సత్యము నెఱుగుడు జనులారా సద్గతి నొందుడు జనులారా
సత్యజ్ఞానమనంతము బ్రహ్మము చక్కగ నెఱుగుడు జనులారా
నరజన్మము కడు దుర్లభమన్నది నమ్ముడు మనసున జనులారా
నరజన్మమునకు నారాయణస్మరణము కర్తవ్యము జనులారా
మరచిన చెడుదురు మరువకెన్నడును హరిని స్మరింపుడు జనులారా
హరిభక్తుల యోగక్షేమములను హరియే చూచును జనులారా
హరియే గతియని త్రికరణశుధ్ధిగ హరినే నమ్ముడు జనులారా
హరియే పతియని అంతఃకరణము హరికర్పించుడు జనులారా
హరియే గురుడని యాత్మను నమ్మిన నంతయు తెలియును జనులారా
హరిభక్తుల హృదయమ్ముల శ్రీహరి హాయిగ నిలుచును జనులారా
పంతగించి కలి మనసునదూరి భ్రమలు గొలుపునో జనులారా
కాంతాకనకమ్ములకై భ్రమసిన కలుగును నరకము జనులారా
కాంతాకనకమ్ములకై భ్రమసిన కలుగును నరకము జనులారా
చింతలుమాని హరితత్త్వమునే చింంతించవలె జనులారా
అంతకుడెన్నడు హరిభక్తులతో నాడడు కయ్యము జనులారా
బ్ర్హహ్మాండాధిపుడపుగు శ్రీహరియే బ్రహ్మముసుండీ జనులారా
బ్రహ్మము శ్రీహరి రామచంద్రుడై వచ్చెను భూమికి జనులారా
బ్రహ్మము నెఱిగిన వాడును తప్పక బ్రహ్మమయుండగు జనులారా
బ్ర్హహ్మానందము బ్రహ్మము నెఱిగిన వారికె కలుగును జనులారా
శ్రీమన్నారాయణుడే రాముడు సీతమ్మయె సిరి జనులారా
పామరత్వమును విడువుడు రాముని భజనచేయుడు జనులారా రామనామము పెదవుల నుండిన రావు కష్టములు జనులారా
రాముని కరుణాసాగరు గొలిచిన రాదిక జన్మము జనులారా
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.