కృష్ణగీతికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కృష్ణగీతికలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2025, ఆదివారం

నందనందన

వందనములు వందనములు నందనందన న
న్నెందుల కేడ్పింతువయ్య నందనందన

పొందితిరా కష్టములను నందనందన నేను
పొందితిరా వేదనలను నందనందన
పొందితిరా చెడుగెంతో నందనందన నీకు
వందనములు కావు మింక నందనందన

పొందితినా సంపదలను నందనందన నేను
పొందితినా భోగములను నందనందన
పొందితినా గర్వములను నందనందన నీకు
వందనములు కావు మింక నందనందన

ఉందువు శ్రీరాముడవై నందనందన నాదు
డెందంబున నెపుడు నీవు నందనందన
వందనములు రాముడందు నందనందన కృష్ణు
డందు నిన్ను కావు మింక నందనందన



14, సెప్టెంబర్ 2025, ఆదివారం

పాహి పాహి

పాహి పాహి కృష్ణ మాం
పాహి కృష్ణ కృష్ణ 

పాహి నందనందన మాం
పాహి భక్తచందన

పాహి గోపవేషక మాం
పాహి దీనపోషక

పాహి గోగణప్రియ మాం
పాహి గోపికాప్రియ

పాహి ధర్మరక్షక మాం
పాహి లోకరక్షక

పాహి దైత్యనాశన మాం
పాహి కంసశాసన

పాహి దురితమోచన మాం
పాహి భవవిమోచన

22, జులై 2025, మంగళవారం

నల్లనయ్య

గొల్లవాడ లెల్ల తిరిగి నల్లనయ్య చాల
కల్లోలము సృష్టించెను నల్లనయ్య

కొల్లగొట్టి వెన్నలన్ని నల్లనయ్య మా
చల్లకుండ పగులగొట్టె నల్లనయ్య మా
చెల్లె లడ్డగించితే నల్లనయ్య బుగ్గ
గిల్లి పారిపోయె నీ నల్లనయ్య

వెన్నలన్ని మెక్కి పోయి వేణువూద ఆ
పొన్న చెట్టు నెక్కె నీ చిన్ని దొంగ సం
పన్ను లింటి బిడ్డడైన బరితెగించి పాలు
వెన్న లన్ని కొల్లగొట్టు వేడు కేమి

అల్ల రెంత చేయ నేమి నల్లనయ్య మా
కెల్లరకును ముద్దువచ్చు నల్లనయ్య ఒక
పిల్లంగోవి చేత బట్టి నల్లనయ్య భువన
మెల్లను రంజింపజెయు నల్లనయ్య


19, జులై 2025, శనివారం

కసరవచ్చునా

కొంటె కొంటె మాట లిట్లు  గోవిందా నీ
వంటె నేనూరు కో నయ్య జాగ్రత

కుంటిసాకు లెందుకే గొల్లభామా నే
నంటె నీకు ప్రాణమే వయ్యారి భామా నా
కంటబడగ వేచి యున్న కలికీ నేను
కంటబడగ వంక బెట్టి కసరవచ్చునా

గొంటుదనము మానవే గొల్లభామా నా
కంటె నాథు డెవ్వడే వయ్యారిభామా 
ఉంటి నేను తోడుంటే యువిద నీవు
కంటగించుకొని నన్ను కసరవచ్చునా 

కొంటె మాట లేమిటే గొల్లభామా నే
నంటున్నది తప్పా వయ్యారిభామా న
న్నంటుకొన్న కైవల్య మెంటే మోము
గంటునెట్టుకొని నిన్ను కసరవచ్చునా

7, జూన్ 2025, శనివారం

శ్రీకృష్ణా


సంసారబాధావిదారా కృష్ణా సర్వేశ్వర శ్రీకృష్ణా 


సుమధురసుందరహాసా కృష్ణా శుధ్ధపరబ్రహ్మ కృష్ణా 

కమలాయతేక్షణ కమలామనోహర ఘనపీతాంబర కృష్ణా


గోపగోపికాజీవన కృష్ణా గోకులసుందర కృష్ణా 

పాపతిమిరభాస్కర శ్రీకృష్ణా పరమేశ్వర శ్రీకృష్ణా 


కంసాదిదానవసంహార కృష్ణా కలుషాంతక శ్రీకృష్ణా 

హింసావిదూరా కృష్ణా పరమహంసార్చిత శ్రీకృష్ణా 


పాలితాఖిలజగజ్జాలా కృష్ణా పరమపావనా కృష్ణా 

నీలమేఘసుశ్యామా కృష్ణా నిరుపమసుందర కృష్ణా 


కురుకులవనదావానల కృష్ణా నరసఖ హరి శ్రీకృష్ణా 

నరసింహాచ్యుత నారాయణ హరి కరుణాంతరంగ కృష్ణా 


భక్తవత్సలబిరుదాంకిత కృష్ణా పతితపావనా కృష్ణా 

ముక్తివితరణశుభశీలా కృష్ణా భూభారాంతక కృష్ణా 



20, మే 2025, మంగళవారం

మధురభాషల చిన్ని కృష్ణ

మధురభాషల చిన్ని కృష్ణ నీవు

    మథురకు పోవద్దు కృష్ణ

మథురలో పనియుందే భామా నేను

    మథురకు పోవలె భామా


మదురలో కంసుడు కృష్ణా నిన్ను

     మననిచ్చునా వద్దు కృష్ణా

వధియింతు కంసుని భామా నేను

    మథురకు పోవలె భామా


కథలుకథలుగ వింటి కృష్ణా వాడు

     కఠినాత్ముడట చిన్ని కృష్ణా

వ్యథలకు మూలము భామా వాని

      కథ తేల్చ బోవలె భామా


ఆధముడు వానితో కృష్ణా నీవు

       ఆటలాడుట యేల కృష్ణా

విధి శంకరులు సాక్షి భామా వాని

     విరిచివచ్చెద గొల్లభామా



30, సెప్టెంబర్ 2024, సోమవారం

శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ


శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ శృంగారమూర్తి కృష్ణ

లోకేశ కృష్ణ కృష్ణ శోకాపనయన కృష్ణ 


గోవింద కృష్ణకృష్ణ గోపాల కృష్ణ కృష్ణ

దేవాధిదేవ కృష్ణ దివ్యప్రభావ కృష్ణ

శ్రీవిష్ణుదేవ కృష్ణ శ్రీరుక్మిణీశ కృష్ణ

సేవింతుమయ్య నినుభక్తితోడ శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ 


జగదీశ కృష్ణ కృష్ణ సర్వేశ కృష్ణ  కృష్ణ 

నిగమాంతవేద్య కృష్ణ  నిర్మోహ కృష్ణ  కృష్ణ 

ఖగరాజవాహ కృష్ణ కంసారి కృష్ణ కృష్ణ

అగచాట్లుబాపి మమ్మేలవయ్య హరి కృష్ణ  కృష్ణ కృష్ణ 


పరమేశ కృష్ణ కృష్ణ బ్రహ్మాండనాథ కృష్ణ 

గిరిధారి కృష్ణ కృష్ణ కరుణాంతరంగ కృష్ణ 

సురవైరినాశ కృష్ణ గురుమూరి కృష్ణ కృష్ణ 

హరి మాకుతొలగ సంసారబాధ వరమిమ్ము కృష్ణ కృష్ణ 



8, సెప్టెంబర్ 2024, ఆదివారం

వీడేమి చేసేనమ్మా


వీడేమి చేసేనమ్మా వీడు

నేడేమి చేసేనమ్మా


నిన్న కడివెడు పాలు వెన్నమీగడలన్ని

తిన్నంతతిని అన్నీ తన్నిపోయేనమ్మ

కన్నులు గప్పివచ్చు వెన్నదొంగను బట్ట

ఎన్ని చేసినగాని యన్నీ వృథయై పోయె


అన్ని యిండ్లను దూరి యన్నిపాలనుత్రాగి

అన్ని దుత్తలలోని వెన్నలు తినుటేమి

నిన్న మాయింటికి రాలేదన్న సుదతి లేదే

ఎన్నడు నిట్టివి వింతలు విన్నదే లేదోయమ్మ


తిన్నగ వాని పండువెన్నెల వంటినవ్వు

కన్నులజూచి మురియుచున్నాము వాని రాక

అన్నులమిన్నలార ఆనందమే గొలుప

ఎన్నకతప్పు లందరమున్నాము కాదటమ్మ


24, జూన్ 2024, సోమవారం

నందబాల


నందబాల ప్రజ్ఞానఘనా
నందరూప మునిజనా
నందకారక కోటిమన్మథ
సుందరాకా‌ర

చేత మురళిని బట్టి నీవు
చిద్విలొసముగను రార
పూతనాసంహారక కృష్ణ
పురుషసింహమ మా
చేతులార నీకు పూజలు
చేయవలచి వేచినాము
నీతి కాదుర దాగియుండుట
నిన్ను వేడెదము

బేలలము మేము గోప
బాలికలమురా యశోదా
బాలక నిన్నిపుడు వెదుకగ
జాలకున్నాముర కరు
ణాలవాల జాలమేల
నీలగగనశ్యామ రార
కాలిగజ్జెలందెలు మ్రోయ
బాలగోపాల


4, సెప్టెంబర్ 2023, సోమవారం

వద్దనరాదురా బాలగోపాల


వద్దనరాదురా బాలగోపాల ముద్దు
ముద్దుగ నే చిన్నిముద్దు లిచ్చుచు నుండ

సుద్దులెన్ని చెప్పిన సుంత వినని వేళ
గద్దించితే నీవు కాటుకన్నులు
రుద్దుచు నిలువ విలోకించి యక్షుల
నద్దగ వచ్చితే అటునిటు తిరుగుచు 

ఆటలాడిన నీవు అలసివచ్చిన వేళ
పాటపాడుచు నేను బంగరుకొండ
మీటుగాగను నీకు మెఱుగుముద్దల వెన్న
పాటించి తినిపించ వచ్చినవేళ

చద్దిమూటను నీవు చంకను బెట్టుక 
బుద్దిగజన సురభుల వెంట ప్రేమతో
వద్దకు పిలచి నాబాహుపంజరమున
ముద్ధుగ బంధించ భువనమోహన రూప







2, సెప్టెంబర్ 2023, శనివారం

చేరి కొలువవమ్మ నీవు చిత్తమలరగ


చేరి కొలువవమ్మ నీవు చిత్తమలరగ
ధారాధరశ్యాము డిదే దయచేసెను

నల్లపిల్లివలెను తా నిల్లిల్లు తిరుగునని
ఎల్లిదముగ పలికి నీ విల్లు వెడలించ
చల్లనైన మనసున్న స్వామి కనుక నేడు
మెల్లగాను నీ గడపను మెట్టినాడమ్మా

కల్లలాడుచున్నా డని కసరికొట్టి నీవు
నల్లనయ్య మనసునొవ్వ పెల్లునదిట్టి
ఎల్లి రాకు మీ వనుచు నెంతమాటన్నను
పల్లవోష్ఠ వా డిదిగో వచ్చినాడమ్మా

అటు కటువులాడి పంపి యిటు కనుల నీరిడి
కటకట పడుచుంటి వీవు కమలలోచన
యిటులౌదు వని యెఱిగి యెంతో దయ చూపి
కుటిలాలక వచ్చెను నీ గోవిందుడమ్మా


1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

కోటలు వేడను పేటలు వేడను


కోటలు వేడను పేటలు వేడను
మాటే కద యిమ్మంటినిరా

తనివితీరగను నిను సేవించిన 
తనువును మనసును మనుజులకిచ్చి
మనజాలను గావున నీపదముల
నను వ్రాలగ నిమ్మని యడిగితిని

వరాలమూటలు పంచే వాడా
మరేల నాకొక మాటీయవురా
హరి నే వేడితి  ధరపై పుట్టువు
మరింక లేదను మాటేకదా

నరుల కష్టముల నెఱిగిన వాడా
నరుడై వెలసిన నారాయణుడా
కరుణామయుడా కాదనకీరా
హరి శ్రీకృష్ణా యడిగిన మాట 


నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి

 

నీలిమేఘ మొకటి నిలువునామముబెట్టి 
నేలకు దిగివచ్చె నెమలిఫించము గట్టి

వాలెనె నాముందు బాలా నిన్నటి రాత్రి
ఏలాగు వివరింప జాలుదునే యపుడు
చాలసేపటి వరకు కాలమే తెలియని
మేలైన స్థితి కలిగె నీలాలక వినుము

దానాలు ధర్మాలు దండిగ జేసిన
వేనవేలేండ్లుగ మౌనియై యుండిన
తాను రాడట మనసు తనకంకితము జేసి
ధ్యానించినందుకే యవతరించేనట

తనువునాదను భ్రాంతి మనసున లేదాయె
మనసు నాదను భ్రాంతి మటుమాయమైపోయె
విను మేను వాడగుచు విహరించినది నిజము
తనదాయె నాయాత్మ ధన్యనైతిని చెలియ



31, ఆగస్టు 2023, గురువారం

బదులీయ వేమిరా మదనగోపాల


బదులీయ వేమిరా మదనగోపాల
వదనారవిందము వాడిన దేమంటే

త్వరపడుచును నాకై తహతహతో నీవు
బిరబిర తనమందిరమును వీడగ
చురచుర చూపుల సుదతి యెవ్వతె గాని
మరియాద మీఱి పలుమాటలు పలికెనా

పరమభక్తులు నీకు పాండవు లవ్వారి
సిరుల కసూయనే చెంది కౌరవులు
దొరకొనిరా యేమి దుండగముల కిపుడు
మరి యది కాదేని మాటాడవేరా

చనవున నే కొంటెతనమున నేమైన
మనసునొవ్వగ బలికితిని కాదు కద
మనసిజమోహన మధుసూదనా యీ
దినమున నీమోము తీరిటులున్న దేమి


వరములిచ్చే స్వామివైతే నాకేమి


వరములిచ్చే స్వామివైతే నాకేమి
పరమునిచ్చే స్వామివైతే నాకేమి

ఎవరెవరో నీభక్తు లేవేవో యడిగిన
నెవరెవరో యువిదలే యేవేవో కోరిన
భువనమోహన నీవు పొలుపుగ వారికి
త్తువు గాని నాయిల్లు తొలగి పోబోకురా

మునులాడు మాటలు మునుపే వింటి గాని
నినుజూచి నాస్వామివని మాత్ర మెఱుగుదు
ననుబాసి చనకుండ నాయింటనే యుండి
కనులార నినుజూచు కొనుచుండ నీరా

నావరకు నాయింటి నాథుడవై యుండేవు
నీవు నిలకడజూపి నిలచితే నది చాలు
ఏవరములు వద్దు గోవింద నీయండ
భావింప నాకదే పదివేలు కదరా


30, ఆగస్టు 2023, బుధవారం

వీధులన్నీ తిరిగి వేళదాటి వచ్చి


వీధులన్నీ తిరిగి వేళదాటి వచ్చి
బాధింతువేలర బాలగోపాల 

ఎంత బ్రతిమలాడి యెన్నిసుద్దులు చెప్పి
సుంత లాభములేక చోద్యమాయె
వింతచేతలవాడ విధిని దూరుదు నే
నంతియె గాక నిన్ననలేను మాటలు

వీరింట వారింట విందులారగించి
తీరికగ యింటికి చేరే బుధ్ధి
మారజనక నీకు మరియాద కాదని
పోరనేల బుధ్ధి పుట్టినప్పుడు రార

పదునాల్గులోకాలు పరగ వీధులు నీకు
ముదమార భక్తులు ముందిడు నైవేద్యాలు
విదితముగ మంచి విందులు ఆపైన
సదయుడవై యింటికి చనుదెంతువు 

నేరక నిను బిల్చి నే తప్పుజేసితి


నేరక నిను బిల్చి నే తప్పుజేసితి
నౌర గోపాల శృంగారరససార

గడపగడపకు పోయి కమలాక్షులను దాహ
మడిగి పుచ్చుకొనుట నంతయు విన్నాను
విడిచి నాయింటిని వేయిండ్ల జొరబడు
గడుసుదనము నన్ను కలవరపరచెను

వార్తలు నిజమే నే వారిండ్ల కేగితి
నార్తు లందరి యిండ్ల కరిగెద నందు వే
నార్తను కానోనా యందున శ్రీకృష్ణ
మూర్తి దయజూపవు మోసగించేవు

పెదవివిప్పి నిన్ను పిలువను నీవెపుడు
ముదమార నాదైన హృదయమెఱిగి వచ్చి
పదిచోట్ట తిరిగిన బడలిక తీరంగ
నిదురచేసెద వది నీకే విడచెద 


27, ఆగస్టు 2023, ఆదివారం

నేనెఱుగనివా నీమాయలు


నేనెఱుగనివా నీమాయలు 
ఈనాడే క్రొత్త లేమున్నవి  

ఎచ్చోట జూచిన నచ్చట నుండేవు 
ముచ్చటలాడేవు ముగుదలతో 
ఎచ్చటను లేని దీవింతపోకడ 
వచ్చె నెట్లో గోపాలక నీకే  

యిప్పు డేయే యిండ్ల నింతుల గూడి నే
నొప్పని పనులేమి యొనరించుచు
గొప్పలు చరచుచు గోపాలక నీ
విప్పుడు నామాటనే మరచేవో

పాపము వారెంత భక్తులో నేనెంత
పాపినో యన్నట్లు భావింతును
లోపము లేకున్న గోపాల నీవు నా
తాపంబును తీర్ప దయచేయవు


24, ఆగస్టు 2023, గురువారం

వచ్చిన గోపాలుని ముచ్చటలు తీర్చవే

వచ్చిన గోపాలుని ముచ్చటలు తీర్చవే
వచ్చుటే పదివేలు పరుసము లేలే

విరసోక్తులు పలికితే వెడలిపోవునే
సరసముగా మాటలాడి చక్కని వరములు
తరుణి నీవు బడయుటే తగినపని కాదటే
తరళేక్షణ గోవిందుడు దయగలవాడే

అందరు నీవంటివారె యనుకోరాదే
వందనములు చేయువా రందరకు వరముల
నందించుచు వినోదించు నందగాడు కాదటే
సుందరి యీ గోవిందు డందరి వాడే

వీని పాదములను పట్టి వేడవెందుకే
మౌనులకును యోగులకును పొలుపుగా వరముల
మానక నందించువాడు మరి వీడు కాదటే
మానిని యీగోవిందుడు మహిమల వాడే


22, ఆగస్టు 2023, మంగళవారం

పదము లంటితిని కదరా


పదము లంటితిని కదరా పలుకరా యింక
మదనగోపాల యెట్టి మాటలననురా

పాలు పెరుగులకు నీవు పైపై యిండ్లకు పోతే
చాలవా నాయింటి చల్ల లననురా
కాలునిలువక నీవు గడపలెన్ని మెట్టినా
చాలును తిరుగుళ్ళని సణగబోనురా

ఇంటికివచ్చిన సుదతుల నికిలించుచు పిలచినా
కొంటెవాడ తప్పనుచు కోపపడనురా
మంటిముద్దలోన నీకు మంచిరుచులు తోచినా
వెంటబడి నిన్ను నేను వెక్కిరించరా

నేనేగా శ్రీహరినని నీవు గొప్పలాడితే
నేనికపై వాదులాడి నిందించనురా
నేను జీవకోటికెల్ల నిక్కముగా పతినంటే
కానీరా అదే నిజముగా నమ్ముదురా