23, మే 2020, శనివారం

భావయామి గోపాలబాలం



భావయామి గోపాలబాలం   (ధన్యాసి)


భావయామి గోపాలబాలం మన

స్సేవితం తత్పదం చింతయేయం సదా



కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా

పటలనినదేన విభ్రాజమానం

కుటిలపదఘటితసంకుల శింజితే నతం

చటులనటనాసముజ్జ్వలవిలాసం



నిరతకరకలితనవనీతం బ్రహ్మాది

సురనికరభావనాశోభితపదం

తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం

పరమ పురుషం గోపాలబాలం




ఈ కీర్తనకు అర్ధం చెప్పమని శారదావిభావరి బ్లాగులో ఎవరో అడిగారు.

నేనొక ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనిపించింది.

అందరికీ తెలిసిందే గోపాలబాలు డంటే ఎవరో!  గోకులంలో పెరిగిన కొంటె కృష్ణయ్య అని. ఐతే తాత్త్వికులు మరొక రకంగా కూడా అర్ధం చెబుతారను కోండి.

గోవు అంటే ఆవు అని మనకు తెలిసిందే. కాని సంస్కృతంలో ఒక శబ్దానికి తరచుగా అనేకమైన అర్ధాలుంటాయి. గోః అన్న శబ్దానికి ఉన్న అర్ధాల్లో భూమి స్వర్గము వంటివి ఎన్నో ఉన్నాయి.  అంద్చేత గోపాలు డంటే ఎంతో అర్ధ విస్తృతి ఉన్నదన్న మాట గ్రహించాలి మనం. ఐనా రూఢార్ధం చేత గోపాలబాలు డంటే మన గొల్లపిల్లవాడు కిట్టప్పే అనుకుందాం.

భావయామి అన్న పదబంధానికి అర్ధం. తలచుకుంటూన్నాను అని.

మనస్సేవితం అంటే తన  మనస్సు నిత్యం సేవించుతూ ఉండే వాడు అయిన గోపాలబాలుణ్ణి అంటే గోపాలబాలుడైన శ్రీకృష్ణుని మనసారా తలచుకుంటూన్నాను అని తాత్పర్యం.

అటువంటి గోపాలబాలుడి పాదాలను గురించి సదా తత్పదం చింతయేయం అంటున్నారు. ఇక్కడ కొంచెం సరిగా అన్వయం కావటం లేదు. చింతయేహం అని ఉండాలి. ఆ పాదాలను ఎల్లప్పుడూ నేను చింతిస్తూ ఉంటున్నాను అని దీని అర్ధం.

ఆ గోపాల బాలకుడు ఎటువంటి వాడూ అంటే చూడండి ఏమని చెబుతున్నారో


మొదటి చరణం

కటిఘటితమేఖలాఖచితమణిఘంటికా
పటలనినదేన విభ్రాజమానం
కుటిలపదఘటితసంకులశింజితే నతం
చటులనటనాసముజ్జ్వలవిలాసం

ఈ చరణంలోని శింజితే నతం అన్నది అంత అర్ధవంతంగా తోచదు. శింజితేన త్వం అంటే అర్ధవంతంగా తోస్తున్నది.

సమాసక్రమంలో వ్రాస్తే ఇలా ఉంటుంది.

  1. కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం
  2. కుటిలపదఘటితసంకులశింజితేన చటులనటనాసముజ్జ్వలవిలాసం
  3. త్వమ్


మేఖల అంటే మొలత్రాడు. కటి అంటే మొల. ఘటితం అంటే కట్టబడింది అని. ఇప్పుడు కటిఘటితమేఖల అంటే మొలకు కట్టబడిన మొలత్రాడు అని అర్ధం. 

మామూలు మొలత్రాడు అని అనుకుంటూన్నారా.  బంగారు మొలత్రాడు లెండి.. మీకు గుర్తు లేదా మన అందమైన తెలుగుపద్యం

చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ
బంగరు మొలత్రాడు పట్టు ధట్టి
సందె తాయెతులును సరిమువ్వ గజ్జలు
చిన్ని కృష్ణ నిన్ను చేరికొలతు.

అన్నట్లు ఈ పద్యాన్ని నానా భ్రష్ణుగానూ ముద్రించటం చూసాను. బంగారు మొలత్రాడు అని కాదురా బాబూ అంటే వినే వాళ్ళెవ్వరు. బంగారు మొలత్రాడు కాకపోవటం ఏమిటీ అని అలుగుతారు. ఏంచేస్తాం పద్యంలో ఛందస్సు కోసం బంగరు అని వ్రాస్తే చాలు అంటే ఎవరికీ ఎక్కటం లేదు.

సరే మన పాటలోనికి వద్దాం. ఈ కటిఘటితమేఖల అంటే గోపాలబాలుడి బంగారు మొలత్రాడు అన్న మాట. అది వట్టి బంగారపు పోచలు నాలుగు మెలికలు వేసి చేసిన సాదాసీదా మొలత్రాడు అనుకుంటున్నారా ఏమిటీ కొంపదీసి. అందుకే ఆచార్యుల వారింకా దాని సొగసు గురించి చెబుతున్నారు.

ఆ మొలత్రాడు మణిఘంటికాపటలఖచితం అంట. అంటే ఏమన్న మాట? దానికి మణులు పొదిగిన బంగారు గంటలున్నాయని తాత్పర్యం. ఏమయ్యా మణిఘంటికా అన్నారు కాబట్టి మణుల్నే గంటలుగా చెక్కి తగిలించారూ అనాలి కదా అని ఎవరికన్నా సందేహం వస్తుందేమో తెలియదు.  మణుల్ని గంటలుగా చెక్కితే అవి మోగుతాయా ఏమన్నానా?

అచార్యులవారి సందేహ నివృత్తి చూడండి ఘంటికాపటలనినదేన అంటూ ఆ గంటలు మ్రోగుతున్నాయీ అని చెప్పారు. అందుచేత అవి మణిమాణిక్యాలు పొదిగిన బంగారు గంటలు. అలాంటి గంతలు బోలెడు ఆ మొలత్రాటికి తగిలించారు.

ఇంకేం. అవి ఆయనగారు హుషారుగా గంతులు వేస్తుంటే ఘల్లు ఘల్లుమని మ్రోగుతున్నాయి.

విభ్రాజమానం అంటే ఏమిటో తెలుసునా మీకు? బ్రహ్మాండంగా అందగించటం అని.  ఒక్కసారి మన బాలకృష్ణ మూర్తిని మనస్సులో ఊహించుకోండి. బాగా తలచుకోండి మరి.

ఆయన హుషారుగా గంతులు వేస్తుంటే ఆ పిల్లవాడి మొలకు చుట్టిన బంగారపు మొలత్రాడూ దానికి బోలెడు గంటలూ - అ గంటలనిండా రకరకాల మణిమాణిక్యాల సొబగులూ. ఇవన్నీ కలిపి చమక్కు చమక్కు మని మెరుస్తూ ఎర్రటి ఎండనూ పట్టించుకోకుండా ఎగురుతూ ఉన్న గొల్లపిల్లవాడి ఒంటి మీదనుండి వస్తున్న ఆ మెరుపుల శోభను మీరంతా ఒక్కసారి మనసారా భావించండి.

పదేపదే భావించండి  కటిఘటితమేఖలాఖచితమణిఘంటికాపటలనినదేన విభ్రాజమానం ఐన గోపాలబాలుడి దివ్యమూర్తిని.

ఇక్కడ ఈచరణంలో ఉన్న  రెండవభావన  కుటిలపదఘటితసంకులశింజితే నతం  చటులనటనాసముజ్జ్వలవిలాసం  అన్నది చూదాం. 

శింజితం అంటే అలంకారాలు గణగణమని చేసే ద్వని. ఈ గణగణలకు కారణం గోపాలబాలుడి కుటిలపదఘటనం. అంటే ఆ గోపబాలుడు అడ్డదిడ్డంగా అడుగులు వేస్తూ గంతులు వేయటం అన్న మాట.  ఆ బాలుడి అలా చిందులు వేస్తుంటే ఆయన ఒంటి మీద ఉన్న ఆభరణాలు అన్నీ కదలాడుతూ ఉన్నాయి. అసలు మొలత్రాడే చాలు, అదిచేసే చప్పుడే చాలు. ఐనా ఇతరమైన ఆభరణాలూ ఉన్నాయి మొడనిండానూ చేతులకూను. అవన్నీ కూడా మేమేం తక్కువ తిన్నామా అన్నట్లుగా గణగణలాడుతూ ఉన్నాయట. ఇవన్నీ సంకులంగా మోగుతున్నాయంటే అంటే ఒకటే గొడవ అన్న మాట. అవేం వాయిద్యగోష్ఠి చేస్తున్నాయా ఒక పద్ధతిలో గణగణలాడటానికి. దేని గోల దానిదే అన్నట్లు ఒకదానితో ఒకటి పోటీ పడి మరీ హడావుడిగా మ్రోగుతున్నాయట.

