30, మే 2020, శనివారం

నీమాట కెదురేది నీరజాక్షుడా


నీమాట కెదురేది నీరజాక్షుడా నీ

వే మందు వది ధర్మవివరణము



మృగమవు రాజులము మేము నిన్ను వేటాడ

తగదే చెట్టు వెనుక దాగియుండగ

జగమున ధర్మేతరు జంపరే రాజులు

తగునని వాలిని దండించిన రామ



బ్రతుకెల్ల ధర్మమును భంగపుచ్చి పాండవుల

కతిద్రోహివై ధర్మ మడుగుదువు భీము

ప్రతినయు మునిశాప వాక్యము నిటుదీరె

ధృతరాష్ట్రసుత యను కృష్ణావతార



అంచితమగు ధర్మ మది నీస్వరూపము

కొంచెపు బుధ్ధివా రెంచగ లేనిది

మంచిచెడుల గూర్చి మాకేమి యెఱుక మే

మెంచుదుము నిన్ను సేవించుభాగ్యము


27, మే 2020, బుధవారం

చాలు చాలు నీసేవయె చాలును మాకు


చాలు చాలు నీసేవయె చాలును మాకు

కాలము నీసేవలో గడచుట చాలు



తెలియని వారమని తెలియుటయే గాక

తెలిసిన దేమి మాకు దేవదేవుడా

తెలిసి యేమి లాభము తెలియ కేమి నష్టము

వలచి నీ సేవ జేయ గలిగిన చాలు



గురువు దొరక లేదనుచు కొండంత చింతేల

గురు వందరకు శివుడు కువలయంబున

తరుణమెఱిగి తారకమంత్రము నిచ్చుచుండగ

మరువక నీసేవలో మసలిన చాలు



వేల శాస్త్రంబులను వివరింపగ నేల

చాలదా నీయందు సద్భక్తి మాకు

మేలేమి యేమంత్రజాలంబుచే మాకు

చాలు నీరామనామజపమే మాకు


25, మే 2020, సోమవారం

నరవరుడని నరపతియని ధరను జనులు తలచిరి



నరవరుడని నరపతియని ధరను జనులు తలచిరి

పరమాత్ముడు హరి యితడని సురలు మునులు తలచిరి



బాలుడు సుకుమారుడని పంక్తిరథుడు తలచెను

కాలుడు సురవైరులకని గాధిసుతుడు తలచెను



కైకమదిని లోకహితుని కష్టపెట్ట దలచెను

కైకకృతము లోకహితముగా సురాళి తలచెను



మనుజుడనుచు నులభుడనుచు దనుజపతి తలచెను

మునిగణము దనుజాంతకు డనుచు నితని తలచెను



జనపతినే మనుజుడనే యని రాముడు తలచెను

వనజాసనుడనె వెన్నుడవని లోకము తెలియగ



24, మే 2020, ఆదివారం

వీడేమి దేవుడయా వినడు మామొఱలని


వీడేమి దేవుడయా వినడు మామొఱలని

నేడో రేపో భక్తులే నిన్ను తిట్టేరు



జనులు మోసపోయి దుర్జనుల కథికారమిచ్చి

మునుగుచున్నారని మొత్తుకున్న వినవు

జనుల నమాయకుల రక్షణ లేనివారిని

కనని వినని దేవుడవని కసరేరు కారా



దొంగగురువులా యటు దొంగభక్తులా యిటు

దొంగదైవములు గూడ తోచుచున్న వేళ

సంగతి నెఱుగలేని జనుల రక్షణ మాని

సింగారించుకొని గుడుల చేరి యున్నావు



ముక్తి మా టటులుండ భూమిజా రమణ

భుక్తికే కష్టపడుచు పొగులుచున్నట్టి

భక్తుల తిలకించి పలుకక యుండేవు

శక్తిహీనులను బ్రోవ సరగున రావేని


గోవిందా రామ గోవిందా కృష్ణ


గోవిందా రామ గోవిందా కృష్ణ

గోవిందా హరి గోవిందా



గోవిందా సకలబృందారకజనసందోహానంద గోవిందా

గోవిందా సకలసజ్జనవంద్య కోదండరామ గోవిందా

గోవిందా దనుజవిషవనఖండనకుఠార రామగోవిందా

గోవింద పరమయోగిరాజగణభావిత శ్రీపాద గోవిందా



రామచంద్ర హరి రావణసంహర రాజీవాక్ష గోవిందా

కామితార్ధప్రద కరుణాలవాల భూమిజారమణ గోవిందా

శ్రీమన్నారాయణ క్షీరాబ్ధిశయన శేషతల్పగత గోవిందా

కోమలాంగ సుశ్యామలాంగ వైకుంఠవాస హరి గోవిందా

జానకీరామునకు జయపెట్టరే


జానకీరామునకు జయపెట్టరే సామ

గానలోలుని విజయగాథలు వర్ణించరే



మునిరాజు యజనమును చినవాడు కాచుటను

జనకునింటి పెనువిల్లు చప్పున విరుగుటను

వనజాక్షితో విభునిపరిణయ శుభగాధను

జనులార వర్ణించి చక్కగా పాడరే



అరజాము లోపలే యసురుల పదునాల్గువేల

విరచినట్టి వీరగాథ విపులముగా పలుకరే

సరిపుచ్చి రాకాసుల సంచారము దండకను

నిరుపద్రవము జేయు నీరజాక్షు పొగడరే



జనకజ నపహరించి చనిన పౌలస్త్యుని

ఘనవిక్రమము వమ్ము గావించి బ్రహ్మాస్త్ర

మున వాని ప్రాణంబులను గొన్న గాథను

మనసార విపులముగ జనులార పాడరే



రాముని పేరు మేఘశ్యాముని పేరు



రాముని పేరు మేఘశ్యాముని పేరు
ప్రేమమయుడైన రఘువీరుని పేరు

సురవరులును మునివరులును భక్త
వరులును నిత్యము పలికెడి పేరు
అరివీరులకును మరువగ రాక
నిరతము గుండెల నిండెడి పేరు

భవతారకమనబడియెడు పేరు
శివున కిష్టమై చెలగెడు పేరు
పవనజు డెప్పుడు పాడెడు పేరు
అవనిజ ప్రాణం బనబడు పేరు

ఇవల నవల నన్నేలెడి పేరు
చవియై రసనకు సరిపడు పేరు
పవలు రేలు నే పలికెడి పేరు
భువిని సుజనులు పొగడెడి పేరు




23, మే 2020, శనివారం

అందరకు నిష్టుడైన యందాల రాముడు



అందరకు నిష్టుడైన యందాల రాముడు

కొందరకు నచ్చడేల గోవిందా



మోక్షకాము లగువారు మోదముతో రాముని

సాక్షాత్తు బ్రహ్మమని సాగి కొలువగ

రాక్షసాంశసంభూతులు రాముడే దుష్టుడని

రూక్షవాక్యములనే రువ్వుచుందురు



ఒప్పులకుప్ప యనుచు నుత్సహించి సుజనులు

గొప్పగ శ్రీరాముని గూర్చి పలుకగ

తప్పులెన్నుటే గొప్పదన మనుకొను కూళలు

చెప్పరాని వాదములు చేయుచుందురు



నచ్చినవారలకు నారాయణుడైయుండు

నచ్చని వారలకు నానావిధములు

మెచ్చిన మెచ్చకున మేదిని జనులందరిలో

నచ్చముగా రాముడే అతిప్రసిధ్ధుడు


భావయామి గోపాలబాలం



భావయామి గోపాలబాలం   (ధన్యాసి)


భావయామి గోపాలబాలం మన

స్సేవితం తత్పదం చింతయేయం సదా



కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా

పటలనినదేన విభ్రాజమానం

కుటిలపదఘటితసంకుల శింజితే నతం

చటులనటనాసముజ్జ్వలవిలాసం



నిరతకరకలితనవనీతం బ్రహ్మాది

సురనికరభావనాశోభితపదం

తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం

పరమ పురుషం గోపాలబాలం




ఈ కీర్తనకు అర్ధం చెప్పమని శారదావిభావరి బ్లాగులో ఎవరో అడిగారు.

