31, జనవరి 2022, సోమవారం

హరిహరి యనవేలనే మనసా

హరిహరి యనవేలనే మనసా
మరిమరి యనవేలనే

హరిహరి యనుదాక యపవర్గమే లేదు 
హరిభక్తులకు గాక యపవర్గమే లేదు
హరిహరి యనుటకు అమితభేషజమైన 
హరికృప యెటు కలుగునే

నరజన్మ మబ్బక హరిహరి యనలేక
నరజన్మమున నేడు హరిహరి యనకుండ
కరగించి కాలము మరల తిర్యక్కువై 
యురక చెడగ నేలనే

రామహరే యని కృష్ణహరే యని
నామ కీర్తన చేయ నారాయణుని కృప
నీమీద ప్రసరించు నీవు తరింతువు
భూమిపై నిక పుట్టవే


ఏదో నీదయవలన ఈజీవి నరుడాయె

ఏదో నీదయవలన ఈజీవి నరుడాయె 
ఆదయయె అక్షయ మగును గాక రామ

నీనామ మెపుడును మరువక చేసిన నిలచేనేమో నీదయ
అనోట నీనామ మాడుచు నుండగ నాశీర్వదించవయా

నీమంగళాకృతిని నిత్యము కొలిచిన నిలచేనేమో నీదయ
నీమముగను తాను నిన్నే కొలుచునట్లు నీవె దీవింపవయా

నీసేవలో తాను నిలచియుండిన నెడల నిలచేనేమో నీదయ
దాసభావము గలిగి తాను నీసేవలో తనరగ జేయవయా

నీతత్త్వ మెల్లపుడు నిజబుధ్ధి నించిన నిలచేనేమో నీదయ
సీతారామా బుధ్ధి చెదరకుండగ నీవె చేయక తప్పదయా
 
నీదివ్యచరితమె పారాయణము చేయ నిలచేనేమో నీదయ
కాదనక ఆభాగ్యగరిమ కూడ నీవె కలిగించి ప్రోవవయా

నిన్నె పొగడుచు తాను నేలపై తిరిగిన నిలచేనేమో నీదయ
మన్నించి నిన్నెపుడు సన్నుతించు నట్టి మతిమంతు జేయవయా

నీభక్తులను తాను కూడియుండిన నెడల నిలచేనేమో‌ నీదయ
శోభించ నీభక్తసుజనకోటి మధ్య చోటు కల్పించవయా

నిన్ను సర్వాత్మనా శరణువేడిన యెడల నిలచేనేమో నీదయ
మన్నించి తాను శరణాగతుడగు దారి మానక చూపవయా

వారిజాక్ష రామ నీ వాడనయ్యా

వారిజాక్ష రామ నీ వాడనయ్యా నీవు
కారుణ్యము చూపుదాక కదలనయ్యా

భూవలయము మీద నేను పుట్టిన దాది నేను
నీవానిగ నిలచితి నిది నీవెరుగుదువు 
ఏవేవో కోర్కెలు నే నెన్నడడుగను నన్ను
నీవు పలుకరించుదాక నిన్ను విడువను
 
పలుకుచుందు నీనామము పవలురేలును నేను
తలచుచుందు నీరూపము కలలనైనను
వలచియుందు నీతత్త్వము బాగుగ నేను నీవు
పలుకరించు దాక నిన్ను వదలను రామ
 
సన్నుతాంగ శ్రీరామ సర్వసుగుణధామ
నిన్నే నమ్మి యున్న వాడ నీదాసుడను
నన్ను కరుణించి నీవు నాకనులకు దోచి
నన్ను పలుకరించుదాక నిన్ను వదలను

ఉభయకుశలోపరి -


ఈమధ్యన నేను ఎక్కువగా వ్రాయటం లేదు. 

కారణం నాకు కూడా స్పష్టంగా తెలియదు.

నాకు ముఖ్యవ్యాపకం రాములవారి గురించి సంకీర్తనం చేయటం. అది తెలుగుబ్లాగులోకంలో అందరికీ తెలిసిన సంగతే కాబట్టి దాని గురించి విస్తరించి చెప్పనవసరం లేదనుకుంటాను.

