టి రామయ్య శిరస్సు మీదకు వదలింది. అంటే తిన్నగా నెత్తికి చేయి తాకించి కాక కొంచెం పైనుండి పోసిందన్నమాట తలంబ్రాలు. అప్పుడవి చక్కగ కుందప్రసూనాల వలె అనగా మల్లెపూల వలె
స్వఛ్చమైన తెలుపుతో ప్రకాశించాయట.

 ఆ మంచిముత్యాలే రామయ్య నెత్తి మీద నుండి క్రిందికి జారుతున్నప్పుడు ఇంద్రనీలమణుల్లా ఉన్నాయట. ఇంద్రనీల మణుల్ని మనం నీలమణి అంటాం సాధారణంగా. ఇంగ్లీషులో సఫైర్ అంటారు లెండి. అలా ఎందుకైనవండీ అని అనవచ్చును మీరు. సమాధానం సుళువే‌ సుమా. రామయ్య నీలమేఘఛ్చాయ కలవాడు కదా. అందుకే ఆయన శిరస్సుమీద నుండి ఆయన వంటి మీదిగా క్రిందికి జారుతున్నప్పుడు అవే‌ మంచి ముత్యాలు తమాషాగా నీలమణుల్లాగా నల్లగా ఐపోయాయట ఆయన కాయకాంతి అంటే శరీరవర్ణం పొందటం వలన.

ఈశ్లోకంలో మంగళాశాసనం చేస్తూ అటువంటి అద్భుతమైన ఆ సీతారాముల పెండ్లివేడుకలోని ముత్యాల తలంబ్రాలు మీకు శుభాలను ప్రసాదించు కాక అంటున్నారు.

ఈశ్లోకంలో ఈసంగతులు చెప్పటానికి పద్మరాగాయితా, కుందప్రసూనాయితా, ఇంద్రనీలాయితా అంంటూ‌ ఆయితా అన్న శబ్దంతో చెప్పారు కదా, ఈ ఆయితా అంటే ఏమిటీ అంటే సంస్కృతంలో సిధ్ధంగా ఉండటం తయారుగా ఉండటం అన్నమాట. పద్మరాగాయితా అంటే‌ పద్మరాగాలుగా తయారైనవి అని అర్ధం. అంటే మారిపోయినవి అని మన అన్వయం చేసుకోవాలి.
 
పెండ్లిలో ముత్యాల తలంబ్రాలు ఎందుకూ అంటే మనం కారణం ఇప్పటికే చెప్పుకున్నాం మహారాజుల బిడ్దల పెండ్లి కదా అని. అంతే కాదు ఎంతో కొంత మొత్తంలో తలంబ్రాలలో ముత్యాలను కలపటం మంచిది. ముత్యం అనేది అందరికీ మంచిని చేసే గుణం కల రత్నవిశేషం. అందుచేత సామాన్యులమైనా మన యిండ్లల్లో పెండ్లివేడుకలోనూ తలంబ్రాలలో కొన్ని ముత్యాలు కలపటం మంచి ఆచారం.

ఈరోజుల్లో ఐతే నానా చెత్తనూ రంగురంగుల ప్లాస్టిక్ పూసలతో సహా తలంబ్రాలలో కలిపి వాటిని అపవిత్రం చేస్తున్నారు. అందులో చాలావరకూ రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ అని చెప్పనవసరం లేదుగా. రీసైకిల్ అంటే ఆ ప్లాస్టిక్ పూర్వం ఏ తాగిపాడేసిన ప్లాస్టిక్ స్ట్రాలనుండో తినిపారేసిన టిఫిన్ సంచీలనుండో మరే కశ్మలం నుండో చెప్పలేం - అదంతా పెళ్ళికొడుకూ‌ పెళ్ళికూతురూ తలంబ్రాల్లో కలిపి నెత్తిన పోసుకోవట మేమిటీ దరిద్రం‌ కాకపోతే.

పవిత్రమైన మంచి ముత్యాలనే వాడండి తలంబ్రాల్లో కలిపేందుకు. ఆ ముత్యాలు రాములవారి పెండ్లి తలంబ్రాలు అనుకొని ఈశ్లోకాన్ని అనుసంధానం చేసుకోండి. ఆ ముత్యాలు శుభం కలిగించు కాక అని కోరుకోండి.

ఈశ్లోకం ఈపాటికి చక్కగా మీ అందరికీ బోధపడిందని అనుకుంటున్నాను. మరలా మరలా శ్లోకాన్ని మననంచేసుకొని ఆస్వాదించండి దానిలోని సారస్యాన్ని.

శుభం.

9 కామెంట్‌లు:

  1. అనుమానాలు
    1.కమలామలజ సరియా? మలామల పునరుక్తా?
    2.విసర్గ ఉంచి ఉండరనే నా అనుమానం, పొరబాటు కాదనే
    3.తు,చలకు అభేదమనుకుంటున్నాను


    వావిళ్ళ వారి ప్రతి నిర్దుష్టం అని పేరు.
    వావిళ్ళవారు ప్రతులను దిద్దించి సొమ్ము ఇచ్చేవారని శ్రీపాదవారి మాట. అలా తానుకూడా కొన్ని ప్రతులు సరి చేసి ఇచ్చినందుకు అనుకున్నదానికంటే ఎక్కువ సొమ్మే ఇచ్చిన అనుభవం చెప్పేరు.
    సమయం సందర్భం వచ్చింది కనక ఈ శ్లోకానికి ప్రతి పదార్ధం, దండాన్వయం, అర్ధం చెప్పి పుణ్యం కట్టుకోండి.

    రాత్రయినా ఈ వ్యాఖ్య రాసి మరీ పడుకుంటున్నాను.మరో టపాలలో వివరించగలరు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నాదే typo. సరిచేసానండి.
      సంస్కృతంలో చ తు వై స్మ హి అనేవి కేవలం పూరణకోసం వాడే అవ్యయాలు వాటికేమీ అర్ధాలు లేవు.
      వివరణ రేపు కలుపుతానండి.
      ధన్యవాదాలు.

      తొలగించండి
    2. శర్మ గారు, వివరణను జోడించానండీ దయచేసి పరిశీలించ గలరు.

      తొలగించండి
    3. ఆనందమానందమాయె
      వివరంగా చెబుతారనుకున్నా! మాలాటి పామరులు అర్ధం చేసుకోవడం కష్టం కదా.
      జానక్యాః అంజలి కమలాః అమలాః......
      జానకి జోడించిన చేతులు ముడుచుకున్న కమలంలా అమలా మలినముకానివి,తెల్లనైనవి......
      జానకి దోసిట కెంపుల ప్రోవై
      రాముని దోసిట నీలపు రాసై
      ఆణి ముత్యములు తలంబ్రాలుగా ...
      కళ్యాణము చూతము రారండి... ఇదే కదా మా స్థాయి.
      ఏం చేస్తాం ఇంతకే సంతోషపడిపోతాం.
      శ్రమ తీసుకున్నందుకు
      ధన్యవాదాలు.

      తొలగించండి
  2. శ్యామలీయం గారూ,

    అడగగానే వీలు చూసుకుని వివరంగా వ్రాసినందుకు ధన్యవాదాలండీ.నేను ఈ శ్లోకాన్ని వ్రాసిపెట్టుకున్నాను.
    తలంబ్రాలలో ప్లాస్టిక్ పూసల గురించి మీరు వ్రాసినది చదివైనా మానెస్తే బాగుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పెండ్లి అనేది ఒక పవిత్రమైన సంస్కార కార్యక్రమం అన్నది నేటికాలపు వారి ఆలోచనకు రావటంలేదు. అది ఒక వినోదకార్యక్రమం అని యువతా డబ్బుబలుపు చూపేందుకు అవకాశం దండిగా ఉన్న విలాసకార్యక్రమం అని తలిదండ్రులూ భావిస్తున్నారు. కాబట్టే చాలా పెడబుధ్ధులు మరి. వైదికభావనలూ పవిత్రతల వంటివి వీళ్ళ ఊహకు కూడా రావు. ఏంచేస్తాం.

      తొలగించండి
  3. మంచి ప్రయత్నం చేశారు.

    యాః ముక్తాః జానక్యాః కమల+అమల అంజలి పుటే పద్మరాగాయితాః
    యాః ముక్తాః రాఘవ మస్తకే చ న్యస్తాః విలసత్ కుంద ప్రసూనాయితాః
    యాః ముక్తాః స్రస్తాః శ్యామలకాయ కాంతి కలితాః ఇంద్రనీలాయితాః
    శ్రీరామ వైవాహికాః తాః ముక్తాః భవతాం శుభదాః భవంతు.

    ఏ ముత్యాలైతే జానకీదేవి యొక్క అమలమైన కమలము వంటి దోసిలిలో పద్మరాగముల వలె ప్రకాశిస్తున్నాయో, యే ముత్యాలైతే రాఘవుని మస్తకము మీద ఉంచబడినవై కుంద ప్రసూనములవలె భాసించాయో, యే ముత్యాలైతే రాముని నీల దేహము నుండి క్రిందకు జారినవై నీలమణుల వలె విలసిల్లినాయో, శ్రీరామ వైవాహికమునకు సంబంధించినవైన ఆ ముత్యాలు మీకు శుభాలను కలిగించునవి అగు గాక- ఇత్యాశీః.

    సరైన పాఠం ఈ క్రింది విధంగా ఉండనోపును.