నేనొక ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపించింది.

అందరికీ తెలిసిందే గోపాలబాలు డంటే ఎవరో!  గోకులంలో పెరిగిన కొంటె కృష్ణయ్య అని. ఐతే తాత్త్వికులు మరొక రకంగా కూడా అర్ధం చెబుతారను కోండి.

గోవు అంటే ఆవు అని మనకు తెలిసిందే. కాని సంస్కృతంలో ఒక శబ్దానికి తరచుగా అనేకమైన అర్ధాలుంటాయి. గోః అన్న శబ్దానికి ఉన్న అర్ధాల్లో భూమి స్వర్గము వంటివి ఎన్నో ఉన్నాయి.  అంద్చేత గోపాలు డంటే ఎంతో అర్ధ విస్తృతి ఉన్నదన్న మాట గ్రహించాలి మనం. ఐనా రూఢార్ధం చేత గోపాలబాలు డంటే మన గొల్లపిల్లవాడు కిట్టప్పే అనుకుందాం.

భావయామి అన్న పదబంధానికి అర్ధం. తలచుకుంటూన్నాను అని.

మనస్సేవితం అంటే తన  మనస్సు నిత్యం సేవించుతూ ఉండే వాడు అయిన గోపాలబాలుణ్ణి అంటే గోపాలబాలుడైన శ్రీకృష్ణుని మనసారా తలచుకుంటూన్నాను అని తాత్పర్యం.

అటువంటి గోపాలబాలుడి పాదాలను గురించి సదా తత్పదం చింతయేయం అంటున్నారు. ఇక్కడ కొంచెం సరిగా అన్వయం కావటం లేదు. చింతయేహం అని ఉండాలి. ఆ పాదాలను ఎల్లప్పుడూ నేను చింతిస్తూ ఉంటున్నాను అని దీని అర్ధం.

ఆ గోపాల బాలకుడు ఎటువంటి వాడూ అంటే చూడండి ఏమని చెబుతున్నారో


మొదటి చరణం

కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా
పటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకులశింజితే నతం
చటులనటనాసముజ్జ్వలవిలాసం

ఈ చరణంలోని శింజితే నతం అన్నది అంత అర్ధవంతంగా తోచదు. శింజితేన త్వం అంటే అర్ధవంతంగా తోస్తున్నది.

సమాసక్రమంలో వ్రాస్తే ఇలా ఉంటుంది.

  1. కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం
  2. కుటిలపదఘటితసంకులశింజితేన చటులనటనాసముజ్జ్వలవిలాసం
  3. త్వమ్


మేఖల అంటే మొలత్రాడు. కటి అంటే మొల. ఘటితం అంటే కట్టబడింది అని. ఇప్పుడు కటిఘటితమేఖల అంటే మొలకు కట్టబడిన మొలత్రాడు అని అర్ధం. 

మామూలు మొలత్రాడు అని అనుకుంటూన్నారా.  బంగారు మొలత్రాడు లెండి.. మీకు గుర్తు లేదా మన అందమైన తెలుగుపద్యం

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు ధట్టి
సందె తాయెతులును సరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు.

అన్నట్లు ఈ పద్యాన్ని నానా భ్రష్ణుగానూ ముద్రించటం చూసాను. బంగారు మొలత్రాడు అని కాదురా బాబూ అంటే వినే వాళ్ళెవ్వరు. బంగారు మొలత్రాడు కాకపోవటం ఏమిటీ అని అలుగుతారు. ఏంచేస్తాం పద్యంలో ఛందస్సు కోసం బంగరు అని వ్రాస్తే చాలు అంటే ఎవరికీ ఎక్కటం లేదు.

సరే మన పాటలోనికి వద్దాం. ఈ కటిఘటితమేఖల అంటే గోపాలబాలుడి బంగారు మొలత్రాడు అన్న మాట. అది వట్టి బంగారపు పోచలు నాలుగు మెలికలు వేసి చేసిన సాదాసీదా మొలత్రాడు అనుకుంటున్నారా ఏమిటీ కొంపదీసి. అందుకే ఆచార్యుల వారింకా దాని సొగసు గురించి చెబుతున్నారు.

ఆ మొలత్రాడు మణిఘంటికాపటలఖచితం అంట. అంటే ఏమన్న మాట? దానికి మణులు పొదిగిన బంగారు గంటలున్నాయని తాత్పర్యం. ఏమయ్యా మణిఘంటికా అన్నారు కాబట్టి మణుల్నే గంటలుగా చెక్కి తగిలించారూ అనాలి కదా అని ఎవరికన్నా సందేహం వస్తుందేమో తెలియదు.  మణుల్ని గంటలుగా చెక్కితే అవి మోగుతాయా ఏమన్నానా?

అచార్యులవారి సందేహ నివృత్తి చూడండి ఘంటికాపటలనినదేన అంటూ ఆ గంటలు మ్రోగుతున్నాయీ అని చెప్పారు. అందుచేత అవి మణిమాణిక్యాలు పొదిగిన బంగారు గంటలు. అలాంటి గంతలు బోలెడు ఆ మొలత్రాటికి తగిలించారు.

ఇంకేం. అవి ఆయనగారు హుషారుగా గంతులు వేస్తుంటే ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి.

విభ్రాజమానం అంటే ఏమిటో తెలుసునా మీకు? బ్రహ్మాండంగా అందగించటం అని.  ఒక్కసారి మన బాలకృష్ణ మూర్తిని మనస్సులో ఊహించుకోండి. బాగా తలచుకోండి మరి.

ఆయన హుషారుగా గంతులు వేస్తుంటే ఆ పిల్లవాడి మొలకు చుట్టిన బంగారపు మొలత్రాడూ దానికి బోలెడు గంటలూ - అ గంటలనిండా రకరకాల మణిమాణిక్యాల సొబగులూ. ఇవన్నీ కలిపి చమక్కు చమక్కు మని మెరుస్తూ ఎర్రటి ఎండనూ పట్టించుకోకుండా ఎగురుతూ ఉన్న గొల్లపిల్లవాడి ఒంటి మీదనుండి వస్తున్న ఆ మెరుపుల శోభను మీరంతా ఒక్కసారి మనసారా భావించండి.

పదేపదే భావించండి  కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం ఐన గోపాలబాలుడి దివ్యమూర్తిని.

ఇక్కడ ఈచరణంలో ఉన్న  రెండవభావన  కుటిలపదఘటితసంకులశింజితే నతం  చటులనటనాసముజ్జ్వలవిలాసం  అన్నది చూదాం. 

శింజితం అంటే అలంకారాలు గణగణమని చేసే ద్వని. ఈ గణగణలకు కారణం గోపాలబాలుడి కుటిలపదఘటనం. అంటే ఆ గోపబాలుడు అడ్డదిడ్డంగా అడుగులు వేస్తూ గంతులు వేయటం అన్న మాట.  ఆ బాలుడి అలా చిందులు వేస్తుంటే ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ కదలాడుతూ ఉన్నాయి. అసలు మొలత్రాడే చాలు, అదిచేసే చప్పుడే చాలు. ఐనా ఇతరమైన ఆభరణాలూ ఉన్నాయి మొడనిండానూ చేతులకూను. అవన్నీ కూడా మేమేం తక్కువ తిన్నామా అన్నట్లుగా గణగణలాడుతూ ఉన్నాయట. ఇవన్నీ సంకులంగా మోగుతున్నాయంటే అంటే ఒకటే గొడవ అన్న మాట. అవేం వాయిద్యగోష్ఠి చేస్తున్నాయా ఒక పద్ధతిలో గణగణలాడటానికి. దేని గోల దానిదే అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ హడావుడిగా మ్రోగుతున్నాయట.

చటులనటనాసముజ్జ్వలవిలాసం అంటే ఇప్పటికే చెప్పినట్లే కదా. చటులం అంటే కదలటం  వట్టి కదలటమా. పిల్లలు ఊరికే కదులుతారా ఎక్కడన్నా. గోపాలబాలుడి గంతులే గందులు అన్నమాట. అదంతా ఒక నటనం అనగా నాట్యవిలాసంలా ఉన్నదని చెప్పటం. ఈ చటులనటనం అంతా ఒక సముజ్వలవిలాసం అటున్నారు అన్నమయ్య. సముజ్వలం అంటే ఎంతో మనోరంజకంగా ఉండి ప్రకాశిస్తున్నది. అదంతా బాలగోపాలుడి విలాసం. నటనావిలాసం అన్నమాట.

ఇంకా ఈచరణంలో మధ్యలో ఉన్న నతం అన్నదానిని  అన్వయించుకోవాలి. ఈ పదం అంత సరిగ్గా అతకటం లేదు.   శింజితేన త్వం అని పాదాన్ని సవరించుకోకుండా అర్ధం కుదరటం లేదు. శింజితతేన అంటే శింజితం వలన అన్నది ఇప్పటికే అన్వయించుకున్నాం. ఇక త్వం అన్నది ఎలా చెప్పుకోవాలీ అంటే ఆ పదాన్ని సమాసం చివరకు తెచ్చుకోవాలి. అప్పుడు త్వం గోపాలబాలం భావయామి అని పల్లవితో కలిపి అన్వయించుకోవాలి. అన్నట్లు త్వం అంటే నిన్ను అని అర్ధం.

ఇంక రెండవ చరణం చూదాం.

నిరతకరకలితనవనీతం బ్రహ్మాది
సురనికరభావనాశోభితపదం
తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం

ఈ చరణంలో ఉన్న భావనలు

  1. నిరతకరకలితనవనీతం
  2. బ్రహ్మాదిసురనికరభావనాశోభితపదం
  3. తిరువేంకటాచలస్థితమ్
  4. అనుపమమ్
  5. హరిమ్
  6. పరమపురుషమ్
  7. గోపాలబాలమ్


నవనీతం అంటే వెన్న. అప్పుడే చల్ల చిలికి తీసిన వెన్న.  అదెప్పుడూ మనవాడి చేతినిండా ఉంటుంది కదా. అదే చెప్తున్నారు. కరకలితం అంటే చేతిలో ఉన్నది అని. నిరతం అంటే ఎల్లప్పుడూ అని. అందుచేత నిరతకరకలితం అంటే పొద్దస్తమానూ చేతిలో ఉన్నది అని ఉన్నమాట సెలవిస్తున్నారు.

అదే లెండి మన తెలుగుపద్యంలో చేత వెన్నముద్ద అని చెప్పారే, అదే భావన ఇక్కడ. 

నికరం అంటే గుంపు. ఎవరి గుంపు అనుకున్నారు బ్రహ్మాది సురల గుంపు. అందుకే బ్రహ్మాది సుర నికరం అని సెలవిచ్చింది.  వీళ్ళందరూ ఆ బాలకృష్ణుడి చిట్టి పాదాలను ఎంతో అందంగా తమతమ హృదయాల్లో చింతిస్తున్నారట. 

తిరువేంగడం అని తిరుపతికి ప్రాచీన నామాల్లో ఒకటి. ఈ తిరు అన్నమాట తమిళపదం. శ్రీ అన్న సంస్కృతపదానికి సమానార్ధకం. దానికి వైష్ణవసంప్రదాయంలో సమాంతరంగా వాడుకలో ఉన్నపదం. తిరుపతి కొండకే వేంకటాచలం అని పేరు. తరిగొండ వేంగమాంబగారు వేంకటాచల మాహాత్మ్యం అని ఒక గ్రంథం వ్రాసారని అందరికీ తెలిసినదే. దానిలోనిదే మనం చెప్పుకొనే వేంకటేశ్వరస్వామి గాథ. ఆ వేంకటాచలం పైన శ్రీవేంకటేశ్వరుడిగా బాలకృష్ణుడే స్థిరంగా ఉన్నాడట.  ఈ దేవుడు ఆదేవుడు అని లేదు. అన్నమయ్య ఏదేవుడి గురించి ఒక కీర్తన చెప్పినా సరే సదరు దేవుడు తిరువేంకటాచలం రావలసినదే వేంకటేశ ముద్ర వేసుకోవలసినదే. తప్పదు.

అనుపముడు అని అని బాలకృష్ణుడి గురించి ఒక ముక్క కూడా చెప్తున్నారు. అవును మరి ఆయనతో పోల్చి చెప్పదగిన పిల్లవాడు అంతకు ముందున్నాడా ఆయన తరువాత ఉన్నాడా చెప్పండి? అందుకే అమ్మలందరూ ముద్దుముధ్దుగా తమ పిల్లలకి చిన్నికృష్ణుడి వేషం వేసి మురిసిపోయేది. 

 ఆయనను హరి అని చెబుతున్నారు. తెలిసిందేగా శ్రీహరియే కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని ప్రమాణ వాక్యం. ఆయన అవతారమే కాదు స్వయానా విష్ణువే అని దాని అర్ధం. వామనావతారం పూర్ణావతారమే కాని కేవలం ఒక ప్రయోజనం కోసం వచ్చినది.  పరశురామావతారం ఆవేశావతారం. రామావతారం అంశావతారం. ఇక కృష్ణావతారం అనటం పైననే భిన్నాభిప్రాయాలున్నాయి. దశావతారాల్లో బలరాముణ్ణి చెపుతున్నారు కాని కృష్ణుణ్ణి కాదు. చూడండి

  మత్సః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః
  రామో రామ రామశ్చ బుధః కల్కి రేవచ

ముగ్గురు రాముళ్ళట. పరశురామ, శ్రీరామ బలరాములు. కృష్ణుడు పట్టికలో లేడు. ఎందుకంటే ఆయన స్వయంగా విష్ణువే కాని అంశావతారం కాదు కనుక.

విష్ణువే పరమపురుషుడు. అసలు మీరు మీరాబాయి నడిగితే కృష్ణు డొక్కడే పురుషుడి. తతిమ్మా విశ్వంలోని జీవులందరూ స్త్రీలే అని సిధ్ధాంగ చెబుతుంది. గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అహం బీజప్రదః పితా అని చెప్పుకున్నాడు కదా. ఇంకా సందేహం ఏమిటీ మీకు?

ఇదిగో ఆ పరమపురుషుడే నేటి గోపాలబాలుడు.

అటువంటి గోపాల బాలుణ్ణి మనసారా భావిస్తున్నాను అని అన్నమయ్య పాడుతున్నాడు.

ఈ గీతానికి ఒక ఆటవెలది పద్యరూపం లాంటిదే పైన మనం చెప్పుకున్న చేత వెన్నముద్ద పద్యం.

హరినామము లనంతము లందు


హరినామము లనంతము లందు రామనామము

వరగుణోపేతమై వరలునామము



చాల సుందరమైన స్వామి దివ్యనామము

వేలకొలది నామములను మేలైన నామము

భూలోకమున చాల పొగడబడు నామము

చాలు నీ నామమే సర్వజనులకు



రామ రామ రామ యను రామనామ గానమే

ప్రేమతోడ చేసినచో వేల నామంబులను

నీమ మొప్ప జేసి నటుల నారాయణు డెంచును

కామారియె చెప్పెను గౌరి కిట్లు



రామనామ మెన్నడును ప్రజలార మరువకుడు

రామనామమే మోక్ష సామ్రాజ్య మీయగా

భూమి జనుల కితర మంత్రములను తలపనేల

‌ప్రేమతో చేయరే రామనామము


మనశ్శాంతి నిచ్చునట్టి ముందు


మనశ్శాంతి నిచ్చునట్టి మందు రామనామము

జనులారా వేరు మందు కనరాదు నమ్ముడు



సిరుల కొరకు చాల వెంపరలాడి చెడిన వేళ

పరుల సేవ చేసిచేసి పలుచనై యున్న వేళ

వరము లడుగ దేవతలు పలుకకున్నట్టి వేళ

హరి సేవకు తనవారే యడ్డుపడుచు నున్న వేళ



వయసుడుగుట వలన సంపాదన చెడి యున్న వేళ

రయమున శాత్రవుల వలన ప్రాణభయమైన వేళ

దయలేని బంధుగణము తనను దెప్పుచున్న వేళ

నయముకాని వ్యాధి మేననాటి యున్న వేళ



తిరమగుచు తోచు బ్రతుకు తెరువు లేనట్టి వేళ

పరిపాలకులైన వారు విరసులైనట్టి వేళ

పరమభాగవతులకు పరాభవమైన వేళ

మరియాద నీయని మనుజు లధికమైన వేళ


22, మే 2020, శుక్రవారం

రాజీవలోచన శ్రీరామ భవమోచన



రాజీవలోచన శ్రీరామ భవమోచన

ఈ జీవితము నీదే యీశ రఘునందన



కామాది రిపులచే నే కడు నొచ్చియుంటిరా

తామసులగు వీరి తరుమలే కుంటిరా

యేమి యుపాయమును నే నెఱుగలే కుంటిరా

నీ మహిమ జూపర నీవే శరణంటిర



మోసపుచ్చెడు తనువుల మొదటినుండి దూరుచు

వేసగాని వోలె నేను పెక్కుమా ర్లాడితినిరా

వేసరితిరా దేవుడా నీ దాసుడనురా ఏలరా

దాసపోషక నీవు నాపై దయచూప వలయురా



కడకు వచ్చుచుండెరా యీ కాయమున సత్త్వము

పడిన పాట్లు చాలురా నా బాధలుడుగ జేయరా

బడలుచున్న నాలుక నిను నుడువుచున్నది చూడరా

వడివడిగ  నీవు నేడు వచ్చి నన్నేలరా



పెద్దపెద్ద వరము లిచ్చు దేవుడు



పెద్దపెద్ద వరము లిచ్చు దేవుడు మన

      పెద్ద లెఱిగించినట్టి దేవుడు

పెద్ద పెద్ద కన్నులున్న దేవుడు బొల్లి

      గద్ద నెక్కి తిరుగుచుండు దేవుడు



సురలైనను తుదకు శరణు జొచ్చునట్టి దేవుడు

నరుక కెల్ల నాయకుడై నడచినట్టి దేవుడు

పరమాత్ముడయ్యు వట్టి నరుని వలె మెలగిన

మరియాదాపురుషోత్తమ మహామూర్తి వీడు



వలరాజుకు మించి యంద మొలికించిన దేవుడు

తుళువలను ధరనుండి తొలగించిన దేవుడు

నలుగడల ధర్మమును నడిపించిన దేవుడు

కొలుచు నట్టి వారి కెల్ల  కొంగుబంగరు వీడు



తన పేరే సుమా భవతారక మను దేవుడు

మునిముఖ్యుల తపము లరసి మోక్షమిచ్చు దేవుడు

వనజాక్షి సీతతోడ వసుధనేలు రాముడు

మనకు సదా సేవ్యుడైన మాధవుడే వీడు


హరేరామ హరేరామ యనవేమే మనసా



హరేరామ హరేరామ యనవేమే మనసా

మరొక జన్మ ముండదే మతిలేని మనసా



ఆమంత్ర మంతటిదని యీమంత్ర మింతటిదని

యేమో ఋజువు లున్నాయని స్వాములోర్లు చెప్పేరని

యేమి తెలిసి నమ్మేవే యెంతమోసపోయేవే

రామ మంత్ర మొక్కటే రక్షించే మంత్రమే



ఏమి నేర్చి లాభమేమి యెంత నేర్చి ఫలమేమి

రామరామ యనెడు దాక రక్షణ యెట నున్నదే

పామరుడగు వాని కైన పండితోత్తమున కైన

రామనామ మంత్రమే రక్షణకవచమే



అయిన దేమొ ఐనదిలే ఆసంగతి వదలవే

నయము కదా నేటి కైన నమ్మకము కుదిరినది

వియచ్చరులు మునులు కూడ వేడుకొను రాముని

రయమున శరణు జొచ్చి రక్షింప వేడవే



21, మే 2020, గురువారం

శ్రీకరమై శుభకరమై చెలగు దివ్యనామము



శ్రీకరమై శుభకరమై చెలగు దివ్యనామము

శ్రీకాంతుని నామము శ్రీరామనామము


ఇల మీద సుజను లుపాసించు నట్టి నామము

తలచిన వారలకు సిరులు దయచేయు నామము

కొలిచిన వారలకు శుభము గూర్చునట్టి నామము

పలికినంతనే భయము పారద్రోలు నామము



ఇందిరా రమణుని అందమైన నామము

అందరి నామముల వంటిదా రామ నామము

అందరాని ముక్తి ఫలము నందించు నామము

నందివాహనుని నోట నానునట్టి నామము



హరుడు వారణాసిలోన నందించు నామము

నరజన్మము సార్ధకముక నడపునట్టి నామము

పరమయోగిసేవితమై వరలునట్టి నామము

మరలమరల పుట్టకుండ మనుపునట్టి నామము


చేయుదమా మనసారా శ్రీ సీతారాముల సేవ



చేయుదమా మనసారా శ్రీ సీతారాముల సేవ

మాయనణచు సేవ మనకు హాయిగొలుపు సేవ



కల్లకపటములు లేని మనస్సులు కలవారలమై యందరము

ఎల్లవేళలను హితములు గూర్చెడి యీశుభమూర్తుల కందరము

కొల్లగ వరములు భక్తుల కెప్పుడు  కురసెడి వారల కందరము

చల్లగ జగముల నేలుచుండు మన తల్లిదండ్రుల కందరము



భూరికృపాళువు లైన వీరిని పుణ్యాత్ములు సేవింతురట

వీరికి సేవలు చేసెడు వారికి కోరికలు నెరవేరునట

కోరగ వలసిన దేమియు నుండని గొప్పస్థితియు కలుగునట

చేరి కూరిమి మీరగ వీరిని సేవించినచో మోక్షమట



చీకటి కొంపలు వెలువడి వచ్చి సీతారాముల కొలిచెదమా

ఆకలి దప్పిక లవలకు నెట్టి అమ్మను నాన్నను కొలిచెదమా

ప్రాకటముగ హరిభక్తు లందరము వీకొని యాశా మోహంబులను

శ్రీకరులగు మన జననీజనకుల సేవలుచేసి తరించెదమా


సీతారాములకు మీరు సేవచేయరే



సీతారాములకు మీరు సేవచేయరే సం

ప్రీతచిత్తు లగుచు సర్వవిధములుగను వేగ



సేవచేసి కీశేంద్రుడు చేకోనె సింహాసనము

సేవచేసి దైత్యేంద్రుడు చేకొనె గురుపీఠము

సేవచేసి యమరేంద్రుడు చెందె వాంఛితార్ధము

సేవ చేయు సత్ఫలము చేకూరును మీకును



సేవచేసి పక్షులైన చిరకీర్తిని బొందినవి

సేవచేసి యుడుత కూడ చెందె నెంతో ఘనత

సేవచేసి బ్రహ్మపదము చేకొనె నొక మర్కటము

సేవచేసి వైకుంఠము చేరగలరు మీరును



త్రోవజూపు తలిదండ్రుల సేవచేయ వలయును

సేవ సీతారాములకు చేయుటయే కర్తవ్యము

సేవించి నరుల నెవడు చెందగలడు మోక్షము

సేవింప దొరకొనుడు సీతారాములను


19, మే 2020, మంగళవారం

రామ నీనామమే నీమహిమ చాటగ


రామ నీనామమే నీమహిమ చాటగ

నామనసు నిండగ నా బ్రతుకు పండగ



కోరదగిన దింకేమి కువలయమున కలదు

కోరి నీదయను గెలచుకొన్నదే చాలు

కోరకనే నీవు చూపు కూరిమియే చాలు

దారిచూపినదే చాలు చేరదీసి



దేవుడవని నిన్ను తెలుసుకొంటి నేను

నీ వలన నేను నా నిజతత్త్వ మెరిగితిని

భావించితి నిన్ను నాదు పతిగ గతిగ నేడు

నీ వెలుగున లీనమైతి నిశ్చయముగ



పావనమగు నీనామము పరగ నిట్టి దాయె

జీవులను నీవెలుగున నిలుపు నట్టి దాయె

జీవులమగు మేమెవరము దేవు డనగ నెవడు

భావింపగ తత్త్వ మద్వైతమనగ

18, మే 2020, సోమవారం

సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు


సేవజేసె పక్షిరాజు శ్రీరామునకు

భూవలయమునకు వచ్చిన శ్రీవల్లభునకు



అతడు జటాయువట హరితండ్రికి మిత్రుడట

ప్రతిన జేసి యెదిరించె రావణాసురుని

యతని మిత్రధర్మమున కమితసంతుష్ఠుడై

అతులితమగు నపవర్గము నందించె విభుడు


అతడు జటాయువున కన్న యతడి పేరు సంపాతి

అతడు లంకలోన సీత నరసి చెప్పెను

ప్రతిగ రెక్కలను బొందె పక్షీంద్రుడు తక్షణము

ప్రతిలేని రామమహిమ ప్రకటించె నాతడిటు


పాడు నాగపాశములు పట్టు టెఱిగి ప్రభువును

కీడును తప్పించగ నక్షీణబలుడు గరుడుడు

వేడుకతో వచ్చి నిజవిభుని రక్షించి పలు

కాడెను నీ వాడననుచు అంజలించి ప్రేమతో




హరి లేడను వారు హరి యెవ్వడను వారు


హరి లేడను వారు హరి యెవ్వడను వారు

హరితోడ పని యేమను వారు



క్రొత్తగ నేడే కువలయమున మొల

కెత్తినటుల చింతించుట దేనికి

ఎత్తి నరాకృతి యీశ్వర ధికృతి

మత్తిలి యుండెడి మనుజులు పెక్కురు



రాముని గూర్చి రవ్వాడుదు రే

రాముడు హరియని లక్షించెదరా

రాముని విడిచి కాముని కొలిచుచు

భూమికి బరువుగా పురుషాధములు



పరమన కలదను భావన నెరుగని

నరులు తలతురా నారాయణుని

మరి వారలకును తరణోపాయము

హరి నీదయచే నమరెడు గాక

తెలియలేరుగా పామరత్వమున ద


తెలియలేరుగా పామరత్వమున దేవదేవ శ్రీరఘురామా

జలజాతాప్తకులోత్తమ వారికి చక్కని బుధ్ధి నొసంగవయా



హరిచరితములను పరిహసించుట అపరాథంబని తెలియరుగా

హరినామములను పరిహసించుట అపరాథంబని తెలియరుగా

హరిపారమ్యము పరిహసించుట అపరాథంబని తెలియరుగా

హరిసద్భక్తుల పరిహసించుట అపరాథంబని తెలియరుగా



దేవుని యునికిని తర్కంచుటచే తెలియరాదని తెలియరుగా

జీవుడు లేడు దేవుడు లేడని చెప్పరాదని తెలియరుగా

ఆవల ఈవల యనునవి లేవని యనుట తప్పని తెలియరుగా

దైవము హరియని తెలియనేరక తిట్టరాదని తెలియరుగా



చిల్లిగవ్వ యును వెంబడిరాదని చిత్తములందున తెలియరుగా

ఎల్లసుఖంబుల కాకరమను తను విట్టే చెడునని తెలియరుగా

నల్లనయ్య యే రామాకృతిగొని నడిచి వచ్చెనని తెలియరుగా

చల్లగచూచెడు రాముని నమ్మిన చాలను సంగతి తెలియరుగా


బహుజన్మంబుల నెత్తితిని


బహుజన్మంబుల నెత్తితిని బహుదేహంబుల మెలగితిని

బహుబంధంబుల జిక్కితిని బహుకష్టంబుల బొందితిని



బహు విధములగు కూటివిద్య లభ్యాసము చేసి మురిసితిని

బహుధనములకై ప్రాకులాడుచు బ్రతుకులు వృథగా గడిపితిని

ఆహరహమును కడు విషయాసక్తుడ నగుచు లోకమున తిరిగితిని

ఇహమే కాదొక పరమును కలదను యెరుకే లేక చరించితిని



జరిగిన దేదో జరిగిపోయినది చాల తప్పులే దొరలినవి

మరి యీ జగమే మాయామయమను యెఱుక నేటికి కలిగినది

పరితాపముతో పొగిలితి నంతట తరణోపాయము వెదకితిని

కరుణామయుడవు పరంధాముడవు కలవు నీవని తెలిసితిని



నీవున్నావను యెరుక కలిగినది కావున నిన్నే నమ్మితిని

నీవే తల్లివి నీవే తండ్రివి నీవే గతియని తెలిసితిని

జీవుడ కడు నజ్ఞానుడ దేవా చేరితి నిదె నీ పదములను

రావే యీశ్వర రామచంద్ర నను కావవె దయతో కమలాక్ష



17, మే 2020, ఆదివారం

తెలుగులో తమిళ అక్షరాల ప్రవేశం? తస్మాత్ జాగ్రత జాగ్రత!!!

తెలుగు భాషాభిమానులకు ఒక చేదు వార్త.

ఈ నెల 7వ తారీఖున ఆంధ్రజ్యోతి పత్రికలో తెలుగులో తమిళ అక్షరాలా అంటూ  ఒక వార్త వచ్చింది.  తమిళ భాషలోని రెండు అక్షరాలను తెలుగులో విరివిగా వాడుతున్నందున వాటిని తెలుగు అక్షరాల్లో చేర్చాలన్న ప్రతిపాదనను యూనికోడ్ కన్సార్టియమ్ వారు ఆమోదించారట!

ఇవిగో ఆ అక్షరాలు అంటూ పత్రికలో ఇచ్చినవి:



ఇదెలా జరిగిందీ? తెలుగులో తమిళప్రవేశం ఏమిటీ?

రెండు తమిళ అక్షరాలను అదే రూపంలో (తెలుగు సమాన అక్షరాలుగా కాకుండా) యథాతథంగా వైష్ణవ మత గ్రంథాలలోను, ముఖ్యంగా తిరుప్పావై, తిరువాయిమొళిలలో విరివిగా తెలుగువారు వాడుతున్నారని ఒక పది పన్నెండు పాత పుస్తకాలను ఆధారంగా చేసుకుని అతను యూనికోడ్ వారికి ప్రతిపాదించడం, యూనికోడ్ వారు దీనిపై పెద్ద చర్చ లేకుండానే ఆమోదించడం జరిగిపోయింది అని ఆంధ్రజ్యోతి కథనం.

ఈ కథనం లో నిజానిజాలను మనం నిర్ధారించుకోవలసి ఉంది. మన బ్లాగర్లలో ఆంధ్రజ్యోతి అన్న పేరు వింటేనే నిప్పులు చెవుల్లో పడ్డట్లుగా చిందులు త్రొక్కే వారు బ్రహ్మాండమైన సంఖ్యాబలంతో ఉన్నారు. అందుకే యూనికోడ్ సైట్ నుండి వివరాలు సేకరించ వలసి ఉంది. అందుకోసం యూనికోడ్ కొత్త అక్షరాల ప్రపోజల్స్  పేజీని ఒక సారి పరిశీలిద్ధాం.

Draft Candidate Characters for Version 14.0 అనే టేబుల్ వద్ద ఈ క్రింది సమాచారం చూడవచ్చును.

AllocationCountName

0C3C1TELUGU SIGN NUKTA
0C5B..0C5C2TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL LLLA
TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL RRA
0C5D1TELUGU LETTER NAKAARA POLLU


All Characters: UTC Status & ISO Stage అనే టేబుల్ వద్ద ఈ క్రింది సమాచారం చూడవచ్చును.

AllocationCountNameUTC StatusISO Stage

0C3C1TELUGU SIGN NUKTA2020-Apr-28
Accepted
N/A
0C5B..0C5C2TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL LLLA
TELUGU LETTER TAMIL TRANSCRIPTIONAL RRA
2020-Apr-28
Accepted
N/A
0C5D1TELUGU LETTER NAKAARA POLLU2020-Apr-28
Accepted
N/A


ఇక్కడ స్పష్టంగా ఉంది కదా 0C5B..0C5C అని రెండు తమిళ అక్షరాలను తెలుగులిపిలో ఇరికించుతూ నిర్ణయం తీసుకున్నట్లుగా.

అదీ సంగతి.


ఈ విషయమై యూనికోడ్ వారిని మరలా ఆలోచించి ఈ అక్షరాల చేరికను నిలిపివేయవలసిందిగా మనం విజ్ఞప్తి చేయవలసి ఉంది.

యూనికోడ్ పధ్ధతిలో వ్రాసేటప్పుడు ఇతర లిపులలోని అక్షరాలను యథాతధంగా వాడటానికి ఇబ్బంది ఏమీ ఉండదు. అందుచేత ఒక భాషలోనికి ఇతరభాషల అక్షరాలను కలుపుకొని పోవటం అనవసరం.

ఐతే తెలుగువారి ఈఅక్షరాలను విరివిగా ఉపయోగిస్తున్నరని ఒక తమిళుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా యూనికోడ్ వారు ఈనిర్ణయం తీసుకోవటం అభ్యంతరకరం.

అందుచేత ఎప్పటిలా నిర్లిప్తంగా ఉండకుండా తెలుగువారు అందరూ కలుగజేసుకోవలసిన అవసరం తప్పకుండా ఉంది.

లేకపోతే తెలుగులిపి కుక్కలు చింపిన విస్తరిలా తయారు కావటానికి ఆట్టే సమయం పట్టదు.


[ ఒక ముఖ్య గమనిక. ఈ వార్త ఆంధ్రజ్యోతి తప్ప ఇతర పత్రికలలో వచ్చిందా లేదా అన్నది తెలియదు. ఆవిషయం నేను పరిశీలనగా చూడలేదు. దాని అర్ధం నేను సదరు ఆంధ్రజ్యోతి మాత్రమే చూస్తానని కాదు. ఇతరపత్రికల్లో వస్తే వచ్చి ఉండవచ్చును కాని నాదృష్టికి రాకపోయి ఉండవచ్చును. ]

15, మే 2020, శుక్రవారం

నరవేషములో తిరుగుచు నుండును




నరవేషములో తిరుగుచు నుండును నానారకముల పశువులు

హరిహరి మీరా పశువుల మందల కతిదూరముగ నుండవలె




తిండితీర్ధములు దేవునిదయ యని తెలియని వాడొక పశువు

తిండియావలో దేవుని మరచి యుండెడు వాడొక పశువు

దండిగ సంపద లుండిన చాలని తలచెడు వాడొక పశువు

కండలు పెంచుచు గర్వాంధతతో నుండెడు వాడొక పశువు




హరి యను వాడొక డున్నా డనియే యెఱుగని వాడొక పశువు

యెఱుక చాలక హరియే లేడని యెగిరెడి వాడొక పశువు

యెఱిగియు హరిపై నమ్మక ముంచక తిరిగెడి వాడొక పశువు

హరి భక్తులను పరిహసించుచు మొఱిగెడు వాడొక పశువు




హరియే రామాకృతియై వచ్చుట నెఱుగని వాడొక పశువు

వరవిక్రముడగు రాముని రక్షణ వలదను వాడొక పశువు

తరణికులేశుని తత్త్వము లోలో తలచని వాడొక పశువు

నిరతము రాముని నిందించుచు సంబరపడు వాడొక పశువు


కల్నల్ ఏకలింగం ప్రకటన

ఈ సోమవారం 11వ తారీఖున కల్నల్ ఏకలింగం బ్లాగులో ఒక మాలిక నియమాల్లో మార్పులు ప్రకటన వెలువడింది.  ఇది చాలా సంతోషం కలిగించింది.

ఇకనుండి అసభ్య వ్యాఖ్యలను అనుమతించే బ్లాగులను మాలిక వ్యాఖ్యల పేజీ నుండి తాత్కాలికంగా తొలగించడం జరుగుతుంది అని ప్రకటించటం ముదావహం.  మా సైటు ను శుభ్రంగా ఉంచుకోవాడం  మా బాధ్యత అని కల్నల్ గారే కాదు అందరు బ్లాగర్లూ భావించాలని ఆశిస్తున్నాను. అలా శుభ్రంగా ఉంచుకోవాలీ అంటే బ్లాగు ఓనరు మహాశయులందరూ అసభ్య వ్యాఖ్యలను అనుమతించమని శపథం చేయవలసి ఉంటుంది.

అసభ్య వ్యాఖ్యలను అనుమతించం అనగానే సరిపోతుందా? సరిపోదు. ఒక చెత్త వ్యాఖ్య ప్రకటించి, ఆ పిదప  ఆక్షేపణలు వచ్చిన తరువాత తాపీగా వీలు చూసుకొని తొలగిస్తాం అంటే కుదరదంటే కుదరదు. ఈలోగా ఆ చెత్తవ్యాఖ్యకు ప్రతిస్పందనగా అంత కంటే చెత్తవ్యాఖ్యలూ పడే అవకాశం కూడా ఉంది మరి. 

ఐనా అంతవరకూ కల్నల్ గారు కొరడా తీయకుండా వదిలి పెడతారా? వదిలి పెట్టరు కదా. అందుచేత చెత్తవ్యాఖ్యలను చాలా వేగంగా తొలగించాలి.

మీకన్నా కల్నల్ గారు వేగంగా ఉంటే అంతే సంగతులు కొరడా దెబ్బ తగులుతుంది. దేవిడీ మన్నా ఐపోతుంది బ్లాగుకు.

అందుచేత మోడరేషన్ పెట్టి యోగ్యం అని నమ్మకంగా అనిపించిన వ్యాఖ్యలనే అనుమతించాలి. అలా చేయండి మహాప్రభో అని ఎప్పటి నుండో మొత్తుకుంటున్నాను. ఎటొచ్చీ ఎవరూ వినటం లేదు.

ఇప్పుడు వినక తప్పదేమో చూడాలి.

రామనామ మది యమృతమే యని


రామనామ మది యమృతమే యని నీమనసునకు తోచినదా

రాముడు శ్రీమన్నారాయణు డని నీమనసునకు తోచినదా



పడిపడి బహుపుస్తకముల జదివిన ఫలము లేదని తెలిసినదా

గుడిగుడిలో గల రామచంద్రుడే గుండెల నుండుట తెలిసినదా

వడివడిగా భగవంతుని వైపుకు నడచుట మేలని తెలిసినదా

అడుగడుగున శ్రీరామచంద్రునే యఱయుట మేలని తెలిసినదా



తెలియవలసినది తెలిసిన పిమ్మట తెలివిడి చక్కగ కలిగినదా

కలిగిన తెలివిడి ఫలితముగా హరి కలడన్నిట యని తెలిసినదా

తెలిసితివా యీవిశ్వము శ్రీహరి దివ్యవిభూతిశతాంశముగ

తెలిసితివా శ్రీహరియే రాముని దివ్యాకృతియని చక్కగను



రామనామమే తారకనామము భూమిని పుట్టిన జీవులకు

రామరామ శ్రీరామరామ యని రామనామపు రుచితెలిసి

యేమనుజుడు ముక్కాలంబుల నెంచి పాడునో వాడు కదా

పామరత్వమును విడచి చేరును రాముని సన్నిధి తప్పకను


12, మే 2020, మంగళవారం

బలే వాడవయ్యా నన్ను పంపిన దెందు కయ్యా


బలే వాడవయ్యా నన్ను పంపిన దెందు కయ్యా

యిలాతల మెల్ల దిఱిగి యిట్టే వెనుదిరుగుటకా



పిన్నలకు నిన్ను గూర్చి వివరింప బంపితివి

తిన్నగ నీగొప్ప నా తెలివిడికి

పన్నుగ నా బుధ్ధికి తెలియ వచ్చినంత పలుకక

కొన్నినాళ్ళిందున కులికి కూళ నగుదునా రామ



నీ నిజభక్తుల గలసి నివసించ బంపితివి

మానితమగు తెలివి మప్పి నీవు

కాన నీదు భక్తకోటి కలసి పాడుచుందు గాని

మాని యన్యదైవముల మరగుదునా రామ



నిన్ను గూర్చి పాడుటకై నియమించి పంపితివి

మన్నికైన బుధ్ధినిచ్చి మరి నీవు

యెన్నడైన నిన్ను మఱచి యితరుల పొగడుదునా

నన్ను గన్న తండ్రి శ్రీమన్నారాయణా రామ


పామరులము మేము పరమాత్మా


పామరులము మేము పరమాత్మా మాకు

కామిత మీయవె కమలాక్ష



ఎత్తిన జన్మంబు నుత్తుత్తి సుఖముల

చిత్తాయె వేదన చెందితిమి

చిత్తజగురుడ సీతాపతి మాకు

చిత్తశాంతి నిమ్ము శ్రీరమణ



ధారాళమైనట్టి దయగల దేవుడ

కారణకారణ కామప్రద

శ్రీరామచంద్రుడ సీతాపతి మాకు

వైరాగ్యము నిమ్ము పరమాత్మా



నీ యందు భక్తిని నింపుము మాలో

మాయయ్య నిన్నే నమ్మితిమి

చేయెత్తి మ్రొక్కేము సీతాపతి మాకు

హాయి నీకొలువందు మది యిమ్మా


10, మే 2020, ఆదివారం

హరిహరి గోవింద యనలేని నాలుక


హరిహరి గోవింద యనలేని నాలుక

నరునకు కేవల నరకహేతువు



ఉరక నబధ్ధము లుత్పాదించుచు

పరమోత్సాహము బడసెడు నాలుక

హరినామపు రుచి నెఱుగని నాలుక

నరున కెందుకు నారాయణా



కూరలు నారలు కోరిక తీరగ

నూరక మేయుచు నుండెడు నాలుక

శ్రీరామ నామము చేయని నాలుక

పారవంటిదే నారాయణా



నిలుకడలేని పలుకుల నాలుక

కలహములకు దిగు కపటపు నాలుక

పలుచని నాలుక పాపపు నాలుక

పిలుచు టెపుడు గోవిందా యనుచు


6, మే 2020, బుధవారం

రాముడ దయజూడ రావేలరా


రాముడ దయజూడ రావేలర పరం

రాముడ నీవింత తడయగ నేలర



వేడిన వారిని విడువ వట నీ

నీడను జేరిన నిర్భాగ్యులకను

వీడును చింతలు వేదన లందురు

వేడెడు వీడిని విడిచెదవా



కడుసూటి మాటల ఘనుడవు నీవు

వడిగల బాణాల వాడవు నీవు

ఉడుతను జేరదీయుదువే నీవు

విడచెదవా నను విడచెదవా




దారుణదనుజ విదారణశీల

నీరజనయన యనేకుల భక్తుల

కూరిమి బ్రోచిన కారుణ్యాలయ

వీరరాఘవ నను విడచెదవా


శ్రీరామ జయరామ సీతారామ


శ్రీరామ జయరామ సీతారామ

ఘోరభవార్ణవ తారక నామ



చిన్ని నవ్వుల రామ సీతారామ

నన్నేలు వాడవు నాతండ్రి రామ

ఎన్నెన్ని జన్మల నెత్తితి రామ

నన్నేల రక్షించ కున్నావు రామ



వాడవాడల గుడుల పట్టాభిరామ

వాడని సత్కీర్తి భాసిల్లు రామ

వేడిన రక్షించు వాడవు రామ

నేడైన ననుదయ చూడుము రామ



మనసార నినుగొల్చు మనుజుడ రామ

నినునమ్మి యున్నాను నిజము శ్రీరామ

ఇనకులాంబుధిసోమ ఇకనైన రామ

ననుదయజూడుము నాతండ్రి రామ



3, మే 2020, ఆదివారం

శివలింగముపై చీమలుపాకిన


శివలింగముపై చీమలుపాకిన

శివు డేమైనా చిన్నబోవునా



అకటావికటపు టల్లరి మనుషులు

వికవిక లాడుచు వెన్నుని దిట్టిన

సకలజగత్పతి కొక లో టగునా

వెకిలిమూక దుర్విధి పాలగునా



కనులు మూసికొని కాలము లేదని

గొణిగిన లాభము కొంచము గలదా

మనసు మూసికొని మరి హరి లేడని

ఘనముగ తిట్టిన కార్యము కలదా



చింతపండు నొక డెంత పిసికినా

ఎంతగ పులుపెక్కేనో యొక నది

రంతుగ మూర్ఖులు రాముని తిట్టిన

నంతే ఫలితం బది వా రెఱుగరు


2, మే 2020, శనివారం

రామనింద మహాపాపం!


ఈ మధ్య కాలంలో దూరదర్శన్ ఛానెల్ హఠాత్తుగా బాగా ఆదరణలోనికి వచ్చింది. దానికి కారణం దూరదర్శన్ వారు తమ వద్ద నున్న బహుళజనాదరణ పొందిన ఆ రామాయణం ధారావాహికను పునఃప్రసారం చేస్తూ ఉండటమే.

ఇలా పునః ప్రసారం చేయటం వెనుక ఒక గొప్ప కారణం ఉందట. రాముడి తమ్ముళ్ళు ఎందరు అన్న చిన్న ప్రశ్నకు మన భారతీయుల్లో నుండే ఒకటి నుండి వంద వరకూ అన్ని సంఖ్యలూ జవాబులుగా వచ్చాయట. అందుచేత అక్షరాలా జనోధ్ధరణకార్యక్రమంగా మరలా రామాయణం పునఃప్రసారం మొదలైనదట.

అనుమానప్పక్షులు ఉంటారు. వారి కోసం కొంచెం వ్రాయాలి మరి. తెలుగువారిలో తక్కువే కావచ్చును పౌరాణికవాంగ్మయంలో ఓనమాలు తెలియని వారు. ఔత్తరాహుల్లో మాత్రం ఎక్కుఏ అని దశాబ్దుల క్రిందటనే విన్నాను.

నా మిత్రుడు సుబ్రహ్మణ్యేశ్వర రాజు అని ఒకతను హైదరాబాదు వదలి ఉత్తరాదికి వెళ్ళాడు ఉద్యోగం మారి. కొన్నాళ్ళ తరువాత హైదరాబాదుకు అతను వచ్చినప్పుడు కలుసుకున్న సందర్భంలో పిచ్చాపాటీలో ఈ విషయం చెప్పాడు. అతని వాక్యం "వాళ్ళలో ఎక్కువమందికి భీముడూ భీష్ముడూ అనే ఇద్దరున్నారని తెలియదు" అన్నది చదివితే ఆక్కడి జనం సంగతి అర్ధం అవుతుంది కదా.

ఐతే రానురానూ మన తెలుగు వారిలోనూ అటువంటి మహానుభావులు ఎక్కువ అవుతున్నారేమో అనిపిస్తున్నది.

దానికి తోడు అసక్తి లేకపోవటం, తిరస్కారభావం (ఆట్టే ఏమీ తెలియకుండానే!) కలిగి ఉండటం అనే గొప్ప లక్షణాల కారణంగా వీరి సంఖ్య పెరుగుతున్నదని నా విచారం.

నిన్న మే 1 న సాహితీ నందనం బ్లాగులో వచ్చిన ఈవ్యాఖ్యను పరికించండి.

సీతని పోగొట్టుకున్న టైంలో అన్న భార్యపైన, రాజ్యంపైన కన్నేసిన సుగ్రీవుడు లడ్డూలాగా దొరికాడు. అప్పటికి రాముడు 'జీరో'. అందుకే వాలిని చెట్టు చాటునుంచి చంపాడు. వానరసేనని సపాదించాక ఆబలంతో రావణుడితో ముఖాముఖీ యుద్దం చేశాడు. అక్కడ తేడావొస్తుందెలారా బాబూ అనుకునే టైంలో... మళ్ళీ లడ్డూ లాగా విభీషణుడు రేడీ.

అడవుల్లో, కొండల్లో యుధ్ధం చెయ్యడంలో నేర్పరితనంలేని అయొధ్య సైన్యాన్ని వాడుకోకుండా తనసైడు ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించాడు.

ఇప్పుడు చదువరులకు నా బాధ అర్దం ఐనదని భావిస్తున్నాను.

చదువరులు నా బాధ మరొకటి కూడా అర్ధం చేసుకోవాలని కోరుతున్నాను.

తెలుగుబ్లాగు ప్రపంచంలో రెండు రకాల వ్యక్తులున్నారు.  బ్లాగులు వ్రాసేవారు, అవి చదివే వారు. నిజానికి చదివే వారిలో ముప్పాతిక మువ్వీసం మంది బ్లాగులు వ్రాసే వారే.

వ్రాసే వారిలో కాలక్షేపం కోసం వ్రాసే వారి నుండి నిష్ఠగా ఆథ్యాత్మికవిషయాలు మాత్రమే వ్రాసే వారి దాకా అనేక రకాల వారున్నారు.

చదివే వారిలో దాదాపుగా అందరూ కాలక్షేపం కోసం చదివే వారే.

ఎందరో ఎన్నో  విషయాలపైన అమూల్యాభిప్రాయాలు వెలువరిస్తూ ఉంటారు నిత్యమూ. రాజకీయవిషయాలపైన ఐతే నిముషాల వ్యవధిలోనే స్పందనలు పుంఖానుపుంఖాలుగా వస్తూ ఉంటాయి.

కాని ఇంత దారుణంగా రామనింద జరుగుతున్న సందర్భంలో ఒక్కరికి కూడా ఒక్కముక్క మాట్లాడటానికి మనసు రాలేదా?

ఈ దౌర్భాగ్యపు వ్యాఖ్య వ్రాసిన పెద్దమనిషి కనీసం పిల్లల బొమ్మల రామాయంణం పుస్తకం లాంటి దైనా చదివిన వాడు కాదని ఒక్కరికీ తోచలేదా?

అవాకులూ చవాకులూ మాట్లాడరాదని ఇంత గడ్డిపెట్టటానికి ఒక్కరికీ ధైర్యం లేదా?

సాహితీ నందనం బ్లాగరొకాయన మహా దొడ్డవారు. ఆయన బ్లాగులో ఎవరేమి వ్రాసినా కిమ్మనక ఆమోదించి ప్రచురించి తరిస్తారు. చూసి ఆమోదించి మరీ ప్రచురించటం ఉచితం అని ఆయనకు ఎంత చెప్పినా ప్రయోజనం లేదు.

దైవనింద అంత కమ్మగా ఉన్నదా ప్రజలారా? లేదా అలా నింద చేయరాదు అని చెప్తే వారి మనోభావాలు దెబ్బతింటాయి, రాముడికి దెబ్బతగిలితేనేం ఆయన ఏమీ అనుకోడు ఏమీ చేయడులే అని ఉదాసీనంగా ఉన్నారా?

ఒక్క మాట తెలుసుకోండి అయ్యలారా అమ్మలారా,

ఉ. సారపు ధర్మమున్ విమల సత్యముఁ బాపము చేత బొంకుచేఁ
బారము బొందలేక చెడబాఱినదైన యవస్థ దక్షులె
వ్వార లుపేక్ష చేసిరది వారల చేటగు గాని ధర్మ ని
స్తారకమయ్యు సత్య శుభదాయక మయ్యును దైవ ముండెడున్


మనకెందుకొచ్చిన గొడవలే అని చూస్తూ ఊరకున్న పుణ్యాత్ములూ పాపభారం మోయవలసిందే అని చదువరులను గ్రహించ కోరుతాను.