ఒక్కొక్కసారి ఒకే రోజున ఏకంగా అరడజను దాకా రామకీర్తనలు వస్తూ ఉంటాయి. సాధారణంగా ఐతే ఒకటి రెండు వస్తే గొప్పవిషయం.

ఒక్కొక్కసారి రోజుల తరబడి ఒక్క కీర్తన కూడా ఊడిపడదు.

ఈవిషయంలో నాప్రమేయం ఆట్టే లేదు. అయన స్ఫురింపజేయకుండా నేను స్వకపోలకల్పనగా వ్రాసేదీ వ్రాయగలిగినదీ ఏమీ ఉండదు.

ఈస్ఫురణ కలగటం అన్నదానికి వేళాపాళా ఏమీ ఉండదు. అది ఏదైనా ప్రయాణసమయంలో కావచ్చును, భోజనసమయంలో కావచ్చును. తరచుగా నేను నిద్రపోతుండగా కూడా ఇలా కీర్తన స్ఫురించి లేచి వ్రాయటం కద్దు.

రామనామం మాత్రం నిరంతరాయంగా నడుస్తూనే ఉంటుంది.

ఏకీర్తనా స్ఫురించక, వ్రాయలేకపోవటం విచారం కలిగిస్తుంది. కాని నేను చేయగలిగినది ఏమీ లేదు. ఆవిచారంలో ఒక్కొక్క సారి ఎన్నో రోజులూ వారాలూ కూడా గడచిపోతూ ఉంటాయి. ఈసారి జనవరి 15నుండీ‌ నేటి వరకూ విరామం వచ్చింది. మళ్ళీ ఈరోజున ఒక కీర్తన వెలువడింది. జనవరి నెలలో కేవలం అరడజను కీర్తనలే వెలువడ్డాయి.

రాములవారి మీద కీర్తనలేనా, ఇంకా ఏమన్నా వ్రాయవచ్చును కదా అనవచ్చును. కాని నాకుఇతరవిషయాల మీద అభిరుచి అట్టే లేదు. అందుచేత ఇతరాలు వ్రాయటం మీద అసక్తి కలగటం లేదు.
 
ఒకప్పుడు పద్యకవిత్వం వ్రాయటం మీద ఆసక్తి ఉండేది. కానీ ఆ ఆసక్తి కూడా తగ్గింది కాబట్టి అవీ వ్రాయటం లేదు కొన్నేళ్ళుగా.

ఒకప్పుడు మాలికలో నాటపాలే కాక నా వ్యాఖ్యలు కూడా తరచుగానే వచ్చేవి. కాని ప్రస్తుతం ఇతరవిషయాలను చదవటం పైన కూడా అసక్తి తక్కువగా ఉండబట్టి నా వ్యాఖ్యలూ తగ్గాయి. 
 
ఈవిధంగా తెలుగుబ్లాగుల్లో నేను కనిపించటం బాగా తగ్గింది. 

వృధ్ధాప్యం అనేది ఒకటి ముదురుతున్నది కదా. అందుచేత మనస్సులో ఆశ ఉత్సాహం ఉన్నా సరే శరీరం అంత సుముఖంగా స్పందించక ఎక్కువగా ఏదీ వ్రాయలేకపోవటం కూడా జరుగుతున్నదేమో.

నేనిలా నిర్లిప్తంగా ఉండటం గమనికకు వచ్చి ఇంచుమించు నెలరోజుల క్రిందట మిత్రులు కష్టేఫలీ బ్లాగు శర్మ గారు వాట్సాప్ ద్వారా పలకరించారు ఎలా ఉన్నానా అని.

ఈరోజున చూసాను. నిన్ననే ఇదీ ప్రపంచం బ్లాగులో నాకుశలం అడుగుతూ ఒక టపాయే వచ్చింది. నా బ్లాగును చదువను అంటూనే నా కుశలం పట్ల వ్యగ్రతను వ్యక్తం చేసిన ఇదీ ప్రపంచం బ్లాగరు గారికి ధన్యవాదాలు.

