15, మే 2020, శుక్రవారం

నరవేషములో తిరుగుచు నుండును




నరవేషములో తిరుగుచు నుండును నానారకముల పశువులు

హరిహరి మీరా పశువుల మందల కతిదూరముగ నుండవలె




తిండితీర్ధములు దేవునిదయ యని తెలియని వాడొక పశువు

తిండియావలో దేవుని మరచి యుండెడు వాడొక పశువు

దండిగ సంపద లుండిన చాలని తలచెడు వాడొక పశువు

కండలు పెంచుచు గర్వాంధతతో నుండెడు వాడొక పశువు




హరి యను వాడొక డున్నా డనియే యెఱుగని వాడొక పశువు

యెఱుక చాలక హరియే లేడని యెగిరెడి వాడొక పశువు

యెఱిగియు హరిపై నమ్మక ముంచక తిరిగెడి వాడొక పశువు

హరి భక్తులను పరిహసించుచు మొఱిగెడు వాడొక పశువు




హరియే రామాకృతియై వచ్చుట నెఱుగని వాడొక పశువు

వరవిక్రముడగు రాముని రక్షణ వలదను వాడొక పశువు

తరణికులేశుని తత్త్వము లోలో తలచని వాడొక పశువు

నిరతము రాముని నిందించుచు సంబరపడు వాడొక పశువు


10 కామెంట్‌లు:

  1. గురువు గారూ, మీకు నచ్చని పనులను చేసేవారిని విమర్శించడం వరకు మీ ఇష్టం కానీ నిందించడం శోభనీయం కాదేమో ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు సరిగా వివేచన చేసి చూడగలిగితే నింద యేమీ లేదని తెలియగలరు. భక్తి కవిత్వానికి లౌకికంగా కన్న విశేషమైన అంతరార్ధం ఉంటుంది. ఇంతకన్నా నేనే వ్యాఖ్యానించటం భావ్యం కాదు.

      తొలగించండి
    2. నాకు "పశువులు" మీరు వాడే తరహా పదం కాదన్న తపన తప్ప వేరే ఇంకేమీ లేదండీ. అంతరార్ధం (allegorical?) ఏమిటో ఇంకా తెలియడంలేదు.

      వివేచన= meaning please.

      తొలగించండి
    3. వివేచన చేయటం అంటే చక్కగా ఆలోచించి సవిమర్శకంగా చూడటం అని అర్ధ మండీ.

      పశువు అన్నమాట సాధారణమైన నిందార్ధకంలో వాడలేదండీ. కొద్దిగా వివరిస్తాను. భగవంతుడు శివుడికి పశుపతి అని పేరుంది. అమ్మవారికి పశుపాచవిమోచని అన్న నామంతో సంబోధన ఉన్నది.

      జీవులు సహజాతములగు ఆహార నిద్రాభయ మైథునములు మాత్రము జీవనంగా ఉండి విద్యావిహీనులుగా ఉంటున్నారు. అలా ఉండటం పశుత్వం. ఇక్కడ తెలియవల్సినది విద్య అంటే భగవంతుడి కన్నా తాను వేరు కాదన్న తెలివిడి. విద్య లేకపోవటం అవిద్య. అదే జీవుడిని కట్టే పాశం (పాశం అంటేనే పశువును కట్టేది అని అర్ధం). ఈ అవిద్య తాలూకు వికారాలను గురించి ఈకీర్తన చెబుతున్నది.

      కాదూ మీరు రాముణ్ణి నమ్మని వారిని పశువులు అని తిట్టేందుకే ఈ కీర్తన వ్రాసారని, అందరూ రాముణ్ణేనమ్మితీరాలా - అందుచేత పశువులు అని తిడతారా అంటూ నన్నుఎవరైనా సరే నిందిస్తే వారికొక నమస్కారం.

      ఓపిక ఉన్నవారు భవిష్యత్తులో ఈకీర్తనను గురించి ఎంతైనా వివరించవచ్చును. అంత సరుకు ఉన్నది దీనిలో.

      తొలగించండి
    4. ఇప్పుడు నాకు గూడార్థం అర్ధం అయింది. Thank you for the patient explanation Sir.

      అఫ్కోర్స్ నా అభిప్రాయాలు వారివి కనుక నేను ఒప్పుకోవాలని లేదు.
      మీ అనుమతితో agreement is optional and secondary to appreciation అనుకుంటా.

      తొలగించండి
    5. // “ నా అభిప్రాయాలు వారివి కనుక ....” //

      ????? 🤔

      తొలగించండి
    6. Typo, sorry sir. "నా అభిప్రాయాలు నావి" అని చదవగలరు.

      తొలగించండి
  2. ఒక బ్లాగరు Chiru Dreams ".... జనాల్ని భయపెట్టి బతికేసే దోపిడిదొంగలు.. వారి సంపాదనకు మాత్రమే పనికొచ్చే వాడు హరియా? వాడెవ్వడు?" అంటూ నిందాపూర్వకమైన వ్యాఖ్య ఒకటి పంపారు. దాన్ని ప్రచురణకు నిరాకరిస్తున్నాను.

    సదరు వ్యాఖ్యతకు సూచన: ఈబ్లాగులో ప్రచురించబడే సాహిత్యం పట్ల మీకు నిరసన ఉంటే మీరు ఇక్కడకు రాకండి. ఎవ్వరూ మీచేత బలవంతంగా చదివించటం లేదు కదా. మీరిలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పంపితే వాటిని ప్రచురించటమూ కుదరదు, ప్రచురించి మీతో వాదిస్తూనో మీకు నచ్చచెబుతూ కూర్చోవటమూ కుదరదు. అందుచేత మీరు విషయం గ్రహించి అనవసరమైన వ్యాఖ్యలూ వాదనలూ మానవలసిందిగా విజ్ఞప్తి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ Chiru dreams బ్లాగరు నుండి మరింత అభ్యంతరకరవ్యాఖ్య వచ్చింది.

      ఈ బ్లాగరును ఇక్కడ దేవిడీమన్నా చేయడమైనది.

      తొలగించండి
  3. కొంతమంది తమ ప్రవర్తనతో మీ కవితకో అర్థం తీసుకొస్తుంటారు లెండి!

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.