శ్రీమదయోధ్యాపురవిహారా సీతారామా మాకు
సేమమును సంపదలిచ్చే సీతారామా
చిత్తుగ నీకరుణామృతమాని మత్తిలి నాము సీతారామా
బొత్తిగ నితరములందు విరక్తి పుట్టినదయ్యా సీతారామా క్రొత్తగ కామిత మేమని యడుగుదు మిత్తరి నిన్ను సీతారామా
మెత్తని నీపదకమలదళంబుల మిగుల భజింతుము సీతారామా
నరులు పొగడుదురు సురలు పొగడుదురు నారాయణ నిను సీతారామా
హరుడు పొగడు నిను అజుడు పొగడు నిను హరివే నీవని సీతారామా
పరమపురుష భవపాశనాశ హరి పామరులమయా సీతారామా
హరేరామ యని హరేకృష్ణయని యనగల మంతే సీతారామా
శక్తి చాలునా మాంబోట్లకు నిను చక్కగ పొగడగ సీతారామా
భక్తి కొలదిగ భజనచేయుదుము పావననామా సీతారామా
రక్తి గొలుపు నీనామము విడువము రాత్రులు పవళులు సీతారామా
ముక్తిప్రదమది మధురమధురమది మోహాంతకమది సీతారామా
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.