నేను కుశలం గానే ఉన్నాను, సకుటుంబంగా కుశలంగానే ఉన్నాను. మొన్న' రిపబ్లిక్ డే‌' నాడు మేమిద్దరమూ వెళ్ళి కోవిషీల్డ్ బూష్టర్ డోస్ వాక్సీన్ వేయించుకొని వచ్చాం. ఏమీ‌ సైడ్ ఎఫెక్ట్ రాలేదు మాయిద్దరికీ.

వ్రాస్తూనే ఉండాలని ఉంది. పరాత్పరుడు వ్రాయిస్తే తప్పక వ్రాస్తాను.

నా వ్రాతలు చదివే వారికీ చదువని వారికీ కూడా, తెలుగుబ్లాగర్లూ, తెలుగుబ్లాగు చదువరులూ అందరికీ నా శుభకామనలు.

శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా

శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా మాకు
సేమమును సంపదలిచ్చే సీతారామా
 
చిత్తుగ నీకరుణామృతమాని మత్తిలి నాము సీతారామా
బొత్తిగ నితరములందు విరక్తి పుట్టినదయ్యా సీతారామా
క్రొత్తగ కామిత మేమని యడుగుదు మిత్తరి నిన్ను సీతారామా
మెత్తని నీపదకమలదళంబుల మిగుల భజింతుము సీతారామా

నరులు పొగడుదురు సురలు పొగడుదురు నారాయణ నిను సీతారామా
హరుడు పొగడు నిను అజుడు పొగడు నిను హరివే నీవని సీతారామా
పరమపురుష భవపాశనాశ హరి పామరులమయా సీతారామా
హరేరామ యని హరేకృష్ణయని యనగల మంతే సీతారామా 

శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా
భక్తి కొలదిగ భజనచేయుదుము పావననామా సీతారామా
రక్తి గొలుపు నీనామము విడువము రాత్రులు పవళులు సీతారామా
ముక్తిప్రదమది మధురమధురమది మోహాంతకమది సీతారామా
 

18, జనవరి 2022, మంగళవారం

చింతామణి నాటకాన్ని ఆంధ్రా ప్రభుత్వం నిషేధించటం సముచితమా? అలా ఐతే‌ వారు కన్యాశుల్కం నాటకాన్నీ‌ నిషేధీంచాలి.


కొద్ది సేపటి క్రిందట టివీలో వార్తలను వీక్షిస్తున్నప్పుడు ఈనిషేధం గురించిన సంగతి తెలియవచ్చింది. దరిమిలా ఈ‌వార్తను ఆంధ్రజ్యోతిలో కూడా గమనించాను.

నిజానికి చింతామణి చాలా మంచినాటకం. అసక్తి కలవారు ఈచింతామణి నాటకాన్ని ఆర్కీవ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని చదువుకొనవచ్చును.

ఈనాటకాన్ని వ్రాసింది మహానుభావులు మహాకవి కాళ్ళకూరి నారాయణరావు గారు. ఈనాటకం ముఖ్యంగా వేశ్యావృత్తికి వ్యతిరేకంగా వ్రాయబడింది. వేశ్యాలంపటులై జనులు ఎలా సర్వనాశనం అవుతారో తెలియజేయటానికి కాళ్ళకూరి వారు లీలాశుకుడి వృత్తాంతాన్ని స్వీకరించి నాటకంగా మలిచారు.

కాని ఒక ఉదాత్తమైన ఆశయంతో వ్రాయబడిన గొప్పనాటకాన్ని నిషేధించేముందుగా ఆంధ్రాప్రభుత్వం వారు చక్కగా పూర్వాపరాలు విచారించినట్లుగా నాకు అనిపించటం లేదు.

నా చిన్నతనం, టీనేజీతో సహా తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట గ్రామంలో గడిచింది. అప్పట్లో వినాయకచవితి వచ్చిందంటే ఊర్లో కనీసం అరడజను చోట్ల పెద్దపెద్ద పందిళ్ళూ వెలిసేవి, తొమ్మిదిరోజులూ‌ నాటకాలూ నడిచేవి. తప్పనిసరిగా ప్రదర్శనకు వచ్చే‌ నాటకాలంటే సత్యహరిశ్చంద్ర,  కురుక్షేత్రం, చింతామణి అనే చెప్పాలి. తమాషాగా ఒకరేజున ఒకటికంటే ఎక్కువ పందిళ్ళల్లో ఒకేనాటకం ప్రదర్శించటమూ జరిగేది తరచుగా. 

