4, నవంబర్ 2021, గురువారం

వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా

వెన్నెల వేళల్లో కన్నయ్యా నువ్విలా
పొన్నచెట్టెక్కి మధుర మురళి యూదకు

నిలిచేనా చెప్పవయ్య నేలమీద మాకాళ్ళు
పిలిచే నీమురళిపాట వినబడితే చెవులకు
ఇలను పతులు సుతు లత్తల నెవ్వరిని గణించక
లలనల నిదె తొందరించురా నీమురళి మహిమ

రామచంద్రుడు పుట్టిన భూమిలో పుట్టాము
రామపత్ని ఆదర్శమురా మాకెప్పుడును
మేము మాయిళ్ళను వదలి యేమని వచ్చేము
రామంటే నీమురళీ రవము రప్పించురా

ఈమురళీ మృదురవమే యెసగ ప్రణవనాదమై
మేమనగ జీవులము నీవేమో దేవుడైతే
నీమనోహరగానమే నిండనీ నలుదెసల
ఆమాట దబ్బర యైతే ఆపరా మురళిని


2 కామెంట్‌లు:

 1. హరియను రెండక్షరములు
  హరియించును పాతకముల నంభుజనాభా
  హరి నీ నామ మాహాత్మ్యము
  హరి యని పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా

  రిప్లయితొలగించు
 2. చాలా బాగుంది కీర్తన.
  విజయ

  రిప్లయితొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.