చటులనటనాసముజ్జ్వలవిలాసం అంటే ఇప్పటికే చెప్పినట్లే కదా. చటులం అంటే కదలటం  వట్టి కదలటమా. పిల్లలు ఊరికే కదులుతారా ఎక్కడన్నా. గోపాలబాలుడి గంతులే గందులు అన్నమాట. అదంతా ఒక నటనం అనగా నాట్యవిలాసంలా ఉన్నదని చెప్పటం. ఈ చటులనటనం అంతా ఒక సముజ్వలవిలాసం అటున్నారు అన్నమయ్య. సముజ్వలం అంటే ఎంతో మనోరంజకంగా ఉండి ప్రకాశిస్తున్నది. అదంతా బాలగోపాలుడి విలాసం. నటనావిలాసం అన్నమాట.

ఇంకా ఈచరణంలో మధ్యలో ఉన్న నతం అన్నదానిని  అన్వయించుకోవాలి. ఈ పదం అంత సరిగ్గా అతకటం లేదు.   శింజితేన త్వం అని పాదాన్ని సవరించుకోకుండా అర్ధం కుదరటం లేదు. శింజితతేన అంటే శింజితం వలన అన్నది ఇప్పటికే అన్వయించుకున్నాం. ఇక త్వం అన్నది ఎలా చెప్పుకోవాలీ అంటే ఆ పదాన్ని సమాసం చివరకు తెచ్చుకోవాలి. అప్పుడు త్వం గోపాలబాలం భావయామి అని పల్లవితో కలిపి అన్వయించుకోవాలి. అన్నట్లు త్వం అంటే నిన్ను అని అర్ధం.

ఇంక రెండవ చరణం చూదాం.

నిరతకరకలితనవనీతం బ్రహ్మాది
సురనికరభావనాశోభితపదం
తిరువేంకటాచలస్థిత మనుపమం హరిం
పరమ పురుషం గోపాలబాలం

ఈ చరణంలో ఉన్న భావనలు

  1. నిరతకరకలితనవనీతం
  2. బ్రహ్మాదిసురనికరభావనాశోభితపదం
  3. తిరువేంకటాచలస్థితమ్
  4. అనుపమమ్
  5. హరిమ్
  6. పరమపురుషమ్
  7. గోపాలబాలమ్


నవనీతం అంటే వెన్న. అప్పుడే చల్ల చిలికి తీసిన వెన్న.  అదెప్పుడూ మనవాడి చేతినిండా ఉంటుంది కదా. అదే చెప్తున్నారు. కరకలితం అంటే చేతిలో ఉన్నది అని. నిరతం అంటే ఎల్లప్పుడూ అని. అందుచేత నిరతకరకలితం అంటే పొద్దస్తమానూ చేతిలో ఉన్నది అని ఉన్నమాట సెలవిస్తున్నారు.

అదే లెండి మన తెలుగుపద్యంలో చేత వెన్నముద్ద అని చెప్పారే, అదే భావన ఇక్కడ. 

నికరం అంటే గుంపు. ఎవరి గుంపు అనుకున్నారు బ్రహ్మాది సురల గుంపు. అందుకే బ్రహ్మాది సుర నికరం అని సెలవిచ్చింది.  వీళ్ళందరూ ఆ బాలకృష్ణుడి చిట్టి పాదాలను ఎంతో అందంగా తమతమ హృదయాల్లో చింతిస్తున్నారట. 

తిరువేంగడం అని తిరుపతికి ప్రాచీన నామాల్లో ఒకటి. ఈ తిరు అన్నమాట తమిళపదం. శ్రీ అన్న సంస్కృతపదానికి సమానార్ధకం. దానికి వైష్ణవసంప్రదాయంలో సమాంతరంగా వాడుకలో ఉన్నపదం. తిరుపతి కొండకే వేంకటాచలం అని పేరు. తరిగొండ వేంగమాంబగారు వేంకటాచల మాహాత్మ్యం అని ఒక గ్రంథం వ్రాసారని అందరికీ తెలిసినదే. దానిలోనిదే మనం చెప్పుకొనే వేంకటేశ్వరస్వామి గాథ. ఆ వేంకటాచలం పైన శ్రీవేంకటేశ్వరుడిగా బాలకృష్ణుడే స్థిరంగా ఉన్నాడట.  ఈ దేవుడు ఆదేవుడు అని లేదు. అన్నమయ్య ఏదేవుడి గురించి ఒక కీర్తన చెప్పినా సరే సదరు దేవుడు తిరువేంకటాచలం రావలసినదే వేంకటేశ ముద్ర వేసుకోవలసినదే. తప్పదు.

అనుపముడు అని అని బాలకృష్ణుడి గురించి ఒక ముక్క కూడా చెప్తున్నారు. అవును మరి ఆయనతో పోల్చి చెప్పదగిన పిల్లవాడు అంతకు ముందున్నాడా ఆయన తరువాత ఉన్నాడా చెప్పండి? అందుకే అమ్మలందరూ ముద్దుముధ్దుగా తమ పిల్లలకి చిన్నికృష్ణుడి వేషం వేసి మురిసిపోయేది. 

 ఆయనను హరి అని చెబుతున్నారు. తెలిసిందేగా శ్రీహరియే కృష్ణుడు. కృష్ణస్తు భగవాన్ స్వయం అని ప్రమాణ వాక్యం. ఆయన అవతారమే కాదు స్వయానా విష్ణువే అని దాని అర్ధం. వామనావతారం పూర్ణావతారమే కాని కేవలం ఒక ప్రయోజనం కోసం వచ్చినది.  పరశురామావతారం ఆవేశావతారం. రామావతారం అంశావతారం. ఇక కృష్ణావతారం అనటం పైననే భిన్నాభిప్రాయాలున్నాయి. దశావతారాల్లో బలరాముణ్ణి చెపుతున్నారు కాని కృష్ణుణ్ణి కాదు. చూడండి

  మత్సః కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః
  రామో రామ రామశ్చ బుధః కల్కి రేవచ

ముగ్గురు రాముళ్ళట. పరశురామ, శ్రీరామ బలరాములు. కృష్ణుడు పట్టికలో లేడు. ఎందుకంటే ఆయన స్వయంగా విష్ణువే కాని అంశావతారం కాదు కనుక.

విష్ణువే పరమపురుషుడు. అసలు మీరు మీరాబాయి నడిగితే కృష్ణు డొక్కడే పురుషుడి. తతిమ్మా విశ్వంలోని జీవులందరూ స్త్రీలే అని సిధ్ధాంగ చెబుతుంది. గీతలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా అహం బీజప్రదః పితా అని చెప్పుకున్నాడు కదా. ఇంకా సందేహం ఏమిటీ మీకు?

ఇదిగో ఆ పరమపురుషుడే నేటి గోపాలబాలుడు.

అటువంటి గోపాల బాలుణ్ణి మనసారా భావిస్తున్నాను అని అన్నమయ్య పాడుతున్నాడు.

ఈ గీతానికి ఒక ఆటవెలది పద్యరూపం లాంటిదే పైన మనం చెప్పుకున్న చేత వెన్నముద్ద పద్యం.

6 కామెంట్‌లు:

  1. nice discription - మేఖల అంటే మొలత్రాడు. కటి అంటే మొల. ఘటితం అంటే కట్టబడింది అని. ఇప్పుడు కటిఘటితమేఖల అంటే మొలకు కట్టబడిన మొలత్రాడు అని అర్ధం ;

    రిప్లయితొలగించండి
  2. మీరు శింజితేన తం అన్న చోట ఇచ్చిన వివరణ సరికాదు అనిపిస్తుంది.

    పాట అంతా ప్రథమ పురుష ద్వితీయ విభక్తిలో ఉండగా త్వం ఎందుకు వస్తుంది. ?
    అలా అనుకున్నా త్వాం అని ఉండాలి కదా.

    త్వం అంటే నీవు త్వాం అంటే నిన్ను అని అర్థం వస్తుంది.

    కుటిలపదఘటితసంకులశింజితేన
    చటులనటనాసముజ్జ్వలవిలాసం తం
    భావయామి అంటే అన్వయం చక్కగా కుదురుతుంది.

    నాకు ఉన్న పరిమిత జ్ఞానం తో చెప్పడం జరిగింది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ. నిజమే. నాది గాలివాటు గీర్వాణం కదండీ. పొరబడ్డానన్నమాట. ధన్యవాదాలు.

      తొలగించండి
  3. కీర్తనల వివరణ లో అతిశయోక్తి ధోరణి లేకుండా సహజం గా సరళం గానూ grounded గా ఉంటే బాగుంటుంది అని మనవి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు చెప్పదలచుకొన్నది అర్నమయింది. కాని భక్తి వ్యవహారంలో కొంత పారవశ్యమూ పునరుక్తీ అతిశయోక్తీ వంటివి సహజలక్షణాలు తప్ప దోషాలు కావండి. రసవంతంగా ఉండటం తప్ప మరేమీ బడాయికోసం అలా చెప్పటం జరుగదు. భక్తి సాహిత్యం అంతా ఇంతే. కేవలం వాచ్యార్ధవివరణగా చెప్పటం వలన రంజనకలుగదు. కస్తూరీతిలకం అంటే కృష్ణుడు కస్తూరితో బొట్టుపెట్టుకొనెను అంటే సొగసు ఏముందీ దానిని గురించి ఊహించో మరొకవిధంగానో నాలుగు మనోరంజకమైన మాటలు చెబుతే దృష్టి కృష్ణపరం ఆవుతుంది కాని? ఆలోచించండి.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.