19, జనవరి 2026, సోమవారం

శ్రీరామ రామ

శ్రీరామ రామ రాజీవలోచనా దు
ర్వారఘోరసంసారబంధమోచనా

సన్నుతాంగ నిన్ను నేను శరణుజొచ్చితి
నిన్నే నమ్ముకొంటినని నీవెఱింగియు
నన్ను కావరావే యిది న్యాయమేనా
యెన్ని యుగము లాయెను లెక్కించుకోరా

నమ్మలేదు గ్రహములను నరులను సురల
నమ్మలేదు వేరే దైవమ్ముల యునికి
నమ్ముకొన్న నీవు కూడ నన్ను విడచుట
నమ్మలేను నమ్మలేను నారాయణా

వేగ రమ్ము రామా సర్వేశ్వర నీవు
వేగ రమ్ము దీనబంధు బిరుదాంకిత
వేగ రమ్ము కరివరద వేగ రారా
వేగ రార నాతండ్రీ బింకమేలా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.