అలా పందిరినాటకాలు చూడటం మొదలు పెట్టిని కొత్తలోనే అనుకుంటాను చింతామణి నాటకం చూడటం‌ జరిగింది. ఆనాటకంలో విరుచుకు పడిన దరిద్రపు సంభాషణలకు తట్టుకోలేక కొద్ది సేపటిలోనే లేచి వెళ్ళిపోయాను. మరలా ఎప్పుడూ ఆనాటకాన్ని చూసే సాహసం చేయలేదు.

ఐతే ఈ అసభ్యమైన సంభాషణలు కాళ్ళకూరి వారి కలంనుండి వెలువడ్డవి కావు. కాంట్రాక్టు నాటకాల వాళ్ళు జనాకర్షణ కోసం జనం మీదకు పవిత్రమైన రంగస్థలం‌నుండి వదలినవి!

ఈనాడు నాటక కళ అంతరస్తున్నది. ప్రదర్శనలు అపురూపం. ఒకవేళ చింతామణి నాటకాన్ని సవ్యంగా ప్రదర్శించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించటం సమంజసం‌. అంతేకాని చారిత్రక ప్రశస్తి కల నాటకాన్ని తప్పుపట్టి నిషేధించటం సముచితం కాదు. ఏమాత్రం కాదు.

అసలు నేడు తెలుగు సినిమాల్లోనే, కథ డిమాండు చేస్తోందీ, సన్నివేశం డిమాండు చేస్తోందీ, పాత్రను బట్టి డైలాగులు అలాగే ఉండాలీ అంటూ ఇష్టారాజ్యంగా బూతుమాటలు వాడుతూ ఉంటే ఈ‌ప్రభుత్వాలు ఏమీ అనటం లేదు. అందుచేత ఇప్పుడు అసభ్యంగా ఉందని చింతామణి నాటక ప్రదర్శనని నిషేధించలేరు.

ఈనాటకం వేశ్యాలోలత్వం గురించి విస్తృతంగా ప్రస్తావిస్తున్నది కాబట్టి, రంగస్థలంపై వేశ్యల పాత్రలూ, విటుల పాత్రలూ తప్పకుండా ఉంటాయి. అందులో‌ నాటకకర్త చేసిన తప్పిదం ఏమీ లేదు. మరెందుకు నిషేధించినట్లు? అంటే చింతామణి నాటకంలో హాస్యపాత్రను సుబ్బిశెట్టి అనటం ద్వారా వైశ్యకులం‌ మనోభావాలను దెబ్బతీసినందుకట!

నాటకం అన్నాక, అది కేవలం ప్రబోధాత్మకమైన సన్నివేశాలతోనూ సుదీర్థసంభాషణలతోనూ అత్యంత గంభీరమైన నడకతో ఆద్యంతమూ నిర్మించలేరు కదా. అలా చేసిన పక్షంలో జనరంజకంగా ఉండదు. అందుచేత హాస్యం అన్నది కూడా తప్పనిసరిగా నాటకంలో పోషించవలసి ఉంటుంది. 
 
అలా ఒక హాస్యపాత్రకు సుబ్బిశెట్టి అన్నపేరు ఉంచారు నాటకకర్త.
 
ఏ సుబ్బారావో అని పెట్టకుండా సుబ్బిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని అవమానించారు అని సాక్షాత్తూ ఒక మంత్రివర్యుల ఆరోపణ. ఇది అంత సమంజసమైన ఆలోచన కాదని నా అభిప్రాయం.
 
శెట్టి అని అన్నందుకే  వైశ్య కులాన్ని అవమానించటం అన్న వాదన సమంజసం అని ఒప్పుకొనే‌ పక్షంలో గురుజాడ అప్పారావు పంతులు గారి జగత్ప్రసిధ్ధమైన కన్యాశుల్కం నాటకంలోని పాత్రల పేర్లు సిధ్ధాంతీ, అగ్నిహోత్రావధానులు, లుబ్ధావధానులూ, రామప్పపంతులూ, సౌజన్యారావు పంతులూ, కరటకశాస్త్రి అంటూ ఇలా ఉన్నాయే, ఇది బ్రాహ్మణ్యాన్ని అవమానించటమే అని తీర్మానం చేసి కన్యాశుల్కం నాటకాన్ని కూడా వెంటనే నిషేధించాలి. నిషేధించి తీరాలి!
 