    జానక్యాః కమలామలాంజలి పుటే యాః పద్మ రాగాయితాః (కొందరు ఇక్కడ కూడ విసర్గ లోపము చేస్తారు {వావిళ్ల ప్రతికి సంబంధించి మీ సందేహం} కానీ యే పాదానికి ఆ పాదం విరుగుతుంది కనుక చేయకపోవడం ఉత్తమమని స్వీయాభిప్రాయం.)
    న్యస్తా (విసర్గ లోప సంధి) రాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితాః
    స్రస్తాశ్శ్యామల కాయ కాంతి కలితా (విసర్గ లోప సంధి) యా (విసర్గ లోప సంధి) ఇంద్రనీలాయితాః
    ముక్తాస్తాశ్శుభదా (విసర్గ లోప సంధి) భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః !!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. విష్ణు నందన్ గారు,
      దయతో ఈ‌శ్లోకానికి పదక్రమమూ దండాన్వయమూ అనుగ్రహించినందుకు అనేక ధన్యవాదాలు.
      మీరు సూచించిన శుధ్ధపాఠంలో
      1. పద్మ రాగాయితాః (చేయకపోవడం ఉత్తమమని అంటూనే పద్మ రాగాయితాః గ్రహిస్తున్నారు.)
      2. రాఘవ మస్తకే చ (ఎక్కువగా ప్రచారంలో ఉన్నది కాబట్టి అంగీకరిస్తున్నారా?)
      3. స్రస్తాశ్శ్యామల (వావిళ్ళ వారు ఇక్కడ విసంధిగా ఎందుకు ముద్రించారో తెలియదు)
      అన్నవి గమనార్హంగా ఉన్నాయి.

      నమోన్నమః

      తొలగించండి
    2. శ్యామలీయం గారు,
      నమామి.

      1. విసర్గ లోపం చేయకపోవడం ఉత్తమం కాబట్టే, విసర్గతో కలిపి "పద్మరాగాయితాః" అనే పాఠాన్నే పొందుపరిచినాను.
      విసర్గ లోపం చేసిన వావిళ్ల ప్రతిలో "పద్మరాగాయితా" అనే పాఠం ఉన్నట్టుంది, ఆ ప్రతి నేను చూడలేదు. సంస్కృతంలో ఏ పాదానికి ఆ పాదం విరుగుతుంది కనుక లోపం చేయక విసర్గతో కూడిన పదాన్నే స్వీకరించడం మేలనే నా భావనను పౌనఃపున్యం చేస్తున్నాను.
      2. ఈ శ్లోకం నేను మొదటిసారి విన్న 8వ యేట నుండి దాదాపు ఇప్పటిదాకా చకార సహితంగానే విన్నాను, చదివినాను.అనూచానమైన సంప్రదాయం కనుక, కర్ణాకర్ణిగా వింటున్న వాడుక కనుక నా పాఠంలో చకారమే ప్రయుక్తమైనది. అంతే కాక, ఇంకొంత సూక్ష్మం గా పరిశీలిస్తే ఆయా సంస్కృతాభివ్యక్తీకరణలలో "చ" మరియు నూ, "తు" ఐతే నూ, ఆయా పట్టుల తెలియజేయడం కద్దు (ఖచ్చితంగా ఇదమిత్థమని చెప్పలేము కానీ, సాధారణంగా). ఇక్కడ మరియు ప్రయోగం ఉపయుక్తమని నాకనిపించింది. ఆ కారణం వల్ల కూడా చ మేలనిపించింది.
      3. అది విసంధి అని నిర్ధారింపలేము, విసర్గ సంధి సూత్రానుసారం, స, శ, ష లు విసర్గకు పరమైనప్పుడు, అవే ఆగమమౌతాయి కనుక పలికినప్పుడు వైరుధ్యముండదు- సంధియుక్తమైన ఉచ్చారణకు లోపముండదు. మనః సాక్షి- మనస్సాక్షి , వచః శీధురసం- వచశ్శీధురసం, చతుః షష్టి- చతుష్షష్టి ఇత్యాది.
      కానీ వ్రాతలో స్రస్తాశ్శ్యామల అని ఉండుంటేనే పండిత జనరంజకంగా ఉండేదనేది వ్యక్తిగతాభిప్రాయం.

      చివరిగా చెప్పొచ్చేదేమంటే, అసలు అన్ని పదాల చివరా విసర్గ ఉంచి వ్రాయడం ఒక పద్ధతి, విసర్గ లోపించవలసిన స్థానాల్లో విసర్గ తొలగించి సంధికార్యం జరిపించి లిఖించడం ఒక పద్ధతి. రెండూ అంగీకరింపవచ్చు.

      ఇది పూర్తిగా విసర్గ సంధి, విసర్గ లోప సంధుల వ్యవహారం.

      వావిళ్ల ప్రతి అటు కొంత, ఇటు కొంత పాటించినట్లు కనిపిస్తోంది. ఈ ధోరణి కొంత సందేహాస్పదంగా ఉంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.