9, నవంబర్ 2021, మంగళవారం

ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా

ముద్దుముద్దు కోపాల మురళీకృష్ణా రా
వద్దు వద్దనకురా బాలకృష్ణా

విందుచేయ చెవులకు వేణుగానము మే
మందరము నిను చేరితి మదిలించకు
అందమైన మురళిపాట యదే చాలురా గో
విందుడా మరి యేమీ కోరము నిన్ను

అచ్చరలు మింటనిలచి యాలకించ గొల్ల
మచ్చెకంటులు వినగ వచ్చుట తప్పా
ముచ్చటైన మరళిపాట మురిపెము తీర విన
నిచ్చుటే కాకేమీ నిన్నడుగము

మరియాద కాదనుచు మమ్ము కసరకు నీ
మరువుసొచ్చుటే పెద్ద మరియాదరా
మురళిని వాయించు హరి మోహనాంగుడా నిను
శరణము జొచ్చితి మింక శాంతించరా

4 కామెంట్‌లు:

  1. శరణము జొచ్చితి మింక శాంతించరా
    బదులుగా
    శరణము జొచ్చితి మింక కరుణించరా (లేక ఆదరించరా)
    బాగుంటుందేమో ఒకసారి చూడగలరు.
    (కేవలం తెలుసుకోవాలని మాత్రమే అడగడం జరిగింది)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆదరించరా అని అనటం ఇక్కడ కుదరదండీ. యతిమైత్రిని పాటించటం జరుగుతున్నందు వలన. శాంతించరా అన్నప్పుడు అక్షరసమత ఉన్నది కరుణించరా అన్నప్పుదు ప్రాసయతిమైత్రి ఉన్నది. ఉభయమూ అంగీకారమే. నేను ఇక్కడ శాంతించరా అనటానికి కారణం గీతంలోని స్థాయీ భావాన్ని అనుసరించి వ్రాయటం. కరుణించరా అన్నది కూడా పరిశీలించే ఉంటాను.

      తెలుసుకోవాలని అడగటం తప్పు కాదండీ. మంచిదే. అభ్యంతరం లేదు. కాని నాకూ ఒక విషయం తెలుసుకోవాలని ఉంది. తరచూ సవరణలను ప్రతిపాదిస్తున్నది ఒక అజ్ఞాతయే అనుకుంటున్నాను నిజమేనా అని. ఐతే తమరు గీతం నచ్చుదలవంటివి ప్రస్తావించక ఎప్పుడూ రంధ్రాన్వేషణ ఎందుకు చేస్తున్నారో బోధపడటం లేదు. ఈసారినుండీ దయచేసి తమ నామధేయంతోనే వ్రాయగలరు. అలా కుదరని పక్షంలో వ్యాఖ్య చివర తమ నామధేయం తెలుపగలరు. అనామక వ్యాఖ్యలపట్ల నాకు అంతగా ఆసక్తి లేదండి.

      తొలగించండి
  2. అజ్ఞాతలకు గమనిక:
    ఒకరో పదిమందో అన్నది తెలియదు కాని అజ్ఞాతలు కొందరు వ్రాస్తున్నారు. టపాకు సంబంధించిన విషయాలను ప్రస్తావిస్తే, అందులోనూ అనవసరమైన ప్రసంగాలేమీ లేకుండా ఉంటే అజ్ఞాతల వ్యాఖ్యలవలన ఇబ్బంది లేదు. అవి ప్రకటించటం సమంజసమే. కాని వృథా చర్చలకు ఇక్కడ అవకాశం లేదు. నన్నో నాలుగు మాటలు అనటం వలన తృప్తిపొందదలచుకుంటే అది వారి యిష్టం - ఆ రొట్ట అంతా ప్రచురించి ఏమి లాభం? సాహిత్యం గురించి కాక వ్యక్తుల గురించిన చర్చల ప్రయోజనం శూన్యం. అందుకే ఆ చర్చను తొలగించాను. అసలు ముందే ప్రచురించకుండా ఉండవలసినది.

    ఈ అర్ధరాత్రి అజ్ఞాత వ్యాఖ్య ఒకటి నన్ను వ్యక్తిగతంగా ఎత్తిపొడుస్తూ పెద్దపెద్ద ఇంగ్లీషు అక్షరాలలో వచ్చింది. అది ప్రచురణార్హం కాదు.

    విషయం స్పష్టీకరిద్దామని ఈ ముక్కలు రెండూ వ్రాసాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.