31, ఆగస్టు 2021, మంగళవారం

నీ సాటివాడనా నీకు బుధ్ధులు చెప్ప

నీ సాటివాడనా నీకు బుధ్ధులు చెప్ప
కౌసల్యానందన నీ దాసుడ నయ్యా
 
వెన్నుడవు రామ నీ వాపన్నశరణ్యుండవు  
నన్నేలు దేవుడవు నా రాముడవు
మన్నించి ముక్తినీక మరిమరి పుట్టించే
వన్నన్నా యిదియేమి యన్యాయము

పుడమి కీవు పంపనేల పురుషోత్తమా యీ
కడగండ్లు నాకెందుకు కరుణామయా
చెడనేల నిన్ను విడచి శిక్షించబడనేల 
అడుగనా యిదియేమి యన్యాయము

చింతలు తొలగింతువని చేరికొల్చు నాకు
చింతింప రాకపోకల చింతయిదేలా
వింతగా నిదినీకు వినోదంబుగ తోచు
నంతేగా యిదియేమి యన్యాయము

తన్ను తానెఱిగి హరి ధరమీద నిలచినట్లు

తన్ను తానెఱిగి హరి ధర మీద నిలచినట్లు
తన్ను తానెఱిగి సిరి ధరను వెలసె

వెన్నునకు నేటిపేరు వెన్నదొంగ కృష్ణుడు
చిన్నితల్లి రుక్మిణి యని సిరికి పేరు

వెన్నునకు నేటిపేరు వీరమథురకృష్ణుడు
అన్నులమిన్న ఆ అమ్మాయి బిరుదు

వెన్నునకు నేటిపేరు కన్నెదొంగ కృష్ణుడు
మన్ననతో సతికి జగన్మాతగ పేరు

చెన్నుమీఱ హరిని సిరి చేరుకొన్న తీరును
విన్నారా పసందైన పెండ్లివేడుక

వెన్నునకు నాటిపేరు వీరరఘురాముడు
వెన్నంటి సీత యనగ వెలసె నాడు లచ్చి

ఇన్నాళ్ళకు మరల హరి ఈ శ్రీకృష్ణుడాయె
వెన్నంటి రుక్మిణియై వెలసె నిదే లచ్చి



హరి నీకు సరిజోడు సరసాంగి లక్షణ

హరి నీకు సరిజోడు సరసొంగి లక్షణ
గురిచూచి మత్స్యమును కొట్టవయ్యా

ఈనాటి కృష్ణుడా ఆనాటి రాముడా
ఈనాడు విల్లువిఱచ నెంచకయ్యా
ఆనాటి యనుజుడా ఈనాటి యగ్రజడా
ఈనాడు విల్లువిరువబోను లేవయ్య

అన్ని విండ్లు నీశాంగ మంతటివి కావయ్యా
సున్నితము చూపకుంటె మన్నవయ్యా
అన్నయ్యా నిజమేలే ఆశివధనువు వలెగాక
చిన్నగా మోపెట్టెద చింతవద్దయ్య

గురితప్పని ఆనాటి కోదండరాముడవు
గురితప్పని ఈనాటి గోవిందకృష్ణుడవు
హరి యిదే మద్రపుత్రి వరమాల వేసినది
సరిజోడై లక్షణ నీసరసనే నిలచినది




అందముగా పలుకరేల హరినామములు

అందముగా పలుకరేల హరినామములు
ముందు ముందు మీకవి ముక్తిసోపానములు

హరినామము లన్నియు నందమైనవే కదా
హరినామము లన్నియు నతిమధురమేగా
మరియంత యందమైన మధురనామంబులను
మురియుచును పలుకరే ముద్దుముద్దుగా

మధుసూదనా యనుచు మధురముగ పలుకరే
మధురాతిమధురముగ మాధవా యనరే
అధరములా తేనెబా వంచులా యనిపించ
సుధామధురహరినామశోభ చెలగగా

రామరామ యనుటే ప్రాణమైన రసనపై
నామమెంత అందముగ నాట్యమాడేనో
స్వామి యెంత మెచ్చేనో చక్కగా మోక్షమే
ప్రేమతో నిచ్చేనో పిలువు డందముగా



కలకాలము నీపేరు నిలచియుండును

కలకాలము నీపేరు నిలచియుండును రామ
కలకాలము జనులు నిను కొలుచుచుందురు

జలనిధి యున్నంత వరకు జనులిల నున్నంత వరకు
కులగిరు లున్నంత వరకు కువలయ మున్నంత వరకు
జలరుహాక్ష ఆ సూర్యచంద్రు లున్నంత వరకు
నిలచియుండు నీపేరు నిశ్చయమ్ముగ రామ

వరమును లున్నంత వరకు సురవరు లున్నంత వరకు
హరికథ లున్నంత వరకు హరివరు డున్నంత వరకు
పరమపురుష నిజమై హరిపద ముండునంత వరకు 
వరదమగుచు నీపేరు ప్రబలియుండును రామ

పరమభాగవతోత్తములు వాయుసూను విభీషణులు
తరచుగ నినుదలచి లోన మురియుచుండు నంత వరకు
హరుడు నీ‌నామజపము మరువకున్నంతవరకు
తిరమగుచును నీపేరు తేజరిల్లును రామ

కోరి నీపాలబడితి గోవిందుడా

కోరి నీపాలబడితి గోవిందుడా లోకా
ధారుడా వీరుడా దశరథసుతుడా

శ్రీరమానాయకుడా చిత్తజగురుడా ధర్మ
వీరుడవై రాముడవై వెలసిన శౌరీ
ధారుణికి దిగివచ్చి దనుజులందరను బట్టి
పేరడచిన వాడా నీకు వేడకుందునా 
 
భూమిమీద భక్తులెల్ల పొగడుచుండగా సర్వ
కామితములు వారికి కలుగుచుండగ
ప్రేముడితో భక్తుల నీవేలుచుండగా పరం
ధాముడా నేను నీకు దాసుడగానా

సురలు నరులు మ్రొక్కుచుండ శోభిల్లువాడా నీకు
సరివారే లేరు రామచంద్రస్వామీ
ధరమీదను నీదు పేరు దశదిశల మ్రోగ ముక్తి
కరుణించు వాడా నిన్ను శరణువేడనా







ఇందిరారమణుడా యిందీవరాక్షుడా

ఇందిరారమణుడా యిందీవరాక్షుడా
ఎందుదాగి నావు గోవిందుడా

ఇంత మంచివాడవని యంత మంచివాడవని
యెంతెంతో నిన్ను వర్ణించి చెప్పిరే
యింతదనుక నీదు భక్తు లెల్ల రీశ్వరా విని
సంతోషముగ నీకు శరణంటినే

ఎరుగవయా సర్వభూతహృదయదేశంబు లందు
తిరముగా నుంటినని తెలిపిన దీవే
మరి నీవట నుండగానె యరిషడ్వర్గంబునకు
చొరనాయె నేమందువు హరి యిప్పుడు

రామరామ యనువానిని రక్షించుచు నుందువని
తామసుడు కలివాని దాకలేడని
యేమేమో వింటేనే యెంతో‌ నమ్ముకొంటినే
రామాభిధేయ హరి రావేలరా

హరిభక్తుడైతే చాలు నతడు ముక్తుడే

హరిభక్తుడైతే చాలు నతడు ముక్తుడే
పరుల కట్టి భాగ్యమావంతయు లేదు

పాపవనదహనదావానలము హరిభక్తి
పాపతూలముపాలిటి వాతూలము హరిభక్తి
పాపసర్పగారుడైమై పరగునీ హరిభక్తి
శ్రీపతి సద్భక్తునకే పాపమే లేదు

శ్రీపతి సద్భక్తుడైన తాపత్రయమే లేదు 
శ్రీపతి సద్భక్తుడైన కోపమునుబ్బును లేవు
శ్రీపతి సద్భక్తుడైన చీకుచింతలు లేవు
శ్రీపతి సద్భక్తుడైన లోపమే లేదు

రసనపై నిత్యమును రామనామముండగ
మసియై యిహవాంఛలు మాయమే‌కాగా
వెస వాని కబ్బ నిర్బీజసమాధిస్థితి
వసుధపై వాడు జీవన్ముక్తుడేను


30, ఆగస్టు 2021, సోమవారం

కోదండరామ హరి గోపాలకృష్ణ హరి

కోదండరామ హరి గోపాలకృష్ణ హరి
వేదాంతవేద్య హరి విబుధవినుత
 
హరిహరి దశరథనరపతినందన
హరిహరి కౌసల్యానందవర్ధన
హరి దేవకీసుత యదుకులనందన
హరిహరి యశోదానందవర్ధన

ఖరదూషణాదిక సురవైరి సంహర
పరమాత్మ రావణవంశనాశన
సరసిజనయన హరి శంఖచక్రధర
పరమాత్మ భూభారప్రశమనచణ

సుజనావన హరి సురశోకనాశన
కుజనాంతక నిత్యవిజయశీల
నిజభక్తపోష భవరుజావిమోచన
గజరాజవరద సామగానలోల
 

ఇంతబ్రతుకు బ్రతికి యిపుడేమి కోరమందువు

ఇంతబ్రతుకు బ్రతికి యిప్పు డేమి కోరమందువు
యింత విశ్రాంతి నొసగు మీశ్వరా యది చాలు

నిను వెదకికొనుచు నేను వినువీధిని తిరిగితి
వినుతశీల బ్రహ్మాండమును జల్లెడపట్టితి
కనులజూడ నీవెందును కానరాక యలసితి
కనిపించ కుందువుగా కలలోనైన

ఓటిపడవ లెక్కియెక్కి మాటిమాటికిని యీ
సాటిలేన దుస్తరభవసాగర మీదుచుంటి
మేటి మాయావి నీదు కోటయున్న దీవిని
నేటికిని కనులజూడ నేర్వనైతిని

రాముడా సర్వజగ ద్రక్షకుడా యికనైన
నామీద దయచూపవు న్యాయమా చెప్పరా
స్వామి యన్యథా నాకు శరణంబు నాస్తిరా
శ్యామలాంగ పిలిచి విశ్రాంతి నీయరా


పరవశించి పాడరే హరికీర్తనలు

పరవశించి పాడరే హరికీర్తనలు హరి
మురిసితే నబ్బునే మోక్షము మీకు
 
ధరమీదకు పనిగట్టుక తరచుగా వచ్చుట
నరులమేలు కొఱకు కదా నారాయణుని
కరుణ యింత గొప్పదై కనుపించుచుండగా 
హరిని గాక ఎవరిగొప్ప లాలపించేరో

హరేరామ హరేకృష్ణ యన్నంతనె మెచ్చెడి
స్మరణమాత్ర సంతుష్టుని చక్కనయ్యను
హరిని పొగడి మోక్షధన మార్జించుటను మరచి
నరుల సురల పొగడుటచే నొరిగెడి దేమి

హరిస్మరణము హరికీర్తన హరిసేవన మన్నవి
పురాకృతంబైన దొడ్దపుణ్యము చేత 
దొరకినవని తెలిసి మీరు తిరమైన బుధ్ధితో
పరవశించి హరిని గూర్చి పాడవలయును

29, ఆగస్టు 2021, ఆదివారం

శతకపరిచయం.


శతకపరిచయం అన్న పేరుతో వారానికి ఒక శతకం చొప్పున పరిచయం చేయాలని ఆశిస్తున్నాను.

నిన్ననే అగస్త్యలింగ శతకాన్ని పరిచయం చేయటం జరిగింది.

ఆసక్తికలవారు వీక్షించండి.

మాలికలో ఈబ్లాగు కలపటానికి కొంచెం సమయం పడుతుంది.

మా తెలుగుతల్లికి మల్లెపూదండ

కనీసం ఈపూట ఐనా ఈ పాటను వినండి.

 

(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)


(టంగుటూరి సూర్యకుమారి గారు పాడినది)

 

(ఈ వీడియోలో పాటతో పాటు సాహిత్యమూ చూపబండింది చక్కగా)

(శారద & లత పాడినది. నేపథ్యంలో బొమ్మలు చాలా బాగున్నాయి పాటతో పాటు)


చేయెత్తి జై కొట్టు తెలుగోడా....

(సంగీతం: ఘంటసాల గానం: ఘంటసాల & బృందం పల్లెటురు సినిమాకోసం పాడినది. రచన:వేములపల్లి శ్రీకృష్ణ)
(స్వరాభిషేకం కోసం బాలూ 2018లో పాడినది. శ్రీకృష్ణ గారి గురించి వివరాలతో)


వీరగంధము తెచ్చినారము....

(ట్రిపురనేని రామస్వామి చౌదరి గారి రచన, ఆకాశవాణి విజయవాడ వారు ప్రసారం చేసినది)


28, ఆగస్టు 2021, శనివారం

హరిని గూర్చి మనమేమి యనుకొనవలెనో

హరిని గూర్చి మనమేమి యనుకొనవలెనో
ధరనున్న వారలెల్ల రెఱుగవలయును 
 
హరిభక్తుల నాప్తులని యనుకొనవలెను
హరిమయమీ విశ్వమని యనుకొనవలెను
హరికన్యము నాస్తియని యనుకొనవలెను
హరి నెఱుగుట చాలునని యనుకొనవలెను

హరియె మంచిమిత్రుడని యనుకొనవలెను
హరియె పెద్దచుట్టమని యనుకొనవలెను
హరియె దొడ్ద గురువని యనుకొనవలెను
హరియె పరదైవతమని యనుకొనవలెను

హరేరామ హరేరామ యనుకొనవలెను
హరేకృష్ణ హరేకృష్ణ యనుకొనవలెను
హరి ప్రసాదమే చాలు ననుకొనవలెను
హరిని చేరుకొందునని యనుకొనవలెను

జయజయ శ్రీరామచంద్ర

జయజయ శ్రీరామచంద్ర భవభయహర శ్రీరామచంద్ర
దయానిధీ రామచంద్ర నిజదాసపోష రామచంద్ర

రవికులమణి రామచంద్ర దశరథనందన రామచంద్ర్ర
పవనజనుత రామచంద్ర సురవందిత హరి రామచంద్ర
భువనేశ్వర రామచంద్ర హరి పురుషోత్తమ రామచంద్ర
కువలయపతి రామచంద్ర వైకుంఠాధిప రామచంద్ర

ఋజువర్తన రామచంద్ర హరి ఋషిగణనుత రామచంద్ర
సుజనావన రామచంద్ర హతకుజనగణ రామచంద్ర
విజితదనుజ రామచంద్ర దేవేంద్రవినుత రామచంద్ర
విజయాన్విత రామచంద్ర రఘువీరాగ్రణి రామచంద్ర

నిగమవినుత రామచంద్ర హరి నీలవపుష రామచంద్ర
సుగుణాలయ రామచంద్ర హరి సుందరాంగ రామచంద్ర
జగదోధ్ధర రామచంద్ర హరి జానకీశ రామచంద్ర
విగతరాగ రామచంద్ర హరి సుగతిప్రద రామచంద్ర
 

25, ఆగస్టు 2021, బుధవారం

హరియిచ్చిన యన్నమే యమరును కాని

హరియిచ్చిన యన్నమే యమరును కాని
నరుడేమి సంపాదించు ధర మీదను

అదిచదివితి నిదిచదివితి నని పొంగునే కాని
చదివినట్టి చదువులన్ని చదివించిన దెవ్వడు
అదిచదివి యిదిచదివి యార్జించిన ధనముల
కుదురు వాడుపెట్టిన గొప్పభిక్ష కాదో

అది నేర్చితి నిది నేర్చితి నని యార్చునే‌ కాని
అదియు యిదియు నేర్చు నేర్పు నందించిన దెవ్వడు
అదినేర్చి యిదినేర్చి యార్జించిన ధనముల 
కుదురు వాడుపెట్టిన గొప్పభిక్ష కాదో
 
అందులకే హరేరామ హరేకృష్ణ యనవలె
బందీవై యహంబునకు పరమాత్ముని కాదని
తొందరపడి పలికితే దూరమురా మోక్షము
వందనమో హరి యని పొందు మపవర్గమును

24, ఆగస్టు 2021, మంగళవారం

నిద్దుర రాదాయె నాకు నీదయ వలన

నిద్దుర రాదాయె నాకు నీదయ వలన నిదుర
వద్దులే నీనామమె ముద్దు నాకు

అనుక్షణము నీతో నే నంటకాగి యుండగలనా
దినమంతయు పనిపాటులు తినివేయగా
మనసారా నీ నామమాధుర్యమాన సమయము
కనుగొనగ రాత్రి తప్ప కనబడదే

ఎన్ని నిన్ను కీర్తింప నెంతగానో కోరుదును
మన్నింపుము చాల పవలులు చన్నువృథలై
యన్ని దెసలు శాంతమగుచు నున్న రాత్రివేళ లందు
సన్నుతించెదను నేను నిన్ను రామా
 
ఎందుకయ్య మరల నిదుర నించుకంత విశ్రాంతి
చెందు నా తనువు నిన్ను చింతించుచు
నందువలన అమితమైన హాయి కలుగుచుండగను
పొందవలయునా నిదుర పురుషోత్తమ

రామరామ సీతారామ రాఘవేంద్ర యనరే

రామరామ సీతారామ రాఘవేంద్ర యనరే
రామనామ ముందే కలవు రక్తి ముక్తి యనరే

రామనామ నిత్యజపపరాయణుల మనరే
రామనామ మందే మేము రమియింతు మనరే
రామనామ మంటే మాకు ప్రాణమని యనరే
రామనామ మంటే మాకు బ్రహ్మపద మనరే

రామనామమునకు సాటిరావే సిరు లనరే
రామనామమునకు సాటిరావు పదవు లనరే
రామనామమునకు సాటి భూమిని లేదనరే
రామనామమునకు సృష్టి నేమితూగు ననరే

రామరామ యను వారికి రక్ష రాము డనరే
రామరామ యను వారికి రాదు నరక మనరే
రామరామ యను వారిక రారు భూమి కనరే
రామరామ  యనిన మోక్షరాజ్యము కలదనరే




23, ఆగస్టు 2021, సోమవారం

భామాకలాపం - 1978

( ఈ వీడియోను యూట్యూబులో చూడవలసి ఉంటుంది. నేరుగా టపాలో ప్లే కావటం లేదు) 


ఎప్పుడో 1978వ సంవత్సరంలో జరిగిన ఒక నృత్యప్రదర్శనం తాలూకు ఆడియో క్లిప్పింగ్ పంపారు శ్రీభాగవతుల సేతురాం గారు.

ఆయన శ్రీ భాగవతుల రామకోటయ్య గురువు గారి కుమారులు, స్వయంగా ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు.

మాశ్రీమతి శారద శ్రీ‌భాగవతుల రామకోటయ్య గారి శిష్యురాలు, ఆయన వద్ద కూచిపూడి నాట్యంలో డిప్లొమా చేసింది.

ఈ ఆడియోలో భామాకలాపాన్ని గురువుగారితో కలిసి పాడినది మా శ్రీమతి శారద. చాలా ప్రదర్శనల్లో గురువుగారితో కలిసి పాడినట్లు ఆమె చెబుతూ ఉంటుంది.

అప్పట్లో వీడియో రికార్డింగులు లేవు కదా. అందుకని ఆడియో రికార్డు మాత్రం కొంచెం ఉండి ఉంటుంది. ఫోటోలు కూడా ఒకటో అరో ఇంకా ఉండి ఉండవచ్చును. ఒక ఫోటో‌ జతచేసి సత్యభామగా చేసిన ఉమ గారు ఈ ఫిబ్రవరిలో యూట్యూబులో ఉంచారు. దానిని ఈరోజున సేతురాం గారు పంపగా చూసాం.

పెద్దపెద్ద కళ్ళ వాడు పెద్దింటి పిల్లవాడు

పెద్దపెద్ద కళ్ళవాడు పెద్దింటి పిల్లవాడు
ముద్దుముద్దు మాటల మోహనాంగుడు
 
కరిమబ్బు చాయవాడు సరిలేని సొగసుకాడు
మురిపించుమాటల మోహనాంగుడు
నరనాథు నెడదపైన తరుచుగా తోచువాడు
చురుకైన చూపుల సుందరాంగుడు
 
పొడుగుచేతు లున్నవాడు బోలెడన్ని పలుకులవాడు
బుడిబుడి యడుగుల మోహనాంగుడు
పడతికైక చెంగుబట్టి పవలెల్ల తిరుగువాడు
గడుసువా డమ్మచెంత కాని బజ్జోడు

పిలువగనె రామా యని కులుకుచు దరిచేరువాడు
మొలనూలుజార నెగురు మోహనాంగుడు
తలిదండ్రులకు వరమై తలచువారి పుణ్యఫలమై
యిలమీద వెలసినట్టి యీశుడీతడు

సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా

సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా
సత్యజ్ఞానమనంతము బ్రహ్మము చక్కగ నెఱుగుడు జనులారా
 
నరజన్మము కడు దుర్లభమన్నది నమ్ముడు మనసున జనులారా
నరజన్మమునకు నారాయణస్మరణము కర్తవ్యము జనులారా
మరచిన చెడుదురు మరువకెన్నడును హరిని స్మరింపుడు జనులారా
హరిభక్తుల యోగక్షేమములను హరియే చూచును జనులారా
 
హరియే గతియని త్రికరణశుధ్ధిగ హరినే నమ్ముడు జనులారా
హరియే పతియని అంతఃకరణము హరికర్పించుడు జనులారా 
హరియే గురుడని యాత్మను నమ్మిన నంతయు తెలియును జనులారా
హరిభక్తుల హృదయమ్ముల శ్రీహరి హాయిగ నిలుచును జనులారా
 
పంతగించి కలి మనసునదూరి భ్రమలు గొలుపునో‌ జనులారా
కాంతాకనకమ్ములకై భ్రమసిన కలుగును నరకము జనులారా
చింతలుమాని హరితత్త్వమునే చింంతించవలె జనులారా
అంతకుడెన్నడు హరిభక్తులతో నాడడు కయ్యము జనులారా
 
బ్ర్హహ్మాండాధిపుడపుగు శ్రీహరియే బ్రహ్మముసుండీ జనులారా
బ్రహ్మము శ్రీహరి రామచంద్రుడై వచ్చెను భూమికి జనులారా
బ్రహ్మము నెఱిగిన వాడును తప్పక బ్రహ్మమయుండగు జనులారా
బ్ర్హహ్మానందము బ్రహ్మము నెఱిగిన వారికె కలుగును జనులారా

శ్రీమన్నారాయణుడే రాముడు  సీతమ్మయె సిరి జనులారా
పామరత్వమును విడువుడు రాముని భజనచేయుడు జనులారా
రామనామము పెదవుల నుండిన రావు కష్టములు జనులారా
రాముని కరుణాసాగరు గొలిచిన రాదిక జన్మము జనులారా

22, ఆగస్టు 2021, ఆదివారం

భజే రామచంద్రం భజే రాఘవేంద్రం

భజే రామచంద్రం భజే రాఘవేంద్రం
భజే  కృపాసాంద్రం పతితపావనమ్

భజే జానకీ విభుం భజే మారుతీ విభుం
భజే కామదం విభుం భజే సర్వదం విభుం
భజే శక్తిదం విభుం భజే ముక్తిదం విభుం
భజే విభుం శ్రీకరం పతితపావనమ్

భజే నరేంద్ర వంద్యం భజే సురేంద్ర వంద్యం
భజే మునీంద్ర వంద్యం భజే త్రిలోక వంద్యం
భజే  మముక్షు వంద్యం భజే సుభక్త వంద్యం
భజే వందనీయమ్ పతితపానమ్

భజే వినీల దేహం భజే సుదీర్ణ బాహుం
భజే సురారి నాశం భజే మహాఘ నాశం
భజేధనుర్ధరేంద్రం భజే నరేంద్ర చంద్రం
భజే సుభక్తపోషం పతితపావనమ్






21, ఆగస్టు 2021, శనివారం

బంతులాడ రారా నేడు బాలకృష్ణా

బంతులాడ రారా నేడు బాలకృష్ణా నాతో
పంతగించి యాటలాడ బాలకృష్ణా

కొండంతైన బరువున్న కోదండను నెత్తినట్టి
గండరగండడవు నీవు కాదటయ్య
అండవై కోతులచే కొండలెత్తించి జలధిని
దండిగ వేయించిన దర్పమునే చూపర

బంతులవలె నెగిరించి పౌలస్త్యుని తలకాయలు
చింతదీర్చినావు గద సీతమ్మకు నీవు
అంతింతన రాని గొప్ప యశము గల రామచంద్ర
బంతులాడి నాచింతలను వరద నేర్పు చూపర

ఎంతో పెద్ద గోవర్ధననము నిట్టే కొనగోట చిన్న
బంతివలె నిలిపినట్టి బలము నీదటయ్య
గొంతెమ్మ కన్నబిడ్డల కొండలంత యిడుములను
చింతలను బంతులవలె చిమ్ము ఠీవి చూపర
 

20, ఆగస్టు 2021, శుక్రవారం

దేహినిరా నేను దేవదేవా

దేహినిరా నేను దేవదేవా మమ
దేహి ముక్తి  యన్నాను దేవదేవా

సురహృదయ చందనుడ సోమరవినయనుడ
నరపతి దశరథునకు నందనుడా
వరమునిగణ నుతుడ హరి పురుషోత్తముడ
కరుణను నన్నేలర కాకుత్స్థుడా
 
అసురుల నణచువాడ జన్నముల కాచువాడ
వసుధాసుతాప్రాణవల్లభుడా
దెసలదొరలు పొగడగ తేజరిల్లెడువాడ 
మసలక నన్నేలర మంచివాడా

కామితార్దదాయకుడ కళ్యాణకారకుడ
సౌమిత్రి యుక్తుడ సర్వేశుడా
సామీరి హృదయమున సంచరించెడు వాడ
ప్రేమతొ నన్నేలర శ్రీరాముడా

19, ఆగస్టు 2021, గురువారం

శ్రీ జై గొట్టిముక్కల నిర్యాణం.

