16, ఆగస్టు 2021, సోమవారం

బలవిషయము


శ్రీరామచంద్రప్రభో, నేను బలవంతుడనా బలహీనుడనా యనునది యొక ప్రశ్న.
 
పరబ్రహ్మమస్వరూపుడ వైన నీ యండ నాకుండ నేను బలవంతుడనే యగుదును కాని బలహీనుడ నెట్లగుదుని యింతింతనరాని నమ్మక మొక ప్రక్క స్థిరముగా నున్నది. నాదేమి బల మీభవసాగరము నీదలే కున్నాను కదా యీది యావలి యొడ్డునకు చేరి జయపతాకము నెగురవేసిన వాడు బలవంతుడు కాని నాది హీనబలమే కావుననే కదా వందలకొలది యుపాధులలో దీని నీదియీది మరల నిప్పుడీ నరోపాధిని కూడ నీదుచున్నాను. ఈజన్మమున కూడ నీ యీదుట ముగియునట్లు లేదు కదా, యెంతటి దుర్బలుడ నన్న విచారము కూడ దిట్టముగానే యున్నది. ప్రభో నీవే నన్ను బలవంతునిగా తీర్మానించిన పక్షమున బలవంతుడ నగుదును కాని యెడల బలహీనుడనే యగుదును. అదియే సత్యము.

ప్రపంచమున మానవులు వివిధ కారణముల వలన తమను తాము బలవంతులమని లెక్కించుకొనుచున్నారు.

కొందరివద్ద విశేషముగా ధనముండును. అట్లు విశేషధనసంపద కలవారినే లోకులు కలవారని వ్యవహరించు చున్నారు. పదిమంది బిడ్డలు కలవానిని జనులు కలవాడనరు. పదిపదుల కధికముగనే విశేషముగా బంధుగణమున్న వానిని లోకులు కలవాడనుట లేదు. బహుశాస్త్రపాండిత్యము కలవానిని లోకులు కలవా డనుట లేదు. చివర కతీంద్రియశక్తులు కలవాని నైనను లోకులు కలవాడనుట లేదు. నాలుగు కాసులు తమకంటె హెచ్చుగా కలిగిన వానిని మాత్రమే కలవా డనుచున్నారు కదా. ఆకలవారే బలవంతులని లోకవ్యవహారముగ నున్నది. అట్లే ధనము దండిగ కలవారును లోకవ్యవహారము ననుసరించి తామే బలవంతులమను భ్రమతో మిక్కిలి గర్వము చూపుచున్నారు. నేడున్న నేమాయె రేపకడ నిలకడ కలదా ధనమున కన్న స్పృహ వారికి కలుగదే. నిలుకడ లేని ధనము కలవారి బలమును నిలుకడలేనిదై నమ్మరానిది కదా. కావున ధనబలము నిక్కమైన బలము కాదు. కానే కాదు రామచంద్రప్రభో.

బలమనగా ప్రాథమికముగా శారీరక బలమే బలమను భావన జనసహజమై యున్నది. స్ర్రీబాలవృధ్ధులు బలహీనులును యువకులు బలవంతులు ననునది జనాభిప్రాయము. ఉపాధి ననుసరించి బలాబలములు ప్రకృతిలో హెచ్చుతగ్గులుగా నుండుట సర్వవిదితమే. ఒక ఈగ కన్న నొక తొంద బలమైనది. ఆ యొక తొండ కన్న కాకి బలమైఅది. ఆ కాకి కన్న గ్రద్ద బలముకలది. ఎలుక కన్న పిల్లి బలమైనది.ఆ పిల్లి కన్న కుక్క బలమైనది. కుక్క కన్న నేనుగు బలమైనది. కాని యెంత పెద్ద గజమైనను వార్ధకము కారణముగా కదులలేని స్ధితికి వచ్చిననాడు దాని కంటెను దాని ముందే పరుగులుతీయు నొక యెలుక దానికన్న బలమైనది యగుచున్నది కదా. ఒక బలమైన మొసలి నీటిలో నుండగా దేనినైనను పట్టవచ్చును కాని యొడ్డున నున్న వేళ నొక కుక్కయైనను దానితో పరాచికము లాడనేర్చునే కదా. కావున నుపాధి గతమైనదో వయోవస్థాశ్రయమైనదో యగుచున్నట్టి శారీరకబల మేమి బలము. అది నిక్కమైన బలమే కాదు. కానే‌ కాదు రామచంద్రప్రభో.

అధికారము కలవారిని జనులు బలవంతులని యందురు. పూచికపుల్ల వంటి రూపురేఖలున్న వాడైనను వాడు రాజోద్యోగి యగుచో జనులు వాని యధికారబలమును గమనించి భయభక్తులతో మెలగుచుందురు. అధికారి యవివేకి యగచో వాని యాశ్రితులును బంధుమిత్రులును కూడ లేనిపోని బలప్రదర్శనములు చేయుచుందురు. ఒక డధికారము కొంత కలవా డగుచో మరికొంతగ నధికారము కలవా డింకొకడు వాని నెత్తిపై నుండును. పైవానికి నచ్చని నాడు క్రిందివానికి యధికారము చేజారును. సర్వాధికారి నని భావించు రాజును మరొకడు కూలద్రోయ వచ్చును. కాలగతి ననుసరించి చెడుచుండు నధికారముల వలన నబ్బు బలము నమ్మదగినది కాదు.  కావున నది నిక్కమైనబలము కాదు. యెన్నటికి కాదు రామచంద్రప్రభో.

విద్యావిషయమకై మనుజుల మధ్య స్పర్ధ యుండుటను చూచుచునే యున్నాము. ఒక పండితునకు మరొకనితో పదిమంది ముందు తలపడవలసిన పరిస్థితి వచ్చుచున్నప్పుడు వారిలో నొకడు ఆవలి వానిని గూర్చి తనకంటే వాడు బలవంతుడని యనుచున్నాడు లేడా వాడు బలహీనుడు పొమ్మనుచున్నాడు. ఎవనికి ఏతఛ్ఛాస్త్రవిషయమకమై పాండిత్యమధికమో వాడు వారిద్దరిలో బలవంతుడని లోకోక్తిగా నున్నది. సమస్తమైన కళలవిషయముగా నిట్టి వ్యవహారమున్నది. కాని నేడు ఒక కళలో కాని శాస్త్రములో కాని బలమైనవాడుగా నున్న వ్యక్తి మరొక దినమున వయస్సు కారణముగనో మరొక కారణముగనో బలహీనపడవచ్చును. కావున విద్యాప్రజ్ఞయే నిలుకడగల బలమని భావించుట యసంగత మగుచున్నది. కావున విద్యాప్రజ్ఞ నిక్కమైన బలము కాదు కదా రామచంద్రప్రభో

ముఖ్యముగా దైవబలమని యొక బలమున్నదని చెప్పుదురు. ఇట్టి బలము కలవారిలో గొప్పవాడు ప్రహ్లాదుడని పెద్దల వాక్యము. హిరణ్యకశిపుడు తన కన్నకొడుకనియును దయజూపక బాలప్రహ్లాదుని చంపుటకునై రకరకములుగా ప్రయత్నించి విఫలుడై విసివి ఓరి పిల్లవాడా నిన్ను చంపుట దుస్సాధ్యముగా నున్నదే ప్రపంచములో నాకన్న బలశాలి లేడే నీ‌బల మేమిరా యింత దుస్సహముగా నున్నదీ నీవెవ్వని బలమున నాడెదవు నాకుఁ బ్రతివీరుఁడవై యని ఆశ్చర్యపడగా బాలుడు సంతోషముగా

బలయుతులకు దుర్భలులకు 
బల మెవ్వఁడు నీకు నాకు బ్రహ్మాదులకున్ 
బల మెవ్వఁడు ప్రాణులకును 
బల మెవ్వం డట్టి విభుఁడు బల మసురేంద్రా!

అన్నాడు కదా స్వామీ అట్టిది కదా దైవబలమనగా. లోకమును సృష్టించుటకు తగిన బలము బ్రహ్మకెక్కడి దది నీవిచ్చినదే‌ కద. ఆ సృష్టిలో యేప్రాణికైన నిక్కమైన బలమనిన ది నీవిచ్చినదే‌ కదా. 

రామచంద్రప్రభో నాకు నీవే‌ బలము. నీ‌యండ చూచుకొనియే  నేను నిశ్చయముగా నెల్లప్పుడును నిబ్బరముగ నున్నాను.

ధన్యోస్మి.
 
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.