31, జనవరి 2026, శనివారం

సుంత యోచించి చూడు


సుంత యోచించి చూడు  మంతకాంతకుండు లోన
చింతించుచు నుండు హరిని శ్రీరాముని చింతించుము

ఎంతదాక విష్ణుభక్తి యంతరంగ మందు పుట్ట
దంతదాక నజ్ఞానం బంతరించదు

ఎంతదాక భాగవతుల సంతసమున గొలువవో
యంతవరకు పామరత్వ మంతరించదు

ఎంతదాక విష్ణునామ చింతనమున మనసునిలువ
దంతదాక రిపువర్గం బంతరించదు

ఎంతదాక విష్ణురూప మంతరంగ మందు నిలువ
దంతదాక భవబంధము లంతరించవు

ఎంతదాక విష్ణుతత్త్వ చింతనమును చేయకుందు
వంతదాక నా యవిద్య యంతరించదు

ఎంతదాక నెల్లచోట్ల నీశ్వరుడగు హరియె తోచ
డంతదాక మిథ్యాజగ మంతరించదు

ఎంతదాక వెన్నునే నిరంతరముగ వేడవో
యంతదాక భవమోహం బంతరించదు

ఎంతదాక శరణాగతి చింతించవు శౌరికి నీ
వంతదాక మోక్ష మబ్బు టన్నది లేదు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు. అజ్ఞాతల వ్యాఖ్యలు ప్రచురించబడవు