 

కుటుంబ సభ్యులు అందించిన వివరాలు:

పూర్తిపేరు: గొట్టిముక్కల జై ప్రకాశ్ రావు  
వ్యవహారనామం: జై గొట్టిముక్కల  
జననం: అక్టోబరు 7, 1960 
నిర్యాణం: ఆగష్టు 1, 2021 
విద్యాభ్యాసం: BTECH,MBA 
నివాసం:  హైదరాబాదు 
ఉద్యోగ విశేషాలు: IIC TECHNOLOGIES - VICE PRESIDENT BUSINESS DEVELOPMENT and QUALITY ASSURANCE 
హాబీలు: పుస్తకపఠనం, ప్రయాణాలు. 
విదేశీ‌ప్రయాణాలు:  అనేక యూరోపియన్ దేశాలూ, యు.ఎస్. దేశాలను బహుపర్యాయాలు సందర్శించారు.
అనురక్తి:  తెలంగాణా పట్ల అపార ప్రేమ. 
కుటుంబం: భార్య, ఏకైక సంతానం కుమార్తె.



శ్రీ జై గొట్టిముక్కల గారు ఈనెల ఒకటవ తారీఖున ఉదయ సమయంలో పరమపదించారు.

ఈ విషాదవార్త నాకు ఇప్పడే తెలిసింది.

కొన్నాళ్ళుగా నేను బ్లాగుల్లో చురుకుగా లేక, జై గారు ఈమధ్యన బ్లాగుల్లో  కనబడటం లేదన్నది ఆలస్యంగా నిన్ననే గమనించాను.

వెంటనే వారికి ఈమెయిల్ పంపాను.

కానీ స్పందన రాలేదు. 

వారు సాధారణంగా నాకు వెంటనే స్పందిస్తారు. కాని జవాబు రాకపోవటం ఆదుర్దాను పెంచింది.

కొద్ది నిముషాల క్రిందట ఆయన నెంబరుకు ఫోన్ ఛేస్తే వారి సతీమణి గారు ఈదుర్వార్తను తెలిపారు.

జైగారు ఈ జనవరి నుండి కాన్సర్ కారణంగా అస్వస్థతకు గురియై ఉన్నారట. అస్పత్రిలో చికిత్సపొందుతూ ఉన్నారట.

బ్లాగు ప్రపంచంలో మంచి విషయపరిజ్ఞానమూ విశ్లేషణాపాటవమూ కలవారిగా జైగారికి మంచి పేరుంది. 

ఇక ఆయన మనకు దూరం కావటం పెద్దలోటే.

జై గారి ఆత్మకు ఉత్తమగతులు కలుగు గాక!

ప్రజాస్వామ్యం నవ్వులపాలౌతున్నదట కొత్తగా


ఈరోజున శ్రీమాన్ వేంకయ్య నాయుడు గారు ప్రజాస్వామ్యం నవ్వులపాలౌతున్నదని వాపోతున్నట్లు ఒక వార్త కనబడింది.  ఆంధ్రజ్యోతిలో ఉందీ వార్త

ప్రజాస్వామ్య వ్యవస్థను మన ఘనతవహించిన రాజకీయనాయకులు ఏనాడో నవ్వులపాలు చేసేసారు. ఇప్పుడు కొత్త ఏముంది?

చిన్న రాష్ట్రాల సిధ్ధాంతం అంటూ నాటకాలాడి తెలుగుగడ్డను రెండు ముక్కలు చేయటానికి భాజపా వారు ఆడిన నాటకం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయలేదా? 

నాటకం కాకపోతే తెలుగుగడ్డను అడ్డదిడ్డంగా ఆదరాబాదరాగా రెండుముక్కలు చేసిన తరువాత తామే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఎందుకు పాతరవేసారో?

నాటకం కాకపోతే ఏదో ఆంధ్రాకు న్యాయం చేయటానికి తెగ తసతహలాడుతున్నట్లు మాటలాడి తాము కేంద్రంలో అధికారంలోనికి వచ్చి నాలుకలు ఎందుకు మడతవేసి ఆంధ్రాకు అక్షరాలా తీరని ద్రోహం చేసినట్లో.

నాటకం కాకపోతే కేంద్రంలో అధికారం చేతికి రాగానే తమకు మిత్రపక్షంగా ఉన్న పార్టీని వేధించి దూరంపెట్టి ఆంధ్రాలో ఎదగాలని ప్రయత్నం చేసి ఇంకా అవకాశం కోసం అంగలార్చటాన్ని ఏమంటారో. 

తమ కుచేష్టలు ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేయలేదా? 

ఇప్పుడు ఆనాటకాల వెనుకనున్న ఒక పెద్దాయన తన మాట సభలో ఎవరూ వినటం లేదని ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేనట్లు నవ్వులపాలౌతోందని విచారం వెలిబుచ్చటం ఏమిటీ?

చీకటిగదిలో రాష్ట్ర విభజననాటకం ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసిననాడు తమకు చీమకుట్ఞినట్లు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎంత ఆదుర్దా!!


18, ఆగస్టు 2021, బుధవారం

వీరి వారి నాశ్రయించి వివిదకష్టములు పడక

వీరి వారి నాశ్రయించి వివిదకష్టములు పడక
శ్రీరాము నాశ్రయించి చింతలు బాయవే

ఒకరిచ్చే సొమ్ములతో నొకరోజు గడచునో
యొకమాసము గడచునో ఒకయేడే గడచునో
ఒకజన్మము గడచునటే వెఱ్ఱిమనసా భ్రాంతి
నికనైన విడువకున్న నేమి సౌఖ్యమే

ఉన్నవి లేనివి పలుకుచు నుర్విపైన తిరుగుచు
యెన్నిరాళ్ళు ప్రోగుచేసి యేమిలాభమే యవి
యెన్న డైన వెంట వచ్చు టున్నదా వాటికై
యెన్నాళ్ళని వీరివారి నెన్ని కొల్తువే

యేమి కల్ల ధనములే  యేమియూడిగములే
యేమి కల్ల బ్రతుకులే యేమి లాభము నీకు
రామచంద్రు డున్నాడే  రారమ్మని పిలుచుచును
స్వామి యిచ్చు ముక్తిధనమె సరియగు ధనమే

శ్రీరామాష్టోత్తరశతనామావళి - నామవిభజన

 
ఒక విశేషప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రీరాముల వారి అష్టోత్తరం పరిశీలించటం‌ జరిగింది.

ఆ సందర్భంలో ఇటీవల అందరూ అన్నింటికీ నెట్ ఆధారంగా చదువుతున్నది గమనికలోనికి వచ్చింది. ఈమధ్యనే ఒకరు నెట్ ఓపెన్ చేసి పూజాస్త్రోత్రాలు చదువుకుంటున్నట్లు చెప్పారు. ఐతే నెట్‌లో లభించే స్తోత్రాలు ఎంతవరకు తప్పులు లేకుండా ఉంటాయీ‌ అన్నది ఒక ప్రశ్న. ఆమాటకు వస్తే పుస్తకాల్లో చూసి చదివినా అదే పరిస్థితి కదా. అనేక ముద్రితప్రతుల్లో అచ్చుతప్పులు కుప్పలు తెప్పలు. పూజాశ్లోకాలైనా ఆ బాధ తప్పదు.

సరే,  నా దృష్టికి వచ్చిన రామాష్టోత్తరం నెట్‌లో పలు చోట్ల లభిస్తున్నది. దాదాపు అన్ని చోట్లా తప్పులతోనే ఉన్నది. చాలామంది సరిగా నూట యెనిమిది నామాలను ఇవ్వనేలేదు కొంచెం తక్కువ నామాలే చూపారు. ఆనందమయీ బ్లాగులో నూట యెనిమిదీ సరిగా చూపారు కాని ఒకటి రెండు తప్పులున్నాయి. ఉదాహరణకు వృక్ష అన్నారు ఋక్ష బదులు. 

అందుచేత నామవిభజన సరిగా చూపటం మంచిది అని ఈ టపా నిర్మిస్తున్నాను.  ముందు ఈ‌స్తోత్రం యొక్క సంస్కృతపాఠం చూదాం.

శ్రీ రామాష్టోత్తర శతనామ స్తోత్రం

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥

సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యవర్తనః ॥ 7 ॥

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః ॥ 8 ॥

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపూరుష ఏవ చ ॥ 12 ॥

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః ॥ 16 ॥

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ॥ 17 ॥

పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం

ఇతి శ్రీ రామాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణం

ఇప్పుడు ఇదే‌ పాఠాన్ని నామవిభజనతో సహా చూపుతున్నాను.  పాఠం అదే ఐనా ప్రతినామం ముందు ◇ ఒక గుర్తును ఉంచుతున్నాను గమనించండి. ఇలా గమనికతో చదివిన పక్షంలో శ్లోకాలుగా పారాయణం చేస్తున్నా నామాలు ఎక్కడివి అక్కడ స్ఫుటంగా తెలిసి ఉండటం మనస్సుకు సంతోషాన్నిస్తుంది కద.

◇శ్రీరామో ◇రామభద్రశ్చ ◇రామచంద్రశ్చ ◇శాశ్వతః ।
◇రాజీవలోచనః ◇శ్రీమా◇న్రాజేంద్రో ◇రఘుపుంగవః ॥ 1 ॥

◇జానకీవల్లభో ◇జైత్రో ◇జితామిత్రో ◇జనార్దనః ।
◇విశ్వామిత్రప్రియో ◇దాంతః ◇శరణత్రాణతత్పరః ॥ 2 ॥

◇వాలిప్రమథనో ◇వాగ్మీ ◇సత్యవా◇క్సత్యవిక్రమః ।
◇సత్యవ్రతో ◇వ్రతధరః ◇సదాహనుమదాశ్రితః ॥ 3 ॥

◇కౌసలేయః ◇ఖరధ్వంసీ ◇విరాధవధపండితః ।
◇విభీషణపరిత్రాతా ◇హరకోదండఖండనః ॥ 4 ॥

◇సప్తతాలప్రభేత్తా చ ◇దశగ్రీవశిరోహరః ।
◇జామదగ్న్యమహాదర్పదలన◇స్తాటకాంతకః ॥ 5 ॥

◇వేదాంతసారో ◇వేదాత్మా ◇భవరోగస్య భేషజమ్ ।
◇దూషణత్రిశిరోహంతా ◇త్రిమూర్తి◇స్త్రిగుణాత్మకః ॥ 6 ॥

◇త్రివిక్రమ◇స్త్రిలోకాత్మా ◇పుణ్యచారిత్రకీర్తనః ।
◇త్రిలోకరక్షకో ◇ధన్వీ ◇దండకారణ్యవర్తనః ॥ 7 ॥

◇అహల్యాశాపశమనః ◇పితృభక్తో ◇వరప్రదః ।
◇జితేంద్రియో ◇జితక్రోధో ◇జితామిత్రో ◇జగద్గురుః ॥ 8 ॥

◇ఋక్షవానరసంఘాతీ ◇చిత్రకూటసమాశ్రయః ।
◇జయంతత్రాణవరదః ◇సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥

◇సర్వదేవాదిదేవశ్చ ◇మృతవానరజీవనః ।
◇మాయామారీచహంతా చ ◇మహాదేవో ◇మహాభుజః ॥ 10 ॥

◇సర్వదేవస్తుతః ◇సౌమ్యో ◇బ్రహ్మణ్యో ◇మునిసంస్తుతః ।
◇మహాయోగీ ◇మహోదారః ◇సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥

◇సర్వపుణ్యాధికఫలః ◇స్మృతసర్వాఘనాశనః ।
◇ఆదిపురుషః ◇పరమపురుషో ◇మహాపూరుష ఏవ చ ॥ 12 ॥

◇పుణ్యోదయో ◇దయాసారః ◇పురాణపురుషోత్తమః ।
◇స్మితవక్త్రో ◇మితభాషీ ◇పూర్వభాషీ చ ◇రాఘవః ॥ 13 ॥

◇అనంతగుణగంభీరో ◇ధీరోదాత్తగుణోత్తమః ।
◇మాయామానుషచారిత్రో ◇మహాదేవాదిపూజితః ॥ 14 ॥

◇సేతుకృ◇జ్జితవారాశిః ◇సర్వతీర్థమయో ◇హరిః ।
◇శ్యామాంగః ◇సుందరః ◇శూరః ◇పీతవాసా ◇ధనుర్ధరః ॥ 15 ॥

◇సర్వయజ్ఞాధిపో ◇యజ్వా ◇జరామరణవర్జితః ।
◇శివలింగప్రతిష్ఠాతా ◇సర్వావగుణవర్జితః ॥ 16 ॥

◇పరమాత్మా ◇పరం బ్రహ్మ ◇సచ్చిదానందవిగ్రహః ।
◇పరంజ్యోతిః ◇పరంధామ ◇పరాకాశః ◇పరాత్పరః ॥ 17 ॥

◇పరేశః ◇పారగః ◇పారః ◇సర్వదేవాత్మకః ◇పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం  ||18||


ఐతే మనం పూజాకార్యక్రమం కోసం నామావళిని పఠించేదుకు ప్రతినామానికి మొదట ఓంకారాన్నీ చివర నమః అనీ చేర్చు చెప్తూ ఉంటాం కదా. పై విధానంలో 108 నామాల అమరికను స్పష్టంగా చూపటం జరిగినా పూజాదికాలకోసం చదివే విధానంగా చూపటం‌ అవసరం కాబట్టి ఆ పట్టికను ఇక్కడ ఇస్తున్నాను.

