28, జనవరి 2026, బుధవారం

గోవుల కాచేవు చిన్నోడా

గోవుల కాచేవు చిన్నోడా నీది యేవూరయ్యా గోపయ్యా
యేవూరంటేను చిన్నమ్మీ మాది మీవూరేనే గోపమ్మా

మావూరైతేను చిన్నోడా మీది యేవీధయ్యా గోపయ్యా
యేవీధంటేను చిన్నమ్మీ మాది మీవీధేనే గోపమ్మా

మావీధైతేను చిన్నోడా మీది మరి యెవరిల్లయ్యా గోపయ్యా
మీవాళ్ళిల్లేను చిన్నమ్మీ మాది నీవెరిగినదే గోపమ్మా

నేనెరుగుదునా చిన్నోడా చెప్పు నీవారెవరో గోపయ్యా
మీనందరాజే చిన్నమ్మీ నిజము మానాన్నగారు గోపమ్మా

మీనాన్నగారే చిన్నోడా అవ్వ మానందరాజు గోపయ్యా
ఔనే అవ్వేమి చిన్నమ్మీ కండ్లకానదొ మాఠీవి గోపమ్మా'

ఆనుచున్నది ఠీవి చిన్నోడా వట్టి అల్లరి చేతల గోపయ్యా
ఆనేది యల్లరి చిన్నమ్మీ కండ్ల కానదు మాలీల గోపమ్మా

లీలలు విన్నాము చిన్నోడా తెలియలేకున్నామో గోపయ్యా
యేలాగు తెలియును చిన్నమ్మీ దాని నెఱుగరు సురలును గోపమ్మా

సురదుర్లభుడవా చిన్నోడా చాల చోద్యమెవ్వడవు గోపయ్యా
మరి యింకెవ్వాడ చిన్నమ్మీ నేను హరినే సత్యము గోపమ్మా

హరిదేవుడవా చిన్నోడా కృష్ణ యంజలించెదను గోపయ్యా
సరిసరి మ్రొక్కిన చిన్నమ్మీ నీవు తరియించినావు గోపమ్మా


1 కామెంట్‌:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు