13, నవంబర్ 2021, శనివారం

ఏమరక నుడువుదు నీ రామనామము

ఏమరక నుడువుదు నీ రామనామము
నా మనసున నిండిన దీ  రామనామము

కామితార్ధముల నొసంగు రామనామము
కామాదుల నణచివేయు రామనామము
ప్రేమతో నన్నేలెడు రామనామము
రామనామము నా రామనామము

కామారికి యిష్టమైన రామనామము
సామీరికి సర్వమైన రామనామము
భూమిసుతకు ప్రాణమౌ రామనామము
రామనామము నా రామనామము

తామసత్వ మరికట్టు రామనామము
క్షేమంకరమై యుండెడు రామనామము
నీమముగా మోక్షమిచ్చు రామనామము
రామనామము నా రామనామము



2 కామెంట్‌లు:

  1. అనుకూలమైన చోటు నందు శ్రీ తగిలించిన బాగుంటుం
    Demo

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇబ్బంది ఉండదండీ ఇక్కడ. "రామనామము శ్రీరామనామము" అనండి చివరి పాదాలను. లేదా "నుడువుదు శ్రీరామనామము" అనండి. ఐతే మూలపాఠాన్ని ఎవరికి ఇంపుగా వారు సవరించటం అంత మంచిపని కాదు"

      అన్నమాచార్యుల వారు "అదివో అల్లదివో హరినామము" అన్న పల్లవిని ఇస్తే ఎవరో పుణ్యాత్ములు శ్రీహరినామము అని సవరించి ప్రచారంలోనికి తెచ్చారు. తప్పు ఏమీ లేదనకండి. తప్పే. అన్నమయ్య యతిప్రాసలను పాటించారు నీయమంగా. యతిస్థానంలో శ్రీ అని ప్రవేశపెట్టటం వలన యతిమైత్రి చెడిపోయింది!

      అందుచేత మూలపాఠాలకు మెఱుగులు దిద్ది వన్నె తఱుగు చేసే ప్రమాదం విషయంలో మిక్కిలి జాగ్రత వహించాలి. లేదా అయ్యవారిని చేయబోతే కోతి ఐనట్లు జరుగుతుంది.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.