 

శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః ।
రాజీవలోచనః శ్రీమాన్రాజేంద్రో రఘుపుంగవః ॥ 1 ॥

  1. శ్రీరామో           ఓం శ్రీరామాయ నమః
  2. రామభద్రశ్చ         ఓం రామభద్రాయ నమః
  3. రామచంద్రశ్చ        ఓం రామచంద్రాయ నమః
  4. శాశ్వతః           ఓం శాశ్వతాయ నమః
  5. రాజీవలోచనః        ఓం రాజీవలోచనాయ నమః
  6. శ్రీమా            ఓం శ్రీమతే నమః
  7. న్రాజేంద్రో          ఓం రాజేంద్రాయ నమః
  8. రఘుపుంగవః       ఓం‌ రఘుపుంగవాయ నమః

జానకీవల్లభో జైత్రో జితామిత్రో జనార్దనః ।
విశ్వామిత్రప్రియో దాంతః శరణత్రాణతత్పరః ॥ 2 ॥

  1. జానకీవల్లభో        ఓం జానకీవల్లభాయ నమః
  2. జైత్రో            ఓం‌ జైత్రాయ నమః
  3. జితామిత్రో         ఓం‌ జితామిత్రాయ నమః
  4. జనార్దనః          ఓం జనార్ధనాయ నమః
  5. విశ్వామిత్రప్రియో      ఓం విశ్వామిత్రప్రియాయ నమః
  6. దాంతః           ఓం దాంతాయ నమః
  7. శరణత్రాణతత్పరః     ఓం శరణత్రాణతత్పరాయ నమః

వాలిప్రమథనో వాగ్మీ సత్యవాక్సత్యవిక్రమః ।
సత్యవ్రతో వ్రతధరః సదాహనుమదాశ్రితః ॥ 3 ॥
 

  1. వాలిప్రమథనో      ఓం వాలిప్రమథనాయ నమః
  2. వాగ్మీ           ఓం వాగ్మినే నమః
  3. సత్యవా          ఓం సత్యవాచే నమః
  4. క్సత్యవిక్రమః       ఓం సత్యవిక్రమాయ నమః
  5. సత్యవ్రతో         ఓం సత్యవ్రతాయ నమః
  6. వ్రతధరః          ఓం వ్రతధరాయ నమః
  7. సదాహనుమదాశ్రితః   ఓం సదాహనుమదాశ్రితాయ నమః

కౌసలేయః ఖరధ్వంసీ విరాధవధపండితః ।
విభీషణపరిత్రాతా హరకోదండఖండనః ॥ 4 ॥

  1. కౌసలేయః           ఓం‌ కోసలేయాయ నమః
  2. ఖరధ్వంసీ           ఓం‌ ఖరధ్వంసినే‌నమః
  3. విరాధవధపండితః       ఓం‌ విరాధవధపండితాయ నమః
  4. విభీషణపరిత్రాతా        ఓం విభీషణపరిత్రాత్రే‌ నమః
  5. హరకోదండఖండనః      ఓం హరకోదండఖండనాయ నమః

 సప్తతాలప్రభేత్తా చ దశగ్రీవశిరోహరః ।
జామదగ్న్యమహాదర్పదలనస్తాటకాంతకః ॥ 5 ॥

  1. సప్తతాలప్రభేత్తా చ        ఓం‌ సప్తతాళ ప్రభేత్తాయ నమః
  2. దశగ్రీవశిరోహరః          ఓం దశగ్రీవశిరోహరాయ నమః
  3. జామదగ్న్యమహాదర్పదలన    ఓం జామదగ్న్యమహాదర్పదళనాయ నమః
  4. స్తాటకాంతకః           ఓం తాటకాంతకాయ నమః

వేదాంతసారో వేదాత్మా భవరోగస్య భేషజమ్ ।
దూషణత్రిశిరోహంతా త్రిమూర్తిస్త్రిగుణాత్మకః ॥ 6 ॥

  1. వేదాంతసారో       ఓం వేదాంత సారాయ నమః
  2. వేదాత్మా          ఓం వేదాత్మనే‌ నమః
  3. భవరోగస్య భేషజమ్   ఓం భవరోగస్యభేషజాయ నమః
  4. దూషణత్రిశిరోహంతా   ఓం దూషణత్రిశిరో‌హంతాయ నమః
  5. త్రిమూర్తి          ఓం‌ త్రిమూర్తయే నమః
  6. స్త్రిగుణాత్మకః        ఓం‌ త్రిగ్రుణాత్మకాయ నమః

త్రివిక్రమస్త్రిలోకాత్మా పుణ్యచారిత్రకీర్తనః ।
త్రిలోకరక్షకో ధన్వీ దండకారణ్యవర్తనః ॥ 7 ॥

  1. త్రివిక్రమ        ఓం‌ త్రివిక్రమాయ నమః
  2. స్త్రిలోకాత్మా        ఓం త్రిలోకాత్మనే నమః
  3. పుణ్యచారిత్రకీర్తనః   ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః
  4. త్రిలోకరక్షకో       ఓం త్రిలోకరక్షకాయ నమః
  5. ధన్వీ           ఓం ధన్వినే నమః
  6. దండకారణ్యవర్తనః   ఓం దండకారణ్యవర్తనాయ నమః

అహల్యాశాపశమనః పితృభక్తో వరప్రదః ।
జితేంద్రియో జితక్రోధో జితామిత్రో జగద్గురుః ॥ 8 ॥

  1. అహల్యాశాపశమనః   ఓం అహల్యాశాపశమనాయ నమః
  2. పితృభక్తో         ఓం పితృభక్తాయ నమః
  3. వరప్రదః         ఓం వరప్రదాయ నమః
  4. జితేంద్రియో       ఓం జితేంద్రియాయ నమః
  5. జితక్రోధో         ఓం జితక్రోధాయ నమః
  6. జితామిత్రో        ఓం జితామిత్రాయ నమః
  7. జగద్గురుః       ఓం జగద్గురవే నమః

ఋక్షవానరసంఘాతీ చిత్రకూటసమాశ్రయః ।
జయంతత్రాణవరదః సుమిత్రాపుత్రసేవితః ॥ 9 ॥

  1. ఋక్షవానరసంఘాతీ  ఓం‌ ఋక్షవానరసంఘాతినే నమః
  2. చిత్రకూటసమాశ్రయః   ఓం చిత్రకూటసమాశ్రయాయ నమః
  3. జయంతత్రాణవరదః    ఓం జయంతత్రాణవరదాయ నమః
  4. సుమిత్రాపుత్రసేవితః     ఓం సుమిత్రాపుత్రసేవితాయ నమః

సర్వదేవాదిదేవశ్చ మృతవానరజీవనః ।
మాయామారీచహంతా చ మహాదేవో మహాభుజః ॥ 10 ॥

  1. సర్వదేవాదిదేవశ్చ        ఓం సర్వదేవాదిదేవాయ నమః
  2. మృతవానరజీవనః       ఓం‌ మృతవానరజీవనాయ నమః
  3. మాయామారీచహంతా చ   ఓం  మాయామారీచహంత్రే‌ నమః
  4. మహాదేవో            ఓం మహాదేవాయ నమః
  5. మహాభుజః           ఓం మహాభుజాయ నమః

సర్వదేవస్తుతః సౌమ్యో బ్రహ్మణ్యో మునిసంస్తుతః ।
మహాయోగీ మహోదారః సుగ్రీవేప్సితరాజ్యదః ॥ 11 ॥

  1. సర్వదేవస్తుతః        ఓం సర్వదేవస్తుతాయ నమః
  2. సౌమ్యో               ఓం సౌమ్యాయ నమః
  3. బ్రహ్మణ్యో             ఓం బ్రహ్మణ్యాయ నమః
  4. మునిసంస్తుతః        ఓం మునిసంస్తుతాయ నమః
  5. మహాయోగీ           ఓం మహాయోగినే నమః
  6. మహోదారః          ఓం‌ మహోదారాయ నమః
  7. సుగ్రీవేప్సితరాజ్యదః   ఓం సుగ్రీవేప్సితరాజ్యప్రదాయ నమః

సర్వపుణ్యాధికఫలః స్మృతసర్వాఘనాశనః ।
ఆదిపురుషః పరమపురుషో మహాపూరుష ఏవ చ ॥ 12 ॥

  1. సర్వపుణ్యాధికఫలః     ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
  2. స్మృతసర్వాఘనాశనః    ఓం‌ స్మృతసర్వాఘనాశనాయ నమః
  3. ఆదిపురుషః         ఓం ఆదిపురుషాయ నమః
  4. పరమపురుషో        ఓం పరమపురుషాయ నమః
  5. మహాపూరుష ఏవ చ   ఓం‌ మహాపురుషాయ నమః

పుణ్యోదయో దయాసారః పురాణపురుషోత్తమః ।
స్మితవక్త్రో మితభాషీ పూర్వభాషీ చ రాఘవః ॥ 13 ॥

  1. పుణ్యోదయో     ఓం పుణ్యోదయాయ నమః
  2. దయాసారః      ఓం దయాసారాయ నమః
  3. పురాణపురుషోత్తమః  ఓం‌ పురుషోత్తమాయ నమః
  4. స్మితవక్త్రో         ఓం స్మితవక్త్రాయ నమః
  5. మితభాషీ        ఓం‌ మితభాషిణే నమః
  6. పూర్వభాషీ చ      ఓం‌ పూర్వభాషిణే నమః
  7. రాఘవః         ఓం‌ రాఘవాయ నమః

అనంతగుణగంభీరో ధీరోదాత్తగుణోత్తమః ।
మాయామానుషచారిత్రో మహాదేవాదిపూజితః ॥ 14 ॥

  1. అనంతగుణగంభీరో      ఓం‌ అనంతగుణగంభీరాయ నమః
  2. ధీరోదాత్తగుణోత్తమః      ఓం ధీరోదాత్తగుణోత్తమాయ నమః
  3. మాయామానుషచారిత్రో    ఓం మాయామానుషచారిత్రాయ నమః
  4. మహాదేవాదిపూజితః       ఓం మహాదేవాదిపూజితాయ నమః

సేతుకృజ్జితవారాశిః సర్వతీర్థమయో హరిః ।
శ్యామాంగః సుందరః శూరః పీతవాసా ధనుర్ధరః ॥ 15 ॥

  1. సేతుకృ        ఓం సేతుకృతే నమః
  2. జ్జితవారాశిః       ఓం జితవారాశయే నమః
  3. సర్వతీర్థమయో    ఓం సర్వతీర్ధమయాయ నమః
  4. హరిః          ఓం హరయే నమః
  5. శ్యామాంగః      ఓం శ్యామాంగాయ నమః
  6. సుందరః       ఓం సుందరాయ నమః
  7. శూరః        ఓం శూరాయ నమః
  8. పీతవాసా      ఓం పీతవాససే నమః
  9. ధనుర్ధరః      ఓం ధనుర్ధరాయ నమః

సర్వయజ్ఞాధిపో యజ్వా జరామరణవర్జితః ।
శివలింగప్రతిష్ఠాతా సర్వావగుణవర్జితః ॥ 16 ॥
 

  1. సర్వయజ్ఞాధిపో     ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
  2. యజ్వా          ఓం యజ్వినే నమః
  3. జరామరణవర్జితః     ఓం‌ జరామరణవర్జితాయ నమః
  4. శివలింగప్రతిష్ఠాతా     ఓం శివలింగప్రతిష్టాత్రే నమః
  5. సర్వావగుణవర్జితః    ఓం సర్వావగుణవర్జితాయ నమః