ఒక్క బ్రాహ్మణ్యమే‌కాదు ఇంకా ఇతరకులాలకూ బాగానే  అవమానపు చురకలు పడ్డాయి కన్యాశుల్కంలో.  ఈ కన్యాశుల్కం నాటకం ప్రతి ఒకటి ఆర్కీవ్‌లో ఉంది.  అందులో 167వ పేజీలో కలెక్టరు మాటలు "బ్రాహ్మల్లో ఉన్నంత ఖంగాళీ‌, మాలకూడూ మరెక్కడా లేదు"‌ అని. చూసారూ ఈ‌ఒక్క ముక్కలో అటు బ్రాహ్మణకులాన్నీ‌, మాలకులాన్నీ కూడా నిందించి వారి మనోభావాలు దెబ్బతీస్తున్నారు మహాబ్రాహ్మణులైన అప్పారావు పంతులు గారు. 
 
అన్నట్లు కన్యాశుల్కం నాటకంలో ఒక ముఖ్యమైన హాస్యపాత్రకు పేరు పోలిశెట్టి అని పేరు పెట్టి వైశ్యకులాన్ని హేళన చేసారుగా పంతులు గారు. మరి కన్యాశుల్కం నాటకాన్ని కూడా అంధ్రాప్రభుత్వం వారు తక్షణం నిషేదించటం బాగుంటుందేమో.
 
అందుకే‌ ప్రభుత్వం వారు బాగా ఆలోచించి మరీ చింతామణిని నిషేధించి ఉండవలసింది!

15, జనవరి 2022, శనివారం

హరి యనరే హరిహరి యనరే శ్రీహరినామములే రుచి యనరే

హరి యనరే హరిహరి యనరే శ్రీ
హరినామములే రుచి యనరే
 
పరమపురుష గోవింద జనార్దన పతితపావనా హరి యనరే
పరమానంద ముకుంద పరాత్మర పద్మనిభేక్షణ హరి యనరే
గిరిధర మాధవ వనమాలాధర కేశవ నరహరి హరి యనరే
సురారినాశక పురారిసన్నుత సుభుజ సుయామున హరి యనరే

శ్రీనిధి శ్రీధర శ్రీమతాంవర శ్రీవిభావనా హరి యనరే
శ్రీనివాస శశబిందు సురేశ్వర సిధ్ధిసాధనా హరి యనరే
జ్ఞానానందమయస్వరూప శుభసత్యపరాక్రమ హరి యనరే
దానవనాయక గర్వవిశోషణ ధర్మవిదుత్తమ హరి యనరే

పురాణపూరుష లోకత్రయాశ్రయ మోహవినాశక హరి యనరే
సురేంద్రవందిత మునీంద్రవందిత సుందర సుఖదా హరి యనరే
హరేరామ సుగుణాకర శ్రీకర ఆశ్రితవత్సల హరి యనరే
హరేకృష్ణ ప్రణతార్తివినాశక అమేయాత్మ శ్రీహరి యనరే

13, జనవరి 2022, గురువారం

హరివి గురుడవు నీవు నరుడను నేను

హరివి గురుడవు నీవు నరుడను నేను
పరమపురుషుడ వీవు పతితుడ నేను

నిగమంబు లెఱుగని నిర్భాగ్యుడను నేను
నిగమవనవిహార నిరతుడవు నీవు
జగము లెల్ల దిరుగు సామాన్యుడను నేను
జగము లుత్పాదించు జాణవు నీవు

పరమదయామూర్తి వగు దైవమవు నీవు
పరమార్తి నినువేడు వాడను నేను
కరుణతో వరములను కురియుదువు నీవు
వరము లడుగుచునుండు వాడను నేవు

జయశీలుడవు నీవు సర్వేశ్వరుడవును
భయశీలుడను చాల పామరుడను నేను
నయముగ నన్నేలు నారాముడవు నీవు
దయగల నీకు చరణదాసుడ నేను





11, జనవరి 2022, మంగళవారం

నరుడా శ్రీరాముని నమ్ముట నీయిష్టము

నరుడా శ్రీరాముని నమ్ముట నీయిష్టము
మరి నేను నమ్మనంటె సరే నీయిష్టము

నమ్మని వారితోడ నమ్మువారు వాదించి
నమ్మించ వచ్చునో నయముగా నట్టుల 
నమ్మించ రానిచో నరులీ విషయంబున
నిమ్మహి కలహించి యేమిలాభము

హరిని కొలిచితే మోక్షమని కొందరి నమ్మకము
హరియే లేడు లేడని కొందరి మతము
మరి నీమతము నీదే మామత మది మాదే
ఉరక కలహించ నేముండు లాభము

జీవుని ప్రయాణమే చిత్రమైన ప్రయాణము
దేవునకై వెదకునో దేనికై వెదకునో
జీవునకు స్వేఛ్ఛగా చేయగ నగును కాన
ఈవిషయమున వాదు లేమి లాభము


వైకుంఠ పురమునకు స్వాగతమయ్య

వైకుంఠ పురమునకు స్వాగతమయ్య
     మాకు నిన్నుగూర్చి తెలియ మనసాయెను

హరిశాస్త్రము లేమి నీవు చదివినావు
    హరిహరీ యట్టి వేమి చదువలేదు
హరిచింతన మెంత నీవు చేసినావు
    హరిహరీ యట్టి చింతన చేయలేదు
హరికీర్తన లెంత భక్తిగ పాడినావు
    హరహరి యట్టి పాటగాడిని కాను
హరిభజన మెంత శ్రధ్ధగ చేసినావు
    హరిహరీ యట్టి భజన చేయలేదు

హరియాగము లేమి నీవు చేసినావు
    హరిహరీ యట్టి వేమి చేయలేదు
హరివ్రతముల నేమి నీవు సలిపినావు
    హరిహరీ యట్టి వేమి సలుపలేదు
హరిపూజల నేమి నీవు చేసినావు
    హరిహరీ యట్టి వేమి చేయలేదు
హరితీర్ధము లేమి నీవు తిరిగినావు
    హరిహరీ యట్టి వేమి తిరుగలేదు

హరిభక్తుల నెవరిని సేవించినావు
    హరిహరీ యంత భాగ్య మబ్బలేదు
హరిమంత్రము లేమి నీవు పొందినావు
    హరిహరీ యంత భాగ్య మబ్బలేదు
హరికి నీవు దూరమై యన్నివిధముల
     మరియు భవము నెట్లు తరించినావు
పరమపామరుడ రామ నామ మొక్కటి
     నిరంతరము చేసితిని నే తరించితి









నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా

నామము చేయుచు నుండగా రాముని దయ రాకుండునా
రాముని దయ సిధ్ధించగా ఆ మోక్షమును రాకుండునా

వైకుంఠాధిప గరుడవాహనా బ్రహ్మాండాధిప రామా యనుచు
పాకశాశన బ్రహ్మాదిసుర ప్రముఖవినుత హరి రామా యనుచు
శ్రీకర శుభకర దశరథనందన సీతారమణా రామా యనుచు
సాకేతాధిప దానవనాశక సంకటమోచన రామా యనుచు

దీనదయాళో దేవదేవ హరి మానవేశ్వర రామా యనుచు
శ్రీనివాస హరి వేంకటనాయక శ్రితజనపోషక రామా యనుచు
ఈనేలను గల యల్పసుఖంబుల నెన్నక శ్రీహరి రామా యనుచు 
మానక భక్తుడు పవలును రేలును మక్కువతోడుత రామా యనుచు

కామితవరదా కరివరదా హరి కరుణాజలధీ రామా యనుచు
కోమలనీలసరోజశ్యామా రామా జగదభిరామా యనుచు
శ్రీమన్నారాయణ హరి  త్రిజగత్సేవితచరణా రామా యనుచు
రామా తారకనామా సంగరభీమా సీతారామా యనుచు