పరమాత్మా పరం బ్రహ్మ సచ్చిదానందవిగ్రహః ।
పరంజ్యోతిః పరంధామ పరాకాశః పరాత్పరః ॥ 17 ॥

  1. పరమాత్మా         ఓం పరమాత్మనే నమః
  2. పరం బ్రహ్మ        ఓం పరబ్రహ్మణే నమః
  3. సచ్చిదానందవిగ్రహ    ఓం‌ సచ్చిదానందవిగ్రహాయ నమః
  4. పరంజ్యోతిః        ఓం పరస్మైజ్యోతిషే నమః
  5. పరంధామ        ఓం పరంధామాయ నమః
  6. పరాకాశః         ఓం పరాకాశాయ నమః
  7. పరాత్పరః        ఓం పరాత్మరాయ నమః

పరేశః పారగః పారః సర్వదేవాత్మకః పరః ॥
ఏవం శ్రీరామచంద్రస్య నామ్నామష్టోత్తరం శతం
॥ 18 ॥

  1. పరేశః      ఓం పరేశాయ నమః
  2. పారగః      ఓం పారగాయ నమః
  3. పారః       ఓ‌ం పారాయ నమః
  4. సర్వదేవాత్మకః  ఓం సర్వదేవాత్మకాయ నమః
  5. పరః       ఓం పరస్మై నమః

 

17, ఆగస్టు 2021, మంగళవారం

పరమానందముగా శ్రీరాముని భావనచేయవయా

పరమానందముగా శ్రీరాముని భావనచేయవయా
స్మరణాన్ముక్తి కదా కలియుగమున సంశయ మెందుకయా

వేలకొలది సంవత్సరములుగా భీషణముగ తపము
నేలాగున నొనరించెదమయ్యా ఈశ్వరు డిచ్చునదే
చాలీచాలని నూరేండ్లాయువు జనులందరకీ కలిని
కాలుడు వచ్చెడు లోపల స్మరణమె కాని చేయగలవా
 
చీటికిమాటికి కాసులకొఱకై చిందులు వేయుచును
కూటికి గుడ్డకు నటునిటు పరుగిడు కువలయ వాసులకు
నోటికి సత్యవ్రతమను మప్పుట యేటిమాట నరుడా
కాటికి పోయెడు లోపల స్మరణమె కాని చేయగలవా

భక్తవత్సలుని సీతారాముని పంచన చేరవయా
శక్తికొలదిగా భగవన్నామము జపమును చేయవయా
భుక్తిని ముక్తిని రాముడిచ్చునని పూర్తిగ నమ్మవయా
యుక్తి నీకు శ్రీరాముని స్మరణమె భక్తిగ చేయవయా


16, ఆగస్టు 2021, సోమవారం

నోరారా హరినామము నుడివిన చాలు సంసారమనే మాయతెర జారిపోవును

నోరారా హరినామము నుడివిన చాలు సం
సారమనే మాయతెర జారిపోవును

మాటకిని హరినామము మధురముగ గాను కడు
ధాటిగాను సూటిగాను నోటిగూటి చిలుక
పాటించి వ్రతము గాను పాడుచుండ గాను
నేటి నుండా మాయతెర మాటయె లేదు 
 
హరే రామ అని నిత్యము నతిసులువు గాను అతి
కూరిమితో పలుకు నోటిగూటిలోని చిలుక
శ్రీరాముని పేరుచెప్పి చించివేసె గాన
ఔరా యింకా మాయతెర అన్నదె లేదు

మాయతెరను రామనామమహిమ తొలగజేయ
హాయిగాను నోటిగూటి యందమైన చిలుక
చేయుచుండ రక్తిమీఱ శ్రీరామజపము
నాయమోఘస్వస్వరూప మదియెఱుకౌను




బలవిషయము


శ్రీరామచంద్రప్రభో, నేను బలవంతుడనా బలహీనుడనా యనునది యొక ప్రశ్న.
 
పరబ్రహ్మమస్వరూపుడ వైన నీ యండ నాకుండ నేను బలవంతుడనే యగుదును కాని బలహీనుడ నెట్లగుదుని యింతింతనరాని నమ్మక మొక ప్రక్క స్థిరముగా నున్నది. నాదేమి బల మీభవసాగరము నీదలే కున్నాను కదా యీది యావలి యొడ్డునకు చేరి జయపతాకము నెగురవేసిన వాడు బలవంతుడు కాని నాది హీనబలమే కావుననే కదా వందలకొలది యుపాధులలో దీని నీదియీది మరల నిప్పుడీ నరోపాధిని కూడ నీదుచున్నాను. ఈజన్మమున కూడ నీ యీదుట ముగియునట్లు లేదు కదా, యెంతటి దుర్బలుడ నన్న విచారము కూడ దిట్టముగానే యున్నది. ప్రభో నీవే నన్ను బలవంతునిగా తీర్మానించిన పక్షమున బలవంతుడ నగుదును కాని యెడల బలహీనుడనే యగుదును. అదియే సత్యము.

ప్రపంచమున మానవులు వివిధ కారణముల వలన తమను తాము బలవంతులమని లెక్కించుకొనుచున్నారు.

కొందరివద్ద విశేషముగా ధనముండును. అట్లు విశేషధనసంపద కలవారినే లోకులు కలవారని వ్యవహరించు చున్నారు. పదిమంది బిడ్డలు కలవానిని జనులు కలవాడనరు. పదిపదుల కధికముగనే విశేషముగా బంధుగణమున్న వానిని లోకులు కలవాడనుట లేదు. బహుశాస్త్రపాండిత్యము కలవానిని లోకులు కలవా డనుట లేదు. చివర కతీంద్రియశక్తులు కలవాని నైనను లోకులు కలవాడనుట లేదు. నాలుగు కాసులు తమకంటె హెచ్చుగా కలిగిన వానిని మాత్రమే కలవా డనుచున్నారు కదా. ఆకలవారే బలవంతులని లోకవ్యవహారముగ నున్నది. అట్లే ధనము దండిగ కలవారును లోకవ్యవహారము ననుసరించి తామే బలవంతులమను భ్రమతో మిక్కిలి గర్వము చూపుచున్నారు. నేడున్న నేమాయె రేపకడ నిలకడ కలదా ధనమున కన్న స్పృహ వారికి కలుగదే. నిలుకడ లేని ధనము కలవారి బలమును నిలుకడలేనిదై నమ్మరానిది కదా. కావున ధనబలము నిక్కమైన బలము కాదు. కానే కాదు రామచంద్రప్రభో.

బలమనగా ప్రాథమికముగా శారీరక బలమే బలమను భావన జనసహజమై యున్నది. స్ర్రీబాలవృధ్ధులు బలహీనులును యువకులు బలవంతులు ననునది జనాభిప్రాయము. ఉపాధి ననుసరించి బలాబలములు ప్రకృతిలో హెచ్చుతగ్గులుగా నుండుట సర్వవిదితమే. ఒక ఈగ కన్న నొక తొంద బలమైనది. ఆ యొక తొండ కన్న కాకి బలమైఅది. ఆ కాకి కన్న గ్రద్ద బలముకలది. ఎలుక కన్న పిల్లి బలమైనది.ఆ పిల్లి కన్న కుక్క బలమైనది. కుక్క కన్న నేనుగు బలమైనది. కాని యెంత పెద్ద గజమైనను వార్ధకము కారణముగా కదులలేని స్ధితికి వచ్చిననాడు దాని కంటెను దాని ముందే పరుగులుతీయు నొక యెలుక దానికన్న బలమైనది యగుచున్నది కదా. ఒక బలమైన మొసలి నీటిలో నుండగా దేనినైనను పట్టవచ్చును కాని యొడ్డున నున్న వేళ నొక కుక్కయైనను దానితో పరాచికము లాడనేర్చునే కదా. కావున నుపాధి గతమైనదో వయోవస్థాశ్రయమైనదో యగుచున్నట్టి శారీరకబల మేమి బలము. అది నిక్కమైన బలమే కాదు. కానే‌ కాదు రామచంద్రప్రభో.

అధికారము కలవారిని జనులు బలవంతులని యందురు. పూచికపుల్ల వంటి రూపురేఖలున్న వాడైనను వాడు రాజోద్యోగి యగుచో జనులు వాని యధికారబలమును గమనించి భయభక్తులతో మెలగుచుందురు. అధికారి యవివేకి యగచో వాని యాశ్రితులును బంధుమిత్రులును కూడ లేనిపోని బలప్రదర్శనములు చేయుచుందురు. ఒక డధికారము కొంత కలవా డగుచో మరికొంతగ నధికారము కలవా డింకొకడు వాని నెత్తిపై నుండును. పైవానికి నచ్చని నాడు క్రిందివానికి యధికారము చేజారును. సర్వాధికారి నని భావించు రాజును మరొకడు కూలద్రోయ వచ్చును. కాలగతి ననుసరించి చెడుచుండు నధికారముల వలన నబ్బు బలము నమ్మదగినది కాదు.  కావున నది నిక్కమైనబలము కాదు. యెన్నటికి కాదు రామచంద్రప్రభో.

విద్యావిషయమకై మనుజుల మధ్య స్పర్ధ యుండుటను చూచుచునే యున్నాము. ఒక పండితునకు మరొకనితో పదిమంది ముందు తలపడవలసిన పరిస్థితి వచ్చుచున్నప్పుడు వారిలో నొకడు ఆవలి వానిని గూర్చి తనకంటే వాడు బలవంతుడని యనుచున్నాడు లేడా వాడు బలహీనుడు పొమ్మనుచున్నాడు. ఎవనికి ఏతఛ్ఛాస్త్రవిషయమకమై పాండిత్యమధికమో వాడు వారిద్దరిలో బలవంతుడని లోకోక్తిగా నున్నది. సమస్తమైన కళలవిషయముగా నిట్టి వ్యవహారమున్నది. కాని నేడు ఒక కళలో కాని శాస్త్రములో కాని బలమైనవాడుగా నున్న వ్యక్తి మరొక దినమున వయస్సు కారణముగనో మరొక కారణముగనో బలహీనపడవచ్చును. కావున విద్యాప్రజ్ఞయే నిలుకడగల బలమని భావించుట యసంగత మగుచున్నది. కావున విద్యాప్రజ్ఞ నిక్కమైన బలము కాదు కదా రామచంద్రప్రభో

ముఖ్యముగా దైవబలమని యొక బలమున్నదని చెప్పుదురు. ఇట్టి బలము కలవారిలో గొప్పవాడు ప్రహ్లాదుడని పెద్దల వాక్యము. హిరణ్యకశిపుడు తన కన్నకొడుకనియును దయజూపక బాలప్రహ్లాదుని చంపుటకునై రకరకములుగా ప్రయత్నించి విఫలుడై విసివి ఓరి పిల్లవాడా నిన్ను చంపుట దుస్సాధ్యముగా నున్నదే ప్రపంచములో నాకన్న బలశాలి లేడే నీ‌బల మేమిరా యింత దుస్సహముగా నున్నదీ నీవెవ్వని బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడవై యని ఆశ్చర్యపడగా బాలుడు సంతోషముగా

బలయుతులకు దుర్భలులకు 
బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్ 
బల మెవ్వఁడు ప్రాణులకును 
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!

అన్నాడు కదా స్వామీ అట్టిది కదా దైవబలమనగా. లోకమును సృష్టించుటకు తగిన బలము బ్రహ్మకెక్కడి దది నీవిచ్చినదే‌ కద. ఆ సృష్టిలో యేప్రాణికైన నిక్కమైన బలమనిన ది నీవిచ్చినదే‌ కదా. 

రామచంద్రప్రభో నాకు నీవే‌ బలము. నీ‌యండ చూచుకొనియే  నేను నిశ్చయముగా నెల్లప్పుడును నిబ్బరముగ నున్నాను.

ధన్యోస్మి.
 
 

15, ఆగస్టు 2021, ఆదివారం

మానస జపజప రామనామం మంగళకరనామం

మానస జపజప రామనామం మంగళకరనామం
ప్రాణాధికప్రియపావననామం భవతారకనామం

జపజప త్రిభువనకారణనామం జపజప హరినామం
జపజప త్రిభువనపోషకనామం జప రఘుపతినామం
జపజప భక్తాభీష్టదనామం జపజప హరినామం
జపజప దీనజనావననామం జప జయకరనామం
 
జపజప యోగీంద్రార్చితనామం జపజప హరినామం
జపజప సురవరసేవితనామం జప శివనుతనామం
జపజప దానవవారణనామం జపజప హరినామం
జపజప పాపవిదారణనామం జప కులగురునామం

జపజప మారుతిసేవితనామం జపజప హరినామం
జపజప భూమిసుతార్చితనామం జపసౌఖ్యదనామం
జపజప నిగమసుఘోషితనామం జపజప హరినామం
జపజప సర్వార్ధప్రదనామం జప మోక్షదనామం

14, ఆగస్టు 2021, శనివారం

నిన్నే నమ్మితిరా శ్రీరామా

నిన్నే నమ్మితిరా శ్రీరామా  నీదయ చాలునురా
కన్నుల పండుగగా నిను నేను  కానగ నడిగెదరా

ధనముల నమ్మితి మోసపోయితిని మునుపటి భవములను
వనితల నమ్మితి మోసపోయితిని బహుజన్మము లందు
మనుజుల నమ్మితి మోసపోయితిని మరి పలుమారులుగ
విను మన్నిటనే మోసపోయితిని వీఱిడి నైతినిరా

గురువుల గొల్చితి మోసపోయితిని గురువులు లౌకికులే
కరచితి విద్యల మోసపోయితిని కావవి పరమునకు
సురలను గొల్చితి మోసపోయితిని సురలు ముక్తి నీరే
హరి నేనెంతో మోసపోయితిని ఆర్తుడ నైతినిరా

పరమదయాళుడ వని విని నిన్నే భావించితి మదలో
పరమాత్మా నను నీట ముంచెదవొ పాలను ముంచెదవో
మరి నీయిష్ఞము తోచినరీతిగ మలచుకొనుము నన్ను
వరదాయక  యిక నీచిత్తము నాభాగ్యము రామయ్యా







శ్రీరామునకు జయమనరే సీతాపతికి జయమనరే

శ్రీరామునకు జయమనరే సీతాపతికి జయమనరే
కూరిమి తోడుత మనదేవునకు గోవిందునకు జయమనరే

సూనశరారిశరాసనవిదళన సుందరమూర్తికి జయమనరే
దానవలోకవిమర్దనశీలికి దశరథసుతునకు జయమనరే 
మౌనీంద్రగణార్చితశుభమూర్తికి మోహనమూర్తికి జయమనరే
జ్ఞానానందమయాకృతి కద్భుతసత్యకీర్తికి జయమనరే

పాపారణ్యవినాశనకరదావానలమూర్తికి జయమనరే
తాపత్రయదుర్మదవేదండప్రతారణశీలికి జయమనరే
భూపాలకగణసంసేవితశుభమూర్తికి నిత్యము జయమనరే
రూపవిజితశతకోటికుసుమశరసురుచిరమూర్తికి జయమనరే

భవవిధ్వంసనపావనమూర్తికి భక్తవరదునకు జయమనరే
పవమానసుతార్చితచరణునకు వంద్యచరితునకు జయమనరే
అవనీతనయాహృదయకమలప్రభాకరమూర్తికి జయమనరే
దివిజాధిపబ్రహ్మాదికసంస్తుత దివ్యమూర్తికిదె జయమనరే


శ్రీరామచంద్ర నీవు నా చిత్తమున నిలువుమా

శ్రీరామచంద్ర నీవు నా చిత్తమున నిలువుమా
కూరిమితో నిన్ను కొలుచుకొందు నానందముగా

శ్రీరామచంద్ర నీ చరితము చేసెద పారాయణము 
శ్రీరామచంద్ర నీ నామము చేసెద ననునిత్యము
శ్రీరామచంద్ర నీ గుణమును చెలగి కీర్తించెదను
శ్రీరామచంద్ర నీ శౌర్యము నూరూరా చాటెదను
 
శ్రీరామచంద్ర నాకు ప్రాణాధారము నీవందును
శ్రీరామచంద్ర నీవే నా జీవనమని యందును
శ్రీరామచంద్ర నెన్నెప్పుడు  సేవించుచు నుందును
శ్రీరామచంద్ర నాభాగ్యము నీరక్షణ యందును
 
శ్రీరామచంద్ర సీతాపతి క్షితిమండల నాయకా
శ్రీరామచంద్ర యోగిరాజసేవ్యమాన పాదుకా
శ్రీరామచంద్ర సర్వలోక క్షేమంకర రాఘవా
శ్రీరామచంద్ర భవార్ణవతారకా మహాప్రభో

 

12, ఆగస్టు 2021, గురువారం

అతడెవడయ్యా ఆరాముడు

అతడెవడయ్యా ఆరాముడు
వ్రతముగ పొగడుచు పాడెదరు

చిఱుచిఱు నగవులు చదరని వాడు
కరుణను బరపెడు కనుగవ వాడు
పరమమధురమగు పలుకులవాడు
నిరుపమానుడు రాముడు

పరమనిశితమగు శరముల వాడు
కరమరుదగు విక్రమము గలాడు
సురహితకరుడను బిరుదు గలాడు
పరమయశస్వి రాముడు

వరములు నిరతము కురిసెడు వాడు
నరనాయకగణపతి యగు వాడు
నరునిగ వెలసిన హరియగు వాడు
పరమాత్ముడు మారాముడు

శ్రీరవికులపతి శ్రీరామా

శ్రీరవికులపతి శ్రీరామా నా
భారము గైకొనవయ్యా

కుజనులు నిందలు కురిసెడు వేళ
స్వజనము తప్పులు పట్టెడు వేళ
రుజలకు దేహము లొంగెడు వేళ
సుజనావన దయజూపుమురా

తనవున స్వాస్థ్యము తప్పెడు వేళ
మనసున శాంతియె మసకగు వేళ
కనులకు నిదురయె కరువగు వేళ
నను కాపాడర నారామా

కలిమాయలు నను క్రమ్మెడు వేళ
కలబడి కాలుడు కట్టెడు వేళ
కలవలె బ్రతుకే కరిగెడు వేళ
తలగాచగదే దాశరథీ










10, ఆగస్టు 2021, మంగళవారం

పొగడ కుందునె రామ పురుషోత్తమా నిన్ను పొగడినదె సుదినము పురుషోత్తమా

పొగడ కుందునె రామ పురుషోత్తమా నిన్ను
పొగడినదె సుదినము పురుషోత్తమా
 
విరచించి జగముల పురుషోత్తమా నీవు
పరిరక్ష సలిపెదవు పురుషోత్తమా
పరమభక్తుల కెపుడు పురుషోత్తమా నీవు
వరములిచ్చెదవయ్య పురుషోత్తమా

పరమార్తుల యెడ పురుషోత్తమా నీవు
కరుణజూపుదు వయ్య పురుషోత్తమా
కరుణతో సుజనుల పురుషోత్తమా నీవు
దరిజేర్చు చుండెదవు పురుషోత్తమా

తిరముగ నమ్మితిమి పురుషోత్తమా నీవు
కరమొసగి చేదుకో పురుషోత్తమా
కరుణించితే నీవు పురుషోత్తమా నాకు
మరల పుట్టువు లేదు పురుషోత్తమా

9, ఆగస్టు 2021, సోమవారం

శ్రీరామయ్యా శ్రీరామయ్యా చేరితిమయ్యా నీకడకు

శ్రీరామయ్యా శ్రీరామయ్యా చేరితిమయ్యా నీకడకు
నేరము లెంచక శ్రీరామయ్యా కూరిమితో రక్షించవయా
 
తాపత్రయములు కలవారమయా తప్పక నది నిజమేనయ్యా
లోపముగా నది మది నెంచకుము రూపరె తాపత్రయ మెపుడో
మీ పావన తారకనామముచే తాపత్రయములు తొలగెనయా
మీ‌పాదములను పట్టితిమయ్యా కాపాడవయా రామయ్యా
 
పాపులమన్నది నిజమే‌నయ్యా పాతది యని యా సంగతిని
లోపముగా లోలోన నెంచకుము రూపరె నయ్యా పాపములు
మీపావన పాదాబ్జంబులనే మిక్కిలి ధ్యానము చేయుటచే
కాపాడవయా కాపాడవయా కౌసల్యానందన రామా
 
రూపర కున్నవి భవబంధములు శ్రీరామయ్యా నేటికిని
లోప మిదే మము బాధించునయా యోపము మరల పుట్టుటకు
యే పగిదిని భవబంధము లూడ్చెదొ యీశ్వర యిక నీ చిత్తమయా
కాపురుషులమని కఠినత జూపక  కాపాడవయా రామయ్యా

ఆదరించు రాముడున్నా డది చాలదా

ఆదరించు రాముడున్నా డది చాలదా మీ
వేదనలు తొలగు నా వేడుక చాలదా

నిరంతరము శ్రీరాముని నెమ్మదిని తలచితే
దురితంబు లన్నియును తొలగునందురు
దురితకర్మఫలములే యాధివ్యాధులందురే
మరి యవి తొలగుటయే‌ మనకు చాలదా

పవలురేలు శ్రీరాముని భావించెడు వారికి
భవబంధము లుడుగునను పలు కున్నది
భవబంధమోచనమే ప్రతిజీవుని కోరునది
అవలీలగ నిట్లు దొరకు నది చాలదా

మరువక శ్రీరామచంద్రుని మదిలోన తలచితే
మరి పుట్టువు లేదని యొక మాట యున్నది
మరల పుట్టకుండుటె మనకు కావలసినది
హరిస్మరణం బటులచేయు నది చాలదా

వీధులవీధుల విహరించుచు హరిగాధలు పాడరె ఘనులారా

వీధులవీధుల విహరించుచు హరిగాధలు పాడరె ఘనులారా
మాధవనామస్మరణగానములు మప్పరె జనులకు ఘనులారా
 
విశ్వాత్ముడు హరి దశరథసుతుడై విచ్చేసిన కథ విశదము చేయుచు
విశ్వామిత్రుని యాగము గావగ వెడలెడు రాముని విక్రమమెంచుచు
విశ్వమోహనుడు హరుని వింటిని విఱచిన కథను వినిపించుచును
విశ్వజనకులు సీతారాముల పెండ్లిముచ్చటలు విస్తరించుచును 

జనకును యానతి మేరకు రాముడు వనముల నుండగ నఱిగిన విధమును
వనముల సీతారాముడు ఖరదూషణుల తీండ్రము నణచిన విధమును
మునుకొని రావణుడను రక్కసుడు జనకజ నెత్తుకపోయిన విధమును
ఘనుడా యినకులపతి పౌలస్త్యుని దునుమి నిజసతిని గూడిన విధమును
 
సీతారాముల చరితము శ్రవణము చేసిన మోక్షము సిధ్ధము సుమ్మని
ప్రీతిగ జనులకు బోధించుచును వేడుక మీఱగ దేశదేశముల
ఖ్యాతిని గాంచిన కమలానాథుని కరుణను చాటుచు కలయదిరుగుచు
భూతలమున సద్భక్తులు జీవన్ముక్తు లన్నది మిక్కిలి చాటుచు


8, ఆగస్టు 2021, ఆదివారం

అవలియొడ్డు నకు చేర్చు నందమైన నౌక

అవలియొడ్డు నకు చేర్చు నందమైన నౌక
భవసాగరమును దాటు బంగరు నౌక
 
సుజనులే తరచుగా సొచ్చుచుండు నౌక
కుజనులే సంశయించు గొప్పనౌక
ధ్వజమున ఖగరాజుగల విజయనౌక
సజావుగా ప్రయాణించు చక్కనినౌక 

రామనామ నౌక భలే రమ్యమైన నౌక
రామభక్తులందరు చేరు రాజనౌక
ప్రేమతోడ హరిపంపిన పెంపగు నౌక
తామసికులు చేరగా తలచని నౌక

ఎక్కువారలను కే విమ్మనదీ నౌక
పెక్కుడు సౌకర్యముల పెద్దనౌక 
మిక్కిలిగా భక్తులు ప్రేమించెడు నౌక
చక్కగా కైవల్యపురికి సాగెడు నౌక

7, ఆగస్టు 2021, శనివారం

జయజయ రామా జగదభిరామా

జయజయ రామా జగదభిరామా 
జయజయ కరుణాసాగర రామా
 
జయజయ రామా జలధరశ్యామా
జయజయ లక్ష్మణసమేత రామా 
జయజయ రామా జానకి రామా
జయజయ రామా సాకేత రామా
 
జయజయ ధర్మవిచక్షణ రామా
జయజయ అటవీసంస్థిత రామా
జయజయ రావణసంహర రామా
జయజయ సురగణ సన్నుత రామా

జయజయ రామా జయ శుభనామా
జయజయ మునిజన సన్నుత నామా
జయయ రామా జననుత నామా
జయజయ భవభయసంహర నామా 


ఒక్కసారి మ్రొక్కుబడిగ పొగడి యూరకుందుమా

ఒక్కసారి మ్రొక్కుబడిగ పొగడి యూరకుండునా
పెక్కుభంగులను పొగడి వేడుక పొందేనా
 
తినగ తినగ గారెలు చేదెక్కినట్లు కాదు కదా
అనగననగ రామనామ మందు రుచియణగుటకు 
అనని కొలది రుచిమరిగి అంతరంగము శ్రీరామ
గుణనామ కీర్తనముల గొప్పగా చేయును కద

వినినకొలది వినువారికి విసువుబుట్ట జాలదు కద
వినగవినగ రాముని గుణవిశేషములు కథలును
మనసుకెక్కి మరియు గ్రోల మనసగుచు నుండు కద
తనివితీర రామసంకీర్తనము తాను చేయును కద

శ్యామసుందరు జగన్మోహ నాకారము నరయుట యన
పామరున కైన కనులపండువయే యగును కద
స్వామి నెంత కీర్తించిన చాలు ననిపించేనా
యేమాత్రము విసువులేక యెంతో పొగడుచుండు కద

అలసియున్న వారమురా ఆదుకోరా

అలసియున్న వారమురా ఆదుకోరా
నళినాక్ష యిక జగదానందకారకా

రామా నీవార మని రక్షించ వలయు నని
నీమనసున నెఱుగవా నిజము గాను
యే మందుము భవవార్ధి నీదలే మందుము
మా మనవిని వినుటకే మనసురాదా

రామా బహుజన్మ లెత్తి నాము తండ్రీ సుఖ
మేమియు మేమెఱుగ మెన్న డేని
స్వామీ యికనైన మమ్ము చల్లగా చూడరా
ఈ మహాభవాబ్ధి దాటించ రారా

మాటిమాటికిని బుట్టి మరచి నిన్నే యిట
కూటికిని గుడ్డకును గుడుసుపడుచు
నేటికీ భవవార్నిధి నీదు లాడుదుమయా
దాటించర రామచంద్ర దయతో నీవు

రావయ్య రారా రామయ్య రారా

రావయ్య రారా రామయ్య రారా
రావయ్య నాభాగ్యరాశివి కద రారా

నాతో పంతాలు నీకు న్యాయమా రారా
నాతప్పు లిపు డెన్నుట న్యాయమా రారా
సీతాసమేత రారా శ్రీరామ రారా
వాతాత్మజాసహిత పరమాత్మ రారా

నాపాలిటి దైవమా నన్నేల రారా
పాపాత్ముడ గాను నీదు భక్తుడను రారా
భూపుత్రీయుత రామభూపాల రారా
కోపమేల రారా గోవింద రారా

కరుణామయ దైవశిఖామణీ రారా
మరలమరల ప్రార్ధింతును మన్నించి రారా
ధరణిజావర రారా దైత్యాంతక రారా
పరమపురుష రారా పాలించ రారా


6, ఆగస్టు 2021, శుక్రవారం

ఉత్తిత్తి కోపాలు కొత్తవా యేమి కాని

ఉత్తిత్తి కోపాలు కొత్తవా యేమి కాని
కొత్తదన మింత దీర్ఘకోపమేను

అప్పుడపుడు తమాషాగా అలిగితే అలిగినా
ఎప్పుడైన అలిగితివా యింతసేపు
గొప్పవాడవేలే యింక కోపమును చాలించి
తప్పక దరిసెన మీరా దశరథరామా

అందాల రాముడా నీ అలుకలో అందమున్నా
ఎందుకయ్యా అలిగినా వింతసేపు
పందెమాడితివో యిట్లు పరీక్షింతు నన్నని
ముందే సీతమ్మతోడ సుందరరామా

ఐనదేదో అయినదిలే అంతా నామంచికిలే
పోనీ నాగెలుపేలే పొల్లయ్యేను
రానీరా నీదయ నింక రామచంద్ర చక్కగా
దానవాంతకా నాకు దరిసెనమీరా



పిచ్చుకపై బ్రహ్మాస్త్రము వేయకు రామా

పిచ్చుకపై బ్రహ్మాస్త్రము వేయకు రామా
మచ్చికతో రారా నా మనసులోనికి

నిన్నమొన్నటిది కాదు మననెయ్య మన్నది యది
యెన్నెన్ని జన్మములుగ నెడతెగనిదో కాని
చిన్నచిన్న యలుకలతో చెడునదా యది నేడు
పన్నుగాక విధి తంత్రము లెన్నైన గాని

నేను బుధ్ధిమంతుడనై నిన్నెన్ను కొంటినా య
నూనమైన ప్రేమతోడ పూని నీవే నను
జానకీమనోరమణ చక్కగా ఆదరించి
నీ నెయ్యము నిచ్చితివే నేడేల కినుక

భావాంబర వీధి నీవు ప్రకాశింపకున్న దినము
భావింపగ దుర్దినమే పరమపురుష రామా
రావయ్యా వేవేగమె రాజీవనయన యింక
నీవు నాకు ప్రసన్నుడవు కావయ్య దయతో






అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు

అందగాడ చిఱునగవులు నేడు చిందించుచు నా
డెందమునకు రాకుందు వెందుకో

ముప్పొద్దుల నిను బహువిధములుగా పొగడకుండ నొక
ముద్దయు గొంతున దిగకుండును నీ వెద్ది తలచి యింత
పెద్దతడవు నా మనసున తోచక పెడమో మిడితివిరా
వద్దువద్దు రఘురామ పరాత్పర భావమునకు రారా

చిన్నాచితక తప్పులు తెలియక చేసితి నేమో
అన్నన్నా నీ వంతమాత్రమున నగుపడ ననరాదు
వన్నెకాడ నీ చల్లని చూపుల వెన్నెల బడయక నే
నెన్నడుంటి నా భావంబునకు నికనైను రారా

రామచంద్ర నిను వేడుక మీఱగ రమ్మందునయా
స్వామీ యన్యుల నటు పిలువనని చక్కగ నీకెఱుకే
పామరుడను నా దొసగుల నెంచక భక్తిని గమనించి
నా మనవిని విని నాభావమునకు నయముగ రావయ్యా


5, ఆగస్టు 2021, గురువారం

నిన్ను ధ్యానించిన దినము నిజమైన సుదినము

నిన్ను ధ్యానించిన దినము నిజమైన సుదినము
నిన్ను మరచి యున్న దినము నిజముగ దుర్దినము
 
తలపులన్ని నీపైనే నిలుపుకొన్న వాడను
తలపనుగా నినుదప్ప కలనైన నన్యులను
మెలకువలో నీతలపులు మెదలుటుండు టొక యెత్తు
కలలనైన నీతలపులె కదలాడుట మరి యొకటి

పరమాత్ముండవు నీవును పామరుడను నేనుగా
తిరమైనది నేలమీద దివ్యమైన సంబంధము
నిరతంబును నినుదలచి నే పొందుదు నానందము
కరుణతో‌ నన్ను నీవు కాచుకొనుచు నుందువు
 
రామచంద్ర మనకిది నీమముగా నున్నదే
యేమిటికని నినుమరచెద నింక శంక మానుమా
నీమ మెప్పుడు దప్పను నిన్ను నేను మరువను
స్వామీ నీ కరుణ కూడ నేమాత్రము దాచకు

కోరనీయ వయ్యా నాకోరిక లన్నీ

కోరనీయ వయ్యా నా కోరిక లన్నీ మన
సారా నిను చేరి తనివారా నిను పొగడి

నిన్ను కాక పోయి నేనెవరి నడుగుదు
మన్నించి నాకెవరు మరిమరి యిత్తురు
అన్నన్న నేననగ నిన్నొకడిని అడుగు
చున్నానుగా నీవిపుడు సొంపుగ నన్ను

భవబంధముల చేత వచ్చిన వారిలో
ఎవరెవరు నాడు హితు లందునయ్య
ఎవరి నేమడిగేది యెవరేమి టిచ్చేది
చివరికి నీముందు చేయిచాచేదే

హరు డందునా నిన్ను హరి వందునా దేవ
మరి రాముడందునా మాధవుడందునా
చిరపరిచితుడవు సృష్టికర్తవు నీవు
కరుణాకరుడ వీవు కావున నడిగెద







అనుకొన్నది నిజమే కద ఆహరివి నీవే కద

అనుకొన్నది నిజమే కద ఆహరివి నీవే కద
వినయాన్విత రామచంద్ర వీరరాఘవ
 
వేదరాశి నుధ్ధరించ పెద్దమత్సమైనట్టి
ఆదిపూరుషుడవు నీవ యనుకొందును

మునుగుచున్న కొండను తన వీపున మోచిన
ఘనకమఠము నీవే నని యనుకొందును

మేదినికై హేమాక్షుని మీది కుఱికి చీరిన
ఆదివరాహము నీవే యనుకొందును
 
నరసింహాకృతిని దాల్చి సురవైరి నడంచిన 
హరి వచ్యుతడవు నీవ యనుకొందును

గడుసు వామనుడుగ వచ్చి కట్టి బలిచక్రవర్తి
నణిచినట్టి హరివి నీవ యనుకొందును
 
కనలి రాచకులము నెల్ల కకావికలు చేసిన 
ఘనుడు భార్గవుడ వని యనుకొందుము

సురవైరిని రావణుని పరిమార్చిన వీరుడ 
హరివి లక్ష్మీపతివి నీవ యనుకొందుము

కదనంబుల పార్ధులను కాపాడిన దేవుడు
యదుకులేశ్వరుడ వీవ యనుకొందుము

అతిచతురభాషణమున దితివంశనాశనము
యతివై సాధించు హరివి యనుకొందును

కరకు కలిని నిగ్రహించి ధరను రక్షించెడు
హరివి కల్కిరూపుడ వని యనుకొందును



మాకండగ నీవుండగ మాకేమికొఱతరా

మాకండగ నీవుండగ మాకేమి కొఱతరా
శ్రీకర కరుణాకర హరి సీతామనోహరా

చిఱుచిఱునగవుల గుల్కుచు చెంత నీవుండగా
మరియొకరి మోముజూడ మాకేమి కర్మరా
సరసముగా వరములను కురియుచు నీవుండగా
సిరులడుగగ నితరులకడ చేరనేమి కర్మరా

వేదనలడగించు నీవు వెన్నుగాచి యుండగా
ఆదరించుడనుచు నొఱుల నడుగ నేమి కర్మరా
నీదయామృతము మాకు నిశ్చయమై యుండగా
పేదలవలె నితరులదయ వేడనేమి కర్మరా

విమలమగు నీనామము వెడలించగ పాపముల
సమవర్తికి తలయొగ్గుచు చావనేమి కర్మరా
భ్రమలనడచి నీనామము పరమపదము చేర్చగా
కుములుచు భవవార్ధి నీతకొట్టనేమి కర్మరా








హరిపేరు పల్కక హరిసేవ చేయక

హరిపేరు పల్కక హరిసేవ చేయక
నరుడెట్లు పొందురా యరుదైన ముక్తిని

పరమపదంబునే మరినీవు కోరుచో
హరినామ మెందుకు మరచి చరింతువు
హరినామకీర్తనాపరుడై చరించరా
హరినామమే భవతరణైక మార్గము

పరమపదంబునే మరినీవుకోరుచో
హరిసేవ చేయక యదియెట్లు కల్గును
హరినే స్మరించుచు హరిసేవ చేయరా
తరియింపగా నిదే సరియైన మార్గము

శ్రీరామనామమే నోరారచేయరా
శ్రీరామసేవనే శిరసావహించరా
శ్రీరాముడే హరి నీరాత మార్చురా
కారుణ్యమూర్తి నీకందించు ముక్తిని



4, ఆగస్టు 2021, బుధవారం

ఘోరసంసారనరకకూపంబులో నుంటి

ఘోరసంసారనరకకూపంబులో నుంటి
శ్రీరామ వేగ నా చేయందుకో

మేలులేదు చదువులతో మేలులేదు పదవులతో
మేలులేదు ధనములకా మించుట లోన
మేలులేదు సతీసుతమిత్రబంధుగణముతో
మేలులేదు పదేపదే మేదినికి వచ్చుటలో

చాలవిసిగిపోతినిరా జన్మముల నెత్తియెత్తి
చాలునురా జరిగినది వేలతనువుల
ఈలాగున భవాంబుధి నెన్నిమునకలైనవో
చాల డస్సి యుండినిరా సర్వేశ్వరా

ఏలాగున నెప్పటికో యేదో మోక్షమున్న దంటే
చాలదురా జన్మలెత్త జాలనురా నేను
జాలిచూపి భవతరణము సత్వరమే చేయించి
యేలరా దయామయా యేల జాగుచేసేవు

మ్రొక్కేమురా చక్కనయ్యా నీకు మ్రొక్కేమురా చల్లనయ్యా

మ్రొక్కేమురా చక్కనయ్యా నీకు
మ్రొక్కేమురా చల్లనయ్యా
 
మ్రొక్కేమురా నీకు భూమికేతెంచిన
చక్కని సామివి సత్యధర్ముడ వని
మ్రొక్కేమురా నీకు మ్రొక్కెడు భక్తుల
చిక్కులు తీర్చెడు శ్రీనివాసుడ వని
 
మ్రొక్కేమురా నీకు ముక్కంటివింటినే
ముక్కలుగ జేసిన భుజబలం బుందని
మ్రొక్కేమురా నీకు ముక్కోపి భార్గవుని
లెక్కజేయని దోర్లీల స్వంతం బని
 
మ్రొక్కేమురా నీకు మ్రుచ్చురావణు బట్టి
చక్కజేసితివని సంతోషముగను
మ్రొక్కేమురా నీకు మూడు లోకములేలు
చక్కని సామివని సంతోషముగను
 

మామాట మన్నించరా శ్రీరామ

మామాట మన్నించరా శ్రీరామ మామీద దయజూపరా
ఏమనుచు నినువేడితే శ్రీరామ నీమనసు కరిగేనురా

ఈ మాయకలిచేతిలో శ్రీరామ యెంతకని వేగేదిరా
కామాది రిపువర్గము శ్రీరామ యీమాయకలి బంట్లురా
సామాన్యులా దుష్టులు శ్రీరామ మామీద పగబట్టిరి
మామనసు నీనుండియే శ్రీరామ మరలించగా జూతురు

నీనామమే మరచితే శ్రీరామ నిర్దయగ నాకాలుడు
మానాల్కలే చీల్ఛునో శ్రీరామ మాపెదవులే కాల్చునో
యే నిప్పులం గాల్చునో శ్రీరామ యేరంపముల బెట్టునో
యీ నీచకామాదులు శ్రీరామ యేస్థితికి మముదెత్తురో

మాకేమి కానున్నదో శ్రీరామ మన్నించి యోచించరా
యేకారణం బైనను శ్రీరామ యేనాడు నీనామము
మా కించుకయు దూరము శ్రీరామ కాకుండ రక్షించరా
నీకన్యమే యెఱుగము శ్రీరామ మాకింక దిక్కెవ్వరు 





ఒక్క రామునకె మ్రొక్కెదము

ఒక్క రామునకె మ్రొక్కెదము వే
రొక్కరి కెందుకు మ్రొక్కి చెడెదము

మ్రొక్కిన నరులకు మిక్కిలి ధనములు
చక్కని పదవులు దక్కినను
అక్కట యమునకు చిక్కుట తథ్యము
మ్రొక్కము మ్రొక్కము మ్రొక్కము నరులకు

మ్రొక్కిన వేల్పులు చక్కని వరములు
నిక్కముగా వెసనిచ్చినను
ఒక్క వేల్పు మా కొసగునె మోక్షము
మ్రొక్కము మ్రొక్కము మ్రొక్కము సురలకు
 
మ్రొక్కిన రాముడు మోక్షము నిచ్చును
నిక్కువమని సురమునివరులు
ముక్కంటియును చక్కగ జెప్పిరి
మ్రొక్కద మారామున కెప్పుడును

 

ఏమయా దయామయా యెంతకాల మీరీతి నామనోరథ మెఱుగనటులే నటించేవు

ఏమయా దయామయా యెంతకాల మీరీతి
నామనోరథ మెఱుగనటులే నటించేవు
 
తామసాధముడ నని తలచి దయజూపవో
తామసులనే నేను తగులుకున్నానో
నీమనసు శంకింప నేమి కారణముగా
తామసించెద వయ్య దశరథతనయా

దుష్కర్మములు వీడు తొల్లి చేసెనటంచు
నిష్కరుణబుధ్ధివై నీవుండ దగునే
నిష్కారణంబుగా నీవేల యలిగెదవో
శుష్కమాయెను దయ శోభనాకారా
 
రామ రామా యనుచు రమ్యంబుగా నీదు
నామంబునే జేయు నరుడనే‌ కానే
ఆమోక్షమే దక్క యన్యమేమియు నడుగ
కామితంబొసగవే కరుణాలవాల


3, ఆగస్టు 2021, మంగళవారం

నీవే నా మనసున నిలచి యుండగను

నీవే నా మనసున నిలచి యుండగను
నీవు చెప్పినటులే నేనుండనా రామ

వీరు వారు నాకు వినిపించు సలహాలు
వేరయ్య నీచెప్పు విధమది వేరు
ఊరు లోకరీతు లూహించి పలుకు మంచి
దారిజూపుచు నీవు దయతో బోధింతువు

పదిమంది కొఱ కేను బ్రతుకుట లేదయ్య
పదిమంది నాకొఱకు పలుకుట లేదు
పదిమంది త్రోసెడు బాటలు వదలి ఆత్మ
వెదుకు బాటల నెఱుగు విధము బోధింతువు

తనువు గల్గుట చేత తగిలిన బంధాలు
తనువుతో చెడునని తరచు చెప్పుదువు
కనుక వాటిని నేను మనసున నెన్నక నీ
పనిచి నట్టి పథము వదలక యుందును

శ్రీరమణా హరి భూరమణా

శ్రీరమణా హరి భూరమణా
నారాయణ కరుణాభరణా

రారా యీ సంసారార్ణవమున
నేరక జొచ్చితి నారాయణా
ఘోరాపద నున్నారా రారా
తీరము జేర్చర నారాయణా

తారకనామా దశరథనందన
రారా సీతారమణ విభో
రారా రావణప్రాణాపహరా
రారా రామా నారాయణా

రారా మురారి రారా బకారి
రారా కంసవిదారి హరీ
రారా బృందావిహారీ కావగ
రారా కృష్ణా నారాయణా


చంద్రుడంటే శ్రీరాఘవేంద్రుడే

చంద్రుడంటే శ్రీరాఘవేంద్రుడే శ్రీరామ
చంద్రున కాచంద్రు డెందును సాటిరాడు

తారకాపతి చంద్రుడు దక్షిణనాయకుడు మన
శ్రీరాము డేకపత్నీస్థిరవ్రతమువాడు
పేరుగొప్ప చల్లదనపు వేడ్కవాడు చంద్రుడు
పేరొందిన చల్లనయ్య శ్రీరామచంద్రుడు

ఒంటినిండ మచ్చలవాడు మింటనున్న చంద్రుడు
కంటికింపు రూపువాడు  కాకుత్స్థరాముడు
తుంటరియు గురుద్రోహియు మింటనున్న చంద్రుడు
బంటై గురుసేవచేసె భక్తితోడ రాముడు

ఎగడుదిగుడు వెలుగుల బ్రతుకీడ్చువాడు చంద్రుడు
యుగయుగములు నిలుచుకీర్తి వెలుగువాడు రాముడు
పగలు మొగముచాటుచేయు వాడు నింగిచంద్రుడు
పగలురేలు భక్తులతో పలుకు రామచంద్రుడు







ఎక్కడ నీవుందువో యెఱుగ లేమనకు

ఎక్కడ నీవుందువో యెఱుగ లేమనకు నీ
వెక్కడైన నుందువని యెఱుకే మాకు

ఇక్కడ సాకేతపురాధీశుడవై యుండియు నీ
వక్కడ వైకుంఠపురం బందు నుండవే

మక్కువతో సీతాహృన్మందిర మందుండి రామా
చక్కగ సామీరి యెడద కెక్కియుండవే

నక్కి హేమకశిపునిలో చిక్కులను పెట్టచును
చక్కగా ప్రహ్లాదు గూడ సాకుచుండవే

ఎక్కి కంసుని యెడదకు మిక్కిలి వేధించుచు
చక్కగా గోపగోపీ జనుల కూడవే

దక్కి నీవు రక్మిణి ప్రార్ధనలకు వశుడవై
చిక్కి సత్యభామకును చిందులేయవే

ఎక్కడెక్కడి సద్భక్తుల యెడదలం దుండియును
మిక్కిలిగా యోగులతో మెలగుచుండవే

మక్కువతో నిన్ను పొగడు మంచినోళ్ళ మసలుచునే
తిక్కతిక్క తిట్ల నోళ్ళ తిరుగుచుండవే

అక్కడుందు విక్కడుందు వనగ నేమిటికి గాని
నిక్కువముగ నీవులేని దెక్కడ రామా


కల్పవృక్షమును వంటకట్టె లడుగవచ్చునా

కల్పవృక్షమును వంటకట్టె లడుగవచ్చునా
అల్పంబులు రామచంద్రు నడుగవచ్చునా

చదువు గట్టెక్కుటకు సాష్టాంగపడువాడా
మొదవుల నిప్పించుమని మ్రొక్కువాడా
పదవులు కావలెనని ప్రాధేయపడువాడా
వదలరా వదలరా పామరత్వము

ధనరాశుల నాశించి మనవులు చేసేవాడా
తనయుల దయచేయుమని పనవువాడా
ఘనత పెంపుచేయు మనుచు గడబిడ చేసేవాడా
మనసులోని పామరత్వమును వదలరా

అరయరా శ్రీరామున కాత్మార్పణము చేయ
నరున కేవి వలయునవి బిరబిరా చేరు
నిరుపయోగముల.వేడ నీకేమి కర్మమురా
పరమాత్ముడు శ్రీరాముని పరమపదమె వేడరా






2, ఆగస్టు 2021, సోమవారం

జయములు శుభములు సరిజోడుగా

జయములు శుభములు సరిజోడుగా
దయతో కురిపించు తానెపుడు

తననే నమ్మి తననే కొలిచి
తనశుభనామమె తలదాల్చి
తనవారై సతతంబును మెలిగే
తనభక్తాళికి దశరథరాముడు

కలుముల లేముల కష్టసుఖంబుల
తలపులు నీపై నిలుపుకొని
కొలిచెడు వారికి కూరిమి చూపుచు
అలవోకగ శ్రీహరి మన రాముడు

హరేరామ యని హరేకృష్ణ యని
నిరంతరము ధ్యానించు తన
పరమభక్తులను పరమప్రీతితో
అరయుచు  శ్రీహరి అయోధ్యరాముడు










నా గుణదోషములు నా బాగోగులు

నా గుణదోషములు నా బాగోగులు
బాగుగ నెఱిగిన వాడవు నీవే

పరమపురుష నీవే నీవే పట్టాభిరామ నీవే
పరమదయాపరా నీవే పరంధామ నీవే
అరయుచు నా మంచిని కోరి యాదరింతువు
మరి వేరెవ రున్నారయ్యా సరిసాటి నీకు 
 
దురితనాశ నీనే నీవే దుఃఖభంజన నీవే
వరసుగుణోన్నతా నీవే నిరంజనా నీవే
మరువక నా బాగును కోరి మన్నించెదవు
మరి వేరెవరయ్యా నీకు సరిసాటి వారు

నరనాయక నీవే నీవే సురనాయక నీవే
వరదాయక రామా నీవే పరమాత్మ నీవే
సరియైన దారిని చూపి చక్కజేసెదవు
మరి నిన్ను పొగడకుందునె మాటిమాటికి

ఏమి యూరింతువు రాకేందువదన నగు మోముజూపితే నీసొమ్మేమి పోవురా

ఏమి యూరింతువు రాకేందువదన నగు
మోముజూపితే నీసొమ్మేమి పోవురా
 
నీవై నన్నొక్కనాడు నిండారు ప్రేమతో
రావించికొందు వన్న రవ్వంతయాశ
భావింప పేరాశగ పరిణమించుచున్నదే
నీవాడ నందువుగా నిర్దయతగునా

నేనే పనిగట్టుకొని నీయింటికి వచ్చి
పోనీ నిను కనులజూచి పోవుదమంటే
యేనాడును నాకు నీయింటినే చూపలేదు
కాన వైకుంఠపురోద్యానమందిర మెఱుగ

నీవు వచ్చు నాశ లేదు నేనును రాలేనే
యేవిధమున సమాగమం బిక కుదిరేను
నీవాడ నేలే యన్న నిండేనా నాకడుపు
రావయ్య బింకమేల రామచంద్రుడా
 

శరణు శరణు రామచంద్ర కృపాళో

శరణు శరణు రామచంద్ర కృపాళో
శరణు శరణు భక్తవరద

శరణు జానకీసౌమిత్రీ యుత
శరణు భవవార్ధితరణైక నౌక
శరణు భక్తజనపరిపాలనాలోల
శరణు పరంతప పరమాత్మా

శరణు త్రైలోక్యసంపోషణాదక్ష
శరణు వేదాంతసంవేద్యతత్త్వ
శరణు సర్వేశ సామగానప్రియ
శరణు జనార్దన సమితింజయ

శరణు హరబ్రహ్మశక్రాదిసంస్తుత్య
శరణు సామీరీ సంసేవితచరణ 
శరణు సురేశా సత్యపరాక్రమ 
శరణు  యోగీంద